11, ఆగస్టు 2011, గురువారం

తప్పు తప్పే – భండారు శ్రీనివాసరావు

తప్పు తప్పే – భండారు శ్రీనివాసరావు



ఒక జడ్జి గారు చనిపోయి పరలోకానికి పయనమై వెడుతుంటే వెంటవుండి తీసుకువెడుతున్న యమభటులు రూటు మార్చి ఆయన్ని తమ లోకానికి పట్టుకుపోయారు. అక్కడ ఆ సమయంలో యమధర్మరాజు కొలువు తీరి చిత్రగుప్తుడి సాయంతో పాపుల్ని విచారించి దండనలు విధిస్తున్నారు. కొద్ది సేపటిలోనే మన జడ్జీ గారి వంతు వచ్చింది. భూలోకంలో ఆయనకు యముడికి వున్నంత మంచి పేరు వుంది. రాగద్వేషాలు లేకుండా, స్వపర బేధాలు చూడకుండా కేసుల్ని విచారించి తీర్పులు ఇస్తాడనీ, ఎలాటి ప్రలోభాలకు లొంగడనీ అందరూ ఆయన్ని గురించి చెప్పుకునేవాళ్ళు. లక్షలకోట్లు ప్రజాధనాన్ని దిగమింగిన బడా రాజకీయనాయకులని కూడా వొదిలిపెట్టకుండా జైలు వూచలు లెక్కబెట్టించిన ఘనకీర్తి ఆయనది. అలాటి తనను నేరుగా స్వర్గానికి తీసుకుపోకుండా ఈ నరకకూపంలోకి పట్టుకువచ్చినందుకు ఆయనకు ఒకటే గుర్రుగా వుంది. ‘ఆర్డర్ ఆర్డర్’ అని హుంకరించడానికి ఇది కోర్టు హాలు కాదని గుర్తుకువచ్చి తమాయించుకున్నాడు. ఇంతలో చిత్రగుప్తుడు చిట్టావిప్పి ఆయన నరలోకంలో వుండగా చేసిన పాపాల జాబితా చదవడం, సమవర్తి వాటికి తగ్గ శిక్షలను అక్కడికక్కడే విధించడం చూసి ఆ న్యాయమూర్తికి తల తిరిగిపోయింది. సాక్షులు లేకుండా, సాక్ష్యాలు లేకుండా కేసుల్ని విచారించి అప్పటికప్పుడే యముడు తీర్పులు వెలువరించడం, అప్పీలుకు అవకాశం లేకుండా అక్కడి సిబ్బంది వాటిని వెంటనే అమలు పరుస్తూ వుండడం ఇదంతా మన జడ్జి గారికి సుతరామూ నచ్చలేదు. పైగా సచ్చీలతకు మారుపేరని, నిజాయితీకి మరోపేరని గొప్ప పేరున్న తను తప్పులు చేసినట్టు చిత్రగుప్తుడు చెప్పడం చూసి ఆయనకు మతిపోయింది. చిత్రగుప్తుడు తాను చేసినట్టు చెబుతున్న  తప్పులకు, వాటికి యముడు విధించిన శిక్షలకు పొంతన లేకపోవడం ఆయన్ని మరింత నివ్వెరపరచింది. చిత్రగుప్తుడు తనపై మోపిన అభియోగాలు విన్న తరువాత సమవర్తిగా యమధర్మరాజుకున్న బిరుదుకు ఆయన ఏమాత్రం తగడని ఆయనకు అనిపించింది.

ఇంతకీ తను చేసిన తప్పులేమిటి?  ఒక ఉన్నత న్యాయస్తానంలో న్యాయమూర్తిగా వున్నప్పుడు అధికారిక విధులపై అనేకసార్లు అనేక నగరాల్లో అయిదు నక్షత్రాల హోటళ్ళలో విడిది చేసేవాడు. హోటల్ బిల్లులు, అన్నపానీయాల ఖర్చులు అన్నీ నిబంధనల ప్రకారమే వుండేలా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. అయితే, తనకు ఒక చిన్న బలహీనత వుండేది. హోటల్ గది ఖాళీ చేసేటప్పుడు బాత్ రూమ్ లో వుండే రకరకాల శాంపిల్ సబ్బులను, షాంపూ బాటిళ్ళను ఇంటికి పట్టుకువచ్చేవాడు. అంతంత డబ్బులుపోసి అంత పెద్ద హోటళ్ళలో బస చేసినప్పుడు వాటిని తీసుకురావడం అంత పెద్ద విషయంగా కాని, తప్పుపట్టాల్సిన విషయంగా కానీ తనకు ఎప్పుడూ తోచలేదు. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఇలాటి చిన్న తప్పుల్ని ఒక హెచ్చరికతో వొదిలిపెట్టవచ్చు. కానీ ఈ నరక లోకంలో రూల్స్ వేరేగా వున్నట్టున్నాయి. చిన్న తప్పు, పెద్ద నేరం అనే బేధం లేకుండా సరి సమానంగా శిక్షలు వేస్తున్నారు. పైగా వాటికి అప్పీలు కూడా లేకపోవడం మరీ అన్యాయం.

జడ్జి మనసులో తొలుస్తున్న సందేహాలను యమధర్మరాజు అర్ధం చేసుకున్నాడు.

‘తప్పు చేయడం, వాటిని మళ్ళీ మళ్ళీ చేయడం మా శిక్షాస్మృతి ప్రకారం పూర్తిగా నిషేధం. పైగా శిక్షార్హం. చిన్న తప్పులు జరగకుండా జాగ్రత్త పడితేనే పెద్దవి జరగకుండా వుంటాయి. మా నిబంధనల ప్రకారం చిన్నదయినా పెద్దదయినా తప్పు తప్పే. నేరం నేరమే. అలాగే విధించే శిక్షలలో కూడా హెచ్చుతగ్గులుండవు. విచారణలను ఏళ్లతరబడి సాగదీయడం వల్ల కూడా దోషులు తప్పించుకునే వీలు మీ న్యాయశాస్త్రం కల్పిస్తోంది. వందమంది దోషుల్ని విడిచిపెట్టినా పరవాలేదు కాని ఒక్క నిర్దోషిని కూడా శిక్షించకూడదు అనే కాలం చెల్లిన సిద్ధాంతంతో మీ కోర్టులు అనవసర కాలయాపన చేస్తున్నాయి. న్యాయ వ్యవస్థ నిర్వహణలో మీకూ మాకూ అదే తేడా. మీది భూలోకం – మాది యమలోకం. అందుకే మిమ్మల్ని న్యాయమూర్తి అంటారు. మమ్మల్ని సమవర్తి అంటారు.” వివరించాడు యమధర్మరాజు. (11-08-2011)

4 కామెంట్‌లు:

రాజేష్ జి చెప్పారు...

Well said, sir!

Andhraman చెప్పారు...

హోటల్ గది ఖాళీ చేసేటప్పుడు బాత్ రూమ్ లో వుండే రకరకాల శాంపిల్ సబ్బులను, షాంపూ బాటిళ్ళను ఇంటికి పట్టుకువచ్చేవాడు.

They are paid for and included in the room charges.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@రాజేష్ జి - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Andhraman - నిజమే -They are paid for and included in the room charges- కానీ చిన్న చిన్న వాటికి కక్కుర్తి పడడం కూడా యముడి దృష్టిలో తప్పే.అందుకే అందులో రాసింది - చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్ష లేకపోవడం వల్లనే ఇన్ని అనర్ధాలు - భండారు శ్రీనివాసరావు