వెనుకటి
రోజుల్లో ఇతర ప్రాంతాలనుంచి విద్యార్ధులు హైదరాబాదు ఎక్స్ కర్షన్ కు వస్తే వాళ్లకు
చూపించే ప్రదేశాల్లో రేడియో స్టేషన్ కూడా వుండేది. బేగం పేట ఏరోడ్రోం మరోటి. విమానాశ్రయం అనే వాళ్ళు కాదు, ఏరోడ్రోం
అంటేనే చెప్పుకోవడానికి గొప్పగా వుండేది. ఆ రోజుల్లో ఇప్పట్లా కాదు, రోజు మొత్తంలో కలిపి ఒకటీ అరా
విమానాలే హైదరాబాదు వచ్చి వెళ్ళేవి. కొన్ని నైట్ హాల్ట్ బస్సుల మాదిరిగా
రాత్రంతా అక్కడే వుండి మరునాడు బయలుదేరి వెళ్ళేవి. అందుకని స్కూలు పిల్లల్ని
తీసుకువచ్చిన మాస్టర్లు కూడా ఏదో ఒక విమానం వచ్చే టైమో, వెళ్ళే టైమో ముందుగా కనుక్కుని
అక్కడికి తీసుకువెళ్ళేవాళ్ళు. విమానాశ్రయం మేడ మీద అద్దాల కిటికీల్లో నుంచి
విమానం దిగివస్తున్న వాళ్ళను చూసి సంతోషంతో కేరింతలు కొట్టేవాళ్ళు, అల్లాగే అసెంబ్లీ బిల్డింగ్, దానిపక్కనే పబ్లిక్ గార్డెన్,
చార్మినార్,
సాలార్ జంగ్
మ్యూజియం ఇలా అన్ని చోట్లకీ తిప్పి వెనక్కి తీసుకుపోయేవాళ్ళు. తరువాత తరువాత ఈ
జాబితాలో నెహ్రూ జూ పార్కు, రవీంద్రభారతి
వచ్చి చేరాయి.
ఇంతకుముందే
చెప్పినట్టు గొప్ప సంస్థల్లో పనిచేసే అవకాశం రావడం వల్ల అంతవరకూ చాలా గొప్పవాళ్ళు, వీళ్ళను ఒక్కసారి కలిస్తే చాలు
అనుకున్నవాళ్ళతో కలిసి పనిచేసే గొప్ప అవకాశం లభిస్తుంది. రేడియోలో చేరడం వల్లనే,
పన్యాల రంగనాధ
రావు గారు, తిరుమలశెట్టి
శ్రీరాములు గారు, మాడపాటి
సత్యవతి గారు, డి.వెంకట్రామయ్య
గారు ఇలాటి గొప్ప స్వర సంపన్నులతో సహోద్యోగిగా సాంగత్యం చేసే స్వానుభవం సొంతం
అయింది. (నిజానికి రేడియో వార్తల్లో ‘గారు’ వాడరు ‘శ్రీ’ తప్ప. కానీ ఈ
గొప్పవారిపట్ల పెంచుకున్న గౌరవంతో ‘గారు’ చేర్చి గౌరవించుకుంటున్నాను)
జర్నలిజం
వృత్తిలో చేరినప్పుడే సీనియర్లు, జూనియర్లు అనే తేడా వొదులుకోవాలని, ‘హోదాలతో’ సమకూరే పెద్దరికాలను పక్కనపెట్టాలని
నా పెద్దలు నాకు నేర్పిన పాఠం. అందుకే నా వృత్తి జీవితంలో నాకు ఎవ్వరూ ‘బాసులు’
కారు, నేను
ఎవ్వరికీ ‘బాసును’ కాను. ఇదే సూత్రాన్ని నేను మూడు దశాబ్దాలపాటు పాటించాను.
ఆచరించాను.
1975 లో
నేను హైదరాబాదు ఆలిండియా రేడియో ప్రాంతీయ వార్తా విభాగంలో అసిస్టెంట్
ఎడిటర్
(రిపోర్టింగ్) గా చేరినప్పుడు, నా
ఉద్యోగ బాధ్యత కాకపోయినా వారానికి మూడు రోజులు ఉదయం ఆరుగంటల నలభయ్ అయిదు నిమిషాలకు
ప్రసారం అయ్యే ప్రాంతీయవార్తల బులెటిన్ ఎడిటింగ్ బాధ్యతలు చూసేవాడిని. అప్పుడు
పరిచయం గుడిపూడి శ్రీహరి.
తిరుమలశెట్టి
శ్రీరాములు, డి.
వెంకట్రామయ్య, జ్యోత్స్నాదేవి
రెగ్యులర్ న్యూస్ రీడర్లు. మాడపాటి సత్యవతి గారు అసిస్టెంట్ ఎడిటర్. అప్పుడప్పుడు
వార్తలు
చదివేవారు. వారి వీక్లీ ఆఫ్స్, సెలవు రోజుల్లో వార్తలు చదవడానికి క్యాజువల్ న్యూస్ రీడర్లుగా
పీ.ఎస్.ఆర్. ఆంజనేయ శాస్త్రి, సురమౌళి, గుడిపూడి శ్రీహరి గార్లు వచ్చేవారు.
అప్పుడప్పుడు అనుకోకుండా వాళ్లకు గొంతు పట్టేసిన సందర్భాలు వచ్చేవి.
అప్పుడు నేనే బులెటిన్
పేపర్లు పట్టుకుని వెళ్లి స్టూడియోలో కూర్చుని వార్తలు చదివేసేవాడిని. (ఈ
అనుభవం తర్వాత
రోజుల్లో నాకు అక్కరకు వచ్చింది. రేడియో మాస్కోలో వార్తలు చదవడానికి నన్ను ఎంపిక
చేసే సమయంలో, వస్తుతః
నేను రేడియో విలేకరిని అయినప్పటికీ, , అవసరార్థం నెత్తికి ఎత్తుకున్న ఈ
అనుభవం పనికివచ్చింది)
ఉదయం
పూట న్యూస్ రీడర్లు చదివే వార్తలను ఎడిట్ చేసి, ప్రాధాన్యతా క్రమంలో హెడ్ లైన్స్
(ముఖ్యాంశాలు) ఎంపికచేసి ఇవ్వడం నా బాధ్యత. ఉద్యోగంలో చేరకముందే, స్కూలురోజులనుంచే వీళ్ళు చదివే
వార్తలు నేను రేడియోలో వింటూ వుండేవాడిని. అలాంటి వాళ్ళతో కలిసి పనిచేసే
మహత్తర అవకాశం నాకు రేడియో ఉద్యోగం ఇచ్చింది.
శ్రీహరి
సంగతి కదా చెప్పుకుంటున్నాం.
ఆయన
వయసులో నాకంటే పెద్ద. కానీ ఆహార్యంలో నాకంటే కుర్రవాడు. హాలీవుడ్ సినిమా
హీరో మల్లే నెత్తిన హ్యాటు. చలవ కళ్ళజోడు, కోటు, బూటుతో మోటార్ సైకిల్ మీద ఆయన రేడియో
ప్రాంగణంలో ప్రవేశిస్తూ వుంటే చూడాలి. శ్రీహరి గారి దగ్గర రకరకాల హ్యాట్లు (టోపీలు
కాదు, హాలీవుడ్, హిందీ
సినిమాల్లో
హీరోలు పెట్టుకునేవి), పలురకాల
నల్ల కళ్ళజోళ్లు, కొట్టవచ్చేటట్టు
కనబడే ముదురు రంగుల బుష్ కోట్లు, వీటన్నితో కలిపి చూస్తే అసలు వయసు కంటే చాలా చిన్నవాడిగా కనబడేవాడు.
అంచేత నేను కూడా చనువు తీసుకుని ఏకవచనంలోనే సంబోధించేవాడిని. ఆయనా అల్లాగే నన్నూ
ఏమోయ్ శ్రీనివాసరావ్ అని పిలిచేవాడు. అలా అరమరికలు లేని స్నేహం మా నడుమ వుండేది.
ఆహార్యానికి
తగ్గట్టే శ్రీహరి వార్తలు చదివే తీరు కూడా విభిన్నంగా వుండేది. బయట కులాసాగా
తిరిగినట్టే స్టూడియో లోపల కూడా బేఫికర్ గా వార్తలు చదివేవాడు. వార్తలు చదువుతూ
గొంతు సవరించుకోవడం, ఊపిరి
పీల్చి వదిలిన ధ్వని ఇవన్నీ మా రేడియో వాళ్లకి నచ్చవు. అదే రిపోర్టులో రాసి ఆయనకు
చెప్పమనే వారు. నేను చెబితే ఆయన నవ్వి ఇలా అన్నాడు.
‘మనం
పోటీ ప్రపంచంలో ఉన్నాము. ఇలా అనేవాళ్ళు ఎప్పుడయినా బీబీసీ వార్తలు విన్నారా!
వాయిస్ ఆఫ్ అమెరికా వార్తలు విన్నారా! అక్కడ ఇటువంటివి సహజంగా తీసుకుంటారు.
నిజానికి అలా చేయడం వల్ల ఈ ప్రోగ్రాము ముందుగా రికార్డు చేసింది కాదు, లైవ్ ప్రోగ్రాం అని శ్రోతలకు
తెలుస్తుంది కూడా’
ఆయన
చెప్పింది నాకు సరిగానే అనిపించింది.
శ్రీహరికి
భార్యావియోగం కలిగింది. ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం అనుకున్నా. కొన్నేళ్ళ
తర్వాత ఆయనా దూరం అయిపోయారు. 2022 జులై లో తన 88 వ ఏట హైదరాబాదులో కన్నుమూశారు. మనిషి
పోయినా స్వరం మాత్రం తెలుగు శ్రోతల గుండెల్లో పదిలంగా వుంటుంది.
అలాగే
సురమౌళి. ఈయన కూడా రేడియోలో క్యాజువల్ న్యూస్ రీడర్. మాసిపోయిన లాల్చీ పైజామాతో
అత్యంత సాదా సీదాగా వుండే సురమౌళిని చప్పున అర్ధం చేసుకోవడం కష్టం. అసలు ఆ పేరే
విచిత్రం. ముందు కలం పేరు అని భ్రమపడే అవకాశం వుంది. అయితే ఆయనతో పరిచయం పెరిగినకొద్దీ ఆ మనిషిలోని గొప్ప
లక్షణాలు నాకు క్రమంగా బోధ పడుతూ వచ్చాయి. ఫక్తు లోహియావాది. జార్జ్ ఫెర్నాండేజ్
వంటి నాయకులతో సన్నిహిత పరిచయం.
చాలా ఏళ్ళ క్రితం నేనూ జ్వాలా నరసింహారావు ఓసారి ఢిల్లీ
వెళ్లాం (బహుశా అదే మొదటి పర్యాయం అనుకుంటా ఢిల్లీ చూడడం). అప్పుడు పార్లమెంటు
సమావేశాలు జరుగుతున్నాయి. చూద్దామనే కోరిక. ఇద్దరం పార్లమెంటు లాబీల్లోకి వెళ్లాం.
ఇప్పట్లా అప్పట్లో కఠినమైన నిబంధనలు లేవు. లోపలకు వెళ్లి గేలరీ నుంచి పార్లమెంటు
సమావేశాలు చూడాలంటే పాసు అవసరం. దానికి
ఎవరయినా ఎంపీ సంతకం కావాలి. అటూ ఇటూ చూస్తుంటే జార్జ్ ఫెర్నాండెజ్ కనిపించారు.
దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకున్నాం. హైదరాబాదునుంచి వచ్చామనీ, సురమౌళి స్నేహితులమనీ చెప్పాం. అంతే! మేము ఎవరమో తెలియకపోయినా, సురమౌళి పేరు
చెప్పగానే ఫెర్నాండెజ్ మారుమాట మాట్లాడకుండా విజిటర్స్ గేలరీ కాగితం మీద సంతకం
చేసి ఇచ్చారు. దటీజ్ సురమౌళి.
బద్రీ విశాల్ పిత్తి వంటి పెద్దపెద్ద
వారితో సన్నిహిత పరిచయాలు వున్నాకూడా వాటిని ఎన్నడూ తన సొంత ప్రయోజనాలకు
వాడుకోలేదు. ఒక స్థిరమైన ఉద్యోగం చేసిన దాఖలా లేదు. అప్పుడప్పుడూ రేడియో వార్తలు
చదువుతూ, రచనలు చేసుకుంటూ జీవితం వెళ్ళదీశాడు. ఎన్టీఆర్ హయాములో జి.
నారాయణరావు గారు అసెంబ్లీ స్పీకర్ గా వున్నప్పుడు శాసనసభలో ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో సభ్యులు
చేసే ప్రసంగాలను తెలుగులోకి అనువాదం చేసే ఒక ఉద్యోగాన్ని సృష్టించి సురమౌలికి ఒప్పచెప్పారు.
అదీ తాత్కాలికమే.
పెద్ద సంస్కరణవాది. పుట్టుకతో బ్రాహ్మణుడు అన్న సంగతి
పుట్టినప్పుడే మరిచిపోయిన మనిషి. పెళ్లి విషయంలో కులం పట్టింపు పాటించలేదు.
పుట్టిన అమ్మాయికి వెన్నెల అని పేరు పెట్టాడు. నిండైన విగ్రహం. కృష్ణ వర్ణం.
తెల్లటి లాల్చీ, పైజామా ధరించిన సురమౌళిని
ఎంత దూరం నుంచి అయినా గుర్తుపట్టవచ్చు. అనేక భాషలు తెలిసిన వాడు. రాం మనోహర్ లోహియా
రచనలను పుక్కిటపట్టాడు. గంభీరమైన స్వరంతో వార్తలు చదివేవాడు. మంచి స్నేహితుడు.
అలాంటి వాడు చిన్న వయసులోనే చనిపోవడం విచారకరం.
ఇక పి.ఎస్.ఆర్. ఆంజనేయ శాస్త్రి గారు.
వారు ఫిలిం జర్నలిస్టు. అక్కినేని నాగేశ్వరరావు వంటి పెద్ద పెద్ద సినీ నటులతో పరిచయాలు ఉండేవి.
శ్రీహరి కూడా హిందూ వంటి ప్రముఖ పత్రికలకు సినిమా వ్యాసాలు రాస్తుండేవారు. కానీ
ఏనాడు వారి నోటి వెంట ఈ హీరో తెలుసు, ఆ హీరోయిన్ తెలుసు అనే మాట వినపడేది
కాదు. వచ్చి తమ పని చేసుకుని వెళ్ళిపోయేవారు. ఆంజనేయ శాస్త్రి గారిది చాలా
పెద్దమనిషి తరహా. అనేక సినిమా కార్యక్రమాల వత్తిడి ఉన్నప్పటికీ రేడియో డ్యూటీ
వున్నరోజున టైం ప్రకారం వచ్చి వార్తలు
అనువాదం చేసుకుని చదివి వెళ్ళిపోయేవారు. చిక్కడపల్లిలో మా ఇంటికి దగ్గరలోనే
వుండేవారు. సురమౌళి, శ్రీహరి, శాస్త్రి
గార్లది విభిన్న ఆహార్యం. వార్తలు చదివే పద్దతి కూడా విభిన్నం.
కింది ఫోటోలు:
పాత తరం వారి ఫోటోలు గూగులమ్మ దగ్గర కూడా దొరకవని తేలిపోయింది. పి.ఎస్.ఆర్.
ఆంజనేయ శాస్త్రి గారి ఫోటో కోసం వెతికితే, ఆయన ఫోటో లేదు కానీ ఆయన పేరిట నెలకొల్పిన అవార్డు ప్రదాన కార్యక్రమం
ఫోటో దొరికింది. అందులో వేదిక కింద దండ వేసి వున్న ఆయన ఫోటో ఒకటి కనపడింది. గుర్తు పట్టేలా లేదు. ఇక సురమౌళి ఫోటో అసలు
దొరకనే లేదు. ఫోటో కాదు కదా ఆయన గురించిన సమాచారమే లేదు. శ్రీహరి ఫోటో మాత్రం లభ్యం అయింది.
సురమౌళి ఫోటో దొరకలేదు అనే బాధ లేకుండా విజయ జ్యోతి గారు అనే పాఠకురాలు ఆ ఫోటో పంపారు. వారికి నా ధన్యవాదాలు.
(ఇంకావుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి