22, జూన్ 2013, శనివారం

బాలయ్య బాబు అను మా నాయన బాలయ్య



తెలుగు సాహిత్యంలో నాకు నచ్చిన ప్రక్రియల్లో ఆత్మకధలు లేదా జీవితచరిత్రలు ప్రధానమయినవి. వీటిని చదువుతుంటే మనకు చెందని కాలానికి చెందిన అనేక విషయాలను అవగాహన చేసుకోగలుగుతాము. మనం ఈనాడు చూస్తున్న ప్రదేశాలు, ఆచారవ్యవహారాలు వాటికి పూర్వ రూపం ఎలావుండేదో తెలుసుకోవడానికి వీటిని చదవడం ఒక్కటే సరయిన మార్గం. ఏనుగుల వీరాస్వామి గారు రాసిన నా కాశీ యాత్రపుస్తకం చదువుతుంటే ఆనాటి హైదరాబాదు నగరం ఎలావుండేదన్నది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అప్పటి ధరవరలు, వేషధారణలు, ఆహారవ్యవహారాలు అర్ధం చేసుకోవడానికి ఈరకమయిన పుస్తకపఠనం ఉపయోగపడుతుంది. అయితే ఇవి రాసిన వారు యెంత ఘటనాఘటన సమర్దులయినా కించిత్తు స్వోత్కర్ష దొర్లడం కద్దు. కొన్నింట ఏకంగా పర దూషణఏరులై పారుతుంది. ఇక ఆ పెద్దమనిషి యెంతటి మేఘనగధీరుడయినా ఆ రచనని ఆస్వాదించడం పంటికింద రాయి చందమే. ముఖ్యంగా రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినవాళ్లు రాసిన తమ జీవిత చరిత్రల్లో ఈ రకమయిన ఆత్మ స్తుతి-పరనిందతొణికిసలాడుతుంటాయి. వీటివల్ల అసలు వాస్తవాలు మరుగున పడిపోతుంటాయి. గాంధీ గారు రాసుకున్న మై ఎక్స్ పెరిమెంట్ విత్ ట్రూత్అనేది దీనికి పూర్తి మినహాయింపు. తనలోని బలహీనతలను ఒప్పుకోవడానికి ఆయన ఎంతమాత్రం సంశయించకపోవడం ఆ పుస్తకంలోని గొప్పతనం. అలాగే సందర్భాన్నిబట్టి, లేదా వాస్తవాలనుబట్టి తనలోని గొప్పతనాన్ని కానీ, ఇతరులలో తనకు నచ్చని విషయాలను కానీ చెప్పాల్సివచ్చినప్పుడు ఆ విషయాలను సుతిమెత్తగా చెప్పడం మళ్ళీ ముళ్లపూడి వెంకటరమణ గారికే సాధ్యమయింది.

నాందీప్రస్తావన ఇంత విస్తారం కావడానికి నన్ను ప్రేరేపించిన అంశం ఒకటుంది. దామోదర ప్రసాద్ పటకమూరు / బొద్దులూరి శ్రీనివాసరావు అనే వారి నుంచి నాకు ఈ మధ్య ఒక ఈ మెయిల్ అందింది. అది వారిద్వారా వచ్చిందో, లేక ఎవరయినా పంపితే దాన్ని నాకు పంపారో తెలియదు. ఏమయినా వారికి కృతజ్ఞుడిని. మూడు తరాలకు చెందిన ఒక పేద దళిత కుటుంబం సాగించిన జీవన యానంలోని ఒడిదుడుకులను, కష్ట నష్టాలను తేటతెల్లం చేస్తూ డాక్టర్ వై.వి.సత్యనారాయణ రాసిన మై ఫాదర్ బాలయ్యఅనే జీవిత చరిత్రను హార్పర్ కాలిన్స్ ఇండియావారు ప్రచురించారు. తెలంగాణా ప్రాంతంలో తండ్రిని బాబు అని పిలుస్తారు కాబట్టి దాన్ని తెలుగులోకి అనువదించేటప్పుడు బాలయ్య బాబు అని పేరు పెట్టాను. ప్రముఖ పత్రికా రచయిత మల్లేపల్లి లక్ష్మయ్య, హెచ్.ఎం.టీ.వీ. కి చెందిన ఆంగ్ల దినపత్రిక హాన్స్ ఇండియాలో ఈ పుస్తకాన్ని పరిచయం చేశారు.



డాక్టర్ సత్యనారాయణ ఈ పుస్తకం రాయడంలో ఎలాటి భేషజాలకు లోనుకాలేదన్న వాస్తవం మనకు ఇట్టే బోధపడుతుంది. తాను, తన కుటుంబం సాంఘికంగా, ఆర్ధికంగా అనుభవించిన మానసిక క్లేశాలను ఆయన చాలా చక్కగా మనసుకు హత్తుకునేలా అక్షరబద్ధం చేసారని మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. తన కుటుంబం అనుభవించిన కడగండ్లను కళ్ళకు కట్టినట్టు చూపడంలో ఆయన ఎంతమాత్రం పర నిందా సూత్రాన్ని ఉపయోగించుకోలేదు.
రెండు శతాబ్దాలకు విస్తరించిన ఈ మూడు తరాల కధ కరీంనగర్ జిల్లా వంగపల్లి గ్రామం నుంచి డాక్టర్ సత్యనారాయణ ముత్తాత నరసయ్యతో మొదలవుతుంది. ఈనాటికీ అవశేషాలు మిగిలిన దళితుల తాడన పీడనలు, అవమానాలు, ఆక్రోశాలు చదువుతుంటే మనిషి జీవితం ఇంత పర పీడనమా అన్న ఆలోచన కలుగుతుంది. దీనిలో సానుకూల అంశం ఏమిటంటే మనిషి తలచుకుంటే ఈ కష్టాలొక లెక్కకాదన్న వాస్తవం. దేన్నీ లెక్కపెట్టని గుండె ధైర్యం, పైకి రావాలనే చెక్కుచెదరని తపన వుండాలే కాని మనిషి సాధించలేనిది ఏమీ లేదన్న నిజం డాక్టర్ సత్యనారాయణ రాసిన ఈ పుస్తకం చదివినవారికి బోధపడడం తధ్యం.
ఈ మధ్య విడుదలయిన ఒక తెలుగు సినిమాలో అలనాటి తెలంగాణలో బీదాబిక్కీ ఎదుర్కున్న అవమానాలను చూసిన ఈ నాటి తరం పిల్లలు మనుషులు సాటి మనుషులపట్ల ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అన్న సంశయాన్ని వెలిబుచ్చడం నాకు తెలుసు. అవన్నీ నిజంగా నిజం అని తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి.
మనసుల్ని కదిలించే ఓ సంఘటనను డాక్టర్ సత్యనారాయణ ఉదహరించారు.
మాదిగ కుటుంబంలో జన్మించిన నరసయ్య ఓ లేగదూడ చర్మంతో చెప్పుల జతను తయారు చేసి నిజాం నవాబుకు బహుకరిస్తాడు. ఆ కాలిజోళ్ల పనితనం గమనించి ముగ్ధుడైన నిజాం నవాబు అతడికి యాభై ఎకరాలు దానంగా ఇస్తాడు. దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందంగా వూళ్ళోని దొర, నరసయ్యకు నవాబు ఇచ్చిన యాభయ్ ఎకరాల్లో నలభై ఎనిమిది ఎకరాలను బలవంతంగా స్వాధీనం చేసుకుంటాడు.
ఆ నరసయ్యకు ఒక కొడుకు. అతడి పేరూ నరసయ్యే. ఆ జూనియర్ నరసయ్యకు పదునాలుగో ఏట అబ్బమ్మ అనే యువతితో పెళ్లి చేస్తారు. అస్పృశ్యులయిన వాళ్ళిళ్లలొ జరిగే శుభకార్యాల్లో ప్రతి చిన్న విషయాన్ని రచయిత తనదయిన శైలిలో హృద్యంగా వర్ణించారు. వారికి పుట్టిన బిడ్డే రామసామి అలియాస్ బాలయ్య.
కలరా వ్యాధి సోకి భార్య మరణించిన తరువాత ఆమె శవాన్ని భుజానికి ఎత్తుకుని జూనియర్ నరసయ్య, కొడుకు బాలయ్యను వెంట తీసుకుని, వూరుబయట ఓ వాగు చెంత గొయ్యి తవ్వి భార్య శవాన్ని పూడ్చిపెట్టి, వున్న వూరు విడిచిపెట్టి బాలయ్య మేనమామల పంచన చేరతాడు. వారి సాయంతో నిజాం రైల్వేలో చిన్న కొలువు సంపాదిస్తాడు. బంధువుల బలవంతం మీద మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. అయినా తల్లి లేని రామసామి అలియాస్ బాలయ్యను ప్రాణప్రదంగా చూసుకుంటాడు. అలా పెరిగిన బాలయ్యకు ధ్యేయం ఒక్కటే. చదువు. అది తనకు ఎలాగో అబ్బలేదు. తనకు దక్కని చదువు తన సంతానానికయినా దక్కేలా చేయాలి. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురయినా అతడా లక్ష్యానికి దూరం జరగలేదు. పిల్లలు కూడా అతడి కలను నిజం చేస్తూ పెద్దవారవుతారు. స్కూళ్ళు, కాలేజీలు దాటి విశ్వవిద్యాలయాలలో చేరి ప్రొఫెసర్ల స్తాయికి చేరుకుంటారు. వారిలో ఒకడే ఈ గ్రంధకర్త డాక్టర్ సత్యనారాయణ. కృషి వుంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారుఅన్న కవి వాక్యం నిజం చేసిన మట్టిలో మాణిక్యం’.
అవకాశాలు వుండాలే కాని మనిషి పెరుగుదలకు ఆకాశమే హద్దు అని నిరూపించిన సత్యనారాయణ గారికి, ఆయన తండ్రి బాలయ్య బాబుకు నమోవాకాలు. (28-01-2012)

21, జూన్ 2013, శుక్రవారం

కృష్ణ గారు – కాటికాపరి



‘కలం కూలీ’, కీర్తిశేషులు  జి.కృష్ణ గారు గొప్ప వాక్చాతుర్యం కలవారు. అంతేకాదు మంచి సంభాషణాచతురులు కూడా. హైదరాబాదు రాం నగర్ లో ఆయన అద్దెకు వున్న ఇంటికి వెళ్లి ఆయన చెప్పే కబుర్లు వినే వారిలో కేవలం పత్రికల వాళ్ళే కాకుండా  విభిన్న వ్యావృత్తులకు చెందినా వాళ్ళు కూడా వుండేవారు. అలా వెళ్ళిన ఓ పెద్దమనిషిని కృష్ణ గారు ఓ కోరిక కోరారు. ఒక మనిషిని చూడాలని వుందని, చూడడమే కాదు అతడితో మాట్లాడాలని వుందని మనసులో మాట బయట పెట్టారు.  ఒకపక్క ఇంతమంది కృష్ణ గారిని చూడడానికి వస్తుంటే కృష్ణ  గారు చూడాలని అనుకుంటున్నదెవరా అని ఆశ్చర్యపోతుండగా కృష్ణగారు అతడి వివరాలు చెప్పేశారు. అది విని ఆ పెద్దమనిషి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. అతడెవరంటే – బన్సీలాల్ పేట శ్మశానంలో పనిచేసే కాటికాపరి.
కృష్ణ గారి కోరిక తీర్చడం మహద్భాగ్యం అనుకునే ఆ పెద్దమనిషి ఒకటి రెండు రోజుల్లోనే అతడిని వెంటబెట్టుకుని తీసుకువచ్చాడు. ఆ కాటికాపరిని చూడగానే కృష్ణ గారి కళ్ళు వెలిగి పోయాయి. అతడిని ఆప్యాయంగా తన పడక పక్కనే కూర్చోబెట్టుకుని, ‘లచ్చమ్మా!(కృష్ణ గారు భార్యను పిలిచే తీరు) మనవాడు వచ్చాడు, మంచి కాఫీ పట్రా’ అని కేకేసి అతడితో  సంభాషణ ప్రారంభించారు.
‘ఇదిగో చూడవయ్యా! (అతడి పేరు గుర్తుకు రావడం లేదు) నువ్వు రోజుకు ఎన్ని శవాలు దహనం చేస్తుంటావు ఏమిటి?’
‘రోజుకు ఇన్ని అనీ లెక్కేమిటుంటాది చెప్పండి. ఎన్నొచ్చినా కాదనకుండా కాలుస్తూ పోవడమే’ అన్నాడా కాటి కాపరి.
‘సరే! నన్ను చూసావు కదా. బక్క పలచగా వున్నాను. కాస్త నొప్పితగలకుండా కాల్చడం కుదురుతుందా?’
‘అన్ని నొప్పులు వొదిలేకే కదా మా దగ్గరకు వచ్చేది. ఆ బాధేమీ వుండదు లెండి.’ అన్నాడతను తాపీగా.
‘అది సరే ఇంత సన్నగా వున్నాకదా కాటిమీద లేచి కూర్చొను కదా’
‘అలా లేస్తే మరో మొద్దు మీద వేస్తా ఫికరు పడకండి’ అన్నాడతను మరింత తాపీగా.
అలా ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ వుంటే వినే వాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టారు.
(సూతుడు శౌనకాది మునులకు చెప్పగా విని, ఆ విన్నవాళ్ళల్లో ఒకరు చెప్పిన ‘కృష్ణ కధ’)
(21-06-2013) 


(కృష్ణ గారు జీవించివున్న  రోజుల్లో ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళిన నాటి జర్నలిస్టు, నేటి రాజ్యసభ సభ్యులు శ్రీ రాపోలు ఆనంద భాస్కర్) 

-ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ లోకేశ్వరరావు  రచించిన  ఆంగ్ల గ్రంధంలో కృష్ణ గారి గురించి-    
                     
JEEVITHAM ATANI KOKA TAMAASHAA: Lokeshwar, Gandhi Publications, "Shobha" H.No. 12-2-709/5/1/C, Navodaya Colony, Mehidipatnam, Hyderabad-500028. Rs. 40. (Review in Hindu)
THIS VOLUME is a collection of 18 essays most of which support the cause of Telangana.
The author provides insights into the evolution of the mulki (local) movement since the days of Kutub Shahi Kings. His convincing arguments are sometimes overshadowed by emotional overtones. Creation of smaller states at this juncture has to be tackled at the national level as similar demands are on the anvil elsewhere.
The introductory article provides glimpses of the eventful career of the veteran journalist G. Krishna, who went to jail under the Quit India movement.

After release, as a reporter he had a unique experience of having supper with a former prison mate (to fulfil the last wish) who was to be hung for murder next morning. No wonder, "one could see both a child's laughter and Ramana Maharshi's brilliance in his face." A dedicated professional, Krishna is a role model to younger journalists.

19, జూన్ 2013, బుధవారం

సిసలైన నవ్వుకు అసలైన సంతకం జంధ్యాల


(ఈరోజు 19-06-2013 జంధ్యాల వర్ధంతి)

నిండు నూరేళ్ళ జీవితం అనుకుంటే జంధ్యాల బతికింది యాభయ్ యేళ్ళే. కానయితేనేమి నూరేళ్ళకు సరిపడా  నవ్వులు నలుగురికీ పంచి పెట్టిపోయాడు.

ఆరోజు నాకు బాగా జ్ఞాపకం వుంది. నేను రేడియోలో వుంటే రాంపా ఫోను చేసి జంధ్యాల పోయాడని చెప్పాడు. నేను వెంటనే వార్త రాసి ఇచ్చేసి రాజభవన్ రోడ్డులోని వాళ్ల ఇంటికి వెళ్లాను. అప్పుడే వార్త తెలిసి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఓ కుర్చీలో జంధ్యాల నాన్నగారు నారాయణ మూర్తి  గారు కూర్చుని వున్నారు. కానీ ఆయనకు ఏదీ తెలియని పరిస్తితి. జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది. ఏమి జరిగిందన్నది ఒక్కగానొక్క కొడుకు పోయాడన్నది  అర్ధం చేసుకునే స్తితి కాదు. ఏమిటో ఈ జీవితం అనిపించింది.
జంధ్యాల చనిపోయిన రెండేళ్లకు వేటూరి సుందరరామమూర్తి ఇలా గుర్తుచేసుకున్నారు.



( జంధ్యాల - 1951-2001)


“హాస్యం,సంగీతం కలిసి ఒకే జన్మ ఎత్తిన హాసం, నిన్నటి దరహాసం జంధ్యాల ఇతిహాసంలో చేరిపోయి రెండేళ్ళు గడిచాయి.ఎన్నేళ్ళు  గడిచినా ఆయన మధుర స్మృతికి మరణం లేదు.ఎంత కాదనుకున్నా కన్నీళ్ళు  కళ్ళతోనే మింగటం కన్నా శరణం లేదు.
“తెలుగు సినిమా అపహాస్యం పాలెక్కువై పరిహాస్యం పాలై పోతున్న ఈనాడు జంధ్యాల తన వంశవృక్షంతో సహా దర్శనమిచ్చి ఆదుకుంటాడు. పానుగంటి, కందుకూరి, గురజాడ, చిలకమర్తి, భమిడిపాటి, మొక్కపాటి, మునిమాణిక్యం మొదలయిన శాఖోపశాఖలతో విరాజిల్లే ఆ హాస్య కల్పవృక్షానికి మూల స్థానం లో కూర్చుని "ఫిబరే హ్యూమరసం" అని రస పిపాసులకు తన కలం నించి వెలువడిన హాస్య రస కలశాలను అందించిన తెలుగుజాతి చిరునవ్వు జంధ్యాల.”
ఆ వేటూరిగారు కూడా ఇప్పుడు లేరు.  జంధ్యాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.
కాని, ఆయన అన్నట్టు జంధ్యాల మార్కు  నవ్వుకు మాత్రం   మరణం లేదు. (19-06-2013)

17, జూన్ 2013, సోమవారం

జ్ఞాపకాలు పంచుకోవడం అంటే ఇదే.


శ్రీ శ్రీ వర్ధంతికి ప్రసార మాధ్యమాల్లో తగిన ప్రాధాన్యత లభించలేదని బాధ పడుతున్నవారికి స్వాంతన కలిగేలా వుంది ఈ విషాద స్మృతి . ముప్పయ్ ఏళ్ళక్రితం శ్రీ శ్రీ మరణించిన రోజు ఈనాడు దినపత్రికలో పనిచేస్తున్న  నవీన్ RJY గారి జ్ఞాపకాలు:

మహాకవి శ్రీశ్రీ  

"శ్రీశ్రీ మరణాన్ని మరణవార్తగా కాక ఉద్వేగభరితమైన అనుభూతిగా పాఠకుల ముందుంచిన అనుకోని/యాధృచ్ఛిక ఈనాడు "ప్రయోగం"లో నేను కూడా చిన్న భాగస్వామినే!
ఆమహాకవి 30 వర్ధంతి జూన్ 16 అన్న ఫేస్ బుక్ ప్రస్తావన చూశాక ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అప్పటి టెలిప్రింటర్ ఆపరేటర్ గుండిమెడ (రామచంద్ర) శర్మతో ఫోన్ లో మాట్లాడి వివరాలు ధృవీకరించుకున్నాక ఇది రాస్తున్నాను.
అప్పుడు నేను తిరుపతి ఈనాడు ఎడిషన్ మఫిషియల్ డెస్క్ ఇన్ చార్జని. కెఎన్ వై పతంజలి గారు జనరల్ డెస్క్ ఇన్ చార్జ్....ఆరోజురాత్రి 7 గంటల ప్రాంతం...బోయ్ ఏకాంబరం వచ్చి ప్రకాష్ సార్ పిలుస్తున్నారంటే జనరల్ డెస్క్ కి వెళ్ళా. షిఫ్ట్ ఇన్ చార్జ్ ప్రకాష్ ఫస్ట్ ఎడిషన్ డ్యూటీ అయిపోయింది. ఇంకో షిఫ్ట్ ఇన్ చార్జ్ రామశేషుగారు నైట్ ఎడిషన్ల డ్యూటీకి వచ్చేశారు. సబ్ ఎడిటర్లు రామశేషుగారు, ప్రకాష్ గారు, విలాసిని గారూ గంభీరంగా వున్నారు.
శ్రీశ్రీ మద్రాస్ లో పోయారు. వార్తతెప్పించండి అని ఓ టెలిప్రింటర్ మెసేజ్ నా చేతికిచ్చారు. అది విజయవాడ ఆఫీస్ నుంచి వచ్చింది. శ్రీశ్రీ మరణవార్తను చలసాని ప్రసాద్ గారు ఫోన్ లో చెప్పారు. వార్తతెప్పించండి అని అందులోవుంది.
మద్రాస్ లో సితార కు మిక్కిలినేని జగదీష్ బాబు రిపోర్టర్. మద్రాసు ఈనాడు ఆఫీస్ కి జగదీష్ బాబు ఇంటికీ, ఆరుద్రగారి ఇంటికీ(నెంబరు ప్రకాష్ ఇచ్చారు) ట్రంకాల్ బుక్ చేశాను. (బహుశ ఈ విషయం ప్రపంచానికి నేనే చెప్పాలన్న బాధ్యత అధికారాలను ఒలకబోస్తూ) ప్రెస్ కాల్ అర్జంట్ అని ఆపరేటర్ నిఅడిగాను. విషయం చెప్పాను.  శ్రీ శ్రీ ఎవరు అని అతను అడిగాడు.
అంతలో కరెంటుపోయింది. ఎవరో "మహాప్రస్ధానం" పుస్తకాన్ని తీసుకు వచ్చారు. కొవ్వొత్తి వెలుగులో శర్మ ఒకో కవితనీ బిగ్గరగా చదువుతూంటే నా డెస్క్ లో సబ్ ఎడిటర్ దాట్ల నారాయణ మూర్తిరాజు కావలసిన లైన్ లను నోట్ చేసుకున్నారు. నా డెస్క్ లో కళత్తూరు సుధాకరరెడ్డి బయటికి వెళ్ళి ఎక్కడినుంచో ఖఢ్గసృష్టి పుస్తకం తెచ్చి ప్రకాష్ కి ఇచ్చారు.
ఆరుద్రగారినుంచి కాల్ వచ్చింది నేను రాసుకుంటూనే సైగచేసేస్తే ఏకాంబరం వెళ్ళి ప్రకాష్ ని తీసుకువచ్చారు. ఆయన సంతాపసందేశాన్ని పూర్తిగా రాసుకున్నారు.
ఇంతలో  నామిని సుబ్రమణ్యం నాయుడు ఓ రిపోర్టు రాసుకొచ్చాడు. శ్రీశ్రీ మరణానికి ఆకాశం బోరున ఏడుస్తోందని...అప్పటి వరకూ బయట పెద్దవాన పడుతోందన్న స్పృహే మాకెవరికీ లేదు.
శ్రీశ్రీ గారి కవితలనే కోట్ చేస్తూ మరణవార్తను దాట్లనారాయణ మూర్తిరాజు రాశారు. చర్చించుకుని చిన్న మార్పులు చేశారు.
హైదరాబాద్ ఈనాడు సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డునుంచి వర్మగారు నాకు ఫోన్ చేసి "ఎట్టి పరిస్ధితుల్లోనూ మాస్ట్ హెడ్ (ఈనాడు లోగో) దించడానికి వీల్లేదని చెప్పు" అన్నారు.
అపుడు రామశేషుగారు - బ్యానర్ వార్తేగాని మాస్ట్ హెడ్ దించవలసింది కానేకాదు అని తెగేసి చెప్పారు. (ఆ ఎడిషన్ రామశేషుగారు ఇవ్వవలసింది. ప్రకాష్ బృందం ఉద్వేగాన్ని గౌరవించి వారికి బాధ్యతలు అప్పగించేసి పక్కనే వుండి మొత్తం పరిస్ధితిని ఫాలోఅవుతున్నారు.)
"
మహాకవి శ్రీశ్రీ మహాప్రస్ధానం" అని బ్యానర్ రాశారు.ఇది అందరికీ అర్ధమౌతుందా అని నాకు అనుమానమొచ్చంది. ఈ అనుమానాన్నే శర్మ అడిగితే "శ్రీశ్రీ గురించి తెలిసిన వాళ్ళకి ఇది అర్ధమౌతుంది" అని రామశేషుగారు రూలింగ్ యిచ్చారు.
ఈ మొత్తం ప్రక్రియలో ప్రకాష్, దాట్ల, రామశేషు గార్లదే యాక్టివ్ రోల్. డెస్క్ ఎదురగా దూరంగా వుండే ఇన్ చార్జ్ సీటులో పతంజలిగారు కూర్చుని కొవ్వొత్తి వెలుగులో ఆలోచిస్తూ రాసుకుంటున్న రూపం మెదులుతున్నట్టువుంది. మామూలుగా ఫస్ట్ ఎడిషన్ పేజీలు ఇచ్చేశాక పతంజలి వెళ్ళిపోతారు. ఆరోజు ఆయన తిరుపతి టౌన్ కి వెళ్ళారనీ(ఎడిషన్ ఆఫీస్ రేణిగుంటలో వుంటుంది) ఫలానాఫలానా చోట వుండొచ్చనీ రిపోర్టర్ వల్లీశ్వర్ గారికి ఫోన్ చేసి పతంజలిగారికి కబురందేలా చూడాలనీ ప్రకాష్ గారు నన్ను అడిగినట్టు లీలగా గుర్తుంది..లేట్ గా ఆయన వచ్చారో లేక రాలేదో ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు అయితేవార్త మొత్తం కాపీ తయారు చేసింది దాట్లగారే! మెరుగులు దిద్దింది ప్రకాష్ గారే! తుదిమెరుగులన్నీ పతంజలిగారివేననీ, ఆయన విజయవాడ న్యూస్ ఎడిటర్ వాసుదేవరావుగారూ చాలాసార్లు ఫోన్ లో మాట్లాడుకున్నారనీ నాకు లీలగా గుర్తొస్తోంది. శర్మ మాత్రం ఆ రాత్రి పతంజలిగారు కనబడలేదని గట్టిగాచెబుతున్నారు. నేనైతే దాట్ల ముడి సరుక్కి ఉద్వేగాన్ని అద్దింది పతంజలిగారేనని గట్టిగా నమ్ముతున్నాను.
ఎడిషన్ అయిపోయాక చాలాసేపు వుండిపోయాము. టీలు సిగరెట్లూ తీసుకురావడానికి ఏకాంబరం ఆరోజు కనీసం 60/70 సార్లయినా పైకీ కిందికీ తిరిగివుంటాడు.
మూడోరోజుకల్లా చైర్మన్ గారి(రామోజీరావుగారు) కామెంట్స్ వచ్చాయి. "బాగుంది. శ్రీశ్రీ కుటుంబ వివరాలు లేవు.సామాన్యపాఠకులకు ఈ వార్త అర్ధమౌతుందా" అని పేపర్ మీద పచ్చసిరాతో ఆయన రాశారు."(17-06-2013)

16, జూన్ 2013, ఆదివారం

Today Fathers’Day వన్ బై టు కాఫీ


నలభై ఏళ్ళ కిందటి మాట.

ఆ రోజుల్లో విజయవాడ గాంధీ నగరంలోని వెల్ కం హోటలుకు కాఫీ తాగడానికి ఓ రోజు వెళ్లాను. నా పక్క టేబుల్ దగ్గర కూర్చున్న ఓ పెద్ద మనిషి ప్రవర్తన నన్ను ఆకర్షించింది. సర్వర్ ను పిలిచి వన్ బై టు కాఫీ తెమ్మన్నాడు. ఆయన వెంట మరెవరయినా వున్నారా అని చూసాను. ఎవరూ లేరు. ఆయన ఒక్కడే రెండు కప్పుల్లో తెచ్చిన ఒక్క కాఫీని కాసేపు అటూ ఇటూ మార్చుకుంటూ తాగి వెళ్ళిపోయాడు.

మరో సారి కూడా ఆ హోటల్లో అదే పెద్దమనిషి తారస పడ్డాడు. మళ్ళీ అదే సీను. ఒక్కడే మనిషి. వన్ బై టు కాఫీ. ఇక మనసు ఉగ్గపట్టుకోలేకపోయాను. కలిసి కదిలిస్తే కదిలిన కధ ఇది.

ఆయనో ఎలిమెంటరీ స్కూలు మాస్టారు. ఒక్కడే కొడుకు. లక్ష్మీ కటాక్షం లేకపోయినా సరస్వతీ దేవి కరుణ అపారం. క్లాసులో ఫస్ట్. స్కూల్లో ఫస్ట్. హోల్ మొత్తం ఆ ఏరియాలోనే చదువులో ఫస్ట్. ఇరుగు పొరుగు పిల్లాడిని మెచ్చుకుంటూ మాట్లాడే మాటలే వాళ్లకు కొండంత బలం ఇచ్చేవి.పిల్లాడంటే మీ వాడు మాస్టారు. మా పిల్లలూ వున్నారు ఎందుకు తిండి దండగఅంటుంటే ఆ తలిదండ్రులు మురిసి ముక్కచెక్కలయ్యేవారు.

కొడుకు చదువుపై మాస్టారికి కాణీ ఖర్చు లేదు. అంతా స్కాలర్ షిప్పుల మీదనే నడిచిపోయింది. అతగాడు కూడా - చిన్న చదువులప్పుడు మాత్రమే కనిపెంచిన వారితో కలసి వున్నాడు. ఆ తరువాత పొరుగూర్లలోని పెద్ద కాలేజీల్లో పెద్ద చదువులు చదివాడు. కొన్నాళ్ళకు అవీ అయిపోయాయి. పై చదువులు చదవడానికి ఈ చిన్న దేశం సరిపోలేదు. అమెరికా వెళ్లాడు. అక్కడా చదువులో మెరిక అనిపించుకున్నాడు. ఆ చదువులకు తగ్గ పెద్ద ఉద్యోగం అక్కడే దొరికింది. కానీ, ఇండియాకు వచ్చి తలిదండ్రులను చూసే తీరిక దొరకలేదు. అది దొరికే లోపలే అక్కడే ఓ దొరసానిని పెళ్ళిచేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ల ఫోటోలు చూపిస్తూ మా మనవళ్ళుఅని వూళ్ళో వాళ్లకు చెప్పుకుని మురవడమే ఆ ముసలి తలిదండ్రులకు మిగిలింది. డబ్బుకు కొదవలేదు. అమెరికా నుంచి వచ్చిన డాలర్లు ఇండియా బ్యాంకులో రూపాయల పిల్లలు పెడుతున్నాయి. కానీ ఒక్కగానొక్క పిల్లాడు కళ్ళెదుట లేకుండా, ఎక్కడో దూరంగా వుంటూ పంపే ఆ డబ్బు ఏం చేసుకోవాలో తెలియని పరిస్తితి. ఇది వాళ్లకు కొత్తేమీ కాదు. చిన్నప్పటినుంచి చదువుల పేరుతొ పరాయి చోట్లనే పెరిగాడు. పట్టుమని పది రోజులు కలసివున్నది లేదు.

ఇంకా వస్తారు వస్తారుఅనుకుంటూ వుండగానే, పిల్లాడిని, వాడి పిల్లల్ని కళ్ళారా చూడకుండానే ఆ కన్న తల్లి కన్ను మూసింది.

కబురు తెలిసి పెళ్ళాం పిల్లల్ని తీసుకుని అమెరికానుంచి ఆర్చుకుని, తీర్చుకుని వచ్చేసరికే కర్మకాండ అంతా ముగిసిపోయింది.

వచ్చిన వాళ్లకు ఇంట్లో సౌకర్యంగా వుండదని వున్న నాలుగు రోజులు పెద్ద హోటల్లో గదులు అద్దెకు తీసుకుని వున్నారు. మనుమళ్లని దగ్గరకు తీసుకోవాలని వున్నా ఏదో జంకు. తిస్ యువర్ గ్రాండ్ పాఅని తండ్రి పరిచయం చేస్తే య్యా! హౌ డూఅని పలకరించారు. వాళ్లు ఇంగ్లీషులో మాట్లాడుతుంటే జవాబు చెప్పలేని అశక్తత. రెండో తరగతి టిక్కెట్టు కొనుక్కుని ఫస్ట్ క్లాసులో ప్రయాణిస్తున్న అనుభూతి.

అమెరికా తమతో రమ్మన్నారు. తాను రానన్నాడు. భార్య కలిసిన మట్టిలోనే కలసిపోవాలన్నది తన కోరిక.

వొంటరి జీవితంతో వొంటరి పోరాటం మళ్ళీ మొదలు.

కానీ, ఈసారి మొదలుపెట్టే జీవన యానంలో తాను వొంటరి కాదు. తనతో పాటు మరొకరు వున్నారు. ఆ వ్యక్తి మరో లోకానికి వెళ్ళిన భార్యా? మరో దేశానికి వెళ్ళిన కొడుకా? యేమో.


అందుకే ఈ వన్ బై టు కాఫీముగించాడు ముసలాయన.

15, జూన్ 2013, శనివారం

అమెరికాలో వ్యవసాయం చేయాలని వుంది


ఇదేమిటి అలాటి దేశం వెళ్ళి ఏదో లక్షల్లో డాలర్ల పంట పండించే పెద్ద పెద్ద  ఉద్యోగాలు చేయాలని అనుకుంటారు కాని అంత దూరం పోయీ, అంతంత చదువులు చదివి కూడా  గిట్టుబాటుకాని దిక్కుమాలిన  పొలం దున్నుకోవాలేమిటి ఇదేం పోయేకాలం అని కొందరికయినా  అనుమానం రావచ్చు. అయితే,  మన దేశానికి చెందిన, ఆ మాటకు వస్తే మన రాష్ట్రానికే చెందిన ఒక  పెద్దమనిషికి, - శ్రీ కొప్పరపు ప్రకాష్ - నిజానికి వయస్సు రీత్యా చాలా చిన్నవాడు -   ఆ దేశం వెళ్ళిన తరువాత ఈ కోరిక పుట్టిన మాట నిజం. ఆయన చెప్పేదేమిటో ఆయన మాటల్లోనే విందాం.


డాక్టర్ ఎం.ఎస్.స్వామినాధన్ తో ప్రకాష్ కొప్పరపు 

“అమెరికాలో అయోవా (Iowa) అనే రాష్ట్రం వుంది.  డె మొయిన్  (Des Moines, IA) అనే పెద్ద నగరం ఈ రాష్ట్రానికి రాజధాని. అక్కడికి వెళ్ళి చూసేవరకు నేనూ అందరి మాదిరిగానే అమెరికాలో కుదురుగా ఉద్యోగం చేసుకోవాలని అనుకున్నవాడినే. కానీ ఆ ప్రాంతం  నా వూహల్ని, అభిప్రాయాల్ని పూర్తిగా మార్చేసింది.  ఒకప్పుడు కృష్ణా డెల్టాను మన రాష్ట్రానికి ధాన్యాగారం అనేవారు. అలాగే అయోవా రాష్ట్రంలోని డె మొయిన్.  యావత్ అమెరికా ప్రజలకు కావాల్సిన మొత్తం తిండి గింజల అవసరాల్లో అత్యధికభాగం  డె మొయిన్  అనే ఈ ప్రాంతంలోనే ఉత్పత్తి అవుతోంది.  కాకపొతే  ముందు  పేర్కొన్న మన కృష్ణా డెల్టాకు, అమెరికాలోని ఈ ప్రాంతానికి నడుమ  వ్యవసాయ  విధానాల విషయంలో   ఎంతో వ్యత్యాసం వున్న మాట కూడా నిజం. ఇక్కడి రైతులు వ్యవసాయాన్ని ఒక వ్యాపకంగా చూడరు. అది కూడా ఒక వ్యాపారం అనే అనుకుంటారు. సమర్ధవంతంగా సాగుచేసి లాభాలు గడించాలని భావిస్తారు. అందుకే అమెరికాలో వ్యవసాయం కూడా కార్పొరేట్ రూపాన్ని సంతరించుకుంది. పెద్ద పెద్ద కంపెనీలు వేలాది ఎకరాలను కొనుగోలు చేసి పెద్దయెత్తున ఆహార ధాన్యాలు పండిస్తుంటాయి. వీటికి తోడు సాంప్రదాయిక కుటుంబ సేద్యాలు సైతం ఆ దేశంలో ఇప్పటికీ మనుగడలో వున్నాయి. ఈ మధ్య ఆ ప్రాంతానికి  టూరిస్టుగా వెళ్ళినప్పుడు అక్కడి వ్యవసాయ రంగాన్ని దగ్గరనుంచి పరిశీలించిన తరువాత నాకు కలిగిన భావాలను అందరితో పంచుకోవడానికే ఈ ప్రయత్నం.
“ఆ ప్రాంతంలో వ్యవసాయం చేయాలని అనుకునేవారికి అవసరమైన సమాచారం మొత్తం  నెట్లో అందుబాటులో వుంది. భూముల అమ్మకాలు, కౌళ్ళకు సంబంధించి సమస్త వివరాలు అందులో లభిస్తాయి. వ్యవసాయాన్ని ఒక వ్యాపారం మాదిరిగా నిర్వహించడానికి వీలైన మెళకువలు నేర్పుతారు. ప్రభుత్వం పాత్ర పరిమితం. రైతులకు యేది లాభసాటో అర్ధం చేసుకుని ఆ విధానాలను మాత్రమే  అమలుచేయడానికి  ప్రభుత్వ విభాగాలు చివర్లో రంగ ప్రవేశం చేస్తాయి. అమెరికా సెనేట్లో ఒక బిల్లు పరిశీలనలో వుంది. వ్యవసాయాన్ని ఒక వృత్తిగా స్వీకరించడానికి ముందుకువచ్చే   యువజనులకు అవసరమైన రుణసదుపాయం, పన్ను రాయితీలు కల్పించడానికి ఈ బిల్లు మరిన్ని వెసులుబాట్లు  కల్పిస్తుంది.
“అక్కడి పరిస్తితులను అధ్యయనం చేసిన తరువాత నాకు అక్కడే వుండిపోయి వ్యవసాయం చేయాలనే తలంపు కలిగింది. నిజానికి మా పూర్వీకులు కూడా వ్యవసాయం చేసేవారు. కాకపోతే మన వ్యవసాయానికి, అక్కడి వ్యవసాయానికీ నడుమ వ్యత్యాసాలను గమనించిన తరువాత ఎంతో నిర్వేదం కలిగింది. మన దేశం ప్రాధమికంగా వ్యవసాయిక దేశం. దేశ ప్రణాళికలు రూపొందించేవారు మాత్రం పదేపదే వ్యవసాయానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి నొక్కి చెబుతుంటారు కాని  ఆచరణలో మాత్రం అది కనబడదు.              
 “రెండు దేశాల్లో వ్యవసాయం తీరుతెన్నులను చూసిన తరువాత నాకు మరో మారు మన రైతులు ఎంతగా దోపిడీకి గురవుతున్నారో అన్న సంగతి బోధపడింది. మన దగ్గర ప్రతి రాజకీయ నాయకుడు తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకుంటూ వుంటారు కాని సేద్యపు రంగం పట్ల వారికి  ఏపాటి శ్రద్ధ వుందన్నది అందరికీ తెలిసిన విషయమే.  
“వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అనే సంస్థ వుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగం అభివృద్ధికి దోహద పడ్డ శాస్త్రవేత్తలను గుర్తించి వారికి  పురస్కారాలు ప్రకటిస్తుంది. ఈ సంస్థ ఇచ్చే బహుమతిని వ్యవసాయంలో నోబుల్ పురస్కారంతో సమానంగా పరిగణిస్తారు. ఈ బహుమతికి ఎంపికయిన శాస్త్రవేత్తను  రెండులక్షల యాభయ్ వేల డాలర్ల నగదు బహుమతితో సత్కరిస్తారు. వీసా లేకుండా ఏ దేశానికయినా వెళ్ళగలిగే  దౌత్య హోదా కల్పిస్తారు.
“ఈ సంస్థ బృందంలో ఒకడిగా వున్న నేను అయోవా  వెళ్లాను. మరో విషయం తెలుసా? ఈ బహుమతి గెలుచుకున్న ఒక శాస్త్రవేత్త హైదరాబాదులోనే వున్నారు. ఆయన పేరు డాక్టర్ మొదడుగు విజయ్ గుప్తా. చేపల పెంపకంలో విప్లవాత్మక మెళకువలు ప్రవేశపెట్టి బంగ్లాదేశ్, థాయ్ లాండ్ దేశాల జీడీపీని అమాంతం పెంచేసిన ఘనత ఆయనకు వుంది. బేగంపేటలో వుండే ఈ శాస్త్రవేత్త గురించి చాలామందికి తెలియదు. మనదేశానికే చెందిన డాక్టర్ ఎం ఎస్ స్వామినాధన్, డాక్టర్ కురియన్ లకు కూడా ఈ పురస్కారం లభించింది. వీళ్ళందరినీ నేను ప్రతియేటా డె మొయిన్ లో కలుస్తుండేవాడిని.  డాక్టర్ కురియన్ ఇప్పుడు లేరు.
“ఈ ఏడాది యువ వ్యవసాయ శాస్త్రవేత్త కోసం మరో కొత్త పురస్కారాన్ని ప్రవేశపెట్టారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో పనిచేస్తున్న డాక్టర్ (శ్రీమతి) ముఖర్జీకి ఇది  లభించింది. వర్షాల మీద ఆధార పడకుండా భూగర్భ జలాలను సమర్ధవంతంగా ఉపయోగించుకునే నూతన విధానాలను ముఖర్జీ ఆవిష్కరించారు. ఈ యువ మహిళా శాస్త్రవేత్త రూపొందించిన ఈ విధానాలను ఒక్క భారత దేశంలో మినహా ప్రపంచంలో అనేకచోట్ల విరివిగా ఉపయోగిస్తున్నారు.        
“మన దేశంలో ఇలాటి అద్భుత మేధస్సులకు కొదవ లేదు. అయినా వారి సేవలను సరిగా ఉపయోగించుకోలేకపోవడమే మన దురదృష్టం. గిట్టుబాటు ధరలు దొరక్క  రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు దొరక్క మధ్య, దిగువ తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదే కాబోలు.
“అందుకే నాకు  అనిపిస్తోంది, ఇక్కడే (అయోవా) వుండిపోయి వ్యవసాయం చేయాలని.
(రచయిత కొప్పరపు ప్రకాష్ ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు – ఆయన ఇంగ్లీష్ లో రాసిన వ్యాసానికి ఇది స్వేచ్చానువాదం)    

(15-06-2013)

జేబులో రాజీనామా


1971 లో బెజవాడ  ఆంధ్ర జ్యోతిలో సబ్ ఎడిటర్ గా  చేరడానికి వెళ్లాను. ఎడిటర్ నార్ల వేంకటేశ్వర రావు గారు.
‘ఏదీ నీ రాజీనామా?’ అన్నారు. ఒక్క క్షణం గతుక్కుమన్నాను. ఇంతలో ఆయనే ‘జర్నలిస్టు అనేవాడు తన జేబులో రాజీనామా సిద్ధంగా వుంచుకోవాలి.తెలిసిందా’ అన్నారు.
నాలుగున్నర ఏళ్ళదాకా నాకు రాజీనామా అవసరం పడలేదు. తరువాత ఆంధ్రజ్యోతికి సలాం చెప్పి హైదరాబాదు ఆలిండియా రేడియోలో విలేఖరిగా చేరాను. నేను చిక్కడపల్లిలో వుండేవాడిని. కలం కూలీ జీ.కృష్ణ గారి నివాసం రాం నగర్లో. బెజవాడలో వుండగా మా అన్నయ్య పర్వతాలరావు గారి ద్వారా కృష్ణ గారు పరిచయం. తరువాత హైదరాబాదులో ఆయన ఇండియన్  ఎక్స్ ప్రెస్ లో, నేను రేడియోలో విలేఖరులం. రాజకీయాలతో సంబంధం లేని అనేకమంది ప్రముఖులను ఆయన ద్వారా కలుసుకునే అవకాశం దొరికింది. కృష్ణ గారి ధారణ శక్తి అపూర్వం. ఎన్నెన్నో పాత సంగతులను చెబుతుండేవారు. ఎందరో ప్రముఖులతో ఆయనకు వ్యక్తిగత పరిచయాలు వుండేవి. ముఖ్యమంత్రి వెంగళరావు గారిని ‘ఏం వెంగళరాయా!’ అని సంబోధించేవారు. అనేక పత్రికల్లో పనిచేసిన అనుభవం ఆయనది. ఎక్కడా కాలునిలవని తత్వం. నార్లగారు చెప్పిన సూత్రాన్ని అక్షరాలా పాటించిన జర్నలిస్టు. అనేక పర్యాయాలు రాజీనామా చేసి పెద్ద పెద్ద పేపర్లలో పెద్ద పెద్ద పదవులను వొదులుకున్నారు.
కొంతకాలం ఢిల్లీలో పనిచేశారు. ఆనాటి ఆయన జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే.
“ఢిల్లీలో నేను సరిగా ఇమడలేకపోయాను. అక్కడ తక్కువ జీతగాళ్ళు వుంటారు  కాని తక్కువ జీతంపైన వుండలేం.
“ఢిల్లీలో తమిళులు ఒక స్వయం సమృద్ధవర్గం. వాళ్ల పురోహితులు వాళ్ల వాళ్ళే. వాళ్ల హోటళ్ళు వాళ్ళవే. ఒక తమిళుడు కుంభకోణంలోని తన స్నేహితుడికి ఇలా రాశాడట. ‘ఢిల్లీ మనదే. కాకపోతే ఇక్కడ అనవసరంగా ఉత్తరాదివాళ్ళు వచ్చిపడ్డారు.’  బెంగాల్ వాళ్ళది మరోతీరు. వాళ్లు తాము అందరికన్నా కనీసం ఒకరోజు ముందు ఆలోచించగలం అన్నది వాళ్ల ధీమా. అప్పట్లో నెహ్రూ నెల జీతం 2,500. దానిపై బెంగాలీల వ్యాఖ్య.- నెహ్రూ గారు తన యోగ్యతకు మించి నెలకు 2,500 ఎక్కువగా జీతం పుచ్చుకుంటున్నారని.
“అన్నట్టు, పట్టాభి సీతారామయ్య గారిని ఉపరాష్ట్రపతిగా నియమించాలని కాంగ్రెస్ కార్యవర్గం తీర్మానించింది. కాని నెహ్రూ గారు కాదని డాక్టర్ రాదాకృష్ణన్ గారిని ఎంపిక చేశారు. ఒక్క బీసీ రాయ్ మినహా ఇలా యెందుకు చేసావు అని అడిగే ధైర్యం పార్టీలో ఎవ్వరికీ లేకపోయింది.
“విలేఖరులనేకులు పట్టాభి గారి ద్వారా కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించిన వార్తల కూపీలు లాగుతుండేవారు. కానీ ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి రాలేదని యే ఒక్కడూ రాయలేదేమి?
“మన దేశంలో పత్రికా యజమానుల రాజకీయాలు సరేసరి. విలేఖరుల రాజకీయాలు కూడా వుంటయ్యి.” కృష్ణ గారి ఉవాచ.  (15-06-2013)