30, నవంబర్ 2016, బుధవారం

మంచికోసం అయితే మార్పు మంచిదే!


స్వాతంత్రం  వచ్చిన  పదేళ్లకు 1957 లో దేశంలో డెసిమల్ పద్దతిలో కొత్త నాణేలను ప్రవేశ పెట్టారు. మా చిన్న తనంలో తళతళ మెరిసే నయా పైసాలు వచ్చాయి. జనాలకు కొత్త నాణేలు  అలవాటు అయ్యేవరకూ అప్పటివరకు చెలామణీ లో వున్న అర్ధరూపాయలు, పావలాలు, బేడలు, అణాలు,అర్ధణాలు, కాణీలు, చిల్లు కాణీలను కూడా చెలామణీ లోనే ఉంచారు. కాలక్రమంలో అవి కనుమరుగయిపోయాయి. అలాగే తూకాలకు వాడే  వీసెలు, తులాల  స్థానంలో కిలోగ్రాములు, శేర్లు, గిద్దెల స్థానంలో లీటర్లు రంగప్రవేశం చేసాయి. దూరాలకు వాడే మైలురాళ్ళ కొలమానాన్ని కిలోమీటర్లు ఆక్రమించాయి. అప్పటికి దేశంలో నూటికి తొంభయి శాతం జనాభా అంగుష్ఠ మాత్రులు. అంటే నిశానీదారులు. వేలి ముద్ర తప్ప సంతకం చేయడం కూడా రాని నిరక్షరాస్యులు. అయినా మార్పును సంతోషంగా ఆహ్వానించారు. ఎలాటి ఇబ్బందీ లేకుండా అలవాటు పడ్డారు.
స్వతంత్ర భారతంలో వచ్చిన మరో గొప్ప మార్పు ఎన్నికల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడడం. వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించారు. మొదట్లో పోటీలో వున్న ప్రతి పార్టీకీ (అభ్యర్ధికీ) ఒక్కో గుర్తు కేటాయించేవారు. కాంగ్రెస్ పార్టీకి  కాడి జోడెడ్లు, కమ్యూనిష్టులకు కంకీ కొడవలి, సుత్తీ కొడవలి ఇలా. ప్రతి గుర్తుకూ విడివిడిగా బ్యాలెట్ బాక్సులు ఉండేవి. ఖాళీ కిరోసిన్ డబ్బాలకు కాగితం అంటించి దానిపై పార్టీ గుర్తు అతికించే వారు. తరువాత ప్రతి డబ్బాను తెరిచి ఓట్లు లెక్కబెట్టి ఫలితం ప్రకటించేవాళ్ళు. దరిమిలా బ్యాలెట్ పత్రాలు వచ్చాయి. అభ్యర్దులందరి పేర్లు ఒకే బ్యాలెట్ పై వుండేవి. తరువాత పేర్లు కూడా తీసేసి కేవలం గుర్తులు మాత్రమే ఉంచేవాళ్ళు. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్ధికి ఓటువేసిన తరువాత దాన్ని బ్యాలెట్ పెట్టెలో వేసేవాళ్ళు. ఆ తరువాత ఎలక్ట్రానిక్  ఓటింగ్ మిషన్లు వచ్చాయి. ఓటర్లలో అధిక శాతం నిరక్షరాస్యులు అయినప్పటికీ కాలం తెస్తున్న మార్పులకు బాగా అలవాటుపడ్డారు. కొత్త విషయాలను సులువుగా గ్రహించడానికి చదువు అక్కరలేదని నిరక్షర భారతం పలుపర్యాయాలు నిరూపించి చూపింది.
ఇంతేనా అంటే ఇంకా వుంది.
పూర్వం టూరింగు టాకీసుల్లోనే కాకుండా, మంచి సినిమా థియేటర్లలో కూడా జనాలు చుట్టలు, బీడీలు, సిగరెట్లు తాగేవాళ్లు. పొగతాగరాదు అని స్లయిడ్లు వేసేవాళ్ళు కానీ ఎవరూ పట్టించుకునే వాళ్ళు కాదు. తరువాత ఎయిర్ కండిషన్  ధియేటర్లు వచ్చాక సినిమా హాల్లో పొగతాగ కూడదు అనే సంగతిని సామాన్య జనం ఒకరిని చూసి మరొకరు నేర్చుకున్నారు. జరిమానాలు, శిక్షల బెదిరింపుల వల్లకాదు. అంటే ఏమిటి? మార్పును ఆహ్వానించే తత్వం జనంలోనే  వుంది. వాళ్ళు మార్పుకు ఏనాడు వ్యతిరేకులు కాదు.
ఇప్పుడు డబ్బు మార్పిడికి సెల్ ఫోన్లు వాడమంటున్నారు. తప్పకుండా వాడుతారు. అయితే ఇంతకు  ముందు చెప్పిన వాటికీ దీనికీ ఓ స్థూలమైన తేడా వుంది. అవి జనం చేతులో వున్నాయి. ఇదలా కాదు. ఇంటర్నెట్ అవసరం. అదీ ఎలాంటి అవాంతరాలు లేకుండా.
నెట్ ఉపయోగించడానికి జనం సిద్ధంగానే వున్నారు. అయితే నెట్ అందరికీ అందుబాటులో ఉందా అనేదే అసలు ప్రశ్న.     

ఏలికలు సమాధానం చెప్పాలి.

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

INTERESTING ARTICLE SIR.

Chandrika చెప్పారు...

ముందు సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ కంటే అసలు ఎంత మంది చిరువ్యాపారులకి జన్ ధన్ ఖాతాలు ఉన్నాయన్నది ముఖ్యం. ఎందుకు ముఖ్యం అంటున్నానంటే - ఒక ఉదాహరణ చెప్తాను. ప్రతి అపార్ట్మెంట్ కి పూల అమ్ముకునేందుకు, ఆకుకూరలు అమ్ముకునేందుకు సైకిల్ మీద వస్తారు చిరు వ్యాపారాల వాళ్ళు. ఇస్త్రీ చేసేవారు ఒకరు ఉంటున్నారు. ఇటువంటి వాళ్ళు ఆ ఖాతాని తెరిచి ఉంటే , అపార్ట్మెంట్ లో నివసించేవారు (ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ సౌకర్యం వారికీ ఉంటుంది ) వారి సేవలకు గాను ఖాతా లోకి డబ్బు జమ చేయచ్చు. వారానికో నెలకో. వ్యాపారికి డబ్బు జమ అయినట్లు SMS వస్తుంది. నాకు తెల్సి దానికి స్మార్ట్ ఫోన్ అవసరం లేదు. ఒక వేళ ఆ వ్యాపారికి అసలు ఫోన్ లేని పక్షం లో, తనే బ్యాంకు కి వెళ్లి డబ్బు జమ అయిందో లేదో తెలుసుకోవచ్చు . ఆ వ్యాపారికి ఖాతా నే లేకపోతే ఏమి చేయలేము నగదు రూపం ఇవ్వటం తప్ప. రోజువారి జీవనం లో ఇలాంటి తెల్సిన వ్యాపారులు వారు ఎంతో మంది ఉంటారు. taking baby steps లాగా ఇలా మొదలు పెట్టవచ్చేమో. నేను చెప్పినది, నా అవగాహన తప్పు అయితే ఎవరైనా చెప్పవచ్చు. ఇంకో కోణం తప్పకుండా తెల్సుకుంటాను.

Rao S Lakkaraju చెప్పారు...

నాకు కానీలు అణాలు బేడలూ బదులు నయా పైసలు వచ్చిన రోజులు గుర్తున్నాయి. ఎంత చదువు రాక పోయినా ఇంటికి వచ్చి కూరగాయలు అమ్మే వాళ్ళతో సహా చిన్న వ్యాపారులు పెద్దగా ఇబ్బంది పడి సమ్మెలూ గట్రా చేసినట్లు గుర్తు లేదు.

ఇప్పటికీ అప్పటికీ తేడా ఒకటే కనపడుతోంది. అప్పుడు ప్రతీ వాళ్ళకీ ఏమి చెయ్యాలో తెలిసే తట్టు చేశారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదల్లే ఉంది. ఒకవేళ తెలిసినా చెయ్యటానికి కష్టసాధ్యం చేశారు అనుకుంటాను. త్వరగా ఈ పరిస్థితి మెరుగైతే బాగుండు.

sarma చెప్పారు...

మాదో పల్లెటూరు, ప్రజలు చాలా తెలివైనవాళ్ళు, ఈ ప్రకటన తరవాత మా దగ్గర స్వైపింగ్ మిషన్లు పెట్టేశారు, ఇబ్బందులు తక్కువే! మా పక్క ఇంతకంటే చిన్న పల్లెలలో పెట్టేరు మిషన్లు

అజ్ఞాత చెప్పారు...

పేదవాడు బతికేది వందలు యాభై లాంటి నోట్లతోనే . పెద్ద నోట్లు ఉన్నా అవి వాడలేరు , అదృష్టం ఏంటంటే మన అవసరాలు అన్ని 100 లోపే తీరిపోతాయి , పేదవాడు బ్రతుకు దుర్భరమయిపోతోంది అనే చెప్పే ఈ జనాలు కి ఏ మాత్రం ఐడియా లేదని అర్ధం అవుతుంది .

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

"Blogger sarma అన్నారు...
మాదో పల్లెటూరు, ప్రజలు చాలా తెలివైనవాళ్ళు, ఈ ప్రకటన తరవాత మా దగ్గర స్వైపింగ్ మిషన్లు పెట్టేశారు, ఇబ్బందులు తక్కువే! మా పక్క ఇంతకంటే చిన్న పల్లెలలో పెట్టేరు మిషన్లు."
----------------------------------
ఎంతైనా గోదావరి జిల్లా వాళ్ళు కదా 😀😀.

నిజానికి ఇలా పరిష్కరించుకున్న ప్రాంతాలు ఇంకా ఉండే ఉంటాయి. అయినా పూర్తిగా ఇబ్బందులు లేవనలేం గానీ మీడియా గోల ఎక్కువైపోవడం వల్ల అసలు పరిస్ధితి తెలియడం కష్టమైపోతోందనిపిస్తోంది.

మధ్యాహ్నం ఓ టీవీ చానెల్ "బ్రేకింగ్ న్యూస్" బద్దలు కొడుతోంది - కర్నూలులో పేకాడుతున్నవారిని పట్టుకుని పోలీసులు 12 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారట. నగదు కొరత ఉన్న ఈ రోజుల్లో కూడా పేకాట కోసమే అంత నగదు పెట్టుకుని కూర్చొన్నారా। నల్లధనం అంటారా?? 🤔

1957 లో నాణాలకు డెసిమల్ పద్ధతి (నయాపైసలు) ప్రవేశపెట్టడం నాకూ గుర్తుంది. అయితే పాతనాణాలు రాత్రికి రాత్రే చెల్లుబాటు కావనలేదు. పాతనాణాలు కూడా ఆ తర్వాత చాలా రోజులే చలామణిలో ఉండినాయి (ఏదో సత్తునాణాల ఇబ్బంది అప్పుడప్పుడు తగిలేది 😀). కానీ నెప్పి తెలియకుండా వాటిని ఉపసంహరించారు. దానికీ నల్లధనానికీ / నకిలీడబ్బుకీ సంబంధం లేదు. కానీ ఇప్పుడు చేసిన పని లక్ష్యం వేరు కదా, అందువల్ల హఠాత్తుగానే చెయ్యక తప్పదు మరి. కానీ మరింత ముందస్తు జాగ్రత్తలు తీసుకునుండవచ్చు. ఉదాహరణకి ATM ల్లో ఉండే డబ్బుంచే బిన్ ల (bin) / ట్రేల (tray) సైజ్ కి, కొత్త 2000 ల రూపాయల నోట్ల కొత్త 500 రూపాయల నోట్ల సైజ్ కీ తేడా ఉందనీ, అందువల్ల దేశంలోని ప్రతి ATM లోనూ bin లు మార్చాల్సిరావడంతో ATM ల సమస్య అనివార్యమయిందనీ అంటున్నారు. మరి దీనికి ముందే జాగ్రత్త పడి ఈ సమయంలో అనవసర ప్రయోగాలు చెయ్యకుండా ఆ bin ల సైజ్ లోనే కొత్త నోట్లను కూడా ముద్రిస్తే సమస్య వచ్చేది కాదుగా. అలాగే చిల్లర నోట్లు కూడా విరివిగా ముద్రించి ముందుగా సర్క్యులేషన్ లోకి విడుదల చేసుండవచ్చు. అసలు కొత్తగా రెండువందల రూపాయల నోట్లు కూడా ప్రవేశపెడితే ఉపయోగకరంగా ఉండేదేమో (ATM లోని bin / tray సైజులు జాగ్రత్తగా చూసుకుని 🙂); కొత్త 2000 రూపాయల నోటుకి చిల్లర సమస్య కూడా కొంత తగ్గేది 🤔. చెప్పడం తేలికే అనే వారికి - కొన్ని నోట్ల demonetisation లాంటి బృహత్కార్యం తలపెట్టినప్పుడు పటిష్టమైన ప్రణాళిక అవసరం కదా (అందులోనూ ప్రభుత్వం తలుచుకుంటే అసాధ్యమేముంది) - అని నేననేది. సరే జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడయినా చిల్లర నోట్లు ఎక్కువగా ముద్రించడం వేగవంతం చేస్తే మంచిది.

డిజిటల్ ఇండియా దిశగా పైన చంద్రిక గారు సూచించిన పద్ధతి వారన్నట్లు "baby steps" లాగా ప్రయత్నించవచ్చు. కాకపోతే అంత చిరువ్యాపారుల్ని ఒప్పించడం కొంచెం కష్టమే; ప్రయత్నిస్తూ ఉంటే కెంతమందైనా ఒప్పుకోవచ్చేమో, కానీ కొంచెం డౌటే. బ్యాంక్ ఖాతా ఉన్నా లేకపోయినా చేతిలో సెల్ ఫోన్ మాత్రం ఖాయం అందువల్ల సెల్లు, దాంట్లో SMS లు రావడం ఇబ్బంది ఉండక పోవచ్చు. బ్యాంక్ అక్కంట్ కూడా తీసుకోవచ్చు ఇప్పటికైనా మించిపోయింది లేదు. కానీ ఒక రకమైన వ్యాపార పద్ధతులు పాతుకుపోయాయి. కూరగాయలు పండంచేది నేను కాదమ్మా, పెద్ద వ్యాపారి దగ్గర కొని తీసుకొచ్చి ఇంటింటికీ తిరిగి అమ్ముతాను, ఆడికి కేషే ఇవ్వాలమ్మా లేకపోతే ఆడొప్పుకోడు, అందుకని నాకూ కేషే కావాలమ్మా - అని మనతో అనే ఛాన్సులే ఎక్కువ. మనవి నగదు కి అలవాటు పడిన ప్రాణాలు. సొమ్ము నగదు రూపంలో జేబులో ఉంటే అదొక ధైర్యం, comfort మనకి. వ్యాపారంలో తిప్పుకోవడానికి పనికొస్తుంది, పైగా ఎవరికీ లెక్క చూపించనక్కరలేదు అని వ్యాపారుల ఆలోచన (కొంచెం పెద్ద వ్యాపారులు మరీనూ). చంద్రిక గారు నివసించే అమెరికాలో కూడా ఇటువంటి వాళ్ళు అక్కడక్కడ తగులుతారు (మన వాళ్ళే లెండి, ముఖ్యంగా గుజరాతీలు మార్వాడీలు నడిపే షాపుల్లో, దేవాలయాల ఆవరణలో నడిపే షాపుల్లో). బిల్లు పది డాలర్ల కి పైనయితేనే కార్డ్ అనే బోర్డులు కొన్ని షాపుల్లో చూశాను (మరీ చిన్న కొనుగోళ్ళ మీద కూడా కార్డ్ రుసుం ఏం కడతాంలేం అనే ఆలోచనేమో తెలియదు) అది మన మనస్తత్వం. ఏమయినా గానీ డిజిటల్ సంసృతి మన దేశంలో పెరగడానికి కించిత్తు టైమ్ పడుతుంది, అయినప్పటికీ మెల్లమెల్లగా అడుగులు వెయ్యడం వెంటనే మొదలెట్టాలనేది నా అభిప్రాయం కూడా.

sarma చెప్పారు...

రెండు వేల నోటుకు చిల్లర ఉండీ ఇవ్వనివాళ్ళు. కట్టలకొద్దీ వంద నోట్లు దాచేస్తున్నవాళ్ళు ఇలా ఎన్ని రకాలో.అసలు కష్టాలే లేవనను.దొరికినంత వరకు డ్రా చేసుకోవాలనే తపన. అసలు బంగారం కత ఈ రోజుకదా ప్రారంభం :) చూద్దాం

UG SriRam చెప్పారు...


@ విన్నకోట నరసింహా రావు

Please watch this video

Disruption in Financial Services: Nandan Nilekani

https://www.youtube.com/watch?v=aGM5TvAUF00&spfreload=5