23, మార్చి 2021, మంగళవారం

Die empty

 ‘మీ వూరి గురించి, మీ చిన్నతనంలో జ్ఞాపకాలు గురించి బాగా రాసారు  శ్రీనివాసరావు గారూ అన్నారు ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పి.ఎస్. గోపాలకృష్ణ గారు.

‘ఏమోనండీ! ఒక్కోసారి భయం వేస్తుంది ఇలా రాస్తూ పోతుంటే. దేంట్లోకైనా దించుతుందేమో అని. ఈ వయసులో కొత్త జబ్బులు కష్టం కదా!’

అందామని అనుకున్నా. కానీ పైకి అనలేదు. కానీ ఆయన సామాన్యుడు కాదుకదా! మనసులో మాట దొరకపుచ్చుకునే రకం.

అందుకని ఆయన తనదైన శైలిలో నా అనుమానం తీర్చారు ఒక కధ చెప్పి.

అదే “Die Empty”.

పెద్ద నీతితో కూడిన ఈ  చిన్నపుస్తకాన్ని  టాడ్ హెన్రీ (Todd Henry) రాశారు.

ఈ పుస్తకం రాయడానికి ఓ ప్రేరణ వుంది.

టాడ్ హెన్రీ ఒక వ్యాపారపరమైన సమావేశంలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఒక ప్రశ్నవేస్తాడు.

‘ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ వుంది?’ అనేది ఆ ప్రశ్న.

‘గల్ఫ్ దేశాలు అని ఒకరు, వజ్రాల గనులు ఉన్న ఆఫ్రికా’ అని మరొకరు ఇలా జవాబులు చెబుతారు.

అప్పుడా డైరెక్టర్ అందర్నీ ఆశ్చర్యచకితులను చేసే సమాధానం చెబుతాడు.

‘ఈ లోకంలో అతి ఖరీదైన స్థలం స్మశానం’ 

‘ఎందుకంటే...

 అంటూ ఆయనే వివరణ ఇస్తాడు.

‘ఈ ప్రపంచంలో అనాదిగా కోటానుకోట్లమంది పుట్టారు, మరణించారు. ఇంకా పుడుతూనే వున్నారు, ఇంకా చనిపోతూనే వున్నారు. పుట్టిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమలోని తెలివితేటలను ప్రపంచానికి పంచారు. కానీ అధికసంఖ్యాకులు మాత్రం తమలో నిగూఢ౦గా వున్న మేధస్సును, అనేక ఆలోచనలను, అద్భుతమైన ఐడియాలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని దాటిపోయారు. అవేవీ వెలుగు చూడలేదు. వాటివల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రయోజనమూ దక్కకుండా పోయింది. అవన్నీ సమాధుల్లోనే నిక్షిప్తం అయిపోయాయి. అంతటి విలువైన సంపదను దాచుకున్న స్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడ వుంటుంది చెప్పండి

డైరెక్టర్ చెప్పిన మాటలు టాడ్ హెన్రీ మనస్సులో గట్టిగా నాటుకుని పోయాయి.

ఆ ప్రేరణతోనే  టాడ్ హెన్రీ "Die empty” అనే  పుస్తకం రాసి అద్భుతమైన రచయితగా పేరు పొందాడు.

ఆయన ఈ పుస్తకంలో అంటాడు ఇలా ఒకచోట.

‘మీరు మీలోని సృజనాత్మకతను మీలోనే దాచుకుని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించడానికి వెళ్ళకండి. అవేవో ఈ ప్రపంచానికి పంచేసి వెళ్ళండి  

నిజానికి  టాడ్ హెన్రీ చెప్పదలచుకున్నది ఏమిటంటే:

‘మీలోని మంచిని మీరు ఈ లోకాన్ని వీడేలోగా ప్రపంచానికి పంచేసి వెళ్ళండి.  

‘మీ దగ్గర మంచి ఆలోచన వుంటే చనిపోయేలోగా దాన్ని ఆచరణలో పెట్టండి.

‘మీలోని జ్ఞానాన్ని నలుగురికీ పంచండి.

‘మీకేదైనా లక్ష్యం వుంటే చనిపోయేలోగా దాన్ని సాధించండి.

 ‘ప్రేమను పంచండి, మీలోనే  దాచుకుని వృధా చేయకండి’

వున్నది నలుగురికీ పంచడం ఈనాటి నుండే మొదలు పెడదాం. మన మంచితనంలోఉన్న ప్రతి అణువునూ అందరికీ ఇచ్చేద్దాం!

‘అప్పుడు హాయిగా ...ప్రశాంతంగా....

Let us Die Empty

(23-03-2021)

ఆ గాలీ .....ఆ నేలా...... భండారు శ్రీనివాసరావు

 

అరవై అయిదేళ్ళ పైమాటే. అప్పటికి నాకు పదేళ్లు వచ్చాయేమో! ఆనాటి గురుతులన్నీ స్పష్టాస్పష్టంగా మనసులో మెదులుతున్నాయి. మరచిపోతానేమో అన్న సంశయంతో ఈ రాతలకు శ్రీకారం.
మా ఊరు కంభంపాడు. అప్పట్లో చాలా వెనకపడ్డ ప్రాంతం. అయినా అన్నీ ఉండేవి. స్వావలంబన లాంటి మాటలు వాటి అర్ధాలు అప్పట్లో తెలవ్వు. కానీ అన్నీ అమర్చినట్టు ఉండేవి.

మా ఇంటికి దగ్గరలో అంటే నడిచిపోయే దూరంలో చెరువు గట్టు కింద మా మాగాణి పొలాల పక్కన ఓ మెరక మీద మంచి నీళ్ళ బావి. పైగా గిలకల బావి. నాలుగువైపులా గిలకలు ఉండేవి. ఊరి మొత్తానికి అదొక్కటే మంచి నీటి వనరు. మా ఇంట్లో బావిలో నీళ్ళు ఉప్పు నీటి కషాయం. స్నానాలకు, ఇతర అవసరాలకు ఆ నూతి నీళ్ళే వాడేవాళ్ళం. మా అమ్మగారు వెంకట్రావమ్మ, మా చిన్న మేనత్త చిదంబరం తడి మడి చీరెలతో వెళ్లి మంచి నీటి బావి నుంచి బిందెలలో నీళ్ళు తెచ్చేవాళ్ళు.

అప్పుడప్పుడూ వాళ్ళతో నేనూ వెళ్ళే వాడిని. దోవలో వీర బ్రహ్మం ఇల్లు. ఆయన ఉలీ, బాడిసె పట్టుకుని ఎడ్లు లాగే బండ్లు తయారు చేసేవాడు. నేను అక్కడే ఒక మొద్దు మీద కూర్చుని చూస్తూ కూర్చుండేవాడిని. బండి చక్రాలు, వాటికి ఆకులు అలా కొలతలకు తగ్గట్టుగా ఎలా చెక్కేవాడో ఆశ్చర్యం అనిపించేది. ఆయన ఏమీ చదువుకున్నవాడు కాదు. కానీ బండి ఇరుసు ఏ కొలతలతో చెక్కితే బండి బ్యాలెన్సుగా నడుస్తుందో ఆ విధంగా తయారు చేసేవాడు.
ఆ పక్క వీధిలో కమ్మరి కొలిమి. ఆయనకూ చదువు రాదు. కానీ ఇనుమును కొలిమిలో ఎర్రగా కాల్చి రకరకాల సామాగ్రి తయారు చేసేవాడు.

ఒక వీధిలో వస్త్రాల హనుమంతరావు అని నా దోస్తు ఇల్లు వుండేది. ఆడామగా బట్టలు నేసేవాళ్ళు. ఇంటి బయట చేతికి రంగులు పూసుకుని దారాలకు రంగులు అద్దేవాళ్ళు. ఇంట్లో మగ్గం మీద చీరెలు దోతులు నేసేవాళ్ళు.

చిన్ని రాములు కొట్లో మిఠాయి ఉండలు, లౌజు ముక్కలు కూడా అమ్మేవాళ్లు. ఇళ్ళల్లో లాంతర్లు, చిమ్నీ దీపాలకు వాడే కిరసనాయిలు అక్కడే కొనేవాళ్ళం. కిరోసిన్ డబ్బా పైన ఒక మూలలో వున్న రంధ్రంలో గొట్టం లాంటి సాధనం వుంచి పైకీ కిందికీ అంటుంటే డబ్బాలో కిరోసిన్ సీసాల్లో పడేది.

ఆ పక్కనే కుండలు చేసేవారు. కుండలు చేసే విధానం చూస్తుంటే కళ్ళు తిరిగిపోయేవి. ఒక చక్రం మీద మట్టి ముద్ద వుంచి ఆ చక్రాన్ని వేగంగా ఒకసారి తిప్పేవాళ్ళు. చేతి వేళ్ళతో ఆ ముద్దను సుతారంగా తాకుతూ చిత్రవిచిత్రంగా కుండలు తాయారు చేసేవాళ్ళు. ఆ ముద్ద నుంచి కుండల ఆకారాలు వస్తుంటే ఏదో మాయాజాలంగా అనిపించేది.

సాయంత్రం అయ్యేసరికి మా ఇంటికి దగ్గరలో ఉన్న వాడ నుంచి బ్యాండు మేళం వినపడేది. ఆ తర్వాత తెలిసింది వాళ్లకు గిరాకీ లేని రోజుల్లో అలా తీరి కూర్చుని సినిమా పాటలు ప్రాక్టీసు చేస్తుంటారని. అలాగే సన్నాయి మేళం వాయించేవాళ్లు. మా ఇంటికి చుట్టపక్కాలు ఎవరైనా వస్తే వాళ్ళు పెట్రోమాక్స్ లైట్ తెచ్చి పెట్టేవాళ్ళు. ఆ లైటు వెలిగిస్తుంటే పిల్లలం అందరం కళ్ళప్పగించి చూస్తుండే వాళ్ళం. పొడుగాటి వత్తి తగలబడిపోకుండా చిన్న ఆకారంలోకి మారిపోయి తెల్లటి వెలుగులు విరజిమ్మడం నిజంగా ఆశ్చర్యంగా వుండేది. ఆ వత్తి ఎర్రపడి కాంతి తగ్గినప్పుడల్లా గాలి కొట్ట్టేవారు.

మా ఊరు పంచాంగాలకు ప్రసిద్ధి. వాటిని రాసే సిద్ధాంతులు ముగ్గురు వుండేవాళ్ళు. ఒకే ఊరు నుంచి మూడు పంచాంగాలు రావడం గొప్పగా చెప్పుకునే వారు. గొలుసుకట్టు రాతలో, తెలుగు అంకెలతో రాసిన పంచాంగాలను ఆ సిద్ధాంతులు తెనాలి తీసుకువెళ్లి అక్కడ అచ్చు వత్తించేవారు. ఉగాది రావడానికి ముందుగానే చుట్టుపక్కల గ్రామాలకు కాలినడకన వెళ్లి అక్కడి మోతుబరులకు పంచాంగాలు ఇచ్చి ఆశీర్వదించేవాళ్లు. సంభావన రూపంలో వచ్చిన ప్రతిఫలం ఎంత ఇస్తే అంత తీసుకుని తిరిగివచ్చేవారు.

మంచి నీళ్ళ బావికి వెళ్ళే దోవలో ముస్లిం ల కోసం పీర్ల సావిడి వుండేది. పీర్లను ఊళ్ళో ఊరేగించిన తర్వాత మళ్ళీ ఈ సావిడిలో భద్రపరిచేవాళ్ళు.

షెడ్యూల్ కులాలకోసం ఉసిగెవాగు అవతల ఒక కాలనీ వుండేది. అక్కడ ఒక మిషనరీ స్కూలు వుండేది. జంధ్యాల హరి నారాయణ గారు కృష్ణా జిల్లా కలెక్టరుగా వున్నప్పుడు మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారు అక్కడ కొత్త కాలనీ నిర్మాణం కోసం సుమారు ఇరవై ఎకరాలు భూమి ఇచ్చారు.

ఊళ్ళో మరో బడి వుండేది. అందులోనే మా చదువు. స్కూలు మొత్తానికి కలిపి ఇద్దరు టీచర్లు, అప్పయ్య మాస్టారు, భద్రయ్య పంతులు గారు. బ్లాకు బోర్డులు లేవు. చుట్టూ ఫ్రేం ఉన్న బొందు పలక, సుద్ద బలపం, అవి పెట్టుకునే గుడ్డ సంచీ వుంటే వాడు అందరి దృష్టిలో స్పెషల్.

అప్పయ్య మాస్టారి తండ్రి శివరాజు నాగభూషణం గారు తెలవారకముందే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకుని ఇంటి బయట నిలబడి ఉచ్చైస్వరంతో ఆలపించే కృష్ణ శతకంలోని పద్యాలే ఊరంతటికీ కోడి పిలుపు.

మా ఇంటికి వెనుక రెండు దేవాలయాలు ఒకే ప్రాకారంలో ఉండేవి. పక్కనే కోనేరు వుండేది. కాలక్రమంలో అది పూడిపోయింది. ఆ గుళ్ళకు మేమే వంశ పారంపర్య ధర్మకర్తలం. వాటికి మాన్యాల రూపంలో నలభయ్ ఎకరాల దాకా భూమి వుండేది, కానీ వాటి మీద వచ్చే అయివేజు స్వల్పం. వూళ్ళో వాళ్ళే పూనుకుని పండుగ దినాల్లో ఉత్సవాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించేవారు.

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారి చిన తిరుణాలకు, అది జరిగినన్ని రోజులూ మా వూరినుంచి రంగు కాగితాలతో అలంకరించిన ప్రబ్భండ్లు (ప్రభలు) మేళతాళాలతో ఇంటికొకటి బయలుదేరేవి.

ఆ రోజుల్లో మా ఊర్లో రెండు రకాల సేద్యపు నీటి వనరులు ఉండేవి. ఒకటి చెరువు, రెండోది మునేటి కాలువ. ఒకప్పుడు ఈ రెంటి కిందా అధిక భాగం భూములు మావే. ఐదో అక్కయ్య భర్తది పొరుగూరు పెనుగంచి ప్రోలు. ఆ బావగారు వచ్చినప్పుడల్లా గుర్రపు సవారీ. రాగానే గుర్రాన్ని మేతకు వదిలేసేవాడు. అది మేసినంత మేరా మామగారు (అంటే మా నాన్నగారు) తాలూకు పొలాలే, ఏం పరవాలేదు అని చెప్పుకునే వారు నా చిన్నతనంలో.

ఇప్పుడు ఇవన్నీ ఏవీ లేవు అని చెప్పను కానీ అప్పటి మాదిరిగా లేవు. కొన్ని అసలే లేవు, జ్ఞాపకాలు తప్ప.

వీరబ్రహ్మం లేడు, ఎడ్ల బళ్ళు తయారుచేసే వాళ్ళు లేరు. ఆ బండ్లే లేవు. ఎడ్లూ లేవు. నాటి మగ్గాలు లేవు, బట్టలు నేసేవాళ్ళు లేరు. చిన్ని రాములు కొట్టు లేదు. షట్టర్లు కలిగిన దుకాణాలు వచ్చాయి. కుండల తయారీ లేదు. స్టీలు సామాను, ఫ్రిజ్ లు గృహప్రవేశం చేసాయి.
స్వయం సమృద్ధి కాకపోయినా స్వయం పోషకంగా వుండే మా ఊరు ఇప్పుడు అన్ని ఊళ్లలో ఒక ఊరు. అంతే!

పాస్ పోర్టులో నేటివ్ ప్లేస్ కాలం పూర్తి చేయడానికి మాత్రం పనికి వస్తోంది.
(23-03-2021)

నాలుకే నా శత్రువు - భండారు శ్రీనివాసరావు

 'మీకు శత్రువులు ఎవ్వరూ లేరా స్వామీ?' అని అడిగాడు ఓ ఆసామీ ఓ స్వామివారిని.

'లేకేం! నా నాలుకే నా శత్రువు' అన్నారా స్వామి.

తరచి చూస్తె అందులో ఎంతో నిజం వుందని అనిపిస్తుంది.

ఆ మధ్య ఎప్పుడో  అనుకోకుండా ఓ స్వామి వారి ప్రవచనం నా చెవిన పడింది.

ఆయన కంఠం కంచుగంట. చెప్పే విషయం ఏదయినా ఓ కధలా వినసొంపుగా వుంటుంది.

భార్యాభర్తల సంబంధాలు, విడాకుల ప్రస్తావన దొర్లింది. స్వాములేమిటి? విడాకుల గొడవేమిటి అనుకునేవాళ్ళకు ఆయన ప్రసంగమే సమాధానం. క్రమంగా  దేశంలో విడాకుల కేసులు  వేగంగా పెరిగిపోతాయని స్వామి ఉవాచ. మరి ఏమిటి మార్గం?

ఉందన్నారు ఆయనే. నాలుకను అదుపులో ఉంచుకోవడం ఒక్కటే శరణ్యం ఆన్నారాయన. సరిగ్గా ఇలాగే కాకపోయినా దాదాపు ఇదే అర్ధం వచ్చేలా చెప్పారు.

'మొగుడొకటి అంటాడు. భార్య ఒకటి అంటుంది. ఆ ఒక్కటే విడాకులదాకా వెడుతోంది. వెనుకటిలా ఈనాటి తరానికి మంచీచెడూ చెప్పీవాళ్ళు ఇళ్ళల్లో వుండడం లేదు. చెప్పినా వినిపించుకునే పరిస్తితి లేదు. చిన్న విషయాలు పెద్దవి అవుతున్నాయి. మునుపటి రోజుల్లో కూడా ఇలా జరక్కపోలేదు. కానీ కుటుంబ సంబంధాలు కట్టి పడేసేవి. ఇప్పుడలా కాదు. అప్పటికప్పుడే వేడి మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే కాస్త నాలుకను అదుపులో పెట్టుకుంటే ఇలాటి సమస్యలు అన్నీ అదుపులోకి వస్తాయి. లేకపోతే అదుపుతప్పి పోతాయి'

స్వామి వారు చెప్పింది అందరూ విన్నారు. బాగా చెప్పారు అని కూడా అనుకున్నారు. ఆ హితవచనాలను ఇంటిదాకా ఎంతమంది మోసుకెళ్లారన్నది అనుమానమే.

నేనూ దీనికి మినహాయింపు కాదని ఓ చర్చలో కూర్చున్నప్పుడు తెలిసిపోయింది.

నా నాలుకే నా శత్రువు. నిజానికి ఈ శత్రువును జయించాల్సిన పనిలేదు. స్వామి చెప్పినట్టు అదుపులో వుంచుకుంటే చాలు.

కానీ అయ్యే పనా!

 

22, మార్చి 2021, సోమవారం

వంద సమర్పణ

 సన్మాన సభ ముగింపుకు వచ్చింది. అధ్యక్షుల వారు వందన సమర్పణ చేయాల్సిన వ్యక్తిని ఆహ్వానించారు. అతడొక పత్రికలో ప్రూఫ్ రీడర్.

అతడు నీరసంగా వేదిక మీదకు వచ్చి, తన చేతిలో ఉన్న ఆనాటి ఆహ్వాన పత్రికని  సభికులకు చూపుతూ మరింత నీరసంగా ఇలా అన్నాడు.

‘ఈ కార్యక్రమానికి రావడానికే మూడు బస్సులు మారి వచ్చాను. ఈ ఇన్విటేషన్ లో చూస్తే నా పేరు రాసి, ‘పలానా ఆయన వంద సమర్పణ చేస్తారు  అని వుంది. వంద కాదుకదా ఇంటికి పోవడానికి బస్సు చార్జీలు కూడా లేవు

ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాల కృష్ణ నిన్న ఫోనులో కబుర్లు చెబుతూ రువ్విన జోకు.

 

ఇల్లెందుకే నీకు చిలకా! – భండారు శ్రీనివాసరావు

 'డెబ్బయ్ అయిదేళ్లు వచ్చాయి. సొంత ఇల్లంటూ వున్నట్టు లేదు. ఇలా ఎన్నాళ్ళు' అని శ్రేయోభిలాషులు తరచూ అడిగే ప్రశ్న.

మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు అయిదుగురు ముఖ్యమంత్రుల దగ్గర వరసగా అయిదేళ్ళ పాటు పీఆర్వో గా పనిచేశారు. రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పదవీవిరమణ చేసి, సొంత గూడంటూ లేకుండా, సిటీ బస్సుల్లో తిరిగేవాడు. ఆయన్ని ఇలాగే అడిగేవారు, ‘ఇంతింత పెద్ద కొలువులు చేస్తున్నావు, ఇల్లేమైనా కట్టావా!’ అని. ‘కట్టాను, ఈ నెల అద్దె’ అంటూ ఆయన చిరునవ్వుతో ఇస్తుండే జవాబు నాకు బాగా గుర్తు. ఇల్లంటూ కట్టుకోకుండానే, ఏవీ కూడబెట్టుకోకుండానే దాటిపోయాడు. ఆయన ముందు పిపీలికాన్ని నేనెంత? పిల్లలు బాగా చూసుకుంటున్నారు. అదే పదివేలు. పోతే, ఈ ప్రశ్న ఎదురయినప్పుడల్లా ఎప్పుడో చదివిన ఓ ఇంగ్లీష్ కధ జ్ఞాపకం వస్తుంది. ఆ కధకు నా స్వేఛ్చానువాదం.
"అనగనగా ఓ రాజుగారు. ఆ రాజుదగ్గర ఓ పనివాడు. వాడిని చూసినప్పుడల్లా రాజుగారికి ఆశ్చర్యంతో కూడిన సందేహం. 'నాకింత హంగూ ఆర్భాటం వుంది. లేదనేది లేదు. అయినా ఏదో లోటు ఎప్పుడూ తొలుస్తూనే వుంటుంది. వీడేమిటి ఎప్పుడూ చూసినా మొహంలో అంత నిశ్చింత. రేపు యెలా గడుస్తుంది అన్న బాధ కనిపించదు. ఏవిటి వీడి వ్యవహారం?'
"రాజుగారి చింత మంత్రిగారు కనిపెట్టాడు. రాజుగారికి చెప్పి తొంభయ్ తొమ్మిది బంగారు మొహరీలు తెప్పించాడు. వాటిని ఓ సంచీలో వుంచి ఆ పనివాడి గుమ్మం ముందు వొదిలి పెట్టి రమ్మని భటులను ఆదేశించాడు.
"తెల్లారి లేచిన తరువాత పనివాడికి తన గుమ్మం ముందు పడివున్న సంచీ కనబడింది. లోపలకు తీసుకు వచ్చి విప్పి చూశాడు. కళ్ళు జిగేల్ మన్నాయి. అన్నీ బంగారు కాసులు. లెక్కబెట్టాడు. 99 వున్నాయి. అనుమానం వచ్చి మళ్ళీ లెక్కించాడు. పొరబాటు ఏమీ లేదు. 99 నాణేలు మాత్రమే వున్నాయి. మరి ఆ ఒక్క మొహరీ ఏమైంది?
"పనివాడికి మరోపని లేకుండా పోయింది. మరో ఆలోచన లేకుండా పోయింది. ఎలాగైనా ఆ ఒక్క నాణెం సంపాదించి మొత్తం నూరు నాణేలు సొంతం చేసుకోవాలి అన్న ధ్యాస పెరిగింది. ఈ యావలో పడి పెళ్ళాం పిల్లలతో అచ్చట్లు ముచ్చట్లు తగ్గిపోయాయి. సర్వం కోల్పోతున్న భావన. తెలియని దిగులుతో నిద్ర పట్టేది కాదు. అన్నం సయించేది కాదు.
"పనివాడిలో కనబడుతున్న మార్పు రాజుగారు గమనించాడు. మంత్రిగారు వచ్చి టీకా తాత్పర్యం చెప్పకుండానే ఆయనకు విషయం బోధపడింది.
ఏవీ లేనప్పుడు అ పనివాడికి ఏ చింతా లేదు. 99 నాణేలు సొంతం కాగానే వాటిని నూరు చేయాలన్న తాపత్రయం బాగా పెరిగిపోయింది. ఆశ దురాశగా మారితే మనుషులు యెలా మారిపోతారన్నది రాజు గారికి తెలిసివచ్చింది."
(22-03-21)

మరపురాని గతం

 చిన్నప్పుడు సెలవుల్లో  కంభంపాడు వెళ్లి అమ్మ దగ్గర కొన్నాళ్ళు వుండి మళ్ళీ బెజవాడ బయలుదేరే వాడిని.  ఆ రోజు అమ్మ ఎందుకో చాలా దిగులుగా వుండేది. మాటిమాటికీ మళ్ళీ ఎప్పుడు వస్తావురా అని అడుగుతుండేది.  నాకూ అమ్మను వదిలి వెళ్ళాలి అంటే బెంగగానే వుండేది. కానీ  స్కూలు, చదువులు గుర్తొచ్చి బట్టలు సదురుకునేవాడిని ప్రయాణం కోసం.

దొడ్లో చింతచెట్టు  పక్క నుంచి పెనుగంచి ప్రోలు వెళ్ళడానికి ఓ రాళ్ళ దారి వుండేది. వెనక్కి వెనక్కి చూస్తూ ముందుకు నడిచేవాడిని. ముందు వంటింటి గుమ్మంలో నిలబడ్డ అమ్మ మొహం కనిపించేది. కాసేపటి తర్వాత ఆ గుమ్మం మెట్లు దిగివచ్చి చింతచెట్టు కింద నిలబడి వుండేది. వెనక్కి చూసినప్పుడు అమ్మ నా వంకే చూస్తూ కనపడేది. మళ్ళీ ఎప్పుడు చూస్తానురా నిన్ను అన్నట్టు ఉండేవి ఆ చూపులు. తిరిగి వచ్చేదాకా నా మొహాన్ని తన  కనురెప్పల నడుమ దాచి వుంచుకోవాలి అన్నట్టు దీక్షగా నా వైపు చూస్తున్నట్టు అనిపించేది.

ఎంతైనా అమ్మ అమ్మే. 

(21-03-21)

20, మార్చి 2021, శనివారం

ఇరవై ఏడు రౌండ్లు

 ఇదేమీ సాయంత్రం రౌండ్ల లెక్క కాదు.

మళ్ళీ నలభయ్ ఏళ్ళ నాటి ముచ్చటే

ఆ రోజుల్లో ఇలాగే పట్టభద్రుల స్థానానికి ఎన్నిక జరిగింది.(అప్పుడు ఒకటే సీటు అని గుర్తు)

పోలింగు పూర్తయింది. ఓట్ల లెక్కింపు మొదలయింది.

ఒకటో రౌండ్, రెండో రౌండ్ (అంటే  లెక్కింపులు) ఇలా  అక్షరాలా  ఇరవై  ఏడు రౌండ్లు పూర్తయిన తరువాత కానీ తుది ఫలితం రాలేదు. నాటి విజేత చివరికి గెలిచింది అక్షరాలా ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో.