16, నవంబర్ 2016, బుధవారం

రాజకీయ చెణుకులు



రాజకీయాల్లో వుండేవాళ్ళల్లో కూడా హాస్యపు పాలు ఎక్కువే. అయితే ఇటీవలి కాలంలో అది తక్కువైపోతూ అసహనపు పాలు ఎక్కువవుతోంది. కొన్ని పాత ముచ్చట్లు గుర్తు చేసుకుందాం.
నెహ్రూ మంత్రి వర్గంలో కృష్ణ మీనన్ రక్షణ మంత్రి. పాకీస్తాన్ కి అమెరికా ఆయుధ సాయంపై పార్లమెంటులో చర్చ జరుగుతోంది. ఆ ఆయుధాలను భారత దేశానికి వ్యతిరేకంగా వాడడం జరగదు అనే వాదాన్ని ఖండిస్తూ అయన ఇలా అన్నారు.
“ఆకులూఅలం తిని పొట్టనింపుకునే శాకాహార పులిని నేనింతవరకూ చూడలేదు”
సభలో భారత ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి చర్చ నడుస్తోంది.
ఒక ప్రతిపక్ష  సభ్యుడు ఇలా అన్నారు.                               
“మన దేశంలో తయారయ్యే మోటారు కారులో శబ్దం చేయని భాగం ఏదైనా ఉన్నదంటే అది కారు హారన్ మాత్రమే”
బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చలకు మహాత్మాగాంధీ ఇంగ్లండ్ బయలుదేరుతున్నారు. ఒకరన్నారు.
“అక్కడ బ్రిటిష్ ప్రభువును ఇలానే చాలీచాలని ధోతీ పై కండువాతో   కలుసుకుంటారా!”
“ఏమిటి ఇబ్బంది, నాకు లేకపోయినా బ్రిటిష్ ప్రభువువద్ద  ఇద్దరికి  సరిపడా దుస్తులు వుండే వుంటాయి కదా!” గాంధి జవాబు.
1949 లో ప్రధాని నెహ్రూ మొదటిసారి అమెరికా పర్యటన చేసి స్వదేశానికి తిరిగివచ్చారు. అక్కడి సంస్కృతీ సంప్రదాయాలపై ముఖ్యంగా నాగరీకం పేరుతొ సమాజంలో సాగుతున్న పద్దతులు ఆయనకు నచ్చలేదు. ఆ భావాలను  మొత్తం ఆయన ఒక్క ముక్కలో ఇలా చెప్పారు.
“ఏమైనా సరే! ఎవ్వరూ కూడా ‘మొట్టమొదటిసారి’  మాత్రం అమెరికా వెళ్ళకూడదు”
సరోజినీనాయుడు మహాత్మా గాంధీ గురించి ఘాటుగా వ్యాఖ్యానించింది.
“ఈ గాంధీగారి  నిరాడంబరత్వం  ఏమో కానీ ఆయన్ని ఇలా సాదాసీదాగా వుంచడానికి మనం ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆయన గారు ఈ సంగతి ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో!”
సర్దార్ పటేల్ ని కూడా ఆమె వదిలి పెట్టలేదు.
“ ఈ ఉక్కు మనిషికి అగ్రికల్చర్ తప్ప అసలు కల్చర్ అంటే ఎంతమాత్రం తెలియదు”
ప్రతిపక్ష సభ్యుడు పిలూ మోడీ మంచి హాస్య చతురత కలవాడు. భారీ కాయానికి తగ్గట్టే హాస్యం కూడా అదే మోతాదులో వుండేది. ఆ రోజుల్లో ప్రధాని ఇందిరాగాంధీ,  ఏ  సమస్య  వచ్చినా, మొండిగా  దాన్ని అమెరికా గూఢచారిసంస్థ సీఐఏ తో ముడిపెట్టి మాట్లాడుతూ వుండేవారు. అది విని వినీ చిర్రెత్తుకొచ్చిన పిలూ మోడీ “నేను సీఐఏ ఏజంటును’ అని రాసి వున్న బ్యాడ్జీని ఇందిరాగాంధీకి కనిపించేలా తన చొక్కాకు తగిలించుకుని సభకు వచ్చారు.
అప్పుడు రాజీవ్ గాంధి ప్రధాని. తెలుగుదేశం సభ్యుడు పర్వతనేని ఉపేంద్ర  ప్రతిపక్ష నాయకుడు. రాజీవ్ గాంధి ఏదో విదేశ పర్యటన ముగించుకుని వచ్చి సభలో అడుగు పెట్టారు. పదేపదే విదేశీ యాత్రలు చేసే ప్రధానిగా అప్పటికే ఆయనపై ప్రతిపక్షాలు ఓ ముద్ర వేసాయి. ప్రధాని రావడం చూసి ఉపేంద్ర తన స్థానంలో నిలబడి అన్నారు. “ చాలా అరుదుగా ఢిల్లీని సందర్శిస్తున్న భారత ప్రధానికి స్వాగతం పలుకుతున్నాం”
1950 ప్రాంతాల్లో పీ. గోవింద మీనన్ ట్రావెన్ కూర్, కొచిన్ రాష్ట్రానికి (తరువాత కేరళ రాష్ట్రంగా పేరు మారింది) ముఖ్యమంత్రి. టీ.వీ.థామస్ ప్రతిపక్ష నాయకుడు.
తను కూర్చున్న స్థానాన్ని చూపిస్తూ ముఖ్యమంత్రి అన్నారు. “నా ఈ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి ప్రతిపక్ష నాయకుడు చాలా ఆత్రుత పడుతున్నారు. అది ఆయనకు ఈ జన్మలో సాధ్యం అయ్యేపని కాదని నేను చెప్పదలచుకున్నాను.  ఈ కుర్చీ ఎక్కాలంటే ఆయన మళ్ళీ మనిషి జన్మ కాదు,  నల్లి జన్మ ఎత్తాలి.”
బ్రిటిష్ ప్రధానిగా రామ్సే మెక్ డోనాల్డ్ కి మెతక మనిషి అనే పేరు. ప్రతిపక్షంలో వున్న విన్ స్టన్ చర్చిల్ ఆయన్ని గురించి ఒకసారి ఇలా వ్యాఖ్యానించారు.
ఈ మెక్ డోనాల్డ్  ఎలాటి వాడంటే  గొర్రె తోలు కప్పుకున్న మరో గొర్రె”


1 కామెంట్‌:

Surya Mahavrata చెప్పారు...

ఆఖరి పంచు అదుర్స్