21, నవంబర్ 2015, శనివారం

సమాజంపై టీవీ ప్రభావం

(నవంబర్, 21, ప్రపంచ టెలివిజన్ దినోత్సవం)

సూటిగా.........సుతిమెత్తగా.......

ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం కాదు హింసాయుగం.
'ఎందెందు వెదికిచూసిన అందందే శ్రీహరి కనిపిస్తాడని' ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడితో అంటాడు. కానీ హింస కోసం అలా వెతకాల్సిన పని కూడా లేదు.
హింస ఎక్కడ లేదు? నగరాల్లో, గ్రామాల్లో, ఇళ్ళల్లో, వీధుల్లో, మాటల్లో, చర్చల్లో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా  హింస విలయతాండవం చేస్తోంది. అంతెందుకు, సినిమాల్లో చూపిస్తున్న హింస నేరుగా టీవీల ద్వారా  డ్రాయింగ్ రూముల్లోకి, అక్కడినుంచి ఎకాయెకిన ఇంటిల్లిపాదీ మెదళ్ళలోకీ  జొరబడుతోంది. విశ్వవ్యాప్తంగా అల్లుకుపోయిన టెలివిజన్ చానళ్ళ వల్ల మంచి ఏమీ జరగడం లేదా అంటే పూర్తిగా అవునని కానీ కాదని కానీ చెప్పలేని పరిస్తితి. 
పదేళ్ళక్రితం  అమెరికా వెళ్లాను. మన దగ్గరినుంచి వెళ్లి అక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్న అనేకమంది తెలుగు పిల్లలు కనిపించారు. మీ ఈఅభివృద్దికి కారణం  ఏవిట’న్న నా ప్రశ్నకు వాళ్ళు చెప్పిన సమాధానాలలో ఒకటి ఈనాటి అంశానికి సంబంధించినది  వుంది. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు క్రమం తప్పకుండా (అలనాటి) దూరదర్శన్ లో  క్విజ్ ప్రోగ్రాములు చూసే వాళ్ళమనీ,  తద్వారా పొందిన మానసిక వికాసం  తరువాత జీవితంలో తమకు అక్కరకు వచ్చిందనీ  వాళ్ళు చెప్పారు. 
టీవీల వల్ల పాజిటివ్  ఎఫెక్ట్  ఉంటుందనడానికి దీన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. 
లాహోర్ లో  ఇన్ష్టిట్యూట్ ఆఫ్ బిజినెస్  ఎడ్మినిస్ట్రేషన్  లో చదువుకునే విద్యార్ధులు  ఒక పరిశోధనా పత్రం ఒకటి రూపొందించారు. పిల్లల మీద  ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం అన్న అంశంపై  వారు పరిశీలన  జరిపారు. వాళ్ళ లెక్క ప్రకారం-
అక్కడి పిల్లల్లో,
పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళు రోజుకి రెండుగంటలు టీవీ చూస్తారట.  అరగంటపాటు హోం వర్క్ చేసుకుని, ఓ గంట టీవీ గేమ్స్  చూస్తారట. 
ఓ యిరవయి నిమిషాలు  రేడియో వింటారు. మరో యిరవయి నిమిషాలు పుస్తకాలు చదవడానికీఓ గంట ఆటలకీరెండున్నర గంటలు స్నేహితులతో ముచ్చట్లకీ  ఖర్చు చేస్తారని తేలింది. 
మరో ఆసక్తి కరమయిన విషయం ఏమిటంటే, చాలామంది పిల్లలు టీవీ తమకు సెకండ్ పేరెంట్ లాంటిదని చెప్పారు. టీవీ వల్ల  ఇమాజినేటివ్ పవర్ (ఆలోచించే సామర్ధ్యం)  పెరుగుతుందన్నారు. సృజనాత్మకత మెరుగుపడుతుందన్నారు.  కొత్త భాషలు, సరికొత్త  పదాలు నేర్చుకోవచ్చన్నారు. అదేసమయంలో వాళ్ళు మరో మాట కూడా చెప్పారు. పేద పిల్లలు టీవీల  వల్ల నష్టపోతున్నారన్నారు. అలాగే పెద్దల నుంచి వేధింపులకు గురయ్యే పిల్లలు, టీవీలు చూసి హింసా మార్గం పడుతున్నారనిదౌర్జన్యకారులుగా తయారవుతున్నారనిచదువులో వెనకబడుతున్నారని వెల్లడించారు.
ఈ పరిశోధన చేసిన విద్యార్ధులు కొన్ని విలువయిన సూచనలు కూడా చేశారు. బెడ్ రూముల్లో టీవీలు ఉండకూడదన్నారు. వాణిజ్యపరంగా నిర్వహించే టీవీ చానళ్ళను అదుపుచేసే విధానం వుండాలన్నారు. పిల్లలు చూసే టీవీ  కార్యక్రమాలపై  పెద్దలు ఓ కన్నేసి వుంచాలన్నారు. 
భారత రాజ్యాంగంలోని  యిరవై ఒకటవ అధికరణం ప్రజలందరికీ  జీవించే హక్కు ఇచ్చింది. రైట్  టు లివ్ విత్ డిగ్నిటి అంటే హుందాగాగౌరవంగా జీవించే హక్కు కూడా ఈ అధికరణం పౌరులకు కల్పిస్తోందని , గతంలో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.  టీవీల్లో మహిళలని అసభ్యంగా చూపించడం  రాజ్యాంగంలోని   ఆర్టికిల్ కి విరుద్ధం. కానీ అనేక టీవీ ఛానళ్ళు  దీన్ని పట్టించుకున్న దాఖలా  లేదు.
వంటలు, ఆరోగ్యం, విద్య – ఈ అంశాలమీద  చాలా ఛానళ్ళు అనేక చక్కటి ప్రోగ్రాములు అందిస్తున్నాయి. వీక్షకుల స్పందన కూడా వీటికి బాగా వుంది. మంచి సంగతులు సరే. చెడు ప్రభావం తలచుకుంటేనే భయపడాల్సి వస్తోంది. ఆడవాళ్ళల్లో, ముఖ్యంగా గృహిణుల్లో చాలామందికి టీవీ చూడడంతోనే సమయం సరిపోతోంది. సరయిన వ్యాయామం లేక ఊబకాయం సమస్యలు తలెత్తుతున్నాయి.  ఆకర్షణీయమయిన టీవీ ప్రకటనలు చూసే పిల్లలు జంక్ ఫుడ్స్ కి అలవాటుపడుతున్నారు. పత్రికల్లో ఇలాంటి ప్రకటనలు మామూలే కదా అనవచ్చు. కానీ నిరక్ష్యరాస్యులపై వాటి ప్రభావం అంతగా వుండదు. టీవీల యుగం వచ్చాక చదువుతో నిమిత్తం లేదు. వాటిని చూసి  కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు. కన్స్యూమరిజం బాగా ప్రబలడానికి  ఈ డ్రాయింగ్ రూం  టీవీలే  కారణం. ఇన్ని రకాల టీవీలు లేని రోజుల్లో పల్లెటూళ్ల లోని  ఆడవాళ్ళకు అనేక రకాల కాలక్షేపాలు ఉండేవి. కుట్లు. అల్లికలుసంగీతం  అలా ఏదో ఒక   ప్రయోజనకరమయిన వాటితో పొద్దు పుచ్చుకునేవాళ్ళు. ఇప్పుడో,  సీరియళ్లు చూస్తూ  వాటిపై   చర్చోపచర్చలు చేసుకోవడంతోనే  సరిపోతోంది. పిల్లలని  చూడడానికి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడి సీరియల్ ఏమయిపోతోందో అని బెంగ పడుతున్నారని వింటుంటే  వాటికి ఎంతగా అలవాటు పడిపోయారో సులభంగా  అర్ధం చేసుకోవచ్చు. 
ఒక సూర్యుండు సమస్త జీవులకు  తానొక్కొక్కడయి తోచు  చందాన,  ఈ నాడు  ప్రయివేటు టీవీ   ఛానళ్ళు కుటుంబంలో ప్రతిఒక్కరికీ  కావాల్సిన కార్యక్రమాలను నేత్రానందంగా  తయారుచేసి అందిస్తున్నాయి. కొన్నిసందర్భాలలో ఇవి కుటుంబ సభ్యుల నడుమ పొరపొచ్చాలకు  కూడా కారణమవుతున్నాయి. దానితో ఎవరికి వాళ్ళు తమ విభవం కొద్దీ ఎవరి గదుల్లో వాళ్ళు విడిగా టీవీ సెట్లు ఏర్పాటుచేసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య అసలే అంతంత మాత్రంగా వున్న 'మాటా మంతీదీనితో నామమాత్రంగా మారిపోయింది. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే  'గెస్టులు' గా తయారవుతున్నారు. ఇరుగు పొరుగు, చుట్టపక్కాలతో సంబంధబాంధవ్యాలు  కనుమరుగవుతున్నాయి. టీవీ చూస్తున్న సమయంలో ఫోన్ వస్తే సమాధానం  చెప్పేవారే కరువవుతున్నారు. 
ఇక అశ్లీల కార్యక్రమాలను గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 
అశ్లీలాన్ని అరికట్టే  సదాశయంతో  రూపొందించే  ప్రోగ్రాములే అశ్లీల దృశ్యాలతో నిండిపోతున్నాయి. 
ఒక్క మాటలో చెప్పాలంటే, తీరిక పుష్కలంగా ఉన్నవాళ్ళకోసం ఛానళ్ళు  తీరిక లేకుండా  పనిచేస్తున్నాయి. 
అలా అని టీవీ చానళ్ళ వల్ల ఎలాటి ప్రయోజనాలు లేవనే నిర్ధారణకు రావడం కూడా సబబు కాదు. సమకాలీన రాజకీయాలపట్ల సాధారణ ప్రజల్లో అవగాహన పెరగడానికి టీవీలు దోహదం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. పాతిక ముప్పయ్యేళ్ళ క్రితం అక్కడక్కడా అరుదుగా కానవచ్చిన టీవీలు ఈనాడు తామరతంపరగా దేశం నలుదిక్కులా అల్లుకుపోయాయి. ఇంతటి విస్తృతి కలిగిన ప్రసార మాధ్యమం కాబట్టే టీవీల ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీలులేకుండా పోతోంది.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోను కలిపి వేల సంఖ్యలో టీవీ నెట్ వర్కులు పనిచేస్తున్నాయి. పలు దేశాల్లో టీవీ చానళ్ళ సంఖ్య వేళ్ళమీద లెక్కపెట్టే దశను దాటిపోయింది. బహామాస్, అంటార్కిటికా, ఆండోరాలలో మాత్రమే ఒకే ఒక టీవీ ఛానల్ చొప్పున వుంది. మనదేశం సంగతి, అందులో రెండు తెలుగు రాష్ట్రాల సంగతి చెప్పనక్కర లేదు. దేశంలో రెండేళ్ళ నాటి గణాంకాల ప్రకారం 1148 టీవీ ఛానళ్ళు పనిచేస్తున్నాయి. వీటిల్లో వందకు పైగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. అమెరికాలో సగటున రోజుకు సుమారు నాలుగు గంటలు టీవీ చూస్తుంటే మన దగ్గర రోజుకు టీవీ చూసే సమయం సగటున దానికి రెట్టింపు ఉంటోంది. జనాభా ఎక్కువ కావడం, వారిలో సరయిన పని లేని వాళ్ళ సంఖ్య  కూడా ఎక్కువగా వుండడం అందుకు కారణంగా చెబుతున్నారు. మనకంటే జనాభా ఎక్కువ వున్న చైనాలో సగటున టీవీ చూసే సమయం కొంచెం అటూ ఇటూగా రెండున్నర గంటలేనట. ఇదో వైచిత్రి. (21-11-2015)


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595         

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఇదివరకు ప్రతి ఇంటిలో ఒక రేడియో ఉండేది. రేడియో మోగుతూనే ఉన్నా, ఎవరిపనులు వాళ్ళు చేసుకుంటూనే కార్యక్రమాలు వినేవారు. ఇప్పుడు అదే అలవాటుతో టివి ఆపకుండా, సోఫాలకి శిలాజాల్లా అతుక్కుపోయి చూస్తున్నారు. ఇన్ని చానళ్ళు అవసరం లేదు. దూర్‌దర్శన్ ఒక్కటే ఉన్నప్పుడు మంచి కార్యక్రమాలన్నీ అందులోనే వచ్చేవి.