19, మే 2012, శనివారం

అపర పరమానందయ్య శిష్యుల కధ


అపర పరమానందయ్య శిష్యుల కధ

అనగనగా ఒక వూరు. ఆ వూరు పేరు పుణే అనబడే పూనా.
ఆ నగరంలో ఇద్దరు గురువులు. ఒకరు పరమానందయ్య, మరొకరు ఆనందయ్య. పరమానందయ్య గారి దగ్గర ఏడుగురు, ఆనందయ్య గారి దగ్గర మరో ఏడుగురు శిష్యరికం చేస్తున్నారు.
గురువుల సంగతేమో కానీ వారి శిష్యులకు మాత్రం తమ తెలివితేటలపై అపరిమితమైన నమ్మకం. అలాగే  అవతల జట్టు శిష్యుల తెలివితేటలపై  అంతులేని అపనమ్మకం.
ఒక రోజు ఇద్దరు గురువులు తమ శిష్యులను పిలిచి ముంబై లో ఒక పని చక్కపెట్టుకుని రమ్మని ఆదేశించారు.
గురువాజ్ఞను శిరసావహించి ఆ పద్నాలుగుమంది రెండు జట్లుగా పుణే రైల్వే స్టేషనుకు వెళ్లారు.
ఆ శిష్యబృందానికి  ఒక మహత్తరమయిన ఆలోచన వచ్చింది. గురువులు ఎట్లాగో లేరు. ఎదుటి పక్షం వారు తమ సమక్షం లోనే వున్నారు. రెండు పక్షాలలో ఎవరి తెలివి తేటలు గొప్పవో తేల్చుకోవడానికి  ఈ ప్రయాణమే ఇదే సరయిన తరుణం  అనుకున్నారు.
ఆనందయ్య బృందం తమ ఏడుగురికీ ఏడు టిక్కెట్లు కొనుక్కున్నారు. పరమానందయ్య శిష్యులు మాత్రం  ఏడు కొనకుండా అందరికీ కలిపి ఒకటే ఒక  టిక్కెట్టు కొన్నారు. ఇంతలో టీసీ వచ్చాడు. పరమానందయ్య శిష్యుల తిక్క కుదిరిందని ఆనందయ్య బృందం  ఆనందిస్తుండగానే, పరమానందయ్య శిష్యులు ఏడుగురూ తటాలున  రైలు బోగీలో వున్న   టాయిలెట్లో దూరారు. టీసీ టాయిలెట్ తలుపు తట్టాడు. తలుపు ఓరగా తెరుచుకుని ఒక చేయి బయటకు వచ్చింది. అందులో ఒక టిక్కెట్టు వుంది. టీసీ సంతృప్తి పడి  వెళ్ళిపోయాడు. ఇది చూసిన ఆనందయ్య శిష్యులకు వొళ్ళు మండింది. పరమానందయ్య శిష్యులు చేసిన ట్రిక్కు అర్ధమయింది.
సరే రెండు జట్లూ ముంబాయ్ చేరాయి. గురువులు ఒప్పగించిన పనులు చక్కబెట్టుకున్నాయి. తిరుగు ప్రయాణంలో ముంబాయ్ నుంచి వారికి డైరెక్ట్ ట్రైన్ లో టిక్కెట్లు దొరకలేదు. లోనావాలా వరకు ట్రైన్ లో వెళ్లి అక్కడినుంచి లోకల్ ట్రైన్లో  పుణే వెళ్ళాలనుకున్నారు.
తిరుగు ప్రయాణంలో ‘ఒకే టిక్కెట్టు’ అనే  ట్రిక్కుతోనే  ఎదుటి పక్షం ఆట కట్టించాలని ఆనందయ్య శిష్యులు పధకం వేసారు. ఈసారి వారు ఏడు టిక్కెట్లకు బదులు ఒకే టిక్కెట్టు కొనుక్కుని లోనావాలా రైలెక్కారు. పరమానందయ్య శిష్యులు ఒక్క టిక్కెటు కూడా కొనలేదు.
టీసీ రావడాన్ని పసికట్టి రెండు జట్లూ చెరో టాయిలెట్లో దూరాయి. పరమానందయ్య శిష్యుల్లో  ఒకడు టాయిలెట్ నుంచి  బయటకు వచ్చి టీసీ మాదిరిగా ఎదుటి టాయిలెట్ తలుపు తట్టాడు. అలా తట్టింది  టీసీయే అని భ్రమపడి ఆనందయ్య  శిష్యులు తమ వద్ద వున్న ఒకే ఒక టిక్కెట్టును తలుపు ఓరగా తెరిచి   బయట పెట్టారు. అదను కోసం వేచి వున్న పరమానందయ్య శిష్యుడు తటాలున ఆ టిక్కెట్టు తీసేసుకుని తమ టాయిలెట్లోకి దూరిపోయాడు. మళ్ళీ పాత ట్రిక్కే వాడి టీసీ నుంచి తప్పించుకున్నారు. కొనుక్కున్న ఒకే ఒక్క టిక్కెట్టును  పోగొట్టుకున్న ఆనందయ్య శిష్యులు టీసీకి దొరికిపోయి పెద్ద జరిమానా చెల్లించుకున్నారు.  
ఏమయితేనేం, మొత్తం మీద వారంతా లోనావాలా చేరుకొని పుణే వెళ్ళే లోకల్ ఎక్కారు.
ఆనందయ్య శిష్యులు ఒక్క టిక్కెట్టు ట్రిక్ మళ్ళీ  ప్రదర్శించి వూరుచేరేలోగా ప్రత్యర్ధి జట్టుపై ఒక్కమారయినా ఆధిక్యత చూపాలని అనుకున్నారు.
పరమానందయ్య  శిష్యులు మాత్రం బుద్ధిగా ఏడు టిక్కెట్లు కొనుక్కుని లోకల్ ట్రైన్ ఎక్కారు. ఈ కధలో లెక్కప్రకారం రావాల్సిన టీసీ యధాప్రకారం  వచ్చాడు. పరమానందయ్య  శిష్యులు తాము కొన్న టిక్కెట్లు చూపారు. ఒక్క టిక్కెట్టుతోనే  రైలెక్కిన ఆనందయ్య శిష్యులు  టీసీ కళ్లబడకుండా దాక్కోవడానికి టాయిలెట్ కోసం వెతికారు. కానీ అది వారికి  దొరక్కపోగా వాళ్లు మాత్రం ఎంచక్కా టీసీకి దొరికిపోయారు. ఎదుటి పక్షాన్ని ఓడించాలనే ఆత్రుతలో లోకల్  ట్రైన్లలో టాయిలెట్లు వుండవన్న సంగతి వారు మరచిపోయారు.
అంటే నీతి ఏమిటంటే అనుసరణ  మంచిదే కావచ్చుకాని ఎంతో కొంత ఆలోచన కూడా దానికి తోడు కావాలి. అప్పుడే అది రాణిస్తుంది. (19-05-2012)

18, మే 2012, శుక్రవారం

గుర్తు రావడంలేదు



గుర్తు రావడంలేదు
ఎనభయ్యవ పడిలో పడ్డ పరమేశ్వరాన్ని ఆయన బాల్య స్నేహితుడయిన ఏకాంబరం చాలా  ఏళ్ళ తరువాత ఇంటికి  ఆహ్వానించాడు.
భోజనాలు అయిన తరువాత ముసలివాళ్లిద్దరూ ఆరుబయట మంచాలు వేసుకుని పిచ్చాపాటీ మొదలుపెట్టారు.
పైకి ఏదో మాట్లాడుతున్నాడన్న మాటే కాని పరమేశ్వరాన్ని మనసులో ఒక సందేహం తొలుస్తోంది.
వచ్చినప్పటినుంచీ చూస్తున్నాడు. ఏకాంబరం భార్య కొంగుపట్టుకుని తిరుగుతూ ‘చూడు కన్నా, చూడు బుజ్జీ’ అంటూ ఒకటే నస.
ఇన్నేళ్ళ సంసారం తరువాత కూడా ఏకాంబరం భార్య పట్ల చూపిస్తున్న ప్రేమానురాగాలు, ప్రేమతో పిలుస్తున్న తీరూ గమనించిన పరమేశ్వరానికి మతిపోయినట్టుగావుంది. 
వాళ్ల  పెళ్ళయి దాదాపు అరవై ఏళ్ళు దాటిపోయాయి. అయినా ఏదో నిన్ననో మొన్ననో పెళ్ళిచేసుకున్న జంటలా ఆ పిలుపులు ఏమిటో.
వుండబట్టలేక ఏకాంబరాన్నే నేరుగా అడిగేసాడు అదేమిట్రా ఇంకా చిన్నపిల్లాడిలా పెళ్ళాన్ని పట్టుకుని కన్నా, బుజ్జీ అంటూ ఆ పిలుపులేమిటి? ఎంచక్కా పెళ్ళాన్ని పేరుతొ పిలవచ్చుకదా! అంటూ.
ఏకాంబరం జవాబు చెప్పాడు.
నాకూ పేరుతొ పిలవాలనే  వుంది. కానీ అదేమిటో కాని,  ఆమె పేరు 
 మరచిపోయి పదేళ్లవుతోంది. ఇప్పుడు నీ పేరేమిటని పొరబాటున అడిగాననుకో ఆ రాక్షసి నా ప్రాణం తోడుకుతింటుంది.



(18-05-2012)

కార్టూనిస్ట్ మల్లిక్ కి కృతజ్ఞలతో 

14, మే 2012, సోమవారం

దేవుడా జాగ్రత్త!


దేవుడా జాగ్రత్త! 

హే భగవాన్!

మమ్మల్ని క్షమించు.నీ ముందు మోకరిల్లి మేము రోజూ చేసే ప్రార్ధన ఒకటి. కానీ అనుదినం మేము చేస్తున్న పనులు వేరు.

ప్రతి రోజు ప్రార్ధన సమయంలో ‘దేవుడి మాటలంటూ’ నువ్వు చెప్పే వాటన్నిటినీ బుద్ధిగా వల్లె వేస్తాం.

అడుగు జరగగానే వాటిని నీ గుడి వాకిటి లోనే  మరచిపోతాం.

ఆడపిల్లల్ని గురించి పెద్ద పెద్ద కబుర్లు చెబుతాం. కానీ, వారిని తల్లి గర్భంలో  
వుండగానే మట్టుబెట్టే ప్రయత్నం చేస్తాం.

 పైకి మాత్రం ఆడపిల్ల కావాలో మగపిల్లవాడు కావాలో తేల్చుకునే  హక్కువుందంటూ  లెక్కలు చెబుతాం. 

పిల్లల్ని క్రమశిక్షణలో పెంచం. పైపెచ్చు  వాళ్లను చిన్నతనం నుంచే స్వతంత్ర భావాలతో పెంచుతున్నామని చెప్పుకుని గర్వపడతాం.

అధికారం అందితే చాలు, ఇక దాన్ని అవధులు లేకుండా  దుర్వినియోగం చేస్తాం. దానికి రాజకీయం అని ముద్దు పేరు పెట్టుకుంటాం.

పరాయి సొమ్ము పాముతో సమానమని సుద్దులు చెబుతాం. కానీ పరుల సొమ్ముకు ఇట్టే  ఆశపడతాం.  అవకాశం దొరికినా దొరక్కపోయినా దొరకపుచ్చుకుని మరీ పక్క వారి డబ్బులు, ఆస్తీ కాజేయాలని చూస్తాం. అందుకు పధకాలు వేస్తాం. ధనం సంపాదించడం ముఖ్యం కాని దాన్ని యెలా సంపాదించావన్నది ముఖ్యం కాదని సిద్ధాంతాలు లేవదీస్తాం.
 
సభ్యసమాజంలో సభ్యతగా మెలగాలని అందరికీ సూక్తులు బోధిస్తాం. వీలు చిక్కిందంటే చాలు నీలి చిత్రాలు చూడాలని మనసు పడతాం. రాతల్లో, రచనల్లో నీతులు కుమ్మరిస్తాం. సమయం దొరికిందంటే చాలు, కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లి మాదిరిగా ఆ నీతుల చుట్టూ గీతలు గీసిఅసలు రూపాలతో పాపాలు చేస్తాం. అసభ్య చిత్రాలతో,అడ్డమయిన  రాతలతో సమాజాన్ని కలుషితం చేస్తాం. ఈ ఘనకార్యానికి భావప్రకటనా స్వేచ్ఛ అని ఘనమయిన పేరు పెట్టుకుంటాం.
 

తాతల తండ్రులనుంచి వారసత్వంగా మా చేతికందిన విలువలను కాలరాచేస్తాం. పాతతరం భావాలు పాతరవేసి కొత్తతరాన్ని ఆవిష్కరిస్తున్నామని ఆర్భాటాలు పోతూ,  
మానసిక పరిణతికి ఈ మార్పును కొలమానంగా పేర్కొంటాం.

అందుకే  ఓ భగవాన్.

ఓ విషయం తెలుసుకో. మాకు నిన్ను మెప్పించడం తెలుసు. వరాలు కోరుకోవడం తెలుసు. వాటిని  నీ నుంచి పొందడం తెలుసు. ఈఠక్కుఠమార విద్యలన్నింటిలో మేము పెద్ద పెద్ద పట్టాలే పుచ్చుకున్నాం. కానీ నీకిచ్చే మాటలను నిలుపుకోవడం మాత్రం తెలియదు. తెలియదని కాదు, తెలియనట్టు వుంటాం. అది తెలుసుకో ముందు.

చేసేవన్నీ చేసేసి అవన్నీ నీమీదకు తోసేసే తెలివితేటలు మాకు నువ్వే ఇచ్చావన్న సంగతి మాత్రం మరచిపోకు.

మమ్మల్నో కంట కనిపెట్టి చూడు.

మా మనుషుల తరహా చూస్తుంటే వాళ్ళల్లో ఒకడినయిన నాకే భయం వేస్తోంది. అందుకే సమయం చూసి నీకీ విషయాలు చెవిలో వేస్తున్నాను.

మా మాదిరిగానే నువ్వుకూడా నీ సృష్టినీ, నీ సంతానాన్ని  గాలికి  వొదిలేస్తే, మమ్మల్ని కనిపెట్టిచూడడానికి నువ్వున్నట్టు నీకెవ్వరూ లేరు. అది గుర్తుంచుకో. అప్పుడు – ‘ధర్మ సంస్థాప నార్ధాయ సంభవామి యుగే యుగేఅంటూ  మరో అవతారం ఎత్తినా  ఎలాటి ఫలితం వుండదు.
ఎందుకంటే, మేం మానవులం. సామాన్యులం కాదు.

తస్మాత్ జాగ్రతః 


(14-05-2012)

13, మే 2012, ఆదివారం

కాశీ సమారాధన – 2


కాశీ సమారాధన – 2
మేము హైదరాబాదులో ఉదయం పది గంటలకు  ఇండిగో ఫ్లయిట్ ఎక్కి మధ్యాహ్నం పన్నెండు గంటలకు కోల్ కతా చేరాము. అక్కడ ఆరోజు వుండి చూడదగ్గ ప్రదేశాలు చూసేసి మర్నాడు రైల్లో కాశీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాము. బహుశా ముందు ముందు ఈ ప్రయాణ కాలం మరింత తగ్గిపోయే అవకాశం వుంటుందేమో. కోల్ కతా నుంచి వారణాసికి కనెక్టింగ్ ఫ్లయిట్ వుందో లేదో తెలవదు. అలాగే  హైదరాబాదునుంచి కాశీకి నేరుగా విమాన సౌకర్యం వున్న పక్షంలో ఇంట్లో వొంట్లో పుష్కలంగా వున్నవారు మరింత త్వరగా కాశీ యాత్ర పూర్తిచేసుకు రావడానికి వీలుంటుంది.


కానీ ఏనుగుల వీరాస్వామయ్య గారు కాశీ యాత్ర చేసిన రోజుల్లో ఇలాటి వెసులుబాట్లు లేవు. ఆయన గారు తన బృందంతో కలసి చెన్నపట్నం నుంచి కాశీ వెళ్లి రావడానికి అనేక  రోజులు పట్టింది. ఆమాటకు వస్తే ఆయన చాలా స్తితిమంతుల కుటుంబానికి చెందినవారు. పైగా ఉద్యోగరీత్యా కూడా బాగా పలుకుబడి కలిగిన వ్యక్తి. అయినా కానీ కాశీ యాత్ర చేసిరావడానికి ఆయనకు అన్ని రోజులు పట్టిందంటే ఇక ఆ రోజుల్లో  మామూలు మనుషుల సంగతి అర్ధం చేసుకోవచ్చు. దారి మధ్యలో బందిపోట్ల భయం, కొత్తప్రదేశాల్లో  గాలీ నీరూ పడక నానా రకాల రుగ్మతలతో పడకేసే ప్రమాదం, దారిపొడుగునా దారిఖర్చులకయ్యే పైకాన్ని భద్రపరచుకోవడానికి సరయిన వసతులు లేకపోవడం, వేళకు అన్నపానాదులకు వీలువుండని పరిస్థితులు,    అంతకు ముందు ఎవ్వరూ వెళ్ళని మార్గాల్లో ప్రయాణాలు, అడవి బాటలో క్రూర జంతువుల తాకిళ్లు, ఒకటా రెండా అనేక అవరోధాల నడుమ కాశీ ప్రయాణం దినదిన గండంగా సాగేది. అందుకే కాబోలు కాశీకి వెళ్లినవాడు, కాటికి వెళ్లినవాడితో సమానం వంటి  సామెతలు పుట్టాయి.
స్త్రీజనంతో సహా దాదాపు నూరుమందితో కూడిన   పెద్ద పరివారాన్ని వెంటబెట్టుకుని రోజుకు పన్నెండు మైళ్ల చొప్పున  అనేక చోట్ల మజిలీలు చేస్తూ వీరాస్వామయ్య గారు కాశీయాత్ర పూర్తి చేశారు. దారి చాలా భాగం అడవులు, కొండలు. అడుగడుగున వాగులు, నదులు. మహా క్రూరులయిన దొంగల వలన ప్రతిక్షణం భయమే. వర్షం పడితే అనేకచోట్ల కాలుదిగబడిపోయే నేలల్లో, వర్షం లేకపోయినా సూదుల్లా గుచ్చుకునే నల్లరేగడి నేలల్లో, రాతిగొట్టు నేలల్లో కాలిబాటన ప్రయాణం. ఎక్కడో అక్కడ మజిలీ చేసినా అంతమంది జనాన్ని  భరాయించగల మకాము దొరకడం కష్టమే. చిన్న చిన్న వూళ్ళల్లో వేసే మకాముల్లో  అంతమందికి  కావలసిన పదార్ధాలు, కూరగాయలు, వంట చెరకు లభించడం కూడా కష్టమే.
వీరాస్వామయ్య గారు చెన్నపట్నంలో 1830 వ సంవత్సరం మే 18 వ తేదీన కాశీ బయలుదేరి  1831 సెప్టెంబర్ మూడో తేదీన తిరిగి చెన్నపట్నం చేరుకున్నారు. ఈ కాశీయాత్ర చేసి రావడానికి పట్టిన వ్యవధి  ఆయన గారి మాటల్లోనే చెప్పాలంటే, ‘15 మాసాల 15 దినాల 10 నిమిషాలు’.
మా బామ్మగారి టైముకు అది పదిహేను రోజులకు, మా అమ్మగారి హయాముకు పది రోజులకు తగ్గిపోయింది. అలాగే ప్రయాణ సమయంలో కడగండ్లు కూడా అదేవిధంగా తగ్గిపోయాయి. దానికి తగ్గట్టే  అనుభూతులు, అనుభవాలు  అదే మేరకు తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక మేము కాశీ వెళ్లి వచ్చిన తరువాత చెప్పుకోవడానికి పెద్ద విశేషాలు ఏమీ మిగలలేదు. ‘ప్రయాణం అంతా బాగా జరిగింది కదా!’ అనే బంధు మిత్రుల ప్రశ్నలకు క్లుప్తంగా ‘అవును’ అనే సమాధానం తప్ప. (13-05-2012)
(కాశీ సమారాధన మూడో భాగం వచ్చే ఆదివారం)                

‘అరవై ఏళ్ళ’ బాలిక




అరవై ఏళ్ళ’ బాలిక  
నిజంగా ఆశ్చర్యం వేసింది అప్పటి’ కన్ను ఒకటి ఇంకా చూస్తున్నదని ఈ రోజు పత్రికల్లో చదివినప్పుడు. ఆనాటి మహత్తర చరిత్రను కళ్ళారా వీక్షించిన ఆ నేత్రం’ ఈ నాటి పరిస్తితులను చూస్తూ యెంత కన్నీరు పెట్టుకుంటున్నదో అన్న బాధ మనసును కలచి వేస్తోంది.
ఆయన వయస్సు ఇప్పుడు 92  ఏళ్ళు. పేరు కందాల సుబ్రహ్మణ్యం అలియాస్ తిలక్. భారత పార్లమెంటు ఏర్పడి రేపటికి అంటే మే 13  తేదీకి అరవై ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంలో తొలి సభలో సభ్యులుగా వున్నవారిలో ఇంకా ఎవరయినా బతికున్నారా అని కాగడా వేసి వెతుకుతుంటే అలాటి వారు మొత్తం దేశంలో నలుగురే నలుగురు  కనిపించారు. వారిలో ఒకరు  ఈ కందాల సుబ్రహ్మణ్యం గారు. విజయనగరం మాజీ ఎంపీ.
ఈ చారిత్రిక ఘట్టాన్ని పురస్కరించుకుని లోక సభ స్పీకర్ మీరా కుమార్ మే 13  వ తేదీ  కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని తలపెట్టారు. ఈ నేపధ్యం లోనే సుబ్రహ్మణ్యం గారికి ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. తెలుగు ప్రజలకు లభిస్తున్న అపూర్వ గౌరవం ఇది.
శ్రీ సుబ్రహ్మణ్యం తొట్టతొలి లోక్ సభకు ఎన్నికయిన 499  సభ్యులలో ఒకరు.  ఆనాటి సభ్యులలో వీరికి మరో విశిష్టత కూడా వుంది. అప్పుడు జరిగిన తొలి పార్లమెంటు ఎన్నికల్లో దేశం మొత్తం మీద అత్యధిక మెజారిటీ తో గెలిచిన మొదటి ముగ్గురిలో శ్రీ సుబ్రహ్మణ్యం కూడా ఒకరు. జవహర్లాల్ నెహ్రూ మొదటి స్థానం దక్కించుకోగా మన రాష్ట్రానికే చెందిన రావి నారాయణ రెడ్డి గారు రెండో స్థానాన్నిసోషలిస్టు పార్టీ తరపున నిలబడ్డ శ్రీ సుబ్రహ్మణ్యం అలియాస్ తిలక్ మూడో స్థానం సంపాదించు కున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యం ప్రత్యర్దులెవ్వరికీ డిపాజిట్లు కూడా దక్కలేదు. ఆ ఎన్నికల్లో నిలబడేటప్పుడే ప్రజలకు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఆయన మరోసారి ఎప్పుడూ ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా విశాఖ పట్నం దగ్గర సామాన్య జీవితం గడుపుతూ వస్తున్నారు.
అలాటి మహోన్నత వ్యక్తికి శిరసువంచి పాదాభివందనం చేయాలి.
అలాగే ఈ గౌరవ పురస్కారాన్ని అందుకుంటున్న మరో తెలుగు తేజం కానేటి మోహన రావు గారు.
పోతేఈ అరవై  ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో పార్లమెంటు సాధించిన విజయాలను సమీక్షించుకోవడంలోటుపాట్లను సరిదిద్దుకోవడం అవసరం. ఒక్కసారి ఆగి వెనక్కు తిరిగి చూసుకుంటే కనిపించే దృశ్యం ఏమిటి?

స్వాతంత్ర్య దినోత్సవాలుగణతంత్ర దినోత్సవాల సందర్భంలో  సైనిక కవాతులుశస్త్రాస్త్ర ప్రదర్శనలుభారీ టాంకులువైమానిక దళ విన్యాసాలతో ఎలాంటి పరిణామాలనయినా ఎదుర్కోగల యుద్ధ సన్నద్ధతనుజాతి సంసిద్ధతను ఒక పక్క ప్రదర్శిస్తూనే మరో పక్క బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి నాయకులు చేసే ప్రసంగాలు వినవలసి రావడం యెంతటి  విషాదం?
శాంతి భారతంగా పేరొందిన భారతదేశంలో ఈనాడు ఎక్కడ ఏమిజరుగుతుందోఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియని పరిస్తితి పొటమరించడం యెంతటి  దారుణం?
మతమన్నది మనకంటికి మసకయితే
కులమన్నది మనకంటికి కురుపయితే
మతం వద్దు కులం  వద్దు మారణ హోమం వద్దు అన్న సూక్తులను వొంటబట్టించుకుని ఎదిగిన ఓ తరం ఈనాటి పరిస్తితులను చూసి – మనం కోరుకున్న స్వేఛ్చా భారతం ఇదేనా  అని మధనపడాల్సిరావడం మరెంతటి దుస్తరం?
మతాల దురభిమానాలతోకులాల కుంపట్లతోప్రాంతీయ ద్వేషాలతో దేశం  యావత్తు అడ్డంగా నిలువుగా చీలిపోతుంటే-
స్వార్ధమే పరమావధిగాసంపాదనే ఉపాధిగాఅడ్డదారుల్లో అందినంత స్వాహా చేయడమే అంతిమ లక్ష్యంగా నీతికి దూరంగాఅవినీతికి ఆలంబనగా తయారయిన రాజకీయ దళారులంతా కలసి కుమ్మక్కై  జాతి సంపదను నిస్సిగ్గుగా కొల్లగొడుతుంటే-
జనరంజకంగా పాలించాల్సిన అధికార  యంత్రాంగం లంచాల మత్తులోపడి ప్రజల రక్తం పీలుస్తుంటే -
రాజ్యాంగం ఏర్పరచిన అన్ని వ్యవస్తలు మారుతున్న కాలానికి అనుగుణంగా విలువలను నిలువు పాతర వేసి కుప్పకూలి  కునారిల్లుతున్న సమయంలో, ‘నేనున్నానంటూ’ జనాలకు వెన్నుదన్నుగా నిలబడాల్సిన మీడియా సయితంతానూ ఆ తానులో ఓ ముక్కగా మారిపోతుంటే 
నిస్సహాయంగా జనం చూడాల్సి రావడం యెంత విషాదంయెంత దారుణంయెంత దుస్తరం, యెంత బాధాకరం?  

అయితే ఏమిటట?

నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టేప్రపంచం గర్వించదగిన   గొప్ప లక్షణాలను కూడా స్వతంత్ర భారతం తన కొంగున ముడివేసుకుంది. 1947 లో మన దేశంతో పాటే స్వేఛ్చా వాయువులు పీల్చుకున్న అనేక ఆసియా దేశాలుఇరుగు పొరుగు దేశాలు ఈ అరవై ఏళ్ళలో కొంతకాలం పాటయినా ప్రజాస్వామ్య పధాన్ని వీడి నియంతృత్వపు బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినామరెన్ని వొత్తిడులకు గురయినాఅప్రతిహతంగా ఎంచుకున్న మార్గంలోనే పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్తానాన్ని పదిలం చేసుకుంది.


జనాభాలో అత్యధిక భాగం నిరక్షర కుక్షులయినా 'వోటుఅనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగల సత్తా వారి సొంతం. అక్షర జ్ఞానం లేకపోయినాకానులూఏగానులనుంచిబేడలూ అర్ధణాల నుంచి నయా పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనంవారి ఆస్తి. గిద్దెలుసోలలు, శేర్లుసవాశేర్లు, మానికెల కొలతలనుంచి లీటర్లకు అతి తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర వారిది. అలాగే, వీసెలుమణుగులనుంచి కిలోగ్రాములకుబస్తాలనుంచి క్వింటాళ్లకు,  'మైలు రాళ్ళనిఅధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా కిలోమీటర్ల లెక్కల్లోకి మారిపోకుండా పాతకాలంలోలా   ఇంకా మైలురాళ్ళదగ్గరే ఆగిపోయిన సంగతి ఇక్కడ గమనార్హం.
చదువూసంధ్యా లేని వాళ్లనీఎందుకు  పనికిరాని వాళ్ళనీ  ఇతర దేశాల వారికి మనపై చిన్నచూపు. కానీ అలాటి మనవాళ్ళు - దేశానికి స్వాతంత్రం రాగానే నిర్వహించిన తొలి ఎన్నికల్లో పార్టీల గుర్తులున్న పెట్టెలలో వోటు వేసే దశను అలవోకగా దాటేసారు. ఆ తరువాత  ఒకే బాలట్ పేపరుపై  ముద్రించిన అనేక పార్టీల  గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని అతడి గుర్తుతోనే   గుర్తుపట్టి  వోటు వేయగల పరిణతిని అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా అధునాతన  ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని అలవరచుకోగలిగారు.

'ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణంఅనే నిర్లిప్త స్తితిని అధిగమించి ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో భారతీయుల ముద్ర స్పుటంగాప్రస్పుటంగా ప్రపంచ వ్యాప్తంగా కానరాగల అత్యున్నత శిఖరాలకు మన దేశం చేరుకోగలగడం స్వతంత్ర భారతం సాధించిన మరో ఘనత.


'చందమామ రావేఅంటూ పాటలు పాడే స్తితి నుంచి 'చంద్రయాన్వరకు ఎదగగలిగాము. అంతరిక్ష పరిశోధనల్లో అభివృద్ధి చెందిన  దేశాల సరసకు చేరగలిగాము. సుదూర లక్ష్యాలను చేధించగలిగిన అధునాతన రక్షణ  క్షిపణులను అంబుల పొదిలో చేర్చుకోగలిగాము. సస్య విప్లవం విజయవంతం చేసుకుని ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్తితి తప్పించుకుని స్వయం సమృద్ధిని సాధించుకోగ లిగాము.       

ఏ ఇంగ్లీష్ వారితో తలపడిఅహింసా మార్గంలో వారితో  పోరాడి స్వతంత్రం సంపాదించుకున్నామోఆ ఇంగ్లీషు వారి భాషనే ఆయుధంగా చేసుకుని - దేశ దేశాలలో కంప్యూటర్ రంగాన్ని మన కనుసన్నలతో శాసించగలుగుతున్నాము.  

అయితే ,అంగట్లో  అన్నీవున్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత మాదిరిగా ఎక్కడో ఏదో లోటు జనం మనస్సులని కుదిపేస్తోంది. ఆరు దశాబ్దాల పై చిలుకు కాలంలో సాధించిన అభివృద్ధి అంతా అడవిగాచిన వెన్నెల అవుతున్నదేమో అన్న శంక కలవరపెడుతోంది.

వెడుతున్న దోవ మంచిదే. కానీనడుస్తున్న కాళ్లే తడబడుతున్నాయి. ఒకదానికి మరొకటి అడ్డంపడి గమ్యాన్ని మరింత దూరం చేస్తున్నాయి.

వినిపిస్తున్న సందేశం మంచిదే. విభిన్న స్వరాలే అపస్వరాలతో అసలు అర్ధాన్ని మార్చి వేస్తున్నాయి.

అందరూ మంచివాళ్ళే. కానీ మానసిక కాలుష్యమే  వాళ్ళ మంచితనాన్ని మంచులా కరిగించి వేస్తోంది.

స్వార్ధం ముందు నిస్వార్ధం తలవంచుతోంది. అధికారం అన్నదే పరమావధిగాధనార్జన అన్నదే అంతిమ ధ్యేయంగా - అవలక్షణలక్షిత సమాజం రూపుదిద్దుకుంటోంది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ రకమయిన పరిణామాలు అనివార్యంఅతి సహజం. అయితే అవి  తాత్కాలికం కావాలి. శాశ్వితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం అందరిదీ.

ఒకరిపై మరొకరు నెపాలు మోపకుండాతప్పులు దిద్దుకోగలిగితే మార్పు అనివార్యం.

ఈ శుభసమయంలో  మనమందరం జాతికి కలసికట్టుగా ఇవ్వాల్సిన కానుక అదే.

-భండారు శ్రీనివాసరావు  (13-05-2012)

12, మే 2012, శనివారం

‘నేను అమ్మను నాయనా!’






‘నేను అమ్మను నాయనా!’


(మే నెలలో రెండో ఆదివారం భారత దేశంలో ‘మాతృ దినోత్సవం’. ఈ  సందర్భంగా ‘అమ్మలగన్న అమ్మలందరికీ’ ఇది అంకితం)







అంత వయసూ, ఎంతో అనుభవం వుండీ కూడా అధికారి అడిగే  ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తెలియక వసుంధర తత్తర పడింది. 
‘టైం స్లాట్’  తీసుకుని వచ్చిన అప్పాయింట్ మెంట్ కాబట్టి వెనుక ఎవ్వరూ లేరు.
ఆఫీసర్ మళ్ళీ అడుగుతున్నాడు.
‘చెప్పండి మేడం! మీరెవ్వరు? ఏం చేస్తుంటారు?’
నిజమే. తనెవ్వరు? ఏం చేస్తుంటుంది? 
ఏం జవాబు చెప్పాలి?
వసుంధర లిప్త పాటు ఆలోచించింది.
ఆలోచించి చెప్పడం మొదలు పెట్టింది.
‘పిల్లల  మానసిక, భౌతిక పెరుగుదలను నేను కనిపెట్టి చూస్తుంటాను. ఆ పెరుగుదల ఏరీతిన సాగుతున్నది ఎప్పటికప్పుడు గమనిస్తుంటాను. ఒకరకంగా చెప్పాలంటే ఇది రీసెర్చ్ కిందికి వస్తుంది. అంతే  కాదు, పిల్లల ఆహారం, చదువూ సంధ్యా అన్నీ చూస్తుంటాను. పెద్దలతో పిల్లల ప్రవర్తన, నడవడిక యెలా వుండాలో బోధిస్తుంటాను.’
కౌంటర్ వెనుకనుంచి ప్రశ్నలు సంధిస్తున్న అధికారికి మతి పోయింది.
ఉత్సుకతను అణచుకోలేక మళ్ళీ అడిగాడు. 
‘ ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పండి మేడం! ఇంతకీ మీరేం చేస్తుంటారు?’
‘నా వయస్సు  ఇప్పుడు అరవై. చాలా ఏళ్లుగా నా ఈ రీసెర్చ్ సాగుతూనే వుంది. ముగింపు  కూడా కనుచూపు మేరలో  కానరావడం లేదు. పెళ్ళయిన నాటినుంచి  నా ఈ ఉద్యోగం రాత్రింబగళ్ళు చేస్తూ వస్తూనే వున్నాను. కనీసం ఒకటంటే ఒక్క రోజు కూడా సెలవు లేకుండా, ఆదివారాలు సయితం  పనిచేస్తూ వచ్చిన దానికి గుర్తింపుగా ఇప్పటికి రెండు సర్టిఫికేట్లు  దొరికాయి. ఆ రెండూ ఇప్పుడు నా దగ్గర లేవు. నా కనుసన్నల్లో పెరిగి, పై చదువులకోసం విదేశాలకు వెళ్ళిన నా ఇద్దరు పిల్లలే ఆ సర్టిఫికేట్లు. వారిదగ్గరకు వెళ్లడానికే ఇదిగో ఈ ప్రయత్నం. కాకపొతే ఇన్నాళ్లబట్టి నేను చేస్తున్న ఉద్యోగంలో నాకు బాసులు ఇద్దరే. ఒకడు పైన వున్న భగవంతుడు అయితే, రెండోది నన్ను కట్టుకుని కనిపెట్టుకుని వున్న భర్త. పోతే జీతమంటారా! పనిలో పొందే మానసిక ఆనందమే నాకు దొరికే ప్రతిఫలం.
‘ఇంత చెప్పిన తరువాత కూడా నేనెవరంటావా?
‘అమ్మను నాయనా! నేను అమ్మను!!’ (12-05-2012)


(అమ్మను గురించి ‘ఈ’ మెయిల్ పంపిన వారికి కృతజ్ఞతలతో- భండారు శ్రీనివాసరావు)

10, మే 2012, గురువారం

జగన్ తో అమీతుమీకి సిద్ధపడుతున్న అధిష్టానం


జగన్ తో అమీతుమీకి సిద్ధపడుతున్న అధిష్టానం
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వున్నట్టుండి పూర్తిగా మారిపోయింది.
వురుములతో కూడిన జల్లులు పడతాయనుకుంటే, పెను గాలులతో కుంభవృష్టి కురిసే సూచనలు కానవస్తున్నాయి.
ఈ నెల 28 వ తేదీన కోర్టుకు హాజరవ్వాలంటూ జగన్ ఆస్తుల కేసులో అనేకమందికి  సమన్లు జారీ అయిన నేపధ్యంలో,  వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అరెస్టు తధ్యం అంటూ మొదలయిన  వూహాగానాలపై చర్చోపచర్చలు ఓ పక్క సాగుతుండగానే ఆయనకు సంబంధించిన మూడు ప్రధాన సంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేస్తూ  సీబీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు పాలక పక్షానికీ, అటు ప్రధాన ప్రతిపక్షానికీ పక్కలో బల్లెం మాదిరిగా తయారయిన సాక్షిదినపత్రిక, ‘సాక్షి టీవీల  మనుగడనే  ప్రశ్నార్ధకం చేసేలా వున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు, స్వాగతించేవారు రెండు వర్గాలుగా విడిపోయి అసలే సంక్షుభితంగా వున్న రాజకీయ వాతావరణాన్ని మరింత కల్లోలభరితంగా మార్చేసారు.
సీబీఐ నిర్ణయంవల్ల ప్రధానంగా ప్రభావితం అయ్యే జగన్ మోహన్ రెడ్డి దీన్ని ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించారు. అంతటితో ఆగకుండా పత్రికా స్వేచ్చ పై జరిగిన దాడిగా ఆరోపించారు. సీబీఐ నిర్ణయం వల్ల ఎక్కువగా నష్టపోయేది ఆయనే కనుక ఆ ఆవేదనను ఓ మేరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ కొన్ని జర్నలిష్టుల సంఘాలు, వాటి నాయకులు, జర్నలిజంలో కాకలు తీరిన మరికొందరు పత్రికా రచయితలు సైతం సాక్షిసంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడాన్ని తీవ్రంగా నిరసించారు. పత్రికా స్వేచ్చను హరించే చర్యగా విమర్శించారు.  ఆ సంస్థలలో పనిచేస్తున్న జర్నలిష్టులు, వారి కుటుంబాలనే కాకుండా వాటిపై పరోక్షంగా ఆధారపడ్డ కొన్ని వేల కుటుంబాలను ఈ నిర్ణయం ఇబ్బందుల పాలు చేస్తుందని వారి అభిప్రాయం. మరికొందరు పత్రికారచయితలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్రమ సంపాదన ద్వారా  కూడబెట్టుకున్న ధనంతో పత్రికలను నడపాలని చూడడం పత్రికావిలువలకు తగని పని అన్నది వారి వాదన. పై పెచ్చు బ్యాంకు ఖాతాల స్తంభనను వ్యతిరేకించేవారు ఆయననుంచి నెల మామూళ్ళు తీసుకుంటున్నారని ఆరోపించడం చూస్తే ఈ విషయంలో మీడియా యెలా విడిపోయి వ్యవహరిస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు.
అయితే, పత్రికా ప్రపంచానికి సంబంధించిన వ్యక్తులు, వ్యవస్థలు  కాబట్టి వీరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడంలో ఆక్షేపించాల్సింది ఏమీ లేదు. అలాగే సీబీఐ చట్ట పరిధిలోనే ఈ నిర్ణయం తీసుకుంది కనుక  అందులోను తప్పుపట్టాల్సింది ఏమీ లేదు. తప్పుపట్టాల్సింది ఏమన్నావుంటే అసలు ఈ మొత్తం  వ్యవహారం సాగిన తీరుతెన్నులనే!
న్యాయస్థానం ఆదేశాలమేరకు సీబీఐ ప్రారంభించిన రెండు కేసుల్లోను ఒకరకంగా కేంద్రబిందువు జగన్ మోహన రెడ్డే కావడం విశేషం. అక్రమ మైనింగు కేసులో ఎలాటి మచ్చపడకుండా దర్యాప్తును ఓ కొలిక్కి తేగలిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ,  జగన్ ఆస్తుల కేసు విషయం వచ్చేసరికి  నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నదన్న పేరును నిలుపుకోలేకపోయిందనే చెప్పాలి. దర్యాప్తు మందకొడిగా సాగుతోందన్న అభిప్రాయం కలిగేలా కొన్నాళ్లు, విచారణ బాగా వూపందుకుంటోంది  అనే భావన కలిగేలా మరికొన్నాళ్ళు సీబీఐ వ్యవహార శైలి కనిపించింది. రాజకీయపరమైన వొత్తిళ్ల కారణంగా ఇలా జరుగుతున్నదేమో అన్న అభిప్రాయం సర్వత్రా బలపడడానికి ఇది దోహదం చేసింది. దఫదఫాలుగా సీబీఐ చార్జ్ షీట్లు దాఖలు చేయడం అనుమానాలకు తావిచ్చేదిగా వుందని  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు  గాదె వెంకటరెడ్డి కూడా అభిప్రాయ పడినట్టు మీడియాలో వచ్చింది. అలాగే,  జగన్ మోహన రెడ్డి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేత్రితో అవగాహన కుదుర్చుకోవడం వల్లనే దర్యాప్తు మందగించిందని తెలుగుదేశం నాయకులు అనేకమంది ఆరోపించడం గమనిస్తే ఈ కేసును ప్రభావితం చేస్తున్నది ఆర్ధికపరమైన నేరం కాకుండా రాజకీయపరమైన వొత్తిళ్లన్న అభిప్రాయం సామాన్య జనంలో నాటుకుపోయింది.  ఇలా ఈ కేసుకు  రాజకీయ రంగు అంటుకోవడం వల్లనో యేమో అవినీతి సొమ్ముగురించి కొందరు రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారం జనాలను ఆకట్టుకోలేకపోయింది.  అందుకే  ఇటీవల వరుసగా జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ వరస విజయాలను కైవసం చేసుకోవడానికి  ప్రజల్లో గూడుకట్టుకున్న ఈ అభిప్రాయమే  దోహదపడింది. జగన్ మోహన రెడ్డి అవినీతి గురించి తామెంతగా మొత్తుకుంటున్నా  జనం యెందుకు పట్టించుకోవడం లేదనే అసహనాన్ని కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం నాయకులు కూడా పలుమార్లు బహిరంగంగానే వ్యక్తపరచడం గమనార్హం. జగన్ మోహన రెడ్డిని, ఆయన పార్టీని సమర్ధవంతంగా ఎదుర్కోగలిగిన ఇటువంటి  ‘పాశుపతాస్త్రం’ అంబులపొదిలో వుండికూడా  పాలక,  ప్రతిపక్ష నాయకులు అనుసరిస్తూ వచ్చిన వ్యూహాత్మక తప్పిదాల ఫలితంగా అంతటి  మహాశక్తివంతమైన అస్త్రం కూడా   నీరుకారిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయింది. అవినీతి అన్నదాన్ని  ఒక అంశంగానే ప్రజలు స్వీకరించడానికి ఇచ్చగించని  స్తితి ఉత్పన్నం కావడానికి కొందరు పాలక, ప్రతిపక్ష నేతలు జగన్ పై అదేపనిగా చేసిన, చేస్తున్న  విమర్శలు, ఆరోపణలు చాలావరకు  ఉపకరించాయి. కాని, వారు మాత్రం ఈ వాస్తవాన్ని ఏమాత్రం  గమనించకుండా అవే ఆరోపణలను  అదే  పనిగా కొనసాగిస్తూనే  వున్నారు. ఇలా పదే పదే ఒకే రకమయిన ఆరోపణల దాడి చేస్తూ వుంటే,  జగన్ పట్లా ఆయన పార్టీ పట్లా జనం విముఖత పెంచుకుంటారని వారి ఆలోచన కావచ్చు. అయితే,  ఇలాటి ఆరోపణల కారణంగానే  ఈ మొత్తం వ్యవహారానికి రాజకీయ మకిలి అంటుకుంటోందన్న వాస్తవాన్ని వారు మరచిపోయారు. అసలు ఈ కేసుకు మూలం ఆర్ధిక పరమైన నేరం  అన్న భావనను  జనంలో కలిగించివుంటే, అందుకు తగ్గట్టుగా పాలక, ప్రతిపక్ష నేతలు ఎంతో కొంత సంయమనం పాటించి వ్యవహరించి వుంటే, ఉప ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా రావడానికి అవకాశాలు తగ్గివుండేవి. తాము విడవకుండా ఎక్కుపెడుతున్న అస్త్రాలన్నీ అవతల ప్రత్యర్ధికి గట్టి కవచంలా మారుతున్నాయన్న నిజం ఇంకా ఆ పార్టీలకు బోధపడినట్టు లేదు. ‘లోపల అయ్యవారేం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నార’న్న నానుడి మాదిరిగా కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు వ్యవహరిస్తూ,  జగన్ మోహన రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోగల సత్తా, తెగువ ప్రదర్శించడంలో విఫలం అయ్యాయనే చెప్పాలి. వాటి ఆ బలహీనతలన్నీ వైరి పక్షానికి బలంగా, వరంగా మారాయి.
ఈ నేపధ్యంలో వచ్చిపడిన మినీ ఎన్నికల సంగ్రామాన్ని యెలా ఎదుర్కోవాలో తెలియని అయోమయ స్తితిలో పడిన అధికారపక్షం ఆరునూరయినాచేసి  కనీసం అయిదారు స్తానాలనయినా గెలుచుకుని పరువు కాపాడుకోవాలన్న తాపత్రయంలో పడిపోయింది. ఈ లక్ష్య సాధనలో రాష్ట్ర కాంగ్రెస్  నాయకుల శక్తి సామర్ధ్యాలపట్ల ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన పార్టీ  అధిస్థానం ముందు జాగ్రత్తగా  తన దూతలను పంపి పడకేసిన పార్టీకి   కొంత చికిత్స జరపాలని చూసింది.  కానీ,  ఉపఎన్నికల ఫలితాలను గురించి అందుతున్న  వివిధ సర్వేల  వివరాలు ఢిల్లీ పెద్దలను కలవరపరుస్తున్నాయి. ఈ  పరిస్థితుల్లో  ఏమిచేసినా, తిమ్మిని బమ్మి చేసినా సరే, రానున్న ఉపఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించడం అటుంచి అనేక చోట్ల  రెండో స్తానం కోసమో, మూడో స్తానం కోసమో పోటీ పడాల్సిన దుస్తితి దాపురించి  వుందన్న వాస్తవం వారికి  అర్ధం అయింది.
అందువల్లే, ఒక నిర్ధారణకు వచ్చిన అధిష్టానం  జగన్ మోహన రెడ్డి పట్ల అత్యంత కఠిన వైఖరి అవలంబించడానికే సిద్ధపడినట్టు కానవస్తోంది.  ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఉపఎన్నికల్లో ఘోర పరాజయాలు ఎదురయినా సరే జగన్ విషయంలో అమీతుమీ తెల్చుకోవడానికే సోనియా గాంధీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జగన్ పై ముప్పేట దాడి చేసి, ఆయన ఆర్ధిక మూలాలనూ, ఆయన పార్టీకి దన్నుగా మారిన సాక్షి   మీడియా మూలాలనూ వేళ్ళతో సహా పెరికివేసే పధకానికి  పచ్చ జెండా వూపినట్టు తెలుస్తోంది. ఫలితమే రాష్ట్ర రాజకీయ చిత్రంలో చకచకా మారిపోతున్న పరిణామాలు.
బ్యాంకు ఖాతాల స్తంభన అంశాన్ని గోరంతలు కొండంతలు  చేసి చూపుతున్నారని కొందరు వాదిస్తున్నారు. నిజమే, కోర్టు ద్వారా న్యాయం కోసం పోరాటం చేసే అవకాశం వున్న మాట నిజమే. జగన్ మోహన్ రెడ్డి కి సంబంధించి ఇంకా అనేక వ్యాపార సంస్థలు వున్నాయి. వాటి జోలికి పోకుండా వీటి జోలికే ముందు యెందుకు వచ్చారన్న ప్రశ్నకు మాత్రమే సరయిన జవాబు దొరకడం లేదు.
ఇక్కడే పైకి కనిపించని రాజకీయ కోణం దాగివుందని జగన్ వర్గ ప్రతినిధులు చెబుతున్నారు. సాక్షి మీడియా పునాదులను బలహీనం చేయగలిగితే, రాజకీయంగా ఆయన స్వరాన్ని అదుపుచేయడం సాధ్య పడగలదని కాంగ్రెస్ పెద్దల ఆలోచన అన్నది వారి మనోగతం. కేవలం రాజకీయం మాత్రమే కాకుండా మరికొన్ని శక్తులు జగన్  మీడియాకు వ్యతిరేకంగా కంకణం కట్టుకున్నాయన్నది కూడా వారి ఆరోపణ. దీనికి తగ్గట్టుగానే వుంది కాంగ్రెస్ నాయకుల ధోరణి. జగన్ సంస్థల బ్యాంకు ఖాతాల స్తంభన విషయంలో ప్రభుత్వానికి కానీ, ఏ ఇతర పార్టీలకు కానీ, ‘మీడియా’ సంస్థలకు కానీ  ఎలాటి ‘ప్రమేయం’ లేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్పష్టం చేశారు. ఇలాటి సందర్భాలలో ఈ విధమయిన ప్రకటనలు చేయడం  దేనికి సంకేతం అనుకోవాలి?
కోర్టును ఆశ్రయించడం ద్వారా సాక్షి యాజమాన్యం  దినవారీ ఖర్చులను, సిబ్బంది జీతభత్యాలను, సంస్థ  నిర్వహణ వ్యయాన్ని బ్యాంకులనుంచి పొందగల వెసులుబాటు వున్నప్పుడు ఇంత గగ్గోలు ఎందుకన్నది జగన్  ప్రత్యర్ధుల వాదన.
నిజమే, ఇలాటి సర్దుబాటు చేసుకోగల అవకాశం కోర్టు ద్వారా పొందవచ్చు. కానీ, సాక్షి పత్రిక కానీ, సాక్షి టీవీ కానీ క్రమం తప్పకుండా వెలువడడానికీ, ప్రసారం చేయడానికీ ఇందువల్ల  వీలు పడుతుందేమో కానీ, పోగొట్టుకున్న విశ్వసనీయతను అటు  పాఠకుల నుంచీ, ఇటు  ప్రేక్షకులనుంచీ, ఆ మాటకు వస్తే, ప్రకటనకర్తలనుంచి తిరిగిపొందడం కష్టం. ఏ  మీడియా మనుగడకయినా ఇలాటి విశ్వాసం ఎంతో అవసరమన్నది మీడియా నిర్వాహకులందరికీ తెలిసిన విషయమే. ఈ కారణం వల్లే, అలాటి ఆయువు పట్టుపై దెబ్బతీయడం  ఖచ్చితంగా పత్రికా స్వేచ్చను హరించడమే అన్నవాదనకు బలం చేకూరుతోంది. ఇలా వాదించే వారందరూ జగన్ సొమ్ములో వాటా కోరుకునేవారని కానీ, ఆయన నుంచి ఏదోరకమైన లబ్ది  పొందుతున్నారని కాని  ముద్రవేయడం కూడా  సరికాదు. (10-05-2012)