14, మార్చి 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (115) – భండారు శ్రీనివాసరావు

 

మెట్రో డిజైన్  మార్చిన స్టాలిన్ కాఫీ కప్పు

మాస్కో మెట్రో పట్ల స్టాలిన్ యెంతో శ్రద్ధ కనబరిచేవారని చెబుతారు. రోజూ ఏదో ఒక వీలు చూసుకుని మెట్రో నిర్మాణ పురోగతిని అధికారులతో, ఇంజినీరులతో సమీక్షించేవారు. అంతకుముందు ఏటవాలుగా, నిలువుగా, అడ్డంగా మెట్రో రైలుమార్గాలను డిజయిన్ చేశారు.వాటిని స్టాలిన్ కు చూపించి, ఆ మాపులపై స్టాలిన్ అభిప్రాయం కోసం అధికారులు ఎదురుచూస్తున్న సమయంలో కాఫీ తాగుతున్న స్టాలిన్-ఆ కప్పును ఒక మ్యాప్ మధ్యలో వుంచారుట. కప్పుకు వున్న కాఫీ మరక గుండ్రంగా దానిపై పడింది. దాన్ని స్టాలిన్ అభిప్రాయంగా పరిగణించిన ఇంజినీర్లు - వృత్తాకారంలో మరో మెట్రో మార్గాన్ని- మిగిలిన అన్ని మార్గాలను కలుపుతూ 'మెట్రో రింగ్ రూట్' కు రూపకల్పనచేసి నిర్మించారు. భూగర్భంలో రైల్ జంక్షన్ ల నిర్మాణానికి స్టాలిన్ ' కాఫీ కప్పు మరక' పరోక్షంగా దోహదం చేసిందన్న ఒక కధ
ప్రచారంలోకి వచ్చింది.

రష్యన్ ఒక్క అక్షరం ముక్క  తెలియకపోయినా, మెట్రో లో తేలిగ్గా ప్రయాణాలు చేసేందుకు అక్కడి రవాణా వ్యవస్థ అధికారులు ఒక చక్కటి మెట్రో మ్యాప్ తయారు చేశారు. ఇది దగ్గర వుంచుకుంటే స్టేషన్లు గుర్తించడం సులభం అవుతుంది.

మేమున్న రోజుల్లోనే మాస్కో మెట్రోలో నూటయాభయి స్టేషన్ల దాకా ఉండేవి. మాఇంటికి దగ్గరలో ప్రొఫ్ సోవూజ్నయా (నిజానికి ఆ స్టేషన్ ని రష్యన్ లో ఎలా ఉచ్చరిస్తారో తెలియదు) అనే మెట్రో స్టేషన్ వుంది. అక్కడిదాకా నడిచి వెళ్ళి మెట్రో ఎక్కేవాళ్లము.

 మాస్కో రేడియోకు వెళ్ళాలంటే త్రేత్యా కోవోస్కయా అనే పేరుకలిగిన మెట్రో స్టేషన్ లో దిగాలి. అక్కడ ఎస్కలేటర్ ద్వారా పైకి వస్తే పక్కన పది అడుగుల దూరంలో మాస్కో రేడియో భవనం. ఈ మధ్యలో మరో అయిదు స్టేషన్లు వున్నాయి. అకడమిస్కయా , లెనిన్ స్కీ ప్రాస్పెక్ట్, షావోలోస్కయా, అక్త్యా బ్రస్కయా (రింగ్ లైన్ లో వున్న మెట్రో జంక్షన్ ), నోవో కుజ్నిస్కయా అనేవి ఈ స్టేషన్ల పేర్లు .టంగ్ ట్విష్ట్ పదాలకోసం వెతుక్కోనక్కరలేదు. మాస్కో మెట్రో స్టేషన్ల పేర్లు సరిపోతాయి.

 ముందే చెప్పినట్టు,  మెట్రో రైళ్లల్లో, ట్రాముల్లో, ట్రాలీ బస్సుల్లో, సిటీ బస్సుల్లో,  అన్నిటిలో పనికొచ్చే పాస్ వుంటుంది. అంటే, మూడు రూబుళ్ళు పెట్టి అతి సులభంగా లభించే ఈ పాస్ కొనుక్కుంటే, నెల పొడుగునా మాస్కో అంతా వీర విహారం చేయవచ్చు. నెలసరి పాస్ అనవసరమనుకున్న వాళ్ళు,  అంటే మాస్కోకి పనులమీద వచ్చే వాళ్ళు,  ఒకే ఒక్క రూబుల్ తో పదిరోజులు వాడుకునే పాస్ కొనుక్కోవచ్చు. ఇన్ని సదుపాయాలతో, ఇంత చవకగా ప్రయాణించడానికి వీలున్న మెట్రో ప్రపంచంలో మరొకటి లేదన్న మంచి పేరు ఒక్క మాస్కో మెట్రోకే దక్కింది.


ఇప్పుడు ఇదంతా గతం. గత కీర్తి మరింత ఘనం. మాస్కో మెట్రో గురించి  జనం మంచిగా చెప్పుకునే రోజులకు నూకలు చెల్లిపోయాయి. అయితే ఇది నా కళ్ళతో చూసి చెబుతున్నది కాదు. చెవులతో విన్నది, వింటున్నది.

1935 లో మాస్కో మెట్రో తొలిసారి ప్రారంభమయినప్పుడు దాని టికెట్ ధరను యాభయి కోపెక్కులుగా నిర్ణయించారు. 1961 లో దాన్ని అయిదు కోపెక్కులకు తగ్గించారు. అప్పటినుంచి  1991 వరకు అంటే ముప్పయి సంవత్సరాలపాటు మెట్రో టికెట్ ఖరీదుని ఒక్క పైసా కూడా పెంచలేదు. గోర్భచేవ్ ఆర్ధిక సంస్కరణల నేపధ్యంలో 1991 లో 15  కోపెక్కులకు, 1992 లో  యాభయి కోపెక్కులకు,  అదే ఏడాదిలో  ఒక్కసారిగా మూడు రూబుళ్ళకు పెంచేశారు. అంటే రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలో,  అమాంతం అరవై రెట్లు పెంచారన్న మాట. అంతటితో ఈ పెరుగుదల ఆగలేదు. అలా పెరుగుతూ పోయి మెట్రో టికెట్ ధర 1994 లో   నాలుగువందల రూబుళ్లకూ, 1995 లో  ఆరు వందలనుంచి పదిహేను వందల రూబుళ్లకూ, 1997 సంవత్సరం నాటికి ఏకంగా రెండువేల రూబుళ్లకూ పెరిగి ఇక పెరగడానికి వీలులేక కాబోలు ఆగిపోయింది. పెరుగుట విరుగుట కొరకే అన్న సుమతీ శతకకారుడి సూక్తిని నిజం చేస్తూ ప్రస్తుతం మాస్కో మెట్రో టికెట్ ధర,  మెట్రో  రైలులో  ఒకసారి ప్రయాణానికి 26  రూబుళ్ల వద్ద  నిలకడగా నిలచిపోయింది. ఇంతటి స్థాయిలో,  అనేక వందల  రెట్లు, అదీ అతి తక్కువ వ్యవధిలో ధరలు ఆకాశాన్ని దాటి చుక్కలను తాకినప్పటికీ కూడా నిబ్బరంగా  తట్టుకున్న మాస్కో పౌరులను అభినందించి తీరాలి కదూ. అంతేకాదు, అంతటి ద్రవ్యోల్బణం  ఉత్పాతాన్ని పది పదిహేనేళ్ళ వ్యవధిలోనే అధిగమించగలిగిన   లేదా  తట్టుకోగలిగిన విధంగా 'కుషన్' ఏర్పాటు చేసిన  'సోవియట్ ఎకానమీ'ని  అభినందించాలి.
నిశ్చింతగా ప్రయాణాలు సాగిన ఆ నాటి మాస్కో మెట్రో స్టేషన్లలో ప్రయాణాలు చేయాలనుకునే విదేశీయులకు, ఈనాడు  వారి ఎంబసీలు ఇస్తున్న ఉచిత సలహా వింటుంటే కడుపు తరుక్కుపోతుంది. అదేమిటంటే, 'మాస్కో మెట్రోల్లో జేబు దొంగలుంటారు జాగ్రత్త'.

కళ్ళెదుటే  కలల సామ్రాజ్యం కనుమరుగు కావడం అంటే ఇదే.

ఆనాడు నేను చూసింది మరో ప్రపంచం.

అప్పటికి, ఇప్పటికి ఎంతో తేడా.

కింది ఫోటో:

మాస్కో మెట్రో మ్యాప్ ( 1980లో)



 

(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: