12, మే 2012, శనివారం

‘నేను అమ్మను నాయనా!’


‘నేను అమ్మను నాయనా!’


(మే నెలలో రెండో ఆదివారం భారత దేశంలో ‘మాతృ దినోత్సవం’. ఈ  సందర్భంగా ‘అమ్మలగన్న అమ్మలందరికీ’ ఇది అంకితం)అంత వయసూ, ఎంతో అనుభవం వుండీ కూడా అధికారి అడిగే  ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తెలియక వసుంధర తత్తర పడింది. 
‘టైం స్లాట్’  తీసుకుని వచ్చిన అప్పాయింట్ మెంట్ కాబట్టి వెనుక ఎవ్వరూ లేరు.
ఆఫీసర్ మళ్ళీ అడుగుతున్నాడు.
‘చెప్పండి మేడం! మీరెవ్వరు? ఏం చేస్తుంటారు?’
నిజమే. తనెవ్వరు? ఏం చేస్తుంటుంది? 
ఏం జవాబు చెప్పాలి?
వసుంధర లిప్త పాటు ఆలోచించింది.
ఆలోచించి చెప్పడం మొదలు పెట్టింది.
‘పిల్లల  మానసిక, భౌతిక పెరుగుదలను నేను కనిపెట్టి చూస్తుంటాను. ఆ పెరుగుదల ఏరీతిన సాగుతున్నది ఎప్పటికప్పుడు గమనిస్తుంటాను. ఒకరకంగా చెప్పాలంటే ఇది రీసెర్చ్ కిందికి వస్తుంది. అంతే  కాదు, పిల్లల ఆహారం, చదువూ సంధ్యా అన్నీ చూస్తుంటాను. పెద్దలతో పిల్లల ప్రవర్తన, నడవడిక యెలా వుండాలో బోధిస్తుంటాను.’
కౌంటర్ వెనుకనుంచి ప్రశ్నలు సంధిస్తున్న అధికారికి మతి పోయింది.
ఉత్సుకతను అణచుకోలేక మళ్ళీ అడిగాడు. 
‘ ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పండి మేడం! ఇంతకీ మీరేం చేస్తుంటారు?’
‘నా వయస్సు  ఇప్పుడు అరవై. చాలా ఏళ్లుగా నా ఈ రీసెర్చ్ సాగుతూనే వుంది. ముగింపు  కూడా కనుచూపు మేరలో  కానరావడం లేదు. పెళ్ళయిన నాటినుంచి  నా ఈ ఉద్యోగం రాత్రింబగళ్ళు చేస్తూ వస్తూనే వున్నాను. కనీసం ఒకటంటే ఒక్క రోజు కూడా సెలవు లేకుండా, ఆదివారాలు సయితం  పనిచేస్తూ వచ్చిన దానికి గుర్తింపుగా ఇప్పటికి రెండు సర్టిఫికేట్లు  దొరికాయి. ఆ రెండూ ఇప్పుడు నా దగ్గర లేవు. నా కనుసన్నల్లో పెరిగి, పై చదువులకోసం విదేశాలకు వెళ్ళిన నా ఇద్దరు పిల్లలే ఆ సర్టిఫికేట్లు. వారిదగ్గరకు వెళ్లడానికే ఇదిగో ఈ ప్రయత్నం. కాకపొతే ఇన్నాళ్లబట్టి నేను చేస్తున్న ఉద్యోగంలో నాకు బాసులు ఇద్దరే. ఒకడు పైన వున్న భగవంతుడు అయితే, రెండోది నన్ను కట్టుకుని కనిపెట్టుకుని వున్న భర్త. పోతే జీతమంటారా! పనిలో పొందే మానసిక ఆనందమే నాకు దొరికే ప్రతిఫలం.
‘ఇంత చెప్పిన తరువాత కూడా నేనెవరంటావా?
‘అమ్మను నాయనా! నేను అమ్మను!!’ (12-05-2012)


(అమ్మను గురించి ‘ఈ’ మెయిల్ పంపిన వారికి కృతజ్ఞతలతో- భండారు శ్రీనివాసరావు)

కామెంట్‌లు లేవు: