చంద్రబాబునాయుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చంద్రబాబునాయుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, నవంబర్ 2019, ఆదివారం

రేడియో రోజులు – 12 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA telugu daily on 10-11-2019, SUNDAY)

1984 సెప్టెంబర్ 16 మధ్యాహ్నం ఒంటి గంటా ఇరవై నిమిషాలకు విజయవాడ రేడియో కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు మొదలయ్యాయి. కొద్దిసేపు గడిచిందో లేదో వార్తలు చదివే వ్యక్తి "ఇప్పుడే అందిన వార్త" అంటూ ఒక సంచలన వార్తను వినిపించారు.
"గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు సమర్పించిన రాజీనామాను ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ ఎన్టీ రామారావును ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా ఆహ్వానించారు" ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం సాధించిన విజయ సమాచారం ఆనాటి రేడియో వార్త ద్వారా రాష్ట్రం నలుమూలలకు చేరిపోయింది. ఆరోజు హైదరాబాదు రాజభవన్ సెంట్రీ రూములోని ఫోనుద్వారా బెజవాడ రేడియో కేంద్రానికి ఈ వార్తను అందించింది నేనే. ఆ రోజు నావెంట నేటి తెలంగాణా సిఎం, సీపీఆర్వో శ్రీ జ్వాలా నరసింహారావు కూడా వున్నారు.

అలాగే మరో జ్ఞాపకం.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉద్యమం సాగుతున్నరోజులు. ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును అధికారం నుంచి అక్రమంగా తొలగించారని, ఆయన్ని వెంటనే తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ ఆ ఉద్యమం మొదలయింది.
ఎన్టీఆర్ ని సమర్ధిస్తున్న టీడీపీ సభ్యులతోపాటు మిత్ర పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా హైదరాబాదు, ముషీరాబాద్ లోని రామకృష్ణా స్టుడియోలో బస చేస్తున్నారు. అందులోకి పోవాలన్నా, బయటకి రావాలన్నా బోలెడన్ని ఆంక్షలు ఉండేవి. అయితే విలేకరులు మాత్రం తమ గుర్తింపు కార్డులు చూపించి వెళ్ళే వెసులుబాటు వుండేది. ఇక రేడియో విలేకరిగా నేను దాదాపు ప్రతిరోజూ వెళ్లి వస్తుండేవాడిని.
ఒకరోజు నాతోపాటు మిత్రుడు జ్వాలా నరసింహారావు, మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు కూడా వచ్చారు.
లోపలకు వెళ్ళాము. స్టూడియో అంతా సందడిగా వుంది. ఎమ్మెల్యేలు పేపర్లు చదువుతూ, పచార్లు చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు. చంద్రబాబునాయుడు కూడా హడావిడిగా తిరుగుతూ పైనుంచి అన్నీ కనుక్కుంటూ వున్నారు. ఆయన్ని పలకరించి, ఖమ్మం సీపీఎం  ఎమ్మెల్యే మంచికంటి రాంకిషన్ రావు గారి వద్దకు వెళ్ళాము. మాకు బంధువు కూడా.  ఆయన కాస్త దిగులుగా కనిపించారు. భార్యకు ఒంట్లో నలతగా వున్నట్టు ఇంటి నుంచి కబురు వచ్చినట్టు వుంది.
ఆయన మాతో చెప్పారు.
“రామారావు గారితో విషయం చెప్పి ఓ రెండు రోజులు ఖమ్మం వెళ్లి వద్దామని వారి దగ్గరకు వెళ్లాను. మా ఆవిడ సుస్తీ సంగతి చెప్పాను. ఆయన ఇలా అన్నారు. ‘రాం కిషన్ రావు గారు,  మీరు పెద్దవారు. మీకు చెప్పదగిన వాడిని కాను. కానీ నా విషయం తీసుకోండి. మా ఆవిడ (శ్రీమతి బసవ తారకం) మద్రాసు కేన్సర్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య వుంది. అయినా నేను వెళ్ళలేని పరిస్తితి. పెద్ద మనసుతో కాస్త  అర్ధం చేసుకోండి’ అని ఆ పెద్దమనిషి అంటుంటే ఇక నేనేమి మాట్లాడను?”

గండిపేటలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతోంది. నేను గోడకు ఆనుకుని  నిలబడి వున్నాను. మరి కొద్ది నిమిషాల్లో సాయంత్రం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. నాకు టెన్షన్ పెరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ప్రసంగం అనర్ఘలంగా సాగుతోంది. పార్టీ  ప్రధాన కార్యదర్శి ఎవరన్నది  ఆరోజు  ప్రకటిస్తారు. సాయంత్రం వార్తల సమయం అయిపోయిందంటే ఇక  మరునాడు  ఉదయం విజయవాడ నుంచి వెలువడే వార్తల వరకు వేచి వుండాలి. పత్రికలు కూడా తెల్లవారినదాకా రావు. అందుకే రేడియో వార్తలకు, ముఖ్యంగా ‘ఇప్పుడే అందిన వార్తలకు’ అంత గిరాకీ.   ఆ రోజుల్లో గండిపేట నుంచి హైదరాబాదుకు డైరెక్టు టెలిఫోను సదుపాయం లేదు. ట్రంకాల్ బుక్ చేయాలి. అంత  వ్యవధానం లేదు. నేను నిలబడ్డ కాంపౌండ్ వాల్ వెనుక ఎన్టీఆర్ కుటీరం వుంది. ముఖ్యమంత్రి కాబట్టి  అందులో ఎస్టీడీ  సౌకర్యం వున్న ఫోను ఏర్పాటు చేసారు. అది ముందుగానే తెలుసుకుని, విలేకరుల వరుసలో కాకుండా ఆ గోడ దగ్గర కాచుకుని వున్నాను. ఇంతలో ఎన్టీఆర్ నోటినుంచి ‘మన పార్టీ ప్రధాన కార్యదర్శిగా చం.....’  అనే మాట వినబడింది.  అంతే! నేను ఒక్క క్షణం వృధా చేయకుండా ఆ గోడ దూకేసాను. సెంట్రీ ఎవరు ఎవరని వెంటపడ్డాడు. లెక్కచేయకుండా లోపలకు దూరి వెళ్లి ఫోను తీసుకుని రేడియోకు ఫోను చేసాను. అవతల మా న్యూస్ ఎడిటర్ ఆకిరి రామకృష్ణా రావు, నా గొంతు విని ‘ఎవరు?’ అని క్లుప్తంగా అడిగారు. నేను ‘చంద్రబాబు’ అని అంతే క్లుప్తంగా వగరుస్తూ చెప్పాను. మరునిమిషంలో టీడీపీ నూతన  ప్రధాన కార్యదర్శిగా శ్రీ చంద్రబాబునాయుడ్ని నియమించిన సమాచారం, ‘ఇప్పుడే అందిన వార్తగా’ రాష్ట్రం నలుచెరగులకూ రేడియో ద్వారా చేరిపోయింది.
ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకమునుపే జగత్ ప్రసిద్ధ తెలుగు సినీ నటుడు. మద్రాసులోని ఆయన ఇంటి ముందు ప్రతి ఉదయం రెండు మూడు టూరిస్టు బస్సులు నిలిపివుండేవి. ఆయన అలా బయటకు వచ్చి మేడమీది వరండాలో నిలబడగానే అప్పటి వరకు ఆయనకోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆనందానికి అలవి వుండేది కాదు. అదృష్టవశాత్తు దర్శన భాగ్యం లభించిన వాళ్ళు ఆయన కాళ్ళకు సాష్టాంగనమస్కారం చేసేవాళ్ళు. ఆయనకు ఓ అలవాటు ఉండేదని చెప్పుకునేవారు,  కాళ్ళమీద మీద పడిన వాళ్ళు తమంతట తాము లేవాలే కానీ ఆయన  లెమ్మని చెప్పేవాళ్ళు కాదని. పైగా కాళ్ళ మీద పడుతున్నవారిని వారించేవారు కాదు.
తెలుగు దేశం పార్టీ పెట్టి, తొలి ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి, అఖండ విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఈ పాద నమస్కారాల ప్రహసనం కొనసాగింది. తెలుగుదేశం పార్టీలో మహిళా నాయకురాళ్ళు పదిమంది  చూస్తున్నారని కూడా చూడకుండా బహిరంగంగానే ఆయనకు పాద నమస్కారాలు చేసేవాళ్ళు. ఇది ఎంతవరకు ముదిరింది అంటే బేగం పేట విమానాశ్రయంలో ఎన్టీఆర్ విమానం దిగివస్తున్నప్పుడు టార్ మాక్ మీదనే వాళ్ళు పోటీలు పడి ఆయన  కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుని మరీ పాద నమస్కారాలు చేయడం ఆ రోజుల్లో ఒక సంచలన వార్తగా మారింది. అది  ఇంతింతై, అంతింతై దేశం నలుమూలలకు పాకింది.
ఢిల్లీ నుంచి ఇల్లస్ట్రెటెడ్  వీక్లీ ఆఫ్ ఇండియా విలేకరి ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేయడానికి హైదరాబాదు వచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి ప్రధాన పౌరసంబంధాల అధికారిగా మా పెద్దన్నయ్య, కీర్తిశేషులు భండారు పర్వతాల రావు పనిచేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన విలేకరికి తెల్లవారుఝామున నాలుగు గంటలకు టైం ఇచ్చారు. కొద్ది ముందుగానే ఆ విలేకరి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. సరిగ్గా ఇచ్చిన టైముకల్లా,  కిర్రు చెప్పులు చప్పుడు చేస్తుండగా ఎన్టీఆర్ కిందికి దిగివచ్చారు. ఢిల్లీ విలేకరి కుర్చీ నుంచి లేచి ఎన్టీఆర్  పాదాలకు సాష్టాంగనమస్కారం చేసారు. చేసిన మనిషి లేవకుండా అలాగే కాసేపు వుండిపోయారు. కొద్ది సేపటి తర్వాత లేచి కూర్చుని  ‘నేను విన్నది నిజమే!’ అని అంటూ ఇంటర్వ్యూ ప్రారంభించారు.
ప్రశ్నోత్తరాల కార్యక్రమం యధావిధిగా కొనసాగింది. అది వేరే సంగతి.
కొసమెరుపు ఏమిటంటే తరువాత చాలా రోజులకు ఆ పత్రిక ప్రచురించిన కధనం, ఈ పాద నమస్కారం ప్రహసనంతోనే మొదలవుతుంది.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన గండిపేట నివాసంలో ‘శవపూజలు’ చేస్తున్నారన్న వదంతులు వ్యాపించాయి. వాటిని తిప్పి కొట్టడానికి హైదరాబాదు నుంచి కొందరు విలేకరులను (అప్పుడు గండిపేట దూరమే అనిపించేలా వుండేది) అక్కడికి తీసుకు వెళ్ళారు. రామారావు గారు స్వయంగా విలేకరులను వెంటబెట్టుకుని ఆశ్రమంలో ఆణువణువూ చూపించారు. ఆ సందర్భంలో నేను అడిగితే రెడియోకోసం కాసేపు మాట్లాడారు. ఆశ్రమం వెలుపల ఒక చప్టా లాంటి దానిమీద ఎన్టీఆర్ బాసింపట్టు వేసుకు కూర్చున్నారు. ఆయన ముందు టేప్ రికార్డర్ వుంచి నేను పక్కగా ఆ చప్టా మీదనే కూర్చున్నాను. ఈ సన్నివేశాన్ని మిత్రుడు జీఎస్ రాధాకృష్ణ (అప్పుడు ‘వీక్’ ఇంగ్లీష్ వార పత్రిక కరస్పాండెంటు) ఫోటో తీసి ఇచ్చాడు. నేను మాస్కో వెళ్లి వచ్చేవరకు అది భద్రంగానే వుంది. కానీ ఆ తరవాత అనేక అద్దె ఇళ్ళు మారే క్రమంలో ఆ విలువైన ఫోటో పోగొట్టుకున్నాను.
ఇక రేడియోకి, రామారావు గారికీ నడుమ సాగిన ఒక వివాదం చెప్పి ముగిస్తాను.
ముప్పయి అయిదేళ్ళ క్రితంసంగతి
టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల దరిమిలా రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వ పాలన మొదలయింది. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో వుండడంతో రాజకీయ క్రీనీడలు అన్ని వ్యవస్థల్లో మాదిరిగానే రేడియో, దూరదర్శన్ ల మీద కూడా పడ్డాయి. ఆ రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని అనావృష్టి ప్రాంతాల్లో పర్యటించి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు, ప్రెస్ మీట్ పెట్టి రేడియో, దూరదర్శన్ లకు కూడా కబురు పంపారు. కరవు ప్రాంతాలలో ప్రభుత్వం తీసుకునే చర్యలు గురించి ముఖ్యమంత్రి ప్రసంగ పాఠాన్ని రికార్డ్ చేసి సందేశం రూపంలో ప్రసారం చేయాలని కోరారు.
ఆబిడ్స్ లోని ముఖ్యమంత్రి నివాసాన్ని చేరుకున్న మా సిబ్బంది రికార్డింగ్ పరికరాలను సిద్ధం చేసుకున్నారు. కొద్దిసేపటికి ఎన్టీఆర్ కిర్రు చెప్పులు చప్పుడు చేసుకుంటూ మెట్లు దిగివచ్చారు. ముఖ్యమంత్రి  ప్రధాన పౌర సంబంధ అధికారిగా పనిచేస్తున్న మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు తయారు చేసిన సందేశం ప్రతిని ఆమూలాగ్రం ఓ మారు తిరగేసి, తాము సిద్ధం అన్నట్టు తలపంకించారు. రికార్డింగు మొదలయింది.
"ప్రియమైన రాష్ట్ర ప్రజలారా!..." అని ప్రసంగం ప్రారంభించారు. అదే స్పీడులో కొనసాగుతుందని అంతా అనుకున్నాం. కానీ ఆయన హఠాత్తుగా ఆపి, 'కట్ వన్ - టేక్ టు' అన్నారు. మా వాళ్ళు రికార్డింగు ఆపేశారు. వందల సినిమాల్లో అనర్ఘళంగా డైలాగులు చెప్పిన అనుభవం ఆయనది. ఏ పదాన్ని ఎక్కడ వొత్తి పలకాలో, ఏ వాక్యాన్ని ఎక్కడ విరిచి చెప్పాలో ఆయనకు కొట్టిన పిండి. కానీ, ఇక్కడే ఎదురయింది మాకు వూహించని, ఆ మాటకు వస్తే అంతవరకూ అనుభవంలో లేని ఇబ్బంది. ఈ కట్లు, టేకుల విషయం తెలియకుండా రికార్దింగుకు రావడం వల్ల, తెచ్చిన టేపులు సరిపోలేదు. ఆఘమేఘాల మీద పంపించి స్టూడియో నుంచి అదనపు టేపులు తెప్పించి రికార్డింగు ముగించామనిపించారు.
అసలు కధ స్టూడియోకు చేరిన తర్వాత మొదలయింది. ఏ టేపు విన్నా కట్లూ, టేకులూ అన్న రామారావుగారి స్వరమే. ఆరాత్రే ప్రసారం కావాల్సి వుండడంతో సిబ్బంది అంతా టెన్షన్ కు గురయ్యారు. సీ ఎం గారి మొదటి ప్రసంగం కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ కమీషనర్ (పూర్వాశ్రమంలో తపాలా శాఖ డైరెక్టర్) సైదులు గారు, డైరెక్టర్ సీ,వీ, నరసింహారెడ్డి గారు అంతసేపూ మాతోపాటే రేడియో డబ్బింగు గదిలోనే వుండిపోయారు. కట్లూ టేకుల మధ్య వున్న ముఖ్యమంత్రిగారి సందేశాన్ని మా వాళ్లు కష్టపడి మాస్టర్ టేపు మీదకు ఎక్కించి డబ్బింగు పని పూర్తి చేసి ప్రసారం నిమిత్తం అనౌన్సర్ కి అప్పగించి వూపిరి పీల్చుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, డబ్బింగు పూర్తయిన తరువాత చూసుకుంటే మాకెంత నిడివి అవసరమో ముఖ్యమంత్రి సందేశం అంతే వ్యవధికి అతికినట్టు ఖచ్చితంగా సరిపోయింది.
దటీజ్ ఎన్టీఆర్.
అయితే ఈ ఉదంతం ఎంతగా చిలవలు పలవలు వేసిందంటే ఒక దశలో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన వివాద స్థాయికి చేరుకుని ఆ పిదప అలాగే చల్లారిపోయింది.
(ఇంకా వుంది)

28, ఆగస్టు 2016, ఆదివారం

శభాష్ రఘు

ఈ కింది చిత్రంలో మధ్యలో కూర్చున్నది ఎవరో అందరికీ తెలుసు. ఆయన అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు పక్కన మెడలో గుర్తింపు కార్డు వేలాడవేసుకుని, గళ్ళ చొక్కా ధరించి ఒద్దికగా కూర్చున్నది మా మూడో అన్నయ్య భండారు వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు భండారు రాఘవరావు. అతడు ప్రభుత్వ రెవెన్యూ శాఖలో అతి చిన్న ఉద్యోగి వీ ఆర్ వో. అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. ఇటీవలే ముగిసిన కృష్ణా పుష్కరాలలో చక్కని సేవలు అందించినందుకు రాఘవరావు ఇతర సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి వారితో కలిసి ఫోటో దిగారు. రేయింబవళ్ళు పడ్డ శ్రమను చంద్రబాబు చూపిన ఈ ఆత్మీయ ప్రదర్శన మరపున పడేసిందని మా అందరికీ పెట్టిన పోస్ట్ లో మా రఘు పేర్కొన్నాడు.


23, జూన్ 2016, గురువారం

జ్ఞాపకం


విరిగిన కాలుతో  ఇంట్లో ‘కాలుక్షేపం’ చేస్తున్న రోజుల్లో  నా కాలక్షేపం కోసం జ్వాలా పూనికతో ఎంసీఆర్ హెచ్ ఆర్డీ  డైరెక్టర్ జనరల్ పీవీఆర్కే ప్రసాద్ గారు తెలుగు మాతృభాష కాని ఐఏఎస్ ట్రైనీలకి తెలుగు బోధించే పని ఒప్పచెప్పారు. మా ఇంటికి దగ్గర్లోనే గ్రీన్ లాండ్స్ గెస్టు హౌస్ లో ఉంటున్న ఆ ఉత్తరాది యువ అధికారులు ఉదయం, సాయంత్రం మా ఇంటికే వచ్చి నా వద్ద తెలుగు నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. నేను నేర్పిన తెలుగేమో కానీ, మా ఆవిడ చేసిపెట్టే తెలుగు చిరుతిండ్లకు మాత్రం వాళ్ళు బాగా అలవాటు పడ్డారు.
వారిలో ఒకరు తదనంతర కాలంలో విజయవాడ సబ్  కలెక్టర్ అయ్యారు. అప్పట్లో కూడా ఇసుకకు బాగా గిరాకీ వుండేది. ఆ మాఫియాకు ఈ అధికారి గొంతులో వెలక్కాయ కావడంతో బదిలీ తప్పలేదు. మంచి అధికారి, నా దగ్గర తెలుగు నేర్చుకున్నాడు అనే భావనతో నా అంతట నేనే వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెప్పాను. ఆయన రవీంద్ర భారతిలో జరిగే ప్రజాప్రతినిధులు, మునిసిపల్ అధికారుల సమావేశానికి వెళ్ళే హడావిడిలో వున్నారు. ఆ సమావేశంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చెప్పారు.
“ఇంతవరకు మునిసిపల్ కమీషనర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించలేదు. మునిసిపాలిటీలలో  పరిస్తితులను మెరుగుపరచడానికి ఇప్పుడాపని చేద్దామనుకుంటున్నాను. ముందు ఏలూరుతో మొదలెడతాను. సంజయ్ అని సమర్దుడయిన అధికారిని ఏలూరు మునిసిపల్ కమీషనర్ గా వేస్తున్నాను”

సబ్ కలెక్టర్ గా పనిచేసిన అధికారికి మునిసిపల్ కమీషనర్ పదవి ఇష్టమో కాదో నాకు తెలవదు. కానీ, మంచి పనులు చేయడానికి ఆ ఉద్యోగం కూడా పనికి వస్తుంది అని తెలుసు. పైగా సిఎం అంతటి వాడే ‘సమర్ధుడు’ అని ఇచ్చిన కితాబు ఇంకా గొప్పది కదా!          

10, సెప్టెంబర్ 2014, బుధవారం

సిగరెట్లు మానడం యెలా?



‘ఇదేమన్నా బ్రహ్మ విద్యా! నేను చాలాసార్లు మానేశాను’ అనే జోకులు వింటూనే వుంటాము.
చాలా సంవత్సరాల క్రితం అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మ్యాగజైన్ సంపాదక బాధ్యతలు నిర్వహించిన కీర్తిశేషులు శ్రీ పీవీ రావు నాచేత ఈ అంశంపై ఒక వ్యాసం రాయించి పత్రికలో అచ్చు వేయించి ఓ నూటపదహార్లు అనుకుంటాను తాంబూలం కూడా ఇచ్చారు. ఏదయితేనేం అప్పుడా డబ్బులు ఓ వారం పదిరోజులు సిగరెట్ల ఖర్చుకు పనికొచ్చాయి.
సిగరెట్లను సిగరెట్టు మాదిరిగా తాగే మా స్నేహితులు నా గురించి చెప్పుకునేమాట వేరు. ‘శ్రీనివాసరావు సిగరెట్లు తాగడు, తగలేస్తాడు’ అన్నది వాళ్ల థియరీ, ‘హార్లిక్స్ తాగడు తింటాడు’ అనే వాణిజ్య ప్రకటన టైపులో.
సిగరెట్లు అలవాటు కావడానికి నేను చెప్పుకునే కారణం వేరే వుంది. ఇండియాలో వున్నప్పుడు కొని తాగే అలవాటు అలవడని నేను, మాస్కో వెళ్ళేక డబ్బులు తగలేసి మరీ సిగరెట్లు తగలేయడం మొదలు పెట్టాను. దానికి కారణాలు రెండు. ఒకటి మన దగ్గర అతి ఖరీదైన సిగరెట్లు కూడా మాస్కోలో అతి తక్కువ ధరకు దొరకడం. భాష ఎంతమాత్రం  తెలియని  ఆడామగా రష్యన్   సహోద్యోగులతో కాసేపు ‘మాటామంతీ’ లేని కాలక్షేపం చేయడానికి  ఈ సిగరెట్లు చక్కగా  అక్కరకు రావడం. దానాదీనా నా కొనుగోళ్ళు   సిగరెట్ ప్యాకెట్ల నుంచి  ఏకంగా  కార్టన్ల స్థాయికి పెరిగాయి. 2004లో అమెరికా వెళ్ళినప్పుడు  ఒక పెద్ద సూటుకేసు నిండా మా ఆవిడ వూరగాయ పచ్చళ్ళ ప్యాకెట్లతో, మరో పెద్ద సూటుకేసు నిండా సిగరెట్ల ప్యాకెట్లతో దిగబడ్డ మమ్మల్ని చూసి అమెరికా కష్టమ్స్ వాళ్లు నోళ్ళు వెళ్ళబెట్టారు. నా మీద కార్టూన్లు వేసే స్థాయికి నేను జీవితంలో ఎదిగివుంటే అంజయ్య గారి వేలుకు హెలికాఫ్టర్ బొమ్మ ముడివేసినట్టు నా బొమ్మకు చేతిలో సిగరెట్ తగిలించేవాళ్లేమో!


(అలనాటి మా మాస్కో అపార్ట్ మెంట్లో) 

“మరి ఇప్పుడేవిటి ఇలా అయిపోయారు? ‘ఏవి తండ్రీ నాడు విరిసిన  రింగు రింగుల  పొగల మేఘాలు” అని మా స్నేహితులు భారంగా నిట్టూర్పులు విడుస్తుంటారు. నా ఈ దుస్తితికి కారకులు ఎవరయ్యా అంటే నిమ్స్ డైరెక్టర్ గా పనిచేసిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు.
దీనికి ముందు ఓ పిట్ట కధ చెప్పాలి. దూరదర్శన్ విలేకరిగా పనిచేస్తున్న రోజుల్లో  ఓ రోజు తెల్లగా తెలవారక మునుపే, కప్పు కాఫీ కూడా కడుపులో పడకుండానే జూబిలీ హిల్స్ లోని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కెమెరామన్ తో సహా  చేరుకున్నాను. మిగిలిన జాతీయ చానళ్ళ బృందాలు కూడా బిలబిల మంటూ అక్కడికే చేరాయి.  మామూలుగా అయితే బాబుగారి ఇంట్లో  విలేకరులకు రాజభోగాలు. కానీ ఆ రోజు విలేకరులది పిలవని పేరంటం. బీజేపీతో టీడీపీకి ఎన్నికల పొత్తు విషయం గురించి తేల్చడానికి  ఆ రెండు పార్టీల నాయకుల నడుమ  ఎడతెగని చర్చలు లోలోపల సాగుతున్నాయి. బయట ఫుట్ పాత్ మీద నిలబడి కొందరం,  కూలబడి కొందరం పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నాం. ముందు జాగ్రత్త చర్యగా వెంట తెచ్చుకున్న సిగరెట్లను ఒకదాని వెంట మరోటి తగలేస్తూ, తెచ్చుకోని వాళ్లకు ఉదారంగా పంచిపెడుతూ నా మానాన నేను కాలక్షేపం చేస్తుండగా సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. కడుపులో ఎలుకలు. మరో పక్క సిగరెట్ల పొగతో కళ్ళ కలకలు. అలా నిలబడి సిగరెట్ తాగుతూ వున్నవాడ్ని వున్నట్టుండి  స్లో మోషన్ లో కిందకు వొరిగి పోతూ వుండడం వరకే గుర్తు.
కట్ చేస్తే నిమ్స్ ఆసుపత్రిలోని  ప్రత్యేక గదిలో డాక్టర్ల పర్యవేక్షణలో. ఆందోళనగా నా వైపే చూస్తున్న నా భార్య. ఆమెతో పాటు నా ఇద్దరు పిల్లలు. ముఖ్యమంత్రి గారా మజాకా. జరిగిన విషయం  విలేకరుల ద్వారా తెలుసుకుని హుటాహుటిన అంబులెన్స్ తెప్పించి నన్ను నిమ్స్ లో అడ్మిట్ చేయించారట. అందుకే కాబోలు  కాకర్ల వారు కూడా స్వయంగా వచ్చి చూసారు. రిపోర్టులన్నీ తిరగేశారు.  కళ్ళు తిరగడానికి, వొళ్ళు తూలడానికీ నా సిగరెట్లే కారణం అని ఆయన తన అనుభవంతో ఇట్టే కనుక్కున్నారు. ఆ విషయం మా ఆవిడతో చెప్పి, ‘నెమ్మదిగా ఈ అలవాటు మానిపించమ’ని సలహా ఇచ్చారు.  కళ్ళు తెరిచి  ఇదంతా చూస్తూ, చెవులు వొగ్గి ఇదంతా వింటున్న నేను హఠాత్తుగా   ముందుకు వొంగి,  ‘నేను సిగరెట్లు మానేశాను డాక్టర్ గారు’ అని ఒక బహిరంగ ప్రకటన చేసాను. ఆయన విలాసంగా మందహాసం చేసి,  నెత్తి మీది వెంట్రుకలు చేత్తో పట్టి చూపిస్తూ, ‘ఇలాటి వాళ్ళను నా సర్వీసులో  ఇంతమందిని చూసాను’ అంటూ,  ‘అదంత తేలిక కాద’ని ఆయనే చెబుతూ,  నేను తాగే బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్ ఒకటి అప్పటికప్పుడే తెప్పించి మా ఆవిడ చేతిలో పెట్టి,  ‘రాత్రి అందరూ  నిద్ర పోయిన తరువాత నీ మొగుడు  నీ మెదడు కొరుక్కు తింటాడు, ఎందుకయినా మంచి ఇది దగ్గర వుంచుకోమ్మా’ అని వెళ్ళిపోయారు.
అంతే! ఎంతయినా నేనూ పట్టుదల కలిగిన  మనిషిని కదా! ఇంటికి వెళ్ళినప్పటినుంచి ఆ ప్యాకెట్టూ ముట్టుకోలేదు. అప్పటినుంచి సిగరెట్టూ అంటించలేదు.
మరో వింత ఏమిటంటే, ఆనాటి నుంచి  సిగరెట్ తాగాలని కూడా అనిపించలేదు.          

  

27, మే 2010, గురువారం

మౌంట్ అబూ గురించిన జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

మౌంట్ అబూ గురించిన జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు


2003 లో ఒక రోజు.
అబూ రోడ్ చేరేసరికి ఉదయం ఏడున్నర.
బ్రహ్మ కుమారీలు ఏర్పాటు చేసిన సుమోలో మా ఆరుగురిని సామానుతో సహా మౌంట్ అబూ కి చేర్చారు. సుమారు యిరవై కిలోమీటర్లకు పైగా ఘాట్ రోడ్.  ఆరావళీ పర్వత పంక్తుల్లో మౌంట్ అబూ ఎత్తయిన శిఖరం అంటారు. శిఖరం అన్న మాటే గాని పైన అన్ని వసతులతో కూడిన ఒక చిన్నపాటి పట్టణమే వుంది. మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ చాలా బాగుంది. స్నానాలు ముగించుకుని బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కేంటీన్ కి బయలుదేరాము. నిటారుగా నిర్మించిన సిమెంట్ రోడ్ పై నుంచి కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కాలి. డైనింగ్ హాల్ ఎంతో నీటుగా వుంది. పుంగనూర్ కి చెందిన శ్రీనివాస్ అనే కార్యకర్త స్వచ్చందంగా అంత దూరం నుంచి వచ్చి అక్కడ బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేసే విధులను నిర్వహిస్తున్నాడు. బ్రహ్మ కుమారీల ప్రధాన కార్య స్థానంలో పనిచేసేవారందరూ అలాటి వారే. ఎవరూ జీతాలు తీసుకోరు. బ్రేక్ ఫాస్ట్ లో దక్షిణాది వంటకాలు కూడా వుండడంతో మాకు ఎలాటి ఇబ్బంది ఎదురు కాలేదు. తరువాత మెల్లగా నడుచుకుంటూ ఆ కొండల మీద కలయ తిరిగాము. మబ్బులు తాకుతూ వెడుతున్న అనుభూతి. పురాణ సినిమాలలో నారదుడు గుర్తుకువచ్చాడు.
కాసేపు గదిలో సేదతీరామో లేదో మళ్ళీ భోజనాలకు పిలుపు. ఈసారి నార్త్ ఇండియా వంటకాలు. కాకపొతే పులిహార వడ్డించారు. తెలుగు వాళ్లమని పెరుగు స్పెషల్.
భోజనం ముగించుకుని మెట్లెక్కి శిఖరం అంచున ఫోటోలు దిగాము.
మధ్యాహ్నం నుంచి బ్రహ్మ కుమారీల సెషన్స్ మొదలయ్యాయి. బ్రదర్ శాంత కృష్ణ మెడిటేషన్ గురించీ, బ్రహ్మకుమారీల గురించీ వివరంగా చెప్పారు. మాలో కొంతమంది జర్నలిష్టులకు సహజసిద్దమయిన రీతిలో రెచ్చగొట్టే విధంగా ప్రశ్నలు వేసినా, ఆయన నిగ్రహం కోల్పోకుండా జవాబులు చెప్పారు.
మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వాన.
హైదరాబాదుకు చెందిన బ్రహ్మకుమారీల ప్రతినిధి సరళ, ఐఏఎస్ అధికారి శ్రీ మంగపతిరావు, రెవెన్యూశాఖలో పనిచేసిన శ్రీమతి నైనాదేవి, మా ఆవిడ నిర్మల   హైదరాబాదు నుంచి వచ్చిన బృందం లో వున్నారు. మా పని తరలి వచ్చిన మగ పెళ్లివాళ్ళ మాదిరిగావుంది.
శుక్రవారం


అంబర చుంబిత అన్న అల్లసానివారి పద్యం గుర్తుకు వచ్చింది.
మేము వుంటున్న జ్ఞాన సరోవర్ నుంచి సుమారు యిరవై కిలోమీటర్లు ఘాట్ రోడ్ లో పైకి వెడితే వచ్చే గురు  శిఖిరం మీద నిలబడ్డపుడు ఎవరికయినా ఈ పద్యపాదం స్ఫురించకమానదు.
ఆకాశం అంచుల్లో నిలబడ్డ అనుభూతి కలిగించే ఆ సుందర దృశ్యం అనిర్వచనీయం. ఎటుచూసినా తెల్లని పొగ మంచు. అడుగు దూరం అవతల వున్నది కూడా కనిపించని స్తితి. ఎదురుగా వున్న మనుషులను కూడా పోల్చుకోలేని పరిస్తితి.
అక్కడికి వెడుతున్నప్పుడు మా డ్రయివర్ బాబు ఆ పొగమంచులో ముందుకు వెళ్లడం కుదరదని వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపేశాడు. ఉసూరుమనిపించింది. కానీ ఇంతలో హెడ్ లైట్లు వేసుకుని ఒక కారు ఎదుటినుంచి రావడంతో ఏమనుకున్నాడో కానీ ముందుకే నడిపించాడు. ముందు సీట్లో కూర్చున్న నాకు అడుగు ముందు ఏమివుందో కనిపించడం లేదు. అయినా డ్రయివరు బాబు మాత్రం ఎంతో చాకచక్యంగా నడుపుతూ మమ్మల్ని  పైకి చేర్చాడు. అప్పటికే అక్కడ చాలామంది వున్నారు. ఏదో మాట్లాడుకుంటూ పోకపోతే ఎదురుగా వచ్చేవారు డీకొట్టే ప్రమాదం వుంది. అందుకే అవసరం వున్నా లేకపోయినా గలగలా మాట్లాడుకుంటూ, నూట యాభయి రూపాయలుపెట్టి కొనుక్కున్న కాల్చిన మొక్కజొన్న కంకులు తింటూ   దాదాపు మూడువందల మెట్లెక్కి, గురు శిఖరం చేరుకున్నాము. అంత పొగమంచులో కూడా చిరుచెమట పట్టింది. ఆ శిఖరం మీద దత్తాత్రేయ ఆలయం వుంది. చాలా చిన్న గుడి. గుడి కంటే అక్కడ వేళ్ళాడదీసిన గంట పెద్దదిగా అనిపించింది.  ఆ గంట మోగిస్తే దాని ధ్వని లోయలో ప్రతిధ్వనించడం ఒక అనుభూతి. అక్కడ కొన్ని ఫోటోలు దిగాము కానీ ఆ దట్టమయిన పొగమంచులో ఆ ఫోటోలు ఎలావస్తాయో తెలియదు. అన్ని మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం డోలీలు వున్నాయి. నూటయిరవై రూపాయలు ఇస్తే పైకి తీసుకువెళ్ళి కిందకు తీసుకువస్తారు. దోవలో డ్రైవర్ బాబుని అడిగాము, చంద్రబాబునాయుడు ఎవరో తెలుసా అని. ఆంధ్రా సీఎం అని చటుక్కున జవాబిచ్చాడు. అదే గుజరాత్ సీఎం ఎవరంటే ఉప రాష్ట్రపతి పేరు చెప్పాడు.
మేము వెళ్ళిన దోవలో రెండు లోయల నడుమ కట్టిన ఒక డాం కనిపించింది. మౌంట్ అబూ లో కొన్ని ప్రాంతాలు మాత్రమే బ్రహ్మకుమారీల అధీనంలో వున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఆకాశవాణి, దూరదర్శన్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, రాజస్తాన్ టూరిజం కార్యాలయం వున్నాయి. గురు శిఖరానికి వెళ్ళే దారిలో పడి పన్నెండు చిన్న చిన్న ఊళ్లు, ఆవుల మందలూ వాటి కాపరులూ కానవచ్చారు. విచిత్రమేమిటంటే  వాళ్ళు మేమూ కూడా చలిదుస్తులు వేసుకోలేదు. పొగమంచులో చలిగా అనిపించదు. వెంట తీసుకువెళ్ళిన షాల్స్ కారులోనే వొదిలేసి తిరిగాము. కాకపొతే, గొడుగు తప్పనిసరి. ఎప్పుడు వాన పడుతుందో తెలవదు. వాన వచ్చిందో పొగమంచు పరార్.
కిందికి వచ్చి కేంటీన్ లో భోజనాలు చేశాము. పులిహార, రోటీలు, రసం, పెరుగు, మామిడి పండ్లు. శుక్రవారం కదా. మా ఆవిడకు పులుపు నిషిద్దం. అన్నంలో పాలూ పంచదార కలుపుకుని భోజనం ముగించింది.అక్కడ మాకు హైదరాబాదు
నుంచి వచ్చిన సత్యనారాయణ రెడ్డి, రాజేశ్వరరెడ్డి, శర్మ, సుబ్బారావు, ఆయన భార్య పరిచయం అయ్యారు.
మధ్యాహ్నం నాలుగ్గంటల సమయంలో కాస్తంత ఎండ పొడ. కానీ అది వేడిగా వుందో చల్లగా వుందో అనుమానమే.
గమ్మత్తుగా సాయంత్రానికి వాతావరణం హైదరాబాదులో మాదిరిగా మారిపోయింది.            
ఆరు గంటలకు అసలు సెషన్ మొదలు. మా అందరికీ బాడ్జీలు, ఇతర సమాచారం వున్న ఫోల్డర్లు ఇచ్చారు. విశాలంగా వున్న ఒక పచ్చిక బయలులో సమావేశం మొదలయింది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లందరూ అక్కడ జమయ్యారు. ఆ ప్రదేశం ఎంతో అందంగా వుంది. తివాచీ పరచినట్టుగా పచ్చని పచ్చిక. ఎత్తయిన చెట్లు. ఎటుచూసినా రంగురంగుల పూలమొక్కలు. అకాడమీ ఆఫ్ బెటర్ వరల్డ్ కు చెందిన బ్రదర్ మోహన్ సింగ్హన్ ఒక విషయం చెప్పారు. కొన్నేళ్ళకు పూర్వం ఆ ప్రదేశం రాళ్ళు రప్పలతో, రక్కసి పొదలతో నిండి వుండేదట. నీటి సౌకర్యం ఏమాత్రం లేని ఆ రోజుల్లో నంజుడప్ప అనే ఆయన స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. చిన్న చిన్న మట్టి పాత్రలకు చిల్లులు పెట్టి, వాటికి దూది పెట్టి, నీళ్ళను నింపి ఒక్కొక్క మొక్కని తడుపుతూ, వాటినన్నిటినీ పసిపాపలమాదిరిగా సాకుతూ పోషించి పెంచాడట. అలా నాలుగయిదేళ్ళలోనే ఆయన ఆ ప్రాంతం రూపురేఖలను  మార్చివేశాడట. ఇది విన్న తరవాత పని పట్ల నంజుడప్ప అంకిత భావానికి జోహారు అర్పించకుండా వుండలేకపోయాము.
బ్రహ్మ కుమారీ సంస్త అధినేత్రులందరూ , రాజయోగి డాదీ మనోహర్ ఇంద్రాజీ తో సహా  ఆ సమావేశానికి వచ్చారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసారు. తరువాత మెడిటేషన్ హాలులో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. మంగపతిరావు గారూ నేనూ కూడా జ్యోతులను వెలిగించాము. మీడియా ఇంచార్జి కరుణ ఆధ్వర్యంలో ఇది జరిగింది.
మధ్యాహ్నం వరకు కన్ను పొడుచుకున్నా కానరాని పొగమంచు. సాయంత్రం  ఏడవుతున్నా సూర్యాస్తమయం కాని స్తితి.మౌంట్ అబూలోని ఈ ప్రకృతి వైరుధ్యాన్ని మనస్సులో పదిల పరచుకుంటూ, మెడిటేషన్ హాలులో దాదీ రతన్ మొహినీజీ  హిందీలో చేసిన అనుగ్రహ భాషణాన్ని ఆలకించాము.
కర్మ బంధాలలో చిక్కుపోయిన ఆత్మ తన తండ్రి అయిన పరమాత్మను  గుర్తించలేదన్నారు. దానికి ధ్యానం ఒక్కటే మార్గం అన్నారు. ఆధ్యాత్మిక మార్గం హేతువుని తిరస్కరిస్తుంది, అయితే అది హేతువుని అధిగమించి వెళ్ళగలదన్నారు దాదీజీ.
శనివారం ఉదయం
తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి- ధ్యాన మందిరానికి వెళ్ళాము. స్నానాలు చేసి శుచిగా రావాలని కానీ, పాద రక్షలు ధరించకూడదని కానీ నిబంధనలేమీ లేవు. మందిరంలో ఒక బ్రహ్మ కుమారి తెల్లని దుస్తుల్లో సోఫా మీద ధ్యాన ముద్రలో వుంది. ప్రశాంతమయిన వాతావరణంలో ఎక్కడ అమర్చారో తెలియని స్పీకర్ల నుంచి మెల్లగా ఒక పాట వినబడుతోంది. పాట పూర్తీ కాగానే బ్రహ్మ కుమారి సమ్మోహన స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టారు. మధుర ఘడి యలుగా వారు పేర్కొనే ఆ సుప్రభాత వేళలో మెడిటేషన్ చేయడం కొత్త అనుభూతి. కానీ మనస్సు కోతి కదా. దాని వాసనలు దానివి. అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే నేను మాత్రం ఆ వాతావరణాన్నీ అక్కడి మనుషులనూ పరిశీలించడంలో మునిగిపోయాను. అరగంటలో ఆ కార్యక్రమం ముగిసింది. అంతా నిశ్శబ్దంగా బయటకు వచ్చారు. అందరిలో ఒక రకమయిన ప్రశాంతత. నిజంగా ధ్యానం లో ఏదయినా వుందా?
మరునాడు మౌంట్ అబూ నుంచి కిందికి దిగాము. అక్కడ బ్రహ్మ కుమారీలకు ఒక బ్రహ్మాండమయిన సమావేస మందిరం వుంది. దాదాపు లక్షమంది సౌకర్యంగా కూర్చుని ప్రసంగాలు వినడానికి, కార్యక్రమాలు తిలకించడానికీ వీలుగా దానికి రూపకల్పన చేసిన తీరు అద్భుతంగా వుంది. అంత పెద్ద హాలులో ఎక్కడా స్తంభాలు లేకుండా మందిరం పైకప్పు నిర్మించారు. వేదికకు సుదూరంగా కూర్చున్నవారికి కూడా స్పుటంగా వినగలిగేలా అత్యాదునికమయిన లౌడ్ స్పీకర్లను అమర్చారు. నిర్మాణ కౌశలానికి ఒక మచ్చు తునకగా పరిగణించాల్సిన ఈ సుందర మందిరం దేశానికి బ్రహ్మ కుమారీల భిక్షే.
(రెండువేల మూడులో సతీ సమేతంగా చేసిన మౌంట్ అబూ యాత్ర గురించి మనసు పొరల్లో మరగునపడిన జ్ఞాపకాల ఆధారంగా భండారు శ్రీనివాసరావు 27-05-2010-) 
Be firm when authority is required,but be gentle and sweet when administering authority- Brahmakumaries 

NOTE: All the images in this blog are copy righted to their respective owners.