12, జులై 2017, బుధవారం

పుట్టింట్లో రెండు గంటలు

రోజూ ఎన్ని టీవీ చర్చలకు వెళ్ళినా ఆలిండియా రేడియో రికార్డింగ్ కు వెళ్ళడంలో కిక్కే వేరప్పా. ఏవిటో ఫేస్ బుక్ భాష అలవడుతున్నట్టుంది కాబోలు. ఎంతయినా   నా వృత్తి జీవితంలో రేడియో నా పుట్టిల్లు. అటూ ఇటూగా ముప్పయ్యేళ్ళ అనుబంధం. 1975 నవంబరు 14 న అందులో  మొదటిసారి కుడికాలు మోపాను. పుట్టింటి ఆరాటం అంటే ఏమిటో ఈరోజు ఆకాశవాణికి వెళ్ళినప్పుడు అర్ధం అయింది.   రిటైర్ అయి అడుగు బయట పెట్టి పుష్కర కాలం దాటింది కానీ బయట వాచ్ మన్ల దగ్గర నుంచి అక్కడ పనిచేస్తున్న డ్యూటీ ఆఫీసర్లు, ఇంజినీర్లు, ప్రోగ్రాం అధికారులు, అన్ని విభాగాల సిబ్బంది గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించడం, యోగక్షేమాలు ఆరా తీయడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఇక మా ప్రాంతీయ వార్తా విభాగం సిబ్బంది సంగతి చెప్పక్కరలేదు. ఎవర్నీ కాదనలేక ఎన్ని సార్లు, ఎన్ని టీలు తాగానో లెక్కేలేదు.  దీనికంతటికీ కారణం రేడియోలో తెలుగు ప్రసంగాలు చూసే అధికారి సీతారాంబాబు  మొన్నీమధ్య ఫోను చేసి ‘సాంఘిక మాధ్యమాల మంచీ చెడుల’పై ఒక ప్రసంగవ్యాసం రాయాలని కోరారు. ఈరోజు సాయంత్రం రికార్డింగ్ అన్నారు. మళ్ళీ ఒక్కసారి పాత పరిచయస్తులని పలకరించే అవకాశం దొరికిందని ఆనందంగా వెళ్లాను. ఒకప్పుడు నేను పనిచేసినప్పుడు అచ్చు ప్రభుత్వ కార్యాలయం మాదిరిగా ఉన్న అదే ఆఫీసు ఇప్పుడు కార్పొరేట్ హంగుల్ని సమకూర్చుకుంది. మా న్యూస్ రూమ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.  అంతా డిజిటలైజ్ చేసారు. ప్రసారం అయిన ప్రతి బులెటిన్  ని  ఏ.ఐ.ఆర్. వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేస్తున్నారు. ఏవిటో,  అందరూ వినే రోజుల్లో ఈ భోగాలు లేవు.

అనుకున్నట్టే చాలామంది కలిశారు. ఇన్నేళ్ళ తరువాత గుర్తు పట్టి పలకరించిన వారి సౌహార్ధతకు ధన్యవాదాలు చెప్పడం తప్ప ఏం చేయగలను?    

2 వ్యాఖ్యలు:

Venkata Naresh చెప్పారు...

చాలా సంతోషం. రేడియో డిజిటల్ కోసం చాలా సంవత్సరాలుగా నేను ఎదురుచూస్తున్నా. ఈ మధ్యనే తెలిసింది అవి ప్రారంభించారు అని. నాకు AM రేడియో అంటే చాలా ఇష్టం.ఆన్లైన్ లో తెలుగు ఎఫెమ్ రేడియో ప్రసారాలు వున్నా..మన ఆకాశవాణి వింటే చిన్ననాటి రోజుల్లోకి వెళ్లినట్లు ఉంటుంది. పొరుగు రాష్ట్రాల్లో , దేశాల్లో వుండే మా లాంటి వారికి ఇది శుభవార్త.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Venkata Naresh :రేడియో గురించి మీ అభిప్రాయం నాకూ సంతోషాన్ని కలిగించింది.