21, ఆగస్టు 2021, శనివారం

ఆధ్యాత్మిక అధికారి శ్రీ పీ.వీ.ఆర్.కే. – భండారు శ్రీనివాసరావు

 (ఆగస్టు 22 ఆయన జయంతి)

ఒక ఉన్నతాధికారి, ఆయన ఓ జిల్లా కలెక్టర్ కావచ్చు, సచివాలయంలో ఉప కార్యదర్శి కావచ్చు, ఎక్సైజ్ కమీషనర్ కావచ్చు, టీటీడీ ఈవో కావచ్చు, విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కావచ్చు, ఏకంగా భారత ప్రధానమంత్రి సలహాదారు కావచ్చు, మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ కావచ్చు, ధర్మ పరిరక్షణ సంస్థ గౌరవ అధ్యక్షులు కావచ్చు, అది ఏ ఉద్యోగం అయినా కానివ్వండి, ఏ హోదా వున్నదయినా కానివ్వండి, ఎంతటి బాధ్యత కలిగినదయినా కానివ్వండి దాన్ని ఒకే నిబద్ధతతో, ఒకే అంకితభావంతో, అంతే సమర్ధంగా నిర్వహించుకుని, నిభాయించుకుని సెహభాష్ అనిపించుకోగల అధికారులను వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు. ఆ లెక్క తీసుకుంటే ఆ వరుసలో మొదట్లో కానవచ్చే వ్యక్తి, తన డెబ్బయి ఏడో ఏట స్వల్పఅస్వస్థత అనంతరం 2017, ఆగస్టు ఇరవై ఒకటో తేదీ తెల్లవారుఝామున కన్నుమూసిన పీ.వీ. ఆర్. కే. ప్రసాద్. (వారి పూర్తి పేరు పత్రి వేంకట రామకృష్ణ ప్రసాద్)

నలుగురికే కాదు, ప్రపంచం నలుమూలల తెలిసిన మనిషి ఆయన. శనివారం తెల్లవారుఝామున ఆస్పత్రిలో చేరారు.  అస్వస్వతకు గురయిన సంగతి నలుగురికీ తెలిసేలోగానే, ఇరవైనాలుగు గంటలు గడిచీ గడవక ముందే, సోమవారం తెల్లవారుఝామున ఆయన ఈ ప్రపంచాన్ని వీడిపోయారనే కబురు నేల నాలుగు చెరగులా తెలిసిపోయింది. మరణం అలా ముంచుకురావడం పుణ్యాత్ముల విషయంలోనే జరుగుతుందంటారు. అలాగే జరిగింది కూడా.

అంతకుముందు రాత్రి జ్వాలా, నేనూ కలిసి బంజారా కేర్ ఆసుపత్రికి వెళ్ళాము. ఐ.సి.యూ. లో ప్రసాద్ గారిని చూశాము. జీవితంలో ఎలాంటి బంధాలు లేకుండా బతికిన మనిషిని, ముక్కుకు, నోటికి బంధనాలతో చూస్తుంటే ఎంతో బాధ వేసింది. ఈ రాత్రి గడవడం కష్టం అనే భావన డాక్టర్ల అభిప్రాయంగా తోచింది. అయ్యో అనిపించింది. ఆ తెల్లవారుఝామున ఫోను మోగింది. పెద్దాయన దాటిపోయారు అని చెప్పారు. ప్రసాద్ గారి భార్య, కొడుకు, కుమార్తె అంతిమ ఘడియల్లో ఆయన చెంతనే వున్నారు. అదొక ఊరట.

అప్పటికి ఆయన వయస్సు డెబ్బయి ఏడు సంవత్సరాలు. ఆగస్టు ఇరవై రెండు ఆయన పుట్టిన రోజు. అదేమిటో ఆ రోజుకు ఒక్క రోజుముందే ఆగస్టు ఇరవై ఒకటో తేదీనే పీవీఆర్కే మరణించడం దైవలీల.

 ఒక్క రోజు గడిచి వుంటే డెబ్బయి ఎనిమిదిలో ప్రవేశించి వుండేవారు. ఈరోజులలో ఇదేమంత పెద్ద వయస్సేమీ కాదు. కానీ ఆయన నమ్ముకున్న తిరుపతి వెంకటేశ్వరుడికి ఆయన్ని తన దగ్గరకు పిలిపించుకోవాలనే కోరిక కలిగిందేమో. అందుకే ప్రసాద్ గారు ఎవరినీ కష్ట పెట్టకుండా, తను మరీ కష్టపడకుండా దాటిపోయారు. ఆధ్యాత్మిక అంశాలతో కూడిన చక్కటి రచనలను మనకు మిగిల్చిపోయారు.


ఎన్నెన్నో బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేసినా ఎలాటి మచ్చ పడకుండా నెగ్గుకువచ్చారు. తన పైవారికి కానీ, కింది సిబ్బందికి కానీ మాట రాకుండా నిప్పులాంటి నిజాయితీతో విధులను నిర్వహించారు. ఎన్ని గిరులు గీసుకున్నా,మరెన్నో బరులు తన చుట్టూ బారులు తీరినా, ఏదైనా విషయం సమాజానికి మేలు చేసేది అని తను మనసారా నమ్మితే చాలు, అంతే! ఎలాంటి సంకోచాలు లేకుండా, ఎలాటి భేషజాలకు పోకుండా, అడ్డొచ్చే నిబంధనలను తోసిరాజనికూడా ప్రజాక్షేమానికి పెద్దపీట వేసే గుండెధైర్యం ఆయన సొంతం. ఇలాటి విషయాల్లో యువ ఐ.ఏ.ఎస్. అధికారులకు ఆయన చక్కని స్పూర్తి ప్రదాత. నిబంధనల పేరుతొ అధికారుల్లో వుండే చొరవను చిదిమేయవద్దని ప్రసాద్ గారు తరచుగా అంటుండేవారని ఆయన కింద పనిచేసిన ఓ అధికారి గుర్తు చేసుకున్నారు. యువ అధికారులు చొరవ తీసుకుని చక్కని ఫలితాలు రాబట్టే క్రమంలో కొన్ని కొన్ని పొరబాట్లు చేసినప్పుడు ఆయన పెద్ద మనసుతో సర్దిపుచ్చేవారు. నల్గొండ జిల్లాలో ఎస్.ఎఫ్.డి.ఏ. అధికారిగా పనిచేస్తున్నప్పుడు సన్నకారు రైతులకు ప్రయోజనం కల్పించే ఒక పధకం అమల్లో ఆయన అలాంటి చొరవనే ప్రదర్శించారు. ఆ జిల్లాలో అయన వేసిన కొత్త బాటకు దేశవ్యాప్త ప్రచారం లభించింది. ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి స్వయంగా నల్గొండ ప్రయోగం గురించి ప్రస్తావించిన విషయాన్ని నాటి ముఖ్యమంత్రి శ్రీ పీ.వీ. నరసింహారావు గారు స్వయంగా పీవీఆర్కే చెవిన వేశారు. ఈ సంగతిని ఆయన తన అనుభవాల గ్రంధంలో రాసుకున్నారు కూడా.

అకీర్తిం చాపి భూతాని కధయిష్యంతి తేవ్యయామ్

సంభావితస్యచా కీర్తిర్మరణా దతిరిచ్యతే”

ప్రజలెప్పుడూ నీ అపకీర్తి గురించే చెప్పుకుంటారు. ఆత్మగౌరవం కలిగిన వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కంటే దుర్భరమైనది”

భగవద్గీతలో గీతాకారుడు చెప్పిన ఈ సూక్తిని శ్రీ పీ.వీ.ఆర్.కే. ప్రసాద్ తన జీవిత పర్యంతం మనసా వాచా కర్మణా గుర్తుంచుకుని జీవనయానం సాగించారేమో అనిపిస్తుంది ఆయన జీవితాన్ని తరచి చూస్తే.

నాహం కర్తా హరి:కర్తా”

(నేను కాదు కర్తని. చేసేది చేయించేది అంతా శ్రీహరే!)

ఇదీ శ్రీ ప్రసాద్ గారి నమ్మకం. అందుకే కాబోలు తన తిరుపతి అనుభవాల గ్రంధానికి దీన్నే మకుటంగా పెట్టుకున్నారు.

పుణ్యజీవితం గడిపిన ధన్యజీవి శ్రీ పీ.వీ.ఆర్.కే. ప్రసాద్.

20, ఆగస్టు 2021, శుక్రవారం

పాపం సీబీఐ – భండారు శ్రీనివాసరావు

 గుర్తుంది కదా! కొన్నేళ్ళ క్రితం ఒక కేసు విషయంలో కోల్ కతా పోలీసు కమీషనర్ ను విచారించడానికి సీబీఐ అధికారుల బృందం వెళ్ళింది. స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. ప్రధానమంత్రి మోడీ, సీబీఐని అడ్డుపెట్టుకుని తమ ప్రభుత్వంలో పనిచేసే అధికారులను వేధిస్తున్నారని ధర్నాకు దిగారు. ఆనాటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయుడుతో సహా దేశవ్యాప్తంగా అనేకమంది బీజేపీ వ్యతిరేకులు కోల్ కతా దీదీకి సంఘీభావం తెలిపారు.

ఓ పదేళ్ళు వెనక్కి వెడదాం.

2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినప్పుడు అహమ్మదాబాదులో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న మోడీ ఏమన్నారో చూడండి.

సీబీఐ అంటే ఏమిటో తెలుసునా ! కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ సీబీఐ తమ ఢిల్లీ బాసులను మెప్పించడం కోసం మా ప్రభుత్వాన్ని వేధిస్తున్నారు. మా మంత్రులను, అధికారులను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈ అధికారులు ఒక విషయం మరచిపోవద్దు. ఏదో ఒకరోజున మీరు జవాబు చెప్పుకోవాల్సివస్తుంది సుమా!’

మళ్ళీ ఓసారి వెనక్కి వెడదాం!

2013. సుప్రీం కోర్టు. కోర్టు హాలు సూదిపడితే వినబడేంత నిశ్శబ్దంగా వుంది.

జస్టిస్ ఆర్. ఎం. లోధా గొంతు పెంచి తీవ్ర స్వరంతో అన్నారు.

సీబీఐ. ప్రభుత్వ పంజరంలోని చిలుక’

కోర్టు హాలులో వున్నవాళ్ళందరూ నివ్వెర పోయారు న్యాయమూర్తి చేసిన ఈ బహిరంగ వ్యాఖ్యతో.

అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు కేటాయింపులలో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి సీబీఐని ఓ పావులా వాడుకుంటోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు, సుప్రీం న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యతో మంచి ఊతం చిక్కినట్టయింది. ‘కోల్ గేట్’ కుంభకోణంగా మీడియా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

కొన్నేళ్ళ క్రితం సీబీఐ గురించి అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఏమన్నారో చూద్దాం.

ఉత్తరప్రదేశ్ లోని సిధౌలిలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఇలా చెప్పారు. ‘సమాజ్ వాది, బిఎస్ పి లను అదుపు చేయడానికి, తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ఒక తాళం చెవి వుంది. దాని పేరే సీబీఐ’.

మరిప్పుడు మద్రాస్ హైకోర్ట్ మధురై బెంచ్, సీబీఐ పంజరంలో చిలక అంటూ వ్యాఖ్యానించింది. ఆ చిలకను పంజరం నుంచి విడిపించడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరింది.

దీనిపై మళ్ళీ చర్చలు.

జరిగేది ఏమీ వుండదు అనడానికి పై ఉదంతాలే రుజువు.

(20-08-2021)

తక్కువేమి మనకు ? – భండారు శ్రీనివాసరావు

 ‘పాజిటివ్ థింకింగ్ అంటుంటారు, ఏమిటి గురువు గారు ?’

‘మన దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ బానిస సంకెళ్ళ నుంచి బయట పడి ప్రజాస్వామ్య విధానంలో గత ఏడు దశాబ్దాలకు పైగా ముందుకు సాగుతోంది.

‘ఆఫ్ఘనిస్థాన్  మనకంటే ఇరవై  ఎనిమిదేళ్లు ముందుగానే బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది. 1919లోనే  ఆ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అంటే స్వతంత్రం వచ్చి వందేళ్ళు దాటిందన్నమాట. అయినా ఇప్పటికీ  అక్కడ రాజకీయంగా  గందరగోళ పరిస్థితులే. కొన్నేళ్ళు ప్రజాస్వామ్యం, మరి కొన్నేళ్ళు నియంతల రాజ్యం, లేదా సైనిక పాలన.  మనతో పాటే స్వాతంత్రం పొందిన పొరుగు దేశం పాకిస్తాన్ లో, ఇరుగు దేశం శ్రీలంకలో అదే పరిస్థితి.

‘అదే మన దేశంలో చూడు. ఏ పార్టీ పాలించినా, ఆ పాలన బాగున్నా లేకపోయినా, మనదేశంలో మాత్రం ప్రజాస్వామ్య ప్రభుత్వాలే మనల్ని పాలిస్తున్నాయి. ఓటు ద్వారానే ప్రజలు తమని పాలించే ప్రభుత్వాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇష్టం లేని పార్టీలను అధికారానికి దూరం చేస్తున్నారు. అంచేతే  ప్రపంచ దేశాల్లో మనం ఎవరికీ లోకువ కాలేదు. 

‘ఇలా ఆలోచించడాన్నే నేను పాజిటివ్ థింకింగ్ అంటాను అన్నారు గురువుగారు.

(!9-08-2021)

అమ్మకు ఏదిష్టం? – భండారు శ్రీనివాసరావు

 కాలం మన చేతిలో వుండదు. చూస్తూ ఉండగానే మా ఆవిడ రెండో ఆబ్దీకం వచ్చింది.

మూడు కూరలు, మూడు పచ్చళ్ళు జాబితా రాస్తున్నప్పుడు ఆమెకి ఇష్టం అయిన కూరో, స్వీటో చేయిస్తే బాగుంటుంది అని ఓ సలహా.

ఆమెకి ఏమిష్టం అన్న ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. నా ఇష్టాలే తన ఇష్టంగా బతికింది. ఆమెకేది ఇష్టమో  నేను తెలుసుకునే తీరిక, ఓపిక నాకు ఎక్కడిది?

అమ్మకు నేనంటే ఇష్టం అని మనసులో మాట చెప్పాలని అనిపించింది. కానీ గుండెలో మొదలయిన ఆ మాటను గొంతులోనే నొక్కేసాను.

పనసుపొట్టు కూర, దబ్బకాయ పులుసు, ఐస్ క్రీం. ఇలా అనేక సూచనలు. వీటిమధ్య కర్ణపేయంగా వినబడింది ఓ మాట.

‘అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా ఇంటికి వచ్చినవాళ్లు ఎంతమంది అనిచూసుకోకుండా అప్పటికప్పుడు వంట చేసి పెట్టడం’

ఇది అందరికీ నచ్చింది.

కొడుకు సంతోష్, కోడలు నిషా ఈ బాధ్యత నెత్తికి ఎత్తుకున్నారు.

మా ఆవిడ క్రమం తప్పకుండా వెళ్ళే మా ఇంటికి దగ్గరలోని  ఓ దేవాలయాన్ని సంప్రదించారు. డబ్బు చెల్లించి ఓ అయిదు వందల మందికి అన్న వితరణ ఏర్పాటు చేశారు.

ఈ కరోనా కాలంలో పిలవకుండా ఎవరు వస్తారని అనుకున్నాను. రెండు రోజుల ముందే ఆ గుడిలో పలానా వ్యక్తి సంస్మరణలో అన్నదానం అని బోర్డు పెట్టారుట. మా చుట్టుపక్కల అపార్ట్ మెంట్లలో వుండే పెద్దపెద్ద వాళ్ళు కూడా వచ్చారు. ఈ లొకాలిటీలో నన్ను తెలిసిన వాళ్ళు అరుదు. ఆమెకి ఇంతమందితెలుసా! ఇంతమందికి ఆమె తెలుసా! అన్న సంగతి అప్పుడే తెలిసింది.

మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావుగారు  ఎనభయ్యో పడిలో కూడా, కరోనాని కూడా లెక్క చేయకుండా చనిపోయిన మరదలి మీద, నా మీద  ప్రేమాభిమానాలతో వచ్చి నిలబడి వడ్డన చేశాడు. నాకది ఎంతో అపూర్వంగా  అనిపించింది.

మనిషి ఎలాటివాడు అన్నది అతడు చనిపోయిన తర్వాత తెలుస్తుంది అంటారు.

భార్యను చూసి మొగుడు గర్వపడే అవకాశం నాకు ఇచ్చి వెళ్ళిపోయింది మా ఆవిడ.



(20-08-2021)            

18, ఆగస్టు 2021, బుధవారం

అంతా భ్రాంతియేనా! - భండారు శ్రీనివాసరావు

రహదారులపై వాహనాలు మితిమించిన వేగంతో వెళ్ళకుండా నియంత్రించాలంటే ఏం చెయ్యాలి. స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలి. నిఘా కెమెరాలను అమర్చాలి. ట్రాఫిక్ సిబ్బందినీ,  జరిమానాల మొత్తాన్నీ పెంచాలి లేదా ఉల్లంఘనులకు వేసే శిక్షలను మరింత కఠినతరం చేయాలి.

ఇవన్నీ ఎందుకని అనుకున్నారేమో కెనడాలో 'భ్రాంతి'ని నమ్ముకున్నారు.

చక్కని రహదారుల మధ్యలో అక్కడక్కడా గుంటలు తవ్వారు. వాటిని గమనించి వాహనదారులు ఎవరికివారే వేగం తగ్గించి నడపాల్సిన పరిస్తితి ఏర్పడింది. రోడ్ల గుంతల వల్ల వాహనాల వేగాన్ని బాగా నియంత్రించగలిగామని అక్కడివారు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇదేం గొప్ప మా దేశంలో రోడ్ల కంటే గుంటలే  ఎక్కువని మనమూ గొప్పలకు పోవచ్చు కానీ కెనడా గుంటలు మనదగ్గర మాదిరిగా నిజం గుంటలు కావు. గుంతలమాదిరిగా కానవచ్చే పోస్టర్లను రోడ్లపై అతికిస్తారు.(ఫోటోలలో కనబడే చిత్రాలను గమనిస్తే అర్ధం అవుతుంది) వాటిని చూసి డ్రైవర్లు అసంకల్పితంగానే వేగం తగ్గిస్తారు. ఈ నకిలీ గుంటలను మార్చి మార్చి మరోచోటకు మార్చుకునే సౌలభ్యం కూడా వుంది. భ్రాంతితో భయం కలిగించి వేగనియంత్రణ చేస్తున్నారన్నమాట.

ఇంకో విషయం ఏమిటంటే ఈ సమాచారం ఇంటర్ నెట్లో బహుళ ప్రచారంలో వున్న ఓ 'ఈ వదంతి' అంటే, 'ఈ మెయిల్', 'ఈ సేవ'  మాదిరిగా 'ఈ వదంతి'  అన్నమాట. అది అన్నమాట అయినా, ఉన్నమాట అయినా వినడానికి, చదవడానికి బాగుంది కాబట్టి నమ్మేస్తే ఓ పనయిపోతుంది.     

NOTE: Courtesy Image Owner






మీడియా రాగాలు – భండారు శ్రీనివాసరావు

 

‘ఏది నిజం? ఏది నిజం?’
‘ఇదే నిజం, ఇటు చూడు, ఇటే చూడు’
‘అటు చూడకు అటు చూడకు!
‘అది చూపేదంతా, నిజం కాని చేదు నిజం.
‘ఇటు చూస్తే కనబడేది
సృష్టి లోని అసలు నిజం’
‘ఇటే చూడు అటు చూడకు’
“అటు చూడకు, ఇటే చూడు’

‘నిజం కోసం వేసారే ఓరి
పిచ్చివాడా! రాముని కాలం వాడా!
కనపడని నిజం కోసం
ఎందుకు నీకీ
వెతుకులాట!’

‘సరే నేను పిచ్చివాడ్ని, రాముడి కాలం వాడిని.
నిజమన్నది నిజమైతే
ఎందుకు ఈ బహురూపులు ?
నిజం నిజం ఎక్కడంటు, ఏదంటూ
ఎందుకు నాకీ
ఎదురుచూపులు?’

‘పిచ్చివాడివి నీవని
ఊరికె అనలేదు నేను
ఈ కలికాలంలో నిజాలకు
నిజరూపం లేనెలేదు
నిజం తోలు కప్పుకు
తిరుగుతున్నవన్నీ
పచ్చి పచ్చిఅబద్దాలు!
ఈ అబద్దాల గొంగట్లో
పుటం వేసి వెతికినా,
కనబడేది నిజం కాదు,
కానె కాదు’

‘ఏమి చేయమంటావు నన్ను?
నిజం కోసం వెతకనా! అబద్దాన్ని నమ్మనా!?’

‘ఈ నవయుగ మీడియాల
కాలంలో
మరోదారి లేదు నీకు.
కంటికి కనబడిందే
నిజమని నమ్ము.
నమ్మి చెడినవాడు లేడు,
ఈ లోకంలో సుమ్ము’

(17-08-2021)

17, ఆగస్టు 2021, మంగళవారం

ప్రేమలు, పెళ్ళిళ్ళు

 

ప్రేమ వివాహాల మీద సమాజానికి కొన్ని శంకలు, సందేహాలు వీటికి మించి చిన్నచూపు వున్న  కారణంగా చాలా ప్రేమలు పెళ్లి పీటల దాకా రావడం లేదు అనే వాదన ఒకటి వుంది. ఇందులో పూర్తిగా కాకపోయినా కొంత వాస్తవం లేకపోలేదు.

ఈ మధ్య తరచుగా టీవీల్లో చూస్తున్న పాత సినిమాలో ఒక ముసలి పాత్ర, ప్రేమించి పెళ్ళిచేసుకున్న కూతురుతో అంటుంది ‘నువ్వు సంతోషంగా వున్నావా తల్లీ!’ అని. అంటే ఎక్కడో మనసు మూలల్లో ఓ అనుమానం,  ప్రేమ పెళ్ళి చేసుకున్న ఆడపిల్లలు సంతోషంగా వుండరేమో అని.

మా కుటుంబంలో చాలా ప్రేమ పెళ్ళిళ్ళు జరిగాయి. నూటికి నూరు శాతం ఆ దంపతులందరూ సంతోషంగా, ఆనందంగా వున్నారు. ఈ క్రమంలో కొందరు, కులాంతర, మతాంతర, దేశాంతర వివాహాలు కూడా చేసుకున్నారు. వాళ్ళు వాళ్ళ పెళ్లి రోజున చెప్పేది ఏమిటంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తమ ప్రేమను అంగీకరించి, ఆశీర్వదించిన కారణంగానే తామిలా హాయిగా, ఆనందంగా పిల్లాపాపలతో కాపురాలు చేసుకుంటున్నామని.

నాకు అర్ధం అయింది ఏమిటంటే ప్రేమ పెళ్ళిళ్ళు జయప్రదం కావాలంటే వాటికి ఇరు కుటుంబాల ఆమోదముద్ర వుంటే, వాళ్ళు చీకూ చింతా లేకుండా వైవాహిక జీవితాన్ని గడపగలుగుతారు.   

మా మేనకోడలు ఫణి కొలిపాక ఈరోజు ఫోన్ చేసింది. ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు. వాళ్లది ప్రేమ వివాహమే.

“మామయ్యా! నా పెళ్ళిలో మీరు ఒక మాట చెప్పారు, మీకు గుర్తుందో లేదో. పెళ్లి చేసుకుని సంతోషంగా వున్నట్టు కనపడడం కాదు, నిజంగా సంతోషంగా ఉండాలని మీరు మాకు చెప్పారు” అంటూ గుర్తు చేసింది.

నిజంగా నాకు గుర్తు లేదు. కానీ ఫణి మాటల్ని బట్టి, హాయిగా సాగిపోతున్న వారి కాపురాన్ని బట్టి చూస్తే ఫణి మాత్రం నా మాటలు గుర్తు పెట్టుకుని ఆచరిస్తున్నట్టే అనిపించింది. అంతకంటే ఏం కావాలి?

Happy marriage anniversary Ramesh garu, Phani. 

(17-08-2021)