28, అక్టోబర్ 2014, మంగళవారం

పదును


పనికోసం వెళ్ళిన అతడికి యజమాని గొడ్డలి చేతికి ఇచ్చి చెట్ల మొద్దులు నరికే పని వొప్పచెప్పాడు. గిట్టుబాటు అయ్యే కూలీ కూడా బాగానే ఉండడంతో అతగాడు ఉత్సాహంగా మొదటి రోజునే ఇరవై మొద్దులు  నరికేసాడు. 'బాగా చేసావ్' అని యజమాని మెచ్చుకున్నాడు. ముందు చెప్పిన దానికన్నా ఎక్కువ కూలీ అతడి చేతిలో పెట్టాడు.
మరునాడు రెట్టించిన ఉత్శాహంతో అతడు ఎక్కువ మొద్దులు నరికి  కొట్టి యజమాని మెప్పుతో పాటు మరిన్ని డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. కానీ రోజల్లా కష్టపడ్డా పదిహేను మొద్దులే నరకగలిగాడు. మూడో రోజు పది మొద్దులు  కొట్టేసరికే ప్రాణాలు ఠావులు తప్పినంత పనయింది. ఆ సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతోంది.  కారణం అంతుపట్టలేదు కానీ కంగారు పెరిగిపోయింది.


యజమాని దగ్గరకు వెళ్లి చెప్పుకున్నాడు, 'వొంట్లో సత్తువ తగ్గిపోతోంది, మునపటిలా పనిచేయలేని నిస్సత్తువ ఆవరిస్తోంది, కారణం అర్ధం కావడం లేదు' అని.
అంతా విని యజమాని ఒకే ఒక ప్రశ్న అడిగాడు, 'గొడ్డలికి పదును పెట్టి ఎన్నాళ్ళయిందని'
'పదును పెట్టడమా! అంత తీరిక ఏది ? పొద్దస్తమానం చెట్ల మానులు నరకడంతోనే సరిపోతోంది'
అతడే కాదు మనలో చాలామందిమి అదే చేస్తాం. గానుగెద్దులా పని చేయడం ఒక్కటే కాదు మధ్య మధ్య కాసింత విశ్రాంతి తీసుకుంటూ వుండాలి. 'చేసే పనిని  మరింత బాగా ఎలా చేయొచ్చు' అని ఆలొచిస్తూ వుండాలి. వీలయితే కాస్త ధ్యానం, యోగం చేస్తూ వుండాలి.  స్టీఫెన్ కోవే అన్నట్టు, 'పదును' పెట్టే తీరిక చేసుకోలేకపోతే, చెట్లు కొట్టేవాడి కధలో మాదిరి  మనలో నిస్సత్తువ పెరిగిపోతుంది. పనిలో పాటవం తగ్గిపోతుంది.
(ఒక ఇంగ్లీష్ గల్పిక ఆధారంగా)

NOTE: Courtesy Image Owner 

27, అక్టోబర్ 2014, సోమవారం

మారథాన్



నడుస్తూనే వున్నాను
గత అరవై ఎనిమిదేళ్ళుగా
వాగులు  వంకలు దాటుకుంటూ
దారులు డొంకలు వెతుక్కుంటూ 
నడుస్తూనే వున్నాను 
కొన్ని చోట్ల నా దారి రహదారి
పలు చోట్ల దారంతా వరద గోదారి
ముళ్ళకంపలు చీకు మొక్కలు
గుంటలు, గతుకులు
పడుతూ లేస్తూ
నడుస్తూ వస్తుంటే అదోరకం   ఆనందం
అలా నడుస్తూ పోతుంటే ఇంకోరకం విషాదం 
ఈ నడక ఎన్నాళ్ళో తెలియదు
పరుగులాంటి నడకకు చివరి మజిలీ ఏదో  తెలుసు
కానీ చేరేదేప్పుడో మాత్రం  తెలవదు
అయితే ఈ నడకలో నేను వొంటరిని కాను
నాతోపాటు కోటానుకోట్లమంది భుజం భుజం కలిపి నడుస్తూనే వున్నారు
వారిలో కొందరే తెలుసు కొందరసలే తెలియదు
చాలా మంది ఎవ్వరో తెలియదు కానీ కలిసి నడవక తప్పదు
కొందరి భాష తెలుసు మరికొందరి యాస తెలుసు
చాలామంది ఊసే తెలవదు
నడిచి నడిచి ఒక్కోసారి అలసట అనిపిస్తుంది.
కానీ ఆగే పని లేదు,  ఆగడం మన చేతిలో లేదు
ఆగితే మాత్రం ఆగినట్టే
ఇక అక్కడితో నడక ఆగినట్టే
అదే ఆఖరి అడుగు
అదే చివరి మజిలీ 
కలిసి నడుస్తున్న వాళ్ళు లిప్తపాటు ఆగి చూస్తారు
అంతే!
మళ్ళీ నడక మొదలెడతారు.
నన్ను దాటుకుంటూ ముందుకెడతారు
నేను అక్కడే ఆగిపోతాను  
అయినా ఈ జీవన యానం అంతటితో  ముగిసేది కాదు 
ముగిసినట్టు అనిపించినా నిజానికి అది ముగింపు కాదు
మరో ప్రయాణానికి కొనసాగింపు.   

(27-10-2014)

NOTE: Courtesy Image Owner 

26, అక్టోబర్ 2014, ఆదివారం

తెగీ తెగని ఆలోచనలు


(The following is the translation of my younger son Santosh Bhandaru's  stray thoughts)
 

అపోలో ఆసుపత్రిలో డాక్టర్ భార్గవని కలవడం కోసం ఎదురుచూస్తున్నాను. మా అమ్మని చూపించడంకోసం గత ఆరేడు నెలలుగా నాకిది అలవాటయిపోయింది. పోయిన ప్రతిసారీ నాకక్కడ రకరకాల మనుషులు తారసపడుతున్నారు. వెయిట్ చేసే టైం పెరిగిపోతున్నకొద్దీ నేను గమనిస్తున్న వ్యక్తుల సంఖ్యకూడా క్రమంగా పెరిగిపోతూ వస్తోంది. వాళ్ళని చూస్తుంటే నాకు మొత్తం ప్రపంచంలోని వ్యక్తులనందర్నీ  అరచేతిలో ఉంచుకుని గమనిస్తున్న భావన కలిగేది.
వారిలో కొందర్ని చూడగానే స్తితిమంతులని తెలిసిపోయేది. వారి మాటలో, నడకలో, చూపులో అది కొట్టవచ్చినట్టు కనబడేది.   ఆడి, బీఎండబ్ల్యు, మెర్సిడెజ్ వంటి  ఖరీదయిన వాహనాల్లో ఆసుపత్రికి వచ్చాము సుమా అనే  అభిప్రాయం అవతలవాళ్ళకు కలిగేలా వారి ప్రవర్తన వుండేది. డాక్టర్ గారి అసిస్టెంట్ తో మాట్లాడేటప్పుడు ఇది మరీ కొట్టవచ్చినట్టు కనబడేది. ఇటీవలి కాలంలో ఈ మోస్తరు జనం మనకు మాల్స్ లో, సినిమాహాల్స్ లో, రెస్టారెంట్లలో మనకు కనబడుతూనే వున్నారు.
పొతే మరో రకం వాళ్ళున్నారు. వాళ్ళ మొహం చూస్తూనే చెప్పొచ్చు వాళ్ళు ఎంతో బాధలో వున్నారని. మొదటి రకం వారికంటే భగవంతుడు వీరిని కాసింత చిన్న చూపు చూసివుండవచ్చునేమో కానీ వీళ్ళూ డబ్బుకు అంతగా కటకట పడేవాళ్ళు కాదు. కానీ వీరి బాధకు రెండు కారణాలు. ఒకటి తాము అమితంగా ప్రేమిస్తున్న కుటుంబసభ్యుల అనారోగ్యం గురించిన కలత ఒక కారణం అయితే, పెరిగిపోతున్న ఆసుపత్రి ఖర్చుల గురించిన బెంగ మరో కారణం. వీటిల్లో ఏది ఎక్కువ వారిని చింతకు గురిచేస్తున్నదీ చెప్పడం కష్టం.
ఇక మూడో రకం. వీరు సమాజంలో కింది స్థాయికి చెందిన వాళ్ళు. అయితే వారికి ఒక విషయంలో మాత్రం స్పష్టమైన అవగాహన  వుంది, అదేమిటంటే ఇలాటి ఆసుపత్రిలో వైద్యం అంటే మాటలు కాదు, జేబు  పేలిపోయే బిల్లు చేతిలో పెడతారని వారికి తెలుసు. కానీ విచిత్రం ఏమిటంటే వారిని కలత పెట్టాల్సిన ఇలాటి విషయం వారికి చీమకుట్టినట్టు కూడా అనిపించకపోవడం. వారి సమస్య అల్లా ఇంత పెద్ద ఆసుపత్రిలో అయినా సరైన వైద్యం దొరుకుతుందా లేదా అనే.
కూర్చుని చూసే నాకు ఇన్ని రకాల మనుషుల్లో ఉన్న వైవిధ్యం అర్ధం అవుతూనే వుంది. కొందరు తమ ఆధిక్యత ప్రదర్శిస్తారు. కొందరు సాటి వారిపట్ల నిర్లిప్తంగా వ్యవహరిస్తారు. చుట్టు పక్కల వారినీ, చుట్టుపక్కల అసలేం  జరుగుతున్నదో అనే  విషయాలను మరి కొందరు అసలు పట్టించుకోకుండానే  గడిపేస్తారు.    అయితే అర్ధం కానిదల్లా ఒక్కటే. అదేమిటో చిత్రం బయట తమ స్థాయీ బేధాలను, భేషజాలను  ఇంతగా ప్రదర్శించే మనుషులు, డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు మాత్రం పూర్తిగా మారిపోతారు. కొత్త వ్యక్తుల్లా కనబడతారు. వారి మాటలో మార్దవం తొణికిసలాడుతుంది. వాళ్ళ నడకలో హుందాతనం గోచరిస్తుంది. వాళ్ళ పలకరింపులో మర్యాద, వాళ్ళ మోహంలో మందహాసం. ఒక్కసారిగా ఇలా మారిపోగలిగిన ఈ  మనుషులు, ఇలా మారగలిగిన శక్తి కలిగి వుండీ ఎందుకు  అదే మాదిరిగా  జీవించ లేకపొతున్నారు. సాటి వారిపట్ల అదేరకమైన  గౌరవ ప్రపత్తులను ప్రదర్శించలేకపోతున్నారు. తోటివారిపట్ల  మనుషుల ప్రవర్తనలో ఎందుకిన్ని తేడాలు కనిపిస్తున్నాయి?

తెలుసుకోవడానికే ఇన్నాళ్ళు పట్టింది, తెలియడానికి ఎన్నేళ్ళు పడుతుందో?


NOTE: Courtesy Image Owner

25, అక్టోబర్ 2014, శనివారం

ప్రపంచాన్ని వణికిస్తున్న 'ఎబోలా' ముప్పు

(Published by 'SURYA' Telugu Daily in its Edit Page on 26-10-2014, SUNDAY)
ప్రపంచ జనాభాలో అత్యధికులను  ఓ మూడక్షరాల పదం వణికిస్తోంది. 'ఎబోలా' అనే వ్యాధి ఛాపకింది నీరులా వ్యాపిస్తోందని ఏకంగా ప్రపంచ  ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించిందంటే పొంచివున్న పెను ముప్పు ఎలాటిదో అర్ధం చేసుకోవచ్చు.
ఎబోలా అనే పేరు గల వ్యాధి ఒకటి  వుందని కొన్నేళ్ళ ముందువరకు అనేక దేశాలకు తెలియనే తెలియదు. ఇది సాధారణ వ్యాధి కాదనీ, చాలా ప్రమాదకరమైనదనీ, ప్రాణాంతకమైనదనీ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో గడగడలాడించిన స్వైన్ ఫ్లూ వ్యాధి గాలి ద్వారా వ్యాపించేది. అయితే ఎబోలా వైరస్  అంతకంటే చురుగ్గా త్వరగా పాకిపోతుంది.  ఈ వ్యాధి  యెంత త్వరగా తేలిగ్గా వ్యాపిస్తుందంటే, ఎబోలా రోగిని తాకినా, లేదా ఆ రోగి చెమట చుక్క ఇతరులపై చిందినాకూడా  వారికి ఈ వ్యాధి వైరస్  సోకుతుంది.  ఇప్పటికే పశ్చిమాఫ్రికా దేశాల్లో వేలాదిమంది ఈ వ్యాధి కారణంగా అసువులుబాశారు. అభివృద్ధి చెందిన అమెరికా ఐరోపా దేశాలను కూడా ఈ వ్యాధి విడిచిపెట్టలేదు. ఆ దేశాలలోని వైద్యనిపుణులకు ఎబోలా పెను సవాలుగా మారుతూ,  అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా వ్యవహరించని కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్లీస్ వాపోవాదం గమనార్హం. ఆ దేశంలో ఎబోలా బారిన పడి రెండువేలమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ తరువాత జాగ్రత్తపడి తీసుకున్న చర్యల కారణంగా ఎబోలా బాధితుల సంఖ్య పెరగకుండా అడ్డుకట్ట వేయగలిగామని ఆమె అన్నారు. తమ దేశ ఆర్ధిక వ్యవస్థను సైతం ఈ వ్యాధి అతలాకుతలం చేసిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఎబోలా వ్యాధికి అడ్డుకట్ట వేయడం చిన్న చిన్న దేశాలకు అలవి కాని పని అనీ, ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం నుంచి  సహకారం అవసరమని సర్లీస్ చెప్పిన మాటలు మిగిలిన దేశాలకు ఒక హెచ్చరిక లాంటివి.  
ఆ దేశాల పరిస్తితి ఈ విధంగా వుంటే, ప్రజారోగ్యం విషయం అంతగా పట్టించుకోవన్న పేరుపడిన  ఆసియా దేశాలు, పొంచివున్న ఈ పెను ముప్పును ఎలా తప్పించుకోగలుగుతాయి అన్నది సమాధానం దొరకని ప్రశ్న. ఈ వ్యాధి కేవలం పశ్చిమాఫ్రికా దేశాలకు పరిమితమై వున్నప్పుడు పరిస్తితి వేరు. భారతీయులు అత్యధిక సంఖ్యలో నివసిస్తూ అనునిత్యం రాకపోకలు సాగిస్తున్న అమెరికా, ఐరోపా దేశాలల్లో కూడా ఎబోలా జాడలు బయటపడుతున్న తరుణంలో ఇక ప్రమత్తంగా వుండడం ఏమాత్రం మంచిది కాదు  అన్న భావన క్రమంగా ప్రబలుతోంది. భారత దేశంలోని మీడియా కూడా ఈ విషయంలో తన బాధ్యతను గుర్తెరిగి ఎబోలా ఎంతటి ప్రాణాంతకమైనదో సవివరంగా ప్రజలకు తెలియచెప్పే  కర్తవ్యాన్ని నెత్తికెత్తుకున్నాయి. ఒక రకంగా ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన ఈ రకం విధులలో పత్రికలు, మీడియా కూడా పాలుపంచుకోవడం ముదావహం.
ఎబోలా అనేది కొత్త వ్యాధి. ఈ వ్యాధి వైరస్  ఎలా వ్యాపిస్తుందో కనుక్కోగలిగారు కాని దీన్ని అరికట్టే వాక్సిన్ కానీ ఔషధాలను కానీ ఇంతవరకు కనుగొనలేదు. కేవలం రోగిని తాకడం ద్వారా వ్యాపించే  గుణం ఉండడంతో ఈ వ్యాధికి చికిత్స చేయగల వైద్య సిబ్బంది కూడా కరువవుతున్నారు. ప్రస్తుతం  పశ్చిమాఫ్రికా దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. రోగ లక్షాలను తెలుసుకుని రోగిని గుర్తించడం ఒక  సమస్య అయితే,  ఆ రోగికి వైద్య సహాయం అందించే సిబ్బందిని వెతికి పట్టుకోవడం మరో సమస్య. అయితే ఈ సమస్యకు  సమర్ధవంతమైన పరిష్కారం కనుగొన్న  దేశం ఒకటి వుంది. ఎబోలా అనే ఈ మూడక్షరాల మహమ్మారికి క్యూబా అనే రెండక్షరాల దేశం ముకుతాడు వేసే పనికి పూనుకుంది. ఇంకో విశేషం ఏమిటంటే ఆ వ్యాధి ఇంతవరకు ఆ దేశంలో పొడసూపలేదు.  ఈ వ్యాధి పొటమరించిన ఆఫ్రికా ఖండానికి కొన్ని వేల మైళ్ళ ఆవల వున్న దేశం అయినప్పటికీ, క్యూబా తన బాధ్యతగా  ఎబోలా వ్యాధి పీడిత దేశాలకు అండగా నిలిచింది. ఈ విషయంలో క్యూబా నిర్వర్తిస్తున్న పాత్ర అనితర సాధ్యం. ఈ కితాబు ఇచ్చింది ఎవరో కాదు. క్యూబా పొడకూడా గిట్టని  అమెరికాలోని ప్రధాన వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్. ఈ పత్రిక  ఈ మధ్య ఏకంగా క్యూబా కృషి గురించిన ఓ సవివర వార్తా కధనాన్ని ప్రచురించింది. నిజానికి అమెరికా ఈ వ్యాధి నివారణ చర్యల విషయంలో ముందంజ వేయకపోయినప్పటికీ, ఆ అమెరికా పత్రిక కధనంతోనే ఈ వ్యాధిపట్ల అవగాహన పెంపొందించుకోవడానికీ,  ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయంలో మిగిలిన దేశాలకు ఒక మార్గం దొరికినట్టయింది. మిగిలిన దేశాలన్నీ వ్యాధి పట్ల గుండెలు బాదుకుంటూ, చేతులుకట్టుకుని కూర్చుంటే క్యూబా మాత్రం తనవంతు సాయంగా క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బందిని ఈ వ్యాధి పీడిత దేశాలకు సాయంగా పంపింది. వాస్తవానికి ఈ వ్యాధి వేలాదిమందికి సోకినా వారిలో అధిక సంఖ్యాకులు రోగులకు వైద్యసాయం అందించిన సిబ్బందీ డాక్టర్లే కావడం విశేషం. చికిత్స అందించేవారే రోగం బారిన పడుతూ ఉండడంతో సాయం అందించేవారి కొరత ప్రధాన సమస్యగా మారింది. క్యూబా ఈ విషయంలో గణనీయమైన సేవా పాత్ర పోషించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక శ్లాఘించింది. పశ్చిమాఫ్రికా  దేశాలు ఈ వ్యాధిని ఎదుర్కోవడంలో పడుతున్న ఇబ్బందులను గమనించిన  క్యూబా తక్షణం స్పందించి తన వైద్య బృందాలను, అవసరమైన మందులను హుటాహుటిన ఆదేశాలకు తరలించింది. సొంత దేశంలోని వైద్యులే సాయం చేయడానికి తటపటాయిస్తున్న తరుణంలో క్యూబా అందిస్తున్న  ఈ ఆపన్న హస్తం ఆ దేశాలకు వరప్రసాదంగా మారింది.  రోగులకు చికిత్స  అందిస్తూ వైరస్ సోకిన వారిలో క్యూబన్ వైద్య సహాయక బృంద సభ్యులు కూడా వున్నారు. అయినా వారు వెరవకుండా సహాయక చర్యల్లో పాల్గొనడం ఆ దేశాలవారిని నివ్వెరపరుస్తోంది. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి  వెళ్ళింది. దానితో  ఎబోలా  వ్యాధిని అరికట్టే విషయంలో ఏం చేయాలనే దానిపై ఆ సంస్థ క్యూబన్ వైద్య నిపుణుల  సాయం కోరాల్సిన పరిస్తితి ఏర్పడింది.                                  
ఈ క్యూబా కధనం అలా ఉంచితే, మన దేశంలో పరిస్తితి వేరేగా వుంది. 'సమస్య ఎదురయినప్పుడు చూసుకుందాం, ఇప్పటినుంచీ ఎందుకు లాయిలాసా' అనేవాళ్ళు ఎక్కువున్న దేశం కాబట్టి ఎబోలా  గురించి ఆందోళన పడేవాళ్ళు తక్కువనే చెప్పాలి. అయినా కొన్ని పత్రికలు పట్టించుకుని ప్రచురిస్తున్న కధనాలు కొంత కదలిక తెచ్చాయనే అనుకోవాలి.
ఎబోలా అనేది ప్రాణాంతక వ్యాధి అని ముందే చెప్పుకున్నాం. రక్తం, చెమట, లాలాజలం ద్వారా ఆ వైరస్ త్వరితగతిన ఇతరులకు సోకుతుంది. జ్వరం, తలనొప్పి, వాంతులు, అలసట, కీళ్ళ నొప్పులు,  కడుపు నొప్పి, ఆకలి మందగించడం ఈ వ్యాధి లక్షణాలు. అయితే ఇవన్నీ షరా మామూలుగా  జనాలకు అలవాటయినవే. ఈ లక్షణాలు  వుంటే వారికి ఈ వ్యాధి సోకినట్టుగా కంగారు పడనక్కరలేదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్యుల సలహా. చేతులు శుభ్రంగా సబ్బుతో  కడుక్కోవాలి. పరిసరాల్ని పరిశుభ్రంగా వుంచుకోవాలనీ, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలనీ వాళ్ళు చెబుతున్నారు. ఇవన్నీ మామూలుగా చెప్పే విషయాలే కావడంవల్ల జనం అంతగా  పట్టించుకునే అవకాశాలు కూడా వుండవు. కాకపోతే ఈ వ్యాధి తీవ్రత పట్ల అవగాహన పెంచడం అవసరం. ఎందుకంటె ఒకసారి ఈ వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయితే ఇక ఆ రోగి మరణానికి చేరువ అయినట్టే అన్నది వైద్యులు చేసే హెచ్చరిక. చెవులు, ముక్కు, దేహంలోని ఇతర బాహ్య రంధ్రాల ద్వారా అపరిమితమైన  రక్తస్రావం జరిగి  రోగి, కొన్ని వారాల్లోనే ప్రాణాలు కోల్పోతాడు అనేది వాళ్ళు చెప్పే మరో బహుపరాక్. బయట తిండ్లు మానుకోవడం లేదా తగ్గించడం  మంచిదని వారిచ్చే ఇంకో సలహా.  
ఇటీవల ఢిల్లీలో ఎబోలా వ్యాధి గురించి ఓ అవగాహనా గోష్టి నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులతో పాటు ప్రవేటు డాక్టర్లు  కూడా దీనికి హాజయ్యారు. భారతదేశం వంటి సువిశాల దేశంలో, జనసాంద్రత ఎక్కువ వున్న దేశంలో ఎలోబా వంటి వ్యాధుల లక్షణాలను రోగుల్లో ఖచ్చితంగా గుర్తుపట్టి, వారిని మిగిలిన రోగులనుంచీ, జనాలనుంచీ వేరుచేసి విడిగా వైద్యం  పరిస్తితులు పరిమితంగా వుంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సంయుక్తంగా, కలసికట్టుగా, ఎంతో సమన్వయంతో, కార్య దీక్షతో, మినుమిక్కిలి   నిబద్ధతతతో - నిర్విరామ కృషి చేయగలిగితే కొంత మేరకు ఫలితం ఉండొచ్చు.అయితే,  క్యూబా డాక్టర్లను ఆదర్శంగా తీసుకుని వైద్యం చేసే సిబ్బంది మన దేశంలో చాలా అరుదన్నది  చాలామంది అభిప్రాయం.
ఎబోలా వ్యాధిని ఎదుర్కునే కృషిలో మొదటి, చివరి అవరోధం ఇదొక్కటే.
(25-10-2014)


24, అక్టోబర్ 2014, శుక్రవారం

ఛ ఛ ....


'ఛ ఛ ....అలా అనకుండా వుండాల్సింది' అన్నాడు రామా రావు
వచ్చిన పావు గంటలో  అతడలా అనడం నాలుగోసారి. అనకుండా వుండాల్సింది అంటాడే కాని అన్నది ఏమిటో చెప్పడు. బహుశా తలచుకోవడానికి కూడా మనస్తాపం  కలిగించే విషయమేమో. అందుకే నేనూ  'విషయం ఏమిటీ' అని రెట్టించి అడగలేదు.
కాసేపయిన తరువాత కాస్త కుదుటపడ్డాడేమో గొంతు సవరించుకుని చెప్పడం మొదలెట్టాడు.


'మన సుబ్బారావు లేడూ, ఓహో నీకు తెలవదు కదూ, నేనీ వూరు వచ్చిన కొత్తలో పరిచయం అయ్యాడు. ఇట్టే కలిసిపోయే రకం. ఇద్దరికీ సంబంధం లేని ఓ పనికిరాని వెషయం మీద మొన్నోరోజు  మాటా మాటా అనుకున్నాం. నిజానికి నాదే తప్పు. కానీ నా మాటే నెగ్గాలనే పంతంలో  నోటికి వచ్చినట్టు ఒక మాటకు పది అనేసాను. పాపం చిన్నబుచ్చుకుని మొహం ఇంత చేసుకుని వెళ్ళాడు. అతడు వెళ్ళిన తరువాత నాకనిపించింది, అతడివాదనలో తప్పేమీ లేదని. అనవసరంగా అతడి మనసుని  కష్టపెట్టానని అనిపించింది. అతడింటికి  వెళ్ళి 'సారీ!  తప్పు నాదే. ఏమనుకోకు, క్షమించు'  అని చెప్పాలని కూడా అనిపించింది. కానీ పోలేదు. ఇప్పుడు పోవాలన్నా పోలేను'
'ఏమిటి ఎందుకని'
'ఎందుకంటే  మేము మాటా మాటా అనుకున్న  రాత్రే గుండెపోటు వచ్చిపోయాడు. మర్నాడు సుబ్బారావు కొడుకు ఫోను చేసి  చెప్పాడు"

'ఛ ఛా....' అనుకున్నాడు రామారావు మరోసారి.
NOTE: Courtesy Image Owner 

22, అక్టోబర్ 2014, బుధవారం

ఆకాంక్ష



మీ గృహ ప్రాంగణంలో
మీ హృదయాంగణంలో
దీపావళి దివ్య కాంతులు
వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ -

- నిర్మలాదేవి, భండారు శ్రీనివాసరావు       


20, అక్టోబర్ 2014, సోమవారం

మంచివాళ్ల మౌనం



ఈనాడు అనేక వర్గాల్లో ఒక విషయం పై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జాతి జనులు అనుభవిస్తున్న అనేకానేక కష్ట నష్టాలకు, వాటిల్లుతున్న అనర్ధాలకు మంచివాళ్ళ మౌనమే కారణం అన్న వాదన మీడియాలో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో సాగుతోంది.
సమాజంలో మంచివాళ్ళు, ప్రత్యేకించి మేధావులు అనే బుద్ధి జీవులు (మంచివాళ్ళందరూ మేధావులు కారు, మేధావులందరూ మంచివాళ్ళు కారు అని వాదించే వర్గం ఒకటుంది. అది వేరే సంగతి) మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని, ఈ వర్గాలు నోరు మెదిపి దిశానిర్దేశం చేయగలిగితే, ప్రజలను సరైన ఆలోచనాపధంలో పెట్టగలిగితే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయనీ ఈ వాదనల సారాంశం. సమాజాన్ని పట్టి పీడిస్తున్న రాజకీయ అవినీతి పట్ల స్పందించాల్సిన విధంగా మేధావులు వ్యవహరించకపోవడం వల్లనే ప్రజలు అవినీతి లంచగొండితనం వంటి సాంఘిక రుగ్మతల పట్ల నిర్లిప్తంగా ఉంటున్నారని ఆ సారాంశంలో దాగున్న భావం.
అనేకానేక రాజకీయ అవినీతులు, అధికార దుర్వినియోగాల విషయాల్లో,  విశ్లేషకులు, మేధావులు తగు విధంగా స్పందించకపోవడం వల్ల, సాధారణ ప్రజల్లో కూడా అవినీతి ఒక చర్చనీయాంశం లేదా ఒక ప్రాధాన్యత కలిగిన విషయం కాకుండా పోతోందని వాదించే రాజకీయ నాయకులు చాలామంది కనబడతారు. దానికి కారణం ఒక్కటే. ఆ ఆరోపణలు చేసేవారికి కూడా తగిన నైతిక బలం లేకపోవడమే. ఎక్కువ తక్కువ అనే తేడా తప్పితే, అవినీతికి ఎవరూ అతీతులు కాకపోవడమే. అందువల్లనే సాధారణ ప్రజల్లో సయితం 'అవకాశం దొరికితే అందరూ అందరే ' అన్న భావం నానాటికీ ప్రబలుతోంది. 'బర్రెలు తినే వాడికంటే గొర్రెలు తినేవాడు మేలుకదా' అంటే అది వేరే సంగతి.
ఇది జరిగి చాలా ఏళ్ళయింది. 1987 లో అనుకుంటాను అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తన బాధ్యతలకు కొంత దూరంగా లక్షద్వీప్ లో సేద తీరేందుకు సకుటుంబ సపరివార సమేతంగా విహార యాత్రకు వెళ్ళడం ఆరోజుల్లో పత్రికల్లో పెద్ద దుమారం రేపింది. ఆయన బృందంలో కుటుంబ స్నేహితుడయిన సినిమా నటుడు అమితాబ్ బచ్చన్ కూడా వున్నారు.


(లక్ష ద్వీప్ లో రాజీవ్ పరివారం విడిది చేసిన 'బంగారం' దీవి) 


ఆరోజుల్లో నేను హైదరాబాదు చిక్కడపల్లిలో ఉండేవాడిని. మా ఇంట్లో ఒక ఫోను వున్నా అది మూగనోము పట్టిన సందర్భాల్లో ఫోను అవసరం వచ్చినప్పుడు దగ్గరలో వున్న ఒక ప్రభుత్వ అధికారి ఇంటికి వెళ్ళేవాడిని. ఆయనకు మంచి నిజాయితీపరుడు అన్న పేరు ఇంటాబయటా బాగా పేరుకుపోయివుంది. చాలా సార్లు నా అనుభవం ఏమిటంటే అలా వెళ్ళినప్పుడు ఆయన భార్య బొంబాయిలో ఉంటున్న వాళ్ళ అమ్మాయితో ఎస్ టీ డీ లో మాట్లాడుతుండేది. ఆ సమయంలో ఆ అధికారి నన్ను కూర్చోబెట్టి, విలేకరిని కాబట్టి అ విషయం ఈ విషయం ముచ్చటిస్తూ వుండేవారు. అలా ఒకరోజు ఆయన నోటి నుంచి వచ్చిందే రాజీవ్ గాంధీ లక్షద్వీప్ యాత్ర. ఇది ఆయనకు సుతరామూ నచ్చినట్టులేదు. 'యెంత ప్రధాన మంత్రి అయితే మాత్రం అలా ప్రభుత్వ ఖర్చుతో ఇలా విలాస యాత్రలు చేయడం ఏం సబబు' అనేది ఆయన ఆవేదన. కానీ అదేసమయంలో ఆయన భార్య అరగంట నుంచి ఎస్టీడీ లో ప్రభుత్వం సమకూర్చిన ఫోనులో మాట్లడుతున్నదేమిటంటే, పోయిన  పండక్కి కొన్న చీరెల రంగులూ, వాటి  అంచులు  గురించిన వివరాలు. వాళ్ళమ్మాయి కొనుక్కున్న చీరెల గురించిన ఆరాలు. తల్లీకూతుళ్ళ ముచ్చట్లు ఇలా  అప్రతిహతంగా టీవీ సీరియల్ మాదిరిగా సాగిపోతూ ఉండగానే,  ప్రభుత్వ వాహనంలో ఆఫీసు గారి పిల్లల్ని తీసుకువెళ్ళి స్కూల్లో దింపి డ్రైవర్ వచ్చాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆయన, వెంటనే సుల్తాన్ బజారో, ఆబిడ్సో వెళ్లి  ఏదో వక్కపొడి డబ్బా కొనుక్కు రమ్మన్నాడు. డబ్బులు ఇచ్చిందీ లేనిదీ నేను చూడలేదు. ఆ డ్రైవర్ వెళ్ళగానే మళ్ళీ అయన రాజీవ్ గాంధీ విషయం ఎత్తుకున్నాడు. 'ఇలా ప్రభుత్వధనం ఖర్చుచేయడానికి పద్దూ పాడూ అక్కరలేదా' అన్నది ఆయన ప్రశ్న. ఆఫీసరు గారి భార్య  ఫోను సంభాషణ ఇంతట్లో తెమిలే అవకాశం లేదని గ్రహించి నేనే ఏదో సాకుచెప్పి బయటపడ్డాను. ఇలాటి సంఘటనల వల్ల అనండి కారణం ఏదయినా చెప్పేదానికీ చేసేదానికీ పొంతనవుంటేనే చెప్పేదానికి నిబద్దత వుంటుందన్న అభిప్రాయం క్రమంగా మనసులో గూడుకట్టుకోవడం మొదలయింది.
'మా పిల్లవాడు పంచదార తింటున్నాడు ఎలా మానిపించాలి' అని ఒక తల్లి స్వామీజీని  అడిగితే మూడు రోజుల తరువాత తీసుకురమ్మని పంపించేస్తాడు. ఆ తరువాత వచ్చినప్పుడు 'బాబూ. పంచదార అలా ఎక్కువ ఎక్కువ తినడం వొంటికి మంచిది కాదు' అని హితవు చెబుతాడు. 'ఆ ముక్కేదో మొన్నే చెప్పవచ్చుకదా' అన్నది  తల్లి సందేహం. 'చెప్పొచ్చు కానీ నాకూ పంచదార తినే అలవాటు వుంది. ముందు నేను మానేసిన  తరువాత కదా మీ పిల్లాడికి చెప్పాలి' అంటాడు ఆ స్వామి.  ఎప్పుడో చదివిన ఇలాటి నీతి కధలూ, ఇలా ఎదురయిన సంఘటనలు మొత్తం మీద నా మనసుపై చెరగని ముద్ర వేసాయి. 'విమర్శించేవారు, ఆరోపణలు చేసేవారు కూడా సచ్చీలురుగా వుండడం అవసరం. లేకపోతే వాటికి నిబద్దత వుండదు. 'రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలు చేసేవాళ్ళు సామాన్యులు అయితే వాటిని వెంటనే పట్టించుకోవాలి'. ఇదీ నా థియరీ. ఒక పక్క తాము అదే పనిచేస్తూ ఇతరులకు నీతి పాఠాలు బోధించడం ఎబ్బెట్టుగా వుంటుంది. ఇలా ఛానళ్లలో పదేపదే చెప్పడం వల్ల అవినీతిని సమర్ధించేవారి  జాబితాలో నా పేరు కూడా కలిపేసి మాట్లాడ్డం మొదలుపెట్టారు. 'పోనీలే అవినీతి సమర్ధకుడినే కాని 'అవినీతి పరుడిని అనలేదు కదా' అని నన్ను నేనే సముదాయించుకున్నాను.
నీతికీ, అవినీతికీ నడుమ పైకి కనబడని చిన్న గీత మాత్రమే విభజనరేఖ. ఓ మోస్తరు దుర్వినియోగం కొందరి దృష్టిలో నీతి బాహ్యం కాదు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లూ, కార్లూ ఇందుకు ఉదాహరణ.
ప్రభుత్వ అధికారుల ఇళ్ళల్లో అధికారికంగా ఫోన్లు వుండడం కొత్తేమీ కాదు. ఆఫీసు వేళల్లో కాకుండా అవసరమైనప్పుడు పైవారు సంప్రదించడానికి వీలుగా ఈ సౌకర్యం వుంటుంది. 'సెల్ ఫోన్లు వచ్చిన తరువాత కూడా ఈ ఖర్చు అవసరమా' అని ఆర్ధిక శాఖలో ఒక ఉన్నతాధికారిని అడిగితే, ఆయన నుంచి చిరునవ్వే జవాబు. ప్రభుత్వ వాహనాల దుర్వినియోగం గురించి యెంత తక్కువ  చెప్పుకుంటే అంత మంచిది. వెనక అంటే ఓ నాలుగు దశాబ్దాల క్రితం ఒక వారపత్రికలో వచ్చిన కార్టూన్ నాకు బాగా గుర్తుండిపోయింది.
ఒక సినిమా హాలుకు జిల్లా కలక్టర్ గారు భార్యను తీసుకుని ప్రభుత్వ జీపులో వస్తాడు. (ఆ రోజుల్లో కలెక్టర్లకు కూడా జీపులే). జిల్లా వైద్యాధికారి అంబులెన్సులో వస్తాడు. పురపాలక శాఖ అధికారి ' మీ వీధులను మురికి చేయకుడి' అని రాసివున్న చెత్త లారీలో వస్తాడు. అగ్నిమాపక అధికారి ఏకంగా గంటలు మోగించుకుంటూ 'అగ్నిమాపక వాహనంలో వచ్చేస్తాడు.
కార్టూన్ లో కాస్త ఘాటు ఎక్కువ ఉండవచ్చు. కొంత అతిశయోక్తి కూడా ఉండవచ్చు. కానీ ప్రభుత్వ వాహనాల  దుర్వినియోగానికి ఓ మేరకు అయినా అద్దం పడుతోంది.

ఇప్పుడు చెప్పండి నీతులు వున్నవి ఎవరికోసం? పక్కవారికి చెప్పడం కోసమేనా!

ఇక అసలు విషయానికి వద్దాం. మా పక్కింటి ఆఫీసరు ఆగ్రహానికీ, పత్రికల్లో విమర్శాత్మక కధనాలకు దారితీసిన రాజీవ్ గాంధి విహార యాత్ర గురించి చెప్పుకుందాం.
1987లో కారణం ఇదీ అని చెప్పలేము కాని ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ నాయకుల  'బుర్రలు వేడెక్కిపోయి' వాటిని చల్లబరచుకోవడానికో ఏమో విహార యాత్రలకు  వరుస కట్టారు. ఆనాటి సోవియట్ యూనియన్ అధినేత మిహాయిల్ గోర్భచేవ్ రష్యాలోని నల్లసముద్ర తీరంలో విడిది చేయడానికి వెడితే, అమెరికా అద్యక్షుడు రోనాల్డ్ రీగన్ శాంటా బార్బరా వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. రాజీవ్ గాంధి లక్షద్వీప్ లో గడిపారు. ముప్పయ్యారు దీవుల సమూహం అయిన లక్షద్వీప్ లో 'బంగారం' అనే ఒక చిన్న దీవిలో నిర్మించిన అతిచిన్న కాటేజీలో భార్య సోనియా, కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంక లతో కలిసి మెదడు వేడెక్కించే రాజకీయాలకు, అలసట కలిగించే దినవారీ ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ప్రధాని సేదతీరారు.
ప్రధానమంత్రి విశ్రాంతిగా గడిపే ప్రాంతాన్ని అధికారులు అతి గోప్యంగా ఉంచడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, 'రవి కాంచని చోట రవి కాంచును' అన్న చందాన పత్రికా విలేకరులు మాత్రం పనిగట్టుకుని  ప్రధాని విహార యాత్రావిశేషాలను ఏరోజుకారోజు బాహ్య ప్రపంచానికి ఫొటోలతో సహా తెలియచేసారు. 


(ఉల్లాసంగా ఉత్సాహంగా రాజీవ్ బృందం) 
    

సోనియా తల్లిగారు, అమితాబ్ ఆయన భార్య జయాబాధురి,  రాజీవ్ అతిధులుగా ఈ విహారయాత్రలో పాల్గొన్నారు. మనుష్య సంచారం లేని ఆ దీవిలో రాజీవ్ పరివారం చాలా హాయిగా, ఉల్లాసంగా  గడిపారు. సముద్రంలో ఈతలు కొట్టారు. వెచ్చని ఇసుకలో పడుకుని  సూర్యరశ్మితో  చలికాగారు. చేపలవేట, ఇసుకతిన్నెలపై విందు భోజనాలు, తీరంలో షికార్లు ఇలా స్వేచ్చగా రోజులు గడిపారు. రాజీవ్, రాహుల్, ప్రియాంకలు సముద్ర జలాల్లో ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడితే,  ఆస్తమా వున్న సోనియా మాత్రం - అడుగు భాగంలో అద్దాలు బిగించిన పారదర్శక  పడవుల్లో తిరుగుతూ అపురూపమైన జలచరాలను చూస్తూ కాలక్షేపం చేసారు. తీరంలో కొబ్బరి చెట్ల  నీడన కూర్చుని, కొబ్బరి నీళ్ళు తాగుతూ  జయా బచ్చన్ తో కబుర్లు చెబుతూ గడిపారు. రాజీవ్ గాంధీ మాత్రం ఆ ప్రదేశాలతో చిరకాల పరిచయం వున్నవాడిలా అన్ని ప్రాంతాలను కలయ తిరిగారు. గాయపడి వొడ్డున పడివున్న ఒక డాల్ఫిన్ ని కాపాడి దాన్ని తిరిగి సముద్రజలాల్లోకి చేర్చారు.
ఈ విహారయాత్రలో రాజీవ్ దంపతులు, ఆయన బృందంలోని ఇతర సభ్యులు  యెంత ఉల్లాసంగా గడిపి యెంత సంతోషాన్ని మూటగట్టుకున్నారో తెలియదు కానీ ఆ తరువాత రోజుల్లో ఈ యాత్ర గురించి పత్రికల్లో వచ్చిన ఆసక్తికర ఊహా  కధనాలు, రాజకీయ ప్రత్యర్ధుల విమర్శలు వారిని అంతకంటే ఎక్కువ బాధించి వుంటాయి.
ఆ ఊహాగాన వివరాలు కొన్ని ఇలావున్నాయి.
"ఢిల్లీ నుంచి పెద్ద మొత్తంలో ఖరీదైన విదేశీ, స్వదేశీ మద్యం సీసాలు అక్కడికి తరలించారు. అగట్టీ అనే చోట ఏకంగా ఓ కోళ్ల ఫారాన్నే ఏర్పాటుచేశారు. పళ్ళూ ఫలాలు లెక్కలేకుండా అక్కడికి చేర్చారు. పిల్లలు ఇష్టపడి తినే ఖరీదైన చాకొలెట్లు, బిస్కెట్లు కొదవలేకుండా సప్లయి  చేసారు. అప్పటికప్పుడే సముద్రంలో వేటాడి పట్టుకున్న చేపలు, లక్షద్వీపుల్లో మాత్రమే  దొరికే అరుదయిన ఫలాలు, తాజా కాయగూరలు, కిలోలకొద్దీ బాస్మతీ బియ్యం, దేనికీ కొదవలేకుండా, కొరత రాకుండా అక్కడికి చేర్చారు. ఇక యాత్రకు అయిన ఖర్చు తలచుకుంటే బెంబేలెత్తేలా వుంది" అంటూ ఎవరికి తోచిన అంచనాలు వాళ్ళు రాసారు.  లక్షద్వీప్ అధికారి ఒకరు ఈ ఊహాగానాలపై స్పందిస్తూ,  ఒక మాట చెప్పారు. 'ప్రధాని విహార యాత్రకు మేము ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చేయలేదు. ఆయన్నీ  ఆయన పరివారాన్నీ బంగారం దీవిలో వొదలడం  వరకే మా బాధ్యత. ఆ తరువాత అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేసుకున్నారు. ఖర్చుచేసిన దానికి చెల్లింపులు జరపడానికి బిల్లులను  రాజీవ్ గాంధీ పేరున పంపమన్నారు'


మొత్తం మీద రాజీవ్ గాంధీ విహారయాత్ర ఆ విధంగా విమర్శలతో ముగిసింది. కాకపొతే, ఈ దుమారం వల్ల కలిగిన ప్రచారంతో, లక్షద్వీప్ దీవులకు పర్యాటకుల తాకిడి బాగా పెరిగిపోయిందని పర్యాటక శాఖవారు సంబరపడిపోయారు.