jandhyala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
jandhyala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జనవరి 2014, శుక్రవారం

ఏనుగు శీర్షాసనం చూశారా!

(ఈనెల పద్నాలుగో తేదీ జంధ్యాలజయంతి)

ఆయనతో పరిచయం యెలా జరిగిందో గుర్తు రావడం లేదు. ఆయనో లాయరు. మహాకాయానికి తక్కువగా, స్తూలకాయానికి ఎక్కువగా వుండేవారు. పేరు మాత్రం కురచ. వరప్రసాద్.  వయస్సులో నాకంటే రెండు పదులు తక్కువ. బుద్ధిలో బృహస్పతి. రాజ్యాంగ శాసనాలు కొట్టిన పిండి. ప్రాచీన ధర్మ సూక్ష్మాలు, శాస్త్రీయ విషయాలు కరతలామలకం. భారత, భాగవత, రామాయణాలు ఆసాంతం  ఆపోసన పట్టిన వ్యక్తి. పద్యాలు, వేల సంఖ్యలో సంస్కృత  శ్లోకాలు కంఠతా వచ్చు. అష్టాదశ పురాణాలు తడుముకోకుండా చెప్పగల సామర్ధ్యం ఆయన సొంతం. కుతర్కంతో కాక  తర్కంతో తన వాదన నెగ్గించుకునే ఈ మహానుభావుడు సూర్యోదయానికి పూర్వమే లేచి ఎంతో నిష్టగా అనుష్టానలన్నీ పూర్తిచేసుకుని ఇంటి నుంచి బయట పడడం తరువాయి ఆయన జీవన శైలి ఈనాటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా మారిపోయేది.
ఎమర్జెన్సీ తరువాత జనతా సర్కారు ఇందిరా గాంధీపై పెట్టిన అనేక కేసులను ఆవిడ తరపున వాదించానని ఆయనే అనేకసార్లు చెప్పుకున్నారు. జ్వాలా నేనూ ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇందుకు దాఖలా అన్నట్టు పలువురు పెద్దలను మాకు పరిచయం చేసి, వారితో తన సాన్నిహిత్యాన్ని తెలియచెప్పారు. దేశ రాజధానిలో   అంతంత స్థాయిలో పరిచయాలు కలిగిన వ్యక్తి  హైదరాబాదులో మాత్రం లాంబెట్రా స్కూటరు మీద తిరిగే వాడు. ఆరోజుల్లో మాకు స్కూటరు సరే సైకిల్ కూడా వుండేది కాదు. కాబట్టి ఆయన్ను సందేహించే పరిస్తితి మాది కాదు. అంత పెద్ద శరీరంతో స్కూటరు మీద చిక్కడపల్లిలో మేముంటున్న ఇంటికి వస్తుంటే మా పిల్లలు వినాయకుడు ఎలక వాహనంపై వస్తున్నాడని ఆట పట్టించేవారు.
ఎక్కడ వున్నా త్రికాలసంధ్యాదులు సక్రమంగా నిర్వర్తించడం ఆయన అలవాటు. ఢిల్లీలో మేము ఆయనతో కలసి కుతుబ్ మినార్ చూసివస్తున్నప్పుడు సూర్యాస్తమయం కావొస్తుండడం గమనించి దారిపక్కన నీటి  చెలమ వున్నచోట కారు ఆపించి సంధ్యావందనం చేసివస్తుంటే టాక్సీ డ్రైవర్ కూడా ఆశ్చర్య పోయాడు.

అలా, ఆయనతో కలసి తిరుగుతూ ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్ళాము. అక్కడి బుక్ స్టాల్లో పుస్తకాలు తిరగేస్తూ మాలో మేము తెలుగులో మాట్లాడుకుంటుంటే ఒకాయన మా వైపు తెలుగు వాళ్ళా అన్నట్టు చూసారు. ఒక్క క్షణం ఆగి మీరు శ్రీనివాసరావు కదూ!అని పలకరించారు. ఆయన ఎవరో కాదు హాస్య సినీ బ్రహ్మ జంధ్యాల. బెజవాడ ఎస్సారార్ కాలేజీలో బీకాంలో క్లాసుమేటు. సినీ రంగంలో అడుగుపెట్టి బాగా పేరు తెచ్చుకుంటున్న రోజులవి. ఆయన అసలు పేరు జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఆయన ఆ హోటల్లోనే దిగారుట. చాలా ఏళ్ళ  తరువాత కలిసిన మమ్మల్ని జంధ్యాల తమ రూముకు తీసుకు వెళ్లారు. వెళ్ళీ వెళ్ళగానే, మాతో వచ్చిన లాయరు గారు ఎలాటి మొహమాటం లేకుండా, కొత్త చోటని సందేహించకుండా ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చాఅని అడుగుతూనే జవాబుకోసం ఎదురుచూడకుండా అందులో దూరిపోయి స్నానం చేసి బయటకు వచ్చారు. రావడం రావడమే ఆ గదిలో పరచిన తివాచీ పై తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపి లిప్త మాత్రంలో శీర్షాసనంలో దర్శనమిచ్చారు. మా అందరికీ కళ్ళు తిరిగిపోయాయి. చిన్న తల, పెద్ద బొజ్జ, అంత భారీ కాయంతో ఆయన వేసిన ఈ ఆసనం చూసి జంధ్యాల కూడా నివ్వెర పోయారు. తరువాత వారిరువురి నడుమ సాగిన కవి పండిత చర్చ విని తీరాలి. అప్పటికే  ‘శంకరాభరణంసినిమాకి సంభాషణలు సమకూర్చిన జంధ్యాల విశ్వనాద్ గారిదే మరో సినిమా సప్తపదికి మాటలు రాస్తున్నారు. అనేకానేక అంశాలను స్పృశిస్తూ జరిగిన సంభాషణ నిజానికి ఇద్దరు పండిత శ్రేష్ఠుల మధ్య జరిగే వాదోపవాదాన్ని తలపించింది. ఏమాత్రం స్వరం పెంచకుండా, ఎదుటివారి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఒకర్ని మించి మరొకరు అక్షర లక్షలు చేసే తర్కవిన్యాసాలు ప్రదర్శించారు. ధర్మాధర్మ విచక్షణకు సంబంధించిన వీటిలో కొన్నింటిని సప్తపదిసినిమాలో జంధ్యాల పొందుపరచినట్టున్నారు కూడా.
ఈ చర్చ సాగిన తీరు గమనిస్తే నాకు కాలేజీలో తెలిసిన శాస్త్రి, ఈ జంధ్యాల ఒకరేనా అన్న సందేహం కలిగింది. అంతటి పరిణతి ఆయనలో కనబడింది. ఆ రోజుల్లో జంధ్యాల ఒక్కడే మొత్తం కాలేజీలో కారున్న కుర్రకారు’. ప్రిన్సిపాల్ కూడా కాలేజీకి రిక్షాలో వస్తుంటే, జంధ్యాల మాత్రం సొంత కారులో వచ్చేవారు. సంధ్యారాగంలో శంఖారావంవంటి నాటకాలు రాస్తూ,వేస్తూ సరదాగా వుండేవారు. అలాటి జంధ్యాలలోని మరో కోణాన్ని ఢిల్లీలో చూడగలిగాను. అలాగే మా వెంట వచ్చిన లాయరు గారు. ఆయనకున్న విషయ పరిజ్ఞానాన్ని కళ్ళారా చూసి, చెవులారా విన్న తరువాత ఆయనపై వున్న దురభిప్రాయం దూదిపింజెలా ఎగిరిపోయింది. వినదగునెవ్వరు చెప్పినసూక్తిలోని  వాస్తవం మరోమారు  బోధపడింది.
మనం చెప్పిందే ఇతరులు వినాలన్న ఆత్రంలో యెంత నష్టపోతామో అర్ధం అయింది. సజ్జన సాంగత్యంలో వొనగూడే లాభం ఎరుకలోకి వచ్చింది.
ఇప్పుడు వారిద్దరూ లేరు. వారి జ్ఞాపకాలే మిగిలాయి. 
(అక్టోబరు 10,2010)      
NOTE: Courtesy Image Owner

19, జూన్ 2013, బుధవారం

సిసలైన నవ్వుకు అసలైన సంతకం జంధ్యాల

(ఈరోజు 19-06-2013 జంధ్యాల వర్ధంతి)

నిండు నూరేళ్ళ జీవితం అనుకుంటే జంధ్యాల బతికింది యాభయ్ యేళ్ళే. కానయితేనేమి నూరేళ్ళకు సరిపడా  నవ్వులు నలుగురికీ పంచి పెట్టిపోయాడు.

ఆరోజు నాకు బాగా జ్ఞాపకం వుంది. నేను రేడియోలో వుంటే రాంపా ఫోను చేసి జంధ్యాల పోయాడని చెప్పాడు. నేను వెంటనే వార్త రాసి ఇచ్చేసి రాజభవన్ రోడ్డులోని వాళ్ల ఇంటికి వెళ్లాను. అప్పుడే వార్త తెలిసి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఓ కుర్చీలో జంధ్యాల నాన్నగారు నారాయణ మూర్తి  గారు కూర్చుని వున్నారు. కానీ ఆయనకు ఏదీ తెలియని పరిస్తితి. జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది. ఏమి జరిగిందన్నది ఒక్కగానొక్క కొడుకు పోయాడన్నది  అర్ధం చేసుకునే స్తితి కాదు. ఏమిటో ఈ జీవితం అనిపించింది.
జంధ్యాల చనిపోయిన రెండేళ్లకు వేటూరి సుందరరామమూర్తి ఇలా గుర్తుచేసుకున్నారు.

( జంధ్యాల - 1951-2001)

“హాస్యం,సంగీతం కలిసి ఒకే జన్మ ఎత్తిన హాసం, నిన్నటి దరహాసం జంధ్యాల ఇతిహాసంలో చేరిపోయి రెండేళ్ళు గడిచాయి.ఎన్నేళ్ళు  గడిచినా ఆయన మధుర స్మృతికి మరణం లేదు.ఎంత కాదనుకున్నా కన్నీళ్ళు  కళ్ళతోనే మింగటం కన్నా శరణం లేదు.
“తెలుగు సినిమా అపహాస్యం పాలెక్కువై పరిహాస్యం పాలై పోతున్న ఈనాడు జంధ్యాల తన వంశవృక్షంతో సహా దర్శనమిచ్చి ఆదుకుంటాడు. పానుగంటి, కందుకూరి, గురజాడ, చిలకమర్తి, భమిడిపాటి, మొక్కపాటి, మునిమాణిక్యం మొదలయిన శాఖోపశాఖలతో విరాజిల్లే ఆ హాస్య కల్పవృక్షానికి మూల స్థానం లో కూర్చుని "ఫిబరే హ్యూమరసం" అని రస పిపాసులకు తన కలం నించి వెలువడిన హాస్య రస కలశాలను అందించిన తెలుగుజాతి చిరునవ్వు జంధ్యాల.”
ఆ వేటూరిగారు కూడా ఇప్పుడు లేరు.  జంధ్యాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.
కాని, ఆయన అన్నట్టు జంధ్యాల మార్కు  నవ్వుకు మాత్రం   మరణం లేదు. (19-06-2013)

4, జనవరి 2013, శుక్రవారం

ఏనుగు శీర్షాసనం చూశారా!

(ఈనెల పద్నాలుగో తేదీ ‘జంధ్యాల’ జయంతి)

ఏనుగు శీర్షాసనం చూశారా!

ఆయనతో పరిచయం యెలా జరిగిందో గుర్తు రావడం లేదు. ఆయనో లాయరు. మహాకాయానికి తక్కువగా, స్తూలకాయానికి ఎక్కువగా వుండేవారు. పేరు మాత్రం కురచ. వరప్రసాద్.  వయస్సులో నాకంటే రెండు పదులు తక్కువ. బుద్ధిలో బృహస్పతి. రాజ్యాంగ శాసనాలు కొట్టిన పిండి. ప్రాచీన ధర్మ సూక్ష్మాలు, శాస్త్రీయ విషయాలు కరతలామలకం. భారత, భాగవత, రామాయణాలు ఆసాంతం  ఆపోసన పట్టిన వ్యక్తి. పద్యాలు, వేల సంఖ్యలో సంస్కృత  శ్లోకాలు కంఠతా వచ్చు. అష్టాదశ పురాణాలు తడుముకోకుండా చెప్పగల సామర్ధ్యం ఆయన సొంతం. కుతర్కంతో కాక  తర్కంతో తన వాదన నెగ్గించుకునే ఈ మహానుభావుడు సూర్యోదయానికి పూర్వమే లేచి ఎంతో నిష్టగా అనుష్టానలన్నీ పూర్తిచేసుకుని ఇంటి నుంచి బయట పడడం తరువాయి ఆయన జీవన శైలి ఈనాటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా మారిపోయేది.
ఎమర్జెన్సీ తరువాత జనతా సర్కారు ఇందిరా గాంధీపై పెట్టిన అనేక కేసులను ఆవిడ తరపున వాదించానని ఆయనే అనేకసార్లు చెప్పుకున్నారు. జ్వాలా నేనూ ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇందుకు దాఖలా అన్నట్టు పలువురు పెద్దలను మాకు పరిచయం చేసి, వారితో తన సాన్నిహిత్యాన్ని తెలియచెప్పారు. దేశ రాజధానిలో   అంతంత స్థాయిలో పరిచయాలు కలిగిన వ్యక్తి  హైదరాబాదులో మాత్రం లాంబెట్రా స్కూటరు మీద తిరిగే వాడు. ఆరోజుల్లో మాకు స్కూటరు సరే సైకిల్ కూడా వుండేది కాదు. కాబట్టి ఆయన్ను సందేహించే పరిస్తితి మాది కాదు. అంత పెద్ద శరీరంతో స్కూటరు మీద చిక్కడపల్లిలో మేముంటున్న ఇంటికి వస్తుంటే మా పిల్లలు వినాయకుడు ఎలక వాహనంపై వస్తున్నాడని ఆట పట్టించేవారు.
ఎక్కడ వున్నా త్రికాలసంధ్యాదులు సక్రమంగా నిర్వర్తించడం ఆయన అలవాటు. ఢిల్లీలో మేము ఆయనతో కలసి కుతుబ్ మినార్ చూసివస్తున్నప్పుడు సూర్యాస్తమయం కావొస్తుండడం గమనించి దారిపక్కన నీటి  చెలమ వున్నచోట కారు ఆపించి సంధ్యావందనం చేసివస్తుంటే టాక్సీ డ్రైవర్ కూడా ఆశ్చర్య పోయాడు.

అలా, ఆయనతో కలసి తిరుగుతూ ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్ళాము. అక్కడి బుక్ స్టాల్లో పుస్తకాలు తిరగేస్తూ మాలో మేము తెలుగులో మాట్లాడుకుంటుంటే ఒకాయన మా వైపు తెలుగు వాళ్ళా అన్నట్టు చూసారు. ఒక్క క్షణం ఆగి ‘మీరు శ్రీనివాసరావు కదూ!’ అని పలకరించారు. ఆయన ఎవరో కాదు హాస్య సినీ బ్రహ్మ జంధ్యాల. బెజవాడ ఎస్సారార్ కాలేజీలో బీకాంలో క్లాసుమేటు. సినీ రంగంలో అడుగుపెట్టి బాగా పేరు తెచ్చుకుంటున్న రోజులవి. ఆయన అసలు పేరు జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఆయన ఆ హోటల్లోనే దిగారుట. చాలా ఏళ్ళ  తరువాత కలిసిన మమ్మల్ని జంధ్యాల తమ రూముకు తీసుకు వెళ్లారు. వెళ్ళీ వెళ్ళగానే, మాతో వచ్చిన లాయరు గారు ఎలాటి మొహమాటం లేకుండా, కొత్త చోటని సందేహించకుండా ‘ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చా’ అని అడుగుతూనే జవాబుకోసం ఎదురుచూడకుండా అందులో దూరిపోయి స్నానం చేసి బయటకు వచ్చారు. రావడం రావడమే ఆ గదిలో పరచిన తివాచీ పై తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపి లిప్త మాత్రంలో శీర్షాసనంలో దర్శనమిచ్చారు. మా అందరికీ కళ్ళు తిరిగిపోయాయి. చిన్న తల, పెద్ద బొజ్జ, అంత భారీ కాయంతో ఆయన వేసిన ఈ ఆసనం చూసి జంధ్యాల కూడా నివ్వెర పోయారు. తరువాత వారిరువురి నడుమ సాగిన కవి పండిత చర్చ విని తీరాలి. అప్పటికే  ‘శంకరాభరణం’ సినిమాకి సంభాషణలు సమకూర్చిన జంధ్యాల – విశ్వనాద్ గారిదే మరో సినిమా ‘సప్తపది’కి మాటలు రాస్తున్నారు. అనేకానేక అంశాలను స్పృశిస్తూ జరిగిన సంభాషణ నిజానికి ఇద్దరు పండిత శ్రేష్ఠుల మధ్య జరిగే వాదోపవాదాన్ని తలపించింది. ఏమాత్రం స్వరం పెంచకుండా, ఎదుటివారి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఒకర్ని మించి మరొకరు అక్షర లక్షలు చేసే తర్కవిన్యాసాలు ప్రదర్శించారు. ధర్మాధర్మ విచక్షణకు సంబంధించిన వీటిలో కొన్నింటిని ‘సప్తపది’ సినిమాలో జంధ్యాల పొందుపరచినట్టున్నారు కూడా.
ఈ చర్చ సాగిన తీరు గమనిస్తే – నాకు కాలేజీలో తెలిసిన శాస్త్రి, ఈ జంధ్యాల ఒకరేనా అన్న సందేహం కలిగింది. అంతటి పరిణతి ఆయనలో కనబడింది. ఆ రోజుల్లో జంధ్యాల ఒక్కడే మొత్తం కాలేజీలో ‘కారున్న కుర్రకారు’. ప్రిన్సిపాల్ కూడా కాలేజీకి రిక్షాలో వస్తుంటే, జంధ్యాల మాత్రం సొంత కారులో వచ్చేవారు. ‘సంధ్యారాగంలో శంఖారావం’ వంటి నాటకాలు రాస్తూ,వేస్తూ సరదాగా వుండేవారు. అలాటి జంధ్యాలలోని మరో కోణాన్ని ఢిల్లీలో చూడగలిగాను. అలాగే మా వెంట వచ్చిన లాయరు గారు. ఆయనకున్న విషయ పరిజ్ఞానాన్ని కళ్ళారా చూసి, చెవులారా విన్న తరువాత ఆయనపై వున్న దురభిప్రాయం దూదిపింజెలా ఎగిరిపోయింది. ‘వినదగునెవ్వరు చెప్పిన’ సూక్తిలోని  వాస్తవం మరోమారు  బోధపడింది.
మనం చెప్పిందే ఇతరులు వినాలన్న ఆత్రంలో యెంత నష్టపోతామో అర్ధం అయింది. సజ్జన సాంగత్యంలో వొనగూడే లాభం ఎరుకలోకి వచ్చింది.
ఇప్పుడు వారిద్దరూ లేరు. వారి జ్ఞాపకాలే మిగిలాయి. 
(అక్టోబరు 10,2010)