4, జులై 2013, గురువారం

మరో జ్ఞాపకం



జర్నలిస్టులకు బాంకు రుణాలు గురించి కృష్ణమోహన్ గారు రాసింది చదివినప్పుడు గతం గుర్తుకు వచ్చింది. కలకత్తా (ఇప్పుడు కోల్ కటా) కార్యస్థానంగా కలిగిన యునైటెడ్ బాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎనభయ్యవ దశకం ప్రధమార్ధంలో అనుకుంటాను హైదరాబాదు వచ్చి అప్పటి బంజారా హోటల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అలాటి వాటికి రాయని పత్రికా రచయితలు ఒకరిద్దర్ని మినహాయిస్తే డ్యూటీమీద వచ్చే వాళ్ళు పట్టుమని పదిమంది కూడా వుండేవాళ్ళు కాదు. అందువల్ల మాటా మంతీ మాట్లాడుకోవడానికి వ్యవదానం, వెసులుబాటు ఉండేవి. అప్పటికే జర్నలిజం వృత్తిలో చేరి పుష్కర కాలం గడిచింది కాని (ద్విచక్ర)వాహనయోగం పట్టలేదు. కొత్త స్కూటరు ఖరీదు పదివేల లోపే. బాంకు ఋణం ఇచ్చినా మూడు నాలుగు వేలు చేతినుంచి పెట్టుకోవాల్సి రావడం వల్ల అప్పు ఇచ్చే బాంకులవాళ్ళు  వాళ్ళు వున్నా తీసుకోవడానికి ఓ పట్టాన  ధైర్యం చాలేది కాదు. ఈ నేపధ్యంలో యునైటెడ్ బాంకు చైర్మన్ హైదరాబాదు వచ్చారు.  ఆయన బాంకులు, లోన్లు గురించి మాట్లాడుతుంటే ఆకాశవాణి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు జర్నలిస్టులకు స్కూటర్ లోన్లు గురించి కదిలించారు. ఆయన వెంటనే స్పందించి  అక్కడ వున్న స్తానిక బాంకు అధికారిని పిలిచి వెంటనే కావాల్సిన వారికి  లోన్ శాంక్షన్ చేసి ఆ విషయం తనకు తక్షణం  తెలియచేయాల్సిందని హుకుం జారీ చేసారు. సరే ప్రెస్ కాన్ఫరెన్స్, దరిమిలా ఏర్పాటు చేసే విందు భోజనాలు ముగిసిన తరువాత ఎవరి ఇళ్ళకు వాళ్ళం వెళ్ళిపోయాం. రెండు రోజుల తరువాత కోటీ లోని యునైటెడ్ బాంకు నుంచి ఫోను వచ్చింది. లోను కోసం రాలేదేవిటి అని వాకబు. ఆశ్చర్యం వేసింది. నమ్మబుద్ది వేయలేదు. అపనమ్మకంతోనే అక్కడికి వెళ్లాను.  బాంకు అధికారి స్కూటరు  లోనులో ఓ ఇరవై శాతం అయినా ముందు ధరావతు మొత్తంగా కట్టమన్నాడు. ఆ డబ్బే వుంటే మీ దగ్గరకు ఎందుకు వస్తామని లేచి రాబోతుంటే ఆయనే మళ్ళీ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ‘మీకు లోను శాంక్షన్ చేసి మళ్ళీ  మా హెడ్ ఆఫీసుకు ఈ సాయంత్రానికల్లా రిపోర్ట్ చేసుకోవాలి, ముందు చెక్కు తీసుకు వెళ్ళండి’ అని హామీదారుల సంతకాలు కూడా అడక్కుండా కాసేపట్లో చెక్కు చేతిలో పెట్టాడు. ఆ రోజుల్లోనే,  గుజరాత్ గవర్నమెంటు వాళ్ళ గిర్నార్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. అంతా వెస్పా స్కూటర్ మోజులో వున్నారు. కానీ అది దొరకాలంటే చాలా ఏళ్ళు వెయిట్ చేయాలి. దాంతో చాలామందికి గిర్నార్ స్కూటర్ వరప్రసాదంలా కనబడింది. అంతకు రెండు రోజులముందే ఎక్స్ ప్రెస్ సుందరం గారు గిర్నార్ కొనుక్కుని దాన్నే నాకు సిఫారసు చేయడంతో నేనూ అదే కొనుక్కున్నాను. మా వైభోగం  ఎలా ఉండేదంటే గిర్నార్ మనిషి మా ఇంటికే వచ్చి స్కూటర్ ను సర్వీసింగుకు తీసుకువెళ్ళేవాడు. కాకపొతే, చివరికి ఆ స్కూటరే నన్ను వార్తల్లోకి ఎక్కించింది. ఆ ఉదంతం పోలీసులు పట్టుకుని అరెస్టు చేసేవరకు వెళ్ళింది.( ఆ సమాచారం మరోమారు)


(1987 లో గిర్నార్ స్కూటర్ పై నేనూ నా పిల్లలు సందీప్, సంతోష్ )

2, జులై 2013, మంగళవారం

జర్నలిస్టుల జీవితాల్లో పైకి కనిపించని ఓ విషాద కోణం


జర్నలిస్టు వృత్తి జీవితం తొలినాళ్ళలో నేను కలిసి తిరిగిన అనేకమంది మిత్రులు-తదనంతర కాలంలో స్వయంకృషితో ఎదిగి వాళ్ళు పనిచేస్తున్న పత్రికలకే ఎడిటర్లుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉచ్చస్తితిలో వున్నప్పుడు వాళ్ళని కలుసుకోవాలంటే మహామహులకే దుర్లభంగా వుండేది. విజిటింగ్ కార్డు పంపి అనేకమంది వెయిట్ చేస్తున్న సమయాల్లో కూడా వాళ్ళు- నాతో గతకాలంలో గడిపిన రోజులు మరచిపోకుండా -నన్ను తమ సన్నిహిత వర్గంలోని వాడిగానే పరిగణించి ఆదరించేవారు. అది వారి గొప్పతనంగా నేను భావిస్తాను.
 విలేకరిగా వృత్తి జీవితం ప్రారంభించి విలేకరిగానే పదవీ విరమణ చేసినవాడిని నేను. నా బోటి వాళ్ళే  ఈ వృత్తిలో ఎక్కువగా వుంటారు. అతికొద్దిమంది మాత్రమె తమ ప్రతిభతో పైమెట్లు  ఎక్కగలుగుతారు. నాది ఒక రకంగా సర్కారు ఉద్యోగం కనుక ఎక్కవలసిన మెట్లు తక్కువే. ఎక్కగలిగిందీ తక్కువే. గోదావరిలో ఎన్ని నీళ్ళున్నా మనం బిందె తీసుకువెడితే బిందెడు నీళ్ళు, చెంబు తీసుకువెడితే చెంబెడు నీళ్ళు మన ప్రాప్తాన్నిబట్టి తెచ్చుకోగలుగుతామని మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు చెప్పిన విషయం గుర్తుంచుకోవడం వల్ల ఈ మెట్లెక్కే గొడవ నా మనసుకు ఎక్కలేదు. అయినా ఈనాటి లోకం పోకడ ఇందుకు విరుద్దం. పొజిషన్ ను బట్టి పలకరింపులు, స్తాయిని బట్టి సాన్నిహిత్యాలు, హోదాని బట్టి ఆహావోహోలు. కానీ నా అదృష్టం నా మిత్రులెవ్వరు ఈ కోవలోకి రారు. అందుకే ఇన్నేళ్ళ తరవాత కూడా వారు నాతో  ప్రవర్తించే తీరులో ఇసుమంత తేడా లేదు.
కీర్తి శేషులు, శ్రీయుతులు జి కృష్ణ, నండూరి రామమోహన రావు, పీటీఐ కృష్ణ, హిందూ రాజేంద్రప్రసాద్,  ఆంధ్రపత్రిక ముక్కు శర్మ, ఈనాడు శాస్త్రి, యుఎన్ఐ డి సీతారాం, పార్ధసారధి, ఎక్స్ ప్రెస్ సుందరం, నీలంరాజు మురళీధర్, శ్రీకాంత్ విఠల్, ఆలిండియా రేడియో పన్యాల రంగనాధ రావు, నర్రావుల సుబ్బారావు, గోవాడ సత్యారావు, తిరుమలసెట్టి శ్రీరాములు, జ్యోతి దామోదరస్వామి, ప్రభ నంద్యాల గోపాల్, పీటీఐ జమాల్ వంటివారితో  కలిసిమెలిసి తిరగగలిగే అదృష్టం నాకు దక్కింది. అలాగే, శ్రీయుతులు ఆంద్ర జ్యోతి  ఆదిరాజు వెంకటేశ్వర రావు,  ఈనాడు ఏబీకే ప్రసాద్, ఆంద్రజ్యోతి తుర్లపాటి కుటుంబరావు, ఐ. వెంకట్రావు, ఎన్.ఇన్నయ్య, వేమూరి రాధాకృష్ణ, హిందూ కేశవరావు, ఎస్.నగేష్ కుమార్, కె. శ్రీనివాస రెడ్డి,  ప్రభ పొత్తూరి వెంకటేశ్వరరావు, దేవులపల్లి అమర్, నందిరాజు రాధాకృష్ణ, జ్యోతి రామచంద్రమూర్తి, ఆంధ్రభూమి ఎంవీఆర్ శాస్త్రి, క్రానికల్ రబీంద్రనాధ్, పెద్ద బాబాయి కృష్ణారావు, విశాలాంధ్ర శ్రీనివాసరెడ్డి, ఆంధ్రపత్రిక శాస్త్రి, విద్యారణ్య, ప్రజాశక్తి వినయకుమార్, ఎన్ఎస్ఎస్ కొండా లక్ష్మారెడ్డి, ఈనాడు యాదగిరి, వేణుగోపాల్, నందిరాజు రాధాకృష్ణ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ నందిరాజు రాధాకృష్ణ, ఆలిండియా  రేడియో ఎంఎస్ఆర్ కృష్ణారావు,  ఆకిరి రామకృష్ణారావు, ఆర్వీవీ కృష్ణారావు, డి.వెంకట్రామయ్య, మాడపాటి సత్యవతి   ఒకరా ఇద్దరా జర్నలిజంలో కాకలు తీరిన అనేకమందితో చనువుగా మసలగలిగే అవకాశాన్ని నా రేడియో విలేకరిత్వం నాకు అందించింది. నిజానికి వీరిలో చాలామందితో నా సాన్నిహిత్యం గారు వంటి గౌరవ పద ప్రయోగాలతో ముడిపడివుండలేదు. చాలా చనువుగా పలకరించుకోగల సంబంధ బాంధవ్యాలు వుండేవి. దాదాపు ప్రతి రోజు సెక్రెటేరియేట్  లోని ప్రెస్ రూం లో కలుసుకునేవాళ్ళం. పత్రికా సమావేశాలు లేనప్పుడు కొన్ని గంటలపాటు మా నడుమ ముచ్చట్లు సాగేవి. పెద్దా చిన్నా తేడా లేకుండా ఒక కుటుంబంలోని సభ్యులమాదిరిగా గడిపేవాళ్ళం. ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్   సుందరం  కనపడగానే సుందరం మనమందరం అని ఏదో కవిత్వ ధోరణిలో పలకరించినా ఆయన  ఏమీ అనుకునేవాడుకాదు. పైగా నవ్వి వూరుకునేవాడు. మా ఇద్దరి నడుమా మరో బాదరాయణ సంబంధం వుండేది. గుజరాత్ గవర్నమెంటు వారి గిర్నార్ స్కూటర్ ను మేమిద్దరం ఒకేరోజు, ఒకే డీలర్ దగ్గర కొన్నాము.  హైదరాబాదులో అమ్ముడుపోయిన గిర్నార్ స్కూటర్లే బహు తక్కువ. వాటిల్లో రెండింటికి మేమిద్దరమే  ఓనర్లం. ఆ రోజుల్లో వెస్పా స్కూట ర్లకు పెద్ద గిరాకీ వుండేది. కొనుక్కోవాలంటే ఎన్నో సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు వుండేవి. అందుకే మరో మాట లేకుండా మేమిద్దరం గిర్నార్ స్కూటర్లు కొనుక్కున్నాము. అదీ ఏదో బ్యాంకు అధికారి జర్నలిష్టులమని అప్పివ్వబట్టి.
‘ఐ నో సీఎం. ఐ నో పీఎం’ అనుకునే  జర్నలిస్టుల జీవితాలు పైకి కనిపించినంత గొప్ప కరెన్సీ కాగితాలేమీ కావు.  వారికి వృత్తి రీత్యా  సమాజంలో ఎంతోమంది తెలుస్తుంటారు. కానీ తోటి జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో  పరిచయాలకు ఆస్కారం చాలా తక్కువ. అందుకే, కొందరు సాటి జర్నలిస్టులు  చనిపోయినప్పుడు  విషయం  తెలిసికూడా వాళ్ళ ఇళ్ళకు వెళ్లి పరామర్శించలేకపోవడానికి ఇదే కారణం. చనిపోయిన వ్యక్తీ తప్ప వేరే ఎవ్వరు తెలవదు. తెలిసిన ఒక్కరికి మనం  వచ్చిన విషయం తెలియదు. ఇది పైకి చెప్పుకోలేని ఓ  పెను విషాదం.

1, జులై 2013, సోమవారం

డాక్టర్స్ డే


ఆరేళ్లక్రితం డిసెంబర్ నెలలో ఓ మంగళవారం.
వైద్యుడనేవాడు ఎలావుండాలో అలాగే యెలా వుండకూడదో ఆనాడు  హైదరాబాదులోని నిలోఫర్ ఆసుపత్రిలో జరిగిన రెండు సంఘటనలు అద్దం పట్టి చూపించాయి.
ఆ ఆసుపత్రికి చెందిన జూనియర్ డాక్టర్లు (జూడాలు అని సంక్షిప్త నామం ఎవరు పెట్టారో కాని బాగా ఆలోచించి పెట్టినట్టున్నారు) హమ్ ఏక్ హై’  అంటూ ఆస్పత్రి వెలుపల చేరి నినాదాలు చేస్తున్న సమయంలో
నిలోఫర్ లో  మరో పసి కందు మృతి,సకాలంలో  వైద్య సాయం అందక  మరణించిన శిశువుల సంఖ్య పదికి పెరిగింది, పదిహేనుకు  పెరిగిందంటూ క్రికెట్ స్కోరు మాదిరిగా టీవీ ఛానళ్లలో అదేపనిగా స్క్రోలింగులు వస్తున్న సమయంలో-
ఒక మృత శిశువును  వొడిలో పెట్టుకుని (నాటి) తల్లి తెలంగాణాఅధినేత్రి రాములమ్మఅదే ఆసుపత్రి ఆవరణలో టీవీ కెమెరాల ముందు వీరంగం వేస్తున్న సమయంలో-
అదే  ఆసుపత్రిలో అదే ఆసుపత్రికి చెందిన కొందరు సీనియర్ డాక్టర్లు  మూడు కాళ్లు, నాలుగు పాదాలు కలిగిన ఆరేళ్ళ అనాకారి బాలుడికి తొలి దశ శస్త్రచికిత్సను  విజయవంతంగా  పూర్తిచేసి, ‘వైద్యో నారాయణో హరిఅనే సూక్తిని నిజం చేశారు.
అంతకుముందు ఆదివారం రాత్రి అదే  ఆసుపత్రిలో ఒక మజ్లిస్ శాసన  సభ్యుడికీ, జూడాలకూ నడుమ మొదలయిన  సంవాదం సాగి, సాగి, చిలికి చికి  గాలివానగా మారింది. ఆ శాసన సభ్యుడు  తమపై దాడికి దిగారని ఆరోపిస్తూ, అతడిని అరెస్టు చేయాలనీ, అతడి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలనీ డిమాండు చేస్తూ జూడాలు ఆకస్మికంగా మెరుపు సమ్మెకు దిగి విధులను బహిష్కరించారు. విధి నిర్వహణలో  వున్న వైద్యులపై దాడులను ఎవ్వరూ సమర్ధించరు. కానీ, వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన పసిప్రాణాలతో చెలగాటమాడే వైఖరిని కూడా ఎవరూ హర్షించరు. సమాజంలో నానాటికీ పెరిగిపోతున్న అవాంచనీయ ధోరణులు, అసహన వైఖరులు పవిత్రమయిన వైద్య వృత్తిని కూడా వొదిలిపెట్టకపోవడమే ఆందోళన కలిగించే విషయం. ఆలోచించాల్సిన విషయం.
ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారానికి ఆందోళనలూ, సమ్మెలూ అవసరమని అందరూ ముక్త కంఠంతో చెబుతుంటారు. కానీ అవే ఆందోళనలు ప్రజలకు మరికొన్ని కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయన్న  వాస్తవాన్ని మరచిపోతుంటారు. నిజమే, ఆనాటి సంఘటనవల్ల  జూడాలలో ఒకరిద్దరి ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని వారు  సమ్మెకు దిగారు సరే, కానీ వారి ఆందోళలన వల్ల వైద్యం సమయానికి అందక  అనేక నిండు ప్రాణాలే పోయాయి. వాటి సంగతేమిటి?  ఇలాటి వాస్తవాలను గుర్తించనంతవరకూ, అలా ఆందోళనలకు దిగే వారికి ప్రజల మద్దతు లభించదు. సరిగ్గా అదే జరిగింది కూడా.

మొత్తమ్మీద జూడాల సమ్మె ముగిసింది. అన్ని సమ్మెలు యెలా ముగుస్తాయో దీనికీ అలాటి ముగింపే లభించింది.
కానీ, వైద్యుల ప్రవర్తనపై మీడియాలో మాత్రం విస్తృత చర్చే జరిగింది.
వాస్తవానికి సమాజంలో వైద్యులది విశిష్టమయిన స్తానం. అందుకే డాక్టరును డాక్టరు గారుఅని గౌరవంగా
సంబోధిస్తారు. నలుగురిలో వారికి పెద్దపీటవేసి మన్నన చేస్తారు. రోగాలబారి నుంచి కాపాడే అపర ధన్వంతరులుగా, ప్రాణబిక్ష పెట్టే కలియుగ దైవాలుగా కొలుస్తారు. నాకిప్పటికీ గుర్తు. మా చిన్నతనంలో మా వూరికి వారానికోసారి ఓ డాక్టరుగారు సైకిలు మీద వచ్చేవారు. చిన్న చితకా జ్వరాలకు తనతో  తెచ్చుకున్న తోలుపటకా సంచీనుంచి మందు  గోలీలు ఇచ్చి వైద్యం చేసేవారు. పంటలు  చేతికందినప్పుడు వూళ్ళోని పెద్ద పెద్ద ఆసాములు ఏడాదికోసారి కొలిచి ఇచ్చే ధాన్యం మినహా ఆ డాక్టరు గారు ఏనాడూ రోగులనుంచి  ఫీజు వసూలు చేసిన దాఖలా లేదు. ఆయన వూరికి వస్తే చాలు దేవుడే నడిచివస్తున్నట్టుగా జనం భక్తి ప్రపత్తులు ప్రదర్శించేవారు. సైకిల్ డాక్టరుగారని పిలవడం మినహా ఆయన అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. నాడి  పట్టుకుని చూసి ఇప్పుడెలావుందయ్యా రాముడూఅని ఆప్యాయంగా అడగగానే సగం రోగం చేతులతో తీసివేసినట్టు వుండేది. చుట్టుపక్కల అయిదారు వూళ్ళకు ఆయనే దిక్కు. సైకిల్ తొక్కుకుంటూ రోజుకో వూరు చుట్టబెట్టేవారు. ఆ రోజుల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే. కరెంటు వుండేది కాదు. ఉక్కపోస్తున్నా, నులక మంచంమీద కూర్చుని తన మానాన తాను రోగులకు వైద్యం చేస్తుండేవారు. కళ్ళల్లో కారుణ్యం. మోహంలో చెదరని చిరునవ్వు. ఆయన హస్తవాసిపట్ల అందరికీ అపరితమయిన గురి. జనాలకు కొండంత ధైర్యంగా వుండేది.
మరి ఇప్పుడో. ఆ చిత్రం పూర్తిగా మారిపోయింది.
రోగులు పెరిగారు. రోగాలు పెరిగాయి. వైద్యులూ పెరిగారు. ఇచ్చే మందులూ  పెరిగాయి. వాటి ఖరీదులూ పెరిగాయి.  పెరగనిదల్లా వైద్యులపట్ల రోగులకు వుండే భరోసా! వుండాల్సిన దిలాసా!!
మా చిన్న తనం రోజులు కానీ, ఆరేళ్ళ క్రితం సంఘటన కానీ గుర్తుచేసుకున్నప్పుడు, మార్పేమయినా కానవస్తున్నదంటారా!

కనీసం ఈనాడు డాక్టర్స్ డేజరుపుకుంటున్న సమయంలోనయినా మంచి మార్పు వస్తుందని ఆశించవచ్చంటారా!!  (01-07-2013)

30, జూన్ 2013, ఆదివారం

జనహితమే సర్వజన సమ్మతం - భండారు శ్రీనివాసరావు



(గమనిక ఇది 2008 మే నెలలో రాసిన వ్యాసం) 


రాష్ట్ర విభజనని ప్రజలు మనస్పూర్తిగా కోరుకుంటే ఏ రాజకీయ శక్తీ దాన్ని ఆడ్డుకోలేదు. ఈ ఆకాంక్ష జనానిదయితే మన్నించాల్సిందే. రాజకీయమైనదయితే ఆలోచించాల్సిందే'. ఇటీవలికాలంలో - దాదాపు అన్ని పార్టీలు - ఏదో ఒక రూపంలో - ఏదో ఒక స్థాయిలో తెలంగాణా సెంటిమేంట్‌ని కొద్దో గొప్పో పులుముకోవాలని ప్రయత్నిస్తూనే  ఉన్నాయి. ఒక్క సీపీఎం ను మినహాయిస్తే,  ఒకప్పుడు ససేమిరా అన్న పార్టీలు కూడా ఇప్పుడు సరే అంటున్నాయి.  ఈ పార్టీల్లోని కొందరు పెద్దలకి ఇది తక్షణ రాజకీయ అవసరం.  అదే ఇందులోని విషాదం.
దేశం స్వాతంత్ర్యం పొందిన దరిమిలా - అనేక కొత్త రాష్ట్రాలు పురుడు పోసుకున్నాయి. పొరుగున ఉన్న అనాటి మద్రాసు(తమిళనాడు) రాష్ట్రం నుంచి విడిపోయి ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం - తరువాత కొద్ది కాలానికే - భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్దాంత ప్రాతిపదిక పై - తెలంగాణా ప్రాంతాన్ని(హైదరాబాదు స్టేట్ లోని ప్రధాన భాగాలు) కలుపుకుని - ఆంధ్ర ప్రదేశ్ గా ఆవిర్భవించింది. ఒకే భాష మాట్లాడే వారికి కూడా, విడివిడిగా రాస్ట్రాలు వున్నప్పుడు - ఆంధ్ర ప్రదేశ్ ని కూడా ప్రజాభిష్టం మేరకు విభజించడంలో తప్పేమి లేదు. అయితే తప్పల్లా - ప్రజల ఆకాంక్షని అంచనా వేయడంలో చేస్తున్న తప్పులే. రాష్ట్ర విభజన అన్నది ఎవరో కొందరి రాజకీయావసరాల కోసం కాకుండా మెజారిటీ ప్రజల అబీష్టం మేరకు జరగాలి.

ఏ వేర్పాటు ఉద్యమానికయినా, వెనుకబడినతనమే ప్రాతిపదిక. దీని ఆధారంగా పెచ్చరిల్లే భావోద్వేగాలే విభజన ఉద్యమాలకు ఊపిరిపోస్తాయి. ఈ విధంగా ప్రజ్వరిల్లే శక్తిని అడ్డుకోవడం అతికష్టం అని గతంలో తెలంగాణా ప్రజా సమితి నిరూపించింది కూడా. అయితే, అప్పటికి అంటే 1969 నాటికి ఇప్పటికీ పరిస్థితుల్లో ఇసుమంత కూడా మార్పు రాలేదంటే నమ్మడం కష్టం. తెలంగాణాలో ఇంకా కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదంటే నమ్మచ్చుకాని తెలంగాణాలో అసలు అభివృద్ధి  జరగలేదని వాదించడం కేవలం రాజకీయమే అవుతుంది. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. 1969 నాటికి వూహకు సయితం అందని ఉదార ఆర్ధిక విధానాలు ఈనాడు శరవేగంగా అమలవుతున్నాయి. ప్రపంచీకరణ సిద్దాంతం నేల నాలుగు చెరగులా బలంగా వేళ్ళూనుకుంటున్న నేపధ్యంలో - అసలు దేశాల  మధ్యనే హద్దులు చెరిగిపోతున్నాయి. 

పొట్ట గడవక కొందరూ - డాలర్ల వేటలో మరికొందరూ - ఉపాథి కోసం ఇంకొందరూ ఉన్నవూరు, కన్న దేశం  వదిలిపెట్టి వెళ్ళడం అన్నది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కావడంలేదు. అవకాశాలు వెతుక్కుంటూ అన్ని ప్రాంతాలవారు అన్ని చోట్లకీ వలస వెడుతున్నారు.
ఏదో ఒకనాడు - తెలుగువాడే అమెరికాకి అధ్యక్షుడు కాగలడని ఆ దేశంలో ఉంటున్న తెలుగువారే భరోసాగా చెబుతున్నారంటే ఇక భౌగోళిక రేఖలకి, దేశాల సరిహద్దులకీ - అర్థమేముంటుంది? పోతే - ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని - భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు ఏపాటి మిగులుతాయో అర్ధం చేసుకోలేని విషయమేమి కాదు. 
ఆ మాటకి వస్తే - దేశాలయినా, రాష్ట్రాలైనా, ప్రజలైనా విడిపోవడం - కలిసిపోవడం పెద్ద విషయమేమి కాదు. విభజన కుడ్యాన్ని కూలగొట్టుకుని - రెండు జర్మనీలు కలిసిపోయాయి. అమెరికాని సయితం శాసించగలిగిన స్థాయికి ఎదిగిన సోవియెట్ యూనియన్ - అంగ, వంగ, కళింగ దేశాల మాదిరిగా విచ్చిన్నమయింది. 

కాబట్టి - చరిత్ర నుంచి నేర్చుకున్నవారు - చరిత్ర హీనులు కాలేరు. మనసులూ - మనుషులూ కలుషితం కావడం ఏ సమాజానికి క్షేమకరం కాదు. విడీపోయినా చేతులు కలిసే వుండాలి. మనసులు మసి బారకుండా ఉండాలి .
సర్వేజనాః సుఖినోభవంతు! 
(మే - 2008 )

అబద్ధం చెప్పడం అంటే




చిన్న పిల్లాడు అబద్దం చెబితే  అబద్ధాలు ఆడకురా పాపంరా అంటాం.
ఎదిగిన వయస్సులో అబద్ధం చెబితే వొద్దురా  తప్పురా అనేస్తాం.
అదే ప్రేమికుడు అబద్ధం చెబితే ప్రేమలో  బొంకడం కూడా  ఓ  కళ అంటాం.
రాజకీయనాయకుడివిషయంలో అబద్ధం అనేది అతగాడికి  తప్పనిసరి అవసరం అని సమాధానపడతాం
పొతే న్యాయవాదికి అబద్ధం అతడి  వృత్తిలో ఒక భాగం అని సరిపుచ్చుకుంటాం.
ఆఫీసులో పై అధికారికి అబద్ధం అనేది  సిబ్బందిపై పట్టు చిక్కించుకునే ఓ పని ముట్టు అనుకుంటాం 
మన కింద పనిచేసేవాడికి మాత్రం అది  సమయానికి పనికొచ్చే ఓ కుంటి సాకు అని భావిస్తాం 
ఇక పెళ్ళయిన మగవాడివిషయంలో  అంటారా!

అబద్ధాలు జీవితంలో ఓ భాగం. ఆడకపోయాడో అతడి ఆట కట్టు. అతడి మనుగడకే ముప్పు. 

28, జూన్ 2013, శుక్రవారం

ఏం చెప్పను? యేమని చెప్పను? (కధానిక)




ఆ వృద్ధాశ్రమంలో పదేళ్లుగా పనిచేస్తూ ఇరవై లోనే అరవై ఏళ్ళు పైపడ్డ వాడిగా తయారయ్యాను.  ఇన్నేళ్ళ బట్టి చూస్తున్నాను కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా నవ్వు మొహంతో వున్నవారెవ్వరూ నాకు ఆ ఆశ్రమంలో తారస పడలేదు. ఎవరిని కదిలించినా కన్నీటి కధలే. అన్నీ వుండి  కూడా ఏమీ లేని వారి వ్యధలే.  తల్లీ తండ్రీ లేని అనాధను కనుక ఆ వృద్ధులు పడే  వేదనలుఆవేదనలు మొదట్లో నాకేమీ అర్ధం అయ్యేవి కావు. ఇక్కడ రూమ్ బాయ్ గా చేరినప్పటినుంచి వయసు మీద పడ్డ వారి బాధలేమిటో,వారి సమస్యలేమిటో కొద్ది కొద్దిగా అవగతం కావడం మొదలయింది
.
ఆశ్రమం అన్న మాటే కానీ వున్న దానికీతిన్న దానికీ అణా పైసలతో సహా వసూలు చేస్తారు. ఆ డబ్బులు కట్టడానికి వచ్చే వారి పిల్లల మొహాల్లో కూడా  ఏ ఒక్కనాడు నాకు సంతోషం అన్నది కానవచ్చేది కాదు. తలితండ్రుల్ని  అలా చూడాల్సి వచ్చినందుకు కాదు వారి  బాధకన్న వారి బాధ్యతలు ఇలా ఇంకా  ఎన్నాళ్ళు మోయాలో అన్నదే వారి అసహనానికి కారణం అని మెలమెల్లగా బోధపడుతూ వచ్చింది. ఈ నేపధ్యంలో - 

ఒక రోజు ఓ పెద్దాయన ఆశ్రమంలో చేరాడు. అతడొచ్చినప్పుడు నేనే డ్యూటీ లో వున్నాను. వయస్సు తొంభై అని  రిజిస్టర్లో వివరాలను బట్టి  తెలుసుకున్నాను. పైకి చూస్తే  అన్నేళ్ళ వాడిగా అనిపించలేదు. బోసినోరే అయినా అతడి నవ్వులో ఒకరకమైన ఆకర్షణ. చూడగానే లేచి నిలబడాలని అనిపించే పెద్దరికం.ఎలాటి దిగులూ దైన్యం కనిపించని ఆయన వదనం నాకు కొత్తగాగమ్మత్తుగా  అనిపించింది.

మరోసారి వివరాలు చూసాను. పెద్ద ఉద్యోగం చేసాడు. పెద్ద పెద్ద హోదాలు అనుభవించాడు. భార్య ఏడాది  క్రితమే కన్ను మూసింది. లంకంత కొంపలో ఒకే ఒక్కడు. ఇద్దరు కొడుకులూముగ్గురు అమ్మాయిలూ అందరూ కట్టుకున్నవాళ్ళతోపుట్టిన సంతానంతో  కలసి విదేశాల్లో సెటిల్ అయ్యారు. వాళ్లు రమ్మంటారు. ఈయన పోనంటారు. తలచుకుంటే ఇంత కంటే మంచి సౌకర్యాలు వున్న ఓల్డ్  ఏజ్ హోంలో దర్జాగా చేరగల స్తోమత వున్నట్టే వుంది. దీన్నే ఎందుకు ఎంచుకున్నాడో తెలవదు.
ఆయన వుండబోయే గది ఎలావుంటుందో నాకు తెలుసు. ఆ గదిలో మొన్న మొన్నటి వరకు వున్న వృద్ధురాలు మొన్నీమధ్యనే  కాలం చేసింది.  చిన్న గది. ఓ మేజా. ఓ పక్కగా కిటికీ. దానికి వేలాడుతూ పాత కర్టెన్. దాన్నిమార్చండి బాబూ అని  పోరు పెడుతూనే ఆ వృద్ధురాలు ఏమారి పోయింది. తెలియని లోకాలకు తరలిపోయింది. ఎందుకయినా మంచిదని ఆయన వుండబోయే గది తీరుతెన్నులు గురించి ముందే చెవిలో వేసాను. బదులుగా ఆయన చిన్నగా  నవ్వాడు.

గది చూపించడానికి నేను ముందు నడిచాను. చేతి కర్రను ఊతంగా తీసుకుని ఆయన నా వెంట నడిచాడు.

గదిని చూసి ఆయన నిరాశ పడతాడనుకున్నాను. అదేమిటో విచిత్రం! పదేళ్ళ పిల్లాడు ఆటబొమ్మ చేతిలో పెడితే మురిసిపోయినట్టు ఆనందంగా  చుట్టూ చూస్తూ బాగుంది. నాకిది బాగా నచ్చింది అన్నాడు.                 
అర్ధం కానట్టు పెట్టిన నా మొహాన్నిఅందులోని భావాలను గమనించి ఆయన మెల్లగా చెప్పాడు.
గదిలో  ఫర్నిచర్ ఎలావుందిఫాన్ వుందాఏసీ వుందాఅన్న వాటిని బట్టి చూస్తేనిజమే ఈ గది అంత బావోలేదు. ఇలాగే వుండాలని నేను వచ్చేముందు అనుకోలేదు. అందువల్లనే నాకు నచ్చింది. ఇలా వుండాలి అని ముందు  అనుకుని  అలా లేకపోతే తరువాత  మిగిలేది నైరాశ్యమే.

ముసలాళ్ళు ధోరణిలో పడితే యెలా మాట్లాడుతారో నాకు తెలుసు. అందుకే నేనేమీ కల్పించుకోకుండా మౌనంగా వుండి పోయాను.
కానీ ఆయన మాటలు కొనసాగించాడు. ముందు అంతగా పట్టించుకోకపోయినా ఆయన మాటల్లోని ఆకర్షణ శక్తి నన్ను కట్టిపడేసింది.
భార్య చనిపోయిన తరువాత కొన్నాళ్ళ పాటు ఈ లోకం  శూన్యం అనిపించింది. ఆవిడతో పాటే నేనూ పోయి వుంటే యెంత బాగుండేదో అనుకునే వాడిని. కానీ క్రమంగా మళ్ళీ నలుగురిలో  పడ్డాను. ఈ లోకానికి నేను చేయగలిగినదేమయినా వున్నదా అని ఆలోచించాను. పిల్లలు వాళ్ల మానాన  వాళ్లు స్తిరపడ్డారు. ఒక్కడికీ  అంత ఇల్లు అనవసరం అనిపించింది. చిన్న పిల్లలకు ఉచితంగా చదువు  చెప్పే ఓ సంస్తకు రాసిచ్చాను. అనాధ బాలలను పెంచి పోషించే మరో సంస్తకు వున్న డబ్బంతా ఇచ్చేసాను. సంపాదించిన దానికి సార్ధకత లభించింది. సంపాదన మళ్ళీ మొదలు పెట్టాలి. కాకపొతే అది డబ్బు కాదు. నలుగురితో మంచిగా వుండడడంమంచి  అనిపించుకోవడం. నిజానికి ఇది డబ్బు సంపాదించడం కన్నా కష్టం.
చిన్నదో పెద్దదో ఆ మంచంలో పడుకుంటాను. నా వొంట్లో ఏ అవయవం సరిగ్గా పనిచేయడం లేదోదానివల్ల  పడాల్సిన బాధలేమిటో ఆ మంచంలో పడుకుని ఆలోచిస్తాను.  పొద్దున్న లేచిన తరువాత  అవయవాలన్నీ సరిగ్గా వుంటే వాటిని అలా సక్రమంగా పనిచేయిస్తున్న ఆ సర్వేశ్వరుడికి ఓ దణ్ణం పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు కావాల్సింది నా ఆరోగ్యం. మరొకరికి భారంగా మార్చే అనారోగ్యాన్ని దూరంగా వుంచడం. ఇది నా  చేతిలో వుందనుకోను. అయినా మానవ ప్రయత్నం చేయాలి కదా.        
       
ప్రతి ఉదయం ప్రతి ఉషోదయం నాకు అదనంగా దేవుడిచ్చిన వరమనే భావిస్తాను. పొద్దున్నే  లేచి లోకాన్ని మళ్ళీ  చూడగలగడం కంటే ఈ వయస్సులో కావాల్సింది ఏముంటుంది? అలా వచ్చిన ఆ  కొత్త రోజుకు స్వాగతం చెబుతాను. నా జీవిత కాలంలో నాకు సొంతమయిన మధుర క్షణాలనన్నింటినీ  మరో సారి మననం చేసుకునే మహత్తర  అవకాశం దొరికిందని ఆనందిస్తాను.

‘ వృద్ధాప్యం బ్యాంక్ ఎక్కౌంట్ లాంటిది. జీవన యానంలో సంపాదించి కూడబెట్టుకున్న దాన్ని  అందులో  డిపాజిట్ చేసుకోవచ్చు. జీవితం చరమాంకంలో తిరిగి తీసుకోవచ్చు. అది డబ్బే కానక్కర లేదు సుమా! నీవంటివారి నుంచి పొందే  వాత్సల్యం కూడా అలాటిదే.

ఈ రోజున ఇలా తారసపడి నీ ప్రేమాభిమానాలతో నా బ్యాంక్ ఖాతాను పెంచుతున్నావు. అంటే నేను తిరిగి తీసుకునే ఆనందాన్ని మరింతగా పెంచుతున్నావన్న మాట. అందుకు నేను నీకు సదా రుణపడివుంటాను.
ఆ వృద్ధుడి మాటలు వింటుంటే నాకు నోట మాట రాకుండా అయిపోయింది.


చక్కనమ్మైతే చిక్కినా అందం

కానీ ఇదేవిటి?

ఒకప్పుడు మన రూపాయికి పదమూడు అమెరికన్ డాలర్లు. ఇప్పుడో.
ఒక డాలరుకు అరవై రూపాయలు.
హతోస్మి.
(28-06-2013)