ఈ పన్నెండు రోజుల చర్చల్లో ఒక విషయం
మాత్రం తెలిసొచ్చింది, అల్లా చేసివుంటే ఇల్లా జరిగేది కాదని.
ఎనిమిదో తేదీ మంగళవారం రాత్రి ప్రధాని
మోడీ ప్రసంగం తయారు చేసిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. (
అసలా నిర్ణయం ప్రధాని కాకుండా రిజర్వ్ బ్యాంక్
అధికార ప్రతినిధిచేత ప్రకటించి
వుంటే బాగుండేది, దీనికి రాజకీయ రంగు అంటివుండేది కాదన్నది ఒక వాదన. 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్
కూడా నోట్ల రద్దు ప్రకటన బాధ్యతను అధికారులకే ఒదిలి వేసిన విషయాన్ని ఈ ‘వాదకులు’ గుర్తు చేస్తున్నారు)
సరే! ప్రకటన ప్రధానమంత్రి స్వయంగా
చేశారు. అందులో కొంపలు మునిగేది ఏమీ వుండదు.
కాకపొతే దాన్ని ఆయన తన తరహాలో కాకుండా ఒక అధికారిక ప్రకటన మాదిరిగా రాసుకొచ్చి చదివి
వుంటే బాగుండేదన్న అభిప్రాయం వుంది. అలానే ఒక రాజకీయ నాయకుడి ప్రసంగం మాదిరిగా
కాకుండా క్లుప్తంగా కొన్ని విషయాలను
మాత్రమే ప్రస్తావించి వుండాల్సింది. నల్ల కుబేరులపై యుద్ధ ప్రకటనకు మరో అవకాశం
వినియోగించుకుని వుండాల్సింది. తన ప్రసంగంలో ప్రధాని మోడీ మరో విషయాన్ని ప్రస్తావించారు. ఉగ్రవాదుల
చేతుల్లో భారత కరెన్సీ, అందువల్ల దేశ భద్రతకు యేర్పడ బోతున్న ముప్పు, వీటి కారణంగా ఈ హఠాత్ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని చెప్పిన ప్రధాని ఆ అంశానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వుంటే దేశ ప్రజల దృష్టి
అటు మళ్ళివుండేది. (నల్ల కుబేరులపై యుద్ధం అంటూ ఓ పక్క చెబుతూ ఆ నోటితోనే రెండువేల కొత్త నోటు తెస్తున్నట్టు చెప్పేసరికి అసలు విషయం జావకారి పోయింది, లేనిపోని అనుమానాలకు
ఆస్కారం ఇచ్చినట్టయింది.)
ప్రధాని తన ప్రసంగాన్ని క్లుప్తంగా
ముగించి, గత పన్నెండు రోజులుగా తీసుకుంటున్న ఉపశమన చర్యలు గురించి ఆ రోజే
ప్రస్తావించి వుంటే సామాన్య ప్రజల మనస్సుల్లో ఇంత గందరగోళం ఏర్పడి వుండేది కాదు.
ప్రకటన దరిమిలా మీడియాలో వస్తున్న వార్తలను బట్టి ప్రభుత్వం నిర్ణయాలు ప్రకటిస్తూ,
మార్చుకుంటూ పోవడం గమనించిన వారికి ప్రభుత్వం చేసిన తప్పులు (పొరబాట్లు అనాలేమో) దిద్దుకుంటూ
పోతోందన్న అభిప్రాయం కలిగింది. సరయిన విధంగా ముందు చూపుతో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో
విఫలం అయిందన్న ఆరోపణలకు ఆస్కారం వుండేది కాదు. నిర్ణయాన్ని సమర్ధించిన వారే అమల్లో లోపాల గురించి ఇంతగా మాట్లాడాల్సిన
అవసరం వచ్చేది కాదు. చర్చలు ఇంత సుదీర్ఘంగా జరిగేవీ కావు, ఇంత రచ్చ జరిగేదీ కాదు.
సరే! జరగాల్సింది జరిగిపోయింది. నిర్ణయం వెనక్కి తీసుకునే వీలులేదు. తడబడ్డ కాలునే కూడదీసుకోవాలి. పైపంచ గాలికి యెగిరి
ముళ్ళకంచెపై పడినప్పుడు అది చిరిగిపోకుండా జాగ్రత్తగా బయటకి తీయాలి. దీనికి చాలా
సంయమనం కావాలి. మనసు నిగ్రహంగా వుంచుకోవాలి. రాజకీయంగా వచ్చే విమర్శలను ఎదుర్కునే
క్రమంలో, ఆవేశకావేశాలతో తీసుకునే నిర్ణయాలు, వ్యాఖ్యలు మరింత గందరగోళానికి దారితీస్తాయి. ఇది మోడీ
అభిమానులకీ, దురభిమానులకీ, వ్యతిరేకులకీ కూడా వర్తిస్తుంది.
ఈ నిర్ణయంలో నిజంగా ఎటువంటి రాజకీయ
ఉద్దేశ్యాలు లేకపోతే ఎవరికీ భయపడాల్సిన అవసరం కానీ, ఎవరినీ భయపెట్టాల్సిన అగత్యం
కానీ వుండదు.
ఇప్పుడు బంతి పూర్తిగా సర్కారుకోర్టులోనే వుంది. అది స్పష్టంగా
కానవస్తోంది.