26, నవంబర్ 2016, శనివారం

నాణేనికి అటూ ఇటూ

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 27-11-2016, SUNDAY) 

పూర్వం పల్లెటూళ్ళలో దుకాణాల ముందు “నగదు నేడు, అరువు రేపు” అనే బోర్డులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దరిమిలా తలెత్తిన కరెన్సీ కటకటల కారణంగా దాన్ని కొద్దిగా మార్చి, “అరువు నేడు, నగదు రేపు” అని బోర్డులు పెట్టాల్సి వస్తుందేమోననే ఓ చమత్కారం సాంఘిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. కాస్త ఉత్ప్రేక్షాలంకారం పాలు ఎక్కువై వ్యాఖ్యలో ఘాటు పెరిగినట్టు అనిపించినా ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు.       
నూట పాతిక కోట్ల జనాభాలో అత్యధికులు పేదవారు అవడం మూలాన దేశంలో  డబ్బు అవసరం కలిగిన వారి సంఖ్య ఎక్కువగా వుండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అవసరం వేరు, కటకటపడడం వేరు అని  గత రెండువారాల పైచిలుకు అనుభవం తెలుపుతోంది. బ్యాంకుల్లో దాచుకున్న తమ డబ్బును తీసుకోవడానికి గంటల గంటల పాటు క్యూలల్లో నిలబడి యాభయ్ మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు  ప్రస్తుత పరిస్తితిలోని తీవ్రతను వెల్లడిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు కదా, అవి అలానే వ్యవహరిస్తాయి, అది సహజం కూడా.
గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ఈ విషయంపై  విరామం లేకుండా జరుగుతున్నచర్చోపచర్చల్లో ఒక విషయం మాత్రం తెలిసొచ్చింది, అల్లా చేసివుంటే ఇల్లా జరిగేది కాదని.
ఎనిమిదో తేదీ మంగళవారం రాత్రి ప్రధాని మోడీ ప్రసంగం తయారు చేసిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. ( అసలా నిర్ణయం ప్రధాని కాకుండా రిజర్వ్ బ్యాంక్  అధికార ప్రతినిధిచేత   ప్రకటించి వుంటే మరింత బాగుండేది, అలా చేస్తే  దీనికి రాజకీయ రంగు అంటివుండేది కాదన్నది ఒక వాదన. 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్  కూడా నోట్ల రద్దు ప్రకటన బాధ్యతను అధికారులకే ఒదిలి వేసిన విషయాన్ని ఈ  ‘వాదకులు’ గుర్తు చేస్తున్నారు)
సరే! ప్రకటన ప్రధానమంత్రి మోడీ స్వయంగా చేశారు. అందులో కొంపలు మునిగేది ఏమీ వుండదు.  కాకపొతే దాన్ని ఆయన తన తరహాలో కాకుండా ఒక  అధికారిక ప్రకటన మాదిరిగా రాసుకొచ్చి చదివి వుంటే బాగుండేదన్న అభిప్రాయం వుంది. అలానే ఒక రాజకీయ నాయకుడి ప్రసంగం మాదిరిగా కాకుండా  క్లుప్తంగా కొన్ని విషయాలను మాత్రమే ప్రస్తావించి వుండాల్సింది. నల్ల కుబేరులపై యుద్ధ ప్రకటనకు మరో అవకాశం వినియోగించుకుని వుండాల్సింది. తన ప్రసంగంలో ప్రధాని  మోడీ “ఉగ్రవాదుల చేతుల్లో భారత కరెన్సీ” అనే  మరో విషయాన్ని కూడా  ప్రస్తావించారు. అందువల్ల దేశ భద్రతకు యేర్పడ బోతున్న ముప్పు, వీటి  కారణంగా ఈ హఠాత్ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని చెప్పిన  ప్రధాని ఆ అంశానికే  ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వుంటే, యావత్  దేశ ప్రజల దృష్టి అటు మళ్ళివుండేది. (నల్ల కుబేరులపై యుద్ధం అంటూ ఓ పక్క చెబుతూ ఆ నోటితోనే  రెండువేల కొత్త నోటు తెస్తున్నట్టు  చెప్పేసరికి అసలు  విషయం జావకారి పోయింది, లేనిపోని అనుమానాలకు ఆస్కారం ఇచ్చినట్టయింది.)
ప్రధాని తన ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించి, గత పన్నెండు రోజులుగా తీసుకుంటున్న అనేకానేక ఉపశమన చర్యలు గురించి ఆ రోజే ప్రస్తావించి వుంటే సామాన్య ప్రజల మనస్సుల్లో ఇంత గందరగోళం ఏర్పడి వుండేది కాదు. ప్రకటన దరిమిలా  మీడియాలో వస్తున్న  వార్తల ఆధారంగా స్పందిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వం కొత్త  నిర్ణయాలు ప్రకటిస్తూ, సవరిస్తూ పోవడం గమనించిన వారికి ప్రభుత్వం  చేసిన తప్పులు (పొరబాట్లు అనాలేమో) దిద్దుకుంటూ పోతోందన్న అభిప్రాయం కలిగింది. సరయిన విధంగా ముందు చూపుతో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అయిందన్న ఆరోపణలకు ఆస్కారం వుండేది కాదు.  నిర్ణయాన్ని సమర్ధించిన వారే  అమల్లో లోపాల గురించి ఇంతగా మాట్లాడాల్సిన అవసరమూ వచ్చేది కాదు. చర్చలు ఇంత సుదీర్ఘంగా జరిగేవీ కావు, ఇంత రచ్చ జరిగేదీ కాదు.
సరే! జరగాల్సింది  జరిగిపోయింది. నిర్ణయం  వెనక్కి తీసుకునే వీలులేదు. తడబడ్డ కాలునే  కూడదీసుకోవాలి. పైపంచ గాలికి యెగిరి ముళ్ళకంచెపై పడినప్పుడు అది చిరిగిపోకుండా జాగ్రత్తగా బయటకి తీయాలి. దీనికి చాలా సంయమనం కావాలి. మనసు నిగ్రహంగా వుంచుకోవాలి. రాజకీయంగా వచ్చే విమర్శలను ఎదుర్కునే క్రమంలో, ఆవేశకావేశాలతో తీసుకునే నిర్ణయాలు, వ్యాఖ్యలు  మరింత గందరగోళానికి దారితీస్తాయి. ఇది మోడీ అభిమానులకీ, దురభిమానులకీ, వ్యతిరేకులకీ కూడా వర్తిస్తుంది.
ఈ నిర్ణయంలో నిజంగా ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేకపోతే ఎవరికీ భయపడాల్సిన అవసరం కానీ, ఎవరినీ భయపెట్టాల్సిన అగత్యం కానీ వుండదు.
ఇప్పుడు బంతి పూర్తిగా  సర్కారు దగ్గరే వుంది. అది స్పష్టంగా కానవస్తోంది.
పొతే, మోడీ ప్రభుత్వ నిర్ణయం గురించి అనుకూలంగా, ప్రతికూలంగా ప్రతిరోజూ అనేక వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఏ నిర్ణయం కూడా నూటికి నూరుపాళ్ళు సరయినదని చెప్పే వీలులేదు. అలాగే ప్రతి నిర్ణయాన్నీ తప్పులతడకగా కొట్టేయడం కూడా  సబబు కాదు. ఈ రెండు వాదనలు అర్ధసత్యాలే. అది వివరించడానికే ఈ ప్రయత్నం. ముందు అనుకూలుర వాదన విందాం.
 “పెద్ద నోట్ల రద్దువల్ల మొట్టమొదట కనబడే ఫలితాలు నిరాశనే కలిగిస్తాయి. అయితే అది తాత్కాలికం. పరిణామాల క్రమం వేరుగా వుంటుంది.
“బ్యాంకుల్లో కరెన్సీ నిల్వలు తగ్గిపోతాయి. నగదు చేతిలో ఆడకపోవడం వల్ల వస్తువుల కొనుగోళ్ళు మందగిస్తాయి. రియల్ ఎస్టేట్, బంగారం వ్యాపారం మీద తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడతాయి.
“సక్రమ మార్గంలో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఖర్చుకు సందేహిస్తారు.  ఇక అక్రమ మార్గాల్లో డబ్బు పోగేసుకున్నవారి సంగతి చెప్పక్కర లేదు. అలాంటి  కరెన్సీని ఏదో విధంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తారు. విఫలం అయితే  ఆ డబ్బు చిత్తు కాగితాలకిందే లెక్క.  వాస్తవానికి  ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు  ప్రజల దగ్గర వున్న ప్రతి నోటు  ప్రభుత్వానికి భారమే.  ఇప్పుడు లెక్కకు రాని, లెక్క చెప్పలేని  అలాంటి నోట్ల భారం ప్రభుత్వానికి గణనీయంగా తగ్గిపోతుంది. ప్రభుత్వ ఖాతాలో మొదట పడే  లాభం ఇదే. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన కొత్త వెసులుబాటును ఉపయోగించుకుని  తమ దగ్గర వున్న లెక్క చెప్పని సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే మళ్ళీ ఆ మొత్తంలో అధిక భాగం పన్ను రూపంలో ప్రభుత్వ ఖజనాకే చేరుతుంది.
“ఇలా సమకూడిన డబ్బుతో  ఒక ఏడాది ద్రవ్య లోటు పూర్తిగా తీరిపోగలదని ఓ అంచనా. మొదటి ఆరుమాసాలకాలంలో జీడీపీ  పెరుగుదల రేటు క్షీణించి నప్పటికీ ఆ తరువాత రెండేళ్ళు  బాగా పుంజుకుంటుందని కొందరు ఆర్ధిక వ్యవహారాల నిపుణులు పేర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టగలదని, రియల్ ఎస్టేట్ రేట్లు భూమార్గం పట్టగలవని ఆశావాదుల ఊహాగానం. పెద్ద నోట్ల రద్దు దరిమిలా ఏడెనిమిది లక్షల కోట్ల విలువైన కొత్త చట్టబద్ధమైన కరెన్సీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరడం మూలాన దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం కాగలదని వారు చెబుతున్నారు. ముందు దెబ్బతిన్న రియల్ ఎస్టేట్, బంగారు ఆభరణాల వ్యాపారం  ఆ  తరువాత అరుమాసాల కాలంలో మళ్ళీ  స్థిరత్వం పొందగలవని, ఆందోళనకు ఆస్కారం లేదనీ వారు భరోసా ఇస్తున్నారు. నల్ల డబ్బు చెలామణీ బాగా తగ్గిపోవడం వల్ల బంగారం కొనుగోళ్ళపై  ప్రభావం వుండే అవకాశం ఉండవచ్చు. అయినా కానీ నల్ల ధనాన్ని దాచుకోవడానికి బంగారం అనేది మంచి ప్రత్యామ్న్నాయం కాబట్టి బంగారం వ్యాపారానికి ముప్పు ఏమీ వుండకపోవచ్చని మరో అంచనా. నగదు మార్పిళ్లు తక్కువ కావడం వల్ల కార్పొరేట్ సంస్థలు లాభపడతాయి. కొత్తగా ప్రవేశపెట్టిన రెండువేల కరెన్సీ నోటు కారణంగా  మళ్ళీ నల్ల ధనం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందా లేదా అనే ప్రశ్న మిగిలే వుంటుంది. అయితే, పెద్ద నోట్ల చెలామణీ రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం నల్ల కుబేరుల మనస్సులో కలిగించిన అలజడి మరికొంత కాలం అలాగే వుండిపోతుందనీ, తిరిగి నల్ల ధనం కూడబెట్టుకునే ధైర్యం చేయకపోవచ్చనీ   ఆ ప్రశ్నకు జవాబు చెబుతున్నారు.”
సరే! ఇదంతా నాణేనికి ఒక వైపు.
రెండో వైపు వాదన దీనికి పూర్తిగా విరుద్ధం. వాళ్ళు చెప్పేదేమిటో చూద్దాం.
“పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల పెద్ద ప్రయోజనం లేకపోగా నష్టం ఎక్కువ. ప్రధానమంత్రి మోడీకి ఈ విషయంలో సరయిన సలహా ఇచ్చినట్టు లేరు. రాబోయే పరిణామాలను ముందుగా ఊహించి తగిన జాగ్రత్తలు చెప్పినట్టు లేదు.
“నిర్ణయం సమర్ధకులు చెబుతున్నట్టు నల్ల ధనం అంటే కేవలం కరెన్సీ నోట్లు కాదు. నిజం చెప్పాలంటే అన్ని కరెన్సీ నోట్లు బ్లాక్ మనీ కాదు. ప్రతి నోటు తెల్లధనం కిందికే వస్తుంది. కరెన్సీ నోటు ఎవరి దగ్గర వున్నదీ అన్నదాన్ని బట్టి దాని రంగు మారుతుంది. ఉదాహరణకు ఒక కరెన్సీ నోటు పన్నులు కట్టని వ్యక్తి వద్దకు చేరితే అది నల్ల ధనం అవుతుంది. తిరిగి అదేనోటు పన్ను చెల్లించే వ్యక్తిదగ్గరకు చేరితే అదే డబ్బు తెల్ల ధనంగా మారుతుంది. ఈ విధాన లోపాన్ని గుర్తించి సరిచేయకుండా మొత్తం కరెన్సీని రద్దు చేయడం సరికాదు.
“నల్లధనం సంపన్నుల దగ్గర వుందని నమ్ముతున్న ప్రభుత్వం ఎక్కువ నగదు మార్పిళ్ళతో జీవితం గడిపేవాళ్ళు అతి పేదవారనే వాస్తవాన్ని విస్మరిస్తోంది. వారిలో 90% మంది కరెన్సీ చెల్లింపుల ద్వారానే జీవన యానం సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ చర్య వల్ల వారివద్ద డబ్బు లేకుండా పోయింది. సమాజంలో నగదు చెలామణీ తగ్గిపోవడంతో దాని ప్రభావం వర్తక వాణిజ్యాలపై పడుతోంది. అవి పూర్తిగా మందగించాయి.
“కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ ఖర్చు పది,పదిహేనువేల కోట్ల రూపాయల వరకు వుండొచ్చని అంచనా. ఇదంతా ప్రభుత్వానికి దండగ ఖర్చే.
“రానున్న కొద్ది మాసాల్లో బ్యాంకుల కార్యకలాపాలు పూర్తిగా స్తంభిస్తాయి. నోట్ల మార్పిడి, డిపాజిట్ల స్వీకరణ, వచ్చిన జనాలను అదుపు చేయడం, సముదాయించడం వీటితోనే సరిపోతుంది. ఫలితం ఆర్ధిక వ్యవస్థపై నేరుగా పడుతుంది. మార్కెట్లో నగదు నిల్వలు తగ్గిపోతాయి. వ్యాపార లావాదేవీలు తగ్గి పన్నుల రూపంలో ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం క్షీణిస్తుంది.
“ప్రజలవద్ద నగదు లేకపోవడంతో ద్రవ్యోల్బణం తగ్గిపోతుంది. ధరలు తగ్గినా కొనుగోలు చేయడానికి జనం దగ్గర డబ్బులు వుండవు. కనీసం కూరగాయలు కొనగల స్థోమత కూడా ఉండకపోవచ్చు.
“నోట్ల రద్దు అనేది చాలా ప్రమాదకరమైనది. అత్యంత తప్పనిసరి పరిస్తితుల్లో మాత్రమే ప్రయోగించాల్సిన ఈ బ్రహ్మాస్త్రాన్ని ఆషామాషీగా ఉపయోగిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా వుంటాయి.”
ఈ రెండు వాదనలు ఒకే నాణేనికి బొమ్మా బొరుసూ. అసలు సంగతి ఈ  రెంటి నడుమా వుంది. వాదప్రతివాదాలు చేసేవారికి ఈ విషయం తెలియకపోలేదు. కానీ అభిమాన దురభిమానాలు అలానే వాదించేలా చేస్తాయి. వీటికి  రాజకీయం కూడా తోడయితే ఇక చెప్పేదేమీ వుంటుంది?  
నిర్ణయం మంచిదే, అమలే ఇబ్బందిగా మారిందని కదా మన్మోహన్ సింగ్ నుంచి మామూలు మనిషి వరకు మనసులో అనుకునే మాట.  నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించలేదు, సరయిన కసరత్తు చేయలేదని కదా అందరం అంటున్నది. మనలో చాలామందిమి ఈ  నల్ల ధనంతో సంబంధం లేనివాళ్ళమే. అయినా కొన్ని ఇబ్బందులు తప్పవు. మరి ఒకటో తారీఖు వచ్చేస్తోంది. మనమన్నా కాస్త ముందు చూపుతో మనకు ఎలాటి ఇబ్బందులు ఎడురవుతాయో కాస్త ఊహించుకుందామా! ఇబ్బందులు పూర్తిగా తొలగక పోయినా కాసింత మానసిక ఉపశమనం అన్నా లభిస్తుందేమో చూద్దాం.
మా ఆవిడను అడిగితే మొదటి వారంలో ఎదురుకాగల కొన్ని సమస్యలు చెప్పింది. పనివాళ్ళ జీతం,  పాలవాడి బాకీ, పేపరువాడి బిల్లు. ఇలా అన్నమాట. బ్యాంకులో డబ్బు వున్నా బయటకి వచ్చే వీలులేదు. చేతిలో డబ్బులు రేపోమాపో అయిపోయే బాపతు. వాళ్లకి బ్యాంకు ఖాతాలు లేవంటున్నారు. మరి ఏమిటి పరిష్కారం.
ఒకటే పరిష్కారం. రాజకీయాలు తగ్గించి ఒక పద్దతిగా  చర్చించుకోవడం. అందరం ఒక పడవలోని ప్రయాణీకులమే కాబట్టి నిజాయితీగా మాట్లాడుకోవడం. రెచ్చగొట్టే చర్చల వల్ల ప్రయోజనం శూన్యం. (26-11-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595    


కామెంట్‌లు లేవు: