7, జనవరి 2010, గురువారం

మార్పుచూసిన కళ్ళు - ఆనాటి సోవియట్ మాస్కో అనుభవాలు - రెండో భాగం - భండారు శ్రీనివాసరావు


ఇంగువ తెచ్చిన తంటా


మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయం

మాస్కో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
  
అక్టోబర్ - 31,1987 - అంటే శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి రోజున - ఢిల్లీ నుంచి సోవియట్ ఎయిర్ లైనర్ 'ఎరోఫ్లోట్' లో కుటుంబంతో కలసి మాస్కో బయలుదేరాను. కొన్ని మాసాలుగా ఎదురుచూసిన క్షణం దగ్గర పడుతుంటే విమానం విండో నుంచి కిందకు చూసే ప్రయత్నం చేసాము. కళ్ళు చికిలించుకుని చూసినా దట్టంగా అలుముకున్న పొగమంచులో ఎమీకనబడలేదు. మరికొద్దిసేపటిలోనే మా విమానం మాస్కో పొలిమేరల్లోని ' శేర్మేతోవా' అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. విద్యుత్ దీపాల కాంతిలో ధగ ధగాలాడుతూ, పలుదేశాల ప్రయాణీకులతో ఎయిర్ పోర్ట్ కళకళలాడుతోంది. మాస్కోలో వేజిటేరియన్లకు ఏమీ దొరకవు ఉప్పూ , పాలూ తప్ప అన్న హెచ్చరికలతో బయలుదేరిన మేము- లగేజి కలెక్ట్ చేసుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము. హైదరాబాద్ నుంచి సూటుకేసులనిండా పట్టుకొచ్చిన వంట సంభారాలతో కస్టమ్స్ అధికారులనుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు కానీ మా ఆవిడ తెచ్చిన ఇంగువ డబ్బా కొంత తంటా తెచ్చిపెట్టింది.ఇంగువని ఇంగ్లీష్ లో ఏమంటారో ఆ క్షణాన గుర్తురాలేదు. అది తినే వస్తువనీ, వంటల్లో వాడుకుంటామనీ ఎన్నోవిదాలుగా చెప్పిచూసాను. ఇంగ్లీష్ భాష ఇసుమంతకూడా అర్ధం కాని ఆ అధికారులముందు నా ప్రయత్నం వృధా ప్రయాస అయింది. పైపెచ్చు ఘాటయిన ఇంగువ వాసన వారి అనుమానాలను మరింత పెంచింది. చివరకు ఇంగువ ముక్క నోటిలో వేసుకుని నమిలి చూపించి ప్రమాదకరమూ, మాదక పదార్ధమూ కాదని రుజువు చేసుకున్న తరవాతనే అక్కడనుంచి బయట పడగలిగాము.

ఇల్లా? హోటలా?

బయటపడ్దామని అన్నానే కానీ బయటపడడం అంత సులభమయిన విషయం కాదని మాకు వెనువెంటనే తెలిసివచ్చింది.

మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మాస్కో రేడియో తరపున 'సెర్గీ' అనే ఉద్యోగి ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. అతడి చేతిలో మా పేర్లు ఇంగ్లీష్ లో రాసివున్న ప్లకార్డు చూసి ఒకరినొకరం గుర్తు పట్టాము. హైదరాబాద్ చిక్కడపల్లిలో కొన్న స్వెట్టర్ లతో ప్రస్తుతానికి పని లాగిద్దామని దిగబడిన మమ్మల్ని చూసేసరికి అంత చలిలోనూ అతడికి చెమటలు పట్టినట్టున్నాయి. రష్యన్లో అతడు చెబుతున్నదేదో మాకు అర్ధం కావడం లేదన్న విషయాన్ని అతడే అర్ధం చేసుకుని మమ్మల్ని తీసుకువెళ్ళడానికి తెచ్చిన వాహనాన్ని ఎయిర్ పోర్ట్ లాంజ్ ఎగ్జిట్ గేటు వరకు తీసుకునివచ్చాడు. కారులో లగేజి ఎక్కించిన తరవాత- కారు డోరు తెరిచే వుంచి - ఒకే అంగలో వెళ్లి కారెక్కమని సైగలతో చూపించాడు. మేమంతా ఒక్క ఉదుటున వెళ్లి కారెక్కాము. అప్పుడు అర్ధమయింది మాకు - మా గురించి అతడు పడిన ఆదుర్దా. ఎగ్జిట్ గేటు నుంచి కారెక్కడానికి మాకు పది సెకన్లు కూడా పట్టివుండదు. కానీ ఆ కాసేపటిలోనే చేతి వేళ్ళన్నీ చలితో కొంకర్లు తిరిగిపోయాయి. మాస్కో చలి పులి విసిరే పంజా దెబ్బ మాకు మొదటిరోజునే అనుభవంలోకి వచ్చింది. అదృష్టవశాత్తూ కారులో హీటరు ఉండడంవల్ల బిగుసుకుపోయిన అవయవాలన్నీ మళ్ళీ స్వాధీనంలోకి వచ్చాయి.

పట్టపగలు మంచుదుప్పటిలో మాస్కో నగరం  

మంచు కురిసే వేళలో

మా లెక్క ప్రకారం అది పగటి వేళ అయివుండాలి. కానీ, వీధి దీపాలన్నీ దివిటీలమాదిరిగా వెలుగుతున్నాయి . వాహనాలను హెడ్ లైట్ లు వేసుకుని నడుపుతున్నారు . అదేపనిగా మంచు కురుస్తూ ఉండడంవల్ల - పగలో రాత్రో తెలియని అయోమయావస్తలో ఉండగానే మా కారు పలు అంతస్తుల భవనం ఒకదానిముందు ఆగింది


మాస్కోలో మేము కాపురమున్న 'రేడియో మాస్కవా' భవనం  

ఎయిర్ పోర్ట్ అనుభవం ఇంకా  గుర్తు ఉండడంతో ఈసారి అందరం ఎక్కువ ఇబ్బంది పడకుండానే లోపలకు ప్రవేసించాము. మమ్మల్నీ, మా సామానునీ తొమ్మిదో అంతస్తులో వున్న ఒక అపార్ట్ మెంట్ కు చేర్చి - సెలవు తీసుకున్నాడు. లోపలకు వెళ్లి చూస్తె కళ్ళు తిరిగేలావుంది. రెండు పడక గదులు, ఒక డ్రాయింగు రూము, వంటగది, సామాను గది, మంచాలు, పరుపులు,దిండ్లు, దుప్పట్లు,టీవీ, నాలుగు బర్నర్ల స్టవ్, గ్యాస్, బాత్ టబ్, షవర్ ఒకటేమిటి సమస్తం అమర్చి పెట్టి వున్నాయి. ఒక క్షణం ఇది ఇల్లా లేక హోటలా అన్న అనుమానం కలిగింది.ఆ పూతకి వంట జోలికి పోకుండా ఇండియా నుంచి తెచ్చుకున్న తినుబండారాలతోనే సరిపెట్టుకున్నాము.

రష్యన్ టీవీ తెరపై గోర్భచేవ్

 సోఫాల్లో సర్దుకు కూర్చుని టీవీ ఆన్ చేస్తే సోవియట్ కమ్యూనిస్ట్ అధినాయకుడు మిహాయిల్ గోర్బచేవ్ అనర్ఘలంగా ప్రసంగిస్తూ కానవచ్చారు. భాష అర్ధం కాకపోయినా వింటూనే నిద్రలోకి జారిపోయాము.

 'రష్యన్ మహిళ నోట తెలుగు మాట' వినడానికి కొంత వ్యవధానం)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

5 వ్యాఖ్యలు:

mani చెప్పారు...

bagunnayi mamayya mee anubhavalu...mamuluga akkadela vuntundi anna prati chinna sangati adagalante kudaradu..kani ivi chaduvutunte memu kuda mee anubhavalloki parakaya pravesam chesi aa anubhutuni sontham chesukuntunnamu....

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

thanks for the interest you are showing in my article - bhandaru

kvsv చెప్పారు...

కళ్ళకు కట్టినట్టు వ్రాశారు స్టెప్ బి స్టెప్ ..చాలా బాగుంది ..మాలా అక్కడికి వెళ్లని వారికి..please continue

kanthisena చెప్పారు...

భండారు శ్రీనివాసరావు గారూ,
మీ మిత్రుడు, బంధువు శ్రీ జ్వాలా నరసింహారావు గారి ద్వారా ఈ రోజే మీ బ్లాగు పరిచయమయింది. ఆయన పదేళ్లక్రితం రాసిన రామాయణం మార్క్సిజం - సాహిత్యంలో మానవవిలువలు అనే ప్రసంగ వ్యాసానికి -సుజనరంజని- నేను చేర్చిన చిన్న వ్యాఖ్యతో మీ ఇద్దరి అమూల్య పరిచయ భాగ్యం ఏర్పడింది.

మీ సోవియట్ రష్యా అనుభవాలు 3 భాగాలను ఈ రోజే చదివి నా సిస్టమ్‌లో భద్రపర్చుకున్నాను.

ఏడు దశాబ్దాలకు పైగా సాగిన మొట్టమొదటి 'సోవియట్ యూనియన్' కమ్యూనిస్ట్ ప్రభుత్వ చరమాంకాన్ని కళ్ళారా చూడగలిగిన అరుదయిన అవకాశాన్ని ఆలంబనగా చేసుకుని - 'మార్పు చూసిన కళ్ళు' అనే పేరుతో ఆనాటి అనుభవాలను గుదిగుచ్చి గ్రంధస్తం చేయాలనే ప్రబలమయిన కాంక్ష...

"ఆ రోజుల్లో 'అలా వుండేది, యిలా వుండేది' అని రాస్తే నమ్మడానికి వీల్లేకుండా ఈనాటి రష్యన్ల జీవన విధానాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. రతనాలను రాశులుగా పోసి- వీధి అంగళ్ళలో విక్రయించిన 'స్వర్ణ యుగాలు' చరిత్ర పుటల్లో ఆనవాలుగా మిగిలిపోయినట్టే - ఆ నాటి నా అనుభవాలు కూడా.

నేను కమ్యూనిష్టుని కాను. వృత్తి రీత్యా వివిధ రాజకీయ పార్టీలవారితో అంటకాగి తిరిగివుండ వచ్చు కానీ ఏ రకమయిన రాజకీయ వాసనలను నేను వొంటబట్టించుకోలేదు. ఒక సామాన్యుడిగా అప్పటి కమ్యూనిస్ట్ రష్యాలో కాలు మోపాను . అక్కడ నేను గడిపిన 'జీవనం' నా జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం.

ఆ రష్యన్ మహిళ - జగదేకవీరుడు సినిమాలో సరోజాదేవి మాదిరిగా తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే అది చూసి నేనూ మా ఆవిడా అవాక్కయ్యాము. దేశం కాని దేశంలో తెలుగు మాట్లాడే విదేశీ వనిత ఒకరు వున్నారని తెలుసుకుని యెంతో సంతోషపడ్డాము.

నేనూ, నా భార్యా పిల్లలూ - అత్యంత సుఖప్రదమయిన, గౌరవప్రదమయిన, తృప్తికరమయిన రోజులు గడిపింది ఆ రోజుల్లోనే. వాటిని గురించి ఏ కొంచెం చెప్పినా గోరంతను 'కొండంత' చేసి చెబుతున్నానేమో అని అనిపించక తప్పదు. అందుకే 'మార్పు చూసిన కళ్ళు' అక్షరబద్ధం చేయడానికి ఇంతగా తటపటాయించాల్సివచ్చింది."

రావుగారూ,
మీరు తటపటాయించవద్దు. మీరు ఈ మూడూ భాగాలలో చెప్పిన ప్రతి విషయాన్ని అక్షరాక్షరంగా విశ్వసిస్తున్నాం. వృత్తి జీవితానికి సంబంధించి మీరు ఆత్మావిష్కరణ చేస్తున్నారు. ఎవరికీ భయపడనవసరం లేదు. ఆద్యంతం ఆసక్తితో సాగుతున్న మీ సోవియట్ యూనియన్ జీవితాన్ని ఇలాగే రాస్తూ పోండి. నాటి సోవియట్ సమాజంలో మీరు చూసిన ప్రతిదీ -సానుకూలమైనది, ప్రతికూలమైనది- నిష్పాక్షికంగానే రాయండి. ఓ మహావ్యవస్థ ఉత్థాన పతనాలను మీరు నూటికి నూటిపాళ్లూ న్యాయం చేస్తూ రాయగలరనే సంపూర్ణ విశ్వాసం మీ మూడు భాగాలను చదివిన తర్వాత మావంటి వారికి ఏర్పడుతోంది. మీ సోవియట్ అనుభవాలను వీలైనంత వివరంగా రాయండి.

3 రోజులవ్యవధిలో ఇద్దరు మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడినందుకు చాలా సంతోషంగా ఉంది.

రాజశేఖర రాజు
చందమామ
blaagu.com/chandamamalu
telugu.chandamama.com

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

'మార్పు చూసిన కళ్ళు ' చదువుతున్నవారికి రచయిత విజ్ఞప్తి:
చరిత్రలో 'గుప్తుల స్వర్ణ యుగం' చదువుకున్నాము. నిజమా కాదా అన్న మీమాంసకు ఎవ్వరం తావివ్వలేదు. ఇదీ అలాగే.
ఆ రోజుల్లో మాకు ప్రతి రోజు 'ఇది నిజంగా నిజమేనా?' అనే సందేహం వెంటాడుతూనే వుండేది. ఇన్నేళ్ళ తరవాత మళ్ళీ గుర్తు చేసుకుని రాస్తున్నప్పుడు కూడా ఆ సందేహం అంటిపెట్టుకునే ఉంటోంది. మెదడులో నిక్షిప్తం చేసుకున్న విషయాల సింహావలోకనమే ఈ రచన. డయిరీల్లో రాసుకున్నది కాదు. అందువల్ల సమగ్రతకు కొంత భంగం వాటిల్లడమో లేదా విషయాలను ఒకచోట గుదిగుచ్చడంలో ఒకమేరకు అస్పష్టతకు అవకాశం ఏర్పడడమో, పునరుక్తి దోషాలకు తావివ్వడమో జరిగివుంటే పెద్ద మనసుతో నన్ను క్షమించాలని కోరుతున్నాను. అలాకాక చరిత్ర వక్రీకరణ కనిపిస్తే నిర్మొహమాటంగా తెలియచేసి దిద్దుబాటుకు అవకాశం ఇవ్వాలని మనస్పూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను.
-భండారు శ్రీనివాసరావు
302, మధుబన్, ఎల్లారెడ్డిగూడా,
శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ - 500 073.
ఫోన్: 040-23731056 (email: bhandarusr@yahoo.co.in)