17, జనవరి 2014, శుక్రవారం

ప్లస్ లూ మైనస్ లూ


“కాంగ్రెస్ కి మైనస్ పాయింట్ రాహుల్. రాహుల్ కి ప్లస్ పాయింట్ కాంగ్రెస్
“బీజేపీకి ప్లస్ పాయింట్ మోడీ. మోడీకి మైనస్ పాయింట్ బీజేపీ”
ఈ వ్యాఖ్యను వ్యాఖ్యన సహితంగా వివరించే వ్యవధానం నాకు లేకపోవడంతో, రాత్రి  టీవీ – 5 ‘హాట్ టాపిక్’  చర్చలో నా పక్కన కూర్చున్న బీజేపీ అధికార ప్రతినిధి శ్రీ ఎన్.వీ.ఎస్.ఎస్. ప్రభాకర్ కాస్త అసహనంగా ఫీలయినట్టు నాకనిపించింది. ఢిల్లీ నుంచి పాల్గొంటున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు శ్రీ రాపోలు  ఆనంద్ భాస్కర్ ఏమనుకున్నారో తెలియదు.
కార్యక్రమం ముగింపులో ఈ ప్లస్ లూ, మైనస్ ల వ్యవహారం ఎత్తుకోవడంవల్లా, వివరణకు ఆట్టే అవకాశం లేకపోవడం వల్లా – ఇప్పుడు ఇక్కడిలా  కవి హృదయం ఆవిష్కరించుకోవాల్సివస్తోంది.

రానున్న లోక సభ ఎన్నికల తరువాత అటు కాంగ్రెస్ కయినా, ఇటు బీజేపీకయినా కావాల్సిన లక్కీ నెంబరు 272. జాతీయ పార్టీలుగా వుంటూ రెండు ప్రధాన రాజకీయ కూటములకు నాయకత్వం వహిస్తున్న ఈ రెండు పార్టీలకు ఆ మేజిక్ ఫిగర్ సొంతంగా సాధించుకోగలమన్న నమ్మకం ఎట్లాగో లేదు. చిన్నా చితకా పార్టీలను కలుపుకుంటే కాని అది సాధ్యం కాదు. ఓటర్లపై  మోడీ మంత్రం ఎంతో కొంత పనిచేసి కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ స్థానాలను బీజేపీ  గెలుచుకోగలిగినా,  ఆ పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి వేరే పార్టీలకి అనేక అభ్యంతరాలు అడ్డం వస్తాయి.  మోడీకి మైనస్ పాయింట్ బీజేపీ అని చెప్పడం అందుకే. (17-01-2014)

కామెంట్‌లు లేవు: