28, జులై 2017, శుక్రవారం

అవినీతి, అనైతికం రెండూ కవలపిల్లలు


మన  దేశంలో అవినీతి ఆరోపణలకు అతీతులయిన రాజకీయ నాయకుల జాబితా తీస్తే అందులో మొదట కనబడే పేరు నీతీష్ కుమార్. అవినీతి మరకలు ఇసుమంతైనా అంటని వాళ్ళలో ఆయన ప్రధముడు. నీతినిజాయితీలకు మారుపేరనిపించుకుంటాడని భావించి తలితండ్రులు ఆ పేరు పెట్టి వుంటారేమో అని అనుకునేవాళ్లు కూడా వున్నారు. అయితే అదంతా నిన్న మొన్నటి దాకానే. ఇప్పుడు ఆయనా ఆ తానులో ముక్కే అని బాధపడుతున్నారు ఆయన అభిమానులు.
లాలూవంటి అవినీతి పరుడయిన రాజకీయ నాయకుడు   అనుయాయులకో, బడా బడా కాంట్రాక్టర్లకో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డమయిన  పనులు చేసి పెట్టి  కోట్లు దండుకుంటే, అటువంటివాళ్ళు రాజకీయాలకు చీడ పురుగువంటివాడని తీర్మానిస్తాము. మరి అలాంటి అధికారాలు అనేకం కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అనైతికంగా, అప్రజాస్వామికంగా దొడ్డిదారిన   పొందితే అటువంటి వారిని యేమని పిలవాలి? అవినీతి ఎలాంటిదో అనైతికం కూడా అలాంటిదే. వేసుకున్న చొక్కా మార్చినట్టు, రాత్రి రాత్రి ఏకంగా ఉత్తర దక్షిణాలవంటి రెండు పార్టీ కూటముల్లో ఒకదాన్ని ఒదిలి మరో దాంట్లో చేరిపోతే, దాన్ని సమర్ధించడం ఏం ధర్మం.
అప్రజాస్వామిక పద్దతిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం గొప్పవిషయమూ కాదు, మన దేశానికి కొత్త విషయమూ కాదు. అలా గతంలో జరిగినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతొ గగ్గోలు పెట్టిన వాళ్ళే ఈరోజు అలాంటి పనులకు పూనుకోవడం, అవినీతిపై చేస్తున్న యుద్ధంగా పేరు పెట్టుకుని వాటిని సమర్ధించుకోవడం క్షంతవ్యం కాదు.  అలా ఏర్పడ్డ ప్రభుత్వాలు అవినీతిరహిత పాలన అందివ్వవచ్చు. యేవో కొన్ని మంచి పనులు చేసి మంచి  ప్రభుత్వాలు అనిపించుకోవచ్చు.  కానీ   ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామిక ప్రభుత్వాలు మాత్రం కానేరవు.  లాలూ కానీ అతడి కుమారుడు కానీ చెడ్డవాడు అయితే వాళ్ళని  తిరస్కరించాల్సింది ప్రజలే కాని వారి  రాజకీయ ప్రత్యర్ధులు కారు. ఇటువంటి నీతిబాహ్య చర్యలకు ప్రజాస్వామ్య ముసుగు తగిలించుకోవడం అంటే ఆ స్పూర్తిని అవహేళన చేయడమే. ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి అయినా, దించడానికి అయినా రాజ్యాంగంలో కొన్ని పద్దతులు వున్నాయి. వాటిని తుచ తప్పకుండా పాటించడం వదిలేసి, వాటిల్లోని లొసుగులను వాడుకోవాలని చూస్తే తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు సిద్ధించవచ్చేమో కాని, శాశ్వితంగా అపకారం జరిగేది ప్రజాస్వామ్యానికే అనే అంశాన్ని  గమనంలో వుంచుకోవాలి.
ఈరోజు గడిస్తే చాలు అనుకునేవాడు రాజకీయ నాయకుడు. రేపు ఎలా అని ఆలోచించేవాడు రాజనీతిజ్ఞుడు.

బీహారు పరిణామాలు గమనిస్తుంటే మొదటి రకానికి దేశానికి లోటులేదనిపిస్తోంది.

27, జులై 2017, గురువారం

పాట్నాలో మూగ మనసులు


కొన్ని వింటున్నప్పుడు, మరి కొన్ని చూస్తున్నప్పుడు ఎప్పుడో విన్న, ఎన్నడో  కన్న సంగతులు గుర్తుకు వస్తుంటాయి, మూగమనసులు సినిమాలాగా.
1964 లో అనుకుంటాను బెజవాడ లీలామహల్లో చూశాను క్లియోపాట్రా సినిమా. ఒక్కసారి కాదు అనేకసార్లు చూసాను అనేకమంది మాదిరిగానే. అప్పుడే విన్నాను ఆ రెండు పేర్లు, ఎలిజబెత్ టేలర్, రిచర్డ్ బర్టన్. ఆ సినిమా సెట్లపై వారిరువురి నడుమ  పుష్పించిన ప్రేమ పెళ్ళికి దారితీసిందని పత్రికలు రాసాయి. (ఆ సినిమాలో ఆ ఇద్దరి నడుమా ఒక ముద్దు సీను వుంది. పెదవులు కలుపుకుని గట్టిగా ముద్దు పెట్టుకునే ఆ దృశ్యంలో ఇద్దరూ ఎంతగా ఒళ్ళు మరిచిపోయారంటే, దర్శకుడు కల్పించుకుని ‘కట్ కట్’ అని అంతకంటే గట్టిగా అరవాల్సి వచ్చిందట) అప్పట్లో అదో సంచలనం. కారణం ఆ ఇద్దరికీ అది మొదటి పెళ్లి కాకపోవడం. అప్పటికే పెళ్లి చేసుకుని సంసారాలు చేస్తున్న ఆ ఇరువురూ విడాకులు తీసుకుని తమ జీవిత సహచరులతో విడిపోయి మళ్ళీ పెళ్ళాడారు. హాలీవుడ్ లో అదో కొత్త విషయం కాదుకాని ఇండియాలో ఇలాంటి కబుర్లు వింతగానే చెప్పుకుంటారు. అలాగే చెప్పుకున్నారు కూడా. ఒక పదేళ్ళు వారి సంసారం బాగానే సాగింది. పాతొక రోత సామెత మాదిరిగా ఇద్దరికీ సరిపడక విడాకులు తీసేసుకుని మళ్ళీ తమకు నచ్చిన పెళ్ళిళ్ళు ఎంచక్కా చేసుకున్నారు. కధ అంతటితో ఆగలేదు. అలా విడిపోయిన వీరిరువురూ ఏదో  సందర్భంలో మళ్ళీ కలుసుకున్నారు. పాత ప్రేమ మళ్ళీ మారాకు తొడిగింది. అంతే! ఏడాది తిరక్కుండానే పాత మొగుడికి టేలరు, పాత భార్యకు బర్టను టాటా చెప్పేసి మళ్ళీ మరోసారి పెళ్లి చేసుకుని కొత్తగా భార్యాభర్తలు అయ్యారు. కానీ పెళ్ళాడి కొన్ని వారాలు గడిచాయో లేదో కధ మళ్ళీ మొదటికి వచ్చింది. కాపురం చివరికి వచ్చింది. మళ్ళీ విడిపోవడమే వారికి మిగిలింది.
ఈ చిన్ని కధలో ఇన్ని ‘మళ్ళీ’లు  ఎందుకు అంటే, ఆ విషయం మళ్ళీ మరోసారి చెప్పుకుందాం!


25, జులై 2017, మంగళవారం

సెన్స్ ఆఫ్ హ్యూమర్


సామాన్యుడికి, ఆ మాటకు వస్తే ఎవరికయినా వారి వారి దినవారీ ఒత్తిళ్ళ నుంచి ఒకింత ఊరట కలిగించేవి చిన్న చిన్న  కార్టూన్లు, జోకులు. సీరియస్  వాతావరణం నుంచి  ఇవి ఎంతోకొంత ఉపశమనం కలిగిస్తాయి. కారణం తెలియదు కానీ రాజకీయ నాయకుల్లో ఈ సెన్స్ ఆఫ్  హ్యూమర్ అనే లక్షణం  రోజురోజుకీ తగ్గిపోతోంది. ఒక కార్టూనును  కానీ, లేదా ఒక హాస్య స్పోరక కధనాన్ని కానీ హరాయించుకోలేకపోతున్నారన్నది సుస్పష్టం.  ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నఅంశాల్లో  ఇదొకటి.
ఈ రోజుల్లో, కార్టూన్లు, జోకులు ప్రత్యేకించి సామాజిక మాధ్యమాల్లో  కొండొకచో కొంచెం శృతి మించుతున్న మాటా నిజమే. కానీ అవి చదవగానే రాసిన వారెవరో, ఎందుకోసం రాసారో సులభంగా తెలిసిపోతూనే వుంటుంది. ఎందుకంటే దేశం ఇప్పుడు రాజకీయ పార్టీల వారీగా, నాయకుల వారీగా విడిపోయి వుంది. ఈ విభజన వల్ల లాభపడేది పార్టీలే, దేశం కాదు.
ఈ సందర్భంలో  ఒక పాత సంగతి ముచ్చటించుకుందాం.   1962 లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశానికి  ఘోర పరాభవం ఎదురయినప్పుడు,  ప్రముఖ కార్టూనిష్టు ఆర్. కే. లక్ష్మణ్,  నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పై ఒక కొంటె కార్టూన్ వేసారు. నెహ్రూను చిన్నబుచ్చుతూ వేసిన ఆ కార్టూన్  కారణంగా ఆయన అభిమానులనుంచి దాడి తప్పదు అని ఆ కార్టూనిష్టు   అనుకుంటుంటే ఒక చిత్రం జరిగింది. లక్ష్మణ్ గారికి  నెహ్రూ నుంచి  ఒక ఉత్తరం వచ్చింది. తెరిచి చూస్తే విషయం ఇది.
‘పొద్దున్నే పత్రికలో మీ కార్టూన్ చూసి నాకెంతో సంతోషమయింది. అది చూడగానే నా మనసుకు ప్రశాంతత చిక్కింది.  అదే కార్టూన్ ని కొంచెం పెద్దదిగా గీసి నాకు  పంపిస్తే ఫ్రేం కట్టించి దాచుకుంటాను.” అని రాశారు నెహ్రూ.
బాపూ సినిమా ముత్యాలముగ్గులో  రావు గోపాల రావు అన్నట్టు ‘మడిసన్నాక కూసింత కలాపోసన వుండాలి’. నిజమే!

అయితే అది రాజహంస మాదిరిగా పాలను నీళ్ళను వేరు చేసి చూడగలిగే విధంగా వుండాలి.

వార్తా వంటకాలు



విషయం ఒక్కటే. కానీ చూసే  ఇద్దరికీ రెండు రకాలుగా కనిపిస్తే,  వైద్య పరిభాషలో ఆ జబ్బుని యేమని పిలుస్తారో తెలియదు. ఒకే వార్త, వివిధ పత్రికల్లో వివిధ రూపాల్లో వస్తే, అందుకు కారణాలు ఏమిటో చదువరులకు  యిట్టే తెలిసిపోతున్నాయి. ఒక సభ కానివ్వండిఒక సంఘటన కానివ్వండి,  ఒక రాజకీయ ప్రకటన కానివ్వండి లేదా విలేకరుల సమావేశం కానివ్వండి, వేర్వేరు పత్రికలు, వేర్వేరు కోణాల్లో, వార్తలు 'వండి వారుస్తున్నతీరు ఇటీవలి కాలంలో ప్రస్పుటంగా కానవస్తోంది. అలాగే మీడియా. ఏ ఛానల్ మార్చి చూసినా యిదే వరస.
ఎవరయినా తాము చదివే పత్రికచూసే ఛానల్ వైవిధ్య భరితంగా ఉండాలనే కోరుకుంటారు. మూసపోసినట్టుగా వుండాలనుకోరు. అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలోని దూరదర్శన్ కు పోటీగా ప్రైవేటు ఛానళ్ళ శకం మొదలయినప్పుడు, జనం ఆ మార్పుని సాదరంగా స్వాగతించారు. కానీ తాము కోరుకున్న మార్పు తాము కోరిన రీతిలో కాకుండా గాడి తప్పుతున్న పద్దతిని మాత్రం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

యిరవై నాలుగ్గంటల నిరంతర న్యూస్ ఛానళ్ళ పుణ్యమా అని ఈ రోజుల్లో పనికొచ్చే సమాచారం, పనికిరాని సమాచారం టన్నుల లెక్కల్లో ప్రజలకు చేరుతోంది. ఇంతంత సమాచారాన్ని మనిషి మెదడు ఏ మేరకు హరాయించుకోగలదో ఆ టీవీ ఛానల్ల వాళ్ళే ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేస్తే బాగుంటుందేమో. ఎన్ని విషయాలు విన్నా మెదడు మాత్రం దానికి వీలయినంతవరకే నిక్షిప్తం చేసుకుని మిగిలింది  వొదిలేస్తుందంటారు. యిదే నిజమయితే, టీవీ ఛానళ్ళ ద్వారా క్షణక్షణానికీ జనాలకు అందుతున్న సమాచారంలో చాలా భాగం గుర్తుకు రానంతగా వృధా అవుతున్నదనే అనుకోవాలి. విన్నదానికంటే చదివిందీ, చదివినదానికంటే చూసిందీ ఎక్కువ కాలం  గుర్తుండి పోతుందనే సిద్దాంతానికి,  సమాచార విస్పోటనం చిల్లులు  పొడుస్తుందనే అనుకోవాలి. ప్రజలకు చిరకాలం ఏదీ గుర్తుండదు అన్న ధీమాతో, రాజకీయ నాయకులు తరచూ స్వవచనఘాతానికి పూనుకుంటూ ఉండడానికి కూడా బహుశా యిదే కారణమేమో!

24, జులై 2017, సోమవారం

బదరీ కేదార్ యాత్ర (1996) పదో భాగం – కొమరగిరి అన్నపూర్ణ


యాత్రలో మా వెంట వచ్చిన గైడ్ పేరు చవాన్. కేదార్ గురించి, బదరీ గురించి అతనే మాకో విషయం చెప్పాడు. “కేదార్ లో పచ్చని చెట్లు విరివిగా  వుంటాయి. అవి ఎల్లవేళలా ఆక్సిజన్ విడిచిపెడుతూ వుంటాయి కనుక అంత ఎత్తున వున్నా  ఆయాసం అనిపించదు. బడరీలో చెట్లు వుండవు. ఎత్తుకు పోయిన కొద్దీ గాలిలో ఒత్తిడి తగ్గి, ఆక్సిజన్ సరిగా అందదు అంచేత నడిచేటప్పుడు మాట్లాడ కూడదు. మాట్లాడితే ఆయాసం వస్తుంది. ఎటు తిరిగినా నెమ్మదిగా నడవాలి. మౌనంగా వుండాలి”.
అతను చెప్పినట్టు గదిలో వున్నప్పుడు బాగానే వుండేది. బయటకు వచ్చినప్పుడు మాత్రం ఊపిరి పీల్చడం కష్టంగా వుండేది. నాకీ కాదు, అక్కడ ఎవ్వరికయినా అంతే.  మనిషి  ముందూ వెనకా ఆలోచించకుండా, ఆశ కొద్దీ చెట్లన్నిటినీ కొట్టేయడం వలన కలిగిన దుష్ఫలితం ఇది.
నాకు మాత్రం హైదరాబాదులో డాక్టర్ నాగభూషణం గారు ఇచ్చిన మాత్రలు బాగా అక్కరకు వచ్చాయి. అందువల్ల ఎలాటి ఆయాసం లేకుండా నేను యాత్ర చేయగలిగాను. ఆయన్ని తలచుకోని రోజు లేదు.
బస్సు అలాగే పర్వతాలను ఒక్కొక్కటే దాటుకుంటూ జోషీ కుండ్ చేరింది. ఇక్కడ నరసింహాలయం వుంది. గుడి గుహలో వుంది. సాధారణంగా నరసింహ స్వామి కోవెలలు కొండలు, గుహల్లోనే వుంటాయి. గుడి బయట నరనారాయణులు, శివపార్వతులు, గరిత్మంతుడు, నవ దుర్గ ఆలయాలు వున్నాయి. మా పెద్ద తమ్ముడు పర్వతాలరావు ఆరోజుల్లో నరసింహ తత్వం మీద పుస్తకాలూ రాస్తుండేవాడు. విషయ సేకరణ ఎక్కడెక్కడో నరసింహ స్వామి క్షేత్రాలు తిరుగుతూ ఉండేవాడు. భార్గవగారు మా తమ్ముడికి పరిచయం. ఆయన శ్రీధర్ గురూజీ శిష్యులు. కను చూపు లేకపోయినా మేము చేస్తున్న ఈ యాత్రలన్నీ భార్గవ గారు అప్పటికే పూర్తిచేసారు. అది మామూలు విషయం కాదు. ఆయనలో ఉన్న భక్తికీ, దీక్షకూ, మనోనిబ్బరానికి తార్కాణం. మా పెనుగంచిప్రోలు నరసింహస్వామి దేవాలయంలో అచ్యుతా చార్యులు గారని పూజారి వుండేవారు. ఆయనకూ కంటి చూపులేదు. కానీ అంతర్నేత్రాలు ఉండేవని చెప్పుకునేవారు. బహుశా భార్గవగారికి కూడా అలంటి నేత్రాలను భగవంతుడు అనుగ్రహించాడేమో తెలవదు.
శంకరాచార్యుల వారు కేరళకు చెందిన నంబూద్రి బ్రాహ్మణులను బదరి దేవాలయంలో అర్చకులుగా నియమించారుట. అప్పటి నుండి దక్షిణాదివారే అక్కడ పూజారులు. ఈవిధంగా ఆసేతు హిమాచలం ( దక్షిణాన సేతువు నుండి ఉత్తరాన హిమాలయాల వరకు) అని భారతదేశం గురించి చెప్పుకునే వర్ణన అతికి నట్టు సరిపోతుంది అనిపించింది.   
బదరిలో వుండే అర్చకులు సంవత్సరానికి ఆరు మాసాలే అక్కడ వుంటారు. మంచు పడడం ఎక్కువకాగానే వాళ్ళు ఉత్సవ విగ్రహాలతో సహా దిగి వచ్చి కింద జోషీ కుండ్  లో మిగిలిన ఆరు నెలలు వుంటారు. ఆ కాలంలో అక్కడి ఆలయంలో పూజాదికాలు నిర్వహిస్తారు. కేదార్ లో కూడా ఆరునెలలే మనుషుల పూజ. తరువాత గుడి మూసివేస్తారు. ఆ ఆరు  నెలలు శివుడికి  దేవతలు పూజ చేస్తారని చెబుతారు. కేదార్  లో అయితే ఇళ్ళ ఛాయలు కూడా లేవు. భక్తులు వెళ్ళే రోజుల్లో ప్లాస్టిక్ షీట్లతో పందిళ్ళ లాగా వేసుకుని కాలక్షేపం చేస్తారు. కేదార్ కు వెళ్ళే దోవలో దేవ  ప్రయాగ, రుద్ర  ప్రయాగ, కర్ణ ప్రయాగ, నంది ప్రయాగ మొదలయినవి చూసాము. ప్రయాగ అంటే రెండు నదుల సంగమం. (ఇంకా వుంది)   


23, జులై 2017, ఆదివారం

డెక్కన్ రేడియో

(నేడు జాతీయ ప్రసార దినోత్సవం)

పాటల్లోనే కాదు మాటల్లో కూడా సంగీతం వినవచ్చు. ఉర్దూ భాషకు ఆ శక్తి వుంది.
డెబ్బయ్యవ దశకంలో హైదరాబాదు రేడియో కేంద్రం నుంచి సరిగ్గా సాయంత్రం అయిదు గంటల యాభయ్ నిమిషాలకు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు మొదలయ్యేవి.
యే ఆకాష్ వాణి హైదరాబాద్ హై. అబ్ ఆప్ వసీమక్తర్ సే ఇలాఖాయే ఖబ్రే సునియే
ఉర్దూ తెలియని వాళ్లు కూడా వసీం అక్తర్ చదివే వార్తలు వినడం నాకు తెలుసు. ఆయన వార్తలు చదువుతుంటే సంగీతం వింటున్నట్టుగా వుండేది. నేను ఆయనతో కలిసి చాలా సంవత్సరాలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేశాను. కొన్ని ఉద్యోగాలు చేయడం కూడా పూర్వజన్మ సుకృతం. చిన్నవా పెద్దవా అన్న మాట అటుంచి గొప్పగొప్ప వాళ్ళతో కలిసి పనిచేశామన్న తృప్తి కలకాలం మిగిలిపోతుంది.
దేశానికి స్వాతంత్రం రావడానికి ఓ పుష్కర కాలం కంటే చాలా ముందుగానే, అప్పటి నిజాం సంస్థానంలో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. 1933 లో రెండువందల వాట్ల ట్రాన్స్మిషన్ శక్తితో, ‘డెక్కన్ రేడియోఅనే పేరుతో ఒక ప్రైవేటు రేడియో స్టేషన్ ను హైదరాబాదులో ఏర్పాటు చేశారు. ఆ రేడియో ట్రాన్స్ మిటర్ ను స్తానికంగా రూపొందించడం విశేషం. వాస్తవానికి ఈ రేడియో కేంద్రం ఒక కుటుంబం ఆద్వర్యంలో ఏర్పడింది. ఆ కుటుంబసభ్యులే కేంద్రం నిర్వహణ బాధ్యత చూసుకునేవారు. చిరాగ్ ఆలీ లేన్ లోని ఆజం మంజిల్ భవనంలో ఈ రేడియో కేంద్రం పనిచేసేది.
ఉర్దూలో వార్తలతో పాటు గజల్స్, ఖవ్వాలీలు, పాటలు ప్రసారం అయ్యేవి. ఆ రోజుల్లో సినిమా పాటల రికార్డులు అంత సులభంగా దొరికేవి కావు. దానితో స్థానిక సంగీత కళాకారులు రేడియో కేంద్రానికి వచ్చి తమ కార్యక్రమాలను రికార్డ్ చేసేవారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు రోషన్ ఆలీ డెక్కన్ రేడియోలో మొదటి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత ఎం ఏ రవూఫ్ డెక్కన్ రేడియోలో స్టుడియో ఎక్జిక్యూటివ్ గా చేరారు. ఆయన పేరు పొందిన గజల్ గాయకుడు. తదనంతర కాలంలో రవూఫ్ ఈ కేంద్రానికి డైరెక్టర్ అయ్యారు.
మొహరం మాసంలో రేడియో కేంద్రానికి సెలవు ప్రకటించేవారు. ప్రసారాలు వుండేవి కావు.
ఆ తరువాత కొన్ని మార్పులు చేశారు. మొదటి పదమూడు రోజులు ప్రసారాలు నిలిపివేసేవాళ్ళు. మిగిలిన రోజుల్లో కూడా సంగీత కార్యక్రమాలు వుండేవి కావు. స్థానిక వార్తాపత్రికల్లో వెలువడిన వార్తల ఆధారంగా న్యూస్ బులెటిన్లు తయారయ్యేవి. రాష్ట్రానికి సంబంధించిన సమాచారమే వార్తల్లో చోటుచేసుకునేది.
రెండేళ్ళ తరువాత అంటే 1935 లో డెక్కన్ రేడియో కేంద్రాన్ని నిజాం స్వాధీనం చేసుకున్నారు. నిజాం సంస్థానంలోని వైర్ లెస్ విభాగం కింద డెక్కన్ రేడియో పనిచేయడం మొదలు పెట్టింది. నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఆధ్వర్యంలో డెక్కన్ రేడియో కేంద్రానికి మరిన్ని హంగులు సమకూరాయి. ఇంగ్లాండ్ లోని మార్కొనీ కంపెనీ తయారు చేసిన శక్తివంతమైన రెండువందల వాట్ల రేడియో ట్రాన్స్ మిటర్ ను దిగుమతి చేసుకున్నారు. రేడియో కేంద్రాన్ని చిరాగ్ ఆలీ లేన్ నుంచి ఖైరతా బాద్ లోని యావర్ మజిల్ అనే భవనంలోకి మార్చారు. కొత్త రికార్డింగ్ స్టుడియోలను నిర్మించారు. నగర పొలిమేరల్లోని సరూర్ నగర్ ప్రాంతంలో పెద్ద యాంటీనా నెలకొల్పారు. దానిమీద వున్న యెర్ర విద్యుత్ దీపాలు నగరంలో సుదూరంగా వుండే అనేక ప్రాంతాలకు కనబడేవని చెప్పుకునే వారు. డెక్కన్ రేడియోలో పనిచేసే ఒక ఉద్యోగిని లండన్ పంపించి బీబీసీ లో శిక్షణ ఇప్పించారంటే డెక్కన్ రేడియో పట్ల నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఎంతటి శ్రద్ధ తీసుకున్నదీ అర్ధం అవుతుంది.
తరువాతి రోజుల్లో డెక్కన్ రేడియో సంగీత కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వాటికి శ్రోతల నుంచి విశేషమైన ఆదరణ లభించడం అందుకు కారణం. ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్, ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్, హీరా బాయ్ బరడేకర్, ఆవిడ సోదరి సరస్వతీ రాణే వంటి సుప్రసిద్ధ సంగీతకారులు డెక్కన్ రేడియో కళాకారుల జాబితాలో వుండేవారు. మరో ప్రసిద్ధ సంగీత కారుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ రెండు పర్యాయాలు హైదరాబాదు వచ్చి డెక్కన్ రేడియోలో ప్రోగ్రాములు ఇచ్చారు.
డెక్కన్ రేడియో నుంచి తెలుగు, కన్నడం, మరాఠీ భాషల్లో కూడా కొన్ని కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి కాని వాటి వ్యవధి చాలా పరిమితం.
(సమాచార సేకరణకు సహకరించిన అనేకానేకమందికి అనేక వందనాలు. కృతజ్ఞతలు భండారు శ్రీనివాసరావు - 06-09-2013)

21, జులై 2017, శుక్రవారం

బదరీ కేదార్ యాత్ర తొమ్మిదో భాగం –కొమరగిరి అన్నపూర్ణ (1996)


మేము డోలీలలో హాయిగానే కూర్చున్నాం. కానీ డోలీల వాళ్ళ సంగతి గమనిస్తే చాలా బాధ వేసేది. రాళ్ళల్లో బురదలో, నిటారుగా వుండే కొండ దారిలో మమ్మల్ని మోస్తూ వాళ్ళు నడుస్తున్నారు. చలికి వణుకుతూ డోలీల్లో కూర్చోవడమే మాకు ఇంత బాధగా వుంటే, వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ, పైగా డోలీల్లోకూర్చున్న మమ్మల్ని మోసుకుంటూ అంతంత దూరాలు ప్రయాణాలు చేస్తున్నారంటే వాళ్ళ కష్టం ఊహించు కోవడానికే భయం వేస్తుంది. వాళ్లకు మన భాష రాకపోయినా ఎలాంటి ఇబ్బంది, పేచీలు  పెట్టకుండా వస్తున్నారు. మన దగ్గర ఆటోల వాళ్ళు, రిక్షాల వాళ్ళు పెట్టే పేచీలు, కిరికిరులు  గుర్తుకువచ్చాయి. కానీ వీళ్ళు అదేమిటో ఒక్కరోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరగలేదు. దొంగతనం అన్నది ఈ యాత్ర మొత్తంలో మాకు అనుభవానికి రాలేదు. మా సామాన్లను వాళ్ళే ఎంతో పదిలంగా జాగ్రత్త చేసారు. డోలీలో ప్రయాణిస్తూ వుండగా సురేష్ వాళ్ళు ఫోటో తీయాలని అనుకున్నారు. అయితే కెమెరా ఎందులో పెట్టిందీ గుర్తురాక అది సాధ్యపడలేదు. చివరికి అందరం క్షేమంగా గౌరీకుండ్ చేరుకున్నాము. మళ్ళీ అదే హోటల్లో మా బస. అక్కడే అన్నాలు తిని మళ్ళీ బస్సెక్కి బదరీ బయలుదేరాం.
తిరుగు ప్రయాణంలో మళ్ళీ శ్రీనగర్ వచ్చాము. అయిదు గంటలు కావస్తోంది. కేదార్ వెళ్ళేటప్పుడు కొండల నిండా గుబురుగా పెరిగిన పచ్చటి చెట్లు. ప్రకృతి సోయగాలు చూసి మురిసిపోయాము. అదేమిటో శ్రీనగర్ (కాశ్మీర్ శ్రీనగర్ కాదు) పరిసరాలలో ఉన్న కొండలన్నీ ఎండిపోయి, చిగురు పెట్టని చెట్లతో కళావిహీనంగా కానవస్తాయి. సారహీనమైన సంసారంలా వన్నెతగ్గి ఉసూరుమంటూవున్నాయి. ఏవిటో ఈ ప్రకృతి వైచిత్రి.
మా బస్సులో వచ్చిన గైడ్  పేరు చవాన్.
“కేదార్ లో పచ్చని చెట్లు విరివిగా వుంటాయి. కాబట్టి ఏమీ అనిపించదు. కానీ బదరీలో అలా చెట్లు లేవు. బాగా ఎత్తుకు పోయిన కొద్దీ ఆక్సిజన్ అందడం కష్టం. నడిచేటప్పుడు ఎక్కువగా మాట్లాడకండి. మాట్లాడితే ఆయాసం వస్తుంది. కాబట్టి ఎక్కడ తిరిగినా నెమ్మదిగా నడవండి, మౌనంగా వుండండి” అని హెచ్చరికగా చెప్పాడు.

గదిలో వున్నప్పుడు బాగానే వుండేది కానీ, బయటకు వచ్చినప్పుడు ఊపిరి పీల్చడం కష్టంగావుండేది. నాకే కాదు, అక్కడ అందరి విషయం అంతే. మనిషి  ముందూ వెనకా ఆలోచించకుండా, ఆశ కొద్దీ చెట్లన్నిటినీ కొట్టేయడం వలన కలిగిన దుష్ఫలితం ఇది.    (ఇంకా వుంది)