22, డిసెంబర్ 2024, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (46) - భండారు శ్రీనివాసరావు

 

 

యాభయ్ అయిదేళ్ళ క్రితం నేను ఎలా వుండే వాడినో నాకే తెలియదు. అంటే నా ముఖకవళికలురూపు రేఖలుతలకట్టువేసుకునే దుస్తులుమాట తీరు,  నడతనడవడిక అన్నీ ఖచ్చితంగా మారిపోయే వుంటాయి. నన్ను అప్పుడు చూసిన వారికి ఇప్పుడు చప్పున పోల్చుకోవడం కష్టమే. అప్పుడు బక్కపలచగా ఉండేవాడిని. ఇప్పుడు మరీ బొద్దుగా కాకపోయినా ఒళ్ళు చేశాను. అప్పుడు దుబ్బులా వున్న జుట్టు పలచపడింది. పాపిడి కుడి నుంచి ఎడమకు  మారింది. పొట్ట వచ్చింది. ఆహార్యం మారింది. బెల్ బాటమ్స్, పెద్ద కాలర్ చొక్కాలు పోయి ఏదో కొంత పెద్దరికంగా అనిపించే దుస్తులు వచ్చి చేరాయి. అప్పటికీ ఇప్పటికీ   మారనది ఒక్క  కాలి చెప్పులే. బూట్లు అప్పుడూ లేవుఇప్పుడూ లేవు. కళ్ళజోడు అవసరాన్ని బట్టి కళ్ళమీదకీచొక్కా జేబులోకి మారిపోతూ వుండీ లేనట్టు వుంటుంది. మరి ‘వాళ్ళు’ నన్ను ఎలా గుర్తు పట్టేట్టు.

వాళ్ళు అంటే ఎప్పుడో యాభయ్ అయిదేళ్ళ క్రితం బెజవాడ ఎస్సారార్ కాలేజి బీకాం (జంధ్యాల బ్యాచ్) వాళ్ళు. మేమందరం  మూడేళ్లు కలిసి చదువుకున్న వాళ్ళం. మా క్లాసులో వందమందిమి వుండేవాళ్ళం. అదొక రికార్డు అప్పట్లో. నా రోల్ నెంబరు 66.  నా కజిన్ తుర్లపాటి వెంకటేశ్వర రావు నెంబరు 77. (ఇప్పుడు లేడు) ఇంతవరకు గుర్తున్నాయి సరే, వాళ్ళను నేను ఎలా గుర్తుపట్టాలి?వాళ్ళు నన్ను ఎలా గుర్తు పడతారు?

ఆనాటి మా కాలేజి మేట్స్ బ్రిగేడియర్ శ్రీరాములుధర్మవరపు రామ్మోహన రావుబ్యాంకర్ ఎన్వీకే రావు చొరవతో ఈ కలయిక ఆలోచన పురుడు పోసుకుంది. మొత్తానికి ఆచరణకు నోచుకుంది.

2022 ఏప్రిల్ ఐదో తేదీన ముహూర్తం. ఆరోజు ఉదయం పదిన్నరగంటలకు హైదరాబాదు నారాయణ గూడాలోని స్టేట్ బ్యాంక్ గెస్ట్ హౌస్ లో దాదాపు నలభయ్ మందిమి కలిశాం. సాయంత్రం దాకా అక్కడే కబుర్లతో కాలక్షేపం. అలనాటి ముచ్చట్లుచిలిపి చేష్టల పునశ్చరణ.  

 

 

 ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల.  ఆరోజుల్లో అంటే ఒక అర్ధ శతాబ్దికి పూర్వం, మొత్తం విజయవాడలో అదొక్కటే ప్రభుత్వ కళాశాల. రెండోది ప్రైవేటు యాజమాన్యంలోని  లయోలా   కాలేజి. స్కూలు చదువు అయిపోయిన తర్వాత పీయూసీ, డిగ్రీలో చేరాలంటే ఈ రెండే దిక్కు. గవర్నమెంటు కాలేజీలో ఫీజులు నామ మాత్రం అయినా రౌడీ కాలేజి అనే పాడు పేరు ఒకటి. లయోలా  కాలేజీకి అలాంటి పేరు లేదు కాని సామాన్యులు భరించలేని ఫీజులు గుంజుతారని ప్రతీతి.

రౌడీ కాలేజీగా పేరుపడ్డ ఎస్సారార్ కాలేజిలో జంధ్యాల బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్ధులం మేమందరం   కలుసుకున్నాం. అదీ యాభయ్ అయిదేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత. వచ్చిన వారిలో ఓ పదిమంది భార్యా సమేతంగా వచ్చారు.

వారిలో ఒకావిడ గారు చెప్పారు.

‘అసలు ఇలాంటి మీటింగులకు ఆడవాళ్ళం ఎందుకు అనిపించింది. అదే మా వారితో చెప్పానుమీరొక్కరు వెళ్లి రండని. ఈలోగా ఆయన స్నేహితులు కొంతమంది బలవంత పెట్టారు. దానితో రాక తప్పలేదు. వచ్చిన తర్వాత అనిపించిందిరాకుండా వుండి వుంటే నేను పొరబాటు చేసిన దాన్ని అయ్యేదానినని. ఈ కాలేజి గురించి విన్నది వేరేగా వుంది. ఇప్పుడు చూస్తుంటే అక్కడ చదువుకున్న వారు చాలా సంస్కారవంతులు అనిపిస్తోంది”

మా అందరికీ గొప్ప కాంప్లిమెంట్ కదా!

ప్రముఖ రంగస్థలసినీ నటుడుఈ పూర్వ విద్యార్ధులలో ఒకరు అయిన  సుబ్బరాయ శర్మ గారు మైకు తీసుకున్నారు. లేదుమాట్లాడమని అందరు బలవంత పెడితే తీసుకున్నారు.

“ ఈ  కాలేజీలో లెక్చరర్ గా పనిచేసిన    విశ్వనాధ సత్యనారాయణ వంటి ప్రముఖ పండితులు, పురాణం సుబ్రమణ్య శర్మ వంటి ఎడిటర్లు,   జంధ్యాల, ఏమ్వీ రఘుమాధవపెద్ది సురేశ్ వంటి సినీ ప్రముఖులువైణిక విద్వాంసుడు అయ్యగారి శ్యామసుందరంఇంకా అనేకమంది బ్యాంకర్లుమల్లాది వెంకట కృష్ణ మూర్తి వంటి నవలా రచయితలు,  మురళి దేవరకొండ వంటి కధారచయితలు, భండారు శ్రీనివాసరావు వంటి జర్నలిస్టులు,  కవులుకళాకారులు అనేకమందిని ఈ కాలేజి సమాజానికి అందించింది. ఇలాంటి కాలేజీని రౌడీ కాలేజ్ అనడం భావ్యమా!” అంటూ తనదైన రీతిలో స్పందించారు.

బ్రిగేడియర్ శ్రీరాములు ఒక ఆసక్తికర అంశాన్ని బయట పెట్టారు. ఎస్సారార్ కాలేజీలో కొందరు ‘ఘనాపాటీలు’ వున్న మాట వాస్తవమే అన్నారు. కాలేజి ఫంక్షన్లలో పాల్గొనడానికి విద్యార్థినులు జంకుతున్నారు, అదీ తమ వల్లనే అనే విషయం ఆ ఘనాపాటీలకు తెలిసిపోయింది. వెంటనే వాళ్ళు సాంస్కృతిక  కార్యక్రమాలు ముగిసిన తర్వాత, వాటిల్లో పాల్గొన్న  ఆడపిల్లలను  రిక్షాలలో కూర్చోబెట్టి,  సైకిళ్ళపై వెంటవెళ్లి, భద్రంగా ఇళ్ళ దగ్గర దింపే పనిని కొందరు జూనియర్లకు ఒప్పగించారుట. అంటే ఆ కాలేజీలో ఏళ్ళ తరబడి చదువుతూ తిష్ట వేసిన ఆకతాయిలు కూడా ఆడపిల్లల పట్ల చక్కటి సంస్కారాన్ని ప్రదర్శించే వారన్నది ఆయన కవి హృదయం.

లయోలా కాలేజీలో చేరిన వారు కూడా అవకాశం దొరకగానే ప్రభుత్వ కళాశాలలో చేరడానికి మక్కువ చూపేవారనిదానికి కారణం  ఎస్సారార్ కాలేజి కోఎడ్యుకేషన్ కాలేజి కావడమే అనేది  ధర్మవరపు రామ్మోహన రావు గారి చమత్కారం. డెబ్బయి పై చిలుకు వయసులో కూడా ఆయన సుస్వరంతో కర్ణుడి జన్మ రహస్యం అంకంలోని పద్యాలను చక్కగా ఆలపించారు. అలాగే, డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ చేసిన  దాసు గారు, ఏలేశ్వరపు ప్రసాద్ గారు పాత పాటలు వినిపించారు. ఈ వయసులో కూడా తమ గాత్ర మాధుర్యం చెక్కు చెదరకుండా చూసుకోవడం ఆశ్చర్యం అనిపించింది.

వీణా వాయిద్య కళాకారుడుదేశ విదేశాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చి, అనేక ప్రశంసలు, అవార్డులు పొందిన అయ్యగారి శ్యామ సుందరానికి పద్మశ్రీ పురస్కారం లభిస్తే బాగుంటుందని వచ్చిన మితృలు అందరూ అభిప్రాయ పడ్డారు. వస్తే,  అంతకంటే కావాల్సింది ఏముంటుంది?

ఇక కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తి ఒకరున్నారు. ఆయన స్టేట్ బ్యాంక్ లో ఉన్నత అధికారిగా రిటైర్ అయిన ఎన్.వీ.కే. రావు గారు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఈ యావత్ కార్యక్రమానికి ఆయన కర్తాకర్మాక్రియ.

తరువాత మరో రోజున జంధ్యాల బ్యాచ్ గా పిలవబడే మిత్ర సప్తకం ఏడుగురం  హైదరాబాదులో జరిగిన సుబ్బరాయ శర్మ గారి డెబ్బయ్ అయిదవ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాం.

కింది ఫోటో అదే:



ఎడమనుంచి:  ప్రముఖ కధా రచయిత దేవరకొండ మురళిప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్వెండి తెరబుల్లి తెరలపై సత్తా చాటుతున్న నటుడు సుబ్బరాయ శర్మసినీ దర్శకుడుప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎం.వి. రఘుభండారు శ్రీనివాసరావు ప్రసాద్ ఏలేశ్వరపు, ధర్మవరపు రామ్మోహన రావు 

 

 

 

 

(ఇంకా వుంది)

 

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

నా డిగ్రీ చదువు విజయవాడ లయోలా కాలేజ్ లోనే వెలగబెట్టాను లెండి. మీరు పైన వ్రాసినట్లు అంత “భరించలేని ఫీజులు” ఏమీ ఉండేవి కాదండి. అఫ్ కోర్స్ ప్రభుత్వ కళాశాలల్లో ఫీజులు తక్కువే ఉంటాయనుకోండి.

ఆ రోజుల నాటికి మా కాలేజ్ ఇంకా కో-ఎడ్ అవలేదు. గవర్నమెంట్ కాలేజ్ లో చేరితే ఆ అనుభవం దక్కేదేమో మరి ? సెకండియర్లో మీ కాలేజ్ కు మారిపోతే బాగుండేదేమో, ప్చ్ ప్చ్ 😒.

అజ్ఞాత చెప్పారు...

ఈ వయసులో వగచి ప్రయోజన మేమి ?
ఆ వయసు ప్రాయపు తీరనికొరిక మిగిలి పోయేనుగా