8, జనవరి 2014, బుధవారం

ఏం చేస్తే తెలంగాణా వస్తుంది?చదివి చెప్పండి అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమన్నా వుందా!
( 24-09-2011 తేదీ సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

‘విధులకు గైర్హాజరు అవుతే తెలంగాణా వస్తుందా?’ అని హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కోర్టు సిబ్బందిని ప్రశ్నించినట్టు పేపర్లలో వచ్చింది.

సకల జనుల సమ్మె జరుగుతున్నా రాష్ట్రంలో పాలన సజావుగా సాగుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మరో పక్క కితాబు ఇచ్చారు. ఇంకో అడుగు ముందుకు వేసి, వొత్తిళ్ళ ద్వారా కేసీఆర్ తాననుకున్నది సాధించాలనుకుంటే అదెలా కుదురుతుందని ఆమె ప్రశ్నించారు. పరిస్థితులు ప్రశాంతంగా వుండి తమకు అనుకూలంగా వున్నప్పుడే నిర్ణయాలు తీసుకుంటామని అన్నట్టు కూడా పత్రికల్లో వచ్చింది. 

రాష్ట్రంలో తెలంగాణా సాధనకోసం దాదాపు వారం రోజులనుంచి దశలవారీగా సకల జనుల సమ్మె సాగుతున్న నేపధ్యంలో వెలువడిన ఈ రకమయిన వ్యాఖ్యానాలకు ఎవరికి వారు తమదయిన రీతిలో భాష్యాలు చెబుతున్నారు. రేణుకా చౌదరి ఈ వ్యాఖ్యలు పార్టీ ప్రతినిధిగా కాకుండా వ్యక్తిగత హోదాలో చేశామని మరో రోజు సమర్ధించుకోవచ్చు. ఆ సంస్కృతి ఈ నాటి రాజకీయ నాయకులకు కొత్తేమీ కాదు. కానీ, సకలజనుల సమ్మె ఓ పక్క ఉధృతంగా సాగుతున్న సమయంలో, భావోద్వేగాలు బాగా పెచ్చరిల్లి వున్న తరుణంలో - ఈ రకమయిన వ్యాఖ్యలు వెలువడ్డాయంటే కొద్దో గొప్పో అధిష్టానం మద్దతు లేకుండా ఆమె తన మనసులోని భావాలు బయట పెట్టి వుంటారని అనుకోవడానికి లేదు.

సకల జనుల సమ్మె అనుకోకుండా మొదలయింది కాదు. దీనిని గురించి కడు వివరంగా ఉద్యమకారులు చాలా ముందస్తు సమాచారం ఇచ్చే దాన్ని మొదలు పెట్టారు. అయితే, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు తమ రివాజు ప్రకారం దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టులేదు. కానీ రాష్ట్రంలోని తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు ఇది మింగుడుపడని వ్యవహారంగా తయారయింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు విషయంలో పార్టీ కేంద్ర నాయకత్వం ఇతమిద్ధంగా తన విధానాన్ని స్పష్టం చేయకపోయినా, అంత సానుకూలంగా వెంటనే స్పందించే అవకాశాలు మృగ్యమని అప్పడప్పుడు ఢిల్లీ నుంచి వెలువడే ఈ మాదిరి ప్రకటనలు సంకేతాలు ఇస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణా విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచన ఏ తీరున వుందో టీఆర్ఎస్ నాయకులకు పూర్తిగా తెలియకపోయినా అది ఏ తీరున సాగుతున్నదో ఒక అవగాహనకు వచ్చినట్టు మధ్య మధ్య వారి నాయకులు చేసే ప్రకటనలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. సకల జనుల సమ్మె విజయవంతంగా, ఉధృతంగా సాగుతోందని బాజా భజాయించి చెప్పగల పరిస్థితులు వున్న నేపధ్యంలో మరోసారి కేసీఆర్ నిరాహారదీక్షకు పూనుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు వార్తలు వెలువడడం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఈ నెలాఖరులో హైదరాబాద్ వస్తున్నారు. ఆయన వచ్చి ఇక్కడి పరిస్తితులను అంచనావేసి పార్టీ అధినాయకురాలికి ఇచ్చే నివేదికే ఈ మొత్తం వ్యవహారంలో కీలకం కావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విచిత్రం ఏమిటంటే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఆజాద్ కు కొట్టిన పిండి. ఆయన హైదరాబాద్ పర్యటనలో కొత్తగా తెలుసుకుని నాయకురాలికి నివేదించే అంశాలు కొత్తగా ఏముంటాయన్న ప్రశ్నకు సమాధానం లేదు. సీమాంధ్ర నాయకులతో ఆయన ఇప్పటికే అనేకమార్లు సమావేశాలు జరిపారు. వారి అభిప్రాయాలు విన్నారు. తెలంగాణాకు సంబంధించి శ్రీ కృష్ణ కమిటీ నివేదికే సిద్ధంగా వుంది. రాష్ట్ర గవర్నర్ కూడా తన నివేదికలు ఎప్పటికప్పుడు పంపుతూనే వుండి వుంటారు. రాష్ట్రంలో పరిస్తితులను గురించి తాజా నివేదికలను కేంద్రానికి పంపుతుండడం గవర్నర్ల బాధ్యత కూడా. ఇన్ని వివరాలు సిద్ధంగా వున్నప్పుడు నిర్ణయం తీసుకోవడంలో జాగు చేస్తున్నారంటే ఢిల్లీ వారికి కావాల్సింది ఈ సంఖ్యలు, అంకెలు కాదని అర్ధమైపోతున్నది. వారికి కావాల్సింది మరో రెండేళ్ళ తరువాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవసరమయిన పార్లమెంటు సభ్యులను రాష్ట్రం నుంచి తగు మోతాదులో గెలిపించుకోవడానికి ఏమి చేస్తే సాధ్యపడుతుంది అన్నది మాత్రమే. తెలంగాణా ఇవ్వడం ద్వారా అది వీలుపడుతుందని తెలిసిన మరుక్షణం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పచ్చ జండా వూపుతుంది. ఇందులో సందేహం లేదు. మరో సంగతి. తెలంగాణా ఏర్పాటు ద్వారా వొనగూడే రాజకీయ లబ్ది పూర్తిగా తన ఖాతాలోకే రావాలని కూడా కాంగ్రెస్ కోరుకుంటే తప్పు పట్టాల్సింది ఏమీ వుండదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ దృక్కోణం నుంచే పావులు కదుపుతుంది. తెలంగాణా విషయంలో ఇంత తాత్సారానికి బహుశా ఇదే కారణం అయివుంటుంది. తీసుకోవాల్సింది రాజకీయ నిర్ణయం అయినప్పుడు ఉద్యమాల ద్వారా లక్ష్య సాధనకు పోరాడుతున్న పార్టీలను లెక్క చేయాల్సిన అవసరం ఏమిటన్నది వారి వ్యూహ కర్తల ఆలోచన కావచ్చు.

‘ఇలా’ చేయడంవల్ల తెలంగాణా వస్తుందా? అని ఎద్దేవాగా అడగడంలో బహుశా అంతరార్ధం ఇదేనేమో.

వెనకటికి ఇంట్లో అమ్ముమ్మలు పిల్లలకు చెప్పే కధల్లో ఓ ముసలమ్మ బావి గట్టుమీద కూర్చుని సూదిలో దారం ఎక్కిస్తుంటే సూది బావిలో పడిపోతుంది. ‘ఊ’ కొడుతూ కధ వింటున్న పిల్లలు ‘ఊ’ అంటారు. ‘ఊ’ అంటే వస్తుందా అని కధ చెప్పే అమ్ముమ్మ ప్రశ్న. అది అర్ధం కాని పిల్లలు ‘ఆ!’ అంటారు. ‘ఆ!’ అంటే వస్తుందా అని మరో ప్రశ్న. ఆ కధ ఎప్పటికీ పూర్తవదు, ఈ లోగా కధ వినే పిల్లలు ఎంచక్కా నిద్రలోకి జారుకుంటారు. (20-09-2011)

కామెంట్‌లు లేవు: