13, మే 2012, ఆదివారం

కాశీ సమారాధన – 2


కాశీ సమారాధన – 2
మేము హైదరాబాదులో ఉదయం పది గంటలకు  ఇండిగో ఫ్లయిట్ ఎక్కి మధ్యాహ్నం పన్నెండు గంటలకు కోల్ కతా చేరాము. అక్కడ ఆరోజు వుండి చూడదగ్గ ప్రదేశాలు చూసేసి మర్నాడు రైల్లో కాశీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాము. బహుశా ముందు ముందు ఈ ప్రయాణ కాలం మరింత తగ్గిపోయే అవకాశం వుంటుందేమో. కోల్ కతా నుంచి వారణాసికి కనెక్టింగ్ ఫ్లయిట్ వుందో లేదో తెలవదు. అలాగే  హైదరాబాదునుంచి కాశీకి నేరుగా విమాన సౌకర్యం వున్న పక్షంలో ఇంట్లో వొంట్లో పుష్కలంగా వున్నవారు మరింత త్వరగా కాశీ యాత్ర పూర్తిచేసుకు రావడానికి వీలుంటుంది.


కానీ ఏనుగుల వీరాస్వామయ్య గారు కాశీ యాత్ర చేసిన రోజుల్లో ఇలాటి వెసులుబాట్లు లేవు. ఆయన గారు తన బృందంతో కలసి చెన్నపట్నం నుంచి కాశీ వెళ్లి రావడానికి అనేక  రోజులు పట్టింది. ఆమాటకు వస్తే ఆయన చాలా స్తితిమంతుల కుటుంబానికి చెందినవారు. పైగా ఉద్యోగరీత్యా కూడా బాగా పలుకుబడి కలిగిన వ్యక్తి. అయినా కానీ కాశీ యాత్ర చేసిరావడానికి ఆయనకు అన్ని రోజులు పట్టిందంటే ఇక ఆ రోజుల్లో  మామూలు మనుషుల సంగతి అర్ధం చేసుకోవచ్చు. దారి మధ్యలో బందిపోట్ల భయం, కొత్తప్రదేశాల్లో  గాలీ నీరూ పడక నానా రకాల రుగ్మతలతో పడకేసే ప్రమాదం, దారిపొడుగునా దారిఖర్చులకయ్యే పైకాన్ని భద్రపరచుకోవడానికి సరయిన వసతులు లేకపోవడం, వేళకు అన్నపానాదులకు వీలువుండని పరిస్థితులు,    అంతకు ముందు ఎవ్వరూ వెళ్ళని మార్గాల్లో ప్రయాణాలు, అడవి బాటలో క్రూర జంతువుల తాకిళ్లు, ఒకటా రెండా అనేక అవరోధాల నడుమ కాశీ ప్రయాణం దినదిన గండంగా సాగేది. అందుకే కాబోలు కాశీకి వెళ్లినవాడు, కాటికి వెళ్లినవాడితో సమానం వంటి  సామెతలు పుట్టాయి.
స్త్రీజనంతో సహా దాదాపు నూరుమందితో కూడిన   పెద్ద పరివారాన్ని వెంటబెట్టుకుని రోజుకు పన్నెండు మైళ్ల చొప్పున  అనేక చోట్ల మజిలీలు చేస్తూ వీరాస్వామయ్య గారు కాశీయాత్ర పూర్తి చేశారు. దారి చాలా భాగం అడవులు, కొండలు. అడుగడుగున వాగులు, నదులు. మహా క్రూరులయిన దొంగల వలన ప్రతిక్షణం భయమే. వర్షం పడితే అనేకచోట్ల కాలుదిగబడిపోయే నేలల్లో, వర్షం లేకపోయినా సూదుల్లా గుచ్చుకునే నల్లరేగడి నేలల్లో, రాతిగొట్టు నేలల్లో కాలిబాటన ప్రయాణం. ఎక్కడో అక్కడ మజిలీ చేసినా అంతమంది జనాన్ని  భరాయించగల మకాము దొరకడం కష్టమే. చిన్న చిన్న వూళ్ళల్లో వేసే మకాముల్లో  అంతమందికి  కావలసిన పదార్ధాలు, కూరగాయలు, వంట చెరకు లభించడం కూడా కష్టమే.
వీరాస్వామయ్య గారు చెన్నపట్నంలో 1830 వ సంవత్సరం మే 18 వ తేదీన కాశీ బయలుదేరి  1831 సెప్టెంబర్ మూడో తేదీన తిరిగి చెన్నపట్నం చేరుకున్నారు. ఈ కాశీయాత్ర చేసి రావడానికి పట్టిన వ్యవధి  ఆయన గారి మాటల్లోనే చెప్పాలంటే, ‘15 మాసాల 15 దినాల 10 నిమిషాలు’.
మా బామ్మగారి టైముకు అది పదిహేను రోజులకు, మా అమ్మగారి హయాముకు పది రోజులకు తగ్గిపోయింది. అలాగే ప్రయాణ సమయంలో కడగండ్లు కూడా అదేవిధంగా తగ్గిపోయాయి. దానికి తగ్గట్టే  అనుభూతులు, అనుభవాలు  అదే మేరకు తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక మేము కాశీ వెళ్లి వచ్చిన తరువాత చెప్పుకోవడానికి పెద్ద విశేషాలు ఏమీ మిగలలేదు. ‘ప్రయాణం అంతా బాగా జరిగింది కదా!’ అనే బంధు మిత్రుల ప్రశ్నలకు క్లుప్తంగా ‘అవును’ అనే సమాధానం తప్ప. (13-05-2012)
(కాశీ సమారాధన మూడో భాగం వచ్చే ఆదివారం)                

కామెంట్‌లు లేవు: