8, ఆగస్టు 2024, గురువారం
పుట్టిన రోజున దేవుడి కానుక
5, ఆగస్టు 2024, సోమవారం
కొడుకే తండ్రిగా మారిన వేళ
3, ఆగస్టు 2024, శనివారం
అమెరికాలో కలిసిన మంతెన సత్యనారాయణ రాజు గారు
Licking of Worry
2, ఆగస్టు 2024, శుక్రవారం
నాకేల చింత - భండారు శ్రీనివాసరావు
1, ఆగస్టు 2024, గురువారం
భూమంటే చేదా !
కన్నంతలో, విన్నంతలో అమెరికా – భండారు శ్రీనివాసరావు
అమెరికా అనేది అవకాశాల దేశమే కాదు,
వింతలు, విశేషాల దేశం కూడా.
నేను అమెరికా రావడం ఇది ఐదో సారి. మా మూడో
అన్నయ్య కుమారుడు సత్య సాయి ఉంటున్న ఉడ్ స్టాక్ పట్టణంలో వాళ్ళ ఇంటికి దగ్గరలోనే
హోవార్డ్ కౌంటీ కన్సర్వెన్సీ కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి వుంది.
పచ్చదనం పరచుకున్న కొండలు,
గుట్టలతో నిండి వుండి, తాటి ప్రమాణంలో గుబురుగా
పెరిగిన చెట్ల మాటున చిన్న చిన్న కాలిబాటలు, సెలయేళ్ళు, క్రమంగా మాయమవుతున్న జాబితాలో
చేరుతున్న జంతుజాలం, పాత
కాలపు వ్యవసాయపు పనిముట్లు,
పరికరాలు ఇవన్నీ చూస్తుంటే, పెద్దనామాత్యులు రచించిన మనుచరిత్రలోని,
‘అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల
ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట
నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక
చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్’ అనే పద్యం గుర్తుకు రాకమానదు.
ఎప్పటినుంచో నూట అరవై అయిదు సంవత్సరాలుగా ఒక
కుటుంబం హక్కుభుక్తంలో వుంటూ, సామ్యుయేల్ బ్రౌన్ అనే పెద్దమనిషికి ఈ అపారమైన విలువగలిగిన
ఆస్తి, తండ్రి తాతల నుంచి వంశపారంపర్యంగా లభించింది. బ్రౌన్ మహాశయుల మరణానంతరం ఆయన కుమారుడికి అది దఖలు కాగా, ఆయన
చనిపోతూ మూడోవంతు భూమిని తన ఇద్దరు చెల్లెళ్లకు రాసిపోయాడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయులైన
రూత్ బ్రౌన్, ఫ్రాన్సెస్ బ్రౌన్ లు, వన్య, జంతు
సంపదతో కూడిన, మౌంట్ ప్లెజెంట్ గా ప్రసిద్ధి చెందిన తమ సువిశాల భూ సంపదను సమాజం
బాగుకోసం త్యాగం చేశారు. పిల్లలకు చిన్నతనం నుంచే వన్య, జంతు
ప్రాణి సంరక్షణ విషయంలో అవగాహన, ఆసక్తితోపాటు ప్రకృతి సంరక్షణ పట్ల భవిష్యత్
తరాలకు తెలియచెప్పే కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ యావత్ ఆస్తిని ఒక ట్రస్టుకు
ఒప్పచెప్పారు.
మొక్కలు, జంతువులు, పక్షులు గురించి చిన్నతనం నుంచి బోధించే
ప్రత్యేక తరగతులను ఆ ట్రస్టు నిర్వహిస్తోంది. ప్రకృతి ప్రేమికులకు ప్రోత్సాహం
కలిగించే అనేక కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటాయి. అక్కడ ప్రవేశం ఉచితం. ఎవరైనా సరే పౌరులు కూరగాయలు సొంతంగా పండించుకోవాలి
అనుకుకుంటే అందుకు కావాల్సిన భూమిని ఉచితంగా ఇస్తారు.
ఇక్కడ పాఠాలు చెప్పేవాళ్ళు, ఇతర
వ్యవహారాలు చూసేవాళ్ళు అంతా జీత భత్యాలు లేకుండా వాలంటీర్లుగా పనిచేస్తున్నట్టు
అనిపించింది. తిరిగి వచ్చేటప్పుడు కారు పార్కింగ్ దగ్గర ఒక వృద్ధ మహిళతో
మాట్లాడాము. మిసెస్ ఆద్రే అనే ఆవిడ వయస్సు
81 సంవత్సరాలు. 2007 రిటైర్ అయ్యారు. భర్త చనిపోయాడు. ప్రవృత్తి రీత్యా ప్రకృతి ప్రేమికురాలు అయిన
ఆవిడ తన ముదిమి వయసులో కాలక్షేపం కోసం కాకుండా స్వచ్చందంగా సిద్ధపడి ఇక్కడ పనిచేస్తున్నారు.
మేము ఇండియా నుంచి వచ్చాము అని చెబితే చాలా సంతోష పడ్డారు. చెట్లను, జంతువులను, పక్షులను భగవత్ స్వరూపాలుగా భావించే భారతీయ సంస్కృతి
అంటే తనకు చాలా గౌరవమని అన్నారు. ఆవిడ అలా అంటూ వుంటే నేను సిగ్గుతో ముడుచుకు
పోయాను. కారణం మీకూ తెలుసు.
వందల ఎకరాల భూమిని ప్రకృతి
సంరక్షణ కోసం అతి సులభంగా త్యాగం చేయడం నిజంగా గొప్ప విషయమే.
పెంపుడు పిల్లులకు, కుక్కలకు కోట్లాది డాలర్ల సంపదను
వీలునామా రాసే సంపన్నుల దేశం కనుక ఇక్కడ ఇదొక వింత కాకపోవచ్చు.
కానీ, హైదరాబాదు జూబిలీ హిల్స్,
బంజారా హిల్స్ వంటి ప్రాంతాలలో కొన్ని వందల గజాల జాగాలో సువిశాలమైన భవంతులు
నిర్మించుకున్న సంపన్న ఆసాములు, రోడ్ల వెడల్పు వంటి ప్రజోపయోగ కార్యక్రమాలకు
హీనపక్షం కొద్ది అడుగుల భూమిని వదులుకోవడానికి ఇష్టంలేక, కోర్టులను ఆశ్రయించిన
ఉదంతాలు తెలిసిన దేశం నుంచి వచ్చాను కనుక, ఈ సోదరీమణుల వదాన్యం వింతల్లో వింతగానే
నాకు అనిపించింది.
(01-08-2024)
బార్ అండ్ రెస్టారెంట్ గా మారిన రైల్వే స్టేషన్ – భండారు శ్రీనివాసరావు
కన్నంతలో, విన్నంతలో అమెరికా
అమెరికన్లకు మార్పు ఇష్టం. స్తబ్దతను ఇష్టపడరు.
ప్రతిక్షణం కదలికలో ప్రగతిని కోరుకుంటారు. నేను గమనించిన మరో విషయం ఏమిటంటే
మార్పును ఎంత గాఢoగా
కోరుకుంటారో గతాన్ని అంతగా ప్రేమిస్తారు. గతం గుర్తులను పదిలంగా దాచుకుంటారు.
భావితరాల కోసం వాటిని భద్రపరుస్తారు.
ప్రస్తుతం నేను ఉంటున్న మేరీ లాండ్ రాష్ట్రంలోని ఉడ్
స్టాక్ నగరానికి దాపులో సైక్స్ విల్ (Sykes Ville) అనే చోట ఒక రైల్వే స్టేషన్ వుంది. దీన్ని 1831 లో
ఏర్పాటు చేశారు. 1863 లో
జరిగిన రైల్వే కార్మికుల సమ్మె హింసాత్మకంగా
మారింది. ఆ విధ్వంసకాండలో రైలు మార్గంతో పాటు నగరంలోని ఆస్తులు కూడా
దెబ్బతిన్నాయి. 1883 లో తిరిగి ఈ రైల్వే స్టేషన్ ను ఇప్పుడున్న
రూపంలో పునరుద్ధరించారు. మరుసటి ఏడాది నుంచి రైళ్ళ రాకపోకలు మొదలయ్యాయి. కానీ
పరిణామక్రమంలో భాగంగా 1950 లో ఈ
స్టేషన్ ను మూసివేశారు. కొన్ని గూడ్స్ రైళ్లు నడుపుతున్నారు. స్టేషన్ భవనంలో
ప్రస్తుతం బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతున్నారు. అక్కడ విందు వినోదాలతో కాలక్షేపం
చేస్తూ, వచ్చి పోయే గూడ్స్ రైళ్ళను తిలకించడానికి సెలవు దినాల్లో అనేకమంది
పర్యాటకులు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ వుంటారు. సుమారు రెండువందల ఏళ్ళ నాటి రైలు
బోగీలను, రైలు
ఇంజన్ ను మ్యూజియంగా మార్చి అలనాటి రైళ్ళ స్వరూప స్వభావాలను నేటి తరానికి పరిచయం
చేస్తున్నారు. అలనాటి రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రతి శనివారం,
ఆదివారాల్లో రైతు బజార్లు నిర్వహిస్తున్నారు. (బెజవాడలో ఇలాగే సత్యనారాయణ పురం రైల్వే స్టేషన్
ను మూసివేశారు. ఇప్పుడు ఆ ప్రదేశం రద్దీ రోడ్లతో సమూలంగా రూపం మార్చుకుంది.
స్టేషన్ అవశేషాలు మచ్చుకు కూడా లేవు. ఒకప్పుడు అక్కడ ఓ రైల్వే స్టేషన్ వుందంటే ఈ
తరం వారెవ్వరూ నమ్మరు)
స్టేషన్ దాపుల్లో రోడ్డుకు ఇరువైపులా హోటల్లు,
రెస్టారెంట్లు,
విడిది గృహాలు లెక్కకు మిక్కిలిగా వున్నాయి.
కాశ్యప్
వాహిని ఇంట్లో భోజనాల అనంతరం తిన్నది అరగడానికి తిరగడానికి మళ్ళీ బయలు దేరాం.
చుట్టుపక్కల అంతా దట్టమైన అడవులు. వాటిగుండా
వేసిన చక్కటి రహదారుల వెంట పొతే, చిట్టడవి నడుమ గలగలా పారుతున్న సెలయేరు. దాని
మధ్య చిన్నాపెద్ద బండరాళ్ళు. వాటి మీద దుముకుతూ, కేరింతలు కొడుతూ పిల్లలు చాలాసేపు కాలక్షేపం చేశారు. నిజానికి
అరకు లోయలో కూడా ఇలాంటి సెలయేరు వుంది. కానీ ఇంత గొప్ప రహదారి సౌకర్యం ఉందా అంటే
అనుమానమే. ఏటి వొడ్డున నలుచదరంగా ఉన్న ఓ
బండరాయిపై నేను విశ్రాంతి తీసుకుంటూ పిల్లలు చేస్తున్న తమాషాలను చూస్తుండిపోయాను. రమణీయమైన ప్రకృతి అందాలను, నింగిని తాకుతున్న ఎత్తైన వృక్షాలు
చూస్తూ కాలక్షేపం చేశాను.
ఇదే ఊర్లో మా అన్నయ్య, మేనల్లుడు, మేనకోడలి
పిల్లలు దగ్గర దగ్గరగానే (వుడ్ స్టాక్, సైక్స్ విల్, టర్ఫ్ వ్యాలీ) ఇండిపెండెంట్ ఇళ్ళు కొనుక్కుని వుంటున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో
తప్పిస్తే, ఉన్న పద్దెనిమిది మందిమీ కలిసి ఎవరో ఒకరి ఇంట్లో మధ్యాహ్నభోజనాలు, రాత్రి డిన్నర్లు. ఎక్కడకు వెళ్ళినా
నాలుగు కార్లు కదలాల్సిందే.
పరాయిదేశంలో కూడా కుటుంబ ఆప్యాయతలు అలాగే
వున్నాయి. అందరూ వర్క్ ఫ్రం హోం బాపతే కాబట్టి లాప్ టాపుల్లో ఆఫీసు పని.
పనిలోపనిగా కాలక్షేపం కబుర్లు. మధ్య మధ్య వేడి వేడి పకోడీలు,
కాఫీలు సరేసరి.
(30-07-2024)
(అమెరికాలో రెండో రోజు కొన్ని ఫోటోలు, వీడియోల లింకులు)