8, జనవరి 2014, బుధవారం

జీవితం నేర్పే పాఠాలు


ఆసక్తి వుండాలే కాని జీవితం నుంచి ప్రతిరోజూ ఓ కొత్త పాఠం నేర్చుకోవచ్చు. వయస్సు దీనికి ఎంతమాత్రం అడ్డంకి కాదు.
ఆకాశవాణి, దూరదర్శన్ లలో పనిచేసేరోజుల్లో ప్రైవేటు టీవీ చానళ్ళ చర్చాకార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు వచ్చినా ఆసక్తి చూపలేదు. పదవీ విరమణ చేసిన అనంతరం మాత్రం గత కొద్దేళ్లుగా అనేక చానళ్ళు నిర్వహించే చర్చల్లో పాల్గొంటూ వస్తున్నాను. వీటికోసం కొన్నిరోజులు తెల్లవారుఝామునే లేచి తయారు కావాల్సివస్తోంది. నేనయితే మా ఆవిడ పొద్దున్నే లేచి ఇచ్చే కాఫీ తాగి వెడుతున్నాకాని, నన్ను స్టూడియోలకు తీసుకు వెళ్లడానికి వచ్చే ఛానల్ కారు డ్రైవర్ల సంగతి ఏమిటని ఆలోచించి అలా పొద్దున్నే వచ్చే డ్రైవర్లకు కొంత టిప్పుఇవ్వడం అలవాటు చేసుకున్నాను. ఈ డ్రైవర్లలో రకరకాల వయస్సులవాళ్ళు వుంటారు.  పొరుగుజిల్లాలనుంచి హైదరాబాదు వచ్చి స్నేహితుల గదుల్లో తాత్కాలిక ఆవాసం ఏర్పరచుకుని బతుకు బండి లాగించే వాళ్ళే వీళ్ళల్లో ఎక్కువ. వాళ్లకు టిప్పు ఇవ్వడం మెహర్బానీ గా నేను ఏనాడు అనుకోలేదు. వాళ్లు కూడా అపార్ధం చేసుకోలేదు. కొందరు యెందుకు సార్ మా డ్యూటీ మేం చేస్తున్నాంఅంటూనే మృదువుగా అనేవారు.
నిన్ననో మొన్ననో అనుకుంటా టీవీ స్టూడియో నుంచి తిరిగొస్తూ ఓ కూడలివద్ద సిగ్నల్ పడ్డప్పుడు నేను పర్సు తీసి డ్రైవర్ కు ఓ పది  నోటు తీసి ఇచ్చాను. అతగాడు  ఆ నోటు తీసుకుని జేబులో పెట్టుకోకుండా అదే చేత్తో స్టీరింగు పట్టుకుని  నడుపుతూ ఒక చోట కారు వేగం తగ్గించి రోడ్డుపక్కన ఒక ముసలి బిచ్చగత్తె చేతిలో ఆ నోటు పెట్టాడు. అతని ప్రవర్తన చిత్రంగా అనిపించి నోరు తెరిచేలోగా అతడు మాఫ్ కీజియే సాబ్అంటూ తన మనసులో మాట చెప్పాడు.
ఈ డ్రైవర్ ఉద్యోగం కోసం సిటీకి వస్తున్నప్పుడు మా అమ్మ ఓ మాట చెప్పింది. అవసరం అయితేనే ఎవరినుంచయినా డబ్బు తీసుకో. నీ దగ్గర డబ్బు వుంటే నీకంటే అవసరం ఎక్కువ వున్నవాళ్ళకు దాన్నివ్వు. తీసుకోవడం తేలిగ్గా అలవాటు అవుతుంది. ఇవ్వడం అనేదే కొద్దిగా కష్టం.  అమ్మ మాట ప్రకారం మీరిచ్చిన డబ్బు ఆమెకు ఇచ్చాను. మీరు వేరే విధంగా అనుకోకండిఅన్నాడు.

అనుకోవడానికి ఏముంది.  ఓ కొత్త పాఠం నేర్చుకునే అవకాశం జీవితం నాకిచ్చిందనుకున్నాను.             

1 కామెంట్‌:

పల్లా కొండల రావు చెప్పారు...

బాగుంది మీరు నేర్చుకుని మాకు చెప్పిన పాఠం.