పిలవకుండానే పలికే డాక్టర్లు.
ఉదయం పది గంటలు దాటుతోంది. పిల్లలు
స్కూలుకు వెళ్ళారు. మా ఆవిడతో కలసి హిందీ రామాయణం కొత్త ఎపిసోడు కాసెట్
చూస్తున్నాము. ఇంతలో డోర్ బెల్ మోగింది. తలుపు తెరిచి చూస్తే నలుగురయిదుగురు
రష్యన్లు. 'దోం సెం దేసిత్ జేవిచ్ పజాలుస్తా' అందులో ఒకతను అంటున్నాడు. పజాలుస్తా
(ఇంగ్లీష్ లో ప్లీజ్ ) అన్న పదం తప్ప ఏమీ అర్ధం కాలేదు. తొంగి చూస్తే వారి వెనుక
ఒక చక్రాల కుర్చీ కనిపించింది. ఒక్క క్షణం కేజీబీ వాళ్ళేమోనన్న అనుమానం మనసులో
మెదిలింది. వాళ్ళను లోపలకు రమ్మని సైగ చేసాను. కూర్చోమన్న నా అభ్యర్ధనను
పట్టించుకోకుండా ఇంట్లో ఇంకా ఎవరయినా వున్నారా అన్నట్టుగా కలయచూస్తున్నారు.
సమయానికి పిల్లలు కూడా లేకపోవడంతో, మా
ఆవిడ పై అంతస్తులో వుండే జస్వంత్ సింగ్ భార్యను పిలుచుకుని వచ్చింది. ఆ కుటుంబం
చాలా ఏళ్ళుగా మాస్కోలో వుంటున్నారు కాబట్టి రష్యన్ బాగా వచ్చు. ఆవిడ వాళ్ళతో
మాట్లాడి హిందీలో మళ్ళీ మాకు చెప్పినదాన్నిబట్టి అర్ధం అయింది ఏమిటంటే, ఆ వచ్చిన
వాళ్ళు డాక్టర్లు. మా ఇంట్లో ఎవరికో బాగా లేదని వారికి సమాచారం అందిందట. అంతే!
రయ్యిమని వచ్చేసారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ ఉండగానే కొంత ఆలస్యంగానే అయినా
బుర్రలో లైటు వెలిగింది. అంతకు కొద్ది సేపటిక్రితం రేడియోకు ఫోన్ చేసి గీర్మన్ తో
మాట్లాడిన సంగతి గుర్తుకు వచ్చింది. ఆఫీసుకు పోవడానికి బద్ధకం వేసి 'జలుబుగా వుంది, ఈ రోజు రాలేనని' చెప్పాను. బహుశా అతను ఈ విషయం
సంబంధిత అధికారులకు చేరవేసివుంటాడని జస్వంత్ సింగ్ గారి భార్య మాకు టీకా తాత్పర్యం
చెప్పింది.
మాస్కోలో
అంబులెన్సులు రాత్రింబగళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఏ ఇంటి నుంచి సమాచారం అందిందో, ఆ
ఇంటికి దగ్గరలో తిరుగాడుతున్న అంబులెన్సుకు వైర్ లెస్ లో వివరాలు తెలియచేస్తారు.
నిమిషాల వ్యవధిలో వారు అక్కడికి చేరుకొని వైద్య సహాయం అందిస్తారు. మొత్తానికి
ఉత్తుత్తి జలుబు పుణ్యమా అని మాస్కో జీవితంలోని మరో మంచి కోణం తెలుసుకోగలిగాము.
వచ్చిన డాక్టర్ల బృందానికి ఏ భాషలో క్షమాపణలు చెప్పామో గుర్తులేదు కానీ ఆఫీసుకు
డుమ్మా కొట్టడానికి మేము ఎన్నుకున్న ఎత్తుగడను అర్ధం చేసుకుని నవ్వుకుంటూ వాళ్ళు వెళ్ళిపోవడం మాత్రం ఇంకా కళ్లల్లో
మెదులుతున్నట్టేవుంది.
పోతే, పనిలో పనిగా జస్వంత్ సింగ్ గారి భార్య అంబులెన్సు సర్వీసు గురించి మరి కొన్ని సంగతులు మా చెవిన వేసి వెళ్ళింది. మైనస్ ముప్పయి, నలభయి డిగ్రీలవరకు ఉష్ణోగ్రతలు పడిపోయే ఆ నగరంలో వోడ్కా అనేది అక్కడి జనాలకు ఒక నిత్యావసర వస్తువులాంటిది. వొళ్ళు వెచ్చగా ఉంచుకోవడానికి వోడ్కా పుచ్చుకునే వారు కోకొల్లలు. ఈ విషయంలో కూడా అక్కడ మహిళలదే పైచేయి.
తాగి
తాగి ఆ తాగిన మత్తులో మంచులో
తూలి పడిపోయి ఇంటికి చేరలేని దేవదాసులు, దేవదాసినులను అంబులెన్సు బృందాలు వెతికి పట్టుకుని ఆసుపత్రులకు చేరవేస్తుంటాయట.
వారివద్దవుండే ప్రోపుస్కా (ఫోటో గుర్తింపు కార్డు) ఆధారంగా వారి ఇళ్ళకూ, ఆఫీసులకూ సమాచారాన్ని అందిస్తాయిట. అంతే కాదు , ఆసుపత్రుల్లో అలా చేరిన వారు పూర్తిగా కోలుకునే వరకూ వాళ్లకు జీతంతో కూడిన సెలవు ఇవ్వడమనేది కొసమెరుపు.
పిలిపెంకో
ఓసారి పట్టుపట్టి మమ్మల్ని లెనిన్ గ్రాడ్ రైల్లో తీసుకువెళ్ళాడు.
ఈ
ఫిలిపెంకో ఎవరో ఇంతకు ముందు చెప్పాను
అనుకుంటా.
అప్పటికి
మాకు పెళ్ళయి ఇరవై ఏళ్ళు. అయినా నా భార్య నాతోనే కాపురం చేస్తూ వుండడం అనేది
వాళ్ళకో వింత. పదహారేళ్ళకే పెళ్ళాడి, ఇరవై ఏళ్ళు వచ్చేసరికి
ముగ్గురు మొగుళ్ళకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్ళికి సిద్ధంగా వున్న రేడియో
మాస్కోలో నా సహచర ఉద్యోగిని నటాషాకు మా ఆవిడ్ని చూస్తే ఓ అబ్బురం. అలాంటి
విడాకుల దేశంలో పెళ్ళయి పాతికేళ్ళయినా ఫిలిపెంకో దంపతులు విడాకుల గొడవలేకుండా
కాపురం చేసుకోవడం మాకో విడ్డూరం.
అయిదేళ్ళ
తర్వాత, మేము
హైదరాబాదుకు ఆల్ మకాం మార్చిన తరువాత కూడా మా రెండు కుటుంబాల నడుమ
స్నేహం కొనసాగింది. ఆ దంపతులు మమ్మల్ని చూడడానికి హైదరాబాదు వచ్చారు. ఇంట్లో సౌకర్యంగా వుండదని హోటల్లో బస
ఏర్పాటు చేయాలనే మా ప్రయత్నాన్ని వాళ్ళు తోసిరాజన్నారు. ఇంత దూరం వచ్చింది కలిసి వుండడానికి కానీ
హోటల్లో గడపడానికి కాదు పొమ్మన్నారు. వినడానికి చిత్రంగా తోచవచ్చు కానీ,
ఇక్కడ ఓ మాట
చెప్పుకోవాలి. వారికి తెలుగూ, ఇంగ్లీష్ రెండూ రావు. మాకు రష్యన్ ఒక ముక్క కూడా అర్ధం అయిచావదు. మా
పిల్లలు ఇంట్లో ఉన్నంత సేపూ వాళ్ళే దుబాసీలు. స్కూలుకు వెళ్ళిన తరువాత మా సంభాషణ
అంతా సైగలతోనే.
హైదరాబాదులో
ఒకరోజు భోజనాలు అయిన తరువాత మా ఆవిడ అరటి పండు ఒలిచి నాకు అందించడం పిలిపెంకో కంటపడింది.
వెంటనే వంటింట్లోకి వెళ్లి , అప్పడాల కర్ర పట్టుకొచ్చాడు. ‘అరటి పండు కాదు దీంతో మీ ఆయన నెత్తి మీద
మొత్తు’ అంటూ సైగలతోనే మా ఆవిడతో చెప్పాడు. భార్య మొగుడికి అలా
అరటిపండు ఒలిచి మరీ అందివ్వడం ఆయనగారికి నచ్చినట్టులేదు. ‘బాగా గారాబం
చేస్తున్నావు మీ ఆయన్ని. ఏం చేతులు లేవా, ఒలుచుకు తినలేడా’ అంటూ ఆ సైగలతోనే
మందలించాడు.
ఇక
ఇంట్లో నవ్వులే నవ్వులు. వాటికి భాషతో అవసరం లేదు కదా!
అలాంటి
ఫిలిపెంకోతో కలిసి రైల్లో లెనిన్ గ్రాడ్ ప్రయాణం ఆహ్లాదకరంగా వుంటుందని మేమూ బయలుదేరాము.
దోవపొడుగునా అటూ ఇటూ మంచు మైదానాలపై అక్కడక్కడా కార్చిచ్చులో
తగలబడిన అడవిలో మాదిరిగా నల్లగా మాడిపోయిన చెట్లు. చలికాలంలో ఒక్క మాస్కోనే కాదు, రష్యా మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఫోటో
మాదిరిగా వుంటుంది. చైత్ర వైశాఖ మాసములు
వసంత ఋతువు అని చిన్నప్పుడు చదువుకున్నట్టు, ఇలా నల్లగా మాడిపోయి కనిపించే
చెట్లు, తరుణం వచ్చినప్పుడు అవన్నీ మళ్ళీ
పచ్చగా ఆకులు రెమ్మలు,
కొమ్మలతో కనుల పండువగా కనిపించడం ప్రకృతిలోని వైచిత్రి.
రైలు
ప్రయాణం బాగానే వుంది. ఒక బోగీని డైనింగ్ హాలు మాదిరిగా తయారు చేశారు. అక్కడ
కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, ఓడ్కా సేవిస్తూ,
పెద్ద పెద్ద కిటికీ అద్దాల నుంచి చక్కటి పరిసరాలను వీక్షిస్తూ కాలక్షేపం
చేయవచ్చు. పిలిపెంకోకి మద్యం అంటే పడదు. ఆయన భార్య కూడా అంతే.
లెనిన్
గ్రాడ్ అందమైన నగరం. కాలువలు, వంతెనలు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మ్యూజియంలు, ముఖ్యంగా హెర్మిటేజ్ మ్యూజియం. ఆ
ఒక్కటి పూర్తిగా చూడాలంటే ఒక్క రోజులో అయ్యేపని కాదు. అంత పెద్దది. అన్నింటికీ
మించి శ్వేత రాత్రులు.
అర్ధరాత్రి
సూర్యుడిని చూడాలి అంటే అక్కడికే వెళ్ళాలి.
కమ్యూనిష్టుల
ఏలుబడిలో లెనిన్ గ్రాడ్ గా పేరు మార్చుకున్న ఆ రష్యన్ నగరం మళ్ళీ తొంభయ్యవ దశకం
మొదట్లో సెంట్ పీటర్స్ బర్గ్ గా తన పూర్వ నామాన్ని ధరించింది.
మార్చి
మొదటి వారం నుంచి జులై చివరి వరకు దాదాపు ఎనభయి రోజులు అనుకుంటాను ఆ నగరంలో ‘శ్వేత
రాత్రులు’ పేరిట ఉత్సవాలు జరుగుతాయి. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు అక్కడికి చేరుకుంటారు. ఆ
విశేషం ఏమిటంటే అన్ని రోజులూ అక్కడ పగలూ, రాత్రీ ఇరవై నాలుగు గంటలు పట్టపగలే.
చీకటి పడదు. అర్ధరాత్రి కూడా నడిబజార్లో నిలుచుని పుస్తకాలు చదువుకోవచ్చు. అందుకే
వీటిని వాళ్ళు ‘శ్వేత రాత్రులు’ అని ముద్దుగా పిలుచుకుంటారు.
వైట్
నైట్స్ చూడడానికి వచ్చే పర్యాటకులతో ఇప్పుడా నగరం మూడు బార్లు, ఆరు హోటళ్ళ చందంగా వెలిగిపోతోంది(ట)
లెనిన్
గ్రాడ్ వెళ్ళామనే కానీ అక్కడ పట్టుమని రెండు రాత్రులు కూడా గడపలేదు.
ఎప్పుడు వెళ్లి ఇంట్లో పడదామా, మా ఆవిడ వండి పెట్టే వేడివేడి అన్నం ఆవురావురుమని
తిందామా అన్న ఆరాటంతోనే సరిపోయింది. ఆ నగరంలో చూడాల్సినవి ఎన్నోవున్నాయి. కానీ తినకుండా తిరగడం అన్నదే నాకు పెద్ద సమస్యగా మారింది. పూజలు, పునస్కారాలు, ఉపోషాలు అలవాటయిన మా ఆవిడకి తిండి
ఒక సమస్య కాదు. పాలు తాగి సరిపుచ్చుకోగలదు. నాకు అలా కాదు, కారాలు, పచ్చళ్ళు పెరుగన్నం కావాలి. అంచేత నాలుగయిదు రోజులు వుందామని వెళ్లి మూడో రోజునే మాస్కోకి
తిరిగివచ్చాం.
శాకాహారులకు
హోటళ్ళలో తినడానికి ఏమీ దొరకదు. ముతక బియ్యంతో పొడిపొడిగా వండిన అన్నంపై ఉప్పూ,
మిరియప్పొడి చల్లుకు తినాలి. పెరుగు కాదు కానీ పెరుగులాంటిది 'కిఫీర్' దొరుకుతుంది. దానితో సరిపెట్టుకుని
భోజనం అయిందనుకోవాలి. అలాగని మాంసాహారులకు రుచికరంగా అన్నీ దొరుకుతాయని
అనుకోనక్కరలేదు. ఉడికించిన కోడిగుడ్లు మినహా మిగిలినవేవీ మనవైపు నుంచి వెళ్ళిన
వాళ్లకు అంతగా రుచిస్తాయనుకోవడానికి లేదు. మాంసాన్ని ఉప్పునీళ్ళల్లో ఉడికించి
అదేమాదిరిగా సర్వ్ చేసేవారు. ఉప్పుకారాలు దట్టించి, నూనెల్లో వేయించి వేయిన్నొక్క
రకాలుగా వంటలు వండుకుని తినే అలవాటు వున్న వాళ్లకు, ఆ తిండి సయించడం కష్టమే.
అందుకే అక్కడికి వ్యాపారపు పనులమీదనో లేక ఇండో సోవియట్ సాంస్కృతిక సంఘం ఆహ్వానం
మేరకో వచ్చినవాళ్ళు భోజనానికి కటకట పడుతుంటారు. అలా వచ్చినవాళ్ళు మొదటి రోజు
అక్కడి హోటళ్లు, బస
ఏర్పాట్లు చూసి పరవాలేదనుకుంటారు. విందుల్లో మందు తప్ప ఇష్టపడి తినదగిన భోజనం
కనబడక పోవడంతో, ఆకలి ఎరుగని దేశంలో
వాళ్లకు ఆకలి కష్టాలు మొదలవుతాయి.
కింది
ఫోటోలు:
ఇంటికి
వచ్చిన రష్యన్ డాక్టర్లతో పిచ్చాపా’టీ’
ఒకనాటి
లెనిన్ గ్రాడ్ లో ముసలి గుర్రం మీద ఓ వయసు కుర్రోడు. అంటే నేనే. నలభయ్ ఏళ్ళ క్రితం
నేను పడుచువాడినే కదా! నాలాగే ఆకలితో కృశించిన గుర్రం దొరకడం కాకతాళీయం.
(ఇంకావుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి