17, జులై 2017, సోమవారం

బదరీ కేదార్ యాత్ర (ఎనిమిదో భాగం) 1996 – కొమరగిరి అన్నపూర్ణ


స్వర్ణ, సురేష్, రంగడు మాత్రం చీకటితోనే లేచారు. మమ్మల్ని లేపి, మొహాలు కడిగించి వేడి వేడి కాఫీలు తాగించారు. తలకు మంకీ టోపీ, కాళ్ళకు  ఉలెన్ సాక్సూ తొడిగారు. మేం ఎవరం స్నానాలు చేయలేదు. మేమే కాదు బస్సులో వచ్చిన వాల్లెవ్వరూ చేయలేదు. మొహాలు, చేతులు కడుక్కోడానికే కాదు, తాగడానికి కూడా వేన్నీళ్ళే. ఒక్క రంగారావుగారు మాత్రం అంత చలిలోనూ పట్టుదలగా స్నానం చేసే బయలుదేరారు.
అందరం గుడికి చేరాం. పై నుంచి మంచు గడ్డలు ఊడి పడుతున్నాయి. క్యూ చూస్తె పెద్దదిగా వుంది. చలి సూదుల్తో పొడుస్తోంది. ఆ క్యూలో ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు నలుగురు కలిసారు. అందులో ఒకామె రాజ్యం ఒదినె కూతురు. ఖమ్మం పర్సా శ్రీనివాసరావు మామయ్య మనుమరాలు. ఆమె బిడ్డనే బెజవాడలో వుండే  తెన్నేటి భాస్కరరావుగారి కొడుక్కి ఇచ్చారు. అంటే మా మేనత్త కూతురికి వియ్యపురాలు. ఆమె గుండె జబ్బు మనిషి. కేదార్ చూడాలని మనసు పడితే వెంటపెట్టుకుని తీసుకు వచ్చారు. హార్టు పేషెంటువి, కేదార్ ఎలా వెడతావ్ అని గద్దించ కుండా ఓపిగ్గా యాత్రలకు తిప్పుతున్నారు.
గుడి నిండా జనం. ఒకటే నెడుతున్నారు.అప్పుడు ఎవరో ఒకాయన మమ్మల్ని పిలిచి తలకాయ పట్టి దేవుడికి తాకించాడు.భగవంతుడే ఆయన రూపంలో వచ్చాడా అనిపించింది. మొత్తం మీద కేదార దేవుడ్ని చూడాలనే మా చిరకాల వాంఛ నెరవేరింది.
పాండవులు యుద్ధంలో అందర్నీ సంహరించారు. ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం యజ్ఞం చేయాల్సి వచ్చిందట. నా వెంట వస్తే స్వర్గానికి దారి చూపిస్తానని శివుడు చెప్పాడట. శివుడు వాళ్ళని గుప్త కాశీ వరకు తీసుకువచ్చి మాయమై పోయాడట. అప్పుడు అర్జునుడు శివుడ్ని వెతుక్కుంటూ గౌరీ కుండ్ వరకు వెళ్ళాడట. శివుడు ఎద్దు రూపంలో కానవచ్చాడు.  అర్జునుడు రెండు పర్వతాల మీద రెండు కాళ్ళు వుంచి నిలబడ్డాడు. ఆ కాళ్ళ మధ్యనుండే అంతా వెడుతున్నారు. కానీ శివుడు మాత్రం పోలేదు. దాంతో ఆ ఎద్దే శివుడని గ్రహించి అర్జునుడు ఆ ఎద్దు తోకని కేదార్ లో తొక్కిపడతాడు.తోక కేదార్ లో వుంటే మొహం మాత్రం నేపాల్ లోని పశుపతినాధ ఆలయంలో వెలిసిందట. అది స్థల పురాణం అని చెప్పారు. అందుకే కేదార్ లో దేవుడు, లింగాకారంలో కాకుండా  ఎద్దు తోక కుచ్చు ఆకారంలో ఉంటాడు.      
రాత్రి రాగానే గదిలో కరెంటు లేదు. కుంపట్లు పెట్టారు. అవి వుంటే గదిలో మనకు ఆక్సిజన్ సరిపోదు. ఆ గది అద్దెఒక రాత్రికి వంద రూపాయలు. కప్పుకునే పరుపులకు ఒక్కొక్క దానికి పదిహేను రూపాయలు చార్జి.
రూముకు వచ్చి కాఫీలు తాగాము. కప్పు కాఫీ పది, టీ ఏడు రూపాయలు. మంకీటోపీలు, ఉలెన్ సాక్స్ ధరించి అందరం మళ్ళీ డోలీలు ఎక్కాం. ఈసారి అన్ని డోలీలు కలుపుకుంటూ వచ్చాము. వచ్చేటప్పుడు వాన లేదు. ఎండ కాస్తూ వుంది. చలి బాధ సాంతం తగ్గలేదు కానీ చాలా నయం. బాగానే మాట్లాడుకోగలుగుతున్నాం. గుర్రాల మీద వస్తున్న సురేష్ వాళ్ళు మధ్య మధ్య కలుస్తున్నారు. కొండలు పచ్చని చెట్లతో ఎంతో అందంగా కనిపించాయి. ఆ కొండలపై ఎవరో మొక్కల్ని నాటి, నీళ్ళు పోసి పెంచినట్టు గుబురుగా వున్నాయి. పోతన భాగవత పద్యం జ్ఞాపకం వచ్చింది.
‘అడవిలోన నున్న అబలుండు వర్ధిల్లు, రక్షితుడు మందిరమున జచ్చు’

దారి వెంట గంగామాయి హోరున శబ్దం చేసుకుంటూ మాతోనే వస్తున్నట్టు వుంది. మా ప్రయాణమంతా ఋషీకేష్ నుండి గంగ ఒడ్డునే జరుగుతోంది. పోతనగారు ఈ దృశ్యాలను ఎలా వర్ణించారో. గంగావతరణం రాసారంటే మాటలా! ఎంతో ఆశ్చర్యం వేసింది. నాలాగే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కూడా, ‘గొల్లపిల్లల  వేళ్ళ సందు మాగాయ పచ్చడి పసందు యేతుల కనుగొంటి వయ్య, నీకెవరు చెప్పిరయ్య’ అంటూ  పద్య రూపంలో ఆశ్చర్యపోయారు. లోయలో పారుతున్న గంగని చూస్తుంటే నగర చక్రవర్తుల కధ, భగీరధ ప్రయత్నం గుర్తుకు వచ్చాయి. (ఇంకా వుంది)