16, మే 2023, మంగళవారం

పొత్తు పొడిచినా ఫలితం దక్కుతుందా! – భండారు శ్రీనివాసరావు

 రేపు ఎన్నికలు పెట్టినా మేము సిద్ధంగా వున్నామని రాజకీయ నాయకులు తరచూ చెప్పే మాటల్లో ఎంత వాస్తవం వుందో తెలియదు కానీ, రేపే ఎన్నికలు అనే స్పృహలోనే పార్టీలు అనుక్షణం అప్రమత్తంగా వుంటాయి అనడం మాత్రం నిజం.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధానం ఉన్నప్పటికీ, అప్పుడే ఎన్నికలు వచ్చిపడ్డట్టు రాజకీయ పార్టీలు హడావిడి పడుతున్నాయి. పొత్తులు, ఎత్తులు, జిత్తుల మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సంవత్సరం తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకునే వ్యూహాలకు తెర తీస్తున్నాయి.

రాజకీయ పార్టీలకి అనేక లక్ష్యాలు వుంటాయి. కానీ అన్నింటిలో ఉమ్మడిగా కానవచ్చేది ఒక్కటే. అది విజయం వైపు పయనం.

2019లో జరిగిన ఎన్నికల్లో తన పార్టీని అధికార అందలం ఎక్కించిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, పరాజయం పాలయిన టీడీపీ నాయకుడు చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ మువ్వురు  కూడా 2024లో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల వ్యూహాలను రూపొందించుకునే కార్యక్రమంలో తలమునకలుగా వున్నారు.  ఈ లక్ష్యసాధన కోసం వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆశ్చర్య పోవాల్సింది ఏమీ ఉండదు. రాజకీయ సమీకరణాలు  పూర్తిగా మారిపోతాయని నాలుగేళ్ల క్రితం ఎవరయినా అంటే ఎవరూ నమ్మేవాళ్ళు కాదు. అంటే రోజులు గడుస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్తితులకు అనుగుణంగా, వారి వారి రాజకీయ అవసరాలకు, ప్రయోజనాలకు తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయనడానికి ఏపీలో  రోజురోజుకి మారుతున్న పరిణామాలే   మంచి ఉదాహరణ. కానీ ఈ విషయాలు వారెవ్వరూ బయటకి ఒప్పుకోరు. అది వారి రాజకీయ జాణతనంలో ఒక భాగం. చెప్పీ చెప్పనట్టుగా కొన్ని చెబుతుంటారు, వాటిల్లో దాగున్న అర్ధాన్ని విశ్లేషిస్తూ చర్చలు సాగుతాయి. ప్రజలని తాము కోరుకున్న పద్ధతిలోనే ఆలోచించేలా చేయడం వీటి అంతిమ లక్ష్యం.

నేటి రాజకీయాల పట్ల కనీస అవగాహన ఉన్నవారికి ఈ పరిణామాలు గొప్ప విషయంగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే గతంలో సిద్ధాంతాల ప్రాతిపదికపై నడిచిన రాజకీయాలు, ఈనాడు అవసరాల పునాదులపై నిలదొక్కుకుంటున్నాయని వారికి తెలుసు కాబట్టి.

2024లో జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నదే ఈ ముగ్గురు నాయకుల ధ్యేయం. కాకపోతే ఈ లక్ష్యసాధన దిశలో వేసే అడుగులు ఎలాటివన్నదే చర్చనీయాంశం. విధానాల ద్వారా విజయం సాధించాలని అనుకోవడం ఒక పద్దతి. విజయం ఒక్కటే పరమావధిగా విధానాలను మార్చుకోవడం మరో పద్దతి.

పాలకపక్షం వైసీపీ పూర్తిగా బలహీన పడిందని  నమ్ముతూ  తద్వారా ఏర్పడ్డ రాజకీయ శూన్యతను ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో కొత్త పొత్తుల ఆలోచన రూపుదిద్దుకుని ఉండవచ్చు. పొత్తులు ఫలితం ఇస్తాయి అనడానికి శాస్త్రీయ ప్రాతిపదిక ఏమీ లేదు. అవసరాలకోసం రాజకీయ నేతలు సర్దుబాటు చేసుకున్నట్టుగా ఆ పార్టీల కార్యకర్తలు అంత సులభంగా కలిసిపోరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఓట్ల బదలాయింపుకు అవకాశాలు తక్కువ.  

రాజకీయ శూన్యత వున్నప్పుడు రాజకీయ ప్రత్యామ్నాయాల వికాసానికి అవకాశం వుంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత అనేదాన్ని ఏ అధికార పక్షం అయినా ఎన్నికల్లో ఎదుర్కోక తప్పదు. అయితే వ్యతిరేకత ఒక్కటే పాలక పక్షం ఓటమికి దోహదం చేయదు. వ్యతిరేకత అసంతృప్తిగా మారి, ఆ అసంతృప్తి అసహనంగా మారి, ఆ అసహనం ఆగ్రహంగా మారినప్పుడే ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తారు. ఆ పరిస్థితిలో బలమైన ప్రత్యామ్నాయంగా కనపడిన పార్టీకి, ఏ పార్టీ అని కూడా చూడకుండా ఓట్లేసి గెలిపిస్తారు.

రాజకీయ పార్టీల మాదిరిగా ప్రజలు తమ ఆగ్రహాన్ని అనునిత్యం ప్రదర్శించరు. తమలోనే దాచుకుంటారు. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు. 

బ్రహ్మాండంగా విజయవంతమైన సినిమా ఫార్ములాతోనే, అందుకు ఏమాత్రం తగ్గకుండా మరో సినిమా తీస్తే అది విజయవంతమైన సందర్భాలు చాలా తక్కువ. అలాగే ఈ పొత్తులు. మళ్ళీ వీటిలో కొన్ని రకాలు. ఎన్నికలకు ముందు పెట్టుకునేవి కొన్ని అయితే, ఎన్నికల తరవాత, ఎవరికీ సరైన మెజారిటీ రానప్పుడు  కుదుర్చుకునేవి మరి కొన్ని. ఎన్నికలకు ముందు ప్రతి పార్టీ తాను బలమైన పార్టీ అనే నమ్ముతుంది. కనుక సీట్ల సర్దుబాటు ఒక సమస్యగా మారుతుంది. వామపక్షాల వైఖరి కొంత విచిత్రంగా వుంటుంది. పలానా నియోజక వర్గంలో గెలిచే అవకాశం లేకపోయినా, కేడర్ ని సుస్తిరం చేసుకోవడానికి ఆ సీటు కోసం పట్టు పడతాయి.

1982 ఎన్టీ రామారావు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు, కాంగ్రెసేతర పార్టీలతో పొత్తుల ప్రతిపాదనలు వచ్చాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలసి 120  సీట్లు కావాలని కోరాయి. సంప్రదింపులు జరిగిన తర్వాత కనీసం 90 సీట్లు ఇవ్వాలని పట్టుబట్టాయి. ఎన్టీఆర్  80 ఇస్తామన్నారు. కమ్యూనిస్టులు తమకు అలవాటయిన చారిత్రక తప్పిదం చేశారు. ఒక్క సీటు తగ్గినా ఒప్పుకోమని తేల్చి చెప్పారు. చర్చలు విఫలం అయ్యాయి. మరో పక్క జనతా పార్టీ తరపున బాబుల్ రెడ్డి ఎన్టీఆర్ ని కలిసి  60 సీట్లు అడిగారు.  20 వరకు ఒప్పుకోవాలని ఎన్టీఆర్ యోచన. ఈలోగా లోక్ దళ్, రిపబ్లికన్ మొదలైన పార్టీలు మరికొన్ని అడిగాయి. ఈ పార్టీల వైఖరితో విసుగుచెందిన ఎన్టీఆర్, అసలు పొత్తులకే స్వస్తి చెప్పి ఒంటరిగా వెళ్ళాలని నిర్ణయించారు. ఆఖర్లో మాత్రం సంజయ్ విచార్ మంచ్ కి అయిదు సీట్లు ఇచ్చారు. మిగిలిన అన్ని సీట్లలో టీడీపీ పోటీ చేసింది.

అప్పటికే కాంగ్రెస్ పాలనతో విసిగి  ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న తెలుగు ప్రజలకు టీడీపీ వెలుగు రేఖలా  కనిపించింది. ఎన్టీఆర్ తొందరపడి ఇతర పార్టీలకు వారు అడిగిన సంఖ్యలో సీట్లు ఇచ్చి వుంటే,  ప్రజలు టీడీపీని కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా భావించి వుండేవారు కాదని ఓ అభిప్రాయం. ఓ పది సీట్ల కోసం కమ్యూనిస్టులు పట్టిన పట్టు, రాష్ట్ర రాజకీయాల తీరుతెన్నులనే మార్చివేసింది.

ఇక ప్రస్తుతానికి వస్తే.       

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతీయ పార్టీలు ఒకేమారు తలపడితే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు గణనీయంగా చీలిపోయి అధికార వైసీపీ లాభపడుతుందని కొందరి ఉద్దేశ్యం.  ఈసారి ఏదీ ఊహకు అందకుండా ఉంటుందని మరికొందరు అంటున్నారు. అంచేత బరిలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళూ ఏ అవకాశాన్నీ వదులుకోకుండా ప్రయత్నాలు చేస్తారు. హామీలు, ప్రలోభాలు, ఎత్తులు, పొత్తులు, అవగాహనలు, పైకి ఒకటి చెబుతూ మరొకటి చేసే రాజకీయ రణతంత్రాలు, మిత్రబేధాలు, ఇలాటివన్నీ ఆ జాబితాలో వుంటాయి. డబ్బు ప్రాధాన్యం ఎలాగూ వుంటుంది. అయితే తమను ఎవరు పరిపాలించాలో ప్రజలు ముందే ఒక నిర్ణయానికి వస్తే మాత్రం, ఈ టక్కు ఠమారవిద్యలు అన్నీ కొరగాకుండా పోతాయి.

ప్రతి రాజకీయ పార్టీకి చెప్పుకోవడానికి కొన్ని మూలసిద్ధాంతాలు ఉన్నప్పటికీ, కాలమాన పరిస్తితులను బట్టి ఆ సిద్ధాంతాలను కొంత పక్కన బెట్టి వ్యవహరించే పరిస్తితి ఈనాడు చూస్తున్నాము. ఇప్పుడు ప్రతి అంశాన్ని, విజయావకాశాలు, రాజకీయంగా ఒనగూడే లాభనష్టాల నిష్పత్తి కోణం నుంచే ఆయా రాజకీయ పార్టీలు పరిశీలిస్తున్నాయి. అధికారమే పరమావధి అయినప్పుడు సిద్ధాంతాలకు నీళ్ళు వదిలి, అవకాశవాద రాజకీయాలకు పెద్ద పీట వేయడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటుతో మొదలయ్యే ఈ కప్పదాట్లు అధికార పీఠం అధిరోహించిన తరువాత మరింత వికృత రూపాన్ని, స్వభావాన్ని సంతరించుకుంటున్నాయి. ఎదుటి పక్షాన్ని ఎదిరించడం కోసం, నిలువరించడం కోసం పలు విపక్షాలతో రాజీపడి దానికి భావసారూప్యం అనే అందమైన అర్ధంలేని పదాన్ని అడ్డు పెట్టుకోవడం రాజకీయాలను గమనించేవారికి అనుభవమే. అలా మొదలయ్యే ఈ అవకరం క్రమంగా రాజకీయ కూటముల ఆవిర్భావానికి మార్గం వేసింది. అయితే, అధికారంలో పై చేయి కోసం వెంపర్లాటలు, పదవుల పంపిణీలో కీచులాటలు, సిద్ధాంత ప్రాతిపదికలేని ఈ రాజకీయ కూటముల అస్తిత్వానికే ముప్పు తెచ్చిన సందర్భాలు కూడా గతంలో అనేకం.

పాలకపక్షాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రతిపక్షాలు ఏకమైనట్టు,  ప్రతిపక్షాలను కనుమరుగు చేయడానికి పాలక పక్షాలు అంతే పట్టుదలగా పనిచేస్తున్నాయి. ప్రతిపక్షాలను గౌరవించడం సంగతి అటుంచి, అసలు వాటి ఉనికిని గుర్తించడానికి కూడా విముఖత చూపుతున్నాయి. ఉనికే లేకుండా చేయాలని యోచించడం ఇందుకు పరాకాష్ట.  చట్టసభల్లోనే కాకుండా చట్ట సభల వెలుపల కూడా ప్రతిపక్షాల పొడగిట్టని తత్వాలు, ఎదుటి పార్టీలను చీల్చి సొంత బలం పెంచుకునే ప్రయత్నాలు కొత్త రాజకీయ సంస్కృతిగా రూపుదిద్దుకుంటున్నాయి. కొద్ది హెచ్చు తగ్గులు మినహా ఏపార్టీ కూడా దీనికి మినహాయింపు కాదనే చెప్పాలి.

రాజకీయులు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే సాధించిన విజయాలు  ఎప్పటికీ శాశ్వతం అని భావించకూడదు. పరాజయం పొందినవారు అది శాశ్వతం అనుకోకూడదు. శిఖరం ఎక్కిన వాడు అక్కడే వుండిపోడు. ఎప్పుడో ఒకప్పుడు కిందికి దిగకతప్పదు. అలా దిగినప్పుడు మళ్ళీ ఎక్కే ప్రయత్నం మానుకోకూడదు.

అధికారం దక్కినప్పుడు కాలయాపన చేయకుండా, జనం తమకు అధికార పగ్గాలు అందించిన నిర్దిష్ట కాల వ్యవధిలోనే ప్రజలకు చేసే నాలుగు మంచి పనులే శాశ్వతంగా మిగిలిపోతాయి.

ఇది నిజం. కానీ ఈ నిజాలు ఈనాటి రాజకీయ నాయకులకు పట్టవు. నిజానికి వారికి ఆ అవసరం ఉన్నట్టు కూడా లేదు.

Below Photo: Courtesy Google Images



14, మే 2023, ఆదివారం

సాధనాత్ సాధ్యతే సర్వమ్ – భండారు శ్రీనివాసరావు

 కొందరు అంతే! తలపెట్టిన పని చేసుకుంటూ పోతుంటారు. ప్రచారం వచ్చిందా! గుర్తింపు దొరికిందా!  ఇలాంటివన్నీ వాళ్లకి అత్యల్ప స్వల్ప విషయాలు.

ఈరోజు కళ్ళతో చూసిన తర్వాత నిజమే అనిపించింది. ఈ మధ్యాన్నం జ్వాలాతో కలిసి అవధాన విద్యా వికాస పరిషత్ నిర్వహించిన ఉచిత అవధాన శిక్షణాకార్యక్రమం ముగింపు సమావేశానికి వెళ్లాను. నటీనటులుగా శిక్షణ ఇస్తాము అంటే వేలు తగలేసి వెళ్ళేవాళ్ళను చూశాను. టీవీ యాంకర్ గా, రేడియో జాకీగా శిక్షణ ఇస్తామన్నా ఎగబడి వెళ్ళే వాళ్ళను చూశాను. కానీ ఇదేమిటి అవధానంలో శిక్షణ అంటే పిల్లలు సరే, వాళ్ళ తలితండ్రులు కూడా ప్రోత్సహించడం వింతగా అనిపించింది. ఈ కార్యక్రమంలో శిక్షణ తీసుకున్న వారిలో పన్నెండు ఏళ్ళ అమ్మాయి నుంచి యాభయ్ ఏళ్ళ వయసు కలిగిన పెద్ద వాళ్ళు వుండడం మరింత వింతగా తోచింది. అంతేనా! ఎంబీబీఎస్ చదువుతున్న ఓ యువకుడు కూడా అవధాన శిక్షణ పొందడం చూసిన తర్వాత గొప్పగా కూడా అనిపించింది.

దీనికి జవాబు ప్రధాన అతిధిగా వచ్చిన ప్రముఖ అవధాని మేడసాని మోహన్ గారి ఉపన్యాసంలో దొరికింది. అవధానంలో ముందు అలవారచుకోవాల్సింది ఏకాగ్రత. ప్రతి విద్యార్ధికి కావాల్సింది కూడా ఇదే. బయట విద్యాసంష్టలలో దొరకంది కూడా ఇదే. అవధాన శిక్షణ ద్వారా ధారణ శక్తి అలవడుతుంది. దీని ద్వారా చదివిన విషయాన్ని చక్కగా గ్రహించడం, గ్రహించిన దాన్ని గుర్తు పెట్టుకోవడం, అవసరమైన సందర్భాలలో కొన్ని విషయాలను సందర్భోచితంగా వాడడం, తద్వారా  బుద్దికి పదును పెట్టడం జరుగుతుంది. ఏ విద్యార్ధికి అయినా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది? ప్రభుత్వాలు చొరవతీసుకుని అవధాన ప్రక్రియను చిన్నతరగతుల నుంచే ఒక పాఠ్యా౦శ౦గా  చేరిస్తే బాగుంటుందేమో ఆలోచించాలి. ఆన్నింటికంటే ముఖ్యమైనది ప్రపంచ భాషల్లో ఒక్క తెలుగుకే సొంతం అయిన పద్యాన్ని బతికించి భవిష్యత్ తరాలకు అందించాలంటే అవధాన ప్రక్రియ ఒక్కటే మార్గం. ఆధునిక చదువులకు కూడా అక్కరకు వచ్చే అవధానానికి అవసరమైంది ఏకాగ్రత. ఏకాగ్రతకు కావాల్సింది సాధనం. సాధనం వల్ల సాధ్యం కానిది ఏమీ లేదు.

అవధాన విద్యా వికాస పరిషత్ కు కర్తా కర్మా క్రియ అయిన మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు కూడా బహుశా ఈ సాధనం అనే మార్గాన్నే నమ్ముకుని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ అవధాన విద్యను ప్రదర్శించే స్థాయికి చేరిన నాడు, అవధానం మరింతగా ప్రజలకు చేరువ అవుతుంది. ప్రాచుర్యం పెరుగుతుంది.

దేశ విదేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చి అనేక పురస్కారాలు పొందిన మేడసాని మోహన్ గారు అవధాన ప్రదర్శనలో అవధాని ఎదుర్కునే ఇబ్బందులను సోదాహరణ పూర్వకంగా వివరించారు. దత్తపది, నిషిద్ధాక్షరి, సమస్యాపూరణం మొదలయిన అవధాన ప్రక్రియల ద్వారా మెదడు ఎలా పదునెక్కుతుందో  విశదం చేశారు. గండపెండేరాలు, కీర్తి కిరీటాల దశ దాటి వచ్చానని చెబుతూ, జ్వాలా నరసింహారావు తనకు బహుకరించిన రామాయణ గ్రంధమే పెద్ద సత్కారంగా భావిస్తానని వినమ్ర పూర్వకంగా చెప్పారు.  

ఒక్కోరోజు ఇలా గడుస్తుంది. ఇలా గడిచిన రోజు, మరో రోజును  ఉత్సాహంగా గడపడానికి ప్రేరణ ఇస్తుంది.






(14-05-2023)

10, మే 2023, బుధవారం

‘స్వ’గతం

 

ఈ స్వగతం నాది కాదు, మాజీ ఐజీ, సీనియర్ ఐ.పి.ఎస్. అధికారి రావులపాటి సీతారామా రావు గారిది.

అట్ట చాలా అట్టహాసంగా వుంది. చాలా ఖరీదైన ఆర్ట్ పేపరు. ముఖచిత్రం మీద కొలువుతీరిన వారందరూ సుప్రసిద్ధులు, మాజీప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, పత్రికారచయితలు, ఆధ్యాత్మిక వేత్తలు, సినీ ప్రముఖులు. అంటే అర్ధం అయిపోతుంది, రచయిత స్వగతం ఎవరి గురించో. పోలీసు అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రదేశాల్లో పనిచేసిన అనుభవాల్లోని గతం అన్నమాట. అన్నట్టు తిరుపతి వెంకన్నతో అనుభవాలు కూడా వున్నాయి సుమా.

పోలీసు అధికారిగా ఆయన లాఠీ పదును అయినా, రచయితగా ఆయన కలం చాలా మృదువైనది. అంచేత నొప్పించక, తానొవ్వక తరహాలోనే ఈ అనుభవాల పరంపర అక్షరరూపం ధరించింది. ఇప్పుడే చేతికి అందితే అప్పుడే చదివేశారా అనేదానికి జవాబు వుంది. ఈ వ్యాసాలు అన్నీ ఇటీవలి కాలంలోనే ఆంధ్రప్రభ దినపత్రికలో వారం వారం  స్వగతం శీర్షిక రూపంలో వెలువడ్డాయి. ఆ విధంగా నా తొలి రీడింగ్ అయిపోయింది అన్నమాట.  

పుస్తకం ఎవరికైనా నచ్చుతుంది అని ఘంటా పదంగా చెప్పడానికి కూడా కారణాలు వున్నాయి. రావులపాటి వారి శైలి వాటిల్లో ముఖ్యమైనది.  మరోటి పుస్తకం సైజు. చక్కనమ్మ అయితే చిక్కినా అందమే. నూటపాతిక పేజీల్లో స్వగతం పొందికగా అమిరింది. కూర్చుని, పడుకుని, మాట్లాడుతూ, ముచ్చట్లు చెబుతూ చదువుకునేలా వుంది.

ఒకరకంగా ఇది ఆయన బర్త్ డే బుక్. నిన్న ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని కుటుంబ సభ్యుల నడుమ ఎంచక్కా స్వయం ఆవిష్కరణ చేసుకున్న పుస్తకం ఇది.

(సాహితి ప్రచురణలు, వెల : రు. 90/-)

 

 

   




4, మే 2023, గురువారం

విశ్వ జ్ఞాన ధ్రువ – భండారు శ్రీఎనివాసరావు

 ‘దూరాభారం అనుకోకుండా అంత దూరం నుంచి మన ఇంటికి వచ్చి పిలిచి వెళ్లినప్పుడు, ఆ శుభ కార్యానికి వెళ్లి రావడానికి  మీనమేషాలు లెక్క పెడతారేమిటి చోద్యం కాకపోతే అంటుండేది మా ఆవిడ. చిన్న కుటుంబం నుంచి వచ్చి, నా పుణ్యమా అని అతి పెద్ద కుటుంబంలోకి వచ్చిపడింది. అంచేత కుటుంబాలలోని వాళ్ళు ఏదో వంకన కలుస్తూ వుండడం ఆమెకు చాలా సరదాగా, వేడుకగా అనిపించేది.

నిజానికి మాదొక పెద్ద కుటుంబం. పదకొండు మంది సంతానంలో అందరిలోకి చిన్నవాడిని. ముగ్గురు అన్నయ్యలు.  ఏడుగురు అక్కయ్యలు. మేనకోడళ్ళు ఓ యాభయ్ మంది. వాళ్ళ పెళ్లిళ్లలో పెళ్లి కూతురురిని బుట్టలో కూర్చోబెట్టి కళ్యాణ వేదికకు చేర్చే మేనమామ పాత్ర నాది. మొదట్లో ఈ పాత్ర పోషించడానికి తెగ ఉబలాట పడేవాడిని. ఫోటో ఆల్బంలో ఎవరున్నా లేకపోయినా మేనమామ ఫోటో  వుండి తీరాల్సిందే.  అయితే, ఎందుకో ఏమిటో, కాలం గడుస్తున్న కొద్దీ  పెళ్ళిళ్ళ పేరిట ఇంత ఖర్చు, ఇంత శ్రమ  అవసరమా అనే ధోరణిలో పడిపోయాను. దరిమిలా పెళ్లి వద్దు పెళ్ళాం కావాలి అనే నినాదం వంటబట్టించుకుని చేసుకున్న పెళ్లి కాని పెళ్లి మాది. ఉభయ పక్షాలు మా ప్రేమ వివాహానికి ఒప్పుకున్నప్పటికీ పెళ్లి తంతుకు నేను  ససేమిరా అన్నాను. దాంతో నా పెళ్లి నేను పట్టుబట్టినట్టే జరిగింది. అయితే ఆ తర్వాత ఎవరు పెళ్ళికి పిలిచినా వెళ్ళడానికి సంకోచం. నా పెళ్ళికి ఎవరినీ  పిలవకుండా వాళ్ళు పిలిచే పెళ్లిళ్లకు పొతే ఏం బాగుంటుంది అని దాటవేస్తూ వచ్చాను. కానీ ఎంతయినా ఇళ్ళల్లో భార్య మాటే చివరాఖరు మాట అనే వాస్తవం  త్వరలోనే తెలిసి వచ్చింది. పెళ్ళికి ముందు నా మాటే ఆమెకు వేద వాక్కు. అయిన తర్వాత ఆవిడ మాట నాకు నాలుగు వేదాల వాక్కు.

ఈ రోజు నా మేనకోడలి మనుమడి ఉపనయనం. భార్యా భర్తలు ఇంటికి వచ్చి పిలిచి వెళ్ళారు. ‘అమ్మ గట్టిగా చెప్పింది, ఎవర్ని పిలిచినా పిలవక పోయినా ఊళ్ళో వున్న నా మేనమామలు ఇద్దర్నీ పిలవమని. తప్పకుండా రా తాతయ్యా అన్నాడు. నేను వాడికి ఏమవుతానో, ఆ వావీవరస ఏమిటో  నాకే తెలియదు. తాతయ్యనే కాబోలు అనుకుని తలూపాను.

ఉదయమే మా అన్నయ్య రామచంద్రరావు గారు కారులో వచ్చి నన్ను వెంటబెట్టుకుని బాచుపల్లిలోని హిల్ కౌంటీకి తీసుకువెళ్ళారు. అదేమిటో చిత్రం హైదరాబాదులో ఉన్న చుట్టపక్కాలు అందరూ ఈ రోజు ఆ వేడుకలో కలిసారు. ఉపనయనాన్ని పెళ్ళిలో కలిపి చేయడం అనే కొత్త సాంప్రదాయం  ఎప్పుడో మొదలయింది. అలాంటిది తలితండ్రులు పిల్లలకు చిన్నతనంలోనే వడుగు చేయాలని సంకల్పించడం, పిల్లలు బుద్దిగా అందుకు ఒప్పుకోవడం కొత్తగా వస్తున్న మార్పు అనిపిస్తోంది. మనుమడి ఉపనయనానికి వచ్చినందుకు నా మేనకోడలు విమల, వటువు తలితండ్రులు లక్ష్మి, దీపలు సంతోషించారు.

ఈ వేడుకలో నన్ను ఆకట్టుకున్నది ఏమిటంటే వడుగు జరిగింది అపార్ట్ మెంటులో అయినా, వాళ్ళ  గుమ్మం ముందు చిన్న తాటాకు పందిరి వేయడం.

విశ్వ జ్ఞాన ధ్రువ

పిల్లలకు చాలా కొత్త కొత్త పేర్లు పెడుతూ వుండడం విచిత్రమేమీ కాదు. అయితే విశ్వ జ్ఞాన ధ్రువ అనే పేరు విచిత్రంగానే కాదు చాలా  చక్కగా కూడా వుంది. నా మేనల్లుడు, చిన్నప్పటి నుంచి నాకు   మంచి దోస్తు కొలిపాక రాజేంద్ర ప్రసాద్ (రాజన్న) మనుమడు ఈ ధృవుడు. తలితండ్రులు సుస్మిత, గోకుల్ కోరి పెట్టుకున్న పేరు ఇది. ఈరోజు ఈ ధృవుడి ఉపనయనానికి వెళ్ళాము. చాలా శాస్త్రోక్తంగా చేశారు. ఈ చిన్నవాడి మరీ చిన్నతనం లండన్ లో గడిచింది. చిన్న చదువు అక్కడ పూర్తిచేసుకుని, పెద్ద చదువుల కోసం హైదరాబాదు రావడం చిత్రమే బహు చిత్రమే ఈ రోజుల్లో. ఇంత చక్కటి తెలుగు ఎలా మాట్లాడుతున్నావ్ అంటే మా అమ్ముమ్మ నేర్పింది అనేది ఆ చిరంజీవి జవాబు.

కరోన కాలంలో రాకపోకలు పూర్తిగా తెగిపోయిన అనేక మంది బంధువులను కుటుంబసమేతంగా కలుసుకోవడం చాలా సంతోషం అనిపించింది.


కింది ఫొటో: కుర్ర బ్రహ్మచారితో మా అన్నయ్య రామచంద్ర రావుగారు, నేను. 



 

(03/4-05-2023)

 

23, ఏప్రిల్ 2023, ఆదివారం

రోడ్డు దాటగలవా ఓ నరహరి! – భండారు శ్రీనివాసరావు

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజులు.

హైదరాబాదులో ఎర్రమంజిల్ కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను. అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ సంప్రదాయంగా ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి. రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా సనత్ నగర్ అయితే తీసుకుపోతా అంటాడు. వాళ్ళతో పనికాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈలోగా సీఎం కాన్వాయ్ రావడం పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు. నేను ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. విందు పూర్తి కావస్తుండగా సీఎం సెక్యూరిటీ అధికారి నాతో అన్నారు, ‘వస్తుంటే దారిలో డివైడర్ మీద నిలబడ్డ మిమ్మల్ని చూసాము, ఒక్కసారి సీఎం గారిని కలవండి అని. చంద్రబాబు నన్ను చూస్తూనే ‘వచ్చారా సంతోషం, బ్రేక్ ఫాస్ట్ చేశారా, ఎవరక్కడ, వీరిని కనుక్కోండి’ అంటూ రోడ్డు మీద నన్ను గమనించిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. “సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, గట్టిగా ఏదైనా చేయాలి, చూద్దాం’ అన్నారు.

నేను మళ్ళీ సెక్యూరిటీ అధికారి దగ్గరికి వెళ్లి, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడ వుంటే కొంపలు మునగవు కదా' అన్నాను. ఆయన నవ్వుతూ, 'అవును మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో చెప్పి చూస్తాను' అన్నారు మర్యాదగా.

ఇది జరిగి కొంచెం అటూఇటుగా ముప్పయ్ ఏళ్ళు.

ఈ సమస్య  పరిష్కారం కాకపోగా దాని  తీవ్రత ముప్పయ్ రెట్లు పెరిగింది. కారణం వీవీఐపీల సంఖ్యతో పాటు తీరుమారిన రాజకీయాల నేపధ్యంలో వారి రాకపోకలు మరింతగా పెరగడం. 

ఒకానొక కాలంలో సమయానికి అంత విలువ వుండేది కాదు. బస్సులు, రైళ్లు కొంచెం ఆలస్యం అయినా జనం సర్దుకు పోయేవాళ్ళు. ఇప్పుడలా కాదు. సమయం అంటే డబ్బుకు మరో రూపం. కార్పొరేట్ ప్రపంచంలో జీవించేవారికి ఆలస్యాలు అసలు పనికి రావు. అలాగే ఆసుపత్రులకు వెళ్ళే వారికి కూడా సమయం అమూల్యం. అమృత ఘడియల్లో (గోల్డెన్ అవర్స్ అని డాక్టర్లు అంటారు) రోగికి చికిత్స అందిస్తే రోగి బతికి బట్టకట్టే అవకాశాలు ఎక్కువ. అటువంటి వారిని తీసుకువెళ్ళే అంబులెన్సులకు సయితం ఈ ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు.   

కొన్ని కొన్ని చిన్న చిన్న చర్యలతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదు.

అన్నింటికంటే ముందు చేయాల్సింది,  ట్రాఫిక్ అధికారులు తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడం. హెల్మెట్లు, సీటు బెల్టులవంటి నిబంధనల అమలుకు తీసుకుంటున్న శ్రద్ధని, కొంతకాలంపాటయినా,  ట్రాఫిక్ చిక్కుముళ్ళని చక్కదిద్దే దిశగా మరల్చాలి. ఎక్కడ, ఏ సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందో అధ్యయనం చేసి అందుకు తగ్గట్టుగా అదనపు సిబ్బందిని  ఆయా కూడళ్ళలో, అవుట్ సోర్సింగ్ పద్ధతిపై నియమించాలి. ఈ సిబ్బందికయ్యే ఖర్చుని ఆయా కూడళ్ళ చుట్టు పక్కల ఉండే దుకాణాలు, నివాస సముదాయాలనుంచి పారదర్శక పద్ధతిలో వసూలు చేసినా తప్పులేదు.

రోడ్లు దాటడానికి  అనేక నగరాల్లో పలు చోట్ల లక్షలు ఖర్చు చేసి ఫుట్ వోవర్ బ్రిడ్జీలు నిర్మించారు. వాణిజ్య ప్రకటనలకు మినహా, వాటిని జనం ఉపయోగిస్తున్న దాఖలాలు లేవు. స్త్రీ, బాల, వృద్ధులు ఆ వంతెనలు ఎక్కలేరు. ఎక్కగలిగిన వారు ఎక్కనే ఎక్కరు. వాహనాల నడుమ రోడ్డు దాటి వెళ్ళడానికే ప్రయత్నిస్తారు.  అందువల్ల వాటిని మరింత ఉపయోగంలోకి తీసుకురావడానికి వాటికి లిఫ్టులు అమర్చాలి. అందుకయ్యే వ్యయాన్ని కొద్ది కొద్దిగా వినియోగదారుల నుంచి రుసుము రూపంలో రాబట్టుకోవాలి. హైదరాబాదు వంటి చాలా నగరాలు, పట్టణాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సదుపాయం వుంది. కానీ వాడుతున్న దాఖలా లేదు.

ప్రైవేటు విద్యాసంస్థల వద్ద నిర్మించిన కాలి వంతెనల పూర్తి వ్యయాన్ని ఆ సంస్థల నుంచే వసూలు చేయాలి. విద్యార్ధుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు పిండుతున్న ఆ సంస్ధలకి ఇదేమంత పెద్ద భారం కాబోదు.

ఇలాటి ఏర్పాట్లకి వీలులేనిచోట్ల ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి. అనేక రద్దీ కూడళ్ల వద్ద రోడ్డు దాటలేక అవస్తలు పడేవారు అనేకమంది కనిపిస్తుంటారు. భవసాగరం ఈదడం కంటే రోడ్డు దాటడం కష్టంగా భావిస్తుంటారు.

బాగా అభివృద్ధి చెందిన ప్రపంచ నగరాలలో రోడ్డుదాటడానికి పుష్ బటన్  వ్యవస్థలు వుంటాయి. రోడ్డుపక్కన వున్న పుష్ బటన్ నొక్కగానే రోడ్డు క్రాస్ చేయడానికి వీలుగా పచ్చ దీపం వెలుగుతుంది. వారు రోడ్డుదాటి వెళ్ళేవరకు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతాయి.

విద్యుత్ దీపాలతో కూడా పని లేకుండా,  జండాలను ఉపయోగించే ఒక విధానం కొన్ని విదేశాల్లో అమల్లోవుంది. అదేమిటంటే, రోడ్డుకు ఇరువైపులా  విద్యుత్  స్తంభాలకు తగిలించిన బాస్కెట్లలో కొన్ని జండాలను ఉంచుతారు. రోడ్డు దాటాలనుకునేవారు ఒక  జండాను తీసుకుని చేతిలో పట్టుకుని ఊపుకుంటూ వెళ్లిపోవచ్చు. రోడ్డు దాటిన తరవాత అవతలవైపు వున్న బాస్కెట్లో వుంచి తమదారిన వెళ్లిపోవచ్చు. ఇరుకైన రోడ్లు వున్న పాత బస్తీ వంటి ప్రాంతాల్లో ఈ పద్దతి ఉపయుక్తంగా వుంటుంది. అయితే ఇచ్చిన సదుపాయాన్ని దుర్వినియోగం చేయడమే పరమావధిగా భావించే జనం అధికంగా ఉన్న మన పౌరసమాజం కారణంగా, ఇటువంటి చిట్కాలు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయనేది అనుమానమే మరి.   

పోతే, థియేటర్లు, పాఠశాలలు, ఆఫీసుల వేళల్లో తగుమార్పులు చేయడం ద్వారా, ఒకే సమయంలో, ప్రజలు, వాహనాలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు రాకుండా నియంత్రించడానికి వీలుపడుతుంది.

కనిపించిన చోటల్లా `నోపార్కింగ్' బోర్డులు పెట్టకుండా పార్కింగ్ కి అనువయిన స్ధలాలని ముందుగా గుర్తించాలి. పోలీసు వాహనాలు `నోపార్కింగ్' ప్రదేశాల్లో నిలపకుండా చూడాలి.

ప్రయివేటు బస్సులని ఎలాగూ అదుపు చేయలేరు కనుక, రాత్రి సమయాలల్లో కొన్ని కొన్ని విద్యాసంస్థలకున్న ఖాళీ జాగాలలో ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు అనుమతి ఇవ్వాలి. ఇందుకోసం వసూలు చేసే రుసుముని ఆయా విద్యా సంస్థలకే ఇవ్వాలి. ఇలా చేయడంవల్ల అనేక ప్రాంతాలలో రాత్రివేళల్లో రోడ్ల మీద  ట్రాఫిక్ జామ్స్ తగ్గిపోతాయి.

స్కూళ్ళకీ, ఆఫీసులకీ వెళ్ళే రద్దీ సమయాల్లో చెకింగులు జరిపే పద్ధతికి స్వస్తి చెప్పాలి. కన్నూ మిన్నూ కానని అతి వేగంతో ద్విచక్ర వాహనాలపై దూసుకుపోయేవారిని, సిగ్నల్ జంపింగ్ చేసే వాహనదారులను పట్టుకుని భారీ జరిమానాలు విధించాలి. అసలు ఇలాటి వాహనదారుల వల్లనే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ.

అలాగే, రద్దీ సమయాలని దృష్టిలో పెట్టుకుని నగరాల్లో 'వీ.ఐ.పీ.' ల పర్యటనలు, రాకపోకల సమయాల్లో మార్పులు చేయాలి. వారికోసం రోడ్లపై  వాహనాలను అంతూపొంతూ లేకుండా నిలిపివేసే పద్దతికి  స్వస్తి చెప్పడానికి అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు వాడుకోవాలి. 'ప్రజలకోసమే మేము, ప్రజాసేవలో మేము' అంటూ నిత్యజపం చేసే నాయకులు, ఇందుకు ఏమాత్రం సహకరిస్తారో చూడాలి.

ప్రధానమైన ఆస్పత్రులు వున్న వీధుల్లో రాస్తారోఖోలు, ధర్నాలు, ఊరేగింపులను నిషేధించాలి.

ఇవన్నీ చేసినా, సమస్య నూటికి నూరుపాళ్లు పరిష్కారం కాకపోవచ్చు. కానీ పరిస్థితి కొంతలో కొంత మెరుగు పడడానికీ , పోలీసుల పట్ల ప్రజలకున్న అవగాహన, అభిప్రాయాల్లో సానుకూల మార్పు రావడానికే ఈ చర్యలు ఖచ్చితంగా దోహదం చేస్తాయి.

తోకటపా:

ట్రాఫిక్ ఇబ్బంది అంటే ఏమిటో ప్రముఖ రాజకీయ నాయకుడు డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డికి కూడా ఒకసారి తెలిసివచ్చింది. ఆ కధాక్రమంబు ఎట్టిదనిన:

హైదరాబాదు ప్రెస్ ఫొటోగ్రాఫర్ల సంఘం వాళ్ళు ఏటా ఒకసారి సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూ వుండడం రివాజు. అది జరిగినన్నాళ్ళు ప్రతిరోజూ ఒక అతిధిని ఆహ్వానిస్తుంటారు. అలాగే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వున్న వైఎస్ రాజశేఖరరెడ్డిని పిలిచారు. రిసీవ్ చేసుకోవడానికి క్లబ్ కార్యదర్శిగా నేనూ, ప్రెస్  ఫోటోగ్రాఫర్లు అందరం క్లబ్ మెయిన్ గేటు దగ్గర నిలబడి ఉన్నాము. వైఎస్ కారులో కేవీపీ రామచంద్రరావు కూడా వస్తున్నారు. ఖైరతాబాదు వైపు నుంచి వస్తున్న వాళ్ళ కారు,  రోడ్డుకు అటువైపు వున్న ఈనాడు మీదుగా వెళ్లి యూ టర్న్ తీసుకుని  ఆర్టీఏ ఆఫీసు పక్కనే ఉన్న  ప్రెస్  క్లబ్ కు రావాలి. అయితే  వై.ఎస్. కారు టర్న్ తీసుకునేలోగానే, సీఎం వస్తున్నారని పోలీసులు ట్రాఫిక్ నిలిపి వేసారు. ఎదురుగా వున్న రోడ్డులో వాహనాల నడుమ నిలిచివున్న వైఎస్ కారుని ఇటువైపునుంచి మేము చూస్తూనే ఉన్నాము. (అప్పట్లో మెట్రో లేదు).  కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రావడం, సచివాలయం వైపు దూసుకు పోవడం జరిగింది. ట్రాఫిక్ కదిలింది. మలుపు తీసుకు వచ్చిన వైఎస్ కారు క్లబ్ దగ్గర ఆగకుండా గేటు దగ్గర నిలబడి వున్న మా కళ్ళఎదుటే  అలా ముందుకు వెళ్ళిపోయింది. వెంటనే నేను కేవీపీ  మొబైల్ కి ఫోను చేశాను. ఆయన ‘అరెరే! బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ అనుకున్నాము’ అని నొచ్చుకుంటూ చెప్పారు. ఆ వెంటనే విశ్వేశ్వరయ్య చౌరాస్తాలో మళ్ళీ వెనక్కి తిరిగి క్లబ్ కి చేరుకున్నారు.

22, ఏప్రిల్ 2023, శనివారం

అన్వర్ గారూ

 రంజాన్ శుభాకాంక్షలు

మీ ఈ పోస్టు చదవక పొతే జీవితంలో బోలెడు మిస్సయ్యేవాడిని. అంచేత అందులో కొన్ని పేరాలను, వాక్యాలను రాసి దాచి పెట్టుకున్నాను. తెలిసిన విషయాలను, తెలిసిన వాటిలో ఇంతవరకు తెలియని సంగతులను, అసలు బొత్తిగా తెలియని విషయాలను ఈ పోస్టు ద్వారా అందించినందుకు ధన్యవాదాలు.  

నేను ఏరుకున్న ఆణిముత్యాలలో కొన్ని.

“అసలు పండగలంటేనే తెల్లవారు ఝామునుండే మొదలయేవి”

“కొత్త బట్టలంటేనే తాను నుండి గుడ్డ చింపించి, చక్కగా కొలతలు తీపించి, కుట్టించి, నలభైసార్లు దర్జీ షాపు చుట్టూ తిరిగి, చొక్కాయ్ సాధించి దానిని బొగ్గుల పెట్టెతో ఉల్టా పల్టా ఇస్త్రీ లాగించి మన చొక్కాని తొలిసారిగా వాడెవడో కాక మనమే తొడుక్కోడం. ఇప్పుడు మనం కొత్తంగి అని తొడుక్కునేది ఎక్కడని కొత్తది? ఆ రెడీమేడ్ షో రూమ్ ట్రైల్ రూమ్‌లో ఎంతమంది దానిని వేసుకుని, విడిచి, నలగ్గొట్టి బాలేదని బయట పడేసింది వచ్చి మన వాటాకు దక్కిందో!”

ప్రార్థనలు త్వరగానే ముగిసేవి. కళ్ళు మూసుకుని ప్రార్థనలు చేసే తోటివాళ్ళు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తుంటాడు కదా! మన మనసు గమనిస్తుంటుంది కదా! సిగ్గుగా ఉండదూ? మనమీద మనకు అసహ్యం వేయదూ?

“అసలు రంజాన్‌ను రంజాన్ అని కూడా అనకూడదట రమ దాన్ అనాలని మళ్ళీ అదొక రుద్దుడు జ్ణానము. వద్దురా దేవుడా!”

“సంవత్సరానికి ఒకసారి వచ్చే పెద్దల రాత్రి అని ఒక దినం ఉంటుంది. ఆ దినాన మా ఇంట్లో మరణించిన వారినందరిని గుర్తు చేస్తుకుంటూ, వారు తమ జీవితకాలంలో దేన్నయితే ఇష్టపడేవాళ్ళో ఆ పదార్దాలను నైవేద్యంగా పెట్టేవారు. వారి కొరకు కొత్తబట్టలు తెచ్చేవారు. మా జేజినాయనకు గణేష్ బీడి ఇష్టమని బీడి కట్ట ఒకటి, గళ్ళుగళ్ళు గల లుంగి, మా అమ్మకు చీర, చిన్నతనానే చనిపోయిన చిన్నపిల్లల కోసం లడ్డు, బాదుషా, మినపగారెలు, ఇంకా అవీలు ఇవీలు. ఎవరికి ఏది ఇష్టమేదయితే అది అన్నమాట. “మనసు నిండుతో వారందరి పేర్లను తలుచుకుంటూ సాంబ్రాణి పొగను, మా భక్తితో పాటే ఆకాశం వైపు పంపించేవాళ్ళం. వారందరితో పాటు ఆమధ్యే మాకు దూరమయిన బాపుగారు, పతంజలిగారు, నాయుని కృష్ణమూర్తిగారు, మోహన్‌గారికి కూడా సాంబ్రాణి భక్తిని వేసేవాళ్ళం.”

“పెద్దలందరి పేరిట సాంబ్రాణి ధూపాలు వేసిని తరువాత ఇంటిల్లిపాది అంతా తలుపులు, కిటికీలు అన్నీ మూసివేసి కాసేపు బయట కూచోవాలి. అప్పుడు మా పెద్దలు అందరూ దివినుండి దిగి వచ్చి మేము తెచ్చిపెట్టిన బట్టలు ఇష్టంగా కట్టుకుని, వండిన అన్నాలు తిని వెళ్ళిపోతారని చెప్పేవారు. అవన్నీ మనం చూడకూడదని అందుకే తలుపులు మూయాలని చెప్పెవారు. చిన్నతనాన అప్పుడప్పుడూ మా ఇంట్లోకి ఝుమ్మంటూ కందిరీగ వచ్చేది. దాన్ని చూసి ఎక్కడ కుడుతుందోని భయంతో దూరం తోలడానికి విసనకర్రో, చేటో పుచ్చుకుంటామా, దానిని కొట్టవద్దని, పాపమని మా మేనత్త చేప్పేది. అది కందిరీగ కాదట. చనిపోయిన మా జేజినాయన అలా వచ్చాడని చెప్పింది. జీవితంలో చాలావాటికి హేతువులు, సమాధానాలు, తెలివితేటలు వాడనక్కరలేదు. కొన్ని విషయాలపై ప్రేమ కలిగి ఉంటే చాలు. చాలా బావుంటుంది.”

“అటూ ఇటూ నడుస్తూ, పరిగెడుతూ, నిక్కర్ జేబులో నాణేల బరువు, ఘల్లు ఘల్లు చప్పుడు అవుతుంటే అచ్చం లక్ష్మీదేవి మా చిల్లర జేబుల్లో కొలువు తీరినట్లుగా ఉండేది”

“వయసు పెరిగేకొద్ది పండగ కూడా ముసలిదవుతుందని తెలీదు, విషయం తెలిసిన పెద్దలు ఎవరూ మాకు చెప్పలేదు. కరిగిపోతుందని తెలుసు కాబట్టి పుల్ల ఐసుని కొంచెం కొంచెం కొరుక్కుతిన్నట్టుగా పండగలని ఆ రంగులని నిముషానికి ఆరు లక్షల తొంబై మూడు వేల నాలుగువందల పదహారు సెకండ్ల చొప్పున అనుభవించాలని తెలీదు.”

“మా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ దేవుడు లేడని నాకు చెప్పింది కానీ పండగలు మాత్రం ఉన్నాయని నా చిన్ననాటి ఇల్లు నేర్పింది నాకు” “జీవితంలోని అసలైన కొన్ని ఉదయాలు, మధ్యాహ్నాలు, సాయంత్ర రాత్రుళ్ళు, నక్షత్రాలు నశించాయి. ఇక అవి ఎప్పటికీ లేవు. ఇప్పుడు పండగ లేదు. భగవంతుడే ఉన్నాడు. ఆయన దయ వలన జ్ఞాపకాల్లో పండగ మిగిలి ఉంది”

మరోసారి ధన్యవాదాలు అన్వర్ గారు మీ విలువైన  పండగ కానుకకు.

ఈద్ ముబారక్!

భండారు శ్రీనివాసరావు


(Image courtesy: Cartoonist Anwar)


22-04-2023