24, మే 2014, శనివారం

దటీజ్ మోడీ మోటివేషన్ పవర్

నమో సునామి నమో నమామి
ఇప్పుడు దేశమంతటా మోడీ అనే రెండక్షరాలే మోగిపోతున్నాయి. ఆయన్ని గురించిన కధనాలతో పత్రికలు నిండిపోతున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు గురించి ఒక మిత్రుడు పంపిన సమాచారం. ఆయనకు అంటే నా మిత్రుడికి తెలుగు తెలియదు.
మోడీ గుజరాత్ సీతయ్య.  కాకపొతే కొంత తేడా వుంది. మన తెలుగు సీతయ్య ఎవడి మాటా వినడు. ఈ గుజరాత్ సీతయ్య అందరి మాటా వింటాడు కానీ చివరకు తాను అనుకున్నదే చేస్తాడు.


ఉదాహరణకు రాష్ట్రంలో చిన్నపిల్లల్ని స్కూళ్లకు పంపేలా వారి తలితండ్రులను ప్రోత్సహించడం యెలా అన్న ఆలోచన వచ్చిందనుకోండి. వెంటనే సంబంధిత అధికారుల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ల అభిప్రాయాలను సావధానంగా వింటారు. తమ మనసులో మాట స్వేచ్చగా ధైర్యంగా చెప్పేలా అధికారులను ప్రోత్సహిస్తారు. మధ్యలో భోజన సమయం అయితే పదిహేను నిమిషాల్లో ఆపని ముగించుకుని మీటింగుకు హాజరు. అందరూ చెప్పింది జాగ్రత్తగా విని తాను ఒక అభిప్రాయానికి వచ్చి ఏం చేయాలో ఆ ఆదేశాలు జారీచేస్తారు. ఆ తరహా చూసిన వారికి ఒక మిలిటరీ అధికారి తన సైన్యానికి ఆదేశాలు జారీ చేసే విధానం గుర్తుకు రాకమానదు. ఇక అప్పటినుంచి ఆ కార్యక్రమం  పురోగతి గురించి వెంట వెంటనే సమీక్షా సమావేశాలు. ఎప్పటికప్పుడు పరిస్తితిని బేరీజు వేసుకుని తదుపరి ఆదేశాలు. వేసవి సెలవుల్లో మండుటెండలను లెక్కపెట్టకుండా అధికారులను వెంటేసుకుని ఒక నెలంతా పల్లెల్లో పర్యటించి పిల్లల చదువు ప్రాధాన్యతను గురించి ప్రతి ఒక్కరికీ వివరించే ప్రయత్నం మరోపక్క. ఫలితం గురించి చెప్పే పని ఏముంటుంది. రెండేళ్లలో స్కూళ్ళల్లో చేరే పిల్లల సంఖ్య  ఇరవయ్యారు శాతం నుంచి నూటికి  నూరు శాతానికి పెరిగిపోయింది. 
దటీజ్ మోడీ మోటివేషన్ పవర్.

వడ డెబ్బ


శుక్రారం నాడు సూరీడు హైదరాబాదు నగరాన్ని కాల్చుకు తిన్నాడు. 'ఫ్రై డే' కదా! బాగా 'ఫ్రై' చేసి వొదిలాడు.
ఎందుకైనా మంచిదని ఇంటి పట్టునేవున్నా. అయినా 'వడ డెబ్బ' కొట్టనే కొట్టింది.

మా ఆవిడ సాయంత్రం  పలహారంగా 'వడలు' చేసింది.  

  

22, మే 2014, గురువారం

రివైండ్ - 2010 (పదిహేనో భాగం)


విన్నంతలో కన్నంతలో అమెరికా

అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ (కేంద్ర ప్రభుత్వం), స్తానిక (రాష్ట్ర) ప్రభుత్వాలు - విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే ఈ అసాధ్యం సుసాధ్యం అయిందని అనుకోవచ్చు. ప్రతి స్టేట్ లోను విద్యారంగం నిర్వహణ కోసం స్కూలు డిస్ట్రిక్టులను ఏర్పాటు చేసారు. తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. విద్యాప్రమాణాలను బట్టి ఆయా స్కూళ్లకు ఫెడరల్ గవర్నమెంట్ ప్రత్యెక నిధులను ఇన్నోవేషన్ ఫండ్నుంచి గ్రాంట్ రూపంలో ఇస్తుంది.ఈ ఏడాది (2010) వంద మిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించింది. ఉదాహరణకు బెల్ వ్యూ స్కూలు డిస్ట్రిక్టు కింద వున్న సమ్మాయిష్ హైస్కూలుకు ఈ నిధి నుంచి నలభై లక్షల డాలర్ల గ్రాంటు లభించింది. దేశ వ్యాప్తంగా పోటీ ప్రాతిపదికపై నిర్వహించిన ఈ ఎంపిక ప్రక్రియకు పదిహేడు వందల ధరఖాస్తులు రాగా వాటిలో ఉత్తమంగా ఎన్నిక చేసిన 49 స్కూళ్ళలో ఇది ఒకటి. ఇలాటి పోటీల వల్ల సర్కారు బడుల్లో నాణ్యతా ప్రమాణాలు నానాటికీ పెరిగిపోతూ వస్తున్నాయి. న్యూస్ వీక్ పత్రిక విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం అమెరికా లోని వంద ఉత్తమ పాఠశాలల్లో అయిదు హైస్కూళ్ళు బెల్ వ్యూ స్కూలు డిస్ట్రిక్టు లోనే వున్నాయి.



ప్రైవేటు స్కూళ్ళలో మాదిరి గానే వసతులు, చక్కటి భవనాలు, క్రీడా మైదానాలు కలిగివుండడం వల్ల ప్రభుత్వ స్కూళ్లను చిన్న చూపు చూసే పద్దతి ఇక్కడ కానరావడం లేదు. బెల్ వ్యూ లోని వుడ్ రిడ్జ్ ఎలిమెంటరీ స్కూలు ఇందుకు ఉదాహరణ. సహజ కాంతి వుండేలా తీర్చిదిద్దిన స్కూలు భవనం, వాల్ టు వాల్ కార్పెట్లు, పొందికయిన తరగతి గదులు, లైబ్రరీ, లంచ్ రూము, ఇండోర్ జిమ్, క్రీడామైదానం, కారు పార్కింగ్ ఏది చూసినా అద్భుతం అనే మాదిరిగా వున్నాయి. టాయిలెట్లు (రెస్ట్ రూములు) అయిదు నక్షత్రాల హోటళ్ళకు దీటుగా వున్నాయి.


(ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ఒక దృశ్యం)    



రివైండ్ - 2010 (పద్నాలుగో భాగం)


విన్నంతలో కన్నంతలో అమెరికా
కలల లోకంలో కాసేపు -
పాడు ఉద్యోగం ఎన్నాళ్ళు చేస్తాంఅని ఈసురోమనే వాళ్ళు కూడా పదవీ విరమణ ఘడియ దగ్గరపడేటప్పుడు – ‘పొడిగింపుకోసం నానా తంటాలు పడడం కద్దు. ఏడుపదుల వయస్సు వచ్చేవరకూ ఏమి జీవితమూ దుర్భరమూ అని తత్వాలు పాడుకున్నవాళ్ళు తరవాత్తరవాత తత్వం మార్చుకుని - కొద్దిగా మనుషుల్ని ఆనవాలు పట్టే చూపు దేవుడు ఇస్తే బాగుండుఅనుకుంటూ బతుకు మీద మళ్ళీ తీపి పెంచుకునేవాళ్ళు సయితం కనబడుతుంటారు. ఇప్పుడు ఆరుపదులు దాటిన తరవాత అమెరికావచ్చి- బెల్ వ్యూ లో  మా మనుమరాళ్ళు చదువుకునే ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల చూసిన తరవాత నాకూ అలాటి అభిలాషే ఒకటి కలిగింది.



 ‘మరుసటి జన్మలో అమెరికాలో పుట్టి ఇక్కడే చదువుకుంటే యెంత బాగుంటుందో కదా!అన్నదే ఆ కోరిక. అలాటి స్కూల్లో చదువుకుంటున్న మా మనుమరాళ్ళని చూసి కాస్తంత అసూయ పడ్డానేమో అని కూడా అనుమానం.
మన దేశంలో కూడా ఈ మాదిరి స్కూళ్ళు లేకపోలేదు. కానీ అవి పెట్టి పుట్టిన వాళ్ళకే పరిమితం. కూలీ నాలీ చేసుకుంటూ కలో గంజో తాగి పిల్లలను మంచి స్కూళ్ళల్లో చదివించే పేదలు కూడా మన దగ్గరవున్నారు. కానీ ఇంగ్లీష్ మీడియం కాన్వెంటు స్కూళ్ళ పేరుతొపల్లెటూళ్ళల్లో సయితం కాలు  పెడుతున్న అలాటి స్కూళ్ళన్నీ డబ్బు చేసుకునేందుకు, డబ్బు దోచుకునేందుకు తప్ప అసలు సిసలు చదువుకు పనికొచ్చేవి కావు.
ఇక్కడి విద్యాలయాల్లో చదువుకన్నా వ్యక్తిత్వవికాసానికి (personality Development) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు అనిపించింది. గట్టిగా చదివించి- ట్యూషన్లు పెట్టించి – “ఎమ్సెట్ఒక్కటీ గట్టెక్కితే చాలనుకునే ధోరణి ఇక్కడి పేరెంట్లలో కానరాదు. ఆ అవసరం కూడా వారికి లేదనుకోండి. మరో విశేషం ఏమిటంటే సర్కారు బళ్ళల్లో (ఇక్కడ పబ్లిక్ స్కూళ్ళు అంటారు.ఇవి పూర్తిగా ప్రభుత్వ ఆజమాయిషీలో నడుస్తాయి) హైస్కూలు స్థాయి వరకూ సెంట్ ఖర్చులేకుండా చదువుకునే వీలుంది.

సమాజంలో ఉన్నత స్తాయి వర్గాలవాళ్ళు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళలో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే - వసతుల విషయంలో, నిపుణత కలిగిన అధ్యాపకుల విషయంలో కొండొకచో సర్కారు బడులే ప్రైవేటు స్కూళ్ళను తలదన్నేలా వుంటాయి. (2010)

21, మే 2014, బుధవారం

రివైండ్ -2010 (పన్నెండో భాగం)


విన్నంతలో కన్నంతలో అమెరికా :
శ్రావణమాసం రెండో శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతం కోసం సియాటిల్ లోని ఈ ఇండియన్  స్టోర్ లో ఒక లారీ లోడ్ కొబ్బరికాయలు అమ్ముడుపోయాయంటే
ఇక్కడివారు సంప్రదాయ వేడుకలను యెంత శ్రద్ధగా జరుపుకుంటున్నారో అర్ధమవుతుంది.

(వరలక్ష్మీ వ్రతానికి పట్టు పరికిణీల్లో సిద్ధమైన మా ముమరాళ్ళు సృష్టి, సఖి) 

 మొత్తం వ్రత కధను, పూజావిదానాన్ని నెట్నుంచి డౌన్ లోడ్ చేసుకుని నిర్దేశించిన పద్దతిలో వ్రతం ఆచరించి ముత్తయిదువలకు దక్షిణ తాంబూలాదులు సమర్పించి సంప్రదాయాలపట్ల తమకున్న మక్కువను వ్యక్తం చేసారు. సియాటిల్ లో మాకు తెలిసిన తెలుగు లోగిళ్ళ వద్ద ఆ నాటి ఉదయం రంగురంగుల రంగవల్లులు కొలువుతీరాయి. 
(2010) 


రివైండ్ -2010 (పదకొండో భాగం)


విన్నంతలో కన్నంతలో అమెరికా :
 అసలు ఆబ్దీకాలవంటి కర్మకాండలపై అంతగా నమ్మకం లేని స్తితిలో  గత యాభయి సంవత్సరాలకు పైగా మా నాన్న గారి తద్దినాలు  పెడుతూ వస్తున్నాము. ఒక పండగ మాదిరిగా ఏటా జరిగే ఈ కార్యక్రమానికి చుట్టపక్కాలందరూ వచ్చేవాళ్ళు. ఏడాదికొకసారి కుటుంబ సభ్యులందరూ ఒకచోట కలుసుకునే సందర్భంగా భావిస్తూ దాన్ని ఒక క్రతువులా జరిపే ఆనవాయితీగా మారిపోయింది.
ఈ కర్మ కాండ మొత్తంలో ఒక ఆసక్తికరమయిన విషయం నేను గమనిస్తూ వచ్చాను. అదేమిటంటే మనకు జన్మ నిచ్చిన తలిదండ్రులతో పాటు మూడు తరాల పూర్వీకులను సయితం పేర్లతో సహా స్మరించుకునే సందర్భం ఇది. తండ్రి, తండ్రి తండ్రి పేరు చెప్పగలిగినవాళ్ళు కూడా తాత తండ్రి పేరు గుర్తుకుతెచ్చుకోవడానికి ఇబ్బంది పడతారు. వంశాన్ని ఉద్ధరించడం సంగతి ఏమో కానీ  వంశస్తులను ఏడాదికి ఒక్కమారయినా స్మరించుకునే అవకాశం  ఇచ్చే తద్దినాలు పెట్టడంలో తప్పేమీ లేదన్న అభిప్రాయం క్రమంగా మనస్సులో పడిపోయింది.


(కాకి ప్రసాదం కోసం వాయసాన్వేషణ)


 ఉత్తరాది పద్దతిలో నిర్వహించినా సుధీర్ ఝా గారు - ఎంతో సంతృప్తికరంగా మా తల్లిగారు వెంకట్రావమ్మ, పితామహి రుక్మిణమ్మ, ప్రపితామహి చెల్లాయమ్మలకు తర్పణ క్రియలు నాచేత జరిపించారు. ఇతర లాంఛనాలు పూర్తయిన తరవాత ఇంటి నుంచి తయారు చేసుకొచ్చిన గారెలు, పరవాన్నం ఇతర పదార్ధాలను  గుడికి వచ్చిన వారికి ప్రసాదంగా అందచేసి అమెరికాలో ఇటువంటి క్రతువులు సాధ్యమా అని మొదట్లో  కలిగిన సందేహాలను పటాపంచలు చేసుకుని ఇంటి దారి పట్టాము.

చెప్పడం మరిచాను. ఇటువంటి కార్యక్రమాలకు అవసరమయిన సమస్త సామాగ్రి సియాటిల్ లో వున్న ఒక ఇండియన్ స్టోర్ లో లభించింది.

రివైండ్ -2010 (పదో భాగం)


విన్నంతలో కన్నంతలో అమెరికా :
అమెరికాలో అమ్మ ఆబ్దీకం
శ్రావణ  త్రయోదశి మా అమ్మగారి ఆబ్దీకం. ఏటా హైదరాబాదులో జరిగే ఈ కార్యక్రమంలో  అమ్మలగన్నమా అమ్మనుమనసారా స్మరించుకోవడానికి ఆమె పిల్లలతో పాటు ఆ పిల్లల పిల్లలుకూడా కట్టగట్టుకుని  వచ్చేవారు. అంతకుముందు మా మూడో అన్నయ్య భండారు వేంకటేశ్వర రావు బతికున్న రోజుల్లో మా అమ్మానాన్నల తద్దినాలను 'వూరంతా పండగే' అన్న రీతిలో ఏళ్లతరబడి ఏటా నిర్వహిస్తూ వచ్చేవారు. మా ఇంట్లో పెళ్ళిళ్ళు చాలా సాదా సీదాగా జరిగేవి. తద్దినాలు మాత్రం పెళ్ళి చేసినట్టు గొప్పగా చేస్తారని చెప్పుకునే వారు.
కానీ ఈసారి అమెరికాలో వున్నాము.
 ‘ఎలా?’ అనే ప్రశ్నకు సియాటిల్ లోని హిందూ టెంపుల్ పూజారి సుధీర్ ఝా రూపంలో జవాబు లభించింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఈ హిందూ దేవాలయ సముదాయం నిర్మాణానికి భూరివిరాళం ఇవ్వడంవల్ల దీన్ని మైక్రోసాఫ్ట్ టెంపుల్ అని పిలవడం కద్దు. (హైదరాబాదులో బిర్లా టెంపుల్ మాదిరిగా)
ఈ దేవాలయం విశాలమయిన ప్రాంగణంలో వుంది. ఒక ఎత్తయిన వేదిక మీద శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ గణేష్ మొదలయిన దేవతామూర్తులను కొలువు తీర్చారు. పుష్పశోభితమయిన ఉద్యానవనం నడుమ నిర్మించిన ఈ దేవాలయం ప్రశాంతతకు, పరిశుభ్రతతకు నిలయంగా వుంది.
 శని ఆదివారాల్లో నగరంలోని భారతీయ కుటుంబాల వాళ్ళు ఈ మందిరాన్ని సందర్శించి పూజాదికాలు నిర్వహిస్తూ వుంటారు. గతంలో ఈ గుడిలో దీక్షితులుగారనే తెలుగు పూజారి వుండేవారు. ఇప్పుడాయన సియాటిల్ లోనే రెడ్మండ్ అనే ప్రాంతంలో వున్న మరో హిందూ టెంపుల్ లో పనిచేస్తున్నారు.


(తల్లీ! నీకు వందనం!)


మైక్రోసాఫ్ట్ హిందూ టెంపుల్ లో ఆబ్దీకం పెట్టుకోవడానికి యాభయి ఒక్క డాలర్లు తీసుకుని టెంపుల్ కమిటీ వాళ్ళు రసీదు ఇచ్చారు. ఆ ప్రాంగణంలోనే ఒక గదిలో మా కార్యక్రమం పూర్తిచేసుకున్నాము. (2010)