11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

“ఇన్ సైడ్ వాయిస్! అవుట్ సైడ్ వాయిస్!” – భండారు శ్రీనివాసరావు

 

నిజం చెప్పొద్దూ! నేను ఇంతవరకు వినని మాట. మా అన్నయ్య మనుమరాళ్లు స్పురిత, హసిత నోటి వెంట మొదటిసారి విన్నాను.

“టీవీ చర్చల్లో పాల్గొనేవాళ్లు దగ్గర దగ్గరగానే కూర్చొంటారు కదా! తాతయ్యా! మరి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నట్టు మాట్లాడతారు”

ఒకప్పుడు ఈ చర్చల్లో పాల్గొనేవాడిని కాబట్టి వారి ప్రశ్న ఒకరకంగా సూటిగా నాకే తగిలిన భావన కలిగింది.

నా నుంచి జవాబు రాకపోవడంతో వాళ్ళే మళ్ళీ అన్నారు, “ఈ డిబేట్స్ లో ఇన్ సైడ్ వాయిస్ చాలు, అనవసరంగా అవుట్ సైడ్ వాయిస్ తో మాట్లాడుతున్నారు” అని.

ఈ ఇద్దరూ అమెరికాలోనే పుట్టారు. కానీ మన చదువులకోసం, సాంప్రదాయకంగా వారిని  పెంచడం కోసం పిల్లల్ని తీసుకుని మా అన్నయ్య కొడుకు లాల్, కోడలు దీప ఆ దేశం నుంచి వచ్చేసి హైదరాబాదులో సెటిల్ అయ్యారు.

ఆ దేశంలో ప్రతివారికీ చిన్నప్పటి నుంచీ నలుగురిలో మాట్లాడడం ఎలాగో నేర్పుతారట. అందులో భాగమే ఈ ఇన్ సైడ్ వాయిస్, అవుట్ సైడ్ వాయిస్.

ఫుట్ బాల్ మైదానం పెద్దగా వుంటుంది. అక్కడ క్రీడాకారులు ఒకరితో మరొకరు స్వరం పెంచి మాట్లాడుకోవాల్సిన అవసరం వుంటుంది. అది అవుట్ సైడ్ వాయిస్. కొంచెం గొంతు పెంచినా ఎవరూ ఏమీ అనుకోరు.

అదే ఇళ్ళల్లో, స్కూళ్ళల్లో, మాల్స్ లో మాట్లాడుకొనేటప్పుడు స్వరం తగ్గించి మెల్లగా మాట్లాడడం అలవాటు చేస్తారు. అది ఇన్ సైడ్ వాయిస్ అన్నమాట.

గురువు అనేవాడికి వయసు ప్రధానం కాదు, జ్ఞానం ముఖ్యం. అది కలిగి వున్నవారు చిన్నవారయినా, మంచి విషయాలను  వారి నుంచి నేర్చుకోవచ్చు.

ఆ విధంగా నేను, స్పురిత, హసితల నుంచి ఒక పాఠం నేర్చుకున్నాను.

(10-09-2020)

3 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

చక్కటి insight తో మాట్లాడారు మీ మనవరాళ్ళిద్దరూ 🙂.
“ఇన్ సైడ్ వాయిస్”, “అవుట్ సైడ్ వాయిస్” పదాలు బాగున్నాయి.

టీవీ చర్చల్లో మీరు అరిచి మాట్లాడేవారు కాదు లెండి కానీ పాల్గొనేవారులో 90 శాతం ఆ బాపతే. అరవడం ఒక్కటేనా, ఎదుటి వారి మాట పూర్తిగా వినిపించుకోక పోవడం, ఇద్దరూ ఒకేసారి మాట్లాడడం, కొన్ని ఛానెళ్ళలో మోడరేటర్ తన పాత్ర మరిచిపోయి తను కూడా అలాగే మాట్లాడడం .... అబ్బో అన్ని రకాల అవలక్షణాలూ కనబడతాయి ... అందుకే టీవీ చర్చలు చూడడం మానేశాను మీరు పాల్గొంటున్నా కూడా.

శ్యామలీయం చెప్పారు...

టీవీ చర్చలు ఆ ఛానెల్స్ అవసరం అంతే కాని జనానికి తలనొప్పే. దాదాపు అంతా నాన్-స్టాప్ అరుస్తూనే ఉంటారు. ప్రధానోద్దేశం మిగతా వాళ్ళు మాట్లాడేది జనానికి చేరకుండా అపాలన్నదే. హెచ్చు మంది పార్టీ చిలకలూ, వట్టి మేధావులూ కాబట్టి ఇతరులను అడ్డుకోవటం మీదే దృష్టి పెడతారు. ఈ సోది పోట్లాటలు వినటం బదులు మరో చోటికి పోదాం అనుకుంటారు జనం.

బుచికి చెప్పారు...

నెమ్మదిగా మాట్లాడే అలవాటు చిన్నప్పటి నుండి నేర్పించడం మంచి విషయం.

మన చానెళ్లలో చర్చలు , టీవీ సీరియల్స్ గోల మ్యూజిక్ చూడటం / వినడం 3rd degree torture లాంటిది. ఇంట్లో వినికిడి శక్తి తగ్గి సీరియల్స్ చూసే వాల్లు ఉంటే మరీ కష్టం.

అర్ణబ్ గోస్వామి వల్ల ఈ శబ్ద కాలుష్యం పెరిగిపోయింది.

టీవీ చర్చలు కుక్కలు అరుపులు మించిపోయింది.