26, జనవరి 2010, మంగళవారం

పాతికేళ్ళనాటి మాస్కో - 16మెట్రో
మన దేశంలో యెంత మారు మూల పల్లెటూరికి వెళ్ళినా హోటల్ అన్న పదం విననివాడు, తెలియనివాడు వుండడు. కానీ ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాలలో ఒకటయిన సోవియట్ యూనియన్ రాజధాని మాస్కోలో- ఆ రోజుల్లో 'హోటల్' అంటే తెలియనివాళ్ళు కోకొల్లలు. అంటే మాస్కోలో హోటల్స్ లేవని కాదు. హోటల్ అనే ఇంగ్లీష్ పదం కూడా వారికి తెలియదన్న మాట.   అదేమిటో గాని రష్యన్ తప్ప మరొక భాష వారికి అర్ధం అయ్యేది కాదు. ఒకసారి రాయపాటి సాంబశివరావు గారు వచ్చి మాస్కోలోని ఇంటర్నేషనల్ హోటల్ లో బస చేశారు. అక్కడికి వెళ్లాలని యెంతో మంది టాక్సీ డ్రైవర్ లను అడిగిచూసినా ప్రయోజనం లేకపోయింది. ఇంటర్నేషనల్ హోటల్ అంటే ఎవరికీ అర్ధం కాలేదు. రష్యన్లో హోటల్ ని గస్తనీచ్చ అంటారు. మేజ్దురోద్నయా గస్తనీచ్చ(ఇంటర్ నేషనల్ హోటల్) అని నాలుకను మూడు మడతలు చుట్టి అడిగితె కాని అర్ధం కాని పరిస్తితి. మిల్క్(పాలు), బటర్ మిల్క్ (మజ్జిగ) స్కూలు, రోడ్డు, స్ట్రీటు (వీధి), వంటి ఇంగ్లీష్ పదాలు సయితం వారికి తెలియవు. ఒక్క మెట్రో తప్ప.

అయిదు పైసల టిక్కెట్టుతో నూటయాభయి స్టేషన్లు
మెట్రో ప్రసక్తి లేకుండా మాస్కో గురించి చెప్పడం అంటే రాముడు లేని రామాయణాన్ని పారాయణ చేయడమే.
మాస్కో వీదుల్లో సంచరిస్తున్నప్పుడు-
రోడ్లపై ట్రాముల్లో, సిటీ బస్సుల్లో, ట్రాలీ బస్సుల్లో (కరెంటు తో నడిచే బస్సులు) తిరుగుతున్నప్పుడు-
ఎత్తయిన ఆకాశ హర్మ్యాలవైపు మెడలురిక్కించి చూస్తున్నప్పుడు-
మన కాళ్ళ కింద, భూమి అడుగున, వందల సంఖ్యలో మెట్రో రైళ్ళు సొరంగ మార్గాల ద్వారా అతివేగంగా ప్రయాణిస్తూ ఉంటాయని చెబితే -
మాస్కో మెట్రో గురించి తెలియనివాళ్ళు ఒక పట్టాన నమ్మడం కష్టం.
సోవియట్ యూనియన్ ఏర్పడడానికి పూర్వమే- జార్ చక్రవర్తుల కాలంలోనే - మెట్రో నిర్మాణం గురించి ప్రతిపాదనలు సిద్దం చేసారని చెబుతారు. అయితే ఈలోగానే, కామ్రేడ్ లెనిన్ నాయకత్వంలో మొట్టమొదటి సోవియట్ నిర్మాణం జరిగిన తరవాత ఆనాటి ప్రాదాన్యతలనుబట్టి, మెట్రో నిర్మాణ ప్రతిపాదనలు కొంత వెనుకపడ్డాయి. 1935  లో తొలి మెట్రో రైలు మాస్కో భూగర్భంలో పరుగులు తీసింది. 13  కిలోమీటర్లతో మొదలయిన మెట్రో క్రమంగా విస్తరించి ౩౦౦ కిలోమీటర్ల   పరిధిలో 180  స్టేషన్లకు పెరిగింది. పనిదినాలలో, సగటున రోజూ 70  లక్షలమంది మెట్రో రైళ్ళలో ప్రయాణిస్తుంటారు. రద్దీ టైములో 90  సెకన్ల కొకటి చొప్పున మెట్రో రైలు ప్రయాణీకులకు అందుబాటులో వుంటుంది. 1935  లో 50  కోపెక్కులతో మొదలయిన  మెట్రో టిక్కెట్టు ధరను 1961  లో అయిదు కోపెక్కులకు తగ్గించారు. అంటే ఐదు పైసల (కోపెక్కుల) నాణెం - మెట్రో స్టేషన్ ప్రవేశ ద్వారం దగ్గరవున్న స్లాటులో వేసి లోనికి ప్రవేశిస్తే చాలు- ఎటునుంచి ఎటువైపయినా- ఎన్నిసార్లయినా సరే-స్టేషన్లతో నిమిత్తం లేకుండా  ప్రయాణం చేయవచ్చు. నగరం నలువైపులకు వెళ్ళే రైలు మార్గాలను కలుపుతూ వృత్తాకారంలో మరో మార్గాన్ని నిర్మించారు. అందువల్ల - అనేకవైపులకు ప్రయాణాలు చేసేవారు కూడా భూగర్భంలో ఒక స్టేషన్ నుంచి మరో స్టేషను కు ఎస్కలేటర్ల ద్వారా వెళ్లి రైళ్ళు మారుతూ తమ గమ్యాలను చేరుకోవచ్చు.అంటే, భూగర్భంలోనే రైల్వే జంక్షన్లు నిర్మించారన్న మాట.ఒక సొరంగ మార్గంలో రైలు వెడుతుంటే- దానికి కిందా పైనా వున్న మార్గాలలోమరికొన్ని రైళ్ళు  తిరుగుతూవుంటాయి.


 ఈ  అద్భుతమయిన ఇంజినీరింగ్ కౌశల్యాన్ని - అధునాతన  సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని రోజుల్లోనే రష్యన్ ఇంజినీర్లు  ప్రదర్శించిన తీరు అమోఘం. మాస్కో మెట్రోలో మరో వెసులుబాటు ఏమిటంటే - ఒక రైలు వెనుకనే మరో రైలు వెంటవెంటనే వస్తుంటుంది కాబట్టి తొక్కిసలాటలకు, తోపులాటలకు ఆస్కారం తక్కువ. రైలు వచ్చి ప్లాటుఫారంపై ఆగగానే తలుపులు తెరుచుకోవడం - దిగేవాళ్ళు ఒక పక్క నుంచి దిగుతుండగానే మరో పక్కనుంచి ఎక్కేవాళ్ళు ఎక్కడం- తలుపులు మూసుకోవడం - రైలు కదిలిపోవడం అంతా క్షణాలలో నిశ్శబ్దంగా జరిగిపోతూ వుంటుంది.రైలు ఒక స్టేషన్ దాటగానే వచ్చేది పలానా స్టేషన్   అని ముందుగానే  పబ్లిక్ అడ్రసు సిష్టం ద్వారా అనౌన్స్ చేస్తుంటారు. అలాగే డోర్లు తెరుచుకుంటున్నాయి, డోర్లు మూసుకుంటున్నాయని కూడా   ప్రయాణీకులను  హెచ్చరిస్తూ  వుంటారు.   అన్ని లక్షలమంది ప్రయాణాలు చేస్తున్నా - ప్లాటుఫారాలన్నీ కడిగిన అద్దంలా మెరిసిపోతూవుంటాయి. ఒక స్టేషనుకు మరో స్టేషనుకు పోలిక లేకుండా - రష్యాలోని వివిధ జాతుల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఒక్కొక్క మెట్రో స్టేషను ను ఒక్కో మ్యూజియంగా తీర్చిదిద్దారు.


(రెడ్ స్క్వేర్ లెనిన్ సమాధి వద్ద పొడుగుపాటి క్యూలు - కన్నడ న్యూస్ రీడర్ శ్రీ రామకృష్ణ భార్య శ్రీమతి సరోజతో కలసి మా ఆవిడ నిర్మల)


 మాస్కోని సందర్శించే విదేశీ అధినాయకులు సయితం తమకు సమకూర్చిన చయికా కార్లను ( యద్దనపూడి నవలల్లో కధానాయకులు వాడే పడవ లాంటి కార్లు - ఈ ఆరు డోర్ల కార్లు అత్యున్నత స్తాయి విదేశీ అతిధులకి మాత్రమే అందుబాటులో వుంటాయి) పక్కన పెట్టేసి మెట్రో ప్రయాణం పట్ల ఆసక్తి వెలిబుచ్చుతారంటే మాస్కో మెట్రో ప్రశస్తిని అర్ధం చేసుకోవచ్చు.

(స్టాలిన్ తాగిన కాఫీ కప్పుతో మారిన మెట్రో డిజైన్ - ఈ వయినం గురించి మరో సారి)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

4 వ్యాఖ్యలు:

Jwala's Musings చెప్పారు...

అలనాటి మాస్కో వ్యవహారం వింటున్నా (చదువుతున్నా) కొద్దీ బాగుంది. భాషాభిమానం అంటే అలానే వుంటుందనుకోవాలేమో !

అయితే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, "ఎల్లలెరుగని కార్మిక-శ్రామిక రాజ్య స్థాపనే" మార్క్స్-లెనిన్ ప్రవచనాల ప్రధాన ధ్యేయం అయినప్పటికీ, ఆదినుంచి, భాష లాంటి పలు విషయాల్లో అంతర్జీతాయంగానే కాదు, కనీసం జాతీయంగా కూడా అలనాటి సోవియట్ నాయకత్వం (ఆలోచించినా) అవలింభించ లేకపోయింది. అంతెందుకు, సోవియట్ యూనియన్ లో, లెనిన్ నాయకత్వంలో, కార్మిక నియంతృత్వ- సామ్యవాద పాలన వచ్చిన తొలిరోజుల్లో, దేశం ఎదుర్కొన్న మొదటి సవాళ్లలో, ఆస్తికి సొంత దారుడెవరనేది. అందులో భూమి ప్రధానం. ప్రపంచంలో ఏ దేశంలోను, చిన్న రైతు తనకున్న భూమిని సంస్కరణల పేరు మీదో-సిద్ధాంతం పేరు మీదో-కమ్యూనిజం నెపంతోనో, "ప్రభుత్వ పరం" చేస్తామంటే, చావడానికైనా సిద్ధపడుతాడు కాని, భూమిని వదులుకోవడానికి ఇష్టపడడు. సోవియట్ యూనియన్ లోనూ అదే జరిగింది. సహజ వనరులుగాని, ఆస్తిపాస్తులుగాని, పరిశ్రమల మీద యాజమాన్యంగాని, సామ్రాజ్యవాద దేశాల్లో మాదిరి ఏ ఒక్కరి సొత్తో కారాదనే కమ్యూనిజం సిద్ధాంతం అమలు అంత సులభం కాదని అర్థమయింది. సరిగ్గా, అప్పుడే, విశ్వవిఖ్యాతి పొందిన లెనిన్ ఆర్థిక సిద్ధాంతం, "న్యూ ఎకనామిక్ పాలిసీ"-నూతన ఆర్థిక విధానం- ఆవిర్భావం జరిగింది. రెండడుగులు ముందుకు వేయాలంటే, ఒకడగు వెనక్కు వేస్తే తప్పులేదంటాడు లెనిన్ మహాశయుడు. అప్పటినుంచే, ప్రపంచవ్యాప్తంగా, "మార్క్సిజం" అనడానికి బదులు, "మార్క్సిజం-లెనినిజం" అనడం మొదలెట్టారు. (చాలా సంవత్సరాల అనంతరం, ఇందిరా గాంధి, లనాటి సిండికేట్ ను ఎదిరించినప్పుడు-దరిమిలా అమలు చేసిన ఇరవై సూత్రాల ఆర్థిక ప్రణాళికకు స్ఫూర్తి లెనిన్ నూతన ఆర్థిక విధానమే).

అయితే, దురదృష్ట వశాత్తు, లెనిన్ తర్వాత వచ్చిన నాయకత్వం (స్టాలిన్, కృశ్చేవ్) వాస్తవాలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఒకవైపు, "మార్క్సిజం-లెనినిజం" సిద్ధాంతానికి కట్టుబడి వుండలేక, మరోవైపు దాన్ని వ్యతిరేకించలేక, పరస్పర విరుద్ధ సంఘర్షణకు లోనయ్యారు. పైహా ఒకరి తర్వాత వచ్చిన ఇంకొకరు, తనముందు అమలయిన సిద్ధాంతపరమైన కార్యక్రమాలను విమర్శించడంలోనే కాలమంతా గడిచిపోయింది. ఇది అంతగతంగా సోవియట్ యూనియన్ ఎదుర్కొన్న సమస్య అయితే, అంతర్జాతీయంగా ఎలా అగ్రరాజ్యంగా ఎదగాలన్న దుగ్ద మరో వైపు పీడించింది. అంతా ఒక్క సారే తినలేక, కక్కలేక, స్టాలిన్, కృశ్చేవ్ ల తర్వాత వచ్చిన నాయకత్వం "మార్పు" కు చొరవతీసుకుంది. చివరకు నీలాంటి వారి కళ్లు "మార్పు చూసిన కళ్లు" అయ్యాయి.

అదే చైనాలో పరిస్థితి వేరుగా సాగింది. అందుకే కమ్యూనిజం అక్కడ కొనసాగుతుంది ఇంకా. కొనసాగడమే కాదు-ఇవ్వాళ అంతర్జాతీయంగా చైనాను మించిన మరో దేశం లేదనే దిశగా దూసుకు పోతుంది. కారణం, దాని, వ్యవస్థాపక-సిద్ధాంతకర్త, ఆదినుంచే తన దేశ-కాలమాన పరిస్థితులకనుగుణంగా, "మార్క్సిజం-లెనినిజం"కు, తనదైన శైలిలో నూతన ఆలోచనావిధానాన్ని రూపొందించి, చనిపొయేంతవరకూ అమలు పరిచి, దాన్ని "అజరామరం"గా చేసిపోయాడు. దానినే ఇప్పుడు "మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానం" అంటున్నాం. ప్రపంచ వ్యాప్త "ఆర్థిక మాంద్యం"లో కూడా చెక్కుచెదరని దేశమంటూ ఏదైనా వుంటే, అది, చైనానే అని, ఇక్కడ అమెరికా పత్రికల్లో చదువుతున్నాను-మీడియాలో వింటున్నాను. నిజానిజాలు తేలేంతవరకు నమ్మాల్సిందే మరి !

ఇక, సొరంగ మార్గ రైళ్ల గురించి చెప్పాలంటే, బహుశా ప్రపంచంలో రష్యాకు ధీటుగా, ఆ సౌకర్యం వున్నది బ్రిటన్ లో అనుకుంటాను. లండన్ లో ఆ సౌకర్యం చూసి అబ్బురపడని వారుండరు. కేవలం రైలు స్టేషన్ మాత్రమే భూమి పైనుంటుంది. మిగాతాదంతా, సొరంగ మార్గమే. అయినా రైలు ప్రమాదాలు జరిగిన సందర్భాలు అసలు లేవనే అనాలి.

మొత్తం మీద నువ్వు ఆవిష్కరిస్తున్న నిజాలు ఈ తరం వారికి, భావి తరం వారికీ ఎంతగానో ఉపయోగపడే, వర్తమాన చారిత్రక సత్యాలు.

వనం జ్వాలా నరసింహారావు

kvsv చెప్పారు...

thank you jwala gaaroo తరువాత యేమి జరిగిందో?అన్న మా లాంటి వాళ్ళకి క్లుప్తంగా వివరించేశారు.[ఇంతకు మునుపు ఒకసారి నేను అడిగివున్నా తర్వాతా.ప్రస్తుతం రష్యా యలా వున్నదంటూ]యెందువలన అంటే మాకు ప్రపంచ విషయాల పై కొంచెము అవగాహన తక్కువ ..thanks again

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

అనేక సార్లు నా అనుభవం లోకి వచ్చిన విషయం.
అసలు పుస్తకం కంటే దాని మీద వచ్చిన విమర్శనాపూర్వక వ్యాసమో లేక ఆ పుస్తకానికి రాసిన ముందు పలుకో బాగుండడం కద్దు. దీనికి మంచి ఉదాహరణ - శ్రీ శ్రీ గేయసంపుటికి చలం ఇచ్చిన యోగ్యతాపత్రం.
సోవియట్ యూనియన్లో అయిదేళ్ళు గడిపినా నీలాగా నేను కమ్మ్యూనిజాన్ని, అవుపోశన పట్టినవాడిని కాను. నేను ముందే తెలియచేసుకున్నట్టు ఒక మామూలు మనిషిగా అక్కడికి వెళ్లాను. ఒక మిలియనీరుగా వెళ్లి వుంటే - నా కళ్ళకు మాస్కో వేరుగా కనిపించి వుండేదేమో. ఒక మామూలు పౌరుడి జీవితం ఎలా వుంటే బాగుంటుందో- అతడి అవసరాలు ఎలా ఉంటాయో తెలుసుకుని - వాటికి రూపకల్పన చేసినట్టుగా నాకు అనిపించింది. అయితే, కూడూ, నీడా, గుడ్డా మాత్రమే కాదు ఇంకా యేవో ఉంటాయని అక్కడి సామాన్య జనం ఆత్రపడ్డట్టుగా కూడా అనిపించింది. నువ్వు ఎప్పుడూ చెబుతుండే ఒక సి ద్దాంతం గురించి ప్రస్తావించడం సబబుగా వుంటుంది. రామాయణం సంగతేమో కానీ, మన వేదాంతం చెప్పిందీ- అక్కడి కమ్మ్యూనిస్ట్ నాయకులు ప్రభోదించిందీ-. ఉన్నదానితో తృప్తిగా బతకడం. లేని దాని కోసం వెంప ర్లాడక పోవడం.- వెనక మన పల్లెటూళ్ళల్లో భూస్వాములు కూలీలకు తిండి పెట్టి బట్టలు,చెప్పులు ఇచ్చి పనిచేయించుకునేవాళ్ళు.పనివారిని అన్నివిధాలుగా కనిపెట్టి చూసుకుంటున్నామన్న అభిప్రాయం వారిది. అక్కడ ప్రభుత్వాలు కూడా ఇలాగే అనుకున్నాయని కాదు కానీ, - అందరూ సమానమే, కానీ అందులో కొందరు మరింత సమానం - అనే పద్ధతిలో బయలుదేరిన పెడ ధోరణులు ప్రజలలో అసహనానికి కారణమయ్యాయని కొందరు చెప్పుకునేవారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యెక దుకాణాలు పెట్టి, ఆకర్షణీయమయిన పాశ్చాత్య వస్తువులను అతి చవుక ధరలకు స్తానిక కరెన్సీలో విక్రయించడం, సాధారణ పౌరులకు వాటిల్లో ప్రవేశం నిరాకరించడం - ఇలాంటివన్నీ ఆ అసహనం మరింత పెరగడానికి దోహదం చేశాయని కూడా చెప్పుకునేవారు. గోర్బచేవ్ ఇచ్చిన భావ వ్యక్తీకరణ స్వేచ్చ కూడా తోడ్పడి ఉండవచ్చు. రానున్న భాగాలలో రాద్దామనుకుంటున్న 'మార్పులు' ఇవే. ఆ మార్పులు ఎంత తీవ్రంగా యెంత వేగంగా వచ్చాయన్నది చెప్పడమే ఈ రచన ఉద్దేశ్యం .- భండారు శ్రీనివాసరావు

kanthisena చెప్పారు...

సోవియట్ రష్యాలో సోషలిజం ఎందుకు విఫలం చెందింది అనే అంశంపై సైద్ధాంతిక విశ్లేషణల కంటే సామాన్య ఉద్యోగిగా మీ స్వంత కళ్లతో చూసి చెబుతున్న విషయాలే కాస్త స్పష్టంగా చెబుతున్నాయనుకుంటున్నాను.

"ప్రపంచంలో ఏ దేశంలోను, చిన్న రైతు తనకున్న భూమిని సంస్కరణల పేరు మీదో-సిద్ధాంతం పేరు మీదో-కమ్యూనిజం నెపంతోనో, "ప్రభుత్వ పరం" చేస్తామంటే, చావడానికైనా సిద్ధపడుతాడు కాని, భూమిని వదులుకోవడానికి ఇష్టపడడు." జ్వాలాగారి వ్యాఖ్య ఇది. మిఖాయిల్ షోలఖోవ్ రాసిన బీళ్లు దున్నేరు అనే రష్యన్ నవల వ్యక్తిగత ఆస్తి పేరిట ప్రజల ఆస్తిని కూడా ఉన్నఫళాన ఊడలాక్కున్న వైనం, దాని పర్యవసానాల గురించి 1920ల చివర్లో, 30లలో సమిష్టీకరణ పేరిట ఆ దేశంలో జరిగిన పెనుమార్పులు సమాజంలోకలిగించిన భూకంపం గురించి చాలా బాగా రాశారు. ఇప్పుడీ పుస్తకం తెలుగులో దొరుకుతున్నట్లు లేదు. రైతాంగం సమ్మతితో పనిలేకుండా పైనుంచి వచ్చిన బలవంతపు ఒత్తిళ్ల ఫలితంగా సోవియట్ వ్యవసాయం దశాబ్దాలుగా పిడచకట్టుకుపోయింది. మనిషి సమిష్టికోసం జీవిత పర్యంతమూ కృషి చేయడం, వ్యక్తిగతం కోసం ప్రయత్నించండం అనే రెండు భిన్న అంశాలపై సోవియట్ రష్యాలో జరిగిన ప్రయోగం చివరకు దాని పతనానికే దారితీస్తుంది. సమిష్టీకరణ పేరుతో రైతుల ఇళ్లలోని కోళ్లను, పందులను కూడా పట్టుకుని పోయి కమ్యూన్ పరం చేసిన కార్యకర్తల పెను ఉత్సాహం గురించి అప్పట్లోనే స్టాలిన్ విజయోన్మాదం -Dizzy with success- పేరుతో వ్యాసం రాసి కేడరుకు పంపాడు. కానీ కమ్యూనిస్టు పార్టీ మొత్తంగా ఈ విజయోన్మాదానికి గురై కన్నూ మిన్నూ కాకుండా పోయిన ఫలితమే సోవియట్ రష్యా పతనం. పార్టీ కార్యకర్తలకు, నేతలకు స్వర్గ సుఖాలు, చవుక ధరలు, విదేశీ వస్తువులు. మీరు చాలా తక్కువే చెప్పారు జ్వాలా గారూ..! ఇలాంటి చీడలు ఎన్ని సోవియట్ సమాజాన్ని నల్చుకుతిని ఉంటే కదా నూతన సమాజ ప్రయోగం అక్కడ 70 ఏళ్లలోపే కుప్పగూలిపోయింది. లెనిన్ కాలంలో స్వల్పస్థాయిలో అయినా మొదలైన నూతన సమాజ బీజాలకు తదనంతర నాయకత్వం తూట్లు పొడిచిన క్రమంలోనే మానవ సమాజంలో కెల్లా సరికొత్త ప్రయోగం బీటలు వారిపోయింది. 1990ల మొదట్లో దాని చరమాంకం జరిగిపోయింది కూడా. అందుకే సోవియట్ సమాజ ప్రభలు వెలిగిన కాలం, అది పతనమైన కాలం రెండింటిని ప్రత్యక్ష అనుభవంతో, సామాన్యుడి దృక్పధంతో చూస్తున్న, చెబుతున్న 'మార్పు చూసిన కళ్లు' చాలా ప్రాధాన్యత కలిగిన కథనం.

శ్రీనివాసరావు గారూ, మీరిలాగే రాస్తూ పోండి. సోవియట్ సమాజ చరిత్రను సామాన్యుడి కళ్లతో చూసి రాస్తున్న అసామాన్య కథనం ఇది. ప్రతి కథనం కోసం ఎదురుచూస్తుంటాము.

రాజు
చందమామ