22, డిసెంబర్ 2024, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (46) - భండారు శ్రీనివాసరావు

 

 

యాభయ్ అయిదేళ్ళ క్రితం నేను ఎలా వుండే వాడినో నాకే తెలియదు. అంటే నా ముఖకవళికలురూపు రేఖలుతలకట్టువేసుకునే దుస్తులుమాట తీరు,  నడతనడవడిక అన్నీ ఖచ్చితంగా మారిపోయే వుంటాయి. నన్ను అప్పుడు చూసిన వారికి ఇప్పుడు చప్పున పోల్చుకోవడం కష్టమే. అప్పుడు బక్కపలచగా ఉండేవాడిని. ఇప్పుడు మరీ బొద్దుగా కాకపోయినా ఒళ్ళు చేశాను. అప్పుడు దుబ్బులా వున్న జుట్టు పలచపడింది. పాపిడి కుడి నుంచి ఎడమకు  మారింది. పొట్ట వచ్చింది. ఆహార్యం మారింది. బెల్ బాటమ్స్, పెద్ద కాలర్ చొక్కాలు పోయి ఏదో కొంత పెద్దరికంగా అనిపించే దుస్తులు వచ్చి చేరాయి. అప్పటికీ ఇప్పటికీ   మారనది ఒక్క  కాలి చెప్పులే. బూట్లు అప్పుడూ లేవుఇప్పుడూ లేవు. కళ్ళజోడు అవసరాన్ని బట్టి కళ్ళమీదకీచొక్కా జేబులోకి మారిపోతూ వుండీ లేనట్టు వుంటుంది. మరి ‘వాళ్ళు’ నన్ను ఎలా గుర్తు పట్టేట్టు.

వాళ్ళు అంటే ఎప్పుడో యాభయ్ అయిదేళ్ళ క్రితం బెజవాడ ఎస్సారార్ కాలేజి బీకాం (జంధ్యాల బ్యాచ్) వాళ్ళు. మేమందరం  మూడేళ్లు కలిసి చదువుకున్న వాళ్ళం. మా క్లాసులో వందమందిమి వుండేవాళ్ళం. అదొక రికార్డు అప్పట్లో. నా రోల్ నెంబరు 66.  నా కజిన్ తుర్లపాటి వెంకటేశ్వర రావు నెంబరు 77. (ఇప్పుడు లేడు) ఇంతవరకు గుర్తున్నాయి సరే, వాళ్ళను నేను ఎలా గుర్తుపట్టాలి?వాళ్ళు నన్ను ఎలా గుర్తు పడతారు?

ఆనాటి మా కాలేజి మేట్స్ బ్రిగేడియర్ శ్రీరాములుధర్మవరపు రామ్మోహన రావుబ్యాంకర్ ఎన్వీకే రావు చొరవతో ఈ కలయిక ఆలోచన పురుడు పోసుకుంది. మొత్తానికి ఆచరణకు నోచుకుంది.

2022 ఏప్రిల్ ఐదో తేదీన ముహూర్తం. ఆరోజు ఉదయం పదిన్నరగంటలకు హైదరాబాదు నారాయణ గూడాలోని స్టేట్ బ్యాంక్ గెస్ట్ హౌస్ లో దాదాపు నలభయ్ మందిమి కలిశాం. సాయంత్రం దాకా అక్కడే కబుర్లతో కాలక్షేపం. అలనాటి ముచ్చట్లుచిలిపి చేష్టల పునశ్చరణ.  

 

 

 ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల.  ఆరోజుల్లో అంటే ఒక అర్ధ శతాబ్దికి పూర్వం, మొత్తం విజయవాడలో అదొక్కటే ప్రభుత్వ కళాశాల. రెండోది ప్రైవేటు యాజమాన్యంలోని  లయోలా   కాలేజి. స్కూలు చదువు అయిపోయిన తర్వాత పీయూసీ, డిగ్రీలో చేరాలంటే ఈ రెండే దిక్కు. గవర్నమెంటు కాలేజీలో ఫీజులు నామ మాత్రం అయినా రౌడీ కాలేజి అనే పాడు పేరు ఒకటి. లయోలా  కాలేజీకి అలాంటి పేరు లేదు కాని సామాన్యులు భరించలేని ఫీజులు గుంజుతారని ప్రతీతి.

రౌడీ కాలేజీగా పేరుపడ్డ ఎస్సారార్ కాలేజిలో జంధ్యాల బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్ధులం మేమందరం   కలుసుకున్నాం. అదీ యాభయ్ అయిదేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత. వచ్చిన వారిలో ఓ పదిమంది భార్యా సమేతంగా వచ్చారు.

వారిలో ఒకావిడ గారు చెప్పారు.

‘అసలు ఇలాంటి మీటింగులకు ఆడవాళ్ళం ఎందుకు అనిపించింది. అదే మా వారితో చెప్పానుమీరొక్కరు వెళ్లి రండని. ఈలోగా ఆయన స్నేహితులు కొంతమంది బలవంత పెట్టారు. దానితో రాక తప్పలేదు. వచ్చిన తర్వాత అనిపించిందిరాకుండా వుండి వుంటే నేను పొరబాటు చేసిన దాన్ని అయ్యేదానినని. ఈ కాలేజి గురించి విన్నది వేరేగా వుంది. ఇప్పుడు చూస్తుంటే అక్కడ చదువుకున్న వారు చాలా సంస్కారవంతులు అనిపిస్తోంది”

మా అందరికీ గొప్ప కాంప్లిమెంట్ కదా!

ప్రముఖ రంగస్థలసినీ నటుడుఈ పూర్వ విద్యార్ధులలో ఒకరు అయిన  సుబ్బరాయ శర్మ గారు మైకు తీసుకున్నారు. లేదుమాట్లాడమని అందరు బలవంత పెడితే తీసుకున్నారు.

“ ఈ  కాలేజీలో లెక్చరర్ గా పనిచేసిన    విశ్వనాధ సత్యనారాయణ వంటి ప్రముఖ పండితులు, పురాణం సుబ్రమణ్య శర్మ వంటి ఎడిటర్లు,   జంధ్యాల, ఏమ్వీ రఘుమాధవపెద్ది సురేశ్ వంటి సినీ ప్రముఖులువైణిక విద్వాంసుడు అయ్యగారి శ్యామసుందరంఇంకా అనేకమంది బ్యాంకర్లుమల్లాది వెంకట కృష్ణ మూర్తి వంటి నవలా రచయితలు,  మురళి దేవరకొండ వంటి కధారచయితలు, భండారు శ్రీనివాసరావు వంటి జర్నలిస్టులు,  కవులుకళాకారులు అనేకమందిని ఈ కాలేజి సమాజానికి అందించింది. ఇలాంటి కాలేజీని రౌడీ కాలేజ్ అనడం భావ్యమా!” అంటూ తనదైన రీతిలో స్పందించారు.

బ్రిగేడియర్ శ్రీరాములు ఒక ఆసక్తికర అంశాన్ని బయట పెట్టారు. ఎస్సారార్ కాలేజీలో కొందరు ‘ఘనాపాటీలు’ వున్న మాట వాస్తవమే అన్నారు. కాలేజి ఫంక్షన్లలో పాల్గొనడానికి విద్యార్థినులు జంకుతున్నారు, అదీ తమ వల్లనే అనే విషయం ఆ ఘనాపాటీలకు తెలిసిపోయింది. వెంటనే వాళ్ళు సాంస్కృతిక  కార్యక్రమాలు ముగిసిన తర్వాత, వాటిల్లో పాల్గొన్న  ఆడపిల్లలను  రిక్షాలలో కూర్చోబెట్టి,  సైకిళ్ళపై వెంటవెళ్లి, భద్రంగా ఇళ్ళ దగ్గర దింపే పనిని కొందరు జూనియర్లకు ఒప్పగించారుట. అంటే ఆ కాలేజీలో ఏళ్ళ తరబడి చదువుతూ తిష్ట వేసిన ఆకతాయిలు కూడా ఆడపిల్లల పట్ల చక్కటి సంస్కారాన్ని ప్రదర్శించే వారన్నది ఆయన కవి హృదయం.

లయోలా కాలేజీలో చేరిన వారు కూడా అవకాశం దొరకగానే ప్రభుత్వ కళాశాలలో చేరడానికి మక్కువ చూపేవారనిదానికి కారణం  ఎస్సారార్ కాలేజి కోఎడ్యుకేషన్ కాలేజి కావడమే అనేది  ధర్మవరపు రామ్మోహన రావు గారి చమత్కారం. డెబ్బయి పై చిలుకు వయసులో కూడా ఆయన సుస్వరంతో కర్ణుడి జన్మ రహస్యం అంకంలోని పద్యాలను చక్కగా ఆలపించారు. అలాగే, డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ చేసిన  దాసు గారు, ఏలేశ్వరపు ప్రసాద్ గారు పాత పాటలు వినిపించారు. ఈ వయసులో కూడా తమ గాత్ర మాధుర్యం చెక్కు చెదరకుండా చూసుకోవడం ఆశ్చర్యం అనిపించింది.

వీణా వాయిద్య కళాకారుడుదేశ విదేశాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చి, అనేక ప్రశంసలు, అవార్డులు పొందిన అయ్యగారి శ్యామ సుందరానికి పద్మశ్రీ పురస్కారం లభిస్తే బాగుంటుందని వచ్చిన మితృలు అందరూ అభిప్రాయ పడ్డారు. వస్తే,  అంతకంటే కావాల్సింది ఏముంటుంది?

ఇక కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తి ఒకరున్నారు. ఆయన స్టేట్ బ్యాంక్ లో ఉన్నత అధికారిగా రిటైర్ అయిన ఎన్.వీ.కే. రావు గారు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఈ యావత్ కార్యక్రమానికి ఆయన కర్తాకర్మాక్రియ.

తరువాత మరో రోజున జంధ్యాల బ్యాచ్ గా పిలవబడే మిత్ర సప్తకం ఏడుగురం  హైదరాబాదులో జరిగిన సుబ్బరాయ శర్మ గారి డెబ్బయ్ అయిదవ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాం.

కింది ఫోటో అదే:



ఎడమనుంచి:  ప్రముఖ కధా రచయిత దేవరకొండ మురళిప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్వెండి తెరబుల్లి తెరలపై సత్తా చాటుతున్న నటుడు సుబ్బరాయ శర్మసినీ దర్శకుడుప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎం.వి. రఘుభండారు శ్రీనివాసరావు ప్రసాద్ ఏలేశ్వరపు, ధర్మవరపు రామ్మోహన రావు 

 

 

 

 

(ఇంకా వుంది)

 

భలే మంచి రోజు

 డెబ్బయి ఎనిమిది దాటి, రేపోమాపో  డెబ్బయి తొమ్మిదిలోకి అడుగుడే నాకు ఇది నిజంగా కలిసివచ్చిన అదృష్టం అనుకోవాలి. 

నాకు ఇద్దరు మగపిల్లలే. కన్యాదాన ఫలం దక్కే అవకాశం లేని నాకు, మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు, వదిన సరోజిని దేవి  మూడో అమ్మాయి వివాహం అప్పుడు నాకూ, మా ఆవిడకూ లేని, రాని  ఆ అదృష్టాన్ని కలిగించించి,  మా చేతులమీదుగా  వాణిని కన్యాదానం చేసే మహత్తర అవకాశం ఇచ్చారు. 

అలాగే ఇప్పుడు మా రెండో అన్నయ్య రామచంద్ర రావు, విమలాదేవి గార్ల రెండో కుమారుడు సుభాష్ చంద్రబోస్, భార్య హేమ, మంచిమనసుతో   మళ్ళీ అటువంటి గొప్ప అవకాశం కల్పించారు. వాడి పెద్ద బిడ్డ శిఖిర వివాహం ఈ నెల 25/26 న హైదరాబాదులో జరుగబోతోంది. ఈరోజు ఆ అమ్మాయిని పెళ్లి కూతురిని చేశారు. మా రెండో కుమారుడు సంతోష్, నిశా దంపతుల ఏకైక   కుమార్తె , వచ్చే నెల ఐదో తేదీన మూడో ఏట అడుగుపెట్టబోతున్న చిన్నారి   జీవికను తోడు పెళ్లి కూతురిగా కూర్చోబెట్టి  అలంకారం చేశారు. మరో పాతిక ఏళ్ళకు పెళ్లి కూతురుగా పెళ్లి పీటలమీద జీవికని చూసే అవకాశం నాకు ఎట్లాగూ వుండదు. 

ఆ మహద్భాగ్యాన్ని నాకు కల్పించిన మా అన్నయ్యకు, సుభాష్, హేమ దంపతులకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

కింద ఫోటో:  


(పెళ్లి కూతురిగా శిఖిర , తోడు పెళ్లి కూతురుగా జీవిక)


  

22-12-2024

21, డిసెంబర్ 2024, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (45) - భండారు శ్రీనివాసరావు

 


డెబ్బయ్యవ దశకానికి ముందు మా అన్నయ్య పర్వతాలరావు గారికి ఖమ్మం నుంచి బెజవాడ బదిలీ కావడం వల్ల నేను ఎస్సారార్  కాలేజీలో,  బీ కామ్ మొదటి సంవత్సరంలో చేరాను. చేరిన కొత్తల్లోనే విద్యార్ధి సంఘం ఎన్నికల్లో భాగంగా లాంగ్వేజ్ అసోసియేషన్ ఎన్నిక జరిగింది. మా క్లాసులో శతమానం భవతి అన్నట్టు వంద మంది. అదే కాలేజీలో బీ ఎస్సీ చదువుతున్న నా మేనల్లుడు తుర్లపాటి సాంబశివరావు పూనికపై నేను కూడా పోటీ చేస్తున్నట్టు పేరు ఇచ్చాను. మాచవరం నుంచి ఇద్దరం రిక్షాలో కాంగ్రెస్ ఆఫీసు రోడ్డులో సింహాల మేడలోని  విశ్వా టైప్ ఇన్స్తిటూట్ లో సూర్యనారాయణ అనే ఫ్రెండ్ ని కలిసి, తెలుగులో అక్కడికక్కడే ఒక గేయం రాసి టైపు చేయించి, సైక్లో స్టైల్ చేయించి  కాలేజీకి  తిరిగి వచ్చి వాటిని క్లాసులో పంచిపెడుతుండగానే గంట మోగింది. వందలో నాకు పదిహేడు ఓట్లు వచ్చినట్టు జ్ఞాపకం. దండిగా ఓట్లు తెచ్చుకుని గెలిచినదెవరంటే జేవీడీఎస్ శాస్త్రి.

చదువులోనే కాకుండా శాస్త్రి, ఇతర విషయాల్లో కూడా ముందుండేవాడు. కాలేజీ కల్చరల్ అసోసియేషన్ కు ఆయనే మకుటంలేని కార్యదర్శి. కవితలు, గేయాలు గిలికే అలవాటున్న నాకు కూడా ఆ మకుటంమీద కన్నుపడింది. వెనకాముందూ చూసుకోకుండా ఏకంగా ఆయనపైనే పోటీ చేశాను. అయితే ఆయన మకుటం గట్టిది, నేను కొట్టిన దెబ్బ ఓటిది అని ఇట్టే తేలిపోయింది. ఓడిపోతే పోయాను కానీ, ఆయనతో నా స్నేహం గట్టిపడింది. ఆయన మిత్ర బృందంలో నాకూ స్థానం దొరికింది. ఇక ఆ మూడేళ్ళూ కలిసే తిరిగాము చదువయినా, సంధ్యయినా! 

'ఒక్కక్షణం' అనే  గేయం ఇలా సాగుతుంది.

"ఒక్క క్షణం తొందరపడి ఓటు వృధా చేయకు - నిప్పుకణికెలాంటిదది నిర్లక్ష్యము చేయకు - మాటలాడబోవుముందు ఒక్కసారి యోచించు - ఓటు వేయబోవుముందు కొద్దిగ ఆలోచించు - స్నేహితునకు ఇవ్వదగిన బహుమానము కాదు ఓటు - శత్రువైన సరే నీకు! అర్హతున్నవానికేయి - చేతులు కాలిన పిమ్మట ఆకులకై  వెదుకకు - మంచికైన చెడుకైన నీదే బాధ్యత మరువకు -  అర్హుడైన వాని గెలుపు నిజము సుమ్ము నీ గెలుపే"

ఎందుకో మా తరగతిలో చాలామంది నా మాట మన్నించారు. చివరి పాదంలో చెప్పినట్టు జేవీడీఎస్ శాస్త్రిని  గెలిపించారు.    

పూర్తి పేరు జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ్రమణ్య శాస్త్రి. ఇంగ్లీష్ అక్షరాల్లో పొడి పొడిగా రాస్తే జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఇంకా పొడి చేసి క్లుప్తంగా చేస్తే జంధ్యాల.  తెలుగు సినీ ప్రేక్షకుల అభిమాన, ఆహ్లాద దర్శకుడు, రచయిత.  

మొదటి పొడుగాటి పేరు బారసాలనాడు బియ్యంలో రాసి పెట్టింది. రెండోది, కాస్త పొట్టిపేరు, స్కూలు, కాలేజీ రికార్డుల్లో రాసుకున్నది. ముచ్చటగా మూడోది ‘జంధ్యాల’ అనే ‘కలం పేరు’ చిరస్థాయిగా వెండి తెరపై స్థిరపడిపోయిన పేరు. తెలుగు హాస్యానికే వన్నె తెచ్చిన పేరు. అందుకే, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకుని అలా వుండిపోయింది.

ఈ భూమ్మీద పడ్డ ప్రతి బిడ్డా ఏడుస్తూనే కళ్ళు తెరుస్తుంది. 1951లో నరసాపురంలో జంధ్యాల పుట్టినప్పుడు బొడ్డు కోసిన మంత్రసాని జాగ్రత్తగా గమనించి వుంటే, ఏడుస్తున్న ఆ పిల్లాడి పెదవుల నడుమ సన్నటి నవ్వుతెర కనిపించి వుండేదేమో.

జంధ్యాల నాన్నగారు జంధ్యాల నారాయణమూర్తి బెజవాడలో పేరుమోసిన వ్యాపారి. అనేక జిల్లాలకు బుష్ రేడియో డీలరు. ఆ రోజుల్లో రేడియోలకి మంచి గిరాకి. అంచేత నారాయణ మూర్తిగారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోయింది.

పుటకల నాటికే జంధ్యాల బంగారు పిచిక. బీసెంటు రోడ్డులో ఏడంతస్తుల భవనం.

(ఏడంటే ఏడు అనికాదు, పెద్ద భవనం అని కవి హృదయం. నిజంగానే చాలా పెద్ద ఇల్లు. ఎదురుగా వున్న మోడరన్ కేఫ్ కంటే ఎత్తుగా వుండాలని నారాయణమూర్తిగారు ముచ్చట పడి కట్టించుకున్నారని ఆ రోజులనాటి ముచ్చట) అది కట్టుకున్నాక వాళ్ళ నివాసం, క్షీరసాగర్ కంటి ఆసుపత్రి దగ్గర నుంచి బీసెంటు రోడ్డుకి మారింది.

మాచవరం ఎస్సారార్ కాలేజీలో మేము, అంటే జంధ్యాల, నేను ఒకే బెంచిలో కూర్చుని బీకాం చదువుతున్నట్టు నటిస్తున్నరోజుల్లో, కాలేజీ ప్రిన్సిపాల్ తో సహా అయ్యవార్లందరూ రిక్షాలు,  సైకిళ్ళమీద కాలేజీకి వస్తుండేవారు. మన జేవీడీఎస్ శాస్త్రి మాత్రం, అంబాసిడర్ కారులో వెనక సీట్లో కూర్చుని దర్జాగా వచ్చేవాడు. డ్రైవరు డోరు తెరిచి నిలబడితే, కారు దిగి కాలేజీలో కాలు పెట్టే జంధ్యాలకు ‘కారున్న కుర్రకారు’ అని పేరు పెట్టింది కూడా నేనే. (మరో విషయం జంధ్యాల చెప్పిందే. ఒకసారి ఆయన హైదరాబాదు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చాడు. అప్పుడు తెలిసింది ఆయన నోటి నుంచి, మా ఆవిడ నిర్మల, పూర్వాశ్రమంలో పేరు బాండ్ జేమ్స్ బాండ్ మాదిరిగా దుర్గ, కనక దుర్గ, ఆవిడా  ఆయనా  మాంటిసొరి స్కూల్లో క్లాస్ మేట్లు అని)

జంధ్యాల రాసిన ‘సంధ్యారాగంలో శంఖారావం’  నాటకం రిహార్సల్స్  హనుమంతరాయ గ్రంధాలయంలో వేస్తుంటే  వెంట నేనూ  వుండేవాడినిఏ వేషమూ వేయకపోయినా. ఏదో కవితలు గిలకడం వచ్చనే పేరు నాకూ వుండేది. దాంతో మా స్నేహం మరింత చిక్కబడింది. డిగ్రీ తరువాత మా దారులు వేరయ్యాయి. నేను ఆంధ్రజ్యోతిలో చేరాను. ఆయన కధ సినిమా మలుపులు తిరుగుతూ  చెన్నై చేరింది.

కట్ చేస్తే...

మద్రాసులో చందమామ రామారావు గారింట్లో ఒక ముందు గదిలో జంధ్యాల  అఫీసు తెరిచాడు. నేనొకసారి వెళ్లాను. గది బయట ‘జంధ్యాల, స్క్రిప్ట్ రైటర్’  అనే నేమ్ ప్లేటు. గదిలో ఒక మేజా బల్ల. దాని వెనుక  కుర్చీలో కూర్చుని రాసుకుంటున్న  జంధ్యాల అనే  జేవీడీఎస్ శాస్త్రి. వెనుకటి రోజుల్లో మాదిరిగా  లేడు. మామూలుగానే మంచి ఛాయ కలిగిన మనిషి. కాకపోతే   జుట్టు కాస్త పలచబడింది.  మొహంలో నవ్వు, ఆ నవ్వులో అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. హాయిగా పలకరించాడు. హాయిగా కబుర్లు చెప్పుకున్నాము. హాయిగా నవ్వించాడు. హాయిగా నవ్వుకున్నాను. ఆ హాయి మనసంతా నింపుకుని బెజవాడ తిరిగొచ్చాను.

మళ్ళీ కట్ చేస్తే...

నేను బెజవాడ ఆంధ్రజ్యోతిని ఒదిలి, హైదరాబాదు రేడియోలో చేరాను. జంధ్యాల మద్రాసులో సినిమాల్లో బిజీ అయిపోయాడు. పదేళ్ళలో రెండువందల సినిమాలకు మాటలు రాశాడంటే ఎంత పని రాక్షసుడిగా మారివుండాలి!

ఒకసారి హైదరాబాదు వచ్చాడు. రేడియో స్టేషన్ కు వచ్చాడు. తన దర్శకత్వంలో మొదటి సినిమా ‘ముద్దమందారం’ తీస్తున్నట్టు చెప్పాడు. ఒక గ్రామ ఫోను రికార్డు ఇచ్చి తన సినిమా పాటలు రేడియోలో వచ్చేలా చేయడం కుదురుతుందేమో చూడమన్నాడు. ఎలాగూ వచ్చాడు కదా అని రేడియోలో ఇంటర్వ్యూ రికార్డు చేసాము. స్టేజి నాటకానికీ, రేడియో నాటకానికీ వుండే తేడా ఆయన అందులో విడమరచి చెప్పిన తీరు నన్ను విస్మయపరిచింది. నాకు తెలిసిన జంధ్యాల, ఇప్పుడు చూస్తున్న జంధ్యాల ఒకరేనా అనిపించింది.. ఇంకోసారి కట్ చేస్తే...

ఓసారి ఢిల్లీలో కలిశాడు. హైదరాబాదుకు చెందిన ఓ లాయర్ తో కలిసి, నేనూ జ్వాలా  ఫైవ్ స్టార్ హోటల్లోని పుస్తకాల షాపులో తిరుగుతుంటే, తెలుగులో మాట్లాడుతున్న మమ్మల్ని జంధ్యాల  గుర్తుపట్టి అదే హోటల్లోని తన గదికి తీసుకుపోయాడు.

గదికి వెళ్ళగానేమాతో వచ్చిన లాయరు గారు ఎలాటి మొహమాటం లేకుండాకొత్త చోటనికానీ, కొత్త మనిషని కానీ  సందేహించకుండా ‘ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చా’ అని అడుగుతూనే జవాబుకోసం ఎదురుచూడకుండా అందులో దూరిపోయి స్నానం చేసి బయటకు వచ్చారు. రావడం రావడమే ఆ గదిలో పరచిన తివాచీ పై తల కిందకు పెట్టి, కాళ్ళు పైకి లేపి లిప్త మాత్రంలో శీర్షాసనంలో దర్శనమిచ్చారు. మా అందరికీ కళ్ళు తిరిగిపోయాయి. చిన్న తలపెద్ద బొజ్జఅంత భారీకాయంతో ఆయన వేసిన ఈ ఆసనం చూసి జంధ్యాల కూడా నివ్వెర పోయారు. ఏనుగు శీర్షాసనం వేస్తే ఎలా వుంటుందో అలాంటి దృశ్యాన్ని ఆరోజు చూశాము.

తరువాత వారిరువురి నడుమ సాగిన కవి పండిత చర్చ విని తీరాలి. అప్పటికే  ‘శంకరాభరణం’ సినిమాకి సంభాషణలు సమకూర్చిన జంధ్యాలవిశ్వనాద్ గారిదే మరో సినిమా ‘సప్తపదికి మాటలు రాస్తున్నాడు. అనేకానేక అంశాలను స్పృశిస్తూ జరిగిన సంభాషణ నిజానికి ఇద్దరు పండిత శ్రేష్ఠుల మధ్య జరిగే వాదోపవాదాన్ని తలపించింది. ఏమాత్రం స్వరం పెంచకుండాఎదుటివారి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఒకర్ని మించి మరొకరు, అక్షర లక్షలు చేసే తర్కవిన్యాసాలు ప్రదర్శించారు. ‘సప్తపది’ సినిమా క్లైమాక్స్ లో ధర్మాధర్మ విచక్షణకు సంబంధించిన ఈ అంశాలలో  కొన్నింటిని   జంధ్యాల పొందుపరచినట్టున్నారు కూడా.

ఈ చర్చ సాగిన తీరు గమనిస్తేనాకు కాలేజీలో తెలిసిన శాస్త్రిఇప్పుడు చూస్తున్న  ఈ జంధ్యాల, ఈ ఇద్దరూ  ఒకరేనా అన్న సందేహం మరోసారి  కలిగింది. అంతటి పరిణతి ఆయనలో కనబడింది.

మరోసారి కట్ చేస్తే....

నా మకాం మాస్కోకి మారింది. జంధ్యాల  మద్రాసుకి అతుక్కుపోయాడు. క్షణం తీరిక లేని జీవితచట్రంలో ఒదుగుతూ, ఎదుగుతూ   ఏళ్ళతరబడి ఉండిపోయాడు. కధా చర్చలు జరపడం కోసం, రాసుకోవడం కోసం ఒకటి రెండు పెద్ద పెద్ద హోటళ్ళలో ఆయనకు పర్మనెంటు గదులు ఉండేవి. మాస్కో నుంచి   విశ్వప్రయత్నం చేస్తే  మద్రాసులో ఏదో ఒక అయిదు నక్షత్రాల హోటల్లో దొరికేవాడు. అంత దూరం నుంచి ఫోను చేస్తున్నందువల్లనో ఏమో, కాసింత తీరిక చేసుకుని లైన్లోకి వచ్చి మాట్లాడేవాడు. అప్పటికే ఆయన బిజీ డైరెక్టర్ల కోవలోకి చేరిపోయాడు.  మాస్కో థియేటర్లో శంకరాభరణం చూశానని చెబితే ఎంతో సంబరపడ్డాడు.  మాస్కో రమ్మని, అక్కడి మంచు వాతావరణంలో ఒక తెలుగు సినిమా తీయమని అనేక మార్లు చెప్పాను. రెండేళ్ళదాకా కొత్త సినిమాలు గురించి ఆలోచించే తీరుబాటు లేదని చెప్పేవాడు.

సోవియట్ యూనియన్ పతనానంతరం నేను హైదరాబాదు తిరిగి వచ్చి రేడియోలో చేరాను. జంధ్యాల మకాం కూడా చెన్నై నుంచి భాగ్యనగరానికే  మారింది. సినిమాల హడావిడి కొంత తగ్గినట్టు వుంది. ఎప్పుడయినా వెళ్లి కలిసినా తీరిగ్గానే కనిపించేవాడు.

తరువాత చాలా సార్లు కలుసుకున్నాము. భక్త రామదాసు ప్రాజెక్టు కోసం తరచూ ఖమ్మం వెడుతుండేవాడు. ఆయన కారులోనే అప్పుడప్పుడు ఖమ్మం వెళ్లి వస్తుండేవాణ్ని. దోవలో ఎన్నో జోకులు చెప్పేవాడు. చెప్పే సంగతులు మారేవి కానీ చెప్పే తీరులో మాత్రం తేడాలేదు.   

ఇరవైనాలుగు గంటలు బిజీ బిజీగా అనేక సంవత్సరాలు గడిపిన మనిషి ఖాళీగా వుండడం ఎంత బాధాకరంగా  వుంటుందో ఎప్పుడూ నవ్వుతుండే ఆయన మొహంలో అప్పుడప్పుడూ లీలగా కానవచ్చేది.

నిండు నూరేళ్ళ జీవితం అనుకుంటే జంధ్యాల బతికింది యాభయ్ యేళ్ళే. కానయితేనేమి నూరేళ్ళకు సరిపడా  నవ్వులు నలుగురికీ పంచి పెట్టిపోయాడు.

ఆరోజు, 2001 జూన్,19,  నాకు బాగా జ్ఞాపకం వుంది. నేను రేడియోలో వుంటే, రాంపా ఫోను చేసి జంధ్యాల పోయాడని చెప్పాడు. నేను వెంటనే వార్త రాసి ఇచ్చేసి రాజభవన్ రోడ్డులోని వాళ్ల ఇంటికి వెళ్లాను. అప్పుడే కబురు  తెలిసి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఓ కుర్చీలో జంధ్యాల నాన్నగారు నారాయణమూర్తి గారు కూర్చుని వున్నారు. కానీ ఆయనకు ఏదీ తెలియని పరిస్తితి. జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది. ఏమి జరిగిందన్నది, ఒక్కగానొక్క కొడుకు పోయాడన్నది  అర్ధం చేసుకునే స్తితి కాదు. ఏమిటో ఈ జీవితం అనిపించింది.

జంధ్యాల చనిపోయిన రెండేళ్లకు వేటూరి సుందరరామమూర్తి ఇలా గుర్తుచేసుకున్నారు.

హాస్యం, సంగీతం కలిసి ఒకే జన్మ ఎత్తిన హాసంనిన్నటి దరహాసం, జంధ్యాల ఇతిహాసంలో చేరిపోయి రెండేళ్ళు గడిచాయి.ఎన్నేళ్ళు  గడిచినా ఆయన మధుర స్మృతికి మరణం లేదు. ఎంత కాదనుకున్నా కన్నీళ్ళు  కళ్ళతోనే మింగటం కన్నా శరణ్యం లేదు”.

తెలుగుజాతి ‘చిరునవ్వు’, జంధ్యాల అన్నారు వేటూరి.

ఆ వేటూరిగారు కూడా ఇప్పుడు లేరు.  జంధ్యాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.

కానిఆయన అన్నట్టు జంధ్యాల మార్కు  నవ్వుకు మాత్రం   మరణం లేదు.

తెలుగు సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన నాగయ్య ఒక తరానికి తెలుసు. నాగేశ్వరరావు మరో తరానికి తెలుసు. నాగార్జున ఇంకో తరానికి తెలుసు. ఒక తరానికి తెలిసిన వాళ్ళు మరో తరానికి అట్టే తెలియకపోవడంలో విడ్డూరం ఏమీ లేదు. అన్ని తరాలను నవ్వుల్తో రంజింప చేసిన జంధ్యాల నిజంగా అమరుడు

 

తోక టపా :

నేను వంటింట్లోకి వేరే పనిమీద వెళ్ళినాకూడావంట చేస్తున్న మా అమ్మగారు‘పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు’  అనేవారు నొచ్చుకుంటూ,  నేను అన్నం కోసం వచ్చాననుకుని. 
ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే !”

అమ్మ ప్రేమ గురించి ఇంత గొప్పగా చెప్పడం ఆ జంధ్యాలకే సాధ్యం!

కింది ఫోటోలు:


కాలేజి రోజుల నాటి జే.వి.డి.ఎస్. శాస్త్రి


సినీ రంగానికి  చేరిన తర్వాత జంధ్యాల





(ఇంకా వుంది)

చిరకాల సమాగమం – భండారు శ్రీనివాసరావు

సుప్రసిద్ధ పాత్రికేయుడు ఐ.వెంకట్రావు గారిని కలవక చాలా కాలం అయింది. బెజవాడ ఆంధ్రజ్యోతిలో కలిసి పనిచేసే రోజుల్లో అనుదినం కలిసేవాళ్ళం. ఆఫీసుకు దగ్గరలోనే మా ఇల్లు. వారి శ్రీమతి నిర్మల గారితో మా ఆవిడ నిర్మలకు మంచి స్నేహం. ఇద్దరం హైదరాబాదుకు ఆల్ మకాం మార్చిన తర్వాత ఆయన జ్యోతిలో, నేను రేడియోలో పని చేస్తున్న రోజుల్లో తరచుగా కలుస్తుండేవాళ్ళం. ఇక మహా న్యూస్ ఛానల్ ప్రారంభించిన తర్వాత వారానికి ఒకటి రెండు సార్లు టీవీ చర్చల్లో కలవడం జరిగేది. ఫోన్ ఇన్ లోకి తీసుకున్న ప్రతిసారీ నా గురించి నాలుగు మంచి పరిచయ వాక్యాలు చెప్పకుండా ఎప్పుడూ కార్యక్రమం మొదలు పెట్టేవారు కారు. అదీ ఆయన సహృదయత. వెంకటరావు గారిని, వారి శ్రీమతి నిర్మల గారిని రాత్రి ఒక శుభ సందర్భంలో కలుసుకున్నాను.

82 ఏళ్ళు మీద పడ్డాయి, బయట తిరగడం బాగా తగ్గించుకున్నాను అనేది ఎప్పుడు ఫోన్ చేసినా ఐ.వి.ఆర్ చెప్పేమాట. తిరగడం తగ్గించుకున్నారు సరే, రాయడం తగ్గించకండి అనేది నా మాట.

ఈ సందర్భంలో చాలామంది పాత జర్నలిస్ట్ మితృలు తారసపడ్డారు. పాత కబుర్లకు, కాలక్షేపానికి కొదవేముంటుంది. అందులో తెలంగాణా సంస్కృతి పరిఢవిల్లిన ఆ ప్రాంగణంలో.  

తెలంగాణా మీడియా అకాడమి చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి మనుమరాలి వివాహ నిశ్చితార్దానికి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో ఇది.



Photo Courtesy : Journalist Jagan   (20-12-2024)

20, డిసెంబర్ 2024, శుక్రవారం

జీవితమే మధురము రాగసుధా భరితమూ - భండారు శ్రీనివాసరావు

 

జీవితం అంటే ఓ సరదా అనుకునే రోజులు ప్రతివారి జీవితంలో కొన్ని వుంటాయి.
అలాంటిదే ఇదొక రోజు. భలే మంచి రోజు.1995 నాటిది. 

అయిదేళ్ళ మాస్కో జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి 1992 లో హైదరాబాదు తిరిగివచ్చిన తరువాత పంజాగుట్ట దుర్గానగర్ కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాము.  రష్యా నుంచి ఓడలో వచ్చిన సామానుకు సరిపడిన ఇల్లు.  అదేమిటో కానీ ఆ ఇంట్లో అన్నీ విశాలమైన హాల్సే. గదుల బదులు హాల్స్ కట్టినట్టు వుంది. బాత్ రూములు పడక గది అంత విశాలంగా కట్టి అసలు ముఖ్యమైన వంట గదిని బాత్ రూమ్ సైజులో కట్టి, మమ అనిపించినట్టున్నారు. ఏదైతేనేం, వాస్తు సరిగా లేని ఆ పెద్ద ఇల్లు కొద్ది అద్దెలో దొరికిందని సంతోషించాము. ఆ రోజుల్లో మా ఇల్లు మగపిల్లల హాస్టల్ మాదిరిగా వుండేది.  మా పిల్లలు, వాళ్ళ స్నేహితులు, స్నేహితుల స్నేహితులు ఇలా చాలామంది. సత్తేపే సత్తా సినిమాలో హీరోల్లా  జుట్లు పెంచుకుని అందరూ మగపిల్లలే. ఆఖరికి ఇంట్లో పిల్లి కూడా మగ పిల్లే. 
వాళ్లకు కాఫీలు, టిఫిన్లు, కొండొకచో భోజనాలు, అదనంగా నా స్నేహితులు వాళ్లకు మంచింగులు వగైరా ఏర్పాట్లతో మా ఆవిడ 24 x 7 బిజీబిజీ.  24 x 7  అని ఎందుకు అంటే ఈ మగపిల్లలు అందరూ నిశాచరులు. అందులో నేను కూడా.  ఎవరు ఎప్పుడు ఇంటికి  వస్తారో వాళ్ళకే తెలియదు. ఎప్పుడూ పాటలు,   డాన్సులతో ఇల్లు మార్మోగుతూ వుండేది. మా పొరుగింటాయన బహు శాంతమూర్తి కావడం వల్ల మర్యాద దక్కింది.
అలాటి రోజుల్లో ఒకనాటి సరదా వీడియో ఇది. ఇందులో చనిపోయిన మా అక్కయ్యలు, మా ఆవిడ వున్నారు. మా అన్నయ్య వదినల చేత కూడా డాన్సులు చేయించారు.  నేనూ. మా ఆవిడ సరే. ఇష్టం వున్నా, ఇష్టం లేనట్టుగా రెండు స్టెప్పులు వేసింది.
ఆ నాటి బ్లాక్ అండ్ వైట్ వీడియోకి, ఆ రోజుల్లో బాగా పాపులర్ అయిన  ప్రేమ దేశం  సినిమా పాట స్థానంలో    కొత్త సినిమా పాట ( డీజే టిల్లు సినిమాలోది)  రీమిక్స్ చేసి యూ ట్యూబ్ లోకి ఎక్కించాడు మా మూడో అన్నయ్య కుమారుడు భండారు రమేష్.
మరో విషయం చెప్పుకోవాలి. ఆరోజుల్లో మా ఇంట్లో రికామీగా తిరిగి పెరిగిన ఆ పిల్లలు అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని, జీవితంలో చాలా మంచి స్థాయిలో స్థిరపడ్డారు. వాళ్ళలో అధిక శాతం విదేశాల్లోనే.
వాస్తు మహిమ కాబోలు.



Video Courtesy: Ramesh Bhandaru (rams old dance videos)






అయాం ఎ బిగ్ జీరో (44) - భండారు శ్రీనివాసరావు

 

హైస్కూలు నుంచి కాలేజీలో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థి లాగే నేనూ ఏదో ప్రమోషన్ వచ్చినట్టు ఫీలయ్యేవాడిని. బట్టలు వేసుకోవడంలో, జుట్టు దువ్వుకోవడంలో, పుస్తకాల సంచీ కాకుండా ఏదో ఒక నోటు పుస్తకం మాత్రం చేతిలో పట్టుకుని ఉల్లాసంగా క్లాసులకు వెళ్ళడంలో ఈ మార్పు చాలా కొట్టవచ్చినట్టు కనిపించేది. క్లాస్ మేట్స్ ని ఏరా అనడం కాకుండా మీరు అని గౌరవంగా సంబోధించడం ఇవన్నీ ఎవరూ చెప్పకుండానే అర్ధం అయ్యాయి.

సైన్స్ గ్రూపు తీసుకున్న ప్రతివాడు భవిష్యత్తులో తానో డాక్టర్ కాబోతున్నట్టు కలలు కనేవాళ్ళు. ప్రవర్తన కూడా అదేవిధంగా వుండేది.

మా క్లాసులో రావులపాటి గోపాలకృష్ణ అని మా బంధువు ఉండేవాడు. రావులపాటి జానకి రామారావు గారి కుమారుడు. చక్కని పసిమి ఛాయ. నల్లటి రింగులు తిరిగిన ఒత్తయిన జుట్టు. చాలా అందగాడు. బాగా చదివేవాడు. క్లాసులో ఫస్ట్ మార్క్ టైపు. దానికి తగ్గట్టే జీవితంలో నిజంగానే డాక్టరు అయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద పదవులు నిర్వహించి రిటైర్ అయ్యాడు. పిల్లలు విదేశాల్లో సెటిల్ అయ్యారు. నాకు మంచి స్నేహితుడు. చదువుసంధ్యల్లో నాకు అంత మంచి పేరు లేకపోయినా, కాలేజీలో మంచి విద్యార్ధులు అందరూ నాకు మంచి స్నేహితులు. కవితలు గిలికే అలవాటు ఇక్కడ అక్కరకు వచ్చింది.

ఆ రోజుల్లో ఎన్.సీ.సీ. లో కేడెట్లుగా చేరే అవకాశం వుండేది. అందులో చేరితే రెండు జతల ఖాకీ యూనిఫారాలు, జత బూట్లు, సాక్స్, టోపీ ఇస్తారు. వీటిల్లో నన్ను ఆకర్షించింది బూట్లు. అంతవరకూ హవాయ్ శాండల్స్ తప్పిస్తే షూస్ మొహం ఎరగం కనుక మరో మాట లేకుండా అందులో చేరిపోయాము చాలామందిమి.

యూనిఫారాలు చూసుకుని మురిసిపోయాము. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మా కొలతలు తీసుకుని కుట్టించినవి కావు. లుడుంగు బుడుంగు మంటూ అవి వేసుకుని కవాతు చేస్తుంటే మమ్మల్ని  చూసి మాకే విచిత్రం అనిపించేది.

ఒకసారి వరంగల్ అనుకుంటా క్యాంపుకి తీసుకువెళ్ళారు. ఊరి బయట ఎక్కడో ఆ క్యాంపులో పెట్టారు. చుట్టూ అడవిలా వుంది. ప్రతితోజు పొద్దున్నే లేవడం, కాసేపు డ్రిల్లు, ప్లేట్లు పట్టుకుని లైన్లో నిలుచకుంటే రెండు రొట్టెలు, కూరా వడ్డించేవారు. తిని, ప్లేట్లు కడుక్కుని మళ్ళీ మనకు ఇచ్చిన బెడ్ రోల్ పైన పెట్టి మళ్ళీ లెఫ్ట్, రైట్.

చిన్నప్పుడు ఈ మిలిటరీ పదాలు బాగా వినవచ్చేవి, ఎందుకంటే మా చుట్టాల్లో కొందరు మిలిటరీలో కొంత కాలం పనిచేసిన వాళ్ళే. ఆ రోజుల్లో లెఫ్ట్ రైట్, అబౌట్ టర్న్, అటెన్షన్, స్టాండిటీజ్ (Stand at ease)  ఇలా ఉండేవి. సీవీఆర్  స్కూల్లో డ్రిల్లు టీచర్స్ కూడా ఇలానే డ్రిల్ చేయించేవారు.  వరంగల్ క్యాంపులో సావదాన్, విశ్రాం, పీచేముడ్, తేజ్ చల్.   ఇలా అవన్నీ  హిందీలోకి మారిపోయాయి.

రాత్రి పూట క్యాంపులో నిద్రపట్టేది కాదు. కీచురాళ్ళు చేసే ధ్వని. ఇళ్ళల్లో ఇలా పడుకునే అలవాటు లేకపోవడం. అయితే పొద్దంతా చేసిన కసరత్తుల వల్ల కాసేపటికి నిద్ర పట్టేది.

క్యాంపు ఒక రోజులో ముగుస్తుంది అనే సమయంలో ఆ రాత్రి ఒక కబురు తెలిసింది. దగ్గరలో వున్న ఒక దిగుడు బావిలో ఎవరో దూకి ఆత్మహత్య చేసుకున్నారని. భయం భయంగా వెళ్లి చూస్తే ఆ శవం బొక్కబోర్లాగా నీళ్ళపై తేలుతోంది. అప్పటికే నాని, బాగా ఉబ్బిపోయి వుంది. చాలామంది ఆ రాత్రి నిద్రపోలేదు. గమ్మత్తయిన విషయం ఏమిటంటే సైన్స్ గ్రూపులో చేరిన ప్రతి ఒక్కరు డాక్టరు కావాలనుకున్న వాళ్ళే. శవాలను అతి దగ్గరగా చూసి, వాటిని కోసి చదువు నేర్చుకోవాల్సిన వాళ్ళే. కానీ ఆ రాత్రి వారి భయం వర్ణనాతీతం.

మర్నాడు రైలు టైము కల్లా మమ్మల్ని  రైలు స్టేషన్ కు చేర్చారు. ఖమ్మంలో దిగి ఇంటికి చేరాము అన్నమాటే కానీ బావిలో తేలిన శవం కళ్ళల్లో మెదులుతూనే వుంది.

భయం సంగతి ఏమో కాని, ఎన్.సీ.సీ. లో చేరడం వల్ల కొంతలో కొంతయినా క్రమశిక్షణ అలవడింది.

కొన్ని దేశాల్లో వున్నట్టు విద్యాభ్యాసం పూర్తి కాగానే కొంత కాలం నిర్బంధంగా మిలిటరీలో పనిచేయాలనే నిబంధన మన దేశానికీ చాలా అవసరమేమో అని అనిపిస్తోంది. కుల, మత,  ప్రాంతీయ, భాషా  సంబంధమైన వివక్షల నుంచి భావి భారత పౌరులను విముక్తులను చేయాలి అంటే ఈ  రకమైన శిక్షణ విద్యార్థిదశ నుంచే అవసరం అనిపిస్తోంది.

ఇక నా చదువు విషయానికి వస్తే షరామామూలుగా తప్పడం, మళ్ళీ సెప్టెంబరులో ఊహాతీతంగా గట్టెక్కడం, ఈ  లోగా మా పెద్దన్నయ్యకు విజయవాడ బదిలీ కావడం, నేను కూడా వెళ్లి మాచవరం లోని ఎస్సారార్ అండ్ సీవీఆర్  ప్రభుత్వ కళాశాలలో బీ కాం లో చేరిపోవడం అన్నీ కామ్ గా జరిగిపోయాయి.  

కింది ఫోటో:


పీయూసీ లో నా క్లాస్ మేట్: డాక్టర్ రావులపాటి గోపాలకృష్ణ, భార్య డాక్టర్ రుక్మిణి


      

(ఇంకా వుంది)