5, జులై 2017, బుధవారం

1996 బదరీ కేదార్ యాత్ర (రెండో భాగం) – కొమరగిరి అన్నపూర్ణ


మా యాత్ర ఏమో కానీ అందుకోసం మా చెల్లెలు ప్రేమ బిడ్డలు ఫణి, మణి పడ్డ హడావిడి అంతాఇంతా కాదు. చక్కిలాలు, కారప్పూస, కజ్జెకాయలు, వేయించిన అటుకులు ఇంకా రైల్లో తినడానికి పులిహోర, పెరుగన్నం, ఒంటి పూట వాళ్ళకోసం పూరీలు, కూర అన్నీ చక్కగా ప్యాక్ చేసి ఇచ్చారు. మా పెద్ద తమ్ముడి మూడో అమ్మాయి వాణి వచ్చి బదరీ, కేదార్ వెడుతున్నారు కదా, మా తరపున కూడా దణ్ణం పెట్టండి అంది. ‘మీ అందరి పేరుపేరునా సహస్రనామాలు మొదలు పెడితే ఇక మా దణ్ణం ఎప్పుడే’ అని నేనంటే అందరూ నవ్వుకున్నారు.
సాయంకాలం అరింటికే స్నానాలు ముగించుకుని నాలుగు ఆటోల్లో రైల్వే స్టేషన్ కు చేరుకున్నాము. సరిగ్గా రాత్రి ఎనిమిది గంటలకు రైలు నాంపల్లి ఒదిలింది. రైలు సికింద్రాబాదులో ఆగినప్పుడు శారదక్కయ్య కొడుకు వచ్చి కలిసాడు. ‘మా అమ్మ మేము ఎంత వద్దంటున్నా వినకుండా మారాం చేసి యాత్రలకు బయలుదేరి వచ్చింది. జాగ్రత్తగా వెళ్ళిరండి’ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. రైలు బయలుదేరగానే అనాదరం సర్దుకుని కూర్చున్నాం. రాత్రి పన్నెండు గంటలకు ఖాజీపేట చేరాము. రంగడు, శేషు టీసీతో మాట్లాడి వచ్చి, రండి, రండి. ఏసీలో సీట్లు దొరికాయన్నారు. సామాన్లు మోసుకుంటూ అందరం రైలు దిగి ఆరు డబ్బాల అవతలవున్న ఏసీ కోచ్ వద్దకు పోయి ఎక్కాము.
తెల్లవారకముందే  మెలకువ వచ్చి బయటకు చూస్తె,  సేవాగ్రాం అనే స్టేషన్ కనబడింది.  ఆ బోర్డు చూడగానే, మహాత్మా గాంధీ, అయన ఉన్న సేవాగ్రామ్ ఆశ్రమం గుర్తుకువచ్చాయి. స్వతంత్ర ఉద్యమంలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం పేరుతొ సబర్మతి నుండి దండి వరకు పాదయాత్ర  మొదలుపెట్టారు. బ్రిటిష్ పాలకులు ఆయన్ని అరెస్టు చేసి రెండేళ్లకు పైగా నిర్బందించారు. విడుదల అయిన తరువాత గాంధీజీ ఒక కఠోర నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్రం సిద్ధించేవరకు తిరిగి సబర్మతి ఆశ్రమానికి వెళ్ళేది లేదని. మధ్య భారతంలో నాగాపూరుకు దగ్గరలో ఉన్న సేవాగ్రాం అనే చిన్న పల్లె టూరును ఆయన తన మకాంగా ఎంచుకున్నారు. నిజానికి ఆ వూరు పేరు వేరే. సేగావ్ కాబోలు. కానీ సేవా దృక్పధం ప్రతిబింబించేలా ఆయన దాన్ని సేవాగ్రామ్ గా పేరు మార్చారని చెప్పుకునేవారు. ఇవన్నీ మా చెవుల్లో పడడానికి కారణం లేకపోలేదు. మా  బావల్లో ఇద్దరు, అయితరాజు రామారావు, కొలిపాక రామచంద్ర రావు దేశ స్వాతంత్ర ఉద్యమంలో నేరుగా పాల్గొంటే, మరో బావ కౌటూరు కృష్ణ మూర్తి పరోక్షంగా స్వతంత్ర సైనికులకు అజ్ఞాతంలో వుండి సేవలు అందించారు. పెద్ద బావ, రెండో బావ  పెళ్లి అయిన కొత్తల్లోనే  బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళారు. వాళ్ళు జైల్లో వున్నప్పుడు మా నాన్నగారు వారిని పుట్టింటికి, కంభంపాడు తీసుకువచ్చి మా బావలు బయటకు వచ్చేవరకు తన దగ్గరే ఉంచుకున్నారు. అప్పటికి మా పెళ్ళిళ్ళు కాలేదు. అక్కయ్యలు మూడో నెల కడుపుతో వున్నప్పుడు జైలుకు వెళ్ళిన వాళ్ళు పద్నాలుగు మాసాల శిక్ష అనుభవించి విడుదల అయిన తర్వాతనే తమ కన్న బిడ్డలను కళ్ళారా చూసుకోగలిగారు.