16, ఆగస్టు 2011, మంగళవారం

ఆంధ్ర పత్రిక మూడో పేజీ చూశారా గురూ గారూ! – భండారు శ్రీనివాసరావు

ఆంధ్ర పత్రిక మూడో పేజీ చూశారా గురూ గారూ! – భండారు శ్రీనివాసరావు




నా చిన్నతనంలో చదివిన జోకు ఇది.

ఒకతను పత్రిక చేతబట్టుకుని వీధిలో అందరి వెంటా పడుతూ ‘మూడో పేజీ చూశారా’ అని వేధిస్తుంటాడు. విషయం ఏమిటంటే అతగాడు రాసిన ఉత్తరాన్ని ఆ రోజు ‘పాఠకుల లేఖలు’ శీర్షికలో ప్రచురించారు. దాన్ని గురించి నలుగురికీ తెలపడానికి అతడెన్నుకున్న మార్గం ఇది. (ఆదుర్తి వారు తీసిన తేనె మనసులు/కన్నెమనసులు సినిమాలో కూడా ఈ మాదిరి సన్నివేశం వున్నట్టు గుర్తు)

తాము చేసిన పనులు ( వారి దృష్టిలో ఘనకార్యాలు) నలుగురి దృష్టికి తీసుకురావడానికి రక రకాల పద్ధతులు అనుసరిస్తూ వుండడం మనకు కొత్తేమీ కాదు. కొందరు బాహాటంగా బయటపడి నిస్సిగ్గుగా చెప్పుకుంటే మరికొందరు నర్మగర్భంగా పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. రాజుల కాలంలో భట్రాజులు ఈ పని తమ నెత్తిన వేసుకునేవారు.కొండొకచో, వారి ఆస్తాన కవులు కూడా ప్రత్యేక సందర్భాలలో అన్యాపదేశంగా ఈ కర్తవ్య పాలన చేసి తమ రాజ భక్తిని కవితాత్మకంగా చాటుకునేవారు. తదుపరి జమీందారుల కాలంలో సయితం కొనసాగిన ఈ విధానం ప్రజాస్వామ్య యుగంలో సమాచార పౌర సంబంధ శాఖ రూపంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ‘ప్రచారం కోసం ఇన్నిన్ని కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తారా ? ఆయ్!’ అంటూ హుంకరించి పత్రికల కెక్కి విమర్శలు గుప్పించిన ప్రధాన ప్రతిపక్షం వాళ్ళే తాము అధికారంలోకి రాగానే ఆ విషయం వీలుచేసుకుని మరీ మరచిపోతారు. మరచిపోవడమే కాదు, పబ్లిసిటీ ఇచ్చుకునే విషయంలో తమ వైరి పక్షం కన్నా నాలుగాకులు ఎక్కువే చదివామని అనిపించుకుంటున్నారు. కాలక్రమంలో ఇది మరింతగా ముదిరిపోయి ప్రభుత్వ పధకాల ప్రచారం కాస్తా అధికారంలో కీలక స్తానాల్లో వున్న వారి వ్యక్తిగత ప్రచారంగా రూపుదిద్దుకోవడం, ఆ ఖర్చును పన్నుల రూపంలో ప్రజల మీద రుద్దడం - ఇవన్నీ ప్రజాస్వామ్య యుగంలో సహజాతి సహజంగా జరిగిపోతున్నాయి.


వ్యక్తిగతం అంటే గుర్తుకొచ్చింది. వ్యవస్థలు, ఆ వ్యవస్థలను శాసించే వ్యక్తుల సంగతి అటుంచండి. ఇప్పుడీ ప్రచార ఉధృతి అనేది సామాన్య జనజీవనంలోకి కూడా ప్రవేశించింది. పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, పూజలు, పునస్కారాలు అన్నీ ప్రచార ప్రాతిపదికనే జరిగిపోతున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తున్నామన్న భావనకన్నా ఎంత ఆడంబరంగా జరుపుకుంటున్నామన్న అభిజాత్యమే వీటిల్లో బాగా కానవస్తోంది.

కొత్తగా ఫ్రిజ్ కొనుక్కున్నావిడ ఇంటికొచ్చిన ప్రతి వాళ్లకు అడగకుండానే ‘మంచినీళ్ళు తాగుతారా పిన్ని గారు’ అని అడిగి నీళ్ళ గ్లాసు చేతికిచ్చి- ‘చల్లగానే వుంటాయి లెండి కొత్త ప్రిజ్ కదా’ అంటూ ప్రిజ్ కొన్న సంగతి చల్లగా బయటపెట్టే సన్నివేశాలకు సినిమాల్లో కొదవ వుండదు. అలాగే కొన్న చీరెలు గురించీ, నగల గురించీ ఇరుగూ పొరుగుతో చెప్పుకుని తృప్తిపడే ఆడంగులు కొల్లలుగా కనిపిస్తారు. ఇలాటి వాళ్ళతో పేచీ ఏమీ లేదు. ఆహా ఒహో అంటే చాలు మురిసి ముక్కచెక్కలవుతారు.


మరోరకం వాళ్ళతోనే ఇబ్బంది. వాళ్లు ఏది కొన్నా అదే బెస్ట్ అంటారు. తాము ఏది చేసినా అది ఇతరులు ఎవ్వరూ చేయలేరన్న ధీమా అనండి, అతిశయం అనండి వారి మాటల్లో పెల్లుబుకుతుంటుంది. వాళ్ల రూటే సపరేటు. వాళ్లు వెళ్ళిందే మంచి హోటలు. వాళ్లు చూసిందే భేషయిన సినిమా. వాళ్లు చదివిందే చక్కటి పుస్తకం. వాళ్లు చెప్పిందే వేదం. ఇంతెందుకు! వాళ్లు పట్టిన కుందేటికి నాలుగు కాళ్ళు వుంటే నా మీద వొట్టు.

దీన్ని ‘వన్ వే’ పబ్లిసిటీ అనాలేమో. ఇతరులకి ఎంత మాత్రం ఛాన్స్ ఇవ్వరు మరి.

ఈ మధ్య ఓ కొత్తరకం సెల్ఫ్ డబ్బా ఒకటి మొదలయింది. ‘పలానా టీవీ పలానా టైం కు పెట్టండి. నా ప్రోగ్రాం వస్తుంది’ అని తెలిసిన వాళ్లకు, తెలియని వాళ్లకు మొబైల్ ఫోన్లల్లో ‘ఎస్సెమ్మెస్’ లు ఇస్తుంటారు. ‘దయచేసి పలానా వారపత్రికలో/దినపత్రికలో నా వ్యాసం వచ్చింది చదవండి ప్లీజ్’ అని వచ్చే ఎస్సెమ్మెస్ ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. టీవీ చర్చల్లో పాల్గొనే మేధావులలో కొందరు ‘పలానా పత్రికలో ఈ విషయం గురించి ఇప్పటికే రాసేసాను’ అని చెప్పుకోవడం సెల్ఫ్ పబ్లిసిటీకి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఇక ‘ఈ’ మెయిల్ సౌకర్యం వుంటే చాలు పైసా ఖర్చు లేకుండా ప్రచారం చేసుకునే అవకాశాలు అన్నీ ఇన్నీ కాదు.

‘నిన్ను గురించి నువ్వు ఎప్పుడూ చెప్పుకోకు. నిజం చెప్పుకుంటే ఎవ్వరూ నమ్మరు. అబద్ధం చెబితే మాత్రం ఇంకా యెంత వున్నదో అని సందేహిస్తార’ని మా అన్నయ్య ఎప్పుడూ చెబుతుండేవాడు. కానీ ఈ నాటి సూత్రాలకు ఇది పూర్తిగా విరుద్ధం. సిద్ధాంతాలయినా, ఆదర్శాలయినా దెశ, కాల, మాన పరిస్తితులనుబట్టి మారిపోతుంటాయి. ఒకప్పుడు కమ్యూనిస్ట్ గా వున్నవాడు ఎప్పటికీ అలాగే వుండి పోనక్కరలేదు. పక్కా సమైక్యవాదులు అని ముద్ర పడ్డవారు రాత్రికి రాత్రే విభజనవాదులుగా మారిపోయి తమ వితండ వాదాలతో టీ వీ చర్చావేదికలపై కుండలు, బల్లలు బద్దలు కొడుతూ వుండవచ్చు. మార్పు మానవులకు సహజం అన్న సిద్ధాంతం సమర్ధించుకోవడానికి ఎలాగూ వుంది.


అంచేత మాస్టారూ, ప్రతివాడూ తన గురించి తానే చెప్పుకోవాలి. ఇతరుల గురించి నాలుగు మంచి మాటలు చెప్పే మంచితనం ఈనాడు కలికానికి కూడా దొరకని పరిస్తితి. అందువల్ల, ఏతావాతా చెప్పేదేమిటంటే మనకి మనమే పీఆర్వోలం. మన గురించి మనమే ప్రచారం చేసుకోవాలి. అవతల మనిషి నమ్మడం లేదని తెలిసినా మన గురించి మనం చెప్పుకుంటూనే పోవాలి. ఎదుటివాడు నమ్మకపోయినా కనీసం అతడి పక్కవాడు మన మాటల్ని నమ్మే ఛాన్సు కొంతయినా వుంటుంది. ఆలశ్యం ఎందుకు? స్వయం భజన బృందంలో చేరుదాం పదండి.

ఇక సిగ్గంటారా! దాన్ని వొదలకపోతే ఈ పాడు ప్రపంచంలో ఎదగడం కష్టం!!

(16-08-2011)

4 కామెంట్‌లు:

కృష్ణప్రియ చెప్పారు...

:) Interesting and true.

శరత్ కాలమ్ చెప్పారు...

మనం బ్లాగింగ్ చేసేది అందుకే కదండీ!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@కృష్ణప్రియ @శరత్'కాలం'- ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

subbalakshmi chepuru. చెప్పారు...

very interesting nd the trend is going on.