17, జనవరి 2010, ఆదివారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు- తొమ్మిదో భాగం) -భండారు శ్రీనివాసరావుపిలవకుండానే పలికే డాక్టర్లు.

ఉదయం పది గంటలు దాటుతోంది. పిల్లలు స్కూలుకు వెళ్ళారు. మా ఆవిడతో కలసి హిందీ రామాయణం కొత్త ఎపిసోడు కాసెట్ చూస్తున్నాము. ఇంతలో డోర్ బెల్ మోగింది. తలుపు తెరిచి చూస్తె నలుగురయిదుగురు రష్యన్లు. 'దోం  సెం దేసిత్  జేవిచ్ పజాలుస్తా' అందులో ఒకతను అంటున్నాడు. పజాలుస్తా (ఇంగ్లీష్ లో ప్లీజ్ ) అన్న పదం తప్ప ఏమీ అర్ధం కాలేదు. తొంగి చూస్తె వారి వెనుక ఒక చక్రాల కుర్చీ కనిపించింది. ఒక్క క్షణం కేజీబీ వాళ్ళేమోనన్న అనుమానం మనసులో మెదిలింది. వాళ్ళను లోపలకు రమ్మని సైగ చేసాను. కూర్చోమన్న నా అభ్యర్ధనను పట్టించుకోకుండా ఇంట్లో ఇంకా ఎవరయినా వున్నారా అన్నట్టుగా కలయచూస్తున్నారు. సమయానికి పిల్లలు కూడా లేకపోవడంతో- మా ఆవిడ పై అంతస్తులో వుండే జస్వంత్ సింగ్ భార్యను పిలుచుకుని వచ్చింది. ఆ కుటుంబం చాలా ఏళ్ళుగా మాస్కోలో వుంటున్నారు కాబట్టి రష్యన్ బాగా వచ్చు. ఆవిడ వాళ్ళతో మాట్లాడి హిందీలో మళ్ళీ మాకు చెప్పినదాన్నిబట్టి అర్ధం అయింది ఏమిటంటే - ఆ వచ్చిన వాళ్ళు డాక్టర్లు. మా ఇంట్లో ఎవరికో బాగా లేదని వారికి సమాచారం అందిందిట. అంతే! రయ్యిమని వచ్చేసారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ ఉండగానే కొంత ఆలస్యంగానే అయినా బుర్రలో లైటు వెలిగింది. అంతకు కొద్ది సేపటిక్రితం రేడియోకు ఫోన్ చేసి గీర్మన్ తో మాట్లాడిన సంగతి గుర్తుకు వచ్చింది. ఆఫీసు కు పోవడానికి బద్ధకం వేసి 'జలుబుగా వుంది, ఈ రోజు రాలేనని' చెప్పాను. బహుశా అతను ఈ విషయం సంబంధిత అధికారులకు చేరవేసివుంటాడని జస్వంత్ సింగ్ గారి భార్య మాకు టీకా తాత్పర్యం చెప్పింది. మాస్కోలో అంబులెన్సులు రాత్రింబగళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఏ ఇంటి నుంచి సమాచారం అందిందో - ఆ ఇంటికి దగ్గరలో తిరుగాడుతున్న అంబులెన్సుకు వైర్ లెస్ లో వివరాలు తెలియచేస్తారు. నిమిషాల వ్యవధిలో వారు అక్కడికి చేరుకొని వైద్య సహాయం అందిస్తారు. మొత్తానికి ఉత్తుత్తి జలుబు పుణ్యమా అని మాస్కో జీవితంలోని మరో మంచి కోణం తెలుసుకోగలిగాము. వచ్చిన డాక్టర్ల బృందానికి ఏ భాషలో క్షమాపణలు చెప్పామో గుర్తులేదు కానీ ఆఫీసుకు డుమ్మా కొట్టడానికి మేము ఎన్నుకున్న ఎత్తుగడను అర్ధం చేసుకుని నవ్వుకుంటూ వాళ్ళు  వెళ్ళిపోవడం మాత్రం ఇంకా కళ్లల్లో మెదులుతున్నట్టేవుంది.
పోతే, పనిలో పనిగా జస్వంత్ సింగ్ గారి భార్య అంబులెన్సు సర్వీసు గురించి మరి కొన్ని సంగతులు మా చెవిన వేసి వెళ్ళింది. మైనస్ ముప్పయి, నలభయి డిగ్రీలవరకు ఉష్ణోగ్రతలు పడిపోయే ఆ నగరంలో వోడ్కా అనేది అక్కడి జనాలకు ఒక నిత్యావసర వస్తువులాంటిది. వొళ్ళు వెచ్చగా ఉంచుకోవడానికి వోడ్కా పుచ్చుకునే వారు కోకొల్లలు. ఈ విషయంలో కూడా అక్కడ మహిళలలదే పైచేయి.

మాస్కోలో 'దేవదాసులు'
 తాగి తాగి ఆ తాగిన మత్తులో మంచులో తూలి పడిపోయి ఇంటికి చేరలేని   డోసు బాబులను అంబులెన్సు బృందాలు  వెతికిపట్టుకుని ఆసుపత్రులకు చేరవేస్తుంటాయట. వారివద్దవుండే ప్రోపుస్కా (ఫోటో గుర్తింపు కార్డు) ఆధారంగా వారి ఇళ్ళకూ, ఆఫీసులకూ సమాచారాన్ని అందిస్తాయిట.  అంతే కాదు , ఆసుపత్రుల్లో అలా చేరిన వారు పూర్తిగా కోలుకునే వరకూ వాళ్లకు జీతంతో కూడిన సెలవు ఇవ్వడమనేది కొసమెరుపు.
    
(మాస్కో  గురించి మరో మంచి ముచ్చట మరో సారి )

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

--

5 వ్యాఖ్యలు:

Jwala's Musings చెప్పారు...

ఎవరు రాసింది వారే చదువుకునే అలవాటు పెరిగిపోతున్న ఈ రోజుల్లో, మళ్లీ-మళ్ళీ చదవాలనిపించే "మార్పు చూసిన కళ్లు" వ్యాస పరంపరలోని తరువాయి భాగం ఎప్పుడు భండారు వారి బ్లాగ్ లోకి చొరబడుతుందానని, చిన్న తనంలో, వచ్చే నెల చందమామ సంచిక కొరకు ఎదురు చూసేవాడిలాగా ఎదురుచూస్తున్న వాళ్లలో నేనొకడిని. త్వర-త్వరగా కొనసాగించుగాని, పూర్తిచేయకు. ఇంకా-ఇంకా చదవాలనిపించే ఇలాంటివి అయిపోతాయేమోనన్న బాధ మిగల్చకు.

వనం జ్వాలా నరసింహారావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

thanks. a simple word but which can convey a lot - bhandaru srinivasrao

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

అర్ధం చేసుకుని ఆస్వాదించని రసహృదయులు లేని చోట కవిత్వం పలికించడం అంత వృధా లేదంటారు.
పాతికేళ్ళ తరవాత మా వారు రాసింది చదివి పులకించే మీలాంటి వారున్న సంగతి తెలుసుకుని నా మనసు కూడా ఎంతో పులకిస్తోంది. రాసిన మా వారికన్నా రాసింది చదివి స్పందించే మీ రస హృదయానికి నా నమోవాకాలు.
భండారు నిర్మలాదేవి

అజ్ఞాత చెప్పారు...

అడిదం అప్పారావు శాస్త్రి గురించి వాడి నీతి మాలిన బ్రతుకు గురించి క్రింది లింక్ లో చూడండి.

http://telugusimha.blogspot.com/

kanthisena చెప్పారు...

సరిగ్గా నాది కూడా జ్వాలా గారి బాధలాంటిదే. 20 రోజుల వ్యవధిలో 13 మాస్కో అనుభవాలను రాసి పోస్టే చేశారు మీరు. చిన్న విషయం కాదు. అలాగని వెంటనే ముంగించేయకండి. మీ మనసు పొరల్లో దాగి ఉన్న అతి చిన్న అంశాలను కూడా పొందుపర్చి మీ మాస్కో అనుభవాలను పొడిగించండి. మీ శైలి పట్టేస్తోంది మమ్మల్నందరినీ.. అంతగా ఆకట్టుకుంటున్నారు. మా అందరిదీ ఒకే మాట .... కొనసాగించండి. ఇలాగే రాస్తూ పోండి..