19, జనవరి 2010, మంగళవారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మాస్కోలో మా అనుభవాలు- పదకొండో భాగం) -భండారు శ్రీనివాసరావు


ఆ వచ్చిన వాళ్ళెవ్వరూ మా బంధువులు కాదు. కనీసం ముఖ పరిచయం వున్న వాళ్ళు కూడా కాదు. కానీ ఒక్క పూట మా ఇంట్లోగడిపిన 'పుణ్యానికి' ఆత్మ బంధువులుగా మారారు.

నిజానికి అది మా ఆవిడ చేసుకున్న పుణ్యం.ఇంకా చెప్పాలంటే - ఆమెను కట్టుకుని నేను చేసుకున్న పుణ్యం. ఇది మూట కట్టుకోవడానికి చాలా రోజులముందు బందరు నుంచి నాకో రోజు ఓ కార్డు ముక్క వచ్చింది. నిజానికి రాలేదు. నేనే వెళ్లి తెచ్చుకున్నాను. మాస్కోలో వుండే విదేశీయులెవరికీ నేరుగా ఇళ్ళకు ఉత్తరాలు రావు. ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు వస్తాయి. అంటే  హైదరాబాదులో వున్న మా వాళ్ళెవారయినా నాకు ఉత్తరం రాయాలనుకుంటే నా పేరు రాసి  తరవాత  కేరాఫ్ మాస్కో రేడియో అని రాసి డిల్లీలో వున్న మన విదేశాంగ శాఖ కార్యాలయానికి పోస్ట్ చేయాలి. అలా వచ్చిన ఉత్తరాలనన్నింటినీ 'డిప్లొమాటిక్ బాగ్ లో' వారానికోసారి మాస్కోకు విమానంలో పంపుతారు. మన ఎంబసికి చేరిన ఉత్తరాలను మనమే వెళ్లి వెదికి తెచ్చుకోవాలి.అలా ఉత్తరాలను గాలించి తెచ్చుకోవడంలో వున్న తృప్తి అనుభవిస్తే కానీ అర్ధం కాదు. చుట్టపక్కాలనుంచివచ్చే  ఉత్తరం ముక్కకోసం ఎంతగా మొహం వాచిపోయేవాళ్లమో ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది.   మేము జవాబు రాయాలన్నా ఇదే వరస. ఇందులోవున్న ఏకైక సౌలభ్యం ఏమిటంటే మనకు ఉత్తరాలు రాసేవాళ్ళు ఎయిర్ మెయిల్ స్టాంప్  ఖర్చులు పెట్టుకోనక్కరలేదు. మామూలు తపాల స్టాంపులతో డిల్లీకి పోస్ట్ చేస్తే సరిపోతుంది. అక్కడనుంచి రాయాలన్నప్పుడు మాకూ అంతే. అందుకే ఎవరయినా వస్తున్నప్పుడు ఏమి పట్టుకురావాలని అడిగినప్పుడు ఇండియన్ స్టాంపులు తెమ్మని అడిగేవాళ్ళం. ఈ ఉత్తరాలతో పాటే ఇండియా నుంచి  ఇంగ్లీష్ దినపత్రికలు వచ్చేవి. వాటిల్లో బెంగళూరు నుంచి వెలువడే హిందూ వుండేది..మన రాష్ట్రం సమాచారం తెలియాలంటే హిందూలో హైదరాబాద్ నుంచి వారం వారం హెచ్ జే రాజేంద్రప్రసాద్ గారు రాసే ఆంద్ర ప్రదేశ్ న్యూస్ లెటర్ ఒక్కటే శరణ్యం.


 తరువాతి రోజుల్లో మాస్కోకు వచ్చిన అప్పటి ఆంద్ర జ్యోతి ఎడిటర్ -  ఐ. వెంకట్రావు గారు  తెలుగు పత్రిక కోసం అక్కడి తెలుగువాళ్ళు పడుతున్న  ఆరాటాన్ని గమనించి- హైదరాబాద్ తిరిగి వెళ్ళగానే ఎంబసీ ద్వారా ఆంద్ర జ్యోతి దినపత్రికను పంపడం ప్రారంభించారు.మాస్కోలో ఉంటున్న తెలుగు వారిలో నా పరపతి పెరగడానికి ఇది దోహదం చేసింది కూడా. ఇక కార్డు విషయానికి వస్తే-
కార్డు కదా! కొంత విరామం తీసుకుందాం. ఏమంటారు?NOTE: All the images in this blog are copy righted to their respective owners.

5 వ్యాఖ్యలు:

Jwala's Musings చెప్పారు...

ఉత్తరాలు రాయడం, జవాబు కొరకు ఎదురు చూడడం, ఆలశ్యమైతే ఏదోలా కావడం, వచ్చిన కొన్ని రకాల ఉత్తరాలను కుటుంబ సభ్యులందరు ఎగబడి చదవడం... ... ఆ రోజులు మళ్లీ తిరిగి రావు. ఉత్తరాలలో "ఉభయ కుశలోపరి" కి అదనంగా, వర్తమాన విషయాలెన్నింటినో చర్చించుకున్న రోజులు కూడా ఇక ఉండవేమో. అయినా.. ఈ-మెయిల్లు వున్నాయన్న ఆనందం మిగిలింది. ఇక కొన్నాళ్లకు పోస్టాఫీసులుండవేమో ! సోవియట్ యూనియన్-మాస్కో లాగా ఉత్తరాలకు ఎదురుచూసే మంచి రోజులు మళ్లా వస్తే ఎంత బాగుంటుందో ! నాగ పూర్ కు, మాస్కో కు పోలిక లేకపోయినా, నాకిలాంటి అనుభవమే నేనక్కడ నలభై సంవత్సరాల క్రితం చదువుకుంటున్నప్పుడు కలిగింది. పోస్ట్ మాన్ రూమ్ దగ్గరకు వచ్చేసరికి ఆలశ్యమవుతుందేమోనని, ఉత్తరాలు రాకపోతాయానన్న ఆశతో, నాగ్ పూర్ లో వున్నప్పుడు, అక్కడికే పోయి, నిరాశతో-సంతోషంతో తిరిగొచ్చిన రోజులు గుర్తుకొస్తున్నాయి ఈ ఆర్టికల్ చదువుతుంటే.
వనం జ్వాలా నరసింహారావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

శ్రీ 'మతి మరపు'
ఉత్తరం రాసేసాననుకుని
పోస్టులో వేసేసాననుకుని
రాని జవాబుకోసం ఎదురుచూడడం
మా ఆవిడ పని
అని ఏనాడో ఆంద్ర జ్యోతిలో నేను రాసిన 'వాక్ట్యూన్' గుర్తుకొచ్చింది
నీ స్పందన చదివినతరవాత.
మాస్కో వెళ్లిన కొత్తల్లో నేను రాసిన ఉత్తరం నీ దగ్గర దొరికే అవకాశం ఉందా?
-భండారు శ్రీనివాసరావు

Kalpana Rentala చెప్పారు...

శ్రీనివాస రావు గారు, ఎలా వున్నారు? మీ మాస్కో అనుభవాలు కొత్త విషయాలు తెలియచేస్తున్నాయి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

thanks kalpana garu
after a long time i heard from you. i am in touch with jayadev.can i have your email please?
happy new year
my email:bhandarusr@yahoo.co.in
mobile: 098491 30595 (hyd)

Jwala's Musings చెప్పారు...

I do have few letters-certainly the entire correspondence between me and your niece. About this letter I will be able to tell you after I return from San Francisco. In fact, as an experiment, we have been keeping the packet with the "Letters Lot" in an OPEN PLACE which, with little bit of effort, could be accessed by any one who either stay in my house or visit frequently. BUT THEY ARE IN-TACT TILL THIS DAY UN SEEN BY ANY ONE.
Jwala