25, ఆగస్టు 2011, గురువారం

“జయ”హో! – భండారు శ్రీనివాసరావు

“జయ”హో! – భండారు శ్రీనివాసరావు


(పూర్తిగా వ్యక్తిగతం – నాకోసం, నావారికోసం రాసుకున్న మనోగతం)




కీర్తిశేషురాలు కొలిపాక జయ  

‘విరిగి పెరిగితి, పెరిగి విరిగితి - కష్టసుఖముల సారమెరిగితి’ అన్న కవి వాక్కు కొందరి విషయంలో అక్షర సత్యం.

కొందరు సుఖపడడానికి పుడతారు. ఇంకొందరు తాము సుఖపడుతూ ఇతరులను కష్టపెడతారు. మరికొందరు కష్టపడడానికి పుడతారు. వారిలో కొందరు కష్టపడుతూ తోటివారిని సుఖపెడతారు. పైన చెప్పిన కవి వాక్కు ఇలాటివారిని గురించే.

మా మేనకోడలు జయ ఈ చివరి కోవ లోనిదే. దానివన్నీ సినిమా కష్టాలే. చిన్న తోటికోడలు వొంటికి నిప్పంటుకుని వొంటింట్లోనే తనువు చాలించింది. అత్తామామలు ఆ తరువాత కొద్దికాలానికే కన్నుమూశారు. కట్టుకున్నవాడు కేన్సర్ బారిన పడి అకాల మృత్యువు పాలయ్యాడు. వున్న ఒక్క కొడుకు డాక్టర్ చదువు పూర్తిచేసి వంశాన్ని ఉద్ధరిస్తాడనుకున్న సమయంలో, చిన్న వయస్సులోనే డాక్టర్లు ఎవ్వరూ కనుక్కోలేని రోగంతో తెలియని లోకాలకు తరలిపోయాడు. తరుముకు వచ్చినట్టు ఒకదానివెంట మరొకటి. రోజులు బాగా గడుస్తున్న రోజుల్లో అవసరాలకు అందరినీ ఆదుకునే ఆమె మనస్తత్వం ఆ తరువాత రోజుల్లో ఆమెకు అక్కరకు వచ్చింది. చిన్నకుటుంబం చింతలు లేని కుటుంబం విధి చూసిన చిన్నచూపుకు చిన్నబోయిన స్తితిలో తోడబుట్టిన అక్కచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళు ఆదరించి చేరదీశారు. ఆత్మీయుల మంచితనం, చనిపోయిన భర్త పుణ్యమా అని వచ్చిన గ్యాస్ ఏజెన్సీ – ఆ చిరు జీవితానికి ఆలంబనగా మారాయి. సొంత కుటుంబంలో ఒక్కొరొక్కరుగా రాలిపోతున్నా గుండె చెడకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకే వేసింది.

జీవితంలో వొడిదుడుకులు, ఆటుపోట్లు అన్నీ వుంటాయి. అన్నింటినీ తట్టుకుని నిలబడి జీవించడంలోనే మనిషి జీవితానికి సార్ధకత. కష్టనష్టాలకు అదరక బెదరక గుండె నిబ్బరంతో ఎదుర్కొని నిలవాలి. నిలిచి పోరాడాలి. పోరాడి గెలవాలి. తాను అబలని కాదు సబలనే అని నిరూపించుకుంటూ అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలవాలి. ఇదే జయను ముందుకు నడిపించింది. తనవద్ద పనిచేసేవారినే సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ కాలం వెళ్ళదీసింది. కాలుడికి కావలసింది కూడా ఆ మంచితనమే కాబోలు. అందుకే తనవద్దకు చేర్చుకునే క్రమంలో స్వల్ప అనారోగ్యం బారిన పడేశాడు. స్వల్పం అనుకున్నది అనల్పంగా మారింది. అపోలో ఆసుపత్రిలో చేర్పించి నిండా రెండు రోజులు కూడా గడవలేదు. ఈ రోజున జయ ఇక లేదన్న కబురు. నిజంగా ఇది నిజమేనా అన్న సందేహాల నడుమ ఆత్మీయులందరూ కట్టగట్టుకుని ఆసుపత్రికి వెళ్లారు. నిద్రిస్తున్న దేవతలా ధవళ వస్త్రంలో చుట్టిన ఆమె భౌతికదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు.

ప్రతి పుట్టుకా మరణంతో అంతమయ్యేదే. జాతస్య మరణం ధృవం. అన్నీ తెలిసిన విషయాలే. కానీ కొన్ని మరణాలు బాధిస్తాయి. అది మరణించినవారి గొప్పదనం. జయ మరణం అలాటిదే. చప్పున మరచిపోవడం అంత తేలిక కాదు.

‘పెద్దవారిని అమితంగా బాధ పెట్టే విషయమేమిట’ని యక్షుడు ధర్మరాజుని అడిగాడో లేదో తెలియదు. అడిగివుంటే మాత్రం ‘తమ కంటే చిన్న వాళ్లు తమ కంటిముందే రాలిపోవడం’ అని జవాబు చెప్పి వుండేవాడని నేననుకుంటు న్నాను. (25-08-2011)

8 కామెంట్‌లు:

Jwala's Musings చెప్పారు...

మంచి టచింగ్ గా, అందరం రాయలనుకుని రాయలేక పోయింది నువ్వు రాసావని మా శ్రీమతి బుజ్జి అంటుంది. జ్వాలా

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Jwala's Musings - very many thanks to you and bujji - bhandaru srinivasrao - నీకూ బుజ్జికీ ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

Pavani చెప్పారు...

I think I know her by some relation. Very touching.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@pavani - THANKS - Bhandaru Srinivas Rao

prasad sarma చెప్పారు...

వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగంతుని కోరుకుంటూ,

prasad sarma చెప్పారు...

వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగంతుని కోరుకుంటూ,

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@prasad sarma - ధన్యవాదాలు ప్రసాద శర్మ -భండారు శ్రీనివాసరావు

subbalakshmi chepuru. చెప్పారు...

her death was very unfortunate. what u said about her is very touching.