27, సెప్టెంబర్ 2020, ఆదివారం

మీరేమిట్లు? – భండారు శ్రీనివాసరావు

‘నాన్నా మనమేమిట్లు?’ అన్నాడు మా పెద్ద కొడుకు సందీప్ ఓ రోజు స్కూలు నుంచి రాగానే.


ముందు ఆ ప్రశ్న అర్ధం కాలేదు. కాసేపటి తర్వాత చిన్నప్పుడు ఈ మాట మా బామ్మగారి నోటంట విన్న సంగతి గుర్తుకువచ్చింది. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి రాగానే వారిని ‘ఏమిట్లు’ అని అడిగేది. నాకు ముందు అర్ధం అవకపోయినా అర్ధం అవడం మొదలయినప్పటి నుంచి ఆ మాట వినగానే చిరాకేసేది. (ఏమిట్లు అంటే మీరెవరు? ఏం కులం?)


మా ఇద్దరు పిల్లల్నీ చిక్కడపల్లిలో మా ఇంటికి రిక్షా దూరంలో హిమాయత్ నగర్ సెంట్ ఆంథోనీ స్కూల్లో చేర్పించాను. మొదటి రోజే నాకూ ఆ స్కూలు ప్రిన్సిపాల్ గ్రిగరీ రెడ్డి గారికీ మాట తేడా వచ్చింది.
‘మీరెన్నయినా చెప్పండి ఆ కాలమ్ (Column) నేను పూర్తి చేసేది లేదు’ అనేశాను.
‘అలా ఎలా కుదురుతుంది. అది రూలు’ అన్నారాయన ఇంకా గట్టిగా.
‘అన్నీ రూలు ప్రకారమే చేస్తున్నారా’ అన్నాను ఒకింత వెటకారంగా.
‘చూడండి. మీరు రేడియో జర్నలిస్టు అని మీ ఇద్దరు పిల్లలకీ డొనేషన్ తీసుకోలేదు. మిగిలిన వారి దగ్గర తీసుకోకపోతే స్కూలు నడపలేము’
‘అప్లికేషన్ లో పిల్లవాడి కులం రాస్తేనే స్కూలు నడుస్తుందా?
ఇండియన్ అని మాత్రమే రాస్తాను, కావాలంటే రెలిజియన్ రాస్తాను. అంతేగాని కులం పేరు రాయను’
చెప్పి వచ్చేశాను.

ఆ తర్వాత ఏమీ కాలేదు. ఆయన ఆ ప్రసక్తి లేకుండానే ఇద్దరు పిల్లల్ని చేర్చుకున్నాడు.


ఇప్పుడు మళ్ళీ మావాడి మాటలతో ఆ గతం గుర్తుకువచ్చింది.


‘ఎవరు అడిగారు’ అన్నాను మా వాడితో.
‘నా క్లాస్ మేట్స్ అడుగుతున్నారు’
‘తెలవదని చెప్పు’
‘సరే’ అని వెళ్ళిపోయాడు.


అప్పటినుంచి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయి వాళ్ళంతట వాళ్ళు తెలుసుకునే దాకా వారి కులం ఏమిటో తెలవకుండా వారి చిన్నతనం గడిచింది.

26, సెప్టెంబర్ 2020, శనివారం

సర్కారు భరోసా

 

 

అర్హత కలిగిన వారికి సాయం చేయడం సామాజిక ధర్మం అయితే సాయపడ్డవారికి కృతజ్ఞతలు  తెలపడం కనీస మానవతా ధర్మం.

మా మూడో అన్నయ్య (ఆయన ఇప్పుడు లేరు)  కుమారుడు రమేశ్  ఖమ్మంలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. దురదృష్టం కొద్దీ  వాడికీ, వాడి భార్యకూ కరోనా పాజిటివ్  అని తేలింది. అమ్మాయికి ఖమ్మంలోనే హోం క్వారంటైన్. రమేశ్ కి కొద్దికాలం క్రితం స్టెంట్ వేయడం వల్ల హైదరాబాదు పంపారు. అయిదురోజులు  ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని అన్నీ చక్కబడ్డ తర్వాత ఆ వివరాలు వాట్సప్ లో తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం  నారాయణ గారెకి పంపారు. తెలంగాణా వర్కింగ్ జర్నలిస్ట్  అసోసియేషన్, మీడియా అకాడమీ కలిసి కరోనా బారిన పడిన  జర్నలిస్టులకు కొంత ఆర్ధిక సాయం ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు. ప్రభుత్వం సాయం చేసినా అది అందుకోవాలంటే కొంత ప్రయాస తప్పదు. సంబంధిత అధికారులను కలిసి ధరకాస్తులు ఇవ్వాలి. కరోనా వచ్చినవారు ఈ లాయలాస పడలేరు. మరి ఎలా అనుకుంటూ వుంటే ఈరోజు  ఇరవై వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ అయినట్టు ఎస్సేమ్మస్ వచ్చింది. దీనికి వాళ్ళు తీసుకున్న సమయం నిండా రెండు రోజులు కూడా కాదు.

ఇది విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది.

ప్రభుత్వం  ఎన్నో రకాల సంక్షేమ పధకాలు ప్రజలకు అందిస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖల్లోని   సంబంధిత అధికారులు కూడా తెలంగాణా  మీడియా అకాడమీ పనితీరును ఆదర్శంగా తీసుకుంటే ప్రజలకు పెద్ద భరోసా లభించినట్టే.

అల్లం నారాయణ గారికి  అభినందనలు, ధన్యవాదాలు  (24-09-2020)

25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

రంగులు బహు భంగులు – భండారు శ్రీనివాసరావు

 

కలర్ బ్లైండ్ నెస్ – దీన్ని తెలుగులో ఏమంటారో తెలవదు. రంగులు సరిగా గుర్తుపట్టలేకపోవడం అని విన్నాను. ఈ కంటి జబ్బు నాకు లేదు. అయినా చప్పున కలర్లు గుర్తుంచుకోలేను. అంటే నిన్న కలిసిన మనిషి ఏ రంగు చొక్కా వేసుకున్నాడు అని మర్నాడు అడిగితే నేను చప్పున జవాబు చెప్పలేను.

ఇక విషయానికి వస్తే నిన్ననో మొన్ననో ఒక ఛానల్ లో ఈ రంగులు గురించి ఒక వింతైన విషయం విన్నాను, పోనీ చూశాను. రవికాంచనిచో కవిగాంచును అన్నట్టు కొన్ని చిన్న విషయాలు కూడా జర్నలిస్టుల దృష్టిని దాటిపోలేవని అనిపించింది.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి  తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి నుదుటిమీద తిరునామాలు దిద్ది ఆయన తలకు పరివట్టం (పట్టు వస్త్రంతో తలపాగా) చుట్టి శేష వస్త్రాన్ని మెడపై ధరింప చేశారు. సరే ఈ విశేషాలన్నీ టీవీల్లో ప్రసారమయ్యాయి. అయితే ఆ టీవీ జర్నలిస్టు తలపాగా రంగును పసికట్టి అది అధికార వైసీపీ రంగును పోలి వుందని పాయింటు తీశారు. అంతటితో ఆగకుండా గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పసుపు రంగు పరివట్టం  చుట్టారని గుర్తు చేస్తూ, టీటీడీ అధికారులు కూడా ఏ ఎండకాగొడుగు మాదిరిగా పాలక పక్షాలను బట్టి తలపాగా రంగులు మారుస్తున్నారా అంటూ  ఓ పాయింటు లేవదీశారు.  ముందే  చెప్పినట్టు నాకు రంగులు గుర్తుండవు కనుక నేనేమీ చెప్పలేను.

అయితే ఈ సందర్భంలో నాకు ఓ సొంత అనుభవం గుర్తుకు వచ్చింది.

చంద్రబాబునాయుడు దాదాపు పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి దిగిపోయిన తర్వాత వై.ఎస్. రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను అప్పుడు దూరదర్సన్   కరస్పాండెంటుగా పనిచేస్తున్నాను. ముఖ్యమంత్రిగారి స్వాతంత్ర దినోత్సవం సందేశం కాబోలు  రికార్డు చేయాలి. షరా మామూలుగా ఆ సందేశం స్క్రిప్ట్ కాపీ ఓ  ప్లాస్టిక్ ఫోల్డర్ లో పెట్టుకుని సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిగారి ముఖ్య పౌర సంబంధాల అధికారికి అందచేసాను. ఆయన దాన్ని అందుకుంటూ మందహాసం చేస్తూ ‘ఏమండీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన సంగతి మీరింకా గుర్తించినట్టులేదు అన్నారు సరదాగా.

ఏమిటా అని చూస్తే ఆ ప్లాస్టిక్  ఫోల్డర్  రంగు పసుపు. ఆయన రెడీ విట్ కి నాకూ నవ్వు వచ్చింది.

ఇది ఎందుకు చెబుతున్నాను అంటే ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రుల కొలువుల్లో పనిచేసేవారికి అంతటి నిశిత పరిశీలన వుండాలి. దాన్ని మనం తప్పుపట్టలేము కూడా.    (25-09-2020)       

24, సెప్టెంబర్ 2020, గురువారం

నేనూ హిందువునే - భండారు శ్రీనివాసరావు

(హిందూ అనగానే మనువును గుర్తు చేసుకోవద్దు. మనువు పుట్టక ముందే హిందూ మతం వుంది. నిజానికి ఇది ఒక మతం కాదు, జీవన విధానం)

నేను ఆచరించి, పాటించే హిందూ మతం గురించి నాకు మా పెద్దవాళ్ళు చెప్పింది వేరు. నేనిప్పుడు చూస్తున్నది వేరు.
ఎందరు గజనీలు దండెత్తి వచ్చినా, ఎందరు ఘోరీలు యుద్ధాలు చేసినా హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేయగలిగారు కానీ హిందూ మత ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారు. వందల వేల సంవత్సరాలు విదేశీయుల ఏలుబడిలో వున్నా హిందూ మతం చెక్కుచెదరలేదు. అదీ ఈ మతం గొప్పతనం. అంచేత ఎవరో ఏదో చేస్తారనీ, చేస్తున్నారనీ అనుకోవడంలో సహేతుకత వుందని నేననుకోను.

సాధారణంగా నేను మతపరమైన, కుల పరమైన విషయాలపై వ్యాఖ్యానాలు చేయను. కానీ ఈ నడుమ సాంఘిక మాధ్యమాల్లో ఒకరకమైన మొండి ధోరణి కనబడుతోంది. ఇది మన మత విధానాలకే వ్యతిరేకం. హిందూ మతాన్ని మొండిగా సమర్ధించే వాళ్ళలో కనీసం కొందరు కూడా మతం చెప్పిన దాన్ని పాటించడం లేదు.

సహనావతు అనేది వేదవాక్యం. ఆ సహనం ఇవ్వాళ కనబడడం లేదు. ఇతర మతాల వాళ్ళు ఏం చేస్తున్నారనే దానితో నిమిత్తం లేదు. ఏమి చేసినా ఏమీ కాదు. చరిత్రే ఇందుకు సజీవ సాక్ష్యం.

నా దృష్టిలో హిందూ మతం బలమైన పునాదులపై ఉద్భవించింది. తనని తాను కాపాడుకోగల సామర్ధ్యం, సత్తా ఈ మతానికి ఈనాటికీ పుష్కలంగా వుంది. అందుకు సందేహం లేదు.

(అనుకూలమైనా,ప్రతికూలమైనా కామెంట్లను తొలగించే అలవాటు నాకు లేదు. సభ్యత పాటిస్తే సంతోషం)

22, సెప్టెంబర్ 2020, మంగళవారం

సహనావతు - భండారు శ్రీనివాసరావు

 వేదకాలం నుంచి వినవస్తున్న హితోక్తి ఇది. ఎల్లకాలం మననం చేసుకుంటూ ఆచరించాల్సిన మహా సూక్తి. దీన్ని గుర్తు చేయాల్సిన పరిస్తితి దాపురించడమే ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.

ఇప్పుడు దేశ వ్యాప్తంగా మీడియాలో సహనం, అసహనం అనే రెండు పదాల చుట్టూ చర్చోపచర్చలు సాగిపోతున్నాయి. ‘సహనం పాటించండి’ అని నోటితో ఓపక్క చెబుతూనే, నొసటితో అసహనం ప్రదర్శించడం ఇందులోని విషాదం.
సహనం గురించి సాధారణ జనాలు అసహనానికి గురయ్యే విధంగా చర్చలు, వాదోపవాదాలు సాగిపోతున్న నేపధ్యంలో (ఆరేడేళ్ళ క్రితం అప్పటి) రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు వేర్వేరు సందర్భాలలో విడివిడిగా చేసిన ఉద్బోధలు గుర్తు చేసుకోవడం అవసరమనిపిస్తోంది.
ప్రధాని ప్రసంగం సాగిన తీరు పత్రికల్లో ఇలా వచ్చింది.
'మతపరమైన హింసపై కఠినంగా వ్యవహరిస్తాము. మత విద్వేషం ప్రేరేపించేవారు ఎవరయినా సరే సహించేది లేదు. ఈ దేశంలో ఎవరయినా తమకు నచ్చిన మత విశ్వాసాలను పాటించేందుకు పూర్తి స్వేచ్చ వుంది. ఈ విషయంలో ఎలాటి వొత్తిళ్లు పనిచేయవు. మెజారిటీ వర్గం అయినా, మైనారిటీ వర్గం అయినా బాహాటంగా కాని, చాటుమాటుగా కాని అన్య మతానికి వ్యతిరేకంగా విద్వేషానికి పాల్పడినా, కుట్రలు చేసినా సహించేది లేదు. అలాటి చర్యలను ఉక్కుపాదంతో అణచి వేస్తాము'

ప్రధాని ప్రసంగ సందర్భం ఢిల్లీలో క్రైస్తవ మతాధికారుల సమావేశం. ప్రధాని హోదాలో వున్న వ్యక్తి అలాటి సదస్సుల్లో ఏవిధంగా మాట్లాడుతారో మోడీ గారి ప్రసంగం అదే విధంగా సాగిపోయింది.

మన దేశానికి చెందిన కురియా కోస్ అలియాస్ చవర, మదర్ యాప్రేసియాలకు సెయింట్ హుడ్ ప్రకటించిన సందర్భంలో ఏర్పాటుచేసిన కార్యక్రమం కాబట్టి దానికి అనుగుణంగానే ప్రధాని ప్రసంగించారు. అంతకుముందు ఢిల్లీలో క్రైస్తవులకు చెందిన చర్చీల మీద జరిగిన దాడుల నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకున్నవాళ్లకు, ప్రధాని వ్యక్తపరచిన ఈ అభిప్రాయాల ప్రాముఖ్యం అర్ధం అవుతుంది. ఈ విషయంలో ఆయన మొదటిసారి పెదవి విప్పారని అనుకోవాలి. మోడీ భారతీయ జనతా పార్టీకి నాయకుడు అయినప్పటికీ, మొత్తం దేశానికీ ఆయన ప్రధాన మంత్రి. అంచేత అటువంటి సమావేశాల్లో వేరే విధంగా మాట్లాడే అవకాశం లేదు.

మత ఘర్షణలు జరక్కుండా చూడడానికి, మతం పేరుతొ ఉగ్రవాదులు చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందనీ, అటువంటి అనాగరిక చర్యలను ఉక్కుపాదంతో అణచివేస్తామనీ ప్రతి ప్రధానమంత్రి నొక్కివక్కాణించడం ఒకరకంగా పరిపాటిగా మారిపోయింది. సరే. అదలా వుంచితే, లౌకిక రాజ్యంగ వ్యవస్థను ఎంచుకున్న భారత దేశాన్ని పాలించేవారికి దేశంలోని మైనారిటీ ప్రజల్లో అభద్రతా భావాన్ని దూరం చేయడం కూడా ఒక కర్తవ్యమే. ఆవిధంగా ప్రధాన మంత్రి మోడీ మాటలవల్ల అలాటి ఫలితాలు వస్తే అంతకంటే కావాల్సింది లేదు.

ఇక రెండో సందర్భం కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్ధులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జరిపిన మాటా మంతీ.
దేశ ప్రధమ పౌరుడు భావి పౌరులతో ముచ్చటిస్తూ తన మనసులోని మాట విప్పి చెప్పారు. దశాబ్దాల రాజకీయ అనుభవసారాన్ని మొత్తం రంగరించి మరీ చెప్పారు. పాలకపక్షం వారికీ, ప్రతిపక్షం వారికీ అందరికీ పనికొచ్చే పసిడి ముక్కలు చెప్పారు. దేశ పరిస్తితులను అవగాహన చేసుకుని ఆవేదనతో కూడిన హితబోధ చేశారు.

చురుక్కుమనిపించేలా మాత్రమే కాదు, ఆలోచింపచేసేలా కూడా వున్నాయి ఆయన మాటలు. ఆ హితవచనాలు విని ఆచరించగలిగితే అది జాతి హితానికి ఎంతో మంచి చేసేలా కూడా వున్నాయి.

ప్రస్తుతం దేశాన్ని పాలిస్తోంది భారతీయ జనతాపార్టీ. పేరుకు సంకీర్ణ ప్రభుత్వం. కానీ , ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో, ఆయన పేరుతొ ఎదురులేకుండా సాగిపోతున్న ప్రభుత్వం అది. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికయింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో. ప్రస్తుతం ఆ పార్టీ, లోకసభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని దుస్తితిలో వుంది. ప్రధాని మోడీకి, ఆయన పార్టీ అయిన బీజేపీకి కాంగ్రెస్ అంటేనే చుక్కెదురు. ఇలాటి నేపధ్యంలో రాష్ట్రపతి తనకున్న పరిమితుల్లోనే హితబోధ చేశారు. జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ, జరగాల్సిన విధి విధానాలను విశ్లేషించారు. అలాగని ఆయన ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఎవ్వరు నొచ్చుకునే విధంగా మాట్లాడలేదు. ఒక కుటుంబ పెద్ద తన కుటుంబ విషయాలను తనవారితో యెలా మాట్లాడతాడో ఆవిధంగానే సాగింది రాష్ట్రపతి ప్రసంగం.

ప్రతిపక్షం యెలా వ్యవహరించాలో, పాలక పక్షం యెలా నడుచుకోకూడదో శ్రీ ప్రణబ్ ముఖర్జీ అన్యాపదేశంగా ప్రస్తావించారు. ప్రజల ద్వారా ఎన్నికయిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన చట్టసభల్లో కనబరుస్తున్న ప్రవర్తనను ఆయన ప్రశ్నించారు. ఒకరకంగా చెప్పాలంటే యావద్దేశ పౌరుల మనస్సుల్లో కదలాడుతున్న అంశాలనే రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి తమ ప్రసంగాలలో చెప్పిన మాటల్ని ఇన్నేళ్ళ తరువాత గుర్తు చేయాల్సిన అవసరం, గుర్తుంచుకోమని చెప్పాల్సి రావడం బాధాకరం.

ముందు చెప్పుకున్నట్టుగా ప్రస్తుతం దేశంలో సహనం, అసహనాలు గురించిన చర్చ సాధారణ జనం సహనం కోల్పోయే స్థాయిలో అనంతంగా సాగిపోతోంది. తమ మాట వినమని చెప్పే వాళ్ళే కాని ఎదుటివారు చెప్పేది వినిపించుకునే ఓపిక ఎవ్వరికీ లేకుండా పోతోంది.

పార్టీలకు అతీతంగా సమాజ హితాన్ని కోరుకునే వారి మనసులను కలవర పరుస్తున్న అంశం ఇదే.

( ఈ వ్యాసం రాసింది: 04-11-2015 తేదీన)

17, సెప్టెంబర్ 2020, గురువారం

విలువల పతనంలో వ్యవస్థల పోటీ – భండారు శ్రీనివాసరావు

 చేదు మాత్ర:

వ్యవస్థలలో దాపరికం లేకుండా పోయినప్పుడే ప్రజాస్వామ్యం మూడు పూవులు ఆరు కాయలుగా విలసిల్లుతుంది.

కోర్టుల్లో విచారణలో భాగంగా అనేక అంశాలు ప్రస్తావనకు వస్తుంటాయి. లాయర్ల నుంచి సరైన సమాచారం రాబట్టడానికి న్యాయమూర్తులు అనేక వ్యాఖ్యలు చేస్తుంటారు. నిజానికి అంతిమంగా వెలువడే తీర్పుకి ఈ వ్యాఖ్యలకి ఎలాంటి పొంతన ఉండక పోవచ్చు. అయినా కానీ, ఇరవై నాలుగు గంటల వార్తా ప్రసారాల్లో వాటిని పదేపదే స్క్రోల్ చేస్తుంటారు. జడ్జీలు వీటి విషయంలో కూడా తగిన ఆదేశాలు ఇస్తే మంచిది. గతంలో ప్లీడర్లు జడ్జీల మీద విసుర్లు విసిరేవారు. వాటికి సినిమాల్లో కూడా మంచి ఆదరణ లభించేది. ఇప్పుడు న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలకు మీడియాలో అలాంటి ఆదరణే దొరుకుతోంది. అసలు వాదోపవాదాలకంటే ఇటువంటి వాటికి ప్రచారం ఇస్తున్నారు అంటే ఎక్కడో ఏదో స్వీయ ప్రయోజనం ఉన్నట్టుగా జనం భావించే అవకాశం వుంది.

స్వీయ ప్రయోజనాలు కలిగిన మీడియాకు స్వేచ్ఛ కోరే వెసులుబాటు వుండదు. స్వేచ్ఛ కావాలంటే కొన్ని త్యాగం చేయక తప్పదు. సొంత ప్రయోజనాలా సమాజం ప్రయోజనాలా అన్నది మీడియా తేల్చుకోవాల్సి వుంది. అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే కుదరదు. అలాంటి స్వేచ్ఛకి ప్రజల మద్దతు లభించదు.

అలాగే ఇతర రాజ్యాంగానికి మూడు మూల స్తంభాలుగా ఏర్పరచిన వ్యవస్థలు కూడా. వీటికి రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలు వుంటాయి. వీటితో పాటు కొన్ని బాధ్యతలు వుంటాయి. విశాల జాతి ప్రయోజనాలను కాపాడేందుకే ఆ వ్యవస్థలకు ఈ అధికారాలు, హక్కులూ అన్నది అవి మరచిపోరాదు.

కనపడని మరో మూల స్తంభంగా పేర్కొనే ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాకు అధికారాలు అంటూ ఏమీ వుండవు. కాకపోతే స్వేచ్ఛ, దానికి తగ్గట్టుగా హక్కులు, బాధ్యతలు వుంటాయి.
అపరిమితమైన, అవాంఛిత స్వేచ్ఛకు రక్షాకవచం మాదిరిగా ఒక్కోసారి ఈ హక్కులను ఓ ఉపకరణంగా వాడుకోవడం ఇటీవలి కాలంలో చూస్తున్నాం. మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలు చాలాకాలం వరకు మీడియా స్వేచ్ఛను గౌరవిస్తూనే వచ్చాయి. మీడియా రంగంలో స్వీయ ప్రయోజనాలు చొరబడిన నాటి నుంచి ఆ గౌరవ ప్రతిపత్తులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇది గమనించని మీడియా వెనుకటి మాదిరిగానే తమ హక్కుల పరిరక్షణ కోసం మిగిలిన వ్యవస్థలతో ఘర్షణ వాతావరణంలో చిక్కుకుంటోంది. ఇది కేవలం స్వయంకృతాపరాధం.
విలువల పతనంలో మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలు కూడా ఏమీ వెనుకబడి లేవు. ఒకప్పుడు వాటికి ఉన్న పేరు ప్రతిష్టలు వేగంగా మసకబారుతున్నాయి. కాలానుగుణంగా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలను అన్ని వ్యవస్థలు అతి సహజంగా తీసుకోవడమే ఓ విషాదం. ఇతరుల తప్పులను వేలెత్తి చూపడం, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం అనే విష క్రీడలో అవి మునిగి తేలుతున్నాయి. పౌర సమాజం కూడా ఈ క్రీడలను చూస్తూ వినోదిస్తున్నది. వారి మౌనానికి కారణం వెరీ సింపుల్. వారిని ఉత్తేజపరచాల్సిన మీడియా, మేధావి సమాజం ఏదో ఒక రాజకీయ గుడారానికి అనుబంధంగా పనిచేస్తూ, తమ స్వీయ ప్రయోజనాలు కాపాడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండడమే. ఇలా ఎవరి ప్రయోజనాలు వారికి ప్రధానం అయినప్పుడు, వాళ్ళు కూడా విలువల పతనానికి సాగుతున్న యాగంలో సమిధలుగా మారుతూ తమ తాత్కాలిక ప్రయోజనాలను నెరవేర్చుకొంటున్నారు. ఈ కోవలోనే సాధారణ జనం. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు కదా!
ఆ విధంగా చక్రభ్రమణం పూర్తయి ప్రజాస్వామ్యానికి చెదలు పడుతున్నాయి.

ఈ స్థితిని చక్కదిద్దాలని కోరని వారుండరు. కానీ ఆ ప్రయత్నం తమ నుంచే ఎందుకు మొదలు కారాదని ఆలోచించే వాళ్ళే లేరు. (17-09-2020)

మూడు పరిష్కారాలు, పరిమితులు – భండారు శ్రీనివాసరావు

మొట్టమొదటిది, మీడియా స్వేచ్ఛగా తన విధులు నిర్వహించుకునేందుకు వీలుగా ఎలాంటి నిర్బంధాలు లేకుండా చూడడం. అదే సమయంలో మీడియా సైతం తన బాధ్యతగా స్వీయ నియంత్రణ పాటించడం. అయితే దీనికి ప్రధానమైన అడ్డంకి స్వీయ ప్రయోజనాలు. వీటిని వదులుకోవడం నేటి పోటాపోటీ ప్రపంచంలో సాధ్యమా?

రెండు,  ప్రభుత్వ వ్యవహారాల్లో పూర్తి పారదర్సకత. తీసుకుంటున్న నిర్ణయాలు,  జారీ చేసిన జీవోలు ఎప్పటికప్పుడు పబ్లిక్ డొమైన్ లో వుంచడం. (దేశ భద్రత, మత విద్వేషాలు రెచ్చగొట్టే  అంశాలకు సంబంధించిన వాటిని మినహాయించి, మిగిలిన అన్నింటినీ ఎటువంటి భేషజాలకు పోకుండా ప్రజలకు అందుబాటులో వుంచడం)

ఇక మూడవది, అతి ప్రధానమైనది ఏమిటంటే, న్యాయస్థానాలు కూడా స్వీయ నియంత్రణ పాటించడం. రాజ్యాంగం ప్రసాదించిన విశేష హక్కులు, అధికారాలను సంయమనంతో ఉపయోగించుకోవడం. తాముకూడా రాజ్యాంగ వ్యవస్థల్లో ఒక భాగమని  ఎల్లప్పుడూ గుర్తెరిగి వ్యవహరించడం. ఇటీవలి కాలంలో ఈ వ్యవస్థపై ముసురుకుంటున్న అనుమానాలు, చోటు చేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాల దృష్ట్యా న్యాయ వ్యవస్థే తనకు తానుగా ముందుకు వచ్చి కోర్టు ధిక్కరణ వంటి అంశాల్లో ప్రజల్లో పెరుగుతున్న సందేహాలను నివృత్తి చేయడానికి వీలుగా వాటిపై  దేశవ్యాప్త బహిరంగ చర్చను ఆహ్వానించడం.

ఈ మూడు వ్యవస్థలలో దాపరికం లేకుండా చేయగలిగితే అంతకంటే ఉత్తమ పరిష్కారం మరోటి వుండదు.

ఇవన్నీ జరిగే పనులు కావని తెలుసు. కానీ సామాన్యుడి మనసులో మాట చెప్పుకోవాలిగా, అదీ స్వీయ నియంత్రణ  పాటిస్తూ. (17-09-2020)