14, ఏప్రిల్ 2022, గురువారం

ఐ వాంట్ టు డై ఎట్ మై హోం

 రెండు సంఘటనలు చెప్పుకుందాం.

2018 ఏప్రిల్ పద్నాలుగో తేదీ సాయంత్రం. కార్పొరేట్ ఆసుపత్రిలో ఓ డాక్టరు తన పేషెంటుతో చెబుతున్నాడు.

మీకు మంచి వైద్యం అందుతోంది, త్వరలో కోలుకుంటారు’

సరే కానీ డాక్టర్! ఐ వాంట్ టు డై ఎట్ మై హోమ్. ప్లీజ్ డిశ్చార్జ్’

ఆ పేషెంటు కూడా డాక్టరే. మా అక్కయ్య కుమారుడు డాక్టర్ ఏపీ రంగారావు.

పేషెంటు అభ్యర్ధన మేరకు డిశ్చార్జ్ చేసారు. ఇంటికి చేరాడు. పన్నెండు గంటలు కూడా కాలేదు. ఆ రాత్రి గడవలేదు. తెల్లవారుజామున కన్ను మూశాడు.

ఇక రెండోది.

మా దగ్గరి బంధువును హైదరాబాదులోని ఓ పెద్ద ఆసుపత్రిలో చేర్చారు. వారిది ఈ ఊరు కాదు. పరిస్తితి క్రిటికల్ అన్నారు. రెండు రోజులు గడిస్తే కాని చెప్పలేమన్నారు. ‘ఒక టెస్ట్ చేయించాలి, అదిక్కడ లేదు, బయట వాళ్ళు చేస్తారు, ఏడు వేలు అవుతుంది, ఆ టెస్ట్ చేయడానికి వచ్చిన వాడికి ఏడు వేలు ఇవ్వండి’ అని చెప్పారు ఆసుపత్రివాళ్ళు. ఆ టెస్ట్ చేయించారు. డబ్బు చెల్లించారు. గంటలు గడవక ముందే ఆ పేషెంటు కన్ను మూసింది. ఆసుపత్రి ఫీజులన్నీ ముందే కట్టేశారు కనుక డిశ్చార్జ్ కి ఎక్కువ టైం తీసుకోలేదు. ఇంతలో వాళ్లకు అంతకు ఒక రోజు ముందు చేయించిన టెస్ట్ జ్ఞాపకం వచ్చి అడిగారు. ఆ రిజల్ట్ అయిదు రోజులకు వస్తుంది అని జవాబు.

రెండు రోజులు గడవటం కష్టం’ అని చెప్పిన వాళ్ళు అయిదు రోజుల తర్వాత రిజల్ట్ వచ్చే టెస్ట్, అదీ ఆసుపత్రి వెలుపల వాళ్ళ చేత చేయించడం ఏమిటో అర్ధం కాని స్తితిలోనే వాళ్ళు పేషెంటు బాడీ తీసుకుని ఊరికి వెళ్ళిపోయారు.

చికిత్స పేరుతో డబ్బులు పిండుతూ చేసే ఇటువంటి వైద్యాలకు డాక్టర్ రంగారావు పరమ విరోధి. అతితక్కువ ఖర్చుతో చేసే వైద్యమే పేదవారు ఎక్కువగా వుండే మన వంటి దేశాలకు ఉపయుక్తమని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. స్వల్ప ఖర్చుతో సత్వర వైద్యం అనేది ఆయన నినాదం. చిన్న చిన్న అస్వస్థతలను శరీరమే తట్టుకుంటుందని, వీటి కోసం పెద్ద పెద్ద వైద్యాలు, పరీక్షలు అనవసరమన్నది డాక్టర్ రంగారావు నిశ్చితాభిప్రాయం. ఇలా వచ్చిన వారికి ఆయన ఓ క్రోసిన్ గోలీ వేసుకోండని చెబుతూ వుండేవారు. ఆయన అన్నట్టే వారికి స్వాంతన చేకూరేది. దానితో ఆయనకు డాక్టర్ క్రోసిన్ అనే పేరు వచ్చింది.

ఎన్నో ఏళ్ళక్రితం వైద్య విద్యార్ధిగా తొలిపాఠం నేర్చుకున్నప్పుడు, యువ డాక్టర్లకు నేర్పే ఓ నీతిపాఠాన్ని ఆయన ఒంటపట్టించుకున్నాడు. జీవితాంతం దాన్నే పాటిస్తూ వచ్చాడు.

రోగికి అవసరం లేని వైద్యం చేయకూడదు, చేసిన వైద్యానికి డబ్బు తీసుకోకూడదు’ అన్నది ఆ పాఠం.

నిజానికి డాక్టర్ రంగారావు ఒక మామూలు డాక్టర్. ‘నేనొక షరా మామూలు డాక్టర్ ని’ ఆయన అనుకున్నట్టయితే ఆయన కధే వేరుగా వుండేది. ఎక్కడో సంపన్నుల కాలనీలో ఓ పెద్ద భవంతి కట్టుకుని ‘నాకిది చాలు’ అనుకుంటూనో, ’ఇంకా కావాలి’ అని తాపత్రయ పడుతూనో జీవితాన్ని దొర్లించి ఉండేవాడు. కానీ ఆయన అలా అనుకోలేదు. సాధారణ మనుషులు కూడా నిబద్ధతతో వ్యవహరిస్తే గొప్ప పనులు చేయడం అసాధ్యం కాదని నిరూపించాడు.

పది జీవితాల్లో చేయాల్సిన మహత్తరమైన పనులన్నింటినీ ఆయన ఒక్క జీవితంలోనే చక్కబెట్టగలిగారు.

అలాంటి విశిష్ట వ్యక్తిత్వం కల మనిషి కనుకనే ఇతరులకు అసాధ్యం అనుకున్న 108, 104 వంటి అనేక అపూర్వ పధకాలను ఆయన నిజం చేసి చూపించగలిగారు.

సకల జనులు మెచ్చుకున్న ఆ గొప్ప పనుల వెనుక తానున్నానని చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడూ వెంపర్లాడలేదు. కనుకనే ఆయన మరణించిన తర్వాత జ్వాలా వంటివారు డాక్టర్ రంగారావు గురించి రాసిన అనేక వ్యాసాలు పత్రికల్లో చదివి, ‘ఈయన ఇంతటి గొప్పవాడా, మాకు తెలియదే’ అంటూ ఫోన్లు చేసి కొనియాడిన అపరిచితులు అనేకమంది.

రేపు ఏప్రిల్ పదిహేను ఆయన వర్ధంతి


(డాక్టర్ రంగారావుతో నేను)




(14-04-2022)

13, ఏప్రిల్ 2022, బుధవారం

మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి ఫోటో చూశారా? – భండారు శ్రీనివాసరావు

 

రెండేళ్ల క్రితం కాబోలు ఆయన అమెరికా నుంచి ఫోన్ చేశారు. అంత గొప్ప రచయిత తనకు తానుగా నాకు ఫోన్ చేయడం ఎంతో సంతోషం అనిపించింది. అయితే ఆ ఆనందం క్షణాల్లోనే ఆవిరై పోయింది.
“శ్రీనివాసరావు గారు మీరు చేసిన పని నాకు ఏమాత్రం బాగాలేదు. వెంటనే మీ బ్లాగు నుంచి నా ఫోటో తీసెయ్యండి”
మృదువుగా చెప్పినా ఆయన పలుకుల్లో దాగున్న కాఠిన్యం, తీవ్రత అర్ధం అవుతూనే వుంది.
“తప్పకుండా! యిప్పుడే మీ ఫోటో తీసేస్తాను” అన్నాను ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో తెలియక.
అన్నట్టుగానే ఫోటో తొలగించాను. ఆ సంగతి ఎస్సెమ్మస్ ద్వారా ఎరుకపరిచాను. అంతే కాదు, ఆ విషయం ఫేస్ బుక్/ బ్లాగ్ మితృలకు కూడా తెలియచేశాను.
“మల్లాది వేంకట కృష్ణమూర్తి గారు ఇప్పుడే ఫోన్ చేసి తన ఫొటో తీసేయమని చాలా మృదువుగా రిక్వెస్ట్ చేశారు. అందుచేత ఆ పోస్టును, వారి ఫొటోను తీసేస్తున్నాను. వారి మనోభావాలను గౌరవించడం నా విధి. అలాగే ఇప్పటికే ఈ ఫొటోను, పోస్టును షేర్ చేసినవారు ఎవరైనా వుంటే దయచేసి వాటిని తొలగించి మీ అభిమాన రచయిత మనసు గాయపడకుండా చూడండి” అని కూడా విజ్ఞప్తి చేశాను.
రచయితగా ఆయన నాకు కొత్త కాదు. కానీ ఫోటో ఎక్కడా కనబడకూడదు అనే ఈ తరహానే నాకు కొత్తగానూ, వింతగాను అనిపించింది. మేము ఇద్దరం చదువుకున్న ఎస్సారార్ కాలేజి గ్రూపు ఫోటోలో కూడా ఆయన ఫోటో లేదు.
లెక్కలేనన్ని కధలు, నవలలు రాసిన మల్లాది, ఇప్పుడు ఆ వ్యాపకానికి దూరంగా ఆధ్యాత్మికతకు దగ్గరగా జీవితం సాగిస్తున్న సంగతి నాకు తెలుసు. కానీ తన ఫోటో ఎక్కడా ప్రచురించ కూడదు అని తనకు తానుగా తీసుకున్న నిర్ణయానికి, గీసుకున్న గిరికి ఇన్ని దశాబ్దాలుగా కట్టుబడి వుండడం అపూర్వం. ప్రసిద్ధ రచయితల ఫోటోలు పత్రికల్లో, వాళ్ళ పుస్తకాల కవర్ పేజీల్లో అందరం చూస్తూనే ఉంటాము. కానీ మల్లాది ఫోటో చూసిన వారు అరుదు. ప్రచురించిన వారు లేనేలేరు. ఎందుకంటే ఫోటోగ్రాఫర్లకు ఆయన చేసే విజ్ఞప్తి ఇదొక్కటే, దయచేసి నా ఫోటో మీ పత్రికలో వేయకండి అని.
మొన్న వాట్సప్ లో మల్లాది నాకో యు ట్యూబ్ వీడియో పంపించారు. అందులో ఈ ఫోటో కధ వుంది. ఆ విశేషాలు అన్నీ ఆయనే స్వయంగా చెప్పారు.
కింద ఆ వీడియో లింక్ ఇస్తున్నాను. ఇచ్చే ముందు ఆయన్ని అడిగాను దీన్ని గురించి రాయవచ్చా అని. సరే అన్న తర్వాతే ఈ పోస్టు.
(13-04-2022)
LINK:




అభిమాన దురభిమానాలు – భండారు శ్రీనివాసరావు

 అభిమానం అనే కళ్ళజోడు ధరించి చూస్తే స్వపక్షం తప్పులు చిన్నవిగాను, ఎదుటి పక్షం తప్పులు పెద్దవిగాను కనిపిస్తాయి. (పాలకపక్షం, ప్రతిపక్షం అనే పదాలు వాడలేదని మనవి, అంటే ఇందులో రాజకీయం లేదని అర్ధం)

మన పిల్లవాడు అద్దం పగలకొడితే ‘ఏదో చంటి సన్నాసి తెలియక చేసాడు, పోనీండి’ అంటాం. అభిమానం అలా అనిపిస్తుంది.

అదే పక్కింటి పిల్లోడయితే ‘రౌడీ వెధవ, పెంపకం అలాంటిది’ అని తేలిగ్గా అనేస్తాం. దురభిమానం అలా పలికిస్తుంది.

ఇక్కడ అభిమాన, దురభిమానాలదే ప్రధాన భూమిక.

వీటికి వయసుతో నిమిత్తం లేదు.

ఇరవై నుండి అరవై వరకు ఇదే వరస.

చిన్నప్పుడు  సినిమా పోస్టర్లపై  పేడ రూపంలో  ఇళ్ళ గోడల మీదా, ఇప్పుడు ఫేస్ బుక్ గోడలమీదా.

(2020)

10, ఏప్రిల్ 2022, ఆదివారం

కరెంటు దుబారా - భండారు శ్రీనివాసరావు

 

‘ఒక వాటర్ కేన్ కొనడానికి ఇంత దూరం రావాలా’
నా ప్రశ్న
‘ఇక్కడ గ్యాస్ (పెట్రోలు) చౌక'
మావాడి జవాబు
‘‘హైదరాబాదులో మన ఇంట్లో ప్రతి గదిలో ఎవరు వున్నా లేకపోయినా ఫ్యాన్లు తిరుగుతుంటాయి. లైట్లు వెలుగుతుంటాయి. ఇక్కడ చూడు. అలా ఎవ్వరూ చేయరు. ఎందుకంటే కరెంటు ఛార్జీలు ఎక్కువ. నతింగ్ ఈజ్ ఫ్రీ’
అన్నాడు వాడే.
పదేళ్ల కిందట అమెరికాలో జరిగిన సంభాషణ ఇది.

ఇండియా వచ్చిన తర్వాత గమనించాను. వాడు చెప్పింది నిజమే అనిపించింది. అన్ని అపార్ట్ మెంట్లలో టీవీలు మోగుతున్నాయి, మరో పక్క ఎవరి పనుల్లో వాళ్ళు వున్నారు. కింద వాచ్ మన్ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి.
బుక్ చేసిన గ్యాస్ సిలిండర్ వచ్చింది. బెల్ కొట్టగానే వంటమ్మాయి వంటింట్లో వెలుగుతున్న గ్యాస్ సిలిండర్ ఆపేసి బయటకు వచ్చింది, అక్కడ లైట్లు వెలుగుతూనే వున్నాయి, ఎక్జాస్ట్ ఫ్యాను తిరుగుతూనే వుంది. అంటే ఏమిటి? గ్యాస్ అయిపోతే వెంటనే రాదేమో. కరెంటు వస్తూనే వుంటుంది కదా అనే ధైర్యమేమో.
మా ఇంట్లో పరిస్థితి అందరిండ్లలో ఉంటుందని కాదు. మానవ స్వభావాన్ని గురించి చెబుతున్నాను.
అమెరికాలో పెట్రోలు లాగా ఈ దేశంలో కరెంటు చౌక అనే అభిప్రాయం జనంలో ఉందా ఏమిటి?
విద్యుత్ చార్జీల పెంపును సమర్థించడానికి కాదీ పోస్టు. ఏ ఒక్కరైనా ఆలోచిస్తారేమో అని.
(10-04-2022)

కమలం ప్రస్థానం – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha on 10-04-2022, SUNDAY today)

నలభయ్ ఏళ్ళు దాటాయి అంటే అది నడికారు వయస్సు. ఇంగ్లీష్ లో ప్లస్ ఫార్టీ సిండ్రోం అంటారు. జీవితంలో పూర్తిగా స్థిరపడిన వయసు కాదు, అలా అని స్థిరపడని వయసూ కాదు. నాలుగురోడ్ల కూడలిలో నిలబడి, అంతవరకూ జీవితం బోధించిన గుణపాఠాలతో మంచిబాటలో సాగడానికి, లేదా అనవసరమైన ఆకర్షణలకు లోబడి చెడు మార్గం వైపు మళ్ళడానికి అదే తరుణం.
ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ కూడా సరిగ్గా ఈ దశకు చేరుకుంది.
ఆరెస్సెస్ మూలాలు వున్నవాళ్ళు మా కుటుంబంలో నాకు తెలుసు. చదువుకుంటూ ఉద్యోగధ్యాసలో వుండాల్సిన వయసులో వాళ్ళు, పొద్దున్న పొద్దున్నే లేచి ఖాకీ నిక్కరు తొడుక్కుని, లాఠీ చేతబట్టుకుని వెడుతుంటే నాకు ఆశ్చర్యంగా అనిపించేది. ఒక్కోసారి వాళ్ళతో వెళ్ళేవాడిని. మైదానంలో కవాతు చేసేవారు. ఎవరో ఏదో అర్ధం కాని భాషలో ఏదేదో చెప్పేవారు. అంతటి క్రమశిక్షణ నేను క్లాసు రూములో కూడా చూడలేదు.
మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత, దివి సీమ ఉప్పెన సమయంలో ఆరెస్సెస్ మాట వినబడింది. ఆ విపత్కర సమయంలో వాళ్ళు చేసిన సేవలను చూసినప్పుడు, విన్నప్పుడు, వరద నీటిలో రోజుల తరబడి నాని పోయి, కుళ్లిపోయి కంపు కొడుతున్న శవాలకు అగ్ని సంస్కారాలు చేసిన వార్తలు చెవిన పడ్డప్పుడు వీళ్లు కదా మనుషులంటే అనే అభిప్రాయం ఏర్పడింది.
ఆ రోజుల్లో గోడల మీద రాజకీయ పార్టీల నినాదాలు కనిపించేవి. ప్రమిద గుర్తుకు మీ ఓటు అని రాసి వుండేది. అది జనసంఘం పార్టీ అనేవారు. ఆరెస్సెస్ కార్యకర్తలు ఈ నిరాడంబర ప్రచారం చేసేవారని చెప్పుకునేవారు. అప్పటికి ఎక్కడా ఏ ఎన్నికలో జనసంఘం పార్టీ గెలిచిన దాఖలా లేదు. గెలవని పార్టీకి ఓటు వేయడం ఎందుకు దండగ అని కొందరు ఆ పార్టీ పట్ల అభిమానం ఉన్నప్పటికీ వేరే పార్టీకి వేసేవాళ్ళు.
కాలేజి చదువుల నాటికి వామపక్ష విద్యార్థి సంఘాలదే హవా. కొన్నాళ్ళకు మరో విద్యార్థి సంఘం పుట్టుకు వచ్చింది. భారతీయ జనతా పార్టీ తరపున వచ్చిన విద్యార్థి పరిషత్ అది. దాని నాయకులు మృదువుగా మాట్లాడి తోటి విద్యార్ధులను తేలికగా ఆకర్షించే వాళ్ళు. త్వరలోనే ఆ విద్యార్థి సంఘం విశ్వ విద్యాలయ స్థాయిలో కూడా బాగా వేళ్ళూనుకుంది. అప్పుడో సత్యం తెలిసింది. పోటీ లేనప్పుడు, వున్న సంఘాలనే ఆదరిస్తారు. ప్రత్యామ్నాయం దొరికింది అనుకుంటే మాత్రం తటస్థులు దాని వైపు మొగ్గుతారు.
ఇక జర్నలిజంలో ప్రవేశించిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. బీజేపీ, వామ పక్షాల నాయకుల తీరు విభిన్నంగా వుండేది. విలేకరులకు రాజమర్యాదలు చేయకపోయినా వారి మాటల్లో మర్యాద మన్నన కనిపించేవి. చెప్పదలచుకున్నది సూటిగా చెప్పేవారు. విమర్శలు సహేతుకంగా ఉండేవి. ఈ వార్త రావాలి సుమా అనే హెచ్చరికతో కూడిన అభ్యర్ధనలు ఉండేవి కావు. ఒక స్థాయి నాయకులు పార్టీలో ఉన్నత స్థాయికి ఎదగడం అనేది ఒక జర్నలిస్టుగా నేను చూడగలిగాను. ఇతర పార్టీలలో ఇలా జరగదు అని కాదు కానీ, బీజేపీలో ఈ సంఖ్య హెచ్చుగా కనబడింది.
తరం మారినప్పుడు మార్పు సహజం. అయితే ఈ మార్పులు సిద్ధాంతాలలోనా, విధానాలలోనా అనేది ప్రధానం. లక్ష్యంతో పాటు, దాన్ని చేరుకునే మార్గం కూడా సరైనది వుండాలనేది పాత తరం బీజేపీ నాయకుల విధానం. గమ్యం సరైనది అయినప్పుడు ఆ లక్ష్య సాధనలో నడిచే మార్గం ఎలాటిదైనా పర్వాలేదనేది తర్వాతి తరం విశ్వాసం కావచ్చు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు అనివార్యం. అయితే, మూల సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వనంత కాలం విధానాల మార్పును కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు.
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. బీజేపీని ఒక రాజకీయ పార్టీగా విశ్లేషించడం ఒక విషయం. ఎన్డీయే కూటమికి నాయకత్వం వహిస్తున్న పార్టీగా విశ్లేషించడం మరో విషయం. ప్రస్తుతాంశానికి సంబంధించి ఒక రాజకీయ పార్టీగా మాట్లాడుకోవడమే సముచితంగా వుంటుంది.
లోకసభలో పార్టీ బలం రెండే రెండు స్థానాల నుంచి మూడంకెల సంఖ్యకి చేరుకోవడానికి దాదాపు మూడు దశాబ్దాలు పట్టింది. అలాంటిది ఇప్పుడు అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగలగడం చిన్న విషయమేమీ కాదు.
2014లో బ్రహ్మాండమైన మెజారిటీతో మోడీ నాయకత్వంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారానికి వచ్చినప్పుడు ఆ పార్టీ ఇచ్చిన కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదం వివాదాస్పదం కావడానికి కారణం అది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. ప్రతిపక్షం లేని పాలకపక్షం నియంతృత్వానికి దారి తీసే అవకాశం వుంటుంది. ప్రత్యర్థి పార్టీని బలహీన పరచడాన్ని ఎవరూ తప్పుపట్టరు. సమూలంగా నిర్మూలించడం అనేది కొంచెం కటువుగా ధ్వనిస్తుంది. నాకు తెలిసి అనేక పార్టీలు కాలక్రమంలో కాలగర్భంలో కలిసిపోయాయి. అందుకు స్వయంకృతాపరాధాలు కారణం. ఎవరూ పనికట్టుకుని వాటిని మట్టుపెట్టలేదు.
సాధారణంగా సిద్ధాంత ప్రాతిపదిక కలిగిన పార్టీలకు పిడివాద పార్టీలు అనే ముద్ర పడుతుంది. ముందు వాటిని అర్ధం చేసుకోవడం కష్టం. అయితే క్రమేణా ప్రజలకు వాటిపట్ల విశ్వాసం కలిగే అవకాశం వుంది. ఎట్టి పరిస్థితుల్లోను ఈ పార్టీ సిద్ధాంతాలతో రాజీపడదు అనే నమ్మకం ప్రబలితే అది దానికి శ్రీరామ రక్ష అవుతుంది.
హిందుత్వ అజెండా అనేది భారతీయ జనతా పార్టీకి పిడివాద పార్టీ అనే ముద్ర వేసింది. దేశానికి స్వతంత్రం వచ్చిన అనేక దశాబ్దాల వరకు అత్యధిక ప్రజానీకం సెక్యులరు అనే కృత్రిమ భావజాలానికి కట్టుబడివుంది. అంచేత జనం అప్పట్లో పిడివాద బావజాలాన్ని అంగీకరించే స్థితి లేదు. అయితే గత ఒక దశాబ్ద కాలంలో ప్రజల ఆలోచనా ధోరణిలో కొంత మార్పు భారీగానే కనబడుతోంది. మైనారిటీల పట్ల వారి అభిప్రాయం క్రమేణా మారుతోంది. మెజారిటీ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ గురించిన ఆలోచనలు ఊపిరి పోసుకోవడం మొదలయింది. బీజేపీ సాంఘిక మాధ్యమాల ప్రచార విభాగాలు పోషించిన పాత్ర కూడా దీనికి కారణం. ప్రధానంగా విద్యాధికులు, యువతీ యువకుల్లో ఈ మార్పు కొట్టవచ్చినట్టుగా కనబడుతోంది. ఇది బలమా బలహీనతా అనేది రానున్న కాలమే నిర్ణయించాలి.
కొంతకాలం క్రితం వరకు బీజేపీకి అగ్రవర్ణాల పార్టీ అనే పేరు వుండేది. క్రమంగా ఇది కనుమరుగు అవుతోంది. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ప్రతి పార్టీ విధిగా అణగారిన కులాలకు రాజకీయ అధికారంలో వాళ్లకు దక్కాల్సిన న్యాయమైన వాటా వారికి ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. అందుకు అనుగుణంగానే బీజేపీ నడుచుకోవడం మొదలుపెట్టడంతో ఇప్పటివరకు ప్రత్యర్థుల చేతుల్లో బలమైన ఆయుధంగా వున్న అగ్రవర్ణాలపార్టీ బీజేపీ అనే ముద్ర క్రమంగా మసకబారుతోంది.
అయితే ఉత్తరాది పార్టీ అనే అపప్రథ ఇంకా అలాగే వుంది. దక్షిణాదిన బలమైన నాయకత్వం లేకపోవడం, ప్రాంతీయ పార్టీలపై ఆధారపడే ధోరణి కారణంగా బలపడలేకపోవడం వంటి కారణాల వల్ల ఈ ముద్ర వదిలించుకోవడానికి మరి కొంత కాలం పట్టవచ్చు.
పార్టీ విధానాల్లో కొట్టవచ్చిన మార్పు ఇతర పార్టీల నుంచి చేరికలను ఆహ్వానించే విషయంలో కనబడుతోంది. పార్టీ మూల సిద్ధాంతాలకు పూర్తిగా కట్టుబడిన వారికే గతంలో అగ్రాసనం లభించేది. ఇప్పుడలా లేదు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించిన చరిత్ర కలిగిన వాళ్లకు కూడా పార్టీలో ప్రవేశం అతి సులభం అవుతోంది. పైగా పెద్ద పీటలు కూడా వేస్తున్నారు. ఒక రకంగా అవకాశవాద రాజకీయానికి ఇది మచ్చుతునక. ఒకే ఒక్క ఓటు తక్కువై కేంద్రంలో అధికారాన్ని చేజేతులా వదులుకున్న త్యాగచరిత్ర బీజేపీది. ఈ నేపధ్యంలో చూసినప్పుడు, అలాంటి మొక్కవోని సిద్ధాంత బలం కారణంగా ఆ పార్టీకి చేరువైన వారికి నిరాశ కలగడం సహజం.
అయితే ఏ సిద్ధాంతాన్ని అమలు చేయాలన్నా, అనుకున్న పనులను ఆటంకం లేకుండా చేసి చూపించాలన్నా చేతిలో తగిన అధికారం వుండాలి. అంచేత ముందు అధికారం ముఖ్యం అంటూ అని సమర్థించేవారు లేకపోలేదు.
గమ్యం ముఖ్యం, మార్గం కాదు అనడానికి భాగవతంలో ఓ దృష్టాంతం వుంది.
వైకుంఠ౦లో విష్ణుమూర్తి దర్శనం కోసం వెళ్ళిన సనకసనందనాదిమునులను ద్వారపాలకులైన జయవిజయులు అడ్డగిస్తారు. కోపించిన మునులు వారిని మర్త్యులుగా జన్మించమని శాపమిస్తారు. విష్ణుమూర్తి కల్పించుకుని వారిరువురికి ఒక మధ్యేమార్గం సూచిస్తాడు. పలుమార్లు విష్ణు భక్తులుగా జన్మించి తిరిగి వైకుంఠం చేరుకోవడం, లేదా మహావిష్ణువుకు ఆగర్భ శత్రువులు గా జన్మించి, మూడే మూడు జన్మల తర్వాత తమ స్వామిని చేరడం. వారు ద్వితీయ మార్గాన్నే ఎంచుకుంటారు. శ్రీహరిని విడిచి అన్ని జన్మలు దూరంగా ఉండలేమని, అంచేత మూడు జన్మల్లో వెనక్కి రావడానికి వీలుగా హరివైరులుగా జన్మిస్తామని వేడుకుంటారు.
చేయదలచుకున్న మంచి పనులు చేయాలి అంటే చేతిలో అధికారం అవసరం. అది లేకుండా సిద్ధాంతాలు అంటూ కాలయాపన చేయడం కంటే త్వరితగతిన అధికార పీఠాన్ని తిరుగులేని బలంతో సాధించి, కర్తవ్యాన్ని నెరవేర్చడం ముఖ్యమని బీజేపీ నాయకత్వం భావిస్తున్నదేమో తెలియదు. ఆ కారణంగానే జయవిజయుల బాటలో నడుస్తున్నదేమో అనే సందేహం కలుగుతోంది.
అయితే నాదొక ఆప్తవాక్యం.
అధికారం అనేది ఒక వ్యసనం కాకుండా చూసుకోవాలి. ఏంచేసయినా సరే, అధికారంలో కొనసాగాలి, అధికారాన్ని విస్తరించుకోవాలి అనే భావన కలగకుండా జాగ్రత్త పడాలి. ప్రజాస్వామ్య బద్ధంగా ఇవి జరిగితే కాదనేవారు వుండరు.
తోకటపా:
పాత తరం వాజ్ పాయ్, ఆద్వానీలది తిరుగులేని నైతికబలం.
ఈ తరం మోడీ, అమిత్ షాలది ఎదురులేని ప్రజాబలం.



(9-04-2022)

9, ఏప్రిల్ 2022, శనివారం

జీవిక – భండారు శ్రీనివాసరావు

 నాకు పక్షులు అంటే ఇష్టం

నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం
నాకు పసి పిల్లలు అంటే మరీ మరీ ఇష్టం

అదేమిటో నా పిల్లలు పసి పిల్లలుగా వున్నప్పుడు నాకింత ఇష్టం అని నాకు తెలియదు. లేదా ఎవరికీ లేనట్టు వీడికే బోడి పిల్లలు, అందరూ ఇలా మాలిమి చేస్తున్నారా అని ఎవరేమైనా అనుకుంటారేమో ముందే అనుకుని పిల్లలను వేలేసి ముట్టకుండా వుండడం తలచుకుంటే ఇప్పుడు సిగ్గేస్తుంది.

సరే! వాళ్ళిద్దరూ అలాగే కేవలం అమ్మ ప్రేమను ఆస్వాదిస్తూ పెరిగి పెద్దవాళ్లు అయ్యారు. తల్లి ప్రేమలో భేషజాలు వుండవు.
ఇక ఇన్నేళ్ళ తర్వాత.

చుట్టూ మొక్క మొలవని కాంక్రీటు వనం. చెట్టే లేకపోతే పక్షులెక్కడ!
అపార్ట్ మెంటు జీవితం. తులసి మొక్కకే నానా అగచాట్లు. ఇక మొక్కలెక్కడ!

పెద్దాడికి ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళు పుట్టినప్పుడు అమెరికా వెళ్లి రావడమే కానీ వాళ్ళ చిన్నతనం మధురిమ మా పెద్దవాళ్లకు దక్కలేదు. స్కూళ్ళు, కాలేజీలు. ఇప్పుడు వాళ్ళే వాళ్ళ తలితండ్రులకు దూరంగా వేరే రాష్ట్రాల్లో చదువుకుంటున్నారు.

మా ఆవిడ పోయిన తర్వాత నా ఒంటరితనం పోగొట్టడానికి బెంగుళూరులో ఉంటున్న నా రెండో కొడుకు, కోడలు నా దగ్గరికి హైదరాబాదు వచ్చేశారు.
ఈ ఏడాది జనవరి నుంచి మా జీవితాల్లో కొత్తగా ప్రవేశించిన పసిపిల్లతోడిదే నా లోకం. చిరంజీవి జీవిక ఇప్పుడు నా జీవితం అయిపోయింది. మా ఆవిడ ఈ పసిపిల్ల రూపంలో వచ్చి తోడుగా ఉంటున్నదేమో అనే ఓ చిన్ని నమ్మకం. మొన్న ఐదో తేదీ మా మనుమరాలికి నెలలవారీ మూడో పుట్టిన రోజు.

నవ్విస్తే తను నవ్వుతుంది. నన్ను నవ్విస్తుంది.
తనని సరదాగా ఏడిపిస్తే కంటతడి పెట్టకుండా ఏడుస్తుంది. కానీ నన్ను ఏడిపించదు.
నిజంగా ఈ పెద్దవాళ్ల కంటే చిన్న పిల్లలు ఎంత నయమో కదా!

తోకటపా: మీ చాదస్తాలు మాకు లేవంటారు కానీ ఈ కాలపు పిల్లలకే ఎక్కువ. పిల్లల ఫోటోలు పోస్టు చేయకూడదు అంటారు.
చాదస్తం కాక మరేమిటి?
(09-04-2022)

ఇలా చేసి మాడండి – భండారు శ్రీనివాసరావు

 "ఇలా చేసి చూడండి అని కిందటి వారం ప్రసారం చేసిన కార్యక్రమంపై శ్రోతల స్పందన ఇప్పుడు తెలుసుకుందాం.

"ముందుగా మంగళవారప్పేట నుంచి మంగళగౌరీదేవి గారు రాసిన ఉత్తరం చూద్దాం.
"మీరు చెప్పినట్టే స్టవ్ మీద బాణలి పెట్టాను. నూనె పోసాను. పోపు గింజలు మీరు చెప్పినట్టే కొలిచి మరీ పోసాను. ఆ తరువాత మీరు చెప్పిన దానిని అక్షరం పొల్లుపోకుండా చెప్పింది చెప్పినట్టే చేసాను. రవ్వ ఉప్మా కాదు కదా రవ్వ జావ కూడా తయారుకాలేదు, అని మంగళగౌరీదేవి గారు రాశారు.
"చాలా సంతోషం మంగళగౌరీదేవిగారు, మీరు మా కార్యక్రమాన్ని శ్రద్ధగా వినడం మాత్రమే కాకుండా ఆచరించి చూస్తున్నందుకు. కాకపొతే ఓ సందేహం. అదేమిటంటే, మీరు స్టౌ వెలిగించడం మరచిపోయారని. యెంత రేడియో విని వంటచేసేవారికయినా ఈ కనీస ప్రాధమిక సూత్రం తెలిసే వుంటుందన్న ఉద్దేశ్యంతో స్టౌ వెలిగించడం గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. నిజంగా అది మా పొరపాటే!"
Courtesy Cartoonist 'LEPAKSHI'