28, జులై 2017, శుక్రవారం

అవినీతి, అనైతికం రెండూ కవలపిల్లలు


మన  దేశంలో అవినీతి ఆరోపణలకు అతీతులయిన రాజకీయ నాయకుల జాబితా తీస్తే అందులో మొదట కనబడే పేరు నీతీష్ కుమార్. అవినీతి మరకలు ఇసుమంతైనా అంటని వాళ్ళలో ఆయన ప్రధముడు. నీతినిజాయితీలకు మారుపేరనిపించుకుంటాడని భావించి తలితండ్రులు ఆ పేరు పెట్టి వుంటారేమో అని అనుకునేవాళ్లు కూడా వున్నారు. అయితే అదంతా నిన్న మొన్నటి దాకానే. ఇప్పుడు ఆయనా ఆ తానులో ముక్కే అని బాధపడుతున్నారు ఆయన అభిమానులు.
లాలూవంటి అవినీతి పరుడయిన రాజకీయ నాయకుడు   అనుయాయులకో, బడా బడా కాంట్రాక్టర్లకో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డమయిన  పనులు చేసి పెట్టి  కోట్లు దండుకుంటే, అటువంటివాళ్ళు రాజకీయాలకు చీడ పురుగువంటివాడని తీర్మానిస్తాము. మరి అలాంటి అధికారాలు అనేకం కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అనైతికంగా, అప్రజాస్వామికంగా దొడ్డిదారిన   పొందితే అటువంటి వారిని యేమని పిలవాలి? అవినీతి ఎలాంటిదో అనైతికం కూడా అలాంటిదే. వేసుకున్న చొక్కా మార్చినట్టు, రాత్రి రాత్రి ఏకంగా ఉత్తర దక్షిణాలవంటి రెండు పార్టీ కూటముల్లో ఒకదాన్ని ఒదిలి మరో దాంట్లో చేరిపోతే, దాన్ని సమర్ధించడం ఏం ధర్మం.
అప్రజాస్వామిక పద్దతిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం గొప్పవిషయమూ కాదు, మన దేశానికి కొత్త విషయమూ కాదు. అలా గతంలో జరిగినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతొ గగ్గోలు పెట్టిన వాళ్ళే ఈరోజు అలాంటి పనులకు పూనుకోవడం, అవినీతిపై చేస్తున్న యుద్ధంగా పేరు పెట్టుకుని వాటిని సమర్ధించుకోవడం క్షంతవ్యం కాదు.  అలా ఏర్పడ్డ ప్రభుత్వాలు అవినీతిరహిత పాలన అందివ్వవచ్చు. యేవో కొన్ని మంచి పనులు చేసి మంచి  ప్రభుత్వాలు అనిపించుకోవచ్చు.  కానీ   ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామిక ప్రభుత్వాలు మాత్రం కానేరవు.  లాలూ కానీ అతడి కుమారుడు కానీ చెడ్డవాడు అయితే వాళ్ళని  తిరస్కరించాల్సింది ప్రజలే కాని వారి  రాజకీయ ప్రత్యర్ధులు కారు. ఇటువంటి నీతిబాహ్య చర్యలకు ప్రజాస్వామ్య ముసుగు తగిలించుకోవడం అంటే ఆ స్పూర్తిని అవహేళన చేయడమే. ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి అయినా, దించడానికి అయినా రాజ్యాంగంలో కొన్ని పద్దతులు వున్నాయి. వాటిని తుచ తప్పకుండా పాటించడం వదిలేసి, వాటిల్లోని లొసుగులను వాడుకోవాలని చూస్తే తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు సిద్ధించవచ్చేమో కాని, శాశ్వితంగా అపకారం జరిగేది ప్రజాస్వామ్యానికే అనే అంశాన్ని  గమనంలో వుంచుకోవాలి.
ఈరోజు గడిస్తే చాలు అనుకునేవాడు రాజకీయ నాయకుడు. రేపు ఎలా అని ఆలోచించేవాడు రాజనీతిజ్ఞుడు.

బీహారు పరిణామాలు గమనిస్తుంటే మొదటి రకానికి దేశానికి లోటులేదనిపిస్తోంది.

7 వ్యాఖ్యలు:

UG SriRam చెప్పారు...

మీరు రాసినదాని ప్రకారం లాలు కోడుకుతో నితీష్ గారు వేగాలి. లాలు కొడుకు, చెడ్డవాడు అయితే వాళ్ళని తిరస్కరించాల్సింది ప్రజలే కాని వారి రాజకీయ ప్రత్యర్ధులు కారు అని ఎలా వ్రాక్కు ఇస్తారు? లాలు గారి అవినీతి కోర్ట్ లో నిరుపించి, శిక్ష వేయించటానికే దశాబ్దాలు పడుతున్నాది. అవినీతిపరుడిని వెంటనే తిరస్కరించటానికి, ప్రజలదగ్గరి అంత బలం బుద్ది జ్ణానం ఉండవు. ప్రజలలో ఒక్కొక్కరి ఒక్కొక్క ప్రాధాన్యతలు ఉంటాయి. ఎన్నికల ద్వారా అవినీతి పరుడైన రాజకీయ నాయకులను శిక్షించాలంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం లా ఓ 4-5 లక్షల కోట్ల స్కాములు చేస్తే, ప్రజలలో కొంచెం చురుకొస్తుంది. అంతేగాని వందల,వేలకోట్ల స్కాములు చేస్తే, ప్రజలు పట్టించుకోరు. ఆ స్కాముల భారం దిగువ మధ్యతరగతి వారిపై మాత్రమే అధిక ధరల రూపంలో పడుతుంది. వాళ్ళు భారం మోయలేక కృంగి పోతారు.ఓట్ల సంఖ్యాపరంగ చూస్తే వారిది ఎన్నికలపై పెద్ద ప్రభావం చూపదు. ఎగువమధ్యతరగతి ప్రజలు ఎదో లే అనుకొంట్టు బండి లాగిస్తారు. పేదోడికి పోయేది ఎమిలేదు. ఉచితపథకాలు తింట్టూ కూచుంటాడు.

Kishore చెప్పారు...

అవినీతిపరుడు, కుల రాజకీయాలు చేసే లాలూ తో జతకట్టినప్పుడే నితీశ్ భ్రష్ఠుపట్టిపోయాడు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@UGSriRam - రెండేళ్ళ క్రితం నేనిది రాసినా బాగుండేది కాదు. రెండేళ్ళ క్రితమే మీరిది చెప్పి వుంటే మహా బాగుండేది.

UG SriRam చెప్పారు...

@Bhandaru Srinivasrao గారు,

మీరు రాసినది చదివిన తరువాత నాకు తట్టిన వ్యాఖ్య అది. మీకు రెండేళ్ళ క్రితమే బిజెపితో విడిపోయి మహాగట్బంధన్ ఏర్పాటు చేసుకొన్నప్పుడే,నితీష్ గారి అవకాశవాదం, అనైతికత కనిపించి ఉండాలి. మీకిప్పుడు కొత్తగా కనిపించిందా? మొదటి నుంచి ఆయనది అదే తరహా. చూడబోతే మీరు ఆయన సెక్యులరిజాన్ని కాపాడటానికి లాలు,కాంగ్రెస్ లతో కలసాడని అనుకొంట్టున్నట్లున్నారు. మనదేశంలో వేరు వేరు సిద్దాంతాలు,పార్టిలకు చెందిన అత్యంత అవినీతి పరులు ఒకతాటిపై వచ్చి,అలయన్స్ కుదుర్చుకోవటానికి మాట్లాడే మొదటి మాట సెక్యులరిజం కాపాడటం కోసం ఫ్రంట్ గా ఏర్పడుతున్నామని చెప్తారు.

ఏది ఎమైనా ప్రజల కోణం నుంచి చూస్తే లాలు తో కన్నా, బిజెపి తో ఉండటం ప్రజలకు ఎంతో మేలు. బీహార్ లో కిడ్నపింగ్ వందల కోట్ల పరిశ్రమ. లాలు గారు అధికారం లో వున్నాడంటే చాలు, క్షేత్రస్థాయి లో జరిగిపోతూంటాయి పేపర్లలో వార్తలు కూడా రావు. చదువుకొన్న బీహారిలు స్వస్థలాన్ని వదలిపెట్టి, మెట్రొ సిటిల బాటపడుతున్నారు. అలాగే ఎంతో మంది పనులకోసం ఒకప్పుడు డిల్లి,పంజాబ్ వెళ్ళే వారు, నేడు బెంగుళూరు,చెన్నై, కేరళా వరకు వస్తున్నారు. బీహార్ ను తలచుకొంటే అవినీతి, రౌడి ఇజం, పరిక్షలను మాస్ కాపీయింగ్ కొట్టటం తప్పించి, బీహారిల కంట్రి బ్యుషన్ గుర్తుకే రాదు. ఐ.ఏ.యస్.లు ,ఐ.పి.యస్.లు బీహార్ నుంచి సెలెక్ట్ అయితే దానివలన ఎమి లాభం?

అజ్ఞాత చెప్పారు...హిందుత్వాన్ని తిట్టడమే.. ‘సెక్యులరిజం’!

http://andhrabhoomi.net/content/main-feature-624

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@UGSriram and అజ్ఞాత: మీ స్పందనకు నా ధన్యవాదాలు. నేను రాసిన దానిలో ఎక్కడయినా ఏదైనా పార్టీ పేరు కనిపించిందా! మీరు శ్రద్ధగా గమనిస్తే నా రాతల్లో కాని, నా టీవీ వ్యాఖ్యల్లో కాని ఎప్పుడూ పార్టీల ప్రస్తావన వుండదు. ఇప్పుడు నా వయసు డెబ్బయి దాటింది. నలభయ్ ఏళ్ళు జర్నలిజంలో వున్నాను. ఇప్పుడు అంటకాగడం వల్ల ఏం ప్రయోజనం. బీజేపీ సిద్ధాంత ప్రాతిపదిక కలిగిన పార్టీ. అదే కట్టు తప్పి వ్యవహరిస్తే ఇక దేశానికి దిక్కెవ్వరు. నితీష్ కుమార్ కూటమి మారదలచుకుంటే ఆ విషయం తనను ఎన్నుకున్న ప్రజల వద్దకు వెళ్లి తేల్చుకోవాలి. అంతే కాని ఇలా పార్టీలు, కూటములు మారడం ద్వారా కాదు. నితీష్ కుమార్,మోడీ లాంటివాళ్ళు రాజకీయాల్లో ఇతరులకు ఆదర్శంగా వుండాలి. అంతేకాని వారి అభిమానులు కూడా బాధపడే పరిస్తితి రానివ్వకూడదు. గుడ్డి అభిమానం కూడా మనం అభిమానించేవారికి చేటు చేస్తుంది. కటువైన నిజం చెప్పగలిగిన వాడే నిజమైన హితుడు. కాదూ కూడదు, ఆ తానులో ముక్కలే కదా అనుకుంటే ఇక పేచీయే లేదు. ఒకటి మాత్రం, యెంత గొప్ప పార్టీలయినా, యెంత గొప్ప నాయకులయినా ప్రజాస్వామ్యం కంటే గొప్పవాళ్ళు కాదు. అటు పాకీస్తాన్ లో చూడండి. అది యెంత ఉగ్రవాద దేశం అయినా ప్రజాస్వామ్యాన్ని ఎలా గౌరవిస్తున్నదో. సుప్రీం తీర్పు రాగానే అక్కడ ప్రధానమంత్రి రాజీనామా చేసాడు. అదే ఇక్కడ ఇందిరాగాంధీని చూసారు కదా! నలభయ్ ఏళ్ళుగా నాకు ఏ పార్టీలతో సంబంధాలు లేవు, ఇక ముందు వుండవు.

అజ్ఞాత చెప్పారు...

నితీష్ చేసింది అనైతికమైన పనే, అనుమానం లేదు. కాని అవినీతి, అనైతికం మీరన్నట్టు కవల పిల్లల్లా మన దేశరాజకీయంలో భాగమైపోయాయి. ఇందుకు ఏ పార్టీ అతీతం కాదు.

అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు లౌకికవాదానికి మద్దతు ఇచ్చారన్న వాదన మాత్రం నిజం కాదు. అలా అయితే పార్లమెంటు ఎన్నికలలో ఎందుకు మద్దతు ఇవ్వలేదు? అక్కడ మూడు గ్రూపులున్నాయి. ఒక్కో గ్రూపుకి, కులం, మతం మొదలైన ప్రాతిపదికల పైన ఓటుబాంకులున్నాయి. అందులో ఏ ఇద్దరు కలిసినా మూడో వాడు ఓడిపోతాడు. కలవకపోతే ముగ్గురిలో ఎక్కువ బలం ఉన్నవాడు గెలుస్తాడు. (యుపిలో జరిగింది అదే) ఇక్కడ సిద్ధాంతాలు ఏమీ లేవు. కేవలం గణితం మాత్రమే ఉంది. బిజెపి, జెడియు కలిసి పోటీ చేసినా చక్కగా నెగ్గి ఉండేవి.

కాకపోతే నితీష్ చేసిన పనివల్ల ప్రతిపక్షం బలహీనపడింది. నితీష్ కూడ చంద్రబాబులా NDAతో సర్దుకుపోవడం ఆశ్చర్యమే. అయితే నితీష్‌కి జాతీయ స్థాయిలో కొద్దో గొప్పో పేరున్నా, చంద్రబాబులా స్వంతంగా ఒక రాష్ట్రంలో కూడా నెగ్గగల బలం లేదు.