12, జూన్ 2016, ఆదివారం

నాహం కర్తా, హరి: కర్తా


గతంలో టీటీడీ ఈవో గా, ప్రధానమంత్రి పీవీ గారికి సమాచార సలహాదారుగా పనిచేసిన పీవీఆర్ కే ప్రసాద్ గారు తమ తిరుపతి అనుభవాలపై రాసిన గ్రంధం ఇది. తిరుపతి వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరూ తమకు చక్కటి దైవ దర్శనం లభించిందని తమ చుట్టపక్కాలతో చెబుతుంటారు. అయితే ఎవరికి ఎలాంటి దర్శన భాగ్యం ఇవ్వాలో స్వామే నిర్ణయిస్తారని, ఎవరు ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా చివరికి స్వామి నిర్ణయమే చెల్లుబాటు అవుతుందనీ ప్రసాద్ గారు ఈ పుస్తకంలో అనేక ప్రమాణాలు చూపించారు.
అది నిజమే అనిపించింది, తన అరవయ్యవ పెళ్లి రోజున స్వామి ఆశీస్సులు తీసుకోవడం కోసం తిరుపతి వెళ్ళివచ్చిన మా అన్నయ్య భండారు రామచంద్రరావు  చెప్పిన అనుభవాలు వింటుంటే.  మా అన్నగారి మాటల్లోనే ఆ కధనం విందా.
“నా అరవయ్యవ పెళ్లిరోజు జూన్ పదో తేదీ. ఆ రోజున తిరుమలలో స్వామి వారి  దర్శనం చేసుకోవాలని నా ప్రగాఢ వాంఛ. అందుకని, ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను చాలా  ముందుగా చేసుకున్నాను. మాది పెద్ద కుటుంబం. నలుగురు పిల్లలు, నలుగురు కోడళ్ళు, మనుమడు, మనుమరాళ్ళు. హైదరాబాదులో ఉంటున్న పిల్లలే కాకుండా అమెరికాలో ఉంటున్న మా చిన్న కొడుకు కూడా భార్యా పిల్లలతో ఈ సందర్భంకోసం వచ్చారు.  మూడు నెలల క్రితమే రైలు టిక్కెట్లు, తిరుమలలో కాటేజీలు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నాము. సిఫారసులు చేయించుకోలేని అనేకమంది యాత్రీకులకి ఈ ఆన్ లైన్  బుకింగులు ఓ వరప్రసాదం అనే చెప్పాలి. పదో తేదీ సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లు పదహారు మేము ఈ విధంగానే కొనుక్కోగాలిగాము.
ముందు అనుకున్న విధంగానే మేము రైల్లో బయలుదేరి పదో తేదీ ఉదయానికి తిరుపతి చేరుకున్నాము. స్టేషన్ బయటకు వచ్చి మేము కొండకు పోవడానికి కార్లు  ఎక్కుతున్న సమయంలో నా జేబులో సెల్ ఫోన్ మోగింది. తీసి చూద్దును కదా, టీటీడీ జేయీవో ఆఫీసునుంచి. పదకొండో తేదీ ఉదయం మా దంపతులు ఇరువురికీ బ్రేక్ దర్శన్ టిక్కెట్లు ఎలాట్ చేసినట్టు అవతలనుంచి  ఓ ఉద్యోగి చెప్పాడు. కలా, నిజమా అని ఆశ్చర్యపోతుంటే అతడు ఇంకో విషయం చెప్పాడు. మా మేనకోడలి భర్త  జ్వాలా నరసింహారావు రిఫరెన్సుతో బ్రేక్ దర్శన్ ఏర్పాటయిందన్నది అతడి మాటల్లో నాకు అర్ధం అయింది. బహుశా మా పెళ్లిరోజు కానుకగా  ఆయన హైదరాబాదునుంచి ఈ ఏర్పాటు చేసివుంటాడు. నిజం చెప్పాలంటే ఈ సందర్భానికి ఇంతకు  మించిన బహుమతి ఏముంటుంది. అందులో పొద్దున్న పేపరు చూస్తె తిరుమల కొండ భక్తులతో నిండిపోయిందనీ, క్యూ లైన్లు వైకుంఠం కాంప్లెక్స్ అవతల కిలోమీటర్ల మేర దాటిపోతున్నాయనీ వార్తలు. అంతే కాకుండా సహస్ర కలశాభిషేకం కారణంగా పదకొండు ఉదయం బ్రేక్ దర్శన్ రద్దు చేసారని కూడా రాసారు. ఈ నేపధ్యంలో ఈ ఫోను. ఇది జరగడానికి కారణం నాకోసం జ్వాలా చేసిన ప్రయత్నమే, అందులో సందేహం లేదు. అందుకే జేఈవో ఆఫీసువాళ్ళు కూడా ఆయన పేరే చెప్పారు. జ్వాలాకు  వెంటనే ఫోను చేసాను. అయన అన్నాడు, మానవ ప్రయత్నాలు మనం ఎన్ని చేసినా చివరికి దర్శనం అనుగ్రహించడం అనేది ఆ స్వామి చేతుల్లోనే ఉంటుందన్నాడు.
ఏదిఏమైనా  బ్రేక్ దర్సనం టిక్కెట్లు జారీ చేయడం నిలిపివేసిన రోజున అవి దొరకడం  ఒక అద్భుతమే. జ్వాలా అన్నట్టు అది స్వామి దయే!
దేవుడు వరం అనుగ్రహించేముందు కొన్ని  పరీక్షలు పెడతారంటారు. అదే జరిగింది. ఉత్త పరీక్ష అయితే పరవాలేదు, ఏకంగా విషమ పరీక్షే పెట్టాడు.
బ్రేక్ దర్శన్ కోసం దంపతులం ఉభయులం పదకొండో తేదీ ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకల్లా వైకుంఠం కాంప్లెక్స్ వద్ద వుండాలి. మేమున్న కాటేజీ అక్కడికి దగ్గరే, కాబట్టి ఆ టైముకల్లా తేలిగ్గా చేరుకోవచ్చు. ఆ ధిలాసాతో బయలుదేరిన మాకు దోవలోనే పెద్ద అవాంతరం ఎదురయింది. దోవదోవంతా యాత్రీకులే. కారు కదలడానికి వీల్లేకుండా రోడ్డంతా భక్త జన సందోహమే. నేను అనేక సార్లు తిరుపతి వెళ్లాను కానీ, కొండ మీద అంత పెద్ద సంఖ్యలో యాత్రీకులను చూసిన జ్ఞాపకం లేదు. ఒక పక్క టైం దగ్గర పడుతోంది. మరో పక్క మేము ఎక్కిన కారు ముందుకు కదిలే పరిస్తితి లేదు. ఎట్లాగో కాంప్లెక్స్ చేరుకునే సరికి పుణ్యకాలం కాస్తా అయిపోయింది. ఎనిమిదిన్నర కావడంతో గేటుకు తాళం వేసారు. అనుకోని దర్శన భాగ్యం బ్రేక్ టిక్కెట్ల వల్ల దొరికినట్టే దొరికి చేజారి పోవడంతో నీరసపడిపోయాము. అక్కడి టీటీడీ సిబ్బందిని ప్రాధేయ పడ్డాను. ఈరోజు మా పెళ్లి రోజనీ, బ్రేక్ టిక్కెట్లు చేతిలో వున్నా వెళ్ళలేకపోతున్నామనీ వివరించాను. అయినా ఫలితం కనబడలేదు. సర్వ దర్శనం క్యూ ఒదిలారనీ, ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదనీ వారు తమ నిస్సహాయత వ్యక్తం చేసారు. అయితే,  బ్రేక్ దర్శన్ అవకాశం వుండికూడా అది వాడుకోలేని మా అసహాయత వారిని కరిగించింది. మమ్మల్ని సర్వ దర్శనం క్యూలో ఒదలడానికి ఒప్పుకున్నారు. సరే అని అందులో కలిసాము. ఇక అక్కడి పాట్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ తోపులాటలోనే గర్భగుడిలో ప్రవేసించాము. అక్కడి వారిని మళ్ళీ చేతులు పట్టుకుని అడిగాను, కొద్దిలో మాకు బ్రేక్ దర్శన్ భాగ్యం చేజారి పోయిందని. కానీ వారికెవ్వరికీ మా గోడు పట్టించుకునే తీరికలేదు. అలాగే స్వామివారిని లఘు దర్శనం చేసుకుని బయటపడ్డాము.
విచారవదనాలతో వున్న  మమ్మల్ని ఓ టీటీడీ  ఉద్యోగిని గమనించింది. వివరం అడిగింది. కధంతా చెప్పాను. ఆవిడ జాలిపడి గుడిలోపల వున్న  సూపర్నెంటు వద్దకు తీసుకు వెడతాను, తరువాత మీ  అదృష్టం అంది.  అన్నట్టే తీసుకు వెళ్ళింది. లోపలకు వెళ్ళిన తరువాత ఆ పెద్దాయనతో విషయం చెప్పాను. ఈ రోజు మా అరవయ్యవ పెళ్లి రోజనీ, బ్రేక్ టిక్కెట్లు ఉపయోగ పడలేదనీ చెప్పాను. ఆ మహానుభావుడు  ఏ కళన ఉన్నాడో కాని నా గోడు విన్నాడు. అదే స్వామి మహత్యం అంటే. అంతకు ముందు అరడజను మందిని కలిసి వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈయన మమ్మల్ని ఇద్దర్నీ వెంటబెట్టుకుని మళ్ళీ గర్భ గుడిలోకి తీసుకు వెళ్ళాడు. తీసుకు వెళ్లి  స్వామి ఎదుట నిలబెట్టి దర్శనం చేయించాడు. మీ ప్రార్ధన మీరు చేసుకోండి అని మమ్మల్ని అక్కడ ఒదిలేసాడు. హడావిడి పెట్టి మమ్మల్ని పొమ్మనలేదు. గుడి ద్వారం గడప అవతల అభయ హస్తం చూపిస్తూ స్వామివారు.  ఇవతల అటువంటి  అద్భుత దర్శనానికి వీలుకల్పించిన ఆ  అధికారి.  ఇన్నిరోజులుగా మంచి దర్శనం అనుగ్రహించమని మేము చేస్తున్న ప్రార్ధనలను స్వామి  ఆలకించారు. ఈ అధికారి రూపంలో వచ్చి మాకు  ఆ అవకాశం కల్పించారు. దైవం మానుష రూపేణ అన్నారు, అందుకే..
పీవీఆర్ కే గారు  చెప్పింది అక్షర సత్యం.

నాహం కర్తా, హరి:కర్తా...... “  






8 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

ప్రొద్దున్నే నాలుగు గంటలకు లేచి.... శ్రీవారి మెట్లదారిలో 2500 మెట్లు ఎక్కి ..దివ్య దర్శనం క్యూలో ఉదయం 11 గంటలకు చేరితే ....3 గంటలవరకూ బందిలదొడ్లో వేసినట్లు వేసి .....ఇంత చిప్పకూడు పడేసి ...లోకేష్ కొడుకు అన్నప్రాసన కారణంగా రాత్రి 9 గంటలవరకూ దర్శనం నిలుపుజేస్తే ....సహనం నశించి... ఊరంతా అప్పులు చేసి ఇద్దరి పెళ్ళాల మధ్య నలిగిపోయి రాయిలాగా మారిన నీకు నీహారిక మొహం చూసే యోగ్యత కోల్పోయావు అనేసుకుని.... ఇదొక ధార్మిక సంస్థా లేక జైలా అని క్యూలోనుండి వెనక్కి వచ్చేసి సరాసరి తిరుపతికెళ్ళిపోయాను.

మీడియా లేదా ప్రజాప్రతినిధులకు మాత్రమే దొరికే దేవుడు నాకు అక్కరలేదు. 10 సం రాల తరువాత తిరుమల దాకావెళ్ళి దర్శనం చేసుకోకుండా వచ్చినదానిగా చెపుతున్నా ప్రజలసొమ్ము విద్య, వైద్యాలకి ఉపయోగపడకపోయినా కనీసం తిరుమలలో సౌకర్యాల మెరుగుకు కూడా ఉపయోగపడకపోవడం మాత్రం నేరం !

అహం బ్రహ్మస్మి !

శ్యామలీయం చెప్పారు...

కం. నేడుండి రేపు పోయెడి
చేడియ నీ మొగము చూడ శ్రీపతి యోహో
కాడా యోగ్యుడు చిత్రము
లాడెదు నీ‌ దరిశనంబు నతడెపు డడిగెన్

అజ్ఞాత చెప్పారు...

neeharika. you go again with atonement. you will get darshan.

నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
నీహారిక చెప్పారు...

Thanks Annonymous, we didn't preplanned,the next day we have another programme so we returned. May be it is true that I am not eligible for Darshan.

శ్యామలీయం చెప్పారు...

భండారువారూ, నీహారికగారి వ్యాఖ్యపై నా స్పందనకు ప్రతిస్పందనగా నీహారిక గారు వ్రాసినది సభ్యతాపరిధులను అతిక్రమించింది. దయచేసి 13 జూన్, 2016 9:06 [AM] సమయముద్రాంకితమైన ఆవిడ ప్రతిస్పందనను తొలగించండి. అనారోగ్యకరమైన వాతావరణాన్ని మీరు ప్రోత్సహించరని ఆశిస్తున్నాను.

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.