29, మార్చి 2021, సోమవారం

వెలుగు చూడని వార్తలు - భండారు శ్రీనివాసరావు

 వై.ఎస్.ఆర్., చంద్రబాబు తమదైన స్టైల్లో  హాయిగా నవ్వేశారు. అయితే కలిసి కాదు. విడివిడిగా వేర్వేరు సందర్భాలలో.

రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా రెండో దఫా ఎన్నికలకు సిద్ధం అవుతున్న రోజులు.

ఏదో కార్యక్రమానికి వెళ్లి బేగంపేట లోని సీఎం క్యాంపు ఆఫీసుకు తిరిగివస్తున్నారు. ముందు సీట్లో కూర్చుని వున్న వై.ఎస్. ఆర్., యదాలాపంగా వెనక సీట్లో కూర్చున్న వ్యక్తిగత సిబ్బందిని అడిగారు రాష్ట్రంలో పరిస్తితి ఎలావుందని. ఐ.ఏ.ఎస్. అధికారి తడుముకోకుండా చెప్పేశారు, పరిస్తితులు పాలక పక్షానికి అనుకూలంగా వున్నాయని.

ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు జనంలోకి బాగా వెళ్ళాయి. అలాగే సేద్యపు నీటి ప్రాజెక్టులు. ప్రజల్లో రవంత కూడా వ్యతిరేకత ఉన్నట్టుగా నాకనిపించడం లేదు. ధైర్యంగా ఉండొచ్చు’

మాట్లాడుతుండగానే క్యాంపు ఆఫీసు వచ్చింది. కారు దిగబోతుండగా ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు రవిచంద్ ఇలా అన్నారు.

దేనికయినా బుల్లెట్ ప్రూఫ్ వుంటుంది, పొగడ్తలకు తప్ప’

వై.ఎస్.ఆర్. కి రవిచంద్ మాటల్లో భావం బోధపడింది.

పెద్దగా నవ్వేశారు, తనదయిన స్టైల్లో.

సమైక్య రాష్ట్రంలో టీడీపీ ఏలుబడిలో వున్న కాలం. చంద్రబాబు ముఖ్యమంత్రి. సీపీఎం మిత్రపక్షం.

శాసనసభలో ఆ పార్టీ నాయకుడు నర్రా రాఘవరెడ్డి. ముఖ్యమంత్రితో ఓ రోజు పిచ్చాపాటీ సాగిస్తున్నారు.

లాభం లేదు రాఘవరెడ్డి గారు, ఇప్పుడు అంతా హైటెక్ కాలం నడుస్తోంది. పాత పద్దతులు పట్టుకుని వేల్లాడుతూ కూర్చుంటే ఉపయోగం ఉండదు. చప్పట్లు కొడితే వీధి దీపాలు వెలగాలి’ అన్నారు చంద్రబాబు.

సరే. కొట్టకుండా వెలగవు కదా! చప్పట్లు కొట్టడానికి అయినా ఓ మనిషి వుండాలి కదా! అందుకే చప్పట్లను కాదు, మనుషుల్ని నమ్ముకోవాలి’ అన్నారు రాఘవరెడ్డి..

ఇంకోరోజు వేరే విషయంలో నర్రా రాఘవరెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. ఆ విషయానికి సంబంధించిన పేపరు కటింగ్ చూపెట్టారు.

భలేవాళ్ళే రెడ్డి గారు మీరు. పేపరు చూసి రాజకీయాలు చేస్తే యెట్లా?’ అన్నారు నారా వారు.

అవునండీ మేము పేపరు చూసి రాజకీయాలు చేస్తాము, మీ పార్టీ వాళ్ళలాగ జేబులు చూసి కాదు’ అనేశారు నర్రావారు.

ఆ మాటలకు చంద్రబాబు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. నవ్వేశారు తనదైన స్టైల్లో చిరు మందహాసం చిందిస్తూ.

28, మార్చి 2021, ఆదివారం

ఒకేరోజు, ఒకే చోట 16 వేలమందికి కోవిడ్ వాక్సిన్

 ఒకేరోజు, ఒకే హాస్పటల్ లో పదహారు వేలమందికి కోవిడ్ వాక్సిన్ (ఫైజర్) ఇచ్చారని అమెరికాలో సియాటిల్ లో ఉంటున్న మా పెద్దకోడలు భావన ఇంత క్రితమే ఫోన్ చేసి  చెప్పింది. చదివింది బీ టెక్ అయినా తన అభిరుచి కొద్దీ టీచింగ్ లైన్ ఎంచుకుంది. అది కోవిడ్ సమయంలో కలిసి వచ్చింది. నర్సులు, టీచర్లు వాక్సినేషన్ విషయంలో ప్రాధాన్యతా క్రమంలోకి వస్తారు. అంచేత నెల క్రితమే మొదటి డోసు ఇచ్చారు. ఈరోజు రెండోది. మా వాడు  మాత్రం  ఇంకా వైటింగ్ లిస్టులోనే వున్నాడు. వాళ్ళ వరుస వచ్చేసరికి కొన్ని నెలలు పట్టేట్టు వుంది.

సియాటిల్  లోని ఒక పెద్ద హాస్పటల్ లో ఈ కోవిడ్ వాక్సినేషన్ కి భారీ ఏర్పాట్లు చేశారట. ముందే టైం స్లాట్లు నిర్ణయించి ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చేశారు. ఉదయం ఆరు గంటల నుంచి మొదలై సాయంత్రం వరకు ఇది కొనసాగుతుందట.

(28-03-2021) 

పాదనమస్కారాలు, ఎన్టీఆర్

 ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకమునుపే జగత్ ప్రసిద్ధ తెలుగు సినీ నటుడు. మద్రాసులోని ఆయన ఇంటి ముందు ప్రతి ఉదయం రెండు మూడు టూరిస్టు బస్సులు నిలిపివుండేవి. ఆయన అలా బయటకు వచ్చి మేడమీది వరండాలో నిలబడగానే అప్పటి వరకు ఆయనకోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆనందానికి అలవి వుండేది కాదు. అదృష్టవశాత్తు దర్శన భాగ్యం లభించిన వాళ్ళు ఆయన కాళ్ళకు సాష్టాంగనమస్కారం చేసేవాళ్ళు. ఆయనకు ఓ అలవాటు ఉండేదని చెప్పుకునేవారు, కాళ్ళమీద మీద పడిన వాళ్ళు తమంతట తాము లేవాలే కానీ ఆయన లెమ్మని చెప్పేవాళ్ళు కాదని. పైగా కాళ్ళ మీద పడుతున్నవారిని వారించేవారు కాదు.

తెలుగు దేశం పార్టీ పెట్టి, తొలి ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి, అఖండ విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఈ పాద నమస్కారాల ప్రహసనం కొనసాగింది. తెలుగు దేశం పార్టీలో మహిళా నాయకురాళ్ళు నన్నపనేని రాజకుమారి, త్రిపురాన వెంకట రత్నం, గంగాభవాని మొదలయిన వాళ్ళు పదిమంది చూస్తున్నారని కూడా చూడకుండా బహిరంగంగానే ఆయనకు పాద నమస్కారాలు చేసేవాళ్ళు. ఇది ఎంతవరకు ముదిరింది అంటే బేగం పేట విమానాశ్రయంలో ఎన్టీఆర్ విమానం దిగివస్తున్నప్పుడు టార్ మాక్ మీదనే వాళ్ళు పోటీలు పడి ఆయన కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుని మరీ పాద నమస్కారాలు చేయడం ఆ రోజుల్లో ఒక సంచలన వార్తగా మారింది. అది ఇది ఇంతింతై, అంతింతై దేశం నలుమూలలకు పాకింది.

ఢిల్లీ నుంచి ఇల్లస్ట్రెటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా విలేకరి ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేయడానికి హైదరాబాదు వచ్చారు. ఆయనకి తెల్లవారుఝామున నాలుగు గంటలకు టైం ఇచ్చారు. కొద్ది ముందుగానే ఆ విలేకరి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. సరిగ్గా ఇచ్చిన టైముకల్లా, కిర్రు చెప్పులు చప్పుడు చేస్తుండగా ఎన్టీఆర్ కిందికి దిగివచ్చారు. ఢిల్లీ విలేకరి కుర్చీ నుంచి లేచి ఎన్టీఆర్ పాదాలకు సాష్టాంగనమస్కారం చేసారు. చేసిన మనిషి లేవకుండా అలాగే కాసేపు వుండిపోయారు. కొద్ది సేపటి తర్వాత లేచి కూర్చునినేను విన్నది నిజమే!’ అని అంటూ ఇంటర్వ్యూ ప్రారంభించారు.

ప్రశ్నోత్తరాల కార్యక్రమం యధావిధిగా కొనసాగింది. అది వేరే సంగతి.

కొసమెరుపు ఏమిటంటే తరువాత చాలా రోజులకు ఆ పత్రిక ప్రచురించిన కధనం, ఈ పాద నమస్కారం ప్రహసనంతోనే మొదలవుతుంది.

 

బెట్టింగు సర్వేలు – భండారు శ్రీనివాసరావు

 మా చిన్నతనంలో వరి కళ్లాల సమయంలో పొలాల్లో రాశిగా పోసిన వడ్లను కొలిచి బస్తాలకు ఎత్తేముందు మా బాబాయి ఉజ్జాయింపుగా చూసి ఇన్ని పుట్లు అని చెప్పేవాడు.(పుట్టి పది బస్తాలు). సాధారణంగా ఆయన అంచనా తప్పేది కాదు.

నటశేఖర బిరుదాంకితులు కృష్ణ, ఏ సినిమా అయినా (తన సొంత సినిమాతో సహా) విడుదల అయిన వెంటనే ఇన్ని రోజులు ఆడుతుందని చెప్పేవారట. ఆయన అన్నట్టే ఆ సినిమా ఫట్టో,హిట్టో అయ్యేదట.

ఇప్పుడు రాజకీయ పార్టీల వంతు వచ్చింది. ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో రోజుకొక సర్వే వస్తోంది. జ్యోతిష్కులు కూడా రంగం లోకి దిగారు. అసలే రాజకీయ పార్టీలు ఆడుతున్న మైండు గేములతో ఇప్పటికే తలలు తిరిగి తల పట్టుకు కూర్చున్న జనాలకు ఈ సర్వేలు మరింత అయోమయం కలిగిస్తున్నాయి.

బహుశా బెట్టింగుల స్థాయి పెంచడానికి కాబోలు.


27, మార్చి 2021, శనివారం

రాయగలను కానీ చెప్పగలనా? – భండారు శ్రీనివాసరావు

 


కొద్దిసేపటి క్రితం పాశం యాదగిరి ఫోను

‘నువ్వూ నేనూ మీ అన్న రామచంద్రరావుగారు ఒకసారి కలవాలి అంటూ ఆర్డరు వేసాడు.

అప్పుడే కంప్యూటర్ ముందరనుంచి లేచి చేతులు లగుతున్నట్టు అనిపిస్తే వెళ్లి మంచం మీద నడుం వాల్చానో లేదో యాదగిరి ఫోను.

‘అలాగే కలుద్దాం! కానీ నువ్వు దొరికేది ఎట్లా!’

కాళ్ళల్లో బొంగరాలో, చక్రాలో అలాంటివి కట్టుకుని పుట్టాడు యాదగిరి. రెండు కాళ్ళు ఒకచోట పెట్టి గంట కూడా వుండలేడు. అదే అన్నాను.

‘భలేగా చెప్పావే. మీ అన్నయ్య పర్వతాలరావు గారు కూడా అచ్చం ఇలాగే అనేవారు. పొత్తూరి వారయితే ఒక అడుగు ముందుకు వేసి చెప్పేవారు.‘రిపోర్టర్ తిరక్క చెడతాడు, సబ్ ఎడిటర్ తిరిగి చెడతాడుఅని’

‘సరే! ఫేస్  బుక్  లో నువ్వు రాస్తున్నవి  చదువుతుంటే ఒక ఆలోచన వచ్చింది. అది చెబుదామని ఫోన్ చేశాను. రోజూ ఓ అరగంట ఏదో ఒక ముచ్చట చెప్పు. దాన్ని రికార్డు చేయించే బాధ్యత నాది. ఈ విషయం మాట్లాడడానికే కలుద్దాం అన్నాను ’ అన్నాడు యాదగిరి.

‘సమయం అయిపోతోంది మిత్రమా!’

అందామనుకున్నా. కానీ అనలేదు.

‘సరే!’ అన్నా.

ఆర్డరు వేసింది మిత్రుడు యాదగిరి కదా!

(27-03-2021)

 

నిఖార్సయిన ఐ.ఏ.ఎస్. నారాయణన్

 గట్టి పరిపాలకుడు అనిపించుకోవడానికి పెద్ద డిగ్రీలు అక్కరలేదు అనడానికి జలగం వెంగళరావును చెప్పుకోవచ్చు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జలగం ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పరిపాలన నల్లేరు మీది  బండిలాగా సజావుగా  సాగిపోయేది. పైగా ఆయన హయాములో ఎమర్జెన్సీ. కేంద్రంలో, రాష్ట్రంలో రెండు చోట్లా కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఇక అడ్డేముంటుంది.

ఈరోజుల్లో నానారకాల లాబీలు, ప్రభుత్వాలపై ఒత్తిడి పెట్టడానికి. ఆ రోజుల్లో రెండే రెండు లాబీలు.  అరకు (సారాయి) వ్యాపారులు, బియ్యం మిల్లుల వాళ్ళు.

జలగం వెంగళరావుకి, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల బియ్యం వ్యాపారులకి మెరుగయిన సంబంధాలు ఉన్న సంగతి బహిరంగ రహస్యమే.

అప్పుడు కృష్ణా జాయింటు కలెక్టరుగా నారాయణన్ అనే ఐ.ఏ.ఎస్. అధికారి వుండేవారు. మిల్లులవాళ్ళు బియ్యంలో రాళ్లు కలిపి  జనాలకు పంటికింది రాయిగా వుంటే, ఆ అధికారి మాత్రం వాళ్ళకే పంటి కింది రాయిలా తయారయ్యారు. ఆ నిక్కచ్చి అధికారి తనిఖీలు చేసి చాలా బియ్యం మిల్లులకు తాళాలు వేయించే పనిలో వుంటే, రాబోయే ముప్పును గమనించిన వ్యాపారులు ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నారు. ఇటు చూస్తే కావాల్సిన వాళ్ళు. అటు చూస్తే మచ్చలేని అధికారి.

చివరికి ముఖ్యమంత్రే ఆ అధికారికి ఫోను చేసి మాట్లాడాల్సివచ్చింది. వెంగళరావు గారు అధికారులతో చాలా హుందాగా వ్యవహరిస్తారని ప్రతీతి.

“చూడండి నారాయణన్ గారూ. మీ వద్ద కొన్ని ఫైళ్ళు పెండింగులో వున్నాయి. వాటి మీద మీ అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా రాసి పంపండి. ఇందులో ఎలాంటి ఒత్తిడీ వుండదు.

“పనులు ఎలా చేయించుకోవాలో బాగా తెలిసిన వాళ్ళే వాళ్ళు”

అన్నారు నింపాదిగా.

ఇదే అధికారి కొన్నాళ్ళు ఒంగోలులో పనిచేశారు. అధికారికమైన పనివుండి హైదరాబాదు వెళ్లి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుని సచివాలయంలో కలిసారు. లిఫ్టులో కాకుండా మెట్లెక్కి వెళ్ళారేమో ఆ అధికారి  కొంచెం ఆయాసపడుతూ ముఖ్యమంత్రి ఛాంబర్ లోకి వెళ్ళారు. ఆయన్ని చూసి జలగం నవ్వుతూ ఇలా అన్నారు.

“ఏమిటలా ఆయాసపడుతున్నారు. మా పిడతల మిమ్మల్ని తరుముతున్నాడా ఏమిటి?

పిడతల రంగారెడ్డి ఒంగోలు జిల్లా  కాంగ్రెస్ అగ్ర  నాయకుడు. ఇద్దరూ కాంగ్రెస్ వాళ్ళే. కాకపోతే ఒకరంటే ఒకరికి పొసగదు.

జలగం మాటల్లోని శ్లేష అదే.

ఈ నారాయణన్ గారు కొన్నేళ్ళ క్రితం వరకు మా రెండో అన్నయ్య రామచందర్రావు గారుంటున్న అపార్ట్ మెంటులోనే అద్దెకు వుండేవారు. ప్రస్తుతం సొంత ఇంటికి మారిపోయారు.

ఆ కొద్ది కాలపు పరిచయంలో మా అన్నయ్యకు తెలిసివచ్చినదేమిటంటే – నారాయణన్ అత్యంత సౌమ్యుడు, నిక్కచ్చిగా వ్యవహరించే నిఖార్సయిన ఐ.ఏ.ఎస్. అధికారి. వాచ్ మన్ తో సహా  ఎవరినీ పల్లెత్తు మాట పరుషంగా అనడం మా అన్నయ్య చూడలేదు, వినలేదు.

(27-03-2021)  

 

మగాడి నిర్ణయం

తెలివిగలవాడు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సివచ్చినప్పుడు ఇంట్లో అందర్నీ సంప్రదిస్తాడు. ఆ నిర్ణయం వల్ల తలెత్తగల సమస్యలను క్షుణ్ణంగా వారికి వివరిస్తాడు. వారు చెప్పేది జాగ్రత్తగా వింటాడు. వాటిని గురించి నింపాదిగా ఆలోచిస్తాడు. అనవసరమైన కంగారు పడడు. ఇతరులను పెట్టడు. అన్నీ సాకల్యంగా బేరీజు వేసుకుంటాడు.

చివరికి భార్య చెప్పిందే వింటాడు. దట్ సింపిల్ !