3, మే 2012, గురువారం

కాంగ్రెస్‌ వాకిట్లో ఆగస్టు సంక్షోభం?


కాంగ్రెస్‌ వాకిట్లో ఆగస్టు సంక్షోభం?

(03-05-2012 సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

- మూడోసారి ఆశలు ఆవిరి కానున్నాయా?
- అధిష్ఠానం ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయా?
- అసాధారణ సమస్యలతో రాష్ట్ర కాంగ్రెస్‌
- దిగజారుస్తున్న అధిష్ఠానం ఒంటెత్తు పోకడలు
- మసకబారిన ప్రధాని ప్రతిష్ఠ
- పట్టి పీడిస్తున్న అవినీతి, కుంభకోణాలు
- మిత్రపక్షాల కనుసన్నల్లో పాలన 


sonia-manmohan-అసలు కాంగ్రెస్‌ లో ఏం జరుగు తోంది? అధిష్ఠానం అన్నీ గమని స్తోంది అని తరచుగా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయ కులు చెబుతుండే మాటలు నిజం కాబో తున్నాయా? రాష్ట్ర కాంగ్రెస్‌ను పట్టి కుదు పుతున్న రుగ్మతలకు శాశ్వత పరిష్కారం దిశగా అధిష్ఠానం పావులు కదుపుతోందా? వరసగా రెండోసారి అధికారంలోకి రాగలిగామని మూడేళ్ల క్రితం మురిసి పోయిన అపురూప క్షణాలు గత కాలపు ముచ్చటగా మారిపోతున్న నేపథ్యంలో, 2012 ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కూడా పార్టీని గెలిపించుకుని, రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనుకున్న ఆశలు కాస్తా ఆవిరి అయిపోతున్నాయేమో అన్న అనుమానం ఢిల్లీ పెద్దలకు కలిగిందా?

తాము కోరి ఎంపిక చేసుకొని నియమించిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తమ అంచనాలకు, ఆకాంక్షలకు అందకుండా వ్యవహరి స్తున్నారన్న అభిప్రాయం హస్తిన నాయకులను కలవర పెడుతోందా?
డా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత రాష్ట్ర వ్యవహారాలను తిరిగి తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్న అధిష్ఠానం ప్రయ త్నాలు బెడిసికొట్టి, 1982 నాటి చరిత్ర పునరావృతం కాబోతున్నదన్న సందేహం పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెడుతోందా?

ఇంతకీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
ఏమీ జరగకుండా అంతా సజావుగా ఉన్నపక్షంలో ఢిల్లీలోని అధిష్ఠానం పనుపున ఇంతమంది దూతలు ఇన్ని సార్లు హైదరాబాదు చక్కర్లు యెందుకు కొడుతున్నట్టు? సవాలక్ష సమస్యలు రాష్ట్రాన్ని చుట్టు ముట్టి ఉన్న సమయంలో ముఖ్యమంత్రీ, పీసీసీ అధ్యక్షుడు ఇన్నిన్ని పర్యాయాలు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నట్టు?
సమాధానాలు తెలియని అనేక ప్రశ్నలు. ఒక వేళ తెలిసినా పైకి చెప్పుకోలేని అనేక ఆశక్తతలు. వెరసి ఈనాటి రాష్ట్ర కాంగ్రెస్‌ పరిస్థితి.ఆటు పోట్లు, హెచ్చు తగ్గులు, ముఠా తగాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు- ఇవన్నీ ఏ రాజకీయ పార్టీకయినా తప్పని తల నొప్పులే! కానీ ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలు గమనిస్తుంటే ఆ పార్టీ అసాధారణ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నదన్న భావన కలుగుతోంది. ఏదో ఒక జబ్బుకయితే రోగనిర్ధారణ చేసి రోగ నిదానానికి ప్రయత్నం చేయవచ్చు.

ఒకదాని కొకటి పొసగని రుగ్మతలతో పడకేసిన కాంగ్రెస్‌ పార్టీకి తిరిగి పూర్వవైభవం తేవడం మాట అటుంచి, పార్టీ తన కాళ్ళమీద తాను నిలబడేట్టు చేయడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యపడే వ్యవహారంగా కానరావడం లేదు. అందుకే, అనేక విచికిత్సల అనంతరం అధిష్ఠానం కాయకల్ప చికిత్సకు పూనుకున్నట్టుంది. బాగా ముదిరిపోయిన వ్యాధి ఏ చికిత్సకూ లొంగదు అన్న అనుమానం ఓ పక్క వేధిస్తున్నా, ఇక తప్పని సరై తానే కల్పించుకుని పరిస్థితులను ఏదో ఒక మేరకయినా చక్కదిద్దాలన్న ఆలోచనకు వచ్చినట్టుంది. బహుశా దాని ఫలితమే కాబోలు, ఇటీవల కాలంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో అధిష్ఠాన నాయకులు జరుపుతున్న నిర్విరామ చర్చలు, మరో వైపు తర్జని చూపుతూ చేస్తున్న హెచ్చరికలు!

నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఇంతగా దిగజారి పోవడానికి ప్రధాన కారణం అధిష్ఠానం అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలే. కానీ ఆ విషయం అధినాయకత్వం ముఖాన్నే చెప్పగల, చేవ కలిగిన నాయకుడేడీ? రాష్ట్ర కాంగ్రెస్‌ అస్తవ్యస్థ పరిస్థితికి సంబంధించి ముద్దాయి స్థానంలో ఉండాల్సిన అధిష్ఠానం తీర్పరి పీఠంపై ఉండడమే విషాదం. దీనికి తోడు - జాతీయ పార్టీ ముసుగులో ‘పేను పెత్తనం’ చేయాలనే ఆభిలాష అదనం.
తమది 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్‌ నాయకులు, తమ పార్టీ చరిత్రలో కలిసిపోకుండా చూసుకోవాలంటే తమ వ్యవహారశైలిని మార్చుకుని తీరాలి. నిర్ణయాలు ఢిల్లీలో తీసుకున్నా స్థానికంగా తీసుకుంటున్న అభిప్రాయాన్ని కల్పించాలి.

ప్రతి చిన్న విషయానికీ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్న అపప్రథ, రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తున్నారు, చీటికీ మాటికీ ముఖ్యమంత్రులను మారుస్తున్నారన్న ఆరోపణ నిజానికి యూపీఏ-1 హయాంలో పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయిన మాట వాస్తవమే. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల విషయంలో నాటి అధినేత్రి ఇందిరా గాంధీ అనుసరించిన వైఖరికి భిన్నంగా సోనియా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఆ రోజుల్లో ప్రబలింది. 2009 ఎన్నికల్లో యూపీఏ-2 ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా అధిష్ఠానం వ్యవహార శైలిలో వచ్చిన ఈ గుణాత్మక మార్పు దోహదం చేసిందని భావించేవారు అనేకమంది ఉన్నారు.

అయితే, కాంగ్రెస్‌ నాయకత్వంలో యూపీఏ మరోసారి అధికార పీఠం ఎక్కిన తరువాత అధిష్ఠానం తన పద్ధతికి కొంత దూరం జరుగుతున్నదేమో అన్న అభిప్రాయం కలుగుతోంది. మన్మోహన్‌ ప్రధానిగా మొదటి టరంలో సంపాదించుకున్న ప్రతిష్ఠ మసకబారడం మొదలయింది. లెక్కకు మిక్కిలి అవినీతి ఆరోపణలు, అనుదినం వెలుగు చూస్తున్న కుంభకోణాలు, ఎన్నికల్లో ఎదురీతలు, వీధికెక్కి సవాళ్లు విసురుతున్న మిత్రపక్షాలు, ఒకటేమిటి అనేకానేక సమస్యల అమావాస్యల నడుమ యూపీఏ -2 సంకీర్ణ ప్రభుత్వం నడి సంద్రంలో నావ మాదిరిగా కొట్టుమిట్టాడు తున్నది. న్యూక్లియర్‌ ఒప్పందం విషయంలో నాటి మిత్ర పక్షం సీపీఎం కు ధాటీగా బదులిచ్చి, మీ అవసరం మాకు లేదు అని దాష్ఠీకంగా జవాబు చెప్పగలిగిన కాంగ్రెస్‌ నాయకత్వం ఈనాడు మిత్రపక్షాల కనుసన్నల్లో పాలన చేయాల్సిన దుస్థితి లో ఉంది.

వారు చెప్పిన వారిని మంత్రిపదవి నుంచి తొలగిం చడం, పలానా వారినే తీసుకోవాలి, పలానా శాఖ ఇవ్వాలి అంటే జీ హుజూర్‌ అంటూ తల ఆడించడం- ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి ఎంతటి శోభ కలిగిస్తుందో ఆ పార్టీ పెద్దలే చెప్పాలి. ఢిల్లీ స్తాయిలో తన పరిస్థితే ఇలా పెట్టుకుని- రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడానికి పూనుకోవడం అవివేకమే అయినా తప్పని బాధ్యతగా నెత్తికెత్తుకోవాల్సిన దుస్థితి. లోపల అయ్యవారేం చేస్తున్నారంటే, చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్న చందంగా తయారయింది. కానీ తప్పు దిద్దుకోవడానికి తరుణం కాదాయె.

Copy of bandaruముంగిట్లో 18 అసెంబ్లీ ఉపఎన్నికలు, ఒక లోకసభ ఉపఎన్నిక పెట్టుకుని ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పాలుపోని పరిస్థితి. బహుశా నిర్ణయం అయిపోయింది, అమలు చేయడమే ఆలశ్యం అనే వాళ్లు కూడా ఉన్నారు.రాష్ట్రపతి ఎన్నిక అనంతరం ఆగస్టులో కాయకల్ప చికిత్స మొదలు పెడతారేమో! అప్పుడూ లొంగకపోతే, ఆఖరి ఔషధంగా గరళ వైద్యం తప్పదేమో! దుష్టాంగాన్ని ఖండించయినా శిష్టాంగాన్ని కాపాడమన్నారు కదా పెద్దలు. కాకపోతే, తొలగించే అంగాలు ఒకటా రెండా అన్నదే ప్రశ్న.

కామెంట్‌లు లేవు: