13, మార్చి 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (112) – భండారు శ్రీనివాసరావు

 గోర్భచేవ్ నుంచి ఫోన్

ఒకరోజు రేడియో స్టేషన్ కు వెళ్ళడానికి తయారవుతున్నాను. ఇంతలో గోర్భచేవ్ నుంచి ఫోన్.

దీనికి ముందు హైదరాబాదులో ఒక జర్నలిష్ట్  మితృడి గురించి చెప్పాలి. జర్నలిష్ట్ అంటే అతడేదో పత్రికల్లో పనిచేసే జర్నలిస్ట్ కాదు. ఒక తరం జర్నలిష్టులందరికి అతడు మంచి స్నేహితుడు. ఒక ప్రసిద్ధ సంస్థలో పౌరసంబంధాల అధికారిగా  పనిచేస్తున్నాడు. మృదుస్వభావి. అందరితో మంచిగా వుండడం ఎలాగో అతడిని నుంచి తెలుసుకోవాలి.  పేరు మురారి. ఎందుకో ఏమిటో తెలియదు కానీ,  నేను అతడిని సరదాగా గోర్భచేవ్ అని పిలిచేవాడిని. మా ఇంటిల్లిపాదికి తెలిసిన వ్యక్తి.

అందువల్ల మురారి నుంచి ఫోన్ రాగానే నేను సంతోషపడ్డాను. తన పెద్ద బాసు బీవీ రావు (బండ వాసుదేవరావు) గారు వ్యాపారపు పనుల మీద మాస్కో వస్తున్నారని, అంచేత కష్టం అనుకోకుండా ఎయిర్ పోర్టుకి వెళ్లి రిసీవ్ చేసుకోమని మురారి కోరాడు. కాస్త కనిపెట్టుకుని చూడమని ఆర్డర్ లాంటి విన్నపం జోడించాడు. వెంటనే గీర్మన్ కు ఫోన్ చేసి ఇవ్వాళ ఆఫీసుకు రావడం లేదని చెప్పేసి, టాక్సీలో నేరుగా షెర్మేతోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్లాను.

బీవీ రావు గారంటే ఆషామాషీ కాదు. రాష్ట్రంలో కోళ్ళ పెంపకాన్ని ఓ పరిశ్రమగా తీర్చిదిద్ది, కోడిగుడ్డుకు జాతీయ ఖ్యాతి, అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించిన  వెంకటేశ్వరా హేచరీస్ అధినేత. కష్టపడి జీవితంలో పైకి వచ్చినవారు. సామాన్యుడిగా జన్మించి మాన్యుడిగా ఎదిగిన వ్యక్తి. పద్మశ్రీ అవార్డు గ్రహీత.  హైదరాబాదులో రేడియో విలేకరిగా నాకూ ఆయనతో పరిచయం వుంది.   

విమానం అనుకున్న టైముకే వచ్చింది. రావుగారు త్వరగానే బయటకు వచ్చారు. తెలిసిన మనిషే కనుక నేను తేలిగ్గానే గుర్తుపట్టాను. సూటు, బూటు,  లాంగ్ కోటులో  వచ్చిన నన్ను ఆయన గుర్తుపట్టే అవకాశం లేదు కాబట్టి నేనే దగ్గరికి వెళ్లి పలానా అని పరిచయం చేసుకున్నాను.  మురారి ఫోను చేసి చెప్పాడు కనుక వచ్చానని తెలుగులో చెప్పాను. దేశం కాని దేశంలో తెలిసిన మనిషి కనిపించి తెలుగులో పలకరిస్తే  పులకరించిపోవడం సహజం. కానీ ఆయన  ప్రవర్తన ఎందుకో ఏమిటో పూర్తిగా విరుద్ధంగా వున్నట్టు అనిపించింది. ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి సోవియట్ ఉన్నతాధికారులు వచ్చినట్టు అక్కడి వాతావరణం చూడగానే అర్ధం అయింది. బహుశా సోవియట్ ప్రభుత్వ అతిధిగా వచ్చి వుంటారు. అందుకే బయట చైకా కారు (యద్దనపూడి సులోచనారాణి నవలల్లో ప్రస్తావించే ఆరడుగుల పొడవైన కారులా చాలా పెద్దగా వుంటుంది) ఆయన కోసం  ఎదురు చూస్తోందన్నమాట. సోవియట్ అధికారుల నడుమ చకచకా నడుచుకుంటూ వెడుతున్న ఆయన్ని సమీపించి, నా విజిటింగ్ కార్డు చేతిలో పెట్టి, ఏదైనా అవసరం వుంటే ఫోన్ చెయ్యండి అని చెప్పేసి అంతే వేగంగా వెనుతిరిగి మళ్ళీ టాక్సీలో సరాసరి ఆఫీసుకు వెళ్ళిపోయాను. రానని చెప్పినవాడిని ఎందుకు వచ్చానో అర్ధం కాక గీర్మన్ ఆశ్చర్యపోయాడు. కానీ నేను మాత్రం మనసులో కుతకుతలాడిపోతున్నాను. పనిమానుకుని, వేళకాని వేళలో యాభయ్ కిలోమీటర్లు టాక్సీలో పడి చచ్చీచెడీ పనికట్టుకుని ఎయిర్ పోర్టుకు వెడితే, పట్టుమని పది నిమిషాలు కూడా పట్టించుకోకుండా పొడిపొడిగా మాట్లాడి వెళ్ళిన ఆ పెద్ద మనిషి వ్యవహారం నాకు సుతరామూ కొరుకుడు పడలేదు. కాసేపటికి నాకు నేనే కుదుటపడ్డాను. ఎంతయినా రావుగారు ప్రభుత్వ అతిధి. అతి పెద్ద హోటల్లో బస ఏర్పాటు చేస్తారు. అతి పెద్ద కారులో తిప్పుతారు. అన్నపానీయాలతో సహా సమస్త అవసరాలను రష్యన్ అధికారులే దగ్గరుండి కనుక్కుంటారు. అలాంటి పెద్ద మనిషికి నేను చేసే సాయం ఏముంటుంది కనుక. తమ చైర్మన్ కనుక మర్యాదకు మురారి ఫోన్ చేసి ఉంటాడు. ఇలా అనుకుని సమాధానపడ్డ తరవాత మనసు కుదుట పడింది.

రెండు రోజులు గడిచాయి. ఓ సాయంత్రం ఇంట్లో ఫోను మోగింది. అవతల రావుగారు. స్వరం చాలా మృదువుగా, చాలా పెద్దరికంగా వుంది.

‘ఈరోజు మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. మీకు వీలుంటుందా, వుంటే చెప్పండి. నా దగ్గర వాహనం వుంది. ఎక్కువసేపు గడిపే అవకాశం ఉండకపోవచ్చు. లైట్ గా భోంచేసి వెళ్ళిపోతాను. ప్రత్యేక ఏర్పాట్లు వద్దు. అన్నం, పెరుగు వుంటే చాలు’ అన్నారాయన చాలా మర్యాదగా. కానీ నాకింకా కోపం పచ్చిగానే వుంది. మనసులో ఏదో మూల అసహనం. అంత పనికట్టుకుని ఎయిర్ పోర్ట్ కి వెడితే నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిన మనిషి. ఆయనతో మర్యాద ఏమిటి?

‘హోటల్ అడ్రసు చెప్పండి, మా అబ్బాయిని పంపిస్తాను’ అన్నాను ముక్తసరిగా. మావాడు హోటల్ కు వెళ్లి, పెద్ద చైకా కారులో రావుగారిని ఇంటికి తీసుకువచ్చాడు. ప్రభుత్వ అతిధి కాబట్టి వెంట సెక్యూరిటి వుంది.

మాస్కోలో ఉన్న తెలుగు కుటుంబాలలో ఓ పద్దతి పెట్టుకుని పాటిస్తూ వస్తున్నాము. మన వైపు నుంచి ఎవరు ఎవరింటికి వచ్చినా తెలుగు కుటుంబాలను అన్నింటినీ భోజనాలకు పిలుస్తాము. అలాగే మా పిలుపు అందుకుని  అందరూ వచ్చారు.

మా ఇంట్లో సందడి చూసి రావుగారు ముందు ఖంగు తిన్నారు. అంత హడావిడి ఆయనకు నచ్చినట్టు లేదు. ఇదంతా ఇక్కడ మామూలు అన్న సంగతి నేనూ ఆయనకు ముందు చెప్పలేదు. ఒక రకంగా నాదే పొరబాటు.

అందరి పరిచయాలు అయిన తర్వాత అతిధి మర్యాదలు మాస్కో పద్దతుల ప్రకారం మొదలయ్యాయి.  మగవాళ్ళ చేతుల్లో గ్లాసులు, ఆడవాళ్ళు వాళ్ళ మాటల్లో ఉండగానే రావు గారు వంట గది వైపు వెళ్ళారు. మరునాడు మా ఆవిడ చెబితే తెలిసింది. సరాసరి వంటింట్లో ఉన్న మా ఆవిడ వద్దకు వెళ్లి, ‘అమ్మా! ఇక్కడ చూస్తుంటే బాగా ఆలస్యం అయ్యేట్టు వుంది. నాకు పెందలకడే భోజనం చేయడం అలవాటు. చెబుదామంటే మీ ఆయనకు ముక్కు మీద కోపం. అంచేత నువ్వు ఏమీ అనుకోకుండా ఈ లోపల నాకింత పెరుగన్నం ప్లేటులో పెట్టిస్తే ఇక్కడే తినేసి వెళ్లి వాళ్ళతో కూర్చుంటాను’ అన్నారట. అన్నట్టే, అక్కడే నిలబడి గోంగూర, ఆవకాయ పచ్చళ్ళు వేసుకుని పెరుగన్నంతో తృప్తిగా తిని, ‘అన్నదాతా! సుఖీభవ’ అని ఆశీర్వదించారట.

రావుగారు వెడుతూ వెడుతూ మా పిల్లలతో చెప్పి వెళ్ళారు, పూణేలో తమకు పెద్ద ఫాం హౌస్, స్టడ్ ఫాం (మేలు జాతి గుర్రాలను పెంచే ప్రదేశం) వున్నాయనీ, ఇండియా వచ్చినప్పుడు నాలుగు రోజులు అక్కడ వుండి వెళ్లాలనీ.

వెళ్ళామా లేదా అనేది కాదు, అంత పెద్ద మనిషి పెద్దమనసుతో చెప్పడమే గొప్ప అని మేమనుకున్నాము.

మేము హైదరాబాదు తిరిగివచ్చిన తరువాత కొన్నేళ్ళకు బీవీ రావు గారు చనిపోయిన విషయం మురారి ఫోన్ చేసి చెప్పాడు. మెహిదీపట్నం పోయే దోవలో  బంజారా హిల్స్ లో ఒక ఫంక్షన్ హాలులో జరిగిన సంస్మరణ సమావేశానికి వెళ్లాను. చాలామంది ప్రముఖులు హాజరయ్యారు.

రావు గారు పుణే నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో బాలాజీ దేవాలయం ఇరవై ఏడు కోట్ల రూపాయలతో నిర్మించారు. మా రెండో వాడు సంతోష్ పుణే లో ఉద్యోగం చేస్తున్నప్పుడు నన్నూ, మా ఆవిడను ఆ దేవాలయానికి తీసుకువెళ్లాడు. అచ్చుగుద్దినట్టు తిరుమల దేవాలయం మాదిరిగానే వుంది. వెంకటేశ్వర ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించారు. ఆలయ ప్రాకారం,  గర్భగుడి, మూల విరాట్ అచ్చం తిరుపతి గుడిని తలపించేవిగా వున్నాయి. 

కింది ఫోటోలు:


మాస్కోలో ఇంటి నుంచి ఫోన్ మాట్లాడుతూ నేను


వెంకటేశ్వర హేచరీస్ చైర్మన్ శ్రీ బీవీ రావు




 

(ఇంకా వుంది)                                          

3 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఇంతకూ ఆనాడు మాస్కో ఎయిర్ పోర్టులో ముక్తసరిగా ఎందుకున్నారో మీ ఇంటికొచ్చినప్పుడైనా వారు చెప్పలేదా ?

Zilebi చెప్పారు...

వారి యింకో టపాలో విశదీకరించేరండి

ఇలా మతిమరుపైతే ఏలా

అజ్ఞాత చెప్పారు...

వెర్రీ గుడ్డూ.