3, ఆగస్టు 2011, బుధవారం

బాబోయ్! బ్యూరోక్రసీ!! - భండారు శ్రీనివాసరావు

బాబోయ్! బ్యూరోక్రసీ!! - భండారు శ్రీనివాసరావు


ఏమి సేతురా లింగా!


ఆ వార్త దావానలంలా నగరంలో ఒక్కసారిగా గుప్పుమంది.
ఒకరు కాదు, ఇద్దరు కాదు తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఓ నిర్మాత, ఒక డైరక్టర్, ఓ రచయిత – వూరిమధ్యవున్న ఓ హోటల్ గదిలో పురుగులమందు తాగి ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసి వెళ్ళిన పోలీసులకు ఆ గదిలో ఓ లేఖ దొరికింది.

అందులో ఇలా వుంది.

"అయ్యా!

విషయం : మహాభారతం మీద మీరు నిర్మించాలనుకున్న సినిమా.
రిఫరెన్స్ : ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం కోసం మీరు పెట్టుకున్న ధరఖాస్తు.

"మీరు పంపిన పై ధరఖాస్తు కింది సంతకందారు పరిశీలనకై వచ్చింది. మహాభారతం అనే సినిమా తీయడానికి ప్రభుత్వ సాయం కోసం మీరు పెట్టుకున్న  ధరఖాస్తును ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. మహాభారతం సబ్జెక్ట్ లోని కొన్ని అంశాలు మరీ సున్నితమైనవిగా భావించి ప్రభుత్వం ఈ ధరఖాస్తును పరిశీలించేందుకు ఒక అత్యున్నత స్తాయి సంఘాన్ని ఏర్పాటుచేసింది. ఇందుకోసం మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, శ్రామిక హక్కుల కమిషన్ తో పాటు ఈ అంశంతో సంబంధం వున్న వివిధ ప్రభుత్వ శాఖల సూచనలను కూడా సేకరించడం జరిగింది. మీరు దాఖలు చేసిన మహా భారతం స్క్రిప్ట్ ను నిశితంగా పరిశీలించిన తరువాత ఆయా శాఖలు పంపిన సూచనలు సిఫారసులను అభ్యంతరాలతో సహా ఈ కింది విధంగా క్రోడీకరించడం జరిగింది.

1. మీరు పంపిన స్క్రిప్ట్ ప్రకారం మహాభారతం కధలో కౌరవులు అనబడేవారు వంద మంది, వారితోపాటు మరో అయిదుగురు పాండవులు వుంటారని అర్ధం చేసుకోవడం జరిగింది. ఈ సంఖ్యల పట్ల కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఆ శాఖ జారీ చేసిన మార్గదర్శిక సూత్రాల ప్రకారం ఒక కుటుంబంలో ఇంత మంది సంతానం వుండడం పూర్తిగా అసంగతం. పైగా అలాటి విషయాలను సినిమా మాధ్యమం ద్వారా ప్రచారం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. చిన్న కుటుంబం ఆవశ్యకతను గురించి ప్రచారం చేయడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్న దృష్ట్యా - ఒకే ఒక్క కుటుంబంలో శత సంతానాన్ని చూపించే మహాభారతం వంటి సినిమాలకు సాయం చేయరాదని ఆ మంత్రిత్వ శాఖ అభిప్రాయ పడింది. ఈ చిత్రంలో కౌరవ పాండవుల సంఖ్యను మూడు దాటకుండా చూసుకోగలిగిన పక్షంలో ఆర్ధిక సాయం చేసే విషయాన్ని పరిశీలించవచ్చని ఆ శాఖ సిఫారసు చేసింది. మీరు స్క్రిప్ట్ ని మార్చుకునే ఉద్దేశ్యం ఉన్నట్టయితే ఈ అంశాన్ని గమనంలో వుంచుకోవలసిందిగా కోరడమయినది.

2. ప్రస్తుత ప్రజాస్వామ్య యుగంలో రాజులు, చక్రవర్తులను సినిమాల్లో చూపించడం భావ్యం కాదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. కాకపొతే, కౌరవులను లోక సభ సభ్యులుగాను, పాండవులను రాజ్యసభ సభ్యులుగాను చూపిస్తూ స్క్రిప్ట్ లో మార్పులు చేసిన పక్షంలో దరఖాస్తును పరిశీలించవచ్చని ఆ శాఖ సూచించింది. కధ చివరిలో కౌరవులను పాండవు లు జయించినట్టు చూపడం పట్ల కూడా ఈ శాఖ అభ్యంతరం తెలిపింది. లోక సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఒకరికొకరు తీసిపోరు అన్న పద్ధతిలో ముగింపు వుండాలని ఈ శాఖ స్పష్టం చేసింది.
౩. శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ కధలోని మరో ప్రధాన అంశంపై అభ్యంతరం తెలిపింది. మీరు పంపిన మహాభారతం స్ర్కిప్ట్ ప్రకారం కౌరవులు క్లోనింగ్ విధానం ప్రకారం ఒక కుండలో జన్మించినట్టు వుంది. ప్రస్తుత చట్టాల ప్రకారం భారత దేశంలో క్లోనింగ్ నిషేధం. ఈ దృష్ట్యా , కౌరవులు సాధారణ పద్ధతిలో జన్మించినట్టు స్క్రిప్ట్ ను మార్చాల్సి వుంటుంది.

4. జాతీయ మహిళా హక్కుల కమిషన్ అభ్యంతరం మరో రకంగా వుంది. అయిదుగురు పాండవులకు కలిపి ఒకే భార్య వున్నట్టుగా స్క్రిప్ట్ లో చూపించారు. మహిళలను కించబరిచే విధంగా రూపొందించిన ఈ కధను ఎట్టి పరిస్తితిలోను ప్రస్తుతం వున్న రీతిలో అనుమతించడం తగదని స్పష్టం చేసింది.

5. ఈ చిత్రంలో దృతరాష్ట్రుడు అనే పాత్రను అంధుడిగా చూపించారు. దానికితోడు ఈ దృతరాష్ట్రుడిని ఉద్దేశించి ఇతర పాత్రలు అనేక దృశ్యాలలో అంధుడు, అంధుడు అని నిందాపూర్వకంగా మాట్లాడినట్టు గా స్క్రిప్ట్ లో వుంది. ఈ దృశ్యాలను తొలగించాలని వికలాంగుల మంత్రిత్వశాఖ గట్టిగా సిఫారసు చేసింది.

6. ఈ చిత్ర కధ ప్రకారం ఓఘట్టంలో ద్రౌపది అనే స్త్రీ పాత్రను నిండు సభలో వస్త్రాపహరణం చేసినట్టు వుంది. ఇది యావత్ స్త్రీ జాతికే అవమానకరమని , ఈ సన్నివేశాన్ని స్క్రిప్ట్ లో నుంచి తొలగించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ తన సిఫారసులో పేర్కొన్నది.

పోతే, ఇలాటి సన్నివేశాలను సినిమాల్లో చూపించడంవల్ల మహిళా సంఘాలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం వుందని, దరిమిలా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కావచ్చుననీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ సన్నివేశాలను తొలగించకుండా స్క్రిప్ట్ ని ఆమోదించడం తమకు సమ్మతం కాదని పేర్కొన్నది.

7. కౌరవ పాండవులను జూదరులుగా చూపించారని, ప్రజల్లో జూద ప్రవృత్తిని ప్రోత్సహించే విధంగా వున్న సన్నివేశాలను తొలగించాలని కూడా హోం శాఖ సూచించింది. అంతగా కధకు అవసరం అనుకుంటే కౌరవ పాండవులు గుర్రపు పందేల్లో పోటీ పడినట్టు చూపవచ్చని ఆ శాఖ సలహా ఇచ్చింది. గుర్రపు పందేలు జూదం కిందికి రావని సుప్రీం కోర్ట్ గతంలో పేర్కొన్న విషయాన్ని హోం శాఖ తన సిఫార్సుకు జత చేసింది.

8. విరాటరాజు కొలువులో పాండవులు ప్రచ్చన్న వేషాలలో ఎలాటి జీత భత్యాలు లేకుండా పని చేసినట్టు చూపించారు. ఇది వెట్టిచాకిరీ కిందకు వస్తుందని, 1976 వెట్టిచాకిరి నిర్మూలన చట్టంలో పేర్కొన్న అధికరణాలకు ఇది విరుద్ధమని మానవ హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. అందువల్ల విరాట పర్వాన్ని మహాభారతం స్క్రిప్ట్ నుంచి తొలగించాలని కోరింది.

9. కౌరవ పాండవ యుద్ధంలో అభిమన్యుడనే పదహారేళ్ళ కుర్రవాడు యుద్ధంలో పాల్గొన్నట్టు చూపారు. అంత చిన్నకుర్రవాడు యుద్ధం చేసినట్టు చూపించడం 1986 బాల కార్మిక నిరోధక చట్టం నిబంధనలకు వ్యతిరేకమని జాతీయ లేబర్ కమిషన్ అభ్యంతరం తెలిపింది. యుద్ధంలో పాల్గొన్న అభిమన్యుడికి పరిహారం చెల్లించినట్టు స్క్రిప్ట్ లో ఎక్కడా పేర్కొనక పోవడం – 1948 కనీస వేతన చట్టం లోని నిబంధనలకు వ్యతిరేకమని అభిప్రాయపడింది. అభిమన్యుడి పాత్రకు సంబంధించి స్క్రిప్ట్ లో తగు మార్పులు చేయాలని సిఫారసు చేసింది.

10. మహాభారతం స్క్రిప్ట్ లో శ్రీకృష్ణుడు అనే పాత్ర వుంది. నెమలి ఈకలను తలపై ధరిస్తూ ఈ పాత్ర కనిపిస్తుంది. నెమలి జాతీయ పక్షి కావున ఆ పక్షి ఈకలతో కృష్ణుడిని చూపించడం 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టానికి విరుద్ధం. అందువల్ల కృష్ణ పాత్ర ఆహార్యాన్ని ఈ సిఫార్సుకు అనుగుణంగా మార్చుకోవాల్సిందిగా కోరడమయినది.

11. యుద్ధసన్నివేశాలలో ఏనుగులను, గుర్రాలను వాడినట్టు స్క్రిప్ట్ లో వుంది. 1890 జంతుహింస నిరోధక చట్టం, 1960 జంతుహింస నిరోధక(సవరణ) చట్టం నిబంధనల ప్రకారం యుద్ధ సన్నివేశాలకు సంబంధించి తగు మార్పులు చేసుకోవాల్సిందిగా కోరడమయినది. జంతుహింస విషయమై శ్రీమతి మేనకా గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో – మహాభారత సంగ్రామ దృశ్యాలలో వాటిని చూపించడం మరిన్ని ఆందోళనలకు దారితీసే అవకాశం వుంది.

12. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ పొదుపుకు సంబంధించి ఇటీవల జారీ చేసిన మార్గదర్శిక సూత్రాలను మహాభారతం స్క్రిప్ట్ తయారీలో పాటించినట్టు లేదు. అన్నివేలమంది సైనికులు అనవసరమని ఆ శాఖ అభిప్రాయపడింది. యుద్ధంలో పాల్గొన్న సైనికులు 1959 ఆయుధాల చట్టం అలాగే 1878 భారతీయ ఆయుధ చట్టం కింద లైసెన్సులు పొందినట్టు రుజువులు చూపించడం అవసరమని ఆంతరంగిక భద్రతా శాఖ పేర్కొన్నది.

"అందువల్ల మీరు పంపిన మహాభారతం స్క్రిప్ట్ కు పైన సూచించిన విధంగా అవసరమయిన మార్పులను చేసిన పక్షంలో మీ సినిమా నిర్మాణానికి మీరు కోరిన ఆర్ధిక సాయం మంజూరు చేసే విషయాన్ని పరిశీలించడం జరుగుతుందని ఇందుమూలంగా తెలియచేయడం జరుగుతోంది. తగిన మార్పులు చేర్పులతో కూడిన మహాభారతం సినిమా స్క్రిప్ట్ ను తిరిగి పంపవలసిందిగా కింది సంతకందారు మిమ్మల్ని కోరుతున్నారు.

కావున తెలియపరచడమయినది."

(సంతకం)

అండర్ సెక్రెటరీ, భారత ప్రభుత్వం

(నెట్లో చక్కర్లు కొడుతున్న ఆంగ్ల రూపానికి స్వేచ్చానువాదం )

-03-08-2011

2 కామెంట్‌లు:

Devika Sai Ganesh Puranam చెప్పారు...

ఈ కధ (జొక్) నేను ఎప్పుడో ఏడాది క్రితం చదివినట్లు గుర్తు. కాని ఏ పెపర్లొ/పుస్తకంలొ చదివానొ గుర్తులేదు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Devika Sai Ganesh Puranam- చివర్లో, బ్రాకెట్లో రాసిన ఆఖరు వాక్యం చదివివుంటే అర్ధం అయివుండేదేమో - భండారు శ్రీనివాసరావు