10, జులై 2017, సోమవారం

బదరీ కేదార్ యాత్ర (1996) ఆరో భాగం – కొమరగిరి అన్నపూర్ణ


మర్నాడు తెల్లవారుఝామున్నే లేచి స్నానాలు కానిచ్చి బస్సులో రుద్రప్రయాగ చేరుకున్నాము. అక్కడ మందాకినీ, అలకనంద నదులు కలుస్తాయి. కానీ అక్కడ నీళ్ళు ఇఘాలు. అంత చల్లటి నీళ్ళలో స్నానాలు కష్టమని శ్రీనగర్ లోనే ఆ కార్యక్రమం ముగించుకుని వచ్చాము కనుక నదిలో నీళ్ళు నెత్తిన చల్లుకున్నాము. బస్సు ఆగిన చోటునుంచి నది దగ్గరికి చేరుకోవడం కూడా కష్టం. ఇరుకు దారి. కాలు జారింది అంటే ఏకంగా నదిలో పడడమే. ఎట్లాగో అందరం చేతులు పట్టుకుని కిందికి దిగాము. యాభయ్ మెట్లు ఎక్కితే గంగాభవాని, శివాలయాలు వున్నాయి. అటునుంచే వెళ్లి బస్సు పట్టుకున్నాము. సాయంత్రం మళ్ళీ శ్రీనగర్ వెళ్లి పడుకున్నాము. మరుసటి రోజు కేదార్ ప్రయాణం.
ఉదయం ఎనిమిది గంటలకు గౌరీ కుండ్ చేరాము. అక్కడి వరకే బస్సు ప్రయాణం. తరువాత కాలినడక లేదా గుర్రాలపైనా కానీ డోలీలలో కానీ వెళ్ళాలి. ఒక్కొక్కళ్ళకు పదకొండువందల చొప్పున అయిదు డోలీలు, నాలుగువందల చొప్పున ఆరు గుర్రాలు మాట్లాడారు. పదకొండుగంటలకు అయిదుగురు అక్కచెల్లెళ్ళం అయిదు డోలీలు ఎక్కాం. మిగిలిన వాళ్ళు గుర్రాలు ఎక్కారు. డోలీలు ఉయ్యాల మాదిరిగా వున్నాయి. ముందర ఇద్దరు మనుషులు, వెనక ఇద్దరు పట్టుకుని మోస్తారు.
బయలుదేరేటప్పుడు పెద్ద చలి ఉంటుందనుకోలేదు. అంచేత అందరం చిన్న స్వెట్టర్లు వేసుకుని శాలువలు కప్పుకున్నాం. వర్షం పడుతుందని బస్సువాడు చెప్పడంతో రెయిన్ కోట్లు అద్దెకు తెచ్చారు. ఒక కిలోమీటరు వెళ్ళామో లేదో పెద్ద వర్షం పట్టుకుంది. మేము తడవలేదు కానీ ఒకటే ఈదురుగాలి. దారిలో అక్కడక్కడా చిన్న పందిర్లు ప్లాస్టిక్ షీట్లతో వేసుకుని టీ, కాఫీ, రొట్టెలు, బిస్కెట్ల వంటివి అమ్ముతున్నారు. అంతంత దూరాల్లో తోడు లేకుండా ఎలా వుండగలుగుతున్నారో. ఒక వైపు చూస్తే కళ్ళు తిరిగే లోయ. అందులో హోరుమని చప్పుడు చేస్తూ మందాకినీ నదీ ప్రవాహం. మరో వైపు ఆకాశాన్ని అంటే హిమాలయాలు. ఇరుకు దారి. వందలకొద్దీ గుర్రాలు, డోలీలు. కాలినడకన సాగిపోయే వందలాది మంది యాత్రీకులు. పైగా వాన, బురద, పెద్ద పెద్ద బండరాళ్ళు. ఏమాత్రం కాలుజారినా పాతాళంలో పడిపోవడమే. ఇక గుర్రాలు ఎలా తర్పీదు ఇచ్చారో కానీ, మెల్లగా దారి అంచున కొననుండి పోతుంటాయి. గుర్రాలకు, వాటిని తీసుకువెళ్ళే వాళ్లకు అలవాటు కావచ్చు కానీ యాత్రీకులకుకొత్త కదా! గుండెలు పీచు పీచుమంటూ వుంటాయి. డోలీల్లో కూర్చున్నామనే కానీ మా కాళ్ళూ చేతులూ చలికి వంకర్లు పోతున్నాయి. భారతికి కీళ్ళ నొప్పులు. చలికి అసలు తట్టుకోలేక గజగజా వణికి పోతోంది. భాష తెలియకపోయినా డోలీల వాళ్ళు దాన్ని మోసుకుపోయి దగ్గరలో ఒక పొయ్యి దగ్గర కూర్చోబెట్టి కాళ్ళూ చేతులూ కాపడం మొదలు పెట్టారు. అది చూసి ప్రేమకు, నాకూ భయం వేసింది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. కేదార్ ప్రయాణం ఇప్పుడే మొదలయింది. ఇంకా చాలా దూరం పోవాలి. చలి ఇప్పుడే ఇలా వుంది. ముందు ముందు ఇంకా ఎలా వుంటుందో. పైగా ఇక్కడ అంతా ఎవరికి వారే. అందర్నీ కలుపుకుపోవడం వుండదు. మిగిలిన వాళ్ళ పరిస్తితి మనకు తెలియదు, మనం ఎలా ఉన్నామో వాళ్లకు తెలియదు. ఇంతలో సురేష్ గుర్రం మీద వస్తూ కనిపించాడు. మేము కేకలు పెడితే చూసి దగ్గరకు వచ్చాడు. వాడిని చూడగానే రవంత ధైర్యం వచ్చింది.
డోలీల వాళ్ళు వాన బాగా వుంటే ఆగడం, తగ్గితే బయలుదేరడం చేస్తున్నారు. ఆగినప్పుడల్లా భారతి చలి తట్టుకోలేక పోతోంది. మా పరిస్తితి అంతంత మాత్రంగానే వుంది. ఇంతలో రంగారావు గారు గుర్రం మీద వస్తూ కనిపించారు. ఆయన వచ్చి భారతికి కాళ్ళూ చేతులూ కాపడం పెట్టించి వేడి వేడి కాఫీ తాగించారు. ఈలోగా శారదక్కయ్య, సావిత్రి వస్తున్న డోలీలు కూడా వచ్చి ఆగాయి. అందరం కాఫీలు తాగి బయలుదేరాము.
వేడి కాఫీ కడుపులో పడేసరికి కాస్త కోలుకున్నాం. డోలీ నుంచి చూస్తె పర్వతశ్రేణులు, వాటిపై రకరకాల చెట్లు, పూలతో ప్రకృతి రమణీయంగా కనబడింది. వాన వచ్చినప్పుడు కొండ వారన ఆగడం, తగ్గగానే బయలుదేరడం ఇలా డోలీ వాళ్ళు ప్రయాణం సాగిస్తున్నారు. కొండరాళ్ళు విరిగి మీదపడే ప్రమాదం పొంచి వుందని తెలిసికూడా అందరూ అలా ప్రయాణం చేస్తూ వుండడం చూస్తే అంతా దైవ లీల అనిపించింది. అవన్నీ చూస్తుంటే, ‘జగతిపై పడవచ్చు జలరాశి కెరటాలు, మామూలు మేరకు ముడవలేక, ఎంత శ్రమనొందుచుంటివో స్వామి’’ అన్న జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి (కరుణశ్రీ) పద్యం గుర్తుకు వచ్చింది. చూస్తుంటే, పైనుంచి కొండరాళ్ళు దొర్లి పడకుండా ఏదో దివ్య శక్తి చేతులతో ఆపుతున్నట్లే వుంది. (ఇంకా వుంది)