3, జులై 2024, బుధవారం
నిజంగా తప్పే - భండారు శ్రీనివాసరావు
2, జులై 2024, మంగళవారం
చిట్కా - భండారు శ్రీనివాసరావు
1, జులై 2024, సోమవారం
వున్నంతలో మానవ సేవ – భండారు శ్రీనివాసరావు
నిన్న ఆదివారం (30-6-24) వినుకొండ రైల్వే స్టేషన్
వందలాదిమంది జనంతో కిక్కిరిసిపోయింది. వారెవరూ ప్రయాణీకులు కాదు. ఆ స్టేషన్ లో
చిరకాలం పనిచేసి పదవీ విరమణ చేస్తున్న ఓ చిరుద్యోగికి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన
వాళ్ళు వారు. ఓ రైల్వేఉద్యోగి, అదీ బుకింగ్ క్లర్క్ స్థాయి నుంచి సూపర్నెంట్
స్థాయికి ఎదిగిన వ్యక్తికి పదవీ విరమణ శుభాకాంక్షలు చెప్పడానికి ఇంతమంది జనం రావడం
ఏమిటి? మేళతాళాల
సందడి ఏమిటి?
ఇంతకీ ఎవరితగాడు? ఏమా కధ. తెలుసుకోవాలంటే ఓ ముప్పయ్ నలభయ్ ఏళ్ళు వెనక్కి
పోవాలి.
స్టేషన్ లో నైట్ డ్యూటీ ముగించుకుని బయటకు
వచ్చాడు. ఇంటికి పోవడానికి రిక్షా కోసం చూసాడు. నిర్మానుష్యంగా ఉన్న రైల్వే
ప్రాంగణంలో ఒకే ఒక రిక్షా కనబడింది. వెళ్లి ఎక్కాడు. రిక్షా మనిషి లాగలేక
లాగుతున్నట్టు అనిపించింది. ఆరా తీసాడు. రెండు రోజులుగా జ్వరం. రిక్షా లాగకపోతే బతుకు
గడవదు. అదొక్కటే ఆధారం. చేతకాకపోయినా బండి బయటకు తీశాడు. విషయం తెలియగానే మనవాడు
వెంటనే రిక్షా దిగాడు. రిక్షా మనిషిని వెనక కూర్చోబెట్టుకుని తొక్కుకుంటూ అతడ్ని
ఇంటికి చేర్చాడు. జేబులో వున్న డబ్బు లెక్కపెట్టకుండా తీసి అతడి చేతిలో పెట్టాడు.
అతడితో చెప్పాడు,
మర్నాడు ఉదయం మళ్ళీ వస్తానని, కొద్ది రోజులు రిక్షా తొక్కవద్దని. అంతవరకూ అతడి
బాగోగులు తానె చూసుకుంటానని.
అన్నాడే కానీ, తను కూడా ఓ చిరుద్యోగి. ఉద్యోగం
అప్పటికి పర్మనెంట్ కాలేదు. చేతికి వచ్చేది చాలా తక్కువ. మరి రిక్షా మనిషికి తోడు
పడడం ఎలా. నిద్ర పోకుండా ఆలోచిస్తున్న అతడికి ఓ ఆలోచన స్పురించింది. అలా చేస్తే
అందరూ ఏమనుకుంటారు అని ఒక్క క్షణం ఆలోచిస్తే ఇక అడుగు ముందుకు పడదు అని
నిశ్చయించుకున్నాడు. తన నిర్ణయంలో బాగోగులు కంటే రిక్షా మనిషి బాగోగులు ముఖ్యం అనుకున్నాడు.
అతడి ఇంటికి వెళ్ళాడు. రిక్షా తన చేతిలోకి
తీసుకున్నాడు. పగలల్లా రిక్షా తొక్కి వచ్చిన డబ్బులు అతడి చేతిలో పెట్టి నైట్ డ్యూటీకి వెళ్ళాడు. ఇలా వారం రోజులు పగలు
రిక్షా తొక్కి, రాత్రీ ఉద్యోగం చేసీ, రిక్షా మనిషి ఆరోగ్యం కుదుటపడేవరకు
శ్రమించాడు. ఈ విషయం మూడో మనిషికి తెలియదు.
తన నాలుగు దశాబ్దాల ఉద్యోగపర్వంలో ఇలాంటి స్వచ్చంద
సేవలు ఎన్నో చేశాడు. సాయం చేసిన తనకూ, సాయం పొందిన వారికీ తప్ప ఎవరికీ తెలియకుండా
జాగ్రత్త పడ్డాడు.
అందుకే పదవీ విరమణ రోజున అంత జనం. వినుకొండలోని
ఆటో రిక్షాల వాళ్ళు అతడ్ని ఇంటి నుంచి రైల్వే స్టేషన్ కు పెద్ద ప్రదర్శనగా
తీసుకువచ్చారు. ఎక్కడో కృష్ణా జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో పుట్టి, ఉద్యోగ రీత్యా
ఎక్కడో దూరంగా ఉన్న వినుకొండను తన స్వస్థలం చేసుకుని, నలుగురికీ తలలో నాలుకలా ఉంటూ,
ప్రజాసేవ చేయడానికి పెద్ద పదవులు ఏమీ అక్కర లేదని, వున్నంతలో కూడా అవసరాల్లో ఉన్నవారికి సాయం చేయవచ్చని
నిరూపించాడు.
అతడి పేరు చామర్తి భవానీ శంకర్,
మేమందరం శ్రీధర్ అని పిలుస్తాము. మాది బాదరాయణ సంబంధం కాదు. శ్రీధర్ ఎవరో కాదు, స్వయానా మా రెండో అన్నగారు భండారు రామచంద్రరావు
గారి బావమరది.
29, జూన్ 2024, శనివారం
‘ఇదేమి సినిమా?‘
‘అదేమరి! మీ వయసు వాళ్ళు చూసే సినిమా కాదది.’
‘అవును. ఏమిటో ఆ
యుద్ధాలు. ఎవరు ఎవరితో కొట్టుకుంటున్నారో, ఎందుకు కొట్టుకుంటున్నారో అర్ధం కాలేదు.
అదృష్టం ఏమిటంటే థియేటర్లో రుధిరం పారలేదు, అధునాతన మారణాయుధాల పుణ్యమా అని. ఆ యుద్ధాలు చూసిన
తర్వాత సినిమాలో ఒక పాత్రకే కాదు, ఎవ్వరికీ చావు లేదేమో అనిపించింది.’
‘ఇంకా’
‘ ఒక్కో టిక్కెట్టు నాలుగు
వందలు. యాభయ్ ఏళ్ళ క్రితం నా మొదటి ఉద్యోగంలో మొదటి జీతం రెండువందల యాభయ్. మరి
మండదా! ఆరువందల కోట్ల సినిమా అంటున్నారు. వారి డబ్బు బూడిదలో పోసినా, వారికి పన్నీరే
దక్కుతోంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అలా వున్నాయిట భారీ స్థాయిలో కలెక్షన్లు ఇంటా బయటా కూడా. హైదరాబాదులో ఏ థియేటర్ లో కూడా మరో సినిమా లేదు, ఇది తప్ప, ఒకే దేశం ఒకే సినిమా లాగా. తీసిన వాళ్ళు సరే,
కానీ నా నాలుగు వందలు బూడిద పాలే కదా!’
‘తెలుగు సినిమాని
అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళే సినిమాకి ఆ మాత్రం డబ్బు ఖర్చు చేస్తే తప్పేమిటి’
‘’పోరాటాలు, యుద్ధాలు హాలీవుడ్ స్థాయిని మించిన మాట నిజమే. కానీ కధ
సంగతి ఏమిటి? రివ్యూలు
చదివి, చూసిన వాళ్ళు కూడా ఏమీ అర్ధం
కాలేదు అనేవాళ్ళు బోలెడుమంది. అలాంటి కళ్ళు
చెదిరే సన్నివేశాలు చూడడానికి ఇంగ్లీష్ సినిమాలు ఎలాగు వున్నాయి. అవతార్ లు, స్టార్ వార్స్ చూడలేదా! పైగా ఇందులో లేని
యాక్టర్ లేడు అన్నట్టు బిల్డప్. అమితాబ్, ప్రభాస్, బ్రహ్మానందం
ఇలా కొందర్ని తప్పిస్తే మేకప్ ముసుగులో ఎవర్నీ గుర్తు పట్టేట్టు లేరు. ఎవరో
అంటుంటే వినబడింది, సినిమా
మొదట్లో కనబడిన ఒక పాత్రలో నటించిన మనిషి రాజేంద్రప్రసాద్ లాగా అనిపించాడు
అని. చివరికి, చివర్లో కనపడ్డ కమల్ హసన్ కూడా అంతే. జగన్నాధ రథచక్రాలు అనే డైలాగ్
ని బట్టి కొందరు గుర్తు పట్టారు. ఏదైనా అంటే ఈ చిత్రంలో పాత్రలు కనిపిస్తాయి, నటులు కనిపించరు అని. ఈ మాత్రం దానికి అంత స్టార్
కాస్ట్ ఎందుకు, ప్రొడక్షన్
కాస్ట్ పెరగడానికి తప్పిస్తే’
‘అదే చెప్పేది, ఆ డబ్బు ఎవరికి పోయింది. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్లు
మనవే కదా! ప్రపంచ స్థాయి సినిమా తీసిన వారిని అభినందించాలి కానీ, ఇలా సన్నాయి నొక్కులు నొక్కితే ఎలా?’
‘నేను చెప్పేది అదే. కోట్లాది
డబ్బులు కోట్లాది డబ్బులు గుమ్మరించి ఇలా తీసే అర్ధం పర్ధం లేని సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం
పడితే, మరి కొందరు
బడా నిర్మాతలు ఇదే దారి పట్టి, తెలుగు సినిమా ఖర్చును హాలీవుడ్ స్థాయికి పెంచుతారు. సినిమా
స్థాయి సంగతి మరచిపోతారు. నిజమే! పెద్ద సినిమా ఒకటి బాగా ఆడితే పరిశ్రమను నమ్ముకుని
బతుకు బండి లాగించే వేలాది కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటాయి. కానీ అందుకోసం
లక్షలాదిమంది ప్రేక్షకులు చెల్లించుకునే మూల్యం మాటలేమిటి? ఇంతంత
మొత్తాల్లో డబ్బులు వాళ్ళూ, వీళ్ళూ తగలేయడం సమంజసమేనా!’
‘ఇక మీకు చెప్పడం నా తరం
కాదు. మీ మనుమల్ని అడగండి, సినిమా ఎలావుందని, వాళ్ళు చెబుతారు మీకు సరైన సమాధానం.’
(29-6-2024)