20, జులై 2017, గురువారం

అధికారం చుట్టూ ఈగలుఓ నలభయ్ ఏళ్ళ క్రితం కేబినెట్ మంత్రిగా చేసిన పీ. నరసారెడ్డి   చాలా ఏళ్ళ క్రితం ఏదో ఫంక్షన్ లో కలిసారు.  రేడియో విలేకరిగా నాకు ఆయనతో సన్నిహిత పరిచయం వుండేది. చాలా కాలం తరువాత మళ్ళీ ఇదే కలవడం. వృద్ధాప్యపు ఛాయలు మినహా మానసికంగా ఆయన గట్టిగానే కనిపించారు. గతం బాగానే  గుర్తున్నట్టు వుంది. అలనాటి విషయాలు కాసేపు ముచ్చటించారు. ‘ఎలా వున్నారు’ అనే నా ప్రశ్నకు ఆయన ఇలా జవాబిచ్చారు.
“హై కోర్టులో బార్ రూమ్ అనేది వుంటుంది. యువ లాయర్లతో పాటు వయసు ఉడిగిన మాజీ అడ్వొకేట్లు కూడా అక్కడ కనిపిస్తారు. నిజానికి వారికి వాదించే కేసులు ఏమీ వుండవు. ఇంట్లో ఉబుసుపోక అక్కడికి చేరి కాసేపు కాలక్షేపం చేసి ఇళ్ళకు వెడతారు. నేనూ అంతే. అప్పుడప్పుడూ పార్టీ ఆఫీసుకు వెడతాను. నేను ఎవరన్నది మా  పార్టీలోనే చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టు తప్పుకుంటారు. ఒక్కోసారి బాధ వేస్తుందని చెప్పారు. కానీ  గొప్పనాయకులని తలచుకుంటే, వారితో పోల్చుకుంటే తన పరిస్తితి చాలా మెరుగని చెప్పారు.
కంటి చూపుతో దేశ రాజకీయాలని, ఒంటి చేత్తో జాతీయ పార్టీని శాసించిన ఇందిరాగాంధీ దివి తుపాను బాధితులను పరామర్శించడానికి రాష్ట్రానికి  వస్తే,  కొంత కాలం క్రితం వరకు ఆమె కనుసన్నల్లోనే పనిచేసి ఎమర్జెన్సీ పుణ్యమా అని సమర్దుడయిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం వెంగళరావు, మాజీ ప్రధాని అని కూడా చూడకుండా ఆమెకు గెస్ట్ హౌస్  సౌకర్యం కల్పించడానికి నిరాకరించిన సందర్భాన్ని ఆ మాజీ మంత్రి ప్రస్తావించారు. ఆవిడతో పోల్చుకున్నప్పుడు తన పరిస్తితి చాలా మెరుగని చెప్పారు. ఇందిరాగాంధీకి జరిగిన అవమానానికి నిరసనగా ఆనాడు వెంగళరావు మంత్రివర్గం నుంచి కార్మిక మంత్రి టి.అంజయ్య రాజీనామా చేసిన సంగతిని ఆయన గుర్తు చేసుకున్నారు. 
ఆయన్ని కలిసివచ్చిన తరువాత ఇందిరకు సంబంధించి ఇలాంటిదే మరో ఉదంతం నాకు జ్ఞాపకం వచ్చింది.
ఓసారి ఇందిరాగాంధి మాజీ ప్రధాన మంత్రిగా ఖమ్మం  జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో మారిన సమీకరణాల  కారణంగా ఆవిడను ఘనంగా కాకపోతే పోనీండి,  ఓ మోస్తరుగా రిసీవ్ చేసుకునే నాయకులు కూడా లేకపోయారు. ఓ గెస్ట్ హౌస్ లో బస చేసినప్పుడు అప్పట్లో ఓ చోటా కాంగ్రెస్ నాయకుడు ఈశ్వరలింగం ఆమె బ్రేక్ ఫాస్ట్  కోసం  దగ్గర్లో ఓ హోటల్ నుంచి  ఇడ్లీ వడ తెప్పించి పెట్టారు. వాటితో పాటు ఇచ్చిన ఓ సత్తు చెంచాతో తినలేక, దాన్ని పక్కన పడేసి, చేత్తో తినడం అలవాటు లేకపోయినా ఇబ్బంది పడుతూనే   ఇందిరాగాంధి తిన్నారని దానికి ప్రత్యక్ష సాక్షి  అయిన కౌటూరు దుర్గాప్రసాద్ చెప్పారు. ఆవిడ టిఫిన్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వారిలో పాలేరు సమితి మాజీ అధ్యక్షులు రావులపాటి సత్యనారాయణ రావు గారు (మాజీ ఐజీ రావులపాటి సీతారామారావుగారి తండ్రి) వున్నారు.  
ఆరోజుల్లో శ్రీమతి గాంధి రాజకీయంగా వొంటరి. కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగెస్ (ఐ) పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. అప్పటివరకు ఆమెకు వీర విధేయుడిగా వున్న ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆమెతో విభేదించి పాత కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ఇక ఆవిడను ఖమ్మం పర్యటనలో కనుక్కునే నాధుడు యెవ్వడు?
ఆవిడ వెంట వచ్చిన మర్రి చెన్నారెడ్డి, జీ వెంకటస్వామి  మొదలయినవాళ్ళు శ్రీమతి గాంధీని హిల్ బంగ్లా లో దింపి, అక్కడ  వసతి సరిపోకనో యేమో, మన్నెగూడెం వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. అంచేత ఆవిడకు  బ్రేక్ ఫాస్ట్  ఏర్పాటుచేసే  బాధ్యత చిన్న నాయకుల మీద పడింది.
మొత్తం మీద  ఇందిరాగాంధీ ఖమ్మం ఎన్నికల సభ బాగా జరిగింది. కాంగ్రెస్ లో సిండికేటుగా పిలవబడే అగ్రనాయకులందరూ కలసి తనని వొంటరిదాన్ని చేసి బయటకు పంపారని శ్రీమతి గాంధి చేసే వాదనను జనం నమ్మారు. అందరూ ఒక్కటై ఈమెను వేదిస్తున్నారన్న నమ్మకం ప్రబలసాగింది. గెస్ట్ హౌస్ పక్కనే ఉన్న పెవిలియన్ మైదానం  చాలా ముందుగానే జనంతో కిక్కిరిసిపోయింది. రాత్రి ఏడు గంటలకు రావాల్సిన శ్రీమతి గాంధి మరునాడు ఉదయం ఖమ్మం వచ్చారు. అయినా సభకు వచ్చిన  ఎవ్వరూ అక్కడనుండి కదలలేదు. ఆవిడ ఖమ్మం సభలో ప్రసంగిస్తూ వున్నప్పుడే కాంగ్రెస్ (ఐ) పార్టీకి హస్తం గుర్తు’  కేటాయించినట్టు కబురు వచ్చింది.

కొసమెరుపు ఏమిటంటే ఆరోజు పెవిలియన్ మైదానంలో అమ్ముడు పోయిన మిర్చి బజ్జీలు అప్పటికీ ఇప్పటికీ ఒక రికార్డుగా చెప్పుకుంటారు.

1 వ్యాఖ్య:

sarma చెప్పారు...

అధికారంతమునందు చూడవలెకదా ఆ అయ్య సౌభాగ్యముల్ అన్నది మాట, రాజకీయాలో చెప్పేదేమి?