17, నవంబర్ 2019, ఆదివారం

రేడియో రోజులు – 18 – భండారు శ్రీనివాసరావు



(Published in SURYA daily on 17-11-2019, SUNDAY, today)

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుమలశెట్టి శ్రీరాములు
– ఢిల్లీ నుంచి ప్రసారం అవుతున్న ఈ వార్తల్ని మద్రాసు, విజయవాడ, హైదరాబాదు కేంద్రాలు రిలే చేస్తున్నాయి”
ఉదయం ఏడుగంటల సమయంలోనో, లేదా రాత్రి ఏడు కొడుతున్నప్పుడో ఈ కంఠస్వరం తెలుగు లోగిళ్లను పలకరిస్తూ వుండేది. వార్తల్లో విషయం కన్నా ఆయన వార్తలు చదివే పధ్ధతి, వాక్యాలను విరుస్తూ, అక్కడక్కడ నొక్కుతూ ఉచ్చరించే తీరుకోసమే వింటున్నామనే వాళ్లు నాకు చిన్నతనంనుంచీ తెలుసు. అయితే, రేడియోలో వినబడే ఆ స్వరం తప్ప శ్రీరాములు గారు యెలా వుంటారో తెలియని వాళ్ళే కాని ఆయన్ని తెలియని తెలుగు వాళ్లు అంటూ ఎవ్వరు వుండరు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, ఆసేతుహిమాచలం హై పవర్ రేడియో ట్రాన్స్ మీటర్లు వున్న ప్రతిచోటా ఆయన గొంతు వినబడేది.
ఆ రోజుల్లో ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చదివే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క బాణీ. ఎవరి స్టైల్ వారిదే. దుగ్గిరాల పూర్ణయ్య, కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు, జోలిపాళ్యం మంగమ్మ, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి ఇలా ఎందరో మహానుభావులు. ఎవరికి ఎవరు తీసిపోరు. వార్తలు మధ్యనుంచి విన్నా చదువుతున్నది పలానా అని చెప్పగలిగేలా తమదయిన తరహాలో వార్తలు చదివేవాళ్ళు. (సందర్భాన్నిబట్టి కొన్ని పేర్లు మాత్రమే ప్రస్తావించడం జరిగింది. మిగిలిన వారిని కూడా వీలువెంట గుర్తుచేయడం జరుగుతుంది. దురదృష్టం ఏమిటంటే రేడియో అభిమాని అనే బ్లాగులో, మాగంటి వారు నిర్వహించే బ్లాగులో తప్ప వీరిలో కొందరి ఫోటోలు సంపాదించడం అనేది గగన కుసుమంగా మారింది)
శ్రీరాములు గారి గురించి చెప్పుకుంటున్నాం కదా! ఆయన ఢిల్లీ నుంచి కొన్నాళ్ళు మాస్కో వెళ్ళి ఆ తరువాత తిరిగి ఢిల్లీ వెళ్ళకుండా హైదరాబాదు బదిలీపై వచ్చారు. వార్తలు చదివే పద్దతే కాదు ఆయన ఆహార్యం కూడా ప్రత్యేకమే. ఎప్పుడు ఫుల్ సూటులో కనబడేవారు. ఆరోజుల్లో ప్రాంతీయ వార్తా విభాగం ప్రస్తుతం క్యాంటీన్ వున్న షెడ్లలో వుండేది. అందులో రెండు విశాలమైన గదులు – ఒకదానిలో న్యూస్ బులెటిన్లు తయారుచేసే సిబ్బంది, అంటే న్యూస్ ఎడిటర్లు, రిపోర్టర్లు, బులెటిన్ టైప్ చేసే వాళ్లు, రెండో గదిలో తెలుగు, ఉర్దూ న్యూస్ రీడర్లు ఆఫీసు అసిస్టెంట్లు కూర్చునే వారు.
నేను చేరినప్పుడు న్యూస్ ఎడిటర్ పన్యాల రంగనాధ రావు గారు, కరస్పాండెంట్ ఎం ఎస్ ఆర్ కృష్ణా రావు గారు అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ మాడపాటి సత్యవతి గారు, న్యూస్ రీడర్ గా వుంటూనే బులెటిన్లు తయారు చేసే బాధ్యతను ఐచ్చికంగా భుజాలకు ఎత్తుకున్న డి. వెంకట్రామయ్యగారు, సరే, ఆ వరసలో నేనూ. చివర్లో ‘ఈ నేను’ ఎందుకంటే అసలు నేను ఆఫీసుకు వచ్చి పోయేదే చాలా తక్కువ. రిపోర్టింగ్ పని మీద రోజులో ఎక్కువ భాగం బయటే తిరిగేవాడిని.
మరో గదిలో తిరుమలశెట్టి శ్రీరాములు గారు, ఉర్దూ న్యూస్ రీడర్ వసీం అక్తర్ కూర్చునే వారు. శ్రీరాములు గారు వార్తల టైము కాగానే ఒక చేతిలో వెలిగించిన సిగరెట్, మరో చేతిలో న్యూస్ బులెటిన్ పట్టుకుని స్టూడియోకు బయలుదేరేవారు. మేమున్న చోటునుంచి స్టూడియోకి కొంతదూరం నడిచి వెళ్ళాలి. శ్రీరాములు గారు అడుగులో అడుగువేసుకుంటూ స్టుడియో దగ్గరికి వెళ్లేసరికి సిగరెట్ అయిపోయేది. వార్తలు చదవడానికి స్టూడియోకి వెళ్లేటప్పుడు యెంత టైం పట్టేదో తిరిగివచ్చేటప్పుడు కూడా సరిగ్గా అంతే సమయం పట్టేదని చెప్పుకునేవారు. వేసే అడుగులు కూడా లెక్కబెట్టినట్టు వుండేవి. ఒక్కోసారి ఏదయినా తాజా సమాచారం అందివ్వడానికి నేను స్టూడియో వైపు పరిగెత్తుకుంటూ వెడుతుంటే శ్రీరాములు గారు మాత్రం నింపాదిగా నడుస్తూ మధ్యలోనే కనిపించేవారు. ఆ కాగితం ఆయన చేతిలో పెడితే దాన్ని చదువుకుంటూ అలాగే అంతే తాపీగా నడుస్తూ వెళ్ళేవారు కాని ఆయనలో ఏమాత్రం ఆందోళన కాని, కంగారు కాని ఏనాడు చూడలేదు. అలాగే ఒక్కోసారి చివరి నిమిషంలో మొత్తం వార్తని తిప్పిరాసి ఇచ్చినా ఏమాత్రం అసహనం ప్రదర్శించకుండా దాన్ని అనువాదం చేసేపనిలో నిమగ్నం అయ్యేవారు. అన్నట్టు చెప్పడం మరిచాను. ప్రాంతీయ వార్తా విభాగంలో మాస్టర్ బులెటిన్ ను ఇంగ్లీష్ లో తయారుచేసి ఇచ్చేవాళ్ళం. దాన్ని కాపీలు తీసి ఇస్తే తెలుగు న్యూస్ రీడర్, ఉర్దూ న్యూస్ రీడర్ తమ భాషల్లోకి అనువదించుకునేవారు.
పొతే, తిరుమలశెట్టి శ్రీరాముల గారికి సంబంధించిన మరో జ్ఞాపకం మనసులో పదిలంగావుంది. ఆయన రేడియోలో చేరి వార్తలు చదవడం మొదలు పెట్టి పాతికేళ్ళు అప్పటికి పూర్తయ్యాయి. శ్రీరాములు గారి రేడియో కంఠస్వర రజితోత్సవం జరిపితే ఎలావుంటుందని నర్రావుల సుబ్బారావు గారికి ఆలోచన వచ్చింది. ఆహ్వాన సంఘం చైర్మన్ గా నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారిని ఒప్పించే బాధ్యతను నాపై పెట్టారు. నేను వెళ్లి అందుకు సంబంధించిన లేఖను ముఖ్యమంత్రికి అందచేసాను. ఆయన ఒకసారి పైనుంచి కింది వరకు చదివి ఆ కాగితాన్ని మడిచి లాల్చీ జేబులో పెట్టుకున్నారు. తర్వాత పెద్దగా నవ్వి “ఇందులో గొప్పేమిటో నువ్వే చెప్పు. ఎవడయినా ఒకడు ఈరోజు సర్కారు నౌకరీలో చేరాడనుకో. పాతికేళ్ళ తర్వాత అతడి సర్వీసుకూడా పాతికేళ్ళు పూర్తవుతుంది”.
ఆ మాటతో నేను వచ్చిన పని ఇంతే సంగతులు అనుకున్నా. కానీ కొన్నాళ్ళ తర్వాత, మా విజ్ఞప్తిని చెన్నారెడ్డి గారు అంగీకరించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాకు జాబు అందింది.
(ఇంకా వుంది)
కింది ఫోటో : కీర్తిశేషులు తిరుమల శెట్టి శ్రీరాములు గారు.


16, నవంబర్ 2019, శనివారం

రేడియో రోజులు - 17 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 16-11-2019, Saturday)

స్కూళ్లకు సెలవిచ్చారని రేడియో వార్తల్లో విని మారుమూల వూళ్ళల్లో బళ్లను మూసివేసిన రోజులున్నాయి. రేడియో వార్తల్లో అంతర్లీనంగా వుండే నిబద్ధతతకు ఈ ఉదంతాలు నిదర్శనాలు. అయినాసరే  రేడియోలో వచ్చే ప్రాంతీయ వార్తల్ని ప్రాచీన వార్తలు అంటూ ఎద్దేవా చేయడం కద్దు.
సుమారు  మూడు దశాబ్దాలు హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేసిన అనుభవం నాకుంది. ఇన్నేళ్ళ ఉద్యోగ పర్వంలో ఏనాడు పై అధికారులెవ్వరూ - ఆ మాటకు వస్తే కేంద్ర ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రులుగా పనిచేసిన తెలుగువారు కూడా  'ఈ వార్త ఇలా ఇవ్వండి, ఆ వార్త అలా యెందుకు ఇచ్చారు' అని అడిగిన జ్ఞాపకం లేదు. ఆ పాటి ఫంక్షనల్ అటానమీ (విధి నిర్వహణా స్వేచ్ఛ) ని నాతోపాటు పత్రికల్లో పనిచేసిన సాటి జర్నలిష్టు మిత్రులు కూడా అనుభవించారని అనుకోవడం లేదు. అయినా కానీ, సర్కారీ వార్తలు రాసే సర్కారీ జర్నలిష్ట్ అనే ముద్ర నుంచి తప్పించుకోలేకపోవడం విచిత్రం. బహుశా, పాలక పక్షాలకు ఎలాటి రాతలు, ఎలాటి వార్తలు రుచిస్తాయో అవగతం చేసుకుని అందుకు తగ్గట్టుగానే వార్తలు వండి వడ్డించి వుంటామని అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు.
ఇక రేడియోలో వార్తలు గురించి చెప్పాల్సివస్తే -
నలభైయ్యేళ్ళ క్రితం రేడియో విలేకరిగా చేరినప్పుడు - ప్రభుత్వ మాధ్యమంలో పనిచేసే మాకు పోటీ ఏమీ లేదు. ఆ మాటకు వస్తే రేడియో వరకు ఈనాటికీ ఎలాటి పోటీ లేదు.
పోటీ లేకపోవడంవల్లా. పోటాపోటీగా సంచలన వార్తలు ప్రసారం చేసి శ్రోతల సంఖ్యని పెంచుకోవాల్సిన అవసరం లేకపోవడంవల్లా, రేడియో వార్తల సేకరణ, కూర్పు ఇత్యాది కార్యక్రమం అంతా ఒక పద్ద్దతి ప్రకారం జరిగిపోతూ వుండేది. ఏదయినా సమాచారాన్ని ఉన్నతస్థాయి ప్రభుత్వ, పోలీసు వర్గాలనుంచి ద్రువపరచుకోవడానికి, పత్రికలవారితో పోలిస్తే రేడియో విలేకరికి కొంత వెసులుబాటు ఎక్కువనే చెప్పాలి. 'అవసరాన్ని మించి రేడియోలో అనవసరంగా ఏమీ చెప్పరు' అని రేడియోవారిమీద వున్న ముద్ర ఇలాటి సందర్భాల్లో చాలా ఉపకరించేది. మంత్రులు, సీనియర్ అధికార్లతో తీరిక సమయాన్ని ఖర్చుచేసే సందర్భాల్లో దొర్లే ప్రైవేట్ సంభాషణల్లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు మా దృష్టికి వచ్చేవి. అయినా వాటిని సంచలనాత్మకం చేయాలనే ఆలోచన కూడా వుండేది కాదు. అందుకే, అధికారులు కూడా మాకు అవసరమైన సందర్భాలలో సరైన సమాచారం అందించేందుకు వెనుకాడేవారు కారు. ఉభయతారకమైన  ఈ సంబంధాలు, రేడియో విలేకరిగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడంలో నాకెంతో సాయపడ్డాయి.               
సంచలనం జోలికి పోకుండా వుంటే రేడియో వార్తల పరిధి చాలా తక్కువ. తెలిసిన లేదా తెలియవచ్చిన వార్తకు ఎలాటి నగిషీలు చెక్కకుండా ప్రసారం చేయడం వల్ల - రేడియో వార్తల్ని మెచ్చుకుని అభిమానించే నిత్య శ్రోతల్ని పెద్ద సంఖ్యలో  సంపాదించుకోగలిగాము. అలాగే పోటీ లేదని చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు శ్రోతలకు అందించడంలో ఎప్పుడూ ముందే వుంటూ వచ్చాము. రేడియో బులెటిన్ లో ఎప్పుడయినా 'ఇప్పుడే అందిన వార్త' అని వినబడితే ఇంటిల్లిపాదీ చెవులు రిక్కించుకుని వినే ఆకర్షణ రేడియో వార్తలకే  చెల్లింది అని చెప్పడం అతిశయోక్తి కాదు.
నాటి విషయాలు ముచ్చటించుకునేటప్పుడు ఒక విషయం ప్రస్తావించుకోవాలి. ఇన్నిన్ని ప్రైవేట్ టెలివిజన్ ఛానళ్ళు లేని ఆ రోజుల్లో రేడియో వార్తలకు ఎంతో ప్రాముఖ్యం వుండేది. రేడియో విలేకరి వచ్చేవరకు ముఖ్యమైన పత్రికా సమావేశాలు మొదలయ్యేవి కావంటే ఆ ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు. వివిధ రకాల టీవీ నెట్ వర్కులు, బ్రేకింగ్ న్యూస్ ప్రక్రియలు లేకపోవడం వల్ల రేడియో వార్తల్లో కదాచిత్ గా వచ్చే 'ఇప్పుడే అందిన వార్త' కోసం  శ్రోతలు ఆసక్తిగా ఎదురుచూసేవారు. విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం,  అంజయ్య గారి భారీ మంత్రివర్గం రాజీనామా, తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు నాయుడు ఎన్నిక, నెల రోజుల ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానంతరం ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేయాల్సిందని గవర్నర్ ఎన్ టీ రామారావును ఆహ్వానించడం వంటి అతి ముఖ్యమైన సమాచారాన్ని మొట్టమొదట తెలుగునాట నలుదిక్కులకూ తెలియచెప్పిన ఘనత ఆకాశవాణిదే.
ఇక ఆ కోవలో చెప్పుకోదగిన వార్త ఎన్టీఆర్  మరణం. ఆయన మృతి చెందిన వార్త కొద్ది గంటల వ్యవధిలోనే ఢిల్లీ నుంచి ఉదయం వెలువడే మొట్టమొదటి ఇంగ్లీష్ బులెటిన్ లో ప్రసారమైంది. తద్వారా యావత్ ప్రపంచానికి తెలిసింది.
నర్రావుల సుబ్బారావు గారని ఒక న్యూస్ ఎడిటర్ వుండేవారు. మోచేతుల కిందకి చొక్కా, పంచెకట్టుతో అచ్చం ఒక రైతు మాదిరిగా కనిపించేవారు. నిజానికి ఆయన రైతు పక్షపాతి. ఆయన నైజం వార్తల్లో కూడా ప్రతిఫలించేది. వర్షాలు కురవక పలానా జిల్లాలో పైర్లు ఎండిపోతున్నాయని వార్తల్లో వివరాలతో సహా ప్రసారం చేసేవారు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు. ఆయన మాటకు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎదురులేదు. అయినా సుబ్బారావు గారు తరువాత అనేక సంవత్సరాలు రేడియోలో కొనసాగారు.  రేడియోమీద కానీ, రేడియో వార్తలమీద కానీ సర్కారువారికి పట్టో, పెత్తనమో వుంటుందని ఓ అభిప్రాయం ప్రచారంలో వుంది. ఇలాటి ఉదంతాలు విన్నప్పుడు వాటికి సరైన ప్రాతిపదిక లేదన్న వాస్తవం బోధపడుతుంది.
నా ముప్పయి సంవత్సరాల రేడియో ఉద్యోగం అనుభవంలో గమనించిన అంశాలు కొన్ని వున్నాయి. ఈ కాలంలో విభిన్న రాజకీయ పార్టీలు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కాలంలో గద్దె ఎక్కడంతో - వాటిని వ్యక్తిగతంగా సమర్ధించే శక్తులు, అన్ని వ్యవస్థల్లో మాదిరిగానే రేడియోలో కూడా ప్రవేశించాయి. రాజకీయ నాయకుల ప్రత్యక్ష జోక్యం లేకున్నా, ఈ వ్యక్తి ఆరాధకుల వికృత పోకడల ప్రభావం రేడియో వార్తలపై పడిందనడంలో సందేహం లేదు. అయితే ఎలాటి రాజకీయ ముద్రాంకితాలు లేని ఉద్యోగులు కూడా అదే సమయంలో పూర్తి స్వేచ్చతో, తమ బాధ్యతలు నిర్వర్తించుకోగలుగుతున్నారు. అదే ఈ వ్యవస్థలో నేను గమనించిన విలక్షణ లక్షణం. 
(ఇంకా వుంది)

15, నవంబర్ 2019, శుక్రవారం

రేడియో రోజులు - 16 భండారు శ్రీనివాసరావు




(Published in SURYA daily on 15-11-2019, Friday)


ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో చెన్నారెడ్డిది చెరపలేని ముద్ర. మనసులో ఏదైనా పడితే ఇక ఇంతే సంగతులు. అంత ఉడుం పట్టుతో ప్రత్యర్ధిని తొక్కేయాలని విశ్వ ప్రయత్నం చేయడంలో ఆరితేరిన మనిషి.
రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అయినప్పటికీ, ఆయన తన  సొంత పార్టీ మనిషి  వై.ఎస్. రాజశేఖరరెడ్డినే ప్రధాన ప్రత్యర్ధిగా భావించేవారు. అవకాశం దొరికినప్పుడల్లా వై ఎస్  ని బద్నాం  చేయడం ఆయన వ్యూహాల్లో ఒకటిగా వుండేది. ఆ రోజుల్లో ఢిల్లీ నుంచి ఒక సమాచారం అందింది. ఆయన  పార్టీ వాళ్ళే దాన్ని చెన్నారెడ్డికి మోశారు. ఆంధ్రాభవన్ గేటు దగ్గర సెక్యూరిటీతో వై ఎస్ గొడవ పడ్డాడన్నది దాని సారాంశం. ఆ విషయం స్థానిక పత్రికల్లో, ప్రత్యేకించి ఇంగ్లీష్ పత్రికల్లో ప్రముఖంగా వచ్చేట్టు చూడాలని పీ ఆర్ వో ఆదేశించారు. అ అధికారి ఆ వార్తను పట్టుకుని ప్రధాన పత్రికల ఎడిటర్లను కలుసుకుని స్వయంగా విన్నవింపులు చేసుకోవడం జరిగింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్ ఆయన్ని  హెచ్చరించారు, ఈ విషయం వై.ఎస్. కి తెలిస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోమని. మొత్తం మీద ఆ వార్త ముఖ్యమంత్రి అనుకున్నంత ప్రముఖంగా కాకపోయినా మర్నాడు పత్రికల్లో వచ్చింది. వై ఎస్ సామాన్యుడు కాదుకదా! ఆంధ్రా భవన్ లోకి అడుగు పెట్టేది లేదని భీషణ ప్రతిన పూనారు. ముఖ్యమంత్రి అయిన తరువాతనే అందులో కాలు పెట్టారు. మరో విచిత్రం ఏమిటంటే, తాను  ముఖ్యమంత్రి కాగానే,  తన గురించిన వార్త పత్రికల్లో చెడ్డగా  రావడానికి కారణం అయిన  వ్యక్తినే పీఆర్వో గా తీసుకోవాలని ఆలోచన చేశారు కూడా. అలా వుండేది వై. ఎస్. తరహా.     
చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనతో సహా ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తిరుపతిలో సమావేశం అయ్యారు. నదీ జలాల పంపిణీ ప్రధాన ఎజెండా. బొంబాయి నుంచి వచ్చిన బ్లిట్జ్ కరస్పాండెంటుకు  మర్నాడు హైదరాబాదులో ముఖ్యమంత్రి  ఇంటర్వ్యూ ఇచ్చారు. కొద్ది రోజుల తరువాత అది ఆ పత్రికలో వచ్చింది. అయితే ఆ వార్త నదీజలాలకు సంబంధించింది కాదు. ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేతులు కలుపుతున్నారన్నది అందులోని సమాచారం. అది చూసి ఆయన పీ ఆర్వో కంగారు పడుతుంటే, ‘ఏమవుతుంది ఆ వార్త వస్తే. కాస్త మనమంటే ఏమిటో ఆవిడకూ తెలియాలి కదా, ఆ మాత్రం బెదురు వుండాల్సిందే’  అన్నారాయన తాపీగా.

(ఇంకా వుంది)

రేడియో రోజులు – 15 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 14-11-2019, Thursday)

రెండున్నర అణాల కోసం నానా హైరానా
రాష్ట్ర ప్రభుత్వాల సంగతి తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడడానికి అనేక నిబంధనలు వుంటాయి. అయితే దుర్వినియోగం అసలు ఏమాత్రం జరగదు అని చెప్పడానికి కూడా వీలు లేదు. నిబంధనలను అతిక్రమించేవారికి భారీ జరిమానాలు వుంటాయి. కానీ నిబంధనలకు విరుగుళ్ళు కనిపెట్టి ప్రభుత్వ బొక్కసానికి చిల్లులు పెట్టే ఘనులు కూడా వుంటారు. ఖచ్చితమైన ఆడిటింగ్ వుంటుంది. ఖర్చుపెట్టే ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సివుంటుంది. లెక్క అంటే మరేమీలేదు, ప్రతి ఖర్చుకూ ఒక రసీదు సమర్పించాలి. వాటి చాటు మాటున గుట్టుముట్లు ఏమిటన్నది జవాబు లేని ప్రశ్న.
ఒక సంగతి చెప్పుకునేవారు. ఎంత నిజమో తెలియదు. కలకత్తా ఆలిండియా రేడియో డైరెక్టర్ ఒక కార్యక్రమ రూపకల్పనలో రెండున్నర అణాలు (ఆనాటి ద్రవ్యమానం ప్రకారం రూపాయికి పదహారణాలు) నిబందనలను ఖాతరు చేయకుండా ఖర్చు చేశాడని  ఆరోపణ.
రేడియో స్టేషన్ వాళ్ళు జంతు ప్రదర్శనశాలలో పిల్లల కోసం ఒక కార్యక్రమాన్ని రికార్డు చేశారు. వివిధ రకాల  జంతువులు, పక్షుల అరుపులు ఎలా వుంటాయనే విషయంపై  చిన్నపిల్లలకు అవగాహన కల్పించడం దీని ఉద్దేశ్యం.  ఇక్కడే అనుకోని అవాంతరం ఎదురయింది.
పిల్లల్ని జూలో ఉన్న  పులి బోను దగ్గరికి తీసుకువెళ్ళారు. ఎంత ప్రయత్నించినా బోనులోని  పులి మూగనోము పట్టింది. పులి గాండ్రించే విధానం రికార్డు చేయడం ఆ కార్యక్రమంలో ముఖ్యమైన అంకం.
జూ కాపలాదారు ఒక తరుణోపాయం చెప్పాడు. ఒక చికెన్ ముక్క పడేస్తే అది మనం చెప్పిన మాట వింటుంది అన్నాడు. రేడియో అధికారులు రెండున్నర అణాలు అతడి చేతిలో పెట్టి మాంసం తెప్పించి పులి నోటికి అందించారు. చిత్రంగా అతగాడు చెప్పినట్టే ఆ పులి గట్టిగా ఘా౦డ్రి౦చింది. ఆ విధంగా మొత్తం మీద  ఆ రికార్డింగు కార్యక్రమం జయప్రదంగా పూర్తిచేసుకుని వెళ్ళారు.
ఆ తర్వాత పెద్ద చిక్కొచ్చి పడింది. ఆడిట్ వాళ్ళు పులికోసం మాంసం కొనడం నిబంధనలకు విరుద్ధం అని కొర్రీ వేసారు. ఇలా ప్రజాధనాన్ని ఖర్చు చేసే అధికారం స్టేషన్ డైరెక్టర్ కి లేదు పొమ్మన్నారు. వెంటనే ఆ రెండున్నర అణాలు ప్రభుత్వ ఖజానాకు జమ చేయకపొతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
రేడియో  రికార్డింగుల నిమిత్తం   కళాకారులను ఆహ్వానించినప్పుడు వారికి కాఫీ గట్రా ఇచ్చి  మర్యాదలు చేసేందుకు కొంత సొమ్ము ఖర్చు చేసే అవకాశం వుందని రేడియో కేంద్రం వారు బదులు చెప్పారు.
ఆడిట్ వాళ్ళు తక్కువ తినలేదు. కళాకారులతో రికార్డింగు చేసేటప్పుడు వారితో కాంట్రాక్ట్ మీద సంతకం చేయించాలనే నిబంధనని వాళ్ళు బయటకు తీసారు. పులితో సంతకం చేయించుకున్నట్టు కాంట్రాక్ట్ వుండాలి. ఠాట్! అది లేకుండా బిల్లును ఆమోదించేది  లేదని మంకుపట్టు పట్టారు.
రేడియో స్టేషన్ కు వచ్చే పెద్దవాళ్ళకు మర్యాదలు చేసేందుకు స్టేషన్ డైరెక్టర్ గా తనకు అధికారాలు వున్నాయని, ఆ పులి రాయల్ బెంగాల్ టైగర్ కాబట్టి ఆ మర్యాదలకు, గౌరవాలకు ఆ పులికి కూడా  అర్హత వున్నదని పాయింటు లేవదీసి మరో లేఖ రాసారు. ఆ పులి రాయల్ బంగాల్ టైగర్ అంటూ జంతు ప్రదర్శనశాల వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ను దానికి జత పరిచారు. తన అరుపు రికార్డింగు చేసుకోవడానికి పులి ఎటువంటి రుసుము అడగనందున కాంట్రాక్ట్ వుండి తీరాలనే నిబంధన ఇక్కడ వర్తించదని,  అందుకే తనకున్న విచక్షణాధికారాతో దాన్ని మినహాయించానని డైరెక్టర్ తన చర్యని సమర్ధించుకున్నారు.
ఆ వివరణతో సంతుష్టి పడిన ఆడిట్ అధికారులు తదుపరి చర్యలను విరమించుకున్నారు.
రెండున్నర అణాల కోసం ఇంత తతంగం, లేఖాయణం నడిచింది. పులిరాజు ఆహారానికి ఖర్చు పెట్టిన దానికంటే పోస్టల్ చార్జీలు ఎక్కువై వుంటాయి.
ఇందులో ఒక నీతితో కూడిన హెచ్చరిక దాగుంది. అదేమిటంటే ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడం కుదరదు, ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి గమనించే కనిపించని కన్ను ఒకటుందని చెప్పడం. అయితే ముందే చెప్పినట్టు ప్రతి నిబంధనకు ఓ విరుగుడు కనిపెట్టడం అనేది ఈనాటి తరానికి వెన్నతో పెట్టిన విద్య.
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని వూరికే అనలేదు.
(ఇంకా వుంది)

రేడియో రోజులు – 14



(Published in SURYA daily on  Wednesday, 13-11-2019)

నలభయ్ ఏళ్ళ క్రితం  రేడియోలో  వార్తలు  చదివే  న్యూస్ రీడర్లను ఎంపిక చేసేందుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. పరీక్షలో నెగ్గినవారికి స్టూడియోలోనే కొన్ని నమూనా వార్తలు ఇచ్చి రికార్డ్ చేయించడం జరిగింది. అభ్యర్ధుల ఎంపిక కోసం వచ్చిన ఓ పెద్దమనిషి వచ్చినవాళ్ళల్లో ఓ అమ్మాయి చదివిన వార్తల రికార్డింగ్ ని పదికాలాలపాటు భద్రపరచమని సూచించారు. అంత బాగా చదివిందా అని మేము ఆశ్చర్య పోతుంటే ఆయన అసలు విషయం చల్లగా చెప్పారు. వార్తలు ఎలా చదవకూడదో అన్నదానిని బోధపరచడానికి ముందు ముందు అది  పనికొస్తుందన్నది  ఆయన తాత్పర్యం.
రేడియో వార్తలను ఏర్చి కూర్చడం ఒక వంతయితే, వాటిని చదివే తీరుతెన్నులే శ్రోతల ఆసక్తిలో హెచ్చుతగ్గులను నిర్ధారిస్తాయి.
పది  నిమిషాలేనా! ఇంకావుంటే బాగుండు అనుకోవడానికీ-
పది నిమిషాలేగా! వింటే ఓ పనయిపోతుంది అని సరిపెట్టుకోవడానికీ  ఎంతో తేడా వుంది.
సమర్దుడయిన న్యూస్ రీడర్ తనదయిన శైలితో శ్రోతలను ఆకట్టుకుంటాడు. రేడియో కట్టేయాలని కసితో వున్న శ్రోతను కూడా  రేడియోకి కట్టిపడేయగలుగుతాడు.
నోటికీ, చెవికీ మధ్యవున్నది నిజానికి బెత్తెడు దూరమే. అయితే, రాసింది చదవడానికీ, చదివేది వినడానికీ నడుమ కాసింత తేడా వచ్చినా సరే అందులోనే స్వారస్వం దెబ్బతింటుంది. ఈ చదవడం వినడం అన్న ప్రక్రియ రేడియో వార్తలకు ఎక్కువగా వర్తిస్తుంది కాబట్టి ఈ తేడాని పట్టుకోగలగడం లోనే రేడియోవారి ప్రతిభ బయట పడుతుంది. వెనుకటి తరం రేడియో న్యూస్ రీడర్లు
వార్తలను మనసు పెట్టి చదవడం వల్లనే వారి పేర్లు ఈనాటి తరానికి కూడా గుర్తుండిపోయాయి.
కాలం వేగంగా మారుతోంది. ఛానళ్లకు  వేగంగా వార్తలను అందించే క్రమంలో విలేకర్లు కూడా వార్తాప్రసారంలో తమ వంతు పాత్ర పోషించాల్సి వస్తోంది. స్టుడియోలో కూర్చుని వార్తలు చదివే వారికి దీటుగా బయటనుండి వార్తలు అందించే విలేకరులు సయితం ఎలాటి తడబాటు లేకుండా అప్పటిఅకప్పుడు తాజా వార్తని వివరించాల్సి రావడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. ఈ విషయంలో న్యూస్ రీడర్లకు కొంత  వెసులుబాటు ఉంది. ఎందుకంటె- వారు చదవాల్సిన వార్తల స్క్రిప్ట్ వారివద్దనే సిద్ధంగా వుంటుంది.  స్పాట్ నుంచి వార్తలు అందించే విలేకరి పరిస్తితి ఇందుకు భిన్నం. అంతేకాకుండా విలేకరులు వార్తలు చదవకూడదు. వార్తని చెప్పగలగాలి. పైగా అంతకుముందు పంపిన వార్తకు తాజా సమాచారాన్ని జోడించి తడుముకోకుండా చెప్పాల్సివుంటుంది. ఏకకాలంలో న్యూస్ రీడర్ పాత్రనీ, న్యూస్ రిపోర్టర్ పాత్రనీ పోషించగలగాలి. అప్పుడే వార్తలు వింటున్న శ్రోతకు కంటిన్యుటీ వున్న భావన కలుగుతుంది.
వార్తలు పంపేటప్పుడు, ముఖ్యంగా రేడియోకి,  విలేకరులు మూడింటిని -   సూటిగా, స్పష్టంగా, సరళంగా అనే పదాలు గుర్తుంచుకోవాలి. అంటే చెప్పదలచుకున్న వార్త, డొంకతిరుగుడులు లేకుండా  సూటిగా వుండాలి. స్పష్టంగా చెప్పడం వల్ల వార్త లోని నిబద్ధత పెరుగుతుంది. సామాన్య శ్రోతకు సయితం అర్ధం అవడానికి సరళత తోడ్పడుతుంది. వీటికి తోడు సాధికారత తోడయితే ఆ వార్తకు ఇక అడ్డే వుండదు.
అలాగే, విలేకరులు ఏదైనా వార్త ఇచ్చేముందు నిర్ధారణ చేసుకోవడం అనేది ప్రాధమిక సూత్రం. అలాటి అవకాశాలు ఈనాటి పాత్రికేయులకు లేవనుకోవాలా?
చాలా ఏళ్ళ క్రితం సంగతి. ఏదో కేసు విషయంలో హైకోర్టు జడ్జి పలానా తీర్పు ఇచ్చారని పీటీఐ వార్తా సంస్థ భోగట్టా. ఇలాటి అంశాలను నిర్ధారించుకోకుండా రేడియో వార్తల్లో చెప్పే వీలు లేదు. సాయంత్రం వార్తల ప్రసార సమయం దగ్గర పడుతోంది. తీర్పు ఇచ్చిన జడ్జి గారు ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడన్నీ ల్యాండ్ లైన్లు. ఫోన్ చేస్తే, జడ్జి గారు బంగ్లా లాన్ లో కూర్చుని టీ తాగుతున్నారని సమాచారం. ఫోను తీసుకుని వెళ్లి ఇవ్వడం కుదురుతుందా అని అనుమానంగానే అడిగాను. ఏ కళన ఉన్నాడో కాని బంట్రోతు ఫోను జడ్జి గారికి ఇచ్చాడు. ఫోన్లో మాటలు వినపడుతున్నాయి. ఎవరది అని జడ్జి గారు అడుగుతున్నారు. రేడియో నుంచి అనగానే లైన్లోకి వచ్చారు. నేను తీర్పు విషయం అడగగానే ఆయన కొంత అసహనానికి గురయ్యారు. అది సహజం కూడా. ఒక న్యాయమూర్తిని ఇలా డిస్టర్బు చేయడం నేరమని తెలుసాఅంటున్నారు. నేనన్నాను. తెలియదు. కానీ ఇటువంటి వార్తను నిర్ధారించుకోకుండా ప్రసారం చేయడం మాత్రం నేరం’. ఈ జవాబుతో ఆయన మెత్తపడి నేను కోరిన వివరణ ఇచ్చారు. అది వార్తా సంస్థ ఇచ్చిన సమాచారానికి  అనుగుణంగానే వుంది. అయినా కొన్ని సంచలన నిర్ణయాలను ప్రసారం చేసేముందు నిజాన్ని నిర్దారించుకోవడం  నా విధి. అది నేను పాటించాను.  తప్పిస్తే ఆ వార్తాసంస్థ నిబద్ధతను అనుమానించడానికో, మరో దానికో మాత్రం కాదు.
ఇలా  ఉండేవి ఆ రోజులు. నిజంగా  ఆ రోజులే వేరు.
(ఇంకా వుంది)

12, నవంబర్ 2019, మంగళవారం

రేడియో రోజులు -13


(Published in SURYA telugu daily on 12-11-2019, tuesday)

రేడియో విలేకరిని కావడం వల్ల ఒక ప్రధానమంత్రితో  ఒకే జీపులో కలిసి ప్రయాణం చేసే అవకాశం నాకు లభించింది. నాకంటే కూడా అదృష్ట వంతుడు ఆ జీపు డ్రైవర్. ఎందుకంటే ప్రధానమంత్రి రాజీవ్ గాంధి ఆ డ్రైవర్ పక్క సీట్లోనే కూర్చుని ఆ అడవి బాటలో ఎలా ఒక పల్లెకు  వెళ్ళాలో అతడికి చెబుతున్నాడు. నమ్మ శక్యం కాదనిపించే ఈ అనుభవం నాకు లభించింది.
అసలు విషయానికి వస్తాను. గోదావరికి వరదలు వచ్చాయి. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాజీవ్ ప్రధాని. రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎన్టీఆర్. వరద నష్టం పరిశీలించడానికి ప్రధానమంత్రే స్వయంగా వచ్చారు. దాంతో సహజంగానే రాజకీయ వేడి రగులుకుంది.

హెలికాఫ్టర్ లో భద్రాచలం చేరుకున్న రాజీవ్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ కార్యక్రమాలను వివరించే ఫోటో ప్రదర్శనని తిలకించిన అనంతరం - అనేక వాహనాలతో కూడిన ప్రధాన మంత్రి బృందం రోడ్డు మార్గంలో వరద తాకిడికి గురయిన ప్రాంతాలను చూసేందుకు బయలుదేరింది. ప్రధాని వెంట ముఖ్య మంత్రి రామారావు గారు, మాజీ ముఖ్య మంత్రి, అప్పటి కేంద్ర మంత్రి జలగం వెంగళరావు గారు అధికారులు, అనధికారులు అంతా వున్నారు. ఆ రోజుల్లో రేడియో విలేకరికి కొద్దో గొప్పో ప్రాధాన్యత వుండడం మూలాన హైదరాబాదు నుంచి వెళ్ళిన నాకు కూడా ప్రధాని కాన్వాయిలో ఒక జీపు కేటాయించారు. అప్పట్లో ఇప్పటిలా ఇన్ని టీవీ ఛానళ్ళు లేవు. టేపు రికార్డర్ చేతబట్టుకుని వీ ఐ పీ ల వెంట తిరగగలిగే వెసులుబాటు వుండేది. భద్రాచలం నుంచి చింతూరు వరకు రోడ్డుమార్గంలో వెళ్లి రావాలన్నది అధికారుల ప్లాను. మార్గమధ్యంలో రాజీవ్ గాంధీ అనేక చోట్ల వాహనాన్ని నిలిపి రోడ్డు దిగి కాలినడకన ఇసుక మేట వేసిన పొలాలలోకి వెళ్లి  రైతులతో, కూలీలతో మాటా మంతీ కలిపేరు. కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంతరావు ప్రజలకు, ప్రధానికి నడుమ దుబాసీగా వ్యవహరించారు. ఇలా అనేక చోట్ల కాన్వాయి ఆపడం,  చాలాదూరం నడుచుకుంటూ వెళ్లి స్తానికులతో మాట్లాడడం , ఇదంతా యువకుడయిన రాజీవ్ గాంధీకి ఏమాత్రం అలసట కలిగించలేదు కానీ ఆ ఎర్రటి ఎండలో ఎగుడు దిగుడు పొలాల్లో వేగంగా అడుగులువేస్తూ వెడుతున్న రాజీవ్ గాంధీతో పాటు సమానంగా నడవడానికి మిగిలిన నాయకులు నానా హైరానా పడ్డారు. ఈ విధంగా సాగిపోతున్న ప్రధాని పర్యటన అనుకోని మలుపు తిరిగింది.
మరి కాసేపటిలో చింతూరు చేరతామనగా ఓ మలుపు దగ్గర రాజీవ్ గాంధీ వాహనం ఆపించారు. ఆ మలుపులో రోడ్డుకు ఎడమవయిపున దిగువగా అడవిలోకి వెళ్ళే ఓ బాట వుంది.
రాజీవ్ గాంధీ ఆయన కారు దిగి జేబులోనుంచి ఓ మ్యాప్ తీసి చూసుకుంటూ అడవి బాట పట్టారు. ఆ వెనుకే రామారావు గారు, వెంగళరావు గారు, ఒకరిద్దరు భద్రతాధికారులు, నేనూ, నామాదిరిగానే హైదరాబాదు నుంచి వచ్చిన పత్రికా విలేకరి సురేందర్(ప్రెస్ అకాడమీ మాజీ  చైర్మన్ ) - అంతా ఆయన్ని అనుసరించాము. రాజీవ్ గాంధీ పదే పదే రోడ్డు దిగిపోయి పొలాలవెంట తిరిగిరావడం గమనిస్తూ వచ్చిన పోలీసులూ, ఇతర అధికారులూ రోడ్డు మీదే వుండిపోయారు.

ఆ అడవి బాటలో కొద్ది దూరం వెళ్ళిన తరవాత,  'ఇక్కడికి దగ్గరలో పలానా పల్లెటూరు వుండాలి కదా' అని అడిగారు రాజీవ్ గాంధీ మరో సారి మ్యాప్ కేసి చూస్తూ. ఖమ్మం జిల్లా ఆనుపానులన్నీ తెలిసిన వెంగళరావు గారికి కూడా ఈ గ్రామం గురించి తెలిసినట్టు లేదు. 'పదండి పోదాం' అంటూ రాజీవ్ కదిలారు. దూరంగా రోడ్డుపై జీపు ఆపుకుని వున్న డ్రైవర్ - మేము ముందుకు కదలడం చూసి రివ్వున జీపు స్టార్ట్ చేసి మా దగ్గరకు వచ్చాడు. మ్యాప్ చూస్తున్న రాజీవ్ గాంధీ గభాలున ఆ జీపులో ఎక్కి కూర్చున్నారు. దాంతో, రామారావు గారు, వెంగళరావు గారు, సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎక్కేసారు. నేనూ సురేందర్ పరిగెత్తుకుని వెళ్లి జీపు వెనుక డోరు కడ్డీపై చతికిలపడ్డాము- సెక్యూరిటీ వాళ్ళు వద్దని వారిస్తున్నా వినకుండా. జీపు కదిలింది. డ్రైవర్ పక్కన ముందు సీట్లో రాజీవ్ గాంధీ, ఆయన వెనుక వెంగళరావుగారు, డ్రైవర్ వెనుక సీట్లో రామారావు గారు , సెక్యూరిటీ వాళ్ళు, నేనూ, సురేందర్- అంత చిన్న జీపులో ఎలా ఇరుక్కుని వెళ్ళామో ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. రాజీవ్ గాంధీ రాజకీయాలలోకి రాకముందు విమానాలు నడిపే పైలట్ గా పనిచేసారు. ఆకాశంలో కొన్ని వేల అడుగుల ఎత్తున విమానం నడుపుతూ, రాడార్ సాయంతో దిగాల్సిన ప్రదేశాన్ని గుర్తించి, నడి రాత్రయినా, పట్టపగలయినా రన్ వేపై ఖచ్చితంగా దించగలిగిన అనుభవం ఆయనకు వుంది. ఎక్కడో భద్రాచలం దగ్గర మారుమూల అరణ్య ప్రాంతంలో మ్యాప్ చూసి గ్రామాలను గుర్తించగలిగిన దక్షతను ఆ అనుభవమే ఆయనకు నేర్పి వుంటుంది.
అడవి గాలికి జీపుకు వేళ్ళాడుతున్న పాత టార్పాలిన్ పట్టాలు టపటపా కొట్టుకుంటున్నాయి. నిటారుగా పెరిగిన చెట్ల కొమ్మలు రాపాడుకుంటూ చప్పుడు చేస్తున్నాయి. నక్సల్స్ సంచరించే ప్రాంతాలలో కొత్త వ్యక్తుల రాక గురించి వారికి తెలియచెయ్యడానికి వారి సానుభూతిపరులు చెట్ల కొమ్మలను ఒకదానికి మరొకటి తాటించి చప్పుడు చెయ్యడం ద్వారా సంకేతాలు పంపుతారని చెప్పుకునేవాళ్ళు. నక్సల్స్ కు పట్టు వున్న అడవుల్లో ఇలా సంచరించడం క్షేమం కాకపోయినా,  రాజీవ్ గాంధీ మాత్రం ముందుకే పోవాల్సిందని డ్రైవర్ కు సైగ చేశారు. తన పక్కన కూర్చుని సూచనలిస్తున్నది సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి అన్న విషయం తెలిసికూడా అతడు మాత్రం ఏమాత్రం తొట్రుపడకుండా,  నిబ్బరం కోల్పోకుండా,  సుశిక్షితుడయిన సైనికుడి మాదిరిగా జీపు నడపడం చూసి నివ్వెరపోవడం మా వంతయింది.

రాజీవ్ ఊహించినట్టుగానే దగ్గరలోనే ఆ లంబాడాగూడెం తారసపడింది. తీరా చూస్తె పట్టుమని పది పూరిళ్లు కూడా లేవు. రాజీవ్ గాంధీ ఎలాంటి భేషజం లేకుండా ఓ చుట్టు  గుడిసె లోకి వెళ్లి ఆ పేద కుటుంబం స్తితిగతులను ఆరా తీసారు. ఓ మూలన మూడు రాళ్ళ పొయ్యిపై వున్న మూకుడు మీద మూత తీసి,  అన్నం మెతుకులను పట్టి చూసి,  ఆ పేదరాలి భుజంపై చేయి వేసి,  సాయం చేయడానికి సర్కారు ఉన్నదన్న భరోసా కలిగించారు. ఆ మిట్టమధ్యాన్నం వేళ తమ ఇంటికి వచ్చిన అనుకోని అతిధి,  దేశ ప్రధాని అన్న సంగతి ఆమెకు తెలుసో లేదో! ఇప్పటి ప్రచార యుగంలో ఈ సంఘటన జరిగి ఉన్నట్టయితే ఎంతటి ప్రాచుర్యం లభించి ఉండేదో!
తర్వాత షరా మామూలే.  రాజీవ్ గాంధీ మళ్ళీ మ్యాప్ సాయంతోనే మమ్మల్నందర్నీ చేరాల్సిన చోటికి చేర్చారు.
ఒక ప్రధాని, ఒక ముఖ్య మంత్రి,  ఒక మాజీ ముఖ్యమంత్రి వెంట ఖమ్మం జిల్లా అడవుల్లో కలిసి తిరిగిన విశేషాలను మర్నాటి ఉదయం రేడియో వార్తల ద్వారా బయటి ప్రపంచానికి తెలియచెప్పడానికి,  మట్టికొట్టుకుపోయిన దుస్తులతో తెల్లారేసరికల్లా భద్రా
చలం చేరడం అదో కధ. (ఇంకా వుంది)

10, నవంబర్ 2019, ఆదివారం

రేడియో రోజులు – 12 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA telugu daily on 10-11-2019, SUNDAY)

1984 సెప్టెంబర్ 16 మధ్యాహ్నం ఒంటి గంటా ఇరవై నిమిషాలకు విజయవాడ రేడియో కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు మొదలయ్యాయి. కొద్దిసేపు గడిచిందో లేదో వార్తలు చదివే వ్యక్తి "ఇప్పుడే అందిన వార్త" అంటూ ఒక సంచలన వార్తను వినిపించారు.
"గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు సమర్పించిన రాజీనామాను ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ ఎన్టీ రామారావును ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా ఆహ్వానించారు" ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం సాధించిన విజయ సమాచారం ఆనాటి రేడియో వార్త ద్వారా రాష్ట్రం నలుమూలలకు చేరిపోయింది. ఆరోజు హైదరాబాదు రాజభవన్ సెంట్రీ రూములోని ఫోనుద్వారా బెజవాడ రేడియో కేంద్రానికి ఈ వార్తను అందించింది నేనే. ఆ రోజు నావెంట నేటి తెలంగాణా సిఎం, సీపీఆర్వో శ్రీ జ్వాలా నరసింహారావు కూడా వున్నారు.

అలాగే మరో జ్ఞాపకం.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉద్యమం సాగుతున్నరోజులు. ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును అధికారం నుంచి అక్రమంగా తొలగించారని, ఆయన్ని వెంటనే తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ ఆ ఉద్యమం మొదలయింది.
ఎన్టీఆర్ ని సమర్ధిస్తున్న టీడీపీ సభ్యులతోపాటు మిత్ర పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా హైదరాబాదు, ముషీరాబాద్ లోని రామకృష్ణా స్టుడియోలో బస చేస్తున్నారు. అందులోకి పోవాలన్నా, బయటకి రావాలన్నా బోలెడన్ని ఆంక్షలు ఉండేవి. అయితే విలేకరులు మాత్రం తమ గుర్తింపు కార్డులు చూపించి వెళ్ళే వెసులుబాటు వుండేది. ఇక రేడియో విలేకరిగా నేను దాదాపు ప్రతిరోజూ వెళ్లి వస్తుండేవాడిని.
ఒకరోజు నాతోపాటు మిత్రుడు జ్వాలా నరసింహారావు, మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు కూడా వచ్చారు.
లోపలకు వెళ్ళాము. స్టూడియో అంతా సందడిగా వుంది. ఎమ్మెల్యేలు పేపర్లు చదువుతూ, పచార్లు చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు. చంద్రబాబునాయుడు కూడా హడావిడిగా తిరుగుతూ పైనుంచి అన్నీ కనుక్కుంటూ వున్నారు. ఆయన్ని పలకరించి, ఖమ్మం సీపీఎం  ఎమ్మెల్యే మంచికంటి రాంకిషన్ రావు గారి వద్దకు వెళ్ళాము. మాకు బంధువు కూడా.  ఆయన కాస్త దిగులుగా కనిపించారు. భార్యకు ఒంట్లో నలతగా వున్నట్టు ఇంటి నుంచి కబురు వచ్చినట్టు వుంది.
ఆయన మాతో చెప్పారు.
“రామారావు గారితో విషయం చెప్పి ఓ రెండు రోజులు ఖమ్మం వెళ్లి వద్దామని వారి దగ్గరకు వెళ్లాను. మా ఆవిడ సుస్తీ సంగతి చెప్పాను. ఆయన ఇలా అన్నారు. ‘రాం కిషన్ రావు గారు,  మీరు పెద్దవారు. మీకు చెప్పదగిన వాడిని కాను. కానీ నా విషయం తీసుకోండి. మా ఆవిడ (శ్రీమతి బసవ తారకం) మద్రాసు కేన్సర్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య వుంది. అయినా నేను వెళ్ళలేని పరిస్తితి. పెద్ద మనసుతో కాస్త  అర్ధం చేసుకోండి’ అని ఆ పెద్దమనిషి అంటుంటే ఇక నేనేమి మాట్లాడను?”

గండిపేటలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతోంది. నేను గోడకు ఆనుకుని  నిలబడి వున్నాను. మరి కొద్ది నిమిషాల్లో సాయంత్రం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. నాకు టెన్షన్ పెరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ప్రసంగం అనర్ఘలంగా సాగుతోంది. పార్టీ  ప్రధాన కార్యదర్శి ఎవరన్నది  ఆరోజు  ప్రకటిస్తారు. సాయంత్రం వార్తల సమయం అయిపోయిందంటే ఇక  మరునాడు  ఉదయం విజయవాడ నుంచి వెలువడే వార్తల వరకు వేచి వుండాలి. పత్రికలు కూడా తెల్లవారినదాకా రావు. అందుకే రేడియో వార్తలకు, ముఖ్యంగా ‘ఇప్పుడే అందిన వార్తలకు’ అంత గిరాకీ.   ఆ రోజుల్లో గండిపేట నుంచి హైదరాబాదుకు డైరెక్టు టెలిఫోను సదుపాయం లేదు. ట్రంకాల్ బుక్ చేయాలి. అంత  వ్యవధానం లేదు. నేను నిలబడ్డ కాంపౌండ్ వాల్ వెనుక ఎన్టీఆర్ కుటీరం వుంది. ముఖ్యమంత్రి కాబట్టి  అందులో ఎస్టీడీ  సౌకర్యం వున్న ఫోను ఏర్పాటు చేసారు. అది ముందుగానే తెలుసుకుని, విలేకరుల వరుసలో కాకుండా ఆ గోడ దగ్గర కాచుకుని వున్నాను. ఇంతలో ఎన్టీఆర్ నోటినుంచి ‘మన పార్టీ ప్రధాన కార్యదర్శిగా చం.....’  అనే మాట వినబడింది.  అంతే! నేను ఒక్క క్షణం వృధా చేయకుండా ఆ గోడ దూకేసాను. సెంట్రీ ఎవరు ఎవరని వెంటపడ్డాడు. లెక్కచేయకుండా లోపలకు దూరి వెళ్లి ఫోను తీసుకుని రేడియోకు ఫోను చేసాను. అవతల మా న్యూస్ ఎడిటర్ ఆకిరి రామకృష్ణా రావు, నా గొంతు విని ‘ఎవరు?’ అని క్లుప్తంగా అడిగారు. నేను ‘చంద్రబాబు’ అని అంతే క్లుప్తంగా వగరుస్తూ చెప్పాను. మరునిమిషంలో టీడీపీ నూతన  ప్రధాన కార్యదర్శిగా శ్రీ చంద్రబాబునాయుడ్ని నియమించిన సమాచారం, ‘ఇప్పుడే అందిన వార్తగా’ రాష్ట్రం నలుచెరగులకూ రేడియో ద్వారా చేరిపోయింది.
ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకమునుపే జగత్ ప్రసిద్ధ తెలుగు సినీ నటుడు. మద్రాసులోని ఆయన ఇంటి ముందు ప్రతి ఉదయం రెండు మూడు టూరిస్టు బస్సులు నిలిపివుండేవి. ఆయన అలా బయటకు వచ్చి మేడమీది వరండాలో నిలబడగానే అప్పటి వరకు ఆయనకోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆనందానికి అలవి వుండేది కాదు. అదృష్టవశాత్తు దర్శన భాగ్యం లభించిన వాళ్ళు ఆయన కాళ్ళకు సాష్టాంగనమస్కారం చేసేవాళ్ళు. ఆయనకు ఓ అలవాటు ఉండేదని చెప్పుకునేవారు,  కాళ్ళమీద మీద పడిన వాళ్ళు తమంతట తాము లేవాలే కానీ ఆయన  లెమ్మని చెప్పేవాళ్ళు కాదని. పైగా కాళ్ళ మీద పడుతున్నవారిని వారించేవారు కాదు.
తెలుగు దేశం పార్టీ పెట్టి, తొలి ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి, అఖండ విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఈ పాద నమస్కారాల ప్రహసనం కొనసాగింది. తెలుగుదేశం పార్టీలో మహిళా నాయకురాళ్ళు పదిమంది  చూస్తున్నారని కూడా చూడకుండా బహిరంగంగానే ఆయనకు పాద నమస్కారాలు చేసేవాళ్ళు. ఇది ఎంతవరకు ముదిరింది అంటే బేగం పేట విమానాశ్రయంలో ఎన్టీఆర్ విమానం దిగివస్తున్నప్పుడు టార్ మాక్ మీదనే వాళ్ళు పోటీలు పడి ఆయన  కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుని మరీ పాద నమస్కారాలు చేయడం ఆ రోజుల్లో ఒక సంచలన వార్తగా మారింది. అది  ఇంతింతై, అంతింతై దేశం నలుమూలలకు పాకింది.
ఢిల్లీ నుంచి ఇల్లస్ట్రెటెడ్  వీక్లీ ఆఫ్ ఇండియా విలేకరి ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేయడానికి హైదరాబాదు వచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి ప్రధాన పౌరసంబంధాల అధికారిగా మా పెద్దన్నయ్య, కీర్తిశేషులు భండారు పర్వతాల రావు పనిచేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన విలేకరికి తెల్లవారుఝామున నాలుగు గంటలకు టైం ఇచ్చారు. కొద్ది ముందుగానే ఆ విలేకరి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. సరిగ్గా ఇచ్చిన టైముకల్లా,  కిర్రు చెప్పులు చప్పుడు చేస్తుండగా ఎన్టీఆర్ కిందికి దిగివచ్చారు. ఢిల్లీ విలేకరి కుర్చీ నుంచి లేచి ఎన్టీఆర్  పాదాలకు సాష్టాంగనమస్కారం చేసారు. చేసిన మనిషి లేవకుండా అలాగే కాసేపు వుండిపోయారు. కొద్ది సేపటి తర్వాత లేచి కూర్చుని  ‘నేను విన్నది నిజమే!’ అని అంటూ ఇంటర్వ్యూ ప్రారంభించారు.
ప్రశ్నోత్తరాల కార్యక్రమం యధావిధిగా కొనసాగింది. అది వేరే సంగతి.
కొసమెరుపు ఏమిటంటే తరువాత చాలా రోజులకు ఆ పత్రిక ప్రచురించిన కధనం, ఈ పాద నమస్కారం ప్రహసనంతోనే మొదలవుతుంది.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన గండిపేట నివాసంలో ‘శవపూజలు’ చేస్తున్నారన్న వదంతులు వ్యాపించాయి. వాటిని తిప్పి కొట్టడానికి హైదరాబాదు నుంచి కొందరు విలేకరులను (అప్పుడు గండిపేట దూరమే అనిపించేలా వుండేది) అక్కడికి తీసుకు వెళ్ళారు. రామారావు గారు స్వయంగా విలేకరులను వెంటబెట్టుకుని ఆశ్రమంలో ఆణువణువూ చూపించారు. ఆ సందర్భంలో నేను అడిగితే రెడియోకోసం కాసేపు మాట్లాడారు. ఆశ్రమం వెలుపల ఒక చప్టా లాంటి దానిమీద ఎన్టీఆర్ బాసింపట్టు వేసుకు కూర్చున్నారు. ఆయన ముందు టేప్ రికార్డర్ వుంచి నేను పక్కగా ఆ చప్టా మీదనే కూర్చున్నాను. ఈ సన్నివేశాన్ని మిత్రుడు జీఎస్ రాధాకృష్ణ (అప్పుడు ‘వీక్’ ఇంగ్లీష్ వార పత్రిక కరస్పాండెంటు) ఫోటో తీసి ఇచ్చాడు. నేను మాస్కో వెళ్లి వచ్చేవరకు అది భద్రంగానే వుంది. కానీ ఆ తరవాత అనేక అద్దె ఇళ్ళు మారే క్రమంలో ఆ విలువైన ఫోటో పోగొట్టుకున్నాను.
ఇక రేడియోకి, రామారావు గారికీ నడుమ సాగిన ఒక వివాదం చెప్పి ముగిస్తాను.
ముప్పయి అయిదేళ్ళ క్రితంసంగతి
టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల దరిమిలా రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వ పాలన మొదలయింది. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో వుండడంతో రాజకీయ క్రీనీడలు అన్ని వ్యవస్థల్లో మాదిరిగానే రేడియో, దూరదర్శన్ ల మీద కూడా పడ్డాయి. ఆ రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని అనావృష్టి ప్రాంతాల్లో పర్యటించి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు, ప్రెస్ మీట్ పెట్టి రేడియో, దూరదర్శన్ లకు కూడా కబురు పంపారు. కరవు ప్రాంతాలలో ప్రభుత్వం తీసుకునే చర్యలు గురించి ముఖ్యమంత్రి ప్రసంగ పాఠాన్ని రికార్డ్ చేసి సందేశం రూపంలో ప్రసారం చేయాలని కోరారు.
ఆబిడ్స్ లోని ముఖ్యమంత్రి నివాసాన్ని చేరుకున్న మా సిబ్బంది రికార్డింగ్ పరికరాలను సిద్ధం చేసుకున్నారు. కొద్దిసేపటికి ఎన్టీఆర్ కిర్రు చెప్పులు చప్పుడు చేసుకుంటూ మెట్లు దిగివచ్చారు. ముఖ్యమంత్రి  ప్రధాన పౌర సంబంధ అధికారిగా పనిచేస్తున్న మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు తయారు చేసిన సందేశం ప్రతిని ఆమూలాగ్రం ఓ మారు తిరగేసి, తాము సిద్ధం అన్నట్టు తలపంకించారు. రికార్డింగు మొదలయింది.
"ప్రియమైన రాష్ట్ర ప్రజలారా!..." అని ప్రసంగం ప్రారంభించారు. అదే స్పీడులో కొనసాగుతుందని అంతా అనుకున్నాం. కానీ ఆయన హఠాత్తుగా ఆపి, 'కట్ వన్ - టేక్ టు' అన్నారు. మా వాళ్ళు రికార్డింగు ఆపేశారు. వందల సినిమాల్లో అనర్ఘళంగా డైలాగులు చెప్పిన అనుభవం ఆయనది. ఏ పదాన్ని ఎక్కడ వొత్తి పలకాలో, ఏ వాక్యాన్ని ఎక్కడ విరిచి చెప్పాలో ఆయనకు కొట్టిన పిండి. కానీ, ఇక్కడే ఎదురయింది మాకు వూహించని, ఆ మాటకు వస్తే అంతవరకూ అనుభవంలో లేని ఇబ్బంది. ఈ కట్లు, టేకుల విషయం తెలియకుండా రికార్దింగుకు రావడం వల్ల, తెచ్చిన టేపులు సరిపోలేదు. ఆఘమేఘాల మీద పంపించి స్టూడియో నుంచి అదనపు టేపులు తెప్పించి రికార్డింగు ముగించామనిపించారు.
అసలు కధ స్టూడియోకు చేరిన తర్వాత మొదలయింది. ఏ టేపు విన్నా కట్లూ, టేకులూ అన్న రామారావుగారి స్వరమే. ఆరాత్రే ప్రసారం కావాల్సి వుండడంతో సిబ్బంది అంతా టెన్షన్ కు గురయ్యారు. సీ ఎం గారి మొదటి ప్రసంగం కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ కమీషనర్ (పూర్వాశ్రమంలో తపాలా శాఖ డైరెక్టర్) సైదులు గారు, డైరెక్టర్ సీ,వీ, నరసింహారెడ్డి గారు అంతసేపూ మాతోపాటే రేడియో డబ్బింగు గదిలోనే వుండిపోయారు. కట్లూ టేకుల మధ్య వున్న ముఖ్యమంత్రిగారి సందేశాన్ని మా వాళ్లు కష్టపడి మాస్టర్ టేపు మీదకు ఎక్కించి డబ్బింగు పని పూర్తి చేసి ప్రసారం నిమిత్తం అనౌన్సర్ కి అప్పగించి వూపిరి పీల్చుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, డబ్బింగు పూర్తయిన తరువాత చూసుకుంటే మాకెంత నిడివి అవసరమో ముఖ్యమంత్రి సందేశం అంతే వ్యవధికి అతికినట్టు ఖచ్చితంగా సరిపోయింది.
దటీజ్ ఎన్టీఆర్.
అయితే ఈ ఉదంతం ఎంతగా చిలవలు పలవలు వేసిందంటే ఒక దశలో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన వివాద స్థాయికి చేరుకుని ఆ పిదప అలాగే చల్లారిపోయింది.
(ఇంకా వుంది)